నేస్తమా…. బి పాజిటివ్
వ్రాసిన వారు: కొల్లూరి సోమశంకర్
*********
హితాన్ని కలిగించేది సాహిత్యం అని అంటారు. సాహిత్యంలోని రెండు ప్రధాన విభాగాలైన కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యాలకు విభిన్న ప్రయోజనాలున్నాయి. కాల్పనిక సాహిత్యం (పద్యం, కవిత, కథ, నవల, కథానిక, వగైరాలు) భావోద్వేగాల్ని కలిగించి, అనుభూతులని మిగిలిస్తూ మనసుకు ఉల్లాసాన్నిస్తే ; కాల్పనికేతర సాహిత్యం (యాత్రా విశేషాలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, నేర్చుకోడం ఎలా వంటి వ్యాసాలు… మొదలైనవి) ప్రమోదాన్ని కలిగిస్తూ, మనసుకు ఉత్తేజాన్నిస్తుంది.
కాల్పనికేతర సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం కోవలోకి వచ్చే ప్రేరణాత్మక సాహిత్యం యొక్క ప్రయోజనం విలక్షణమైనది. ఇది విజేతల అనుభవాల సారాన్ని పాఠకులకు పంచుతుంది. సిద్ధాంతాల గురించి పుంఖానుపుంఖాలుగా రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నా, కథనానికి తమ సొంత అనుభవాలు జోడించి, తేలిక పదాలతో, సులువుగా అర్థమయ్యేలా చేసిన రచనలు సాధకులను అలరిస్తాయి. ఈ తరహా రచయితలలో అగ్రగణ్యులు శ్రీ ఎ. జి. కృష్ణమూర్తి. ‘ఎజికె’గా సుప్రసిద్ధులైన కృష్ణమూర్తి గారు భారతీయ వ్యాపార ప్రకటనల రంగంలో తనదంటూ ‘ముద్ర’ వేసిన తెలుగువారు.
కృష్ణమూర్తి గారు రచించిన స్ఫూర్తిదాయక పుస్తకం ‘నేస్తమా…. బి పాజిటివ్’. ఔత్సాహిక సాధకులకు ఈ పుస్తకం కరదీపిక లాంటిది.
జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునేవారికి కొదవ లేదు. తాము ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అందరికీ కలలుంటాయి, కానీ వాటిని సాకారం చేసుకోడం తెలియదు. చాలా మంది తమ లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గం తెలియదు. గమ్యం, మార్గం తెలిసిన వారిలో చాలా మంది ఒకటి రెండు ఎదురుదెబ్బలు తగలగానే; పరిస్థితులకు తలవంచేసి, ఆ మార్గం నుంచి తప్పుకుంటారు. విజేతలకీ, పరాజితులకీ మధ్య తేడా దృక్పథమేనంటారు ఎజికె.
లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలి, ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి ఏమేమి కావాలి, గమ్యం చేరేదాక మనలో ఉండాల్సిన లక్షణాలేవి? లభించిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే వివరాలు చెబుతారు రచయిత ఈ పుస్తకంలో.
ఎదగాలన్న కోరిక బలీయంగా ఉంటే సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, సామాన్య జీవితం నుంచి అసాధారణ జీవితానికి ఎవరైనా ఎదగవచ్చని అంటారు రచయిత.
“ఎందరో మహానుభావులు” అనే ప్రకరణంలో తనకి మార్గదర్శకులుగా నిలిచిన గీరాబెన్ శరాభాయి, ధీరూభాయి అంబానీ, వర్గీస్ కురియన్‌ల గురించి వివరించారు. వారు ముగ్గురు తనకి నేర్పిన పాఠాలేమిటో చెప్పారు. వాటిని గ్రహించి అమలు చేయడం వలన తాను వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఎంతలా రాణించారో చెప్పారు.
“కొన్ని ప్రగతి మార్గాలు” అనే ప్రకరణంలో తోటివారిని ఎలా ప్రోత్సహించాలో, వారి నుండి నాణ్యమైన పని ఎలా రాబట్టుకోవాలో, గుర్తింపు విలువ ఏమిటో చెబుతారు. మెచ్చుకోలు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చెబుతారు.
“సంతోషానికి కాసిని సలహాలు” అనే ప్రకరణంలో ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి కొన్ని విలువైన సూచనలు చేసారు. ఇవి ఎంతో సులువైనవి అని అనిపించినా తప్పక ప్రభావితం చేసేవి.
“అవీ… ఇవీ… అన్నీ…” అనే ప్రకరణంలో ప్రేరణనిచ్చే ఎన్నో అంశాలను స్పృశించారు.
“జీవితంలో ఏదో ఒకటి సాధించడం మీరనుకున్నంత కష్టం కాదు. ఆ సాధించాలి అనుకునే నిర్ణయానికి రావడమే కష్టం. ఆలోచించి చూడండి. భగవంతుడు, తల్లిదండ్రులు మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని నిస్సారంగా గడపడం ఎంత నేరమో! నమ్మకంతో ముందడుగు వేయండి. ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని మిమ్మల్ని విజయవంతం చేస్తాయి. బి పాజిటివ్ – మంచి జీవితానికి పునాది ఇదే” అంటూ ముగిస్తారు రచయిత.
అందరికీ తెలిసిన విషయాలే అనిపించే అంశాలకు రచయిత తన జీవితానుభవాలను మిళితం చేసి సోదాహరణంగా, వివరణాత్మకంగా చెప్పిన తీరు ఎంతో బాగుంటుంది.
యువత తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోడానికి, విజయపథంలో పయనించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. చదివి పక్కన పడేసే పుస్తకం కాదిది. ఇందులోని అంశాలను జీర్ణించుకుని, జీవితానికి అన్వయించుకోవాల్సిన పుస్తకం.
ఎమెస్కో బుక్ హౌస్ వారు ప్రచురించిన ఈ 148 పేజీల పుస్తకం వెల 60 రూపాయలు. అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలను ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకం ఈ-బుక్‌గా కినిగె.కాంలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
krishna mohan
also available in book format
please check this link
http://www.logili.com/books/nestama-bee-positive-g-krishna-murthi/p-7488847-64363002244-cat.html#variant_id=7488847-64363002244
Rajan
వృత్తిరీత్యా వ్యక్తిత్వనిపుణులు వ్రాసిన పుస్తకాలకన్నా, జీవితంలో కోరుకున్న దిశలో ఎదిగిన వ్యక్తులు వ్రాసిన పుస్తకాలే మనకు స్ఫూర్తినిస్తాయి. అబ్దుల్ కలామ్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మొదలైనవారి రచనలే దీనికి ఉదాహరణ. ఆకోవకే చెందిన మరో వ్యక్తి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.