మా అమ్మ చెప్పిన కతలు

naamini2

   మా పాపాయి కి మొన్నామధ్య 4 నెలలు నిండినయ్యి. వాళ్ళ అమ్మ, అమ్మమ్మ
   , పాపాయికి పాలతో బాటు రాగిబువ్వ అలవాటు చేయిస్తున్నారు.

   ఓ రోజు పాప బువ్వ తినకుండా మారాం చేసింది. అప్పుడేమో పాప అమ్మమ్మ,
  పాపను వడిలో కూర్చోబెట్టుకుని, పాపను ముందుకు వెనక్కీ ఆడిస్తూ, 
   పాట పాడిందిలా.

  "ఊగు ఊగు గంగెద్దు
   ఉలవ కుడితీ పెట్టేము,
   పాఱాడు గంగెద్దు
   పాలబువ్వ పెట్టేము,
   పాఱిపో గంగెద్దు,
   తిరిగీ పట్టుకు వచ్చేము"

  ...పాప ఏడుపాపి నవ్వింది.

నాకో శంక పట్టుకుంది. పాప రేప్పొద్దున పెద్దదయి,నాయనా, మంచి కథ చెప్పంటే
ఎట్లాగబ్బాఅని. ఆ వెంటనే ఊహలు బాల్యానికి పరుగులు తీసినయ్. చిన్నప్పుడు
వీధిబడిలో చదువుకున్న 2, ౩ పజ్జాలో, కథలో మట్టుకు ఇప్పటికీ ఙ్ఞాపకమున్నాయి.
అవి, "ఫుటుక్కు జరజర డుబుక్కు మే",
"వంకర టింకర ఓ,
వాని తమ్ముడు సో,
రెండు గుడ్ల మి,
నాలుక్కాళ్ళ బే",
మూడోదేమో,...
"ముల్లూ బాయ కత్తీ వచ్చె డాం డాం డాం,
కత్తీ బాయ కట్టేలొచ్చే డాం డాం డాం..." తర్వాత గుర్తుకు రాలా.

చందమామ కథలు చెప్పొచ్చేమో కానీ, మరీ చిన్న పిల్లలకు అవి బాగోవు.  ఎలాగబ్బా?...
****************************************

మరుసట్రోజు పాత పుస్తకాలేవో సర్దుతుంటే, నాకో పుస్తకం కనిపించింది.

ఆ పుస్తకం మీద - "మా అమ్మ చెప్పిన కతలు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు" అని రాసుంది. అట్ట మీద బాపు బొమ్మ.

ఆ పుస్తకం చదువుతుంటే -

కాసేపు చిన్న పిల్లోణ్ణయిపోయినట్టు,
మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపిస్తాన్నట్టు,
వర్షం తగ్గిన తర్వాత కాగితం పడవలతో ఆడుకుంటాన్నట్టు,
గడ్ద పెరుగు అన్నం లోకి కొత్తావకాయ నంజుకుని తింటాన్నట్టు..

ఇట్లా ఎన్నని చెప్పేది?

ఆ పుస్తకంలో "ముల్లూ బాయ కత్తీ వచ్చె" కథ కూడా ఉంది.

ఆ పజ్జెం మొత్తం ఇది.
"ముల్లూ బాయ కత్తీ వచ్చె డాం డాం డాం
కత్తీ బాయ కట్టెలు వచ్చె డాం డాం డాం
కట్టెలూ బాయ దోసెలువచ్చె డాం డాం డాం
దోసెలూ బాయ పిల్లా వచ్చె డాం డాం డాం
పిల్లా బాయ డోలూ వచ్చె డాం డాం డాం"

మీకూ ఆ కథ తెలుసుకోవాల్నుందా? ఈ పుస్తకం కొనండి. ఆ కథే కాదు, ఇంకా తొమ్మిది కథలు కలిపి మొత్తం పదున్నాయ్ ఈ పుస్తకంలో. 
ప్రతీ కథకీ బొమ్మల తాత బాపు బొమ్మలు కూడా ఉన్నాయండోయ్. అంతేనా అంటారా,కతలతో పాటూ ఇంకా
మడక దున్నడం, కలుపు తీయడం, వరికోత కోయడం, పన కొట్టడం వంటి పొలం పనులు, సంగటి అంటే ఏంది, తవుడు అంటే ఏంది, ఇంకా, 
బాపుతాత, రమణ తాత,వాళ్ళ మనవడు బుడుగు, గోగాకు, గోగునారతో అల్లిన నులకమంచం,శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ముత్తాత ఇవన్నీ
...ఇంకా..ఇంకా..అబ్బా, అన్నీ చెప్పేయాలనే?

మచ్చుకో ముక్క.

" కళ్ళు మూసుకొని కూడా నేను పుస్తకం చదవగలను అని అమ్మతో పందెం వేసుకోండి. ఈ కత కాకపోతే ఇంకో కత. 
అప్పుడు మీ అమ్మ భలేగా నవ్వి మీ తలకాయ చుట్టూ చేతులు తిప్పి దిష్టి తగలకుండా మెటికలు విరుస్తుంది.
మీ అమ్మ మీకు చిట్టుడుకు నీళ్ళతో స్నానం చేసి పెరుగూ కూడూ తినిపిస్తుంది."
****************************************

మాది వ్యవసాయిక కుటుంబం కాకపోయినా, చిన్నప్పుడు, మాయమ్మ చుట్టుపక్కల ఆవులేవన్నా ఇంటికొస్తే,
ఓ మూలన సిమెంటు తొట్టిలో కడుగు నీళ్ళలో, తవుడు కలిపి పెట్టేది. పైన పాప అమ్మమ్మ మొదటన చెప్పిన పాట పాడేప్పుడు 

అది గుర్తొచ్చింది కాసేపు.

సరే, ఇవేమంత తెలుసుకోవాలసిన సంగతులా? ఇందులో ఏం గొప్ప? అని అడుగుతారా?

దీనికి సమాధానం నామిని చెబుతారు.

"మనది వ్యవసాయిక దేశం.ఈ దేశంలో పుట్టిన పిల్లలు బియ్యం చెట్టు అంతున్నారంటే అది దేశానికి అరిష్టమా కాదా?
ఎల్.కే.జీ పిల్లవాడు కూడా కంప్యూటర్ మౌస్ ను రోజూ నొక్కుతున్నాడని కులుకుతూ ఉందామా? పదో తరగతి దాటినా పిల్లవాడు కొడవలి ని కనీసం
చూడనైనా లేదే అని దుఃఖిద్దామా?

మా పిల్లలు తెలుగులో పూర్ అని బడాయిగా చెప్పుకుంటూ వుందామా? మాతృభాషలో కూడా నాలుగు వాక్యాలు శుభ్రంగా రాయలేకపోతున్నారే -
అని బాధపడదామా?.."

మీకూ మనసులో కలుక్కుమందా? దీనికి మందు ఈ పుస్తకమే.
****************************************
 "maa amma cheppina kathalu" - Namini Subramanyam Nayudu
ఈ పుస్తకం టామ్ సాయర్ బుక్స్, తిరుపతి వారి ప్రచురణ.వారి ఫోను : 2242102, సెల్లు : 9440213249

అన్ని విశాలాంధ్ర బ్రాంచుల్లోనూ,ప్రజాశక్తి బ్రాంచుల్లోనూ దొరుకుతుందట.
నా దగ్గరున్నది మూడవ ముద్రణ - 2003 జనవరిలో ముద్రించినది.

వెల రు. 30/-
48 పేజీలున్నాయ్ ఇందులో.

బడిపిల్లల కోసం అచ్చ తెలుగు పుస్తకం అని నామినే ధైర్యంగా చెబుతున్న ఈ పుస్తకం -

చందమామ సైజులో, చాలా చిన్నది. అయితేనేం...

అమ్మ చేతి గోరుముద్దలు ఓ రెండయినా చాలవా, బిడ్డ కడుపు నిండకపోయినా, మనసు నిండి, సమాధానపట్టానికి?

You Might Also Like

12 Comments

  1. varaprasad.k

    జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒత్తిడి నుండి విముక్తి కావాలంటే ఆనాసిన్,సారిడాన్ లేకుంటే వేరేదో అక్కరలేదు.ముల్లుబోయి కత్తి వచ్చే లాంటి నాలుగు పదాలు సదివితే అన్ని మరచిపోయి వేరే ప్రపంచంలోకి లగెత్తుకు పోతాం.

  2. ఆనంద్

    చూడండి ఈ వ్యాసం.
    http://www.eemaata.com/em/issues/200505/1002.html

    ఆనంద్

  3. varaprasad

    abba malli paccha naku sakshiga rojulu gurtostunnai,naminilo vishayam vundi kabatte twenty years tarvatakooda kulikistunndu,,jampala chowdary garu chinnapilladanukoni vadileyyandi,

  4. Sunil Kumar Surabhi

    నాకు వూరిపిండి అని పిలవడం అలవాటు. నామిని పుస్తకాల ద్వారా నాకు సాక్ష్యం దొరికింది. When she complained that there is no such word, I have shown this as evidence. Thanks for the narration in my own accent. Hats off sir

    1. varaprasad

      babu chalamandiki chalagurtosttayi.

  5. Y RAMESH NAIDU

    Please request publications to give once again little publicity about Namini’s books so that we can again have a glimpse once again to refresh the freshness of our childhood and also introduce the taste of village culture.

  6. Bhanu Ramisetty

    Hi,
    Recently I read MITTORODI KATHALU, through out the book I can remember my childhood days. It reflects the kind of relation between village people, you know in villages even if a lady is not from your community she will greet you like “Era alluda eppudochavura na batta”. By the way I am also from chittoor. I like way of presentation of NAMINI SUBRAMANYAM NAIDU and his social consiousness.

  7. Harshita

    Yes, definitely he is a wonderful writer. I have read his mitturodi pustakam hundreds of times. But his decision about his writings was not at all a good one. A writer should be sensitive. But should not be this much sensitive.

  8. vijaya

    It is my pleasure to inform you that Telugu people are celebrating the silver jubilee year of one of the great contemporary Telugu writer Sri Namini Subramanyam Naidu(1984-2009). As all Telugu readers know that he brought out world class Telugu folktales into limelight with his simple style of Chittoor district Telugu, whom Bapu described as the image of deity. To name some of his books, Mittoorodi Pusthakam, Iskulu Pilakayala Katha, Chaduvula Chavula, Amma Cheppina Kathalu. He is not only a writer but also a journalist of aclaim and independence.

    It is also my unhappiness that eventhough he is treated as great writer and journalist, nobody is here to recognize his originality and greatness.
    I wish that you will certainly extended your good-heartededness to make the people know about him.

    vijaya

  9. వేణూ శ్రీకాంత్

    “అమ్మ చేతి గోరుముద్దలు ఓ రెండయినా చాలవా, బిడ్డ కడుపు నిండకపోయినా, మనసు నిండి, సమాధానపట్టానికి? ”

    సూపర్ రవి గారు.

  10. gireesh

    ముల్లూ బాయ కత్తీ వచ్చె డాం డాం డాం
    కత్తీ బాయ కట్టెలు వచ్చె డాం డాం డాం
    కట్టెలూ బాయ దోసెలువచ్చె డాం డాం డాం
    దోసెలూ బాయ పిల్లా వచ్చె డాం డాం డాం
    పిల్లా బాయ డోలూ వచ్చె డాం డాం డాం”

    అబ్బ…నిజ్జంగా, చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కోతి కథ మళ్ళీ గుర్తుకొచ్చిందండీ!

  11. Purnima

    బాగుంది మీ పరిచయం!

    “ముల్లూ బాయ కత్తీ వచ్చె డాం డాం డాం
    కత్తీ బాయ కట్టెలు వచ్చె డాం డాం డాం
    కట్టెలూ బాయ దోసెలువచ్చె డాం డాం డాం
    దోసెలూ బాయ పిల్లా వచ్చె డాం డాం డాం
    పిల్లా బాయ డోలూ వచ్చె డాం డాం డాం”

    దీన్ని మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఒక పాటలో వాడారు కదా! “పెన్ను పోయి గరిటే వచ్చే.. డాం, డాం, డాం!”

Leave a Reply