అంతర్జాలంలో సాహిత్య కోర్సులు

గత ఏడాది కాలంలో డిజిటల్ యూనివర్సిటీల జోరు పెరిగింది. udacity.com, coursera.com లాంటి వారు అత్యుత్తమ విద్యావిధానాలను ఆన్‍లైన్‍కు తీసుకురావడమే కాక, వాటిని ఉచితంగా అందిస్తున్నారు. అమెరికాలో పేరు పొందిన విశ్వవిద్యాలయాల నుండి ఆరితేరిన ప్రొఫెసర్లు నేర్పించే ఈ కోర్సులు చేయడానికి మన దగ్గర ఉండవలసినవి రెండు: ఒకటి – ఆసక్తి, రెండు-సమయం. అంతకు మించి మరే పెట్టుబడి అక్కర్లేదు, ముఖ్యంగా డబ్బు రూపేణ.

ఇలాంటి ఈ-కోర్సులు ఒకట్రెండు మా సాప్ట్-వేరుకు చెందినవి చేసున్న ధైర్యంతో, coursera.comవారు Fantasy and Science Fiction: The Human Mind, Our Modern World అన్న కోర్సు ప్రకటించగానే అది చేయడానికి పూనుకున్నాను. చదవటంపై ఆసక్తి మాత్రమే కనీస అర్హతలు అనేసరికి మరో ఆలోచన లేకుండా పోయింది. అయితే, ఫాంటసీ అంటే నాకు బొత్తిగా చిన్నచూపుగా ఉండేది. చిన్నపిల్లలకు కల్లబొల్లి కథలు చెప్పి వాళ్ళని నిద్రపుచ్చడానికి తప్ప వాటికేం ప్రత్యేకత లేదనుకునేదాన్ని. సాహిత్యాన్ని చదవడంకాక, “స్టడీ” చేయటమంటే ఏంటో తెల్సుకోవాలన్న కుతూహలంతో మొదలెట్టాను.

ఈ కోర్సు నిర్వహించినవారు ప్రొ.ఎరిక్ ఎస్. రాబ్‍కిన్. ఈయన ప్రొఫైల్ ఆసక్తికరంగా ఉండడం, పదివారాల కోర్సులో ఎనిమిది వారాల రీడింగ్ మెటిరియల్ వాళ్ళే అందించటం నేను కోర్సులో మునగడానికి కొంత తోడ్పడ్డాయి.

కోర్సు రెజిస్టేషన్: ఒక పనిచేస్తున్న ఈమెయిల్ ఐడి ఇచ్చి ఈ కోర్సుకు రెజిస్టేషన్ చేసుకోవాలి. ఆ పై వారం వారం కోర్సుకు సంబంధించిన విషయాలన్నీ ఆ ఐడికే మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇంతకు మించి, కోర్సు మొదలెట్టడానికి మరేం అవసరం లేదు.

కోర్సు విధివిధానం:

ఏ వారం ఏం చదవాలో ముందుగానే చెప్పేసి ఉంటారు. వారం మొదలయ్యేటప్పుడు ప్రొఫెసర్ గారు ఒక వీడియో విడుదల చేస్తారు. (మనం లాగిన్ అయితే ఆ వీడియో చూడగలం.) అందులో ఆ వారం మనం చదవబోయే రచనను చూచాయిగా పరిచయం చేస్తూ, దాన్ని చదువుతున్నప్పుడు మనల్ని ఫలనా అంశాన్ని గుర్తుపెట్టుకోమనో, లేక ఫలనా దానిపై మన అభిప్రాయం ఏంటో ఆలోచించమని సూచిస్తారు.

ఆ వీడియో విడుదలైన రోజునుండి ఓ నాలుగైదు రోజుల్లో మనం ఆ రచనను చదివి, ఆకళింపు చేసుకొని, దానిపై మూడు వందల పదాల లోపు ఒక థీసిస్ తయారుచేసుకొని, అది ఆ కోర్సు వెబ్‍సైటులోనే ఉంచాలి. ఈ థీసిస్ రాయడానికి ఒక ముఖ్యమైన గీటురాయి ఏంటంటే – రచనలో ఉన్నదాన్ని క్రోడీకరించి రాయకూడదు. ఒక తెలివైన విద్యార్థి ఈ పుస్తకం చదివి ఉంటే, అతడు అర్థం చేసుకున్నదాన్ని ఇంకా పెంపొందించేలా ఉండాలి థీసిస్.

అసలైతే ఇలాంటి థీసిస్‍లను ప్రొఫెసర్లో, వాళ్ళ అసిస్టెంట్సో చదివి గ్రేడింగ్ ఇస్తారు. కంప్యూటర్ కోర్సుల్లో ఈ గ్రేడింగ్ ను ఆటోమేట్ చేస్తున్నారు. లిటరరీ వ్యాసాలకు ఆటోమాటిక్ గ్రేడింగ్ ఉన్నా ఈ కోర్సు లో దాన్ని అవలంబించలేదు. యాభై వేలకు పైగా విద్యార్థులున్న ఈ కోర్సులో థీసిస్ లు చదువుతూ కూర్చోవాలంటే అసాధ్యం. అందుకని వీళ్ళు peer-evaluationను ప్రయత్నించారు. మన థీసిస్ సబ్మిట్ చేశాక, ఓ రెండు రోజుల్లో మనం ఇదే రచనపై మరో నలుగురు రాసినవి చదివి వాళ్ళకి గ్రేడింగ్ వేయాలి. మనం రాసిదానికి అలానే ఎవరో ఇంకో నలుగురు వేస్తారు. వాటి ఆవరేజ్‍ను బట్టి మన స్కోర్ ఉంటుంది.

థీసిస్ సబ్మిషన్ అయిపోయాక, ప్రొఫెసర్ ఆ రచనను గురించి తానేమనుకుంటున్నారో, ఆ రచన చుట్టూ ఉన్నా ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ వీడియోలు విడుదల చేస్తారు. అప్పటికే మనం ఆ పుస్తకం చదివి ఉంటాం కాబట్టి, మన అభిప్రాయాలో, అండర్‍స్టాండిగ్సో రాసుకుని ఉంటాం కాబట్టి, ఇహ, హాయిగా ప్రొఫెసర్ గారి మాటల్లో ఆదమరచిపోవచ్చు.

మొదటి నుండి మొదలెట్టాలనే రూలు లేకపోయినా (అంటే కోర్సు మొదలైన రెండు మూడు వారాలకు కూడా జాయిన్ అవ్వచ్చు), ఆది నుండి ఉండడమే మేలు. నా మట్టకు నాకు, ఆయన రచనకు రచనకు మధ్య చాలా లింక్స్ పెడుతూ, as a whole, ఆ రచనల్ని అర్థం చేసుకునే వీలు కల్పించారని అనిపించింది. పైగా ఒక వారం తెల్సుకున్న విషయాల వల్ల ప్రస్తుతవారం చదువుతున్న రచనలో కొత్త కోణాలు కనిపించే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయమేమిటంటే, ఇందులో సాహిత్యాన్ని చదవటం మాత్రమే జరగదు. దాన్ని బాగా విశ్లేషిస్తారు. ఇక్కడ “బాగా”కు చక్కగానూ, అతిగానూ అన్న రెండు అర్థాలూ సరిపోతాయి. రాయబడ్డ ప్రతీ పదం మరిదేనికో ప్రతీకగా భావిస్తూ, రచయిత మానసిక, సామాజిక స్థితిగతులను ఎక్కడా విస్మరించకుండా, అప్పటి దేశరాజకీయ పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకుని జరిగే విశ్లేషణలు ఒక్కోసారి అతిశయంగానూ, మరోసారి అసహనంగానూ అనిపిస్తాయి. కథను చదువుకొని, అది తిప్పే లోకాలు తిరిగి, దాన్ని కంచికి పంపి, మనం ఎంచక్కా బొజ్జోవచ్చు కదా! అని అనుకునేవాళ్ళకి ఈ కోర్సు మీద పీకల దాకా కోపం వచ్చినా రావచ్చు.

ఈ కోర్సు వల్ల నాకు కలిగిన అతి పెద్ద లాభం – ఫాంటసీ అంటే చిన్నచూపు పోవటం. పైగా ఏ రచనని ఫాంటసీ అనాలో, ఎప్పుడు అనాలో తెలియజెప్పింది. ఇప్పుడు మీరు నాకో కథ ఇచ్చి దాని genre చెప్పమంటే, మొత్తానికి చేతులెత్తేయకుండా, కనీసం ప్రయత్నించగలను. చిన్నపిల్లలకు కథలు అవసరం. కానీ పెద్దయ్యేకొద్దీ ఆ కథలని మర్చిపోకుండా వాటిని మళ్ళీ మరో తరం చిన్నపిల్లలకు ఎందుకు చెబుతాం? అన్న ప్రశ్నకూ సమాధానం దొరికింది. అలాంటివింకా బోలెడు విషయాలు తెల్సాయి. (అసలాయన మాట్లాడుతూ ఉంటే నేను ఆశ్చర్యంగా నోరు వెల్లబెట్టుకునే విన్నాను ప్రతి పాఠాన్ని – అన్ని కొత్త సంగతులు తెల్సాయి.)

ఇలాంటి కోర్సులు చేయాలనుకుంటున్నవారికి కొన్ని సూచనలు (నా అనుభవం మేరకు):

౧. కోర్సు చేయాలనుకుంటున్నవారికి ఎలాంటి అర్హతలు ఉండనవసరం లేదని అన్నారు గానీ, దీనికి చాలా ప్రిపరేషన్ కావాలి. ముఖ్యంగా, రచనలన్నీ కనీసం ఒకసారైనా చదివి ఉంటే బాగుంటుంది. థీసిస్ లో ఆశించే స్థాయి అందుకోవాలంటే ఒకటికి రెండు సార్లు చదవాలి. కోర్సు మొదలయ్యాక ఉండే మూడు, నాలుగు రోజులు ఆయా రచనను తిరగేయడానికి, డిస్కషన్ బోర్డ్సులో చర్చించేందుకు, ఆలోచించి థీసిస్ రాసేందుకే సరిపోతుందనుకుంటాను, కనీసం నాబోటి మందబుద్ధులకు. శరవేగంగా నమిలి పారేసేవారికి, అంతకన్నా వేగంగా రాసేవారికి ఇది వర్తించకపోవచ్చు. అలాగే బ్లాగుల్లో రాసుకునే పిచ్చాపాటీ కబుర్లలో వాడే భాషకు ఇలాంటి సాహిత్య విన్యాసాలకు వాడే భాషకు చాలా తేడా ఉంటుందని గమనించుకోవాలి.

౨. మా అప్పుడు ఇది మొట్టమొదటిసారిగా ప్రయత్నించారు కాబట్టి ఎన్నో టెక్నికల్ సమస్యలు, మరెన్నో ఇబ్బందులు కలిగాయి. పియర్ గ్రేడింగ్ చాలా పెద్ద తలనొప్పి అనిపించింది. ముఖ్యంగా “color”కి బదులు “colour” అని రాసినందుకు అరపాయింటు తగ్గించే మనుషులు తగిలినప్పుడు! అయితే కోర్సు డిస్కషన్ బోర్డు మాత్రం చాలా పనికి వచ్చేది. పెద్దమొత్తంలో జరుగుతున్న ప్రయత్నం కాబట్టి ఓపిగ్గా వ్యవహరించటం తప్ప మరోదారి లేదు .

౩. సర్టిఫికేట్స్ ఏం ఇవ్వమన్నారు గానీ, కోర్సు పూర్తిచేసినందుకు ఒక పత్రం ఇస్తామన్నారు. నేను అందాక రానే లేదు. అలాంటిదేదో ప్రయత్నించేదానికన్నా ఆసక్తి ఉన్న నలుగురైదురుగు స్నేహితులు కల్సి చదువుకుంటే ఇందులో ఉన్న అలసట తగ్గుతుంది.

౪. ఇందులో explicit contentకు అవకాశం లేకపోలేదు, ముఖ్యంగా రచనల్లో sexual symbols కోసం వెతికేటప్పుడు. ఒక్కోచోట అవి శృతిమించచ్చు కూడా. Not for the faint hearts!

Fantasy and Science Fiction: The Human Mind, Our Modern World జనవరి 28నుండి మొదలవుతుంది, మళ్ళీ.

ఇలాంటిదే మరో కోర్సు The Fiction of Relationship, జూన్-జూలై నెలల్లో ప్రారంభమవుతుంది.

టెక్నాలజి పుణ్యామని మన ఊహకి కూడా అందడానికి కష్టంగా ఉండేవి, ఇప్పుడు మన కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. అందిపుచ్చుకోవటమా, దాటేయటమా అన్నది మన ఛాయిస్.

 

(Update: ఇక్కడ ప్రచురితమైన తరువాత ఈ వ్యాసం కొన్ని మార్పు-చేర్పులతో జనవరి 21వ తేదీ నాటి ఈనాడు “చదువు” పేజీలో వచ్చింది. తాత్కాలిక లంకె ఇక్కడ. – పుస్తకం.నెట్)

You Might Also Like

4 Comments

  1. సాహిత్యానుబంధం: Fiction of Relationship | పుస్తకం

    […] వాటిలో సాహిత్యం ఎలా నేర్పిస్తారో ఈ వ్యాసంలో చెప్పున్నాను. అందులోనే బ్రౌన్ […]

  2. 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం

    […] కోర్సు-ఎరా.కాం లో చేసిన కోర్సులో భాగంగా చదివిన పుస్తకాలు: […]

  3. Vijayavardhan

    Thank you for letting us know about it.

  4. Sarat

    రాబ్కిన్ గారి మొదటి వీడియో చూసి మరీ కోర్సును మానేసిన గాడిదను నేను. కావాల్సిన ఆసక్తి ఉన్నా సరిపడా ఓపిక, సమయం లేఅకపోవటం మరి కారణాలో లేక సాకులో తెలియదు. ఐతే ఈ కోర్సును మన తోటి తెలుగు వారు తీసుకుని, పూర్తి చేసి, అనుభవాలను తెలుగులో రాయటం, అది నేను చదవటం మాత్రము నాకు బాగా ముచ్చటగా ఉంది.
    ఇకపోతే ఫ్యాంటసీ నాకు చిన్ననాటి నుండి బాగా నచ్చు. ఆ అల్లిబిల్లి కథల నుండే పెరిగిన ఆశక్తి అని నా అభిప్రాయం. పౌరాణికాలు, రామాయణ మహాభారతముల నుండి మొదలయ్యి విదేశాల పురనికాలు, మైథాలజీలను (ఇలియడ్, బియోవుల్ఫ్, హయవత మొదటి సారిగా చదవటం నాకు ఇప్పటికి గుర్తు) అందుకుని అక్కడ నుండి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ , గేం అఫ్ త్రోన్స్ ని చేరుకుంది కాలేజిలో చదువుకుంటుండగా. ఇప్పుడు చేతిలో కాసిన్ని కాసులు ఆడగా ఆ ప్రయాణం ఇంకొంత ముందుకు ప్రాకుతుంది. కనుక నాకు తెలిసి ఫ్యాంటసీ అనగా రాబ్కిన్ గారి definition నాదానికన్నా భిన్నంగా ఉంటే నేను ఆశ్చర్యపోను.

Leave a Reply