అక్క మహాదేవి సమగ్ర వచనాలు

వ్యాసకర్త: కాదంబరి
*******
కర్ణాట సీమను వచన కవితాసీమను సాహిత్యముతో పరిపుష్ఠం చేసిన మహామహులు ఎందరో ఉన్నారు. కన్నడ సాహిత్య చరిత్రలో “బసవన్న యుగము” 12 – 15 వ శతాబ్దముల మధ్య కాలము. సంస్కృత సమాస భూయిష్ఠ గ్రాంథిక శైలి మీద తిరస్కారము వ్యక్తమవడం మొదలైనది. “నయసేనుడు” రచించిన “ధర్మామృతం” తొలి అడుగు అవగా – బసవేశ్వరుని సృజన శక్తి వాడుక భాషలో సాహిత్య లేఖనములను కొత్త పుంతలు తొక్కేలా చేసింది. కన్నడ వచన సారస్వత లోకంలో 346 మందిన్నీ, వారిలో 42 మంది మహిళామణులు ఉన్నారంటే –ఆ ఘటన కన్నడ సాహిత్య సీమ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

కన్నడ భాషాంగణము ముంగిట జ్వాజ్వల్య తేజో సింధువు “అక్క మహాదేవి”.

“అక్క మహాదేవి సమగ్ర వచనాలు” ఒక మహిళామణి ఆశుపదవల్లరులు, వీరశైవ భక్తురాలైన స్త్రీమూర్తి పలుకుల మీగడతరగలు. అక్కమ్మ చరిత్రను 1550 లలో పిడపర్తి సోమనాథుని ద్విపదకావ్యము “ప్రభులింగ లీల” లో ఉల్లేఖించెను.

అక్క మహాదేవి “ఉడుతడి గ్రామములో జన్మించినది. ఈ కుగ్రామము – కర్ణాటక రాష్ట్రములోని “షిమోగా” జిల్లాలో ఉన్నది. ఆమె సంచారజీవిత పథములో అక్క మహాదేవికి తటస్థపడిన ప్రదేశాలలో కొన్ని ముఖ్యమైనవి, గుర్తుంచుకోదగినవి ఉన్నవి. వాటిలో “కళ్యాణము”, “అనుభవమంటపము” ముఖ్యమైనవి. శ్రీశైలములోని కదళీవనములోని గుహాప్రాంతములు (నాగులేటి శేషణ్ణరాధ్యుడు రచన “పర్వత పురాణము” లో కదళీవన ప్రసక్తి కానవస్తుంది) చివరి దశలో అక్క మహాదేవికి ఎత్తిపట్టిన ఛత్రములు. “మహాదేవి” శివ భక్తురాలు. ఆమె “చెన్న మల్లికార్జున స్వామి”ని ఆత్మవల్లభునిగా సంభావించినది. “మధుర భక్తి సుమ సౌరభము” లను నేల నలు చెరగులా వెదజల్లినది, వీర శైవ వాఙ్మయమునందు “అక్క మహాదేవి వచనములు” అవనతము కానట్టి పతాకము రెపరెపలై, చిర యశస్సును గాంచినవి.

“ఆద్యుల అరవై వచనముల కన్న:
దండనాయకుని ఇరవై వచనములు ||

దండనాయకుని ఇరవై వచనముల కన్న :
ప్రభుదేవుని పది వచనములు ||

ప్రభుదేవుని పది వచనముల కన్న :
అజగన్న గారి ఐదు వచనములు |

అజగన్న గారి ఐదు వచనముల
కూడల చెన్న సంగయ్య-
అందు
మహాదేవి అక్క గారి ఒక్క వచనము –
నిర్వచనము – చూచితివా సిద్ధరామన్నా!
– చెన్న బసవడు శివభక్తుడు, ఈతడు బసవేశ్వరునికి మేనల్లుడు. చెన్న బసవని పొగడ్తలను అందుకున్న మహా కవయిత్రి అక్క మహాదేవి.

**
“ లోలోపల శోధించి, ఆ వెలుపల శుద్ధి పరచి :
లో- వెలుపల – అను ‘ ఉభయ శంకలను దూరమ్ము చేసి;
స్ఫటికపు శలాక వలె తలక్రిందులుగ జేసి ;
సుక్షేత్ర మెరిగి, విత్తనములను విత్తు రీతిన్ :
ఎల్ల ప్రపంచము నుండి శిష్యుణ్ణి నివృత్తి పరచి :
నిక్కమౌ ఉపదేశమొనరించి:
సత్యమూలమును జూపు జ్ఞాన గురువు:
అప్పుడా సహజ గురుడనియేను జగములందున ఆరాధ్యుడు:
అతని శ్రీ పదములకు (= చరణములకు) మొక్కుతూ అనెదను
“నమో నమో” అని నేను : వీక్షించుమా చెన్న మల్లికార్జునా!
**

వచనము (43) :-

శిష్యునకు సద్గురుడు ‘అనుగ్రహము ‘ చేసేటి వేళ ;
తన శ్రీ హస్తమును శిష్య శిరసు పయి నుంచేటి తడవున;
లోహమ్ము మీద “పరుస”ను తాకించినట్లాయె! ..
**
సద్యోజాత, వామదేవ ,
అఘోర, తత్పురుష, ఈశానములు అనెడు ;
పంచ కలశమ్ములతొ అభిషేకములు సేయ;
ఈశు కరుణామృయ రసము కురిపించినటులయ్యెనయ్యా! ……..
ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశమును- వీనులందొనరించి;
కంకణము కట్టగనె – కాయమ్మె కైలాసమాయేను:
ప్రాణమే పంచ బ్రహ్మమయ లింగమాయేను;
**
“.. గుర్రము కూలబడిన కళ్ళెము గుంజి;
పరుగులు తీయించగలమా?.”
చెన్న మల్లికార్జున!

వీరునికి రంగమెక్కి దిగుట సబబు కాదు;
శివశరణునికి వెనుకంజ వేయుట సమ్మతము కాదు;
హృదయనాథుడు నిండి ఉండెను నాదు మానసమ్మంతయూ;
శ్రీ పర్వతము నెక్కకూడదు- మరి ఎక్కి దిగుట
నది ‘వ్రత భంగమే” అగునయ్య!!
రంగమెక్కి శస్త్రాస్త్రములను మరచినట్లు ……. “

ఈ పద్యములో అక్క మహాదేవి వసిస్తూన్న ఆ నాటి సమాజములోని ఆచారములూ, నమ్మకములూ తెలుస్తూన్నవి.

“ ….. మబ్బు చిరిగి వాన కురిసినపుడు ;
నా తను స్నానమునకు పడినదందును;
గిరులు దొర్లి పడినప్పుడు ;
పుష్పవృష్టి అని అనుకొందును. చెన్న మల్లికార్జున!……… ” {125}

ఆమె బండల పై నిద్రించీ, ఉపవాసమ్ములతో శుష్కించి కఠోర జీవనమును గడిపినది. అందుకే ఇట్లన్నది!

“చొక్కపు బంగారమును ముక్కలుగా జేసి,
కాచి కరగించిననూ ; నొప్పించబడితిననుచు ;
నలుపుదనము పొందునా ”

భక్త్యావేశములో ఆశువుగా తొణికిసలాడిన ఆ భవుని భక్తురాలి వచనములు భక్తికి పరాకాష్ఠ.

“అకటకటా! సంసారమను నాటకము –
ఆ ఎట్టెదుటకే వచ్చి, ఆడేను కాదా!
అప్పా బొప్పా – అను వేషమ్ము తోడ ;
వచ్చి ఆడేను తొట్ట దొలుత:
నెయ్యి పూసుకున్న మీసమ్ముల తోడ
ఆడేను తా వచ్చి, ఆ నట్ట నడుమ
ముసలి, ముదుసలి అనెడు వేషమ్ము కట్టి
తుట్ట తుదకు వచ్చి, ఆడింది ;
తామెల్లరును తిలకించు క్రియ కాస్త ముగియగానే
“జగన్నాటకమే ముగిసి పోయింది,
కంటివా!? ఓ చెన్న మల్లికార్జునా!”
**
ఈ పద్యములో “జగన్నాటకమునకు – ముక్తాయింపు”ను ఇంపుగా మెరిసిన చమత్కార పరంపరలే అక్క మహాదేవి వచనములను అగ్రస్థానమును పొందేట్లు చేసినవి. (27 ; పేజీ74)

అక్క మహాదేవి ప్రకృతి పరిశీలనము మిక్కుటము, ఆ ప్రజ్ఞయే ఆమె వాక్కులకు నిత్య ప్రభాత కాంతిని అలమింది. ఆమె నుడువు – ఇది గమనించండి – (32 పద్యము, పుట 76)

పట్టుపురుగు జిగురుచే తన ఇల్లు చేసుకుని
తన నూలు వలన – చుట్టుకుని మడియునట్లు;
మనసు కోరికలన్నిటినీ – కోరి దహియించుకుపోయేమయా!
నెమ్మనములో పేరాశలను రూపుమాపేసి,
నీ వైపు త్రిప్పుకో, చెన్నమల్లేశా!
**
శ్రీశైలము చేరి, నిశ్చల తపసు చేయు దశలో అక్క మహాదేవి పలుకులు – అధిక శాతం చెన్న మల్లికార్జునుని వర్ణనలు, శివభక్తుల నిష్ఠలు, వీర శైవుల ఆచారవ్యవహారములు, నొక్కి వక్కాణించే చిత్తరువులు!

“ … గురుకృప అనెడు సుగంధలేపనము నలది……. ”
“జంగమము నా నిధి నిధానము …….”
“ అచ్చ ప్రసాది, నిచ్చ ప్రసాది, సమయ ప్రసాది – అనెడు
చెలమలనుండి జలములను తోడి తెచ్చి;
లింగమునకు మజ్జనముల నొనరించు ;
పగటి దొంగలను మెచ్చునా చెన్న మల్లికార్జునుండు!?!”

“జలములందున పుట్టిన నీటిబుగ్గకు;
జాతిస్మరత్వము తెలిసి ఉండెను
దారిలో నగుపించినట్టి హరి సురులకు –
నీదు నెలవును చూపించినానయ్య ! చెన్న మల్లికార్జునా!”

షోడశోపచారములు, జంగముల సేవ , అష్టవిధార్చనలు, త్రివిధస్థానములు, షట్ స్థానములు, అష్టాదశ మంత్రముల శక్తి, మహా చిద్ఘన ప్రసాదము, పంచాక్షర, షడక్షర మహిమలు, సమ్యక్ జ్ఞాన, భక్తి భావ సంబంధము మున్నగు అనేక విశేషాలను ఉటంకించినది.

చారిత్రక కోణములో ముఖ్య స్థానమునొందగల వచనమును గమనించుదాము :-

“నా అంతటి భాగ్యమెవరికైన కలదా;
కిన్నెరయ్య అంతటి సోదరుడు నాకు ………….”

“మడివాళయ్య, సిద్ధరామయ్య, బసవన్న, చెన్న బసవన, అజగన్న, ఘట్టివాళయ్య, అల్లమ ప్రభువు, మరుళ శంకరయ్య, కోల శాంతయ్య, మాదరధూళయ్య, మిండవల్లినాధ చెన్నబసవన్న, చేరమ రాయ, తెలుగు జొమ్మయ్య మున్నగువారెందరో తారసిల్లారు – వారందరికీ పేరు పేరునా ఆమె ధన్యవాదములు చెప్పినది. “తెలుగు భాష” “తెలుగు” అనే ఇంటి పేరుగా కలవారు ఉన్నారని స్పష్టమౌతూన్నది.

“ ……. చీకటి శిబిరములోన;
సూర్యుడు నడయాడినట్లు ………..
వీర శైవ మార్గము నరయుటకు కలవు
ఏబది రెండు మా
ర్గములు…” అంటూ

52 పద్ధతులను అరటిపండు వలిచి, అరచేతపెట్టినట్లు – ఆమె వర్ణించినది. అక్క మహాదేవి వచనములు సుధాధారలు, భక్తిరస మధు గుళికలు; కన్నడములో వాడుకభాషకు ఉనికినీ, ఊపునూ తెచ్చినవి అక్క మహాదేవి సూక్తిముక్తావళి. ఆమె నుడువుల స్వాతిచిప్పలలో అగణిత మౌక్తికములు ఉద్భవిల్లినవి. ఆ ఆణి ముత్యములను కూర్చిన హారము
కర్ణాట వాణీమ తల్లి గళమున శోభిల్లుతూ, సాహితీ రసజ్ఞులను ఆహ్లాదపరుస్తూఉన్నవి.

“అక్క మహాదేవి సమగ్ర వచనాలు ” అనువాదము సరళముగా ఉన్నది. ఇవి తెలుగు వచనములే!- అనిపించునట్లున్నవి.
****

ఫుస్తకము వివరములు:-

“అక్క మహాదేవి సమగ్ర వచనాలు”
సంపాదకులు :- ధూపం బసవనాగయ్య:
అనువాదకులు: లింగైక్యులు (Late) రేకళిగ మఠం వీరయ్య & శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి
Copies available with:-
Om Namah Sivaya Sahiti Samskrutika Parishat
Plot No: 362: Chandragiri colony, Safilguda,
Ramakrishna puram, Secunderabad – 500056-
కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ ( 40, విద్యానగర్, హైదరాబాద్ – 500044) ప్రింటింగ్ బాగున్నది. అచ్చుతప్పులు లేకుండా ముద్రణ చూడ ముచ్చటగా ఉన్నది.
224 పేజీల ఈ పుస్తకము ధర:120?- రూ||
ఈ పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇదిగో.

You Might Also Like

4 Comments

  1. manoj reddy

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది నేను పోస్ట్ ద్వార ఈ పుస్తకాన్ని పొన్దవచ ప్లీజ్ రిప్లై తో మై మెయిల్

  2. kusumaamba

    “అక్క మహాదేవి సమగ్ర వచనాలు” వ్యాసాలను చదివి,
    మీ అభిప్రాయాలను చెప్పినందుకు కృతజ్ఞతలు కొత్తపాళీ గారూ!
    అక్క మహాదేవి గురించి కొన్ని తమిళ సినిమాలు కూడా వచ్చినవని విన్నాను.
    వాని పరిశీలన నా శక్తికి మించిన పని.
    ఎవరైనా తమిళ, తెలుగీయులు / ఉభయభాషావేత్తల సమీక్షలు చేస్తే బాగుణ్ణు.
    దీవి సుబ్బారవుగారి సూఫీ భక్తి గీతాలను చదివాను,
    చాలా మంచి శైలి, తేలికపాటి తెలుగు పదాలతో సాఫీగా చేసిన అనువాదం,
    నాకు చాలా నచ్చినవి.
    మీరు చెప్పిన పుస్తకానికై ప్రయత్నిస్తాను.

  3. కొత్తపాళీ

    చాలా బాగున్నదండీ. దీవి సుబ్బారవుగారి పుస్తకంలో అక్కమ్మ వచనాలు కొన్ని చదివాను.

    1. kusumaamba1955

      thank u sir

Leave a Reply