వీక్షణం – 1 (కొత్త శీర్షిక ప్రారంభం)

(పుస్తకం.నెట్లోనే కాక – తెలుగు, ఆంగ్ల అంతర్జాలంలో పుస్తకాల గురించి బ్లాగులలోనూ, వార్తలలోనూ, ఇతరత్రా వెబ్సైట్లలోనూ రోజూ ఎన్నో సంగతులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మాకు కనబడ్డవి, కనబడ్డవాటిలో పదుగురితో పంచుకోవాలనిపించినవీ అయిన వెబ్-పేజీల గురించి చిన్ని పరిచయాల కోసం ఈ శీర్షిక. పొద్దులో ఇదివరలో వచ్చిన “బ్లాగు వీక్షణం”, క్రిక్ ఇంఫో వెబ్సైటులో “సర్ఫర్” బ్లాగు – ఈ ఆలోచనకు స్పూర్తి. ప్రస్తుతానికి గత పక్షంరోజుల్లో కనబడ్డ విశేషాల గురించి చెప్పుకుందాము. వీలును బట్టి మరింత తరుచుగా చెప్పుకోవచ్చు. కొన్ని వందల వ్యాసాల నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడానికి కారణం – అన్నీ మొత్తంగా చదివి జీర్ణించుకోవడం మానవమాత్రుల వల్ల కాదన్న కారణం మాత్రమేనని గ్రహించగలరు.)

***
ఈ వారంలో ప్రధాన విశేషాలు – నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటన, ఫ్రాంక్ఫర్ట్ పుస్తక ప్రదర్శన.

చైనా కు చెందిన రచయిత మో యాన్ కు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది.
“Mo Yan, a novelist who brought to life the turbulence of the 20th century China in vivid and often graphic works set against the tumult of the Japanese invasion and a struggling countryside, on Thursday became the first writer in China to be awarded the Nobel Prize in Literature.”
అంటూ మో యాన్ గురించి హిందూ పత్రికలో వచ్చిన అనంత కృష్ణన్ వ్యాసం ఇక్కడ చదవండి. మో యాన్ కథల సంకలనం “Shifu, You’ll do anything for a laugh” గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇదిగో.

“In Chinese, Mo Yan means don’t speak. I was born in 1955. At that time in China, people’s lives were not normal. So my father and mother told me not to speak outside. If you speak outside, and say what you think, you will get into trouble. So I listened to them and I did not speak. When I started to write, I thought every great writer had to have a pen name. I remembered my mom and my dad telling me do not speak. So I took Mo Yan for my pen name. It is ironic that I have this name because I now speak everywhere.”
-అంటూ మోయాన్ తన గురించి 2011లో చెప్పుకున్న ఇంటర్యూ ఇదిగో.

*****
ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుపొందిన ఫ్రాంక్ఫర్ట్ పుస్తక ప్రదర్శన ఈ ఏడు 10-14అక్టోబర్ మధ్యలో సాగింది. ఇది ప్రధానంగా ప్రచురణకర్తలు, ఇతర మీడియా కంపెనీలు వాటి మధ్య పరస్పర లావాదేవిల కోసమే అయినా, చివరి రెండ్రోజులూ మామూలు జనాలకి కూడా ప్రవేశం ఉంది. వంద పైచిలుకు దేశాలు, ఏడు వేలకు పైగా ఎగ్జిబిటర్లు, లక్షలలో ఉండే విజిటర్లూ – ఈ సంఖ్యలను బట్టి ఊహించుకోవచ్చు ఎంత పెద్దదో!

*****

తెలుగు బ్లాగులు, పత్రికల విశేషాలు:
“తెలుగు కథల్లో గాంధీ దర్శనం” కథల సంకలనాన్ని పరిచయం చేసారు “నెమలికన్ను” మురళి గారు.
“విశ్వనాథ సత్యనారాయణ మొదలు, దాదా హయత్ వరకూ మొత్తం పదకొండు మంది రచయితలు రాసిన పన్నెండు కథలని సంకలనంగా కూర్చిన వారు తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన ‘దామల్ చెరువు’ అయ్యోరు మధురాంతకం రాజారాం. 1986 లో రూపుదిద్దుకున్న ఈ సంకలనాన్ని, కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన ‘గాంధీ క్షేత్రం’ 2008 లో మార్కెట్లోకి తెచ్చింది, ఎమెస్కో సౌజన్యంతో. కొన్ని కథలు స్వతంత్ర సంగ్రామం నేపధ్యంతో వచ్చినవి కాగా, మరికొన్ని గాంధీ శతజయంతి (1969) సందర్భంగా వెలువడ్డవి. “

తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జీవితం, సాహిత్యం గురించి మరొక ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రాయగా సాహిత్య అకాడెమీ వారు ప్రచురించిన “దేవరకొండ బాలగంగాధర తిలక్” పుస్తకం గురించి; అలాగే తిలక్ జీవితం పై ఒకప్పుడు ఆకాశవాణి వారు రూపొందించిన “శిఖరారోహణ” డాక్యుమెంటరీ గురించీ పరిచయం చేసారు బ్లాగర్ తృష్ణ గారు. అలాగే, ఆ డాక్యుమెంటరీ ఆడియో కూడా పొందుపరిచారు తమ బ్లాగులో.

కినిగే.కాం వారి బ్లాగులో వారి దగ్గర కొత్తగా వచ్చిన పుస్తకాల గురించీ, అప్పుడప్పుడూ వారి దగ్గర ఉన్న పుస్తకాల గురించి బయట వచ్చిన సమీక్షల గురించీ రాస్తూ ఉంటారు. గత కొన్నాళ్ళలో – ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయచరిత్ర పై ఆంధ్రభూమి లో వచ్చిన వ్యాసమూ, పి.సత్యవతి గారి కథల సంకలనం “మెలుకువ” గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఉణుదుర్తి సుధాకర్ వ్యాసమూ, రవి వీరేల్లి గారి కవితా సంకలనం “దూప” గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసమూ – వీటిలో కొన్ని. అలాగే, కినిగేలో కొత్తగా వచ్చిన – యండమూరి నవల “డేగ రెక్కల చప్పుడు” గురించి, షాడో నవల “స్పైడర్స్ వెబ్” గురించి కూడా టపాలు వేశారు. వీటన్నింటితో పాటు – ప్రాజెక్ట్ గుటెన్బర్గ్ లో ఉచితంగా దొరికే తెలుగు నవల “కొల్లాయి కట్టితేనేమి?“ని  పరిచయం చేస్తూనే, తమ వెబ్సైటు ద్వారా డిజిటల్ కాపీ కొనుగోలుకు, ఉచిత దిగుమతికి కూడా లభ్యం అని మరో టపాలో వ్రాశారు.

హైదరాబాదు బుక్ ట్రస్టు వారు ఇటీవలే విడుదలైన “నిర్జన వారధి” పుస్తకం గురించి వివిధ జాల గూళ్ళలో వచ్చిన వ్యాసాలను సమీకరిస్తూ – జంపాల చౌదరి గారు ఇక్కడ పుస్తకం.నెట్లో రాసిన వ్యాసాన్నీ, చరసాల ప్రసాద్ గారి బ్లాగులో రాసిన వ్యాసాన్నీ పొందుపరిచారు. అలాగే, వాళ్ళు ఇటీవలే ప్రచురించిన దేవులపల్లి కృష్ణమూర్తి కథలు “కథలగూడు” గురించి మోహన్ రాసిన పరిచయం ఇక్కడ చదవవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

పుస్తకాల గురించి తరుచుగా బ్లాగులో రాసే ప్రముఖ జర్నలిస్టు జైఅర్జున సింగ్ బ్లాగులో ఎప్పటిలాగే కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు పరిచయం అయ్యాయి. ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ దర్శకుడు మణిరత్నం తో చేసిన మాటామంతీ “Conversations with Manirathnam” పేరిట విడుదలైంది.
“When I met him first about the book, I just wanted to tell him I was doing a series of essays about his films. But he surprised me by saying: “You like cinema. I like cinema. Let’s just talk and see what happens.”

-అంటూ మణిరత్నం గురించీ, ఈ పుస్తకం గురించీ రంగన్ అర్జున్ సింగ్ తో చెప్పిన కబుర్లు ఇక్కడ చూడవచ్చు. 
***
పందొమ్మిదో శతాబ్దపు దక్షిణాఫ్రికాలోని ఒక గ్రామంలో బానిసగా ఉన్న ఒక బాలిక కథ “ఫిలిదా”. ఈ నవల గురించి, అందులోని వివిధ కోణాల గురించి జైఅర్జున్ బ్లాగులో రాసిన పరిచయం ఇక్కడ చూడండి.
Through its tapestry of intersecting fortunes, one never loses sight of the girl who badly wants for her name to be written down in a family book – to be on the official record, as having existed – but who fears that her life is “a piece of knitting that is knitted by somebody else.”

*****
కొన్ని ఆసక్తి కరమైన పుస్తకాల గురించి హిందూ పత్రిక సమీక్షల ద్వారా తెలిసింది. రాజస్తాన్ రాష్ట్రంలో పనిచేసిన వివిధ ఐ.ఏ.ఎస్. అధికారుల అనుభవాలు, వారు ఎదుర్కున్న ఛాలెంజ్లు – ఇలాంటి అంశాలు స్పృశిస్తూ రూపొందించిన “Bureaucracy in Action” పుస్తకం గురించి అర్.కె.రాధాక్రిష్ణన్ గారి పరిచయం ఆ పుస్తకం చదవాలన్న కుతూహలం కలిగించింది. కరీమ్నగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పటి తన అనుభవాలను వివరిస్తూ సుమితా దవ్రా గారు రాసిన పుస్తకం “Poor but spirited in Karimnagar: Field notes of a civil servant” గురించిన పరిచయం చిన్నదే అయినా, పక్కనే జతచేసిన కవర్ పేజీ మూలాన పుస్తకం గురించి కుతూహలం కలిగించేలా ఉంది.
****

ఇక, ఇటీవలే అరుణ్ శౌరీ పుస్తకంపై పుస్తకం.నెట్లో జరిగిన చర్చ నేపథ్యంలో – వివిధ దేశాలు, మతాల మధ్య తిరుగాడుతూ, తనని తాను ప్రశ్నించుకుంటూ సాగే ప్రధాన పాత్ర కథను చెప్పిన “Dear Prophet:A Woman’s Story అన్న అలీ అన్సారీ నవల గురించి ఈ వ్యాసంలో తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ఇదే అంశం పై, కాల్పనిక గాథగా కాక, స్వీయానుభవాలతో – వివిధ మతాల గురించి ఒక మనిషి చేసిన అన్వేషణలో తెలుసుకున్న సంగతులు వివరిస్తూ వచ్చిన పుస్తకం – “In Search Of Oneness: The Bhagavad Gita And The Quran Through Sufi Eyes” గురించిన పరిచయం కూడా ఈ సందర్భంలో ఆసక్తికరంగా తోచింది.

పుస్తకాల పరిచయాలే కాక, పుస్తక ప్రపంచంలోని ఇతరత్రా విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఐదు నుండి పదకొండేళ్ళ వయసు పిల్లల కోసం ఇటీవలే తిరువనంతపురంలో మొదలైన “లిటిల్ రీడర్స్ క్లబ్” గురించి హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం ఆసక్తికరంగా ఉంది. త్వరలో వీళ్ళు ఆ పిల్లల చేత తాము చదివిన పుస్తకాల గురించి పరిచయాలు కూడా రాయించబోతున్నారట – ఎలా సాగుతుందో చూడాలి మరి. వీరి బ్లాగులో ఇప్పుడిక్కడ మేము చేస్తున్నట్లే అంతర్జాలంలో పిల్లల చదువుల గురించి వచ్చిన వ్యాసాలను సమీకరిస్తున్నారు లాగుంది ప్రస్తుతానికి. అలాగె, కర్నాటకలో ప్రజలకి ఉచితంగా పుస్తకాలు అందించే “Pustaka Parishe” ప్రదర్శన గురించి తెలుసుకోవడం కూడా కొత్తగా, వింతగా అనిపించింది. ఈ ఏడు పదిలక్షల పుస్తకాలు సేకరించి, పంచారట!

ప్రస్తుతానికి ఇవీ విశేషాలు. మళ్ళీ త్వరలోనో, కొన్నాళ్ళకో మరిన్ని విశేషాలతో కలుద్దాం. మీకు ఆసక్తికరంగా అనిపించినా ఇక్కడ తారసపడని వ్యాసాల గురించి ఈ వ్యాసం కింద వ్యాఖ్యల్లో తెలుపగలరు.

You Might Also Like

3 Comments

  1. pavan santhosh surampudi

    ఉదయాన్నే పుస్తకం.నెట్ వాళ్లు ఈ రోజేం చేస్తున్నారో అని పలకరించడం అలవాటైపోయి అలా చూస్తూంటే ఈ శీర్షిక చూడ్డం, అందులోంచి మరెన్నో సైట్లల్లోకి కోతికొమ్మచ్చి ఆడాల్సిరావడం జరిగిపోయింది. చాలామంచి శీర్షిక ప్రారంభించారు.

Leave a Reply