ఆరుట్ల రామచంద్రారెడ్డి పోరాట స్మృతులు

ఆరుట్ల రామచంద్రారెడ్డి పేరు మొదటగా తెలుసుకున్నది ఆరేడేళ్ళ క్రితం నవీన్ “కాలరేఖలు” చదివినప్పుడు అనుకుంటాను.. లేకపోతే లోకేశ్వర్ “సలాం హైదరాబాద్” నవల చదివినప్పుడో, గుర్తులేదు. అయితే, బాగా గుర్తుండిపోయినది మాత్రం ఆర్.నారాయణమూర్తి తీసిన “వీర తెలంగాణా” సినిమా చూశాక.

తెలంగాణాలో నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన కమ్యూనిస్టు నాయకులలో ఆరుట్ల రామచంద్రా రెడ్డి ఒకరు. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో పని చేస్తూ, క్రమంగా కమ్యూనిజంవైపు ఆకర్షితులయ్యారు. జనగామలో రైతు పోరాటానికి నాయకత్వం వహించడం, గెరిల్లా పోరాటాల్లో శిక్షణ పొంది పాల్గొనడం వంటి కార్యకలాపాల ద్వారా ద్వారా అప్పటి తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమ వాతావరణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నిజాం పాలన అంతరించాక ప్రభుత్వ జైళ్ళలో అనేక హింసలు అనుభవించి, తరువాత కొన్నాళ్ళు శాసనసభ సభ్యుడిగా కూడా పని చేశారు. ఈ పుస్తకం – ఆయన నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఉద్యమ కాలం నాటి వ్యక్తిగత అనుభవాలే కాక, అప్పటి తెలంగాణ పరిస్థితుల గురించి కూడా వివరించే పుస్తకం.

మొదటి అధ్యాయం -“నా రాజకీయ ప్రవేశం”

నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా కొలనుపాక రామచంద్రారెడ్డి స్వగ్రామం. వివిధ స్కూళ్ళలో చదువుకుంటూ, మెట్రిక్ చదవడానికి హైదరాబాదు నాంపల్లి హైస్కూల్లో చేరారు. తరువాత కాంగ్రెసు, సత్యాగ్రహం, ఆర్య సమాజం వంటి భావాల పట్ల ఆకర్షితులై, కొన్నాళ్ళు ఊరేగింపుల్లో పాల్గొనడం వంటివి చేశారు. బ్రహ్మచారిగా ఉంటూ దేశసేవ చేద్దాం అని నిర్ణయించుకున్న తరుణంలో కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో తన మేనమామ కూతురు రుక్మిణిని పెళ్ళాడారు. తరువాత ఇద్దరూ హైదరాబాదు చేరుకుని చదువుకుంటూ, స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెసు భావాల నుండి కమ్యూనిజానికి ఎలా మళ్ళారో రాయలేదు కానీ, ఆంద్ర మహాసభలో చేరి, క్రమంగా అందులో చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టారు. ఈ భాగంలో నాకు ఆసక్తికరంగా అనిపించిన సంఘటనలు రెండు:

1) మెట్రిక్ కు పంపడానికి రాసిన ప్రీ-ఫైనల్ లాంటి సెలెక్షన్ పరిక్షలో ఈయన పాసు కాలేదని హెడ్మాస్టర్ ఫైనల్ కు పంపడానికి ఒప్పుకోకపోతే సత్యాగ్రహం చేసి ఆయన్ని ఒప్పించి, పరిక్ష రాసి, ఫస్టు క్లాసులో పాసయ్యారు.

2) పెళ్ళి చేసుకోవడానికి ఆయన పెట్టిన షరతులు:
“-పెళ్ళిలో వధూవరులకి ఖద్దరు దుస్తులే పెట్టించాలి.
– వరదక్షణ అంగీకరించను
– వివాహము కాగానే చదువుకు ఆమెను హైద్రాబాద్ పంపాలి
– పెండ్లిలో మధు-మాంసాలు వాడవద్దు.”

రెండవ అధ్యాయం: ఆనాటి తెలంగాణ

ఆనాటి తెలంగాణ లో వేళ్ళూనుకున్న వెట్టిచాకిరి వ్యవస్థ, కులాల వారీగా చేయవలసిన పనులంటూ విధించిన నిబంధనలు, భూస్వాముల దాష్టీకాలు; ఆంధ్రమహాసభ ఆవిర్భావం, క్రమంగా అందులో పెరుగుతూ పోయిన కమ్యూనిస్టుల పాత్ర, కమ్యూనిస్టులకి-మితవాదులకీ మధ్య జరిగిన వివాదాలు; లెవీ వసూళ్ళలో జరిగే అక్రమాలు; పీడిత కులాలను తమవైపు ఆకట్టుకుని మతం మార్పిడికి ప్రేరేపించిన బహద్దూరుయారుయంగు, అతని అనుయాయులు -దీని పర్యవసానాలు; వీటన్నింటిలో ప్రజల, ఉద్యమ కారుల పాత్రలు – ఇవీ ఈ అధ్యాయంలో ప్రధాన విషయాలు. ఆచార్య ఇనుకొండ తిరుమలి రాసిన పరిశోధన గ్రంథంలో (తెలుగు అనువాదం – “తిరగబడ్డ తెలంగాణ” పుస్తకం) ఈ విషయాల గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి. అయితే, అది చరిత్ర పుస్తకమూ, ఇది ఒక వ్యక్తి చెబుతున్న అనుభవాలూ – దేన్నుండి తెలుసుకునే విషయాలు దాన్నుండి తెలుస్తాయి మరి!

ఈ అధ్యాయంలోనూ నన్ను ఆకర్షించిన సంఘటన ఒకటుంది.

“మితవాదులు 10వ ఆంధ్ర మహాసభ అధ్యక్ష పదవికి పోటీ నిలబెట్టుటకు నిర్ణయించారు. ఇంకా ఆంధ్రమహాసభలందు ప్రతినిధి ఎన్నికలు జరగలేదు. జిల్లా ప్రతినిధి ఎన్నికలు జరుగనున్న దినాలలో నేను వ్యక్తిగతంగ గుండవరపు హనుమంతరావుగారికి హైదరాబాదుకు లేఖ వ్రాసి పోస్టులో వేశాను. ఆ లేఖలో మితవాదుల పక్షాన అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న శ్రీ కొండ వెంకటరంగారెడ్డి గారిని హైద్రాబాదు జిల్లా ఆంధ్ర మహాసభ ప్రతినిధి ఎన్నికల్లోనే ఓడించాలి అని వ్రాశాను. ఆ లేఖను పోస్టువారు పొరపాటున మాడపాటి హనుమంతరావు గారింట్లో పడేశారు. ఆ లేఖను మితవాద ఆంధ్ర మహాసభ నాయకులు చూచుకొని, తెలగాణా జిల్లా ప్రతినుధుల ఎన్నికలలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొని తమను బలపరిచే మితవాదులను మహాసభ ప్రతినిధులుగా హెచ్చు సంఖ్యలో వచ్చేట్టు చేసుకొన్నారు. తత్ఫలితంగ ఆంధ్రమహాసభ అధ్యక్ష ఎన్నికల్లో కొద్ది మెజారిటీతో మితవాద నాయకులు కొండ వెంకట రంగారెడ్డిగారు గెలిచారు. కొద్ది తేడాతో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు.”

– ఇది చదివాక, ఇలాక్కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి లోనయ్యాను.

నన్ను బాగా ఆలోచింపజేసిన ఒక ఉదంతం :

“తెలంగాణ లో సత్యాగ్రహానికి అగ్రభాగాన ఉండి, సత్యాగ్రహ పోరాటానికి నాయకత్వం వహించిన పిదప శ్రీయుతులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి మొదలగువారంతా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సత్యాగ్రహం చేసి, కారాగారాల్లో ఉండి నైజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయగలమనుకోవడం సరైన మార్గం కాదని ప్రత్యుమ్నాయ విధానం అవలంబించారు. అందువల్ల తెలంగాణలో అసలైన సిసలైన కాంగ్రెసువాదులే లేకుండా పోయారు. పోలీసుచర్య తరువాత అమాంతముగ మితవాదులు, నైజాం ఛత్రచ్ఛాయల క్రింద బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరేవారంతా కాంగ్రెసు నాయకులై పరిపాలనలోకి వచ్చారు.”

మూడవ అధ్యాయం : ప్రతిఘటన ప్రారంభం, నాలుగవ అధ్యాయం: భూములు పంపకం
ఈ చిన్న పుస్తకం మొత్తంలోనూ అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం ఇదే, నా అభిప్రాయంలో. రామచంద్రారెడ్డి గారు వివిధ ప్రాంతాల్లో జనాల్ని సమీకరించి వెట్టి నిర్మూలనకు, దొరల ఆగడాలను ఎదుర్కునేందుకు చేసిన ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదుర్కున్నవి, అధిగమించినవి, శత్రువుల పుణ్యాన జైళ్ళకు వెళ్ళినవి – అన్ని అనుభవాలనూ మన ముందుంచారు.

మధ్యమధ్యలో అప్పటి వారి రాజ్యంలో చెలామణిలో ఉన్న ఫసలి కేలెండర్ తాలూకా పదజాలం వాడ్డం వల్ల మొదట కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, అసలా పదాలకి అర్థాలు తెలుసుకున్నాక ఆసక్తికరంగా అనిపించింది. ఉదా: “హైదరాబాద్ లో సం. 1354వ ఫసలీ 7 అర్ధి బెహష్తు నుండి 11 పర్వర్డీ 1355 ఫసలీ వరకు జైలులో నిర్భందంలో ఉంచబడినాము” అన్న వాక్యం నాకొక్కపట్టాన అర్థం కాలేదు ఈ వివరాలు తెలుసుకునే వరకూ! ఉన్నట్లుండి మధ్యలో కేలెండర్లు ఎందుకు మార్చేశారో కథనంలో, అర్థం కాలేదు.

ఐదవ అధ్యాయం: స్వాతంత్ర్యానంతరం
స్వాతంత్ర్యానంతరం, హైదరాబాద్ సంస్థాన విలీనానంతరం కూడా కొన్ని సంవత్సరాలు వీరి అజ్ఞాతం, ఆ తరువాత జైలు జీవితం కొనసాగింది. ఈ క్రమంలో రజాకర్లను తప్పించుకు పోవడాలు, గెరిల్లా పోరాటాలు, కాన్సంట్రేషన్ క్యాంపులలో ఉండటం వంటి వాటిని గురించిన అనుభవాలు చదువుతూ ఉంటే, కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథలో రాసిన విషయాలు కొన్ని గుర్తు వచ్చాయి. ఒళ్ళు జలదరించింది – వీళ్ళ సాహసోపేత జీవితాలని, పోలీసుల చేతిలో వీళ్ళు అనుభవించిన కష్టాలూ తల్చుకుంటే.

ఇవన్నీ దాటుకుని పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించుకున్నట్లు ప్రకటించాక మొత్తానికి ఈయన జైళ్ళ నుండి బయటపడి, ఓటర్ల జాబితాలో పేరు లేనందున పోటీ చేయలేక, పార్టీ కోశం ప్రచారం చేయడంతో ఈ పుస్తకం ముగిసింది.

ఉపసంహారం:

ఇది ఈయన ఆత్మకథే అయినప్పటికీ, మొదటి అధ్యాయం దాటాక తాను కాకుండా ఇతర కమ్యూనిస్టు నాయకుల ప్రస్తావన చాలా తక్కువగా ఉండడం కొంచెం నిరాశ కలిగించింది. తన సహధర్మచారిణి ఆరుట్ల కమలాదేవి గారి ప్రస్తావనైనా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే, పుస్తకం 1952 ఎలెక్షన్ల దగ్గర ఆగిపోయింది. తరువాతేమైంది? అన్నది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. ఇంకొక్క విషయం – ఇది చరిత్ర పుస్తకం కాదు కనుక, పుస్తకం చదివాక బోలెడు సందేహలు కలిగాయి – “అదెందుకు చేసారు?”, “ఇది చేశాక ఏమైంది?” ఈ బాపతువి. అయితే, ఇందాక అన్నట్లు, చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కని బోలెడు విషయాలు కూడా ఇలాంటి ఆత్మకథల్లో తెలుసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం.

ఏమాటకామాటే, పుస్తకంలోని భాష ఎందుకోగాని నాకు చాలా నచ్చింది. మొదట్లో కొన్ని తెలంగాణ మాండలిక పదాలకి అర్థం ఇవ్వడం కూడా బాగుంది. పర భాష వాసన అంతగా అంటలేదనుకుంటాను ఆరుట్ల గారికి (వామపక్ష పదజాలం వాడ్డంలో తప్ప) – అందుకే అంత స్వచ్ఛంగా ఉంది భాష.

ఎక్కడికక్కడ ఈయన రచయిత కాకపోవడం వల్ల ఆ వాక్య నిర్మాణాల వల్ల కొంచెం అయోమయానికి లోనైనా కూడా ఒక్కొక్కసారి స్వతహాగా రచయితలు కానివారి అనుభవాలు పుస్తకంగా చదవడంలో ఒక charm ఉంటుంది. అది ఇందులో ఉంది. ఇదివరలో బుజ్జాయి గారి “నాన్న-నేను” చదివినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. తెలంగాణా సాయుధ పోరాటంపై ఏ కాస్త ఆసక్తి ఉన్నా ఈ పుస్తకం నచ్చవచ్చు. విచిత్రం ఏమిటంటే, సినిమాలో రామచంద్రారెడ్డి పాత్రధారి సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని విసిగించినా కూడా, ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాకు ఆయన విగ్రహమే కనబడ్డం!

పుస్తకం చదవాలా? వద్దా? అంటే – అది మన గతం అన్న ఎరుక ఉంటే చదవాలి అంటాను నేను. నేను ఇదంతా తెలుసుకోవలసిన చరిత్ర అని నమ్ముతున్నాను కనుక చదివాను. ఎవరి ఇష్టం వారిది. (ఈ పుస్తకం చదవడానికి ప్రేరణ – ఆర్.నారాయణమూర్తి తీసిన సినిమా. అది చూడకపోయుంటే నాకీ పుస్తకం చదవాలన్న ఆసక్తి కలిగేది కాదు. అందుకు ఆయనకి ధన్యవాదాలు)

***

పుస్తకం వివరాలు:

తెలంగాణ పోరాట స్మృతులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (ప్రచురణ నెం: 1196)
ప్రథమ ముద్రణ: 1981 (నేను చదివినది ద్వితీయ ముద్రణ, 1986)
వెల: ఏడు రూపాయలు (!)

హైదరాబాదు బుక్ ఫెస్టివల్ లో ఈయన ఆత్మకథ చూసినట్లు గుర్తు కానీ, నిర్థారణగా చెప్పలేను. కనుక పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు.

You Might Also Like

3 Comments

  1. రామ

    అప్రస్తుత ప్రసంగం అనుకోకుండా “అసూర్యంపస్య” అంటే ఏమిటో చెప్పగలరా? మొన్నెప్పుడో తరంగ రేడియో లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో మేడసాని మోహన్ గారు “అసూర్యంపస్యంగా” అనే పదప్రయోగం చేసారు.
    ధన్యవాదములు.
    రామ

    1. డింగు

      అసూర్యంపస్య అంటే సూర్యుని కిరణాలు కూడా తాకనిది.
      అంటే మన అసూర్యంపస్య గారు ఆ సూర్యకిరణాలు పడని పుస్తకాలు సైతం చదువుతారు 😉

  2. R.CHANDRASHEKHAR RAO

    So nice Anati Telangana Udhyamanni, A janula commitment eneti Udyamakarulaku adrsha prayam kavali

Leave a Reply