భావకవితా పరిమళం – కోనేటి మెట్లు
వ్యాసం రాసిపంపినవారు: సోమశంకర్ కొల్లూరి
కవిత్వంలో నవరసాలు పలికించవచ్చు. ఛందోబద్ద కావ్యాలలో భావాలను గుహ్యంగా, మార్మికంగా వ్యక్తీకరించి కవి ఆనందించవచ్చు. పాఠకులను ఆనందిపజేయచ్చు. వచన కవిత్వం అందునా భావ కవిత్వం ప్రధానంగా అనుభూతి ఆధారితం. తాము స్వయంగా, వైయక్తికంగా అనుభూతి చెందిన భావాలను అదే తాదాత్మ్యతతో చదువరులకు అందించడం అంత తేలిక కాదు.
హృదయానుభూతులకి అక్షర రూపమివ్వడం, సరళమైన వచనంలో భావాన్ని వ్యక్తం చేసి, “మా మనసుల్లోనూ ఇలాంటి భావాలు తారసిల్లుతాయి, ఇవి నా భావాలే” అనిపించేలా రాయడం మరీ కష్టం.
అటువంటి పనిని సుసాధ్యం చేసారు స్వాతి కుమారి. కల్హార శీర్షికతో బ్లాగు నిర్వహించే స్వాతి కుమారిగారి మొదటి పుస్తకం “కోనేటి మెట్లు”. ఆధునిక తెలుగు కవిత్వం అంటే అర్థం కాని పదాడంబరం అని ముద్రపడిపోయిన రోజుల్లో, ఇజాల చుట్టూ సాలెగూడులా అల్లుకుంటున్న భావజాలమే కవిత్వం అనిపించుకుంటున్న రోజుల్లో – సున్నితమైన అనుభూతులను చక్కని పదాలతో పొందికగా కూర్చి అందించారు “కోనేటి మెట్లు”లో.
వాన కురిసినప్పుడు మురిసిపోయే బాల్యాన్ని అందంగా చిత్రించడం వర్షోల్లాసం. వర్షం పడినప్పుడు నా కోసమే పడిందని అనుకోని పసి మనసు ఉండదు కదూ.
అత్యంత సన్నిహితుల మధ్య సైతం కాలం దూరాన్ని పెంచుతుంది. అత్యంత దగ్గరివారు, మావి ఒకే భావాలు అనుకున్నవారు సైతం మానసికంగా దూరమవుతూంటారు. అప్పుడే మరోసారి కొత్తగా పరిచయం చేసుకోవాల్సివస్తుంది. దురదృష్టమే… కానీ అవసరం కూడా!
ప్రకృతిలోని అందాలు – చూసే మనసుకి దృశ్యాదృశ్యాలు. భావ చిత్రాలు హరివిల్లుకు రంగులద్దుతాయి, మౌనరాగాలు పాటలకి రమ్యతనిస్తాయి. నా అనుకున్న వాళ్ళ సమక్షం ఎంత హాయినిస్తుందో చెప్పవచ్చు, కానీ ఆత్మీయుల వియోగం తాత్కాలికమైనా ఎంత దిగులుని కలిస్తుందో చెప్పడం అవ్యక్తం.
ఆధునిక జీవన శైలికి అలవాటు పడిపోయి, ఉషోదయానికి స్వాగతం పలికి ఎన్నాళ్ళయిందో అని అనుకునేవాళ్ళూ, అసుర సంధ్యలను ఆస్వాదించి చాలా రోజులైందనుకునే భావుకులు… హఠాత్తుగా మనోజ్ఞమైన అనుభూతులను మనసులోకి ఆహ్వానించుకుని…. ఇదిగో… మళ్ళీ ఇప్పుడే అని అనుకుంటారు.
తొలుత ఆర్ద్ర సముద్రంగా, తర్వాత కల్లోల కడలిగానూ, ఆ తరువాత మున్నీట ముంచిన మహర్ణవంగా – జీవితంలోని వివిధ దశలలో మనిషిలోని మానసిక ఉద్వేగాలూ, ఉద్రేకాలను సూచిస్తుంది సింధువు.
[quote]
“భౌతికమేదైనా
నైతికమౌనా కాదా అని
మనసుకెందుకు మరణయాతన?”
[/quote]
అని ప్రశ్నించడంలో భావుకత్వం పాలు కన్నా వ్యక్తిత్వపరమైన విలువల నిబద్ధతే ఎక్కువగా గోచరిస్తుంది.
తమ భావుకత్వం, సున్నితత్వం – లోకానికి అకారణ దుఃఖంగా అనిపిస్తుందని తెలిసినా- వ్యక్తీకరించకుండా ఉండలేరు. నానృషిః కురుతే కావ్యం అన్న ఆర్యోక్తి నిజమైనా కాకున్నా, భావుకుడు కవి అయి తీరుతాడు. భావుకుల అనుభూతులు ప్రచురించినా ప్రచురించక పోయినా ఏదో ఒక చోట కవితా రూపంలో వెల్లడవుతునే ఉంటాయి.
తమకంలోని మకరందాన్ని అక్షరాల్లో వ్యక్తం చేస్తే అది తమకరందం. ఒంటరితనం బాధిస్తున్నప్పుడు విలవిలలాడుతూ ఇప్పుడెందుకిలా అని మనసు వాపోవడం వేదనాభరితమైన అనుభవం. మిడిసిపాటుని మొక్కతోనూ, వినమ్రతని వేరుతో పోల్చడం అద్భుతమైన భావన.
బంధంలోని గాఢత ఎంత తీవ్రంగా ఉంటుందంటే….. “నువ్వు లేకపోవటమంటే అసలేమీ లేకపోవడం” అనుకునేంత. అటువంటి ఆత్మీయుల వియోగం భరించలేనిది. గుండె గడ్డకట్టినట్టుండదూ?
ఇది వెన్నెల మాసమనీ…. అనే కవితాత్మక వచనం అక్కచెల్లెళ్ళ అనురాగానికి ప్రతిబింబం. దాన్ని చదువుకుని ఆస్వాదించాల్సిందేగానీ… దాని గురించి రాయలేం, చెప్పలేం.
ఇంకెందుకు ఆలస్యం…. అడుగేయండి కోనేటి మెట్ల వైపు!
* * *
“కోనేటి మెట్లు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి ప్రింట్ పుస్తకాన్ని పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.
vijaya
ప్రయాణం చేస్తూ ఈ పుస్తకాన్ని చదివాను…నాకు భావుకతా పల్లకిలో ఊరేగి వెళుతున్నట్టు అనిపించింది. స్వాతి కవితల్లో ప్రత్యేకత ఎంటంటే..భావం ఎంత బాగుంటుందో భాషా అంత బాగుంటుంది.ఒకోసారి ఆ భావాల ఘాడతని అర్ధం చేసుకోడం నా లాంటివారి వలన అయే పని కాదు. ఆగి, మరలా చదివి – వావ్ ఎంత అధ్బుతమైన భావం అని ముందుకి వెళ్ళిన సంధర్బాలు అనేకం.ప్రకృతి ఎవరినైనా కవిగా ప్రేరేపిస్తుంది ,కాని మనలోనే ఉన్న అనేక సంఘర్షణలను, బంధాలను,దుఖం లాంటి బరువైన వస్తువుల ఆధారంగా కవిత్వం రాయడం అదీ అంత భావుకత్వంతో….బహుశా స్వాతి లాంటి వారే
చెయ్యగలరేమో. ఈ పుస్తకం చదవడం అంటే…కోనేటి మెట్ల పై కూర్చుని సముద్రపు ఘాడతను అనుభవిస్తున్నట్టు.
ramani
స్వాతి గారు పుస్తకం ఇంకా చదవలేదు కాని మీ కవితలల మకరందామకరందపు తీయదనం నాకు తెలుసు. సోమ శంకర్ గారు అద్భుతంగా వెంటనే కోనేటి మెట్లు ఎక్కాలి అనేంత సున్నితంగా వ్రాసారు. చదివి మళ్ళీ వస్తాను.