వికీపీడియా ఎడిటథాన్ – ఆహ్వానం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
**********************

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలుగు వికీపీడియాలో అక్షరబద్ధం చేద్దాం రండి!

 

  • బ్రిటీష్ కాలపు భారతదేశపు వాయువ్య సరిహద్దులో ఆఫ్ఘనిస్థాన్‌కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం – వాయువ్య సరిహద్దు ప్రావిన్సు. పోరాటాలే జీవితమైన ఈ ప్రాంతం నుంచి వచ్చిన అన్నదమ్ములిద్దరు గాంధీని అనుసరించి అహింసలోనూ వీరత్వం ఉందని నమ్మారు. తమ్ముడు పూర్తి ముస్లిం మెజారిటీ ప్రాంతాలు పాకిస్థాన్‌కి అనుకూలమన్న వాదానికి ఆఖరి క్షణం వరకూ వ్యతిరేకిస్తూ, కండలు తిరిగిన తోటి ఆఫ్ఘాన్లను లాఠీదెబ్బలు తినేలా చేసి, తుదకు తమ ప్రాంతం పాకిస్తాన్‌లో కలిసిపోతే – మమ్మల్ని తోడేళ్ళకు విసిరేసి పోయారన్న గుండెలు పిండేసే మాటతో వాయువ్య సరిహద్దు ప్రాంతానికి వెళ్లి, ఆఖరివరకూ అహింసా యోధునిగానే, సిద్ధాంత నిబద్ధునిగానే ఉంటూ పాకిస్తానీ జైళ్ళలో మగ్గాడు. పాకిస్తాన్ ప్రాంతంలో జీవిస్తూ భారతరత్న అందుకున్న తొలి వ్యక్తి ఆయన. (ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్)
  • ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అన్న పేరున్న సిపాయిల తిరుగుబాటుకు ఓ అర్థశతాబ్ది ముందు. సన్యాసులు-ఫకీర్లు తిరగబడ్డారు, ప్రస్తుతం పశ్చిమబంగ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, బైకుంఠ్‌పూర్ ప్రాంతపు అడవుల్లో జరిగిందీ పోరాటం. సుశిక్షితులైన బెంగాల్ దళాన్ని కూడా సాధుసన్యాసుల దెబ్బ తట్టుకోలేకపోయారు. ఈ దాడి స్వాతంత్ర సమరం కిందికి రాదని ప్రతిపాదించే చరిత్రకారులు వారిని విభేదించేవారూ ఉన్నారు, అది ఎలా ఉన్నా ఈ పోరాటాన్ని ఆనంద్‌మఠ్ అన్న తన నవలలో బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ చిత్రీకరించగా, అందులోనే రాసిన వందేమాతరం అనే గీతం యావత్ భారతదేశాన్ని కదిలించే స్వతంత్ర నినాదం అయింది. (ఫకీర్లు, సన్యాసుల తిరుగుబాటు)
  • తమిళనాడు ఎట్టయ్యపురం గ్రామంలో జన్మించిన సుబ్రహ్మణ్య అయ్యర్ చిన్నవయసులోనే తన పాండిత్యం, ప్రతిభ, వ్యుత్పత్తులు ప్రదర్శించి సుబ్రహ్మణ్య భారతి అయ్యాడు. కాశీకి విద్య, పాండిత్యం కోసం వెళ్ళిన మనిషి వాటితోపాటుగా జాతీయవాదం, ఆధ్యాత్మికత, సాంఘిక సమానత్వాలను వృద్ధి చేసుకుని 1901 నాటికి తిరిగివచ్చాడు. సోదరి నివేదిత అతనిని సాక్షాత్తు భారతదేశంలా సాక్షాత్కరించి ప్రోద్బలం చేసింది. తమిళ కవిత్వంలో, పాత్రికేయంలో కొత్త పుంతలు తొక్కుతూ భారత జాతీయత, సర్వ మానవ సమానత్వం, స్త్రీ జనాభ్యుదయం వంటి అంశాలపై చిరకాలం నిలిచిన సాహిత్యం సృష్టించాడు.1909లో భారతి మీద ప్రభుత్వం కేసులు నడిపింది, బ్రిటీష్ ప్రభుత్వ చట్టాలు వర్తించని ఫ్రెంచి వలస ప్రాంతం – పాండిచ్చేరికి తప్పించుకున్నాడు. అక్కడ నుంచీ తన పోరాటాన్ని, ప్రయత్నాన్ని ఆపలేదు. అరబిందో, లాలా లజపతిరాయ్ లాంటి విప్లవకారులను కలిసి పరిధిని మరింత విస్తరించుకున్నాడు. తొమ్మిదేళ్ళ ప్రవాస జీవితం ముగించుకుని భారతదేశం వచ్చాకా రెండేళ్ళ జైలుశిక్ష. తుదకు అతిచిన్న వయసులో జీవితాన్ని రెండువైపులా కొవ్వొత్తిలా వెలిగించి, తానే నిత్యం అరటిపళ్ళు పెట్టే దేవుని ఏనుగుకు వెర్రెక్కి తొండంతో పట్టుకుని తిరగేసి కొట్టగా చనిపోయాడు. (సుబ్రహ్మణ్య భారతి)
  • 1912లో కలకత్తా నుంచి బ్రిటీష్ ఇండియా రాజధాని ఢిల్లీకి తరలిపోయింది. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో వైశ్రాయ్ పట్టపుటేనుగుపై కూర్చొని ఊరేగుతూంటే హఠాత్తుగా ఓ బాంబు వచ్చి వైశ్రాయి హార్డింగ్ ఒళ్ళో పడింది. హార్డింగ్ శరీరం రక్తసిక్తమై గాయాలపాలయ్యాడు కానీ త్రుటిలో తప్పించుకున్నాడు, ఆ బాంబు ప్రభావం ఎంతటిదంటే అక్కడే ఉన్న మావటి మరణించాడు. ఈ హత్యాప్రయత్నం వెనుక ఉన్నవారు – బెంగాల్-పంజాబ్ విప్లవకారులు వారికి నాయకత్వం వహిస్తున్న భారత స్వతంత్ర్యోద్యమ విప్లవయోధుడు రాస్ బీహారీ బోస్. ఆ ఘటన నుంచి విజయవంతంగా తప్పించుకుని విదేశాలకు రహస్యంగా పారిపోయిన రాస్ బీహారీ బోస్ ఆ తర్వాత మరో మూడేళ్ళకు గదర్ తిరుగుబాటుకు ప్రయత్నించాడు. పెద్ద ఎత్తున భారతీయ సైన్యం తిరుగుబాటు చేసి ఆఫీసర్లను చంపి అధికారం తీసుకోవాలని చేసిన విఫల యత్నం ఇది. ఈ ప్రయత్నం విఫలమయ్యాకా కూడా రాస్ బీహారీ బోస్ బ్రిటీష్ నిఘా వర్గాల నుంచి విజయవంతంగా తప్పించుకుని జపాన్ చేరుకున్నాడు. 1920లు, 30ల్లో జపాన్‌లో జీవించి, 1942లో సుభాష్ చంద్ర బోస్‌కు అజాద్ హింద్ ఫౌజ్ రూపకల్పనలో సహరించాడు. (1911 ఢిల్లీ కుట్రకేసు, గదర్ కుట్ర, రాస్‌ బిహారి బోస్‌)
  • పన్నులు చెల్లించకుండా చట్టవిరుద్ధంగా ఉప్పు తయారుచేయడం, అమ్మడం, కొనడం ద్వారా నిరసనోద్యమాలు నిర్మించవచ్చని గాంధీ ప్రకటించగానే ఆయన అత్యంత సన్నిహితులైన అనుచరులు కూడా అదొక సరైన వ్యూహమని నమ్మలేదు, ఇక బ్రిటీష్ అధికారులు ఏమాత్రం దీన్నొక పరిగణించదగ్గ ముప్పుగా భావించలేదు. గుప్పెడు ఉప్పు తయారుచేస్తే బ్రిటీష్ ప్రభుత్వానికి ఏమవుతుందన్న సందేహం అందరిలోనూ ఉంది. కానీ ఉప్పు సత్యాగ్రహం విజయవంతం అవుతుందని నమ్మి అనుసరించినవారిలో దక్షిణాదికి చెందిన చక్రవర్తుల రాజగోపాలాచారి ఒకడు. చారిత్రాత్మకమైన దండి సత్యాగ్రహం నెల తర్వాత భారతదేశపు దక్షిణాదిన నాటి మద్రాసు ప్రావిన్సులోని వేదారణ్యం సముద్రతీరం వైపుకు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో వేదారణ్యం సత్యాగ్రహ యాత్ర సాగించాడు రాజాజీ. దారిపొడవునా ఖద్దరు గురించి చైతన్యం పెంపొందింపజేస్తూ, యాత్ర సాగిన ప్రాంతాల వ్యాప్తంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ వేదారణ్యం చేరుకున్నారు. దారిపొడవునా యాత్రకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించిన ప్రభుత్వ యంత్రాంగం ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన రాజాజీ, ఇతర అనుచరులను 1930 ఏప్రిల్ 30న అరెస్టు చేశారు. బ్రిటీష్ పాలన వ్యతిరేకంగా దండి, ధరసణ సత్యాగ్రహాలతో పాటుగా వేదారణ్యం సత్యాగ్రహం కూడా చరిత్రలో నిలిచింది. (వేదారణ్యం సత్యాగ్రహం)
  • పన్నులు వసూలు చేసుకోవడమే తప్ప ప్రజా సంరక్షణ తమ బాధ్యత కాదన్నట్టు వ్యవహరించే ప్రభుత్వం వల్ల 19వ శతాబ్దిలో కరువు కాటకాల పాలై బాధలు పడుతున్న అనేక ప్రాంతాల్లో ఒకటి పలనాడు. విపరీతమైన పన్నులకు తోడుగా అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై పుల్లరి పన్ను వేయడం మరీ దారుణమని భావించిన ప్రజలు తిరగబడ్డారు. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి కన్నెగంటి హనుమంతు పుల్లరి సత్యాగ్రహం పేరుతో పన్నుల నిరాకరణ ఉద్యమం చేపట్టాడు. ప్రజలు అతని వెనుకే నడిచారు, చివరకు ప్రభుత్వ నిర్బంధాలు, ప్రజల హింస పుల్లరి పన్ను కట్టడానికి హనుమంతు అంగీకరించేలా చేశాయి. అయినా ప్రభుత్వ దళాలు హనుమంతుని దారుణంగా కాల్చి, కనీసం మంచినీళ్ళు కూడా దొరకుకుండా ఎండేలా చేసి చంపాయి. (కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహం)
..ఇలా ఎన్నో సంఘటనలు, వ్యక్తులు, ప్రయత్నాలు, తిరుగుబాట్లు, పరిణామాల సమాహారమే భారత స్వాతంత్ర్యోద్యమం. ఇందులో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలెన్నో ముడిపడిపోయినాయి. పరస్పరం సంఘర్షించే శక్తులెన్నో ఏకం కావడం, విడిపోవడం ఇందులో కనిపిస్తుంది. పలు సిద్ధాంతాలు, పలు లక్ష్యాలు. బహుముఖాలుగా విస్తరించిన ఈ మహోద్యమంలో ఎన్నో పార్శ్యాలకు సవివరమైన విజ్ఞానం తెలుగులో అందునా అంతర్జాలంలో అందుబాటులో లేదు. ఇక స్వేచ్ఛగా పంచుకోదగ్గ, కాపీహక్కుల చట్రంలో లేని విజ్ఞానమైతే మరీ కొద్ది. కాబట్టి ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి ఐదురోజుల ముందు మొదలై, ఐదు రోజుల తర్వాత వరకూ (10-20 August 2018) కలిసి రాద్దామన్న ప్రయత్నం. ఆసక్తి ఉన్నవారంతా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావచ్చు. మరిన్ని వివరాలకు ఈ పేజీ చూడండి లేదంటే pavansanthosh.s@gmail.comకి రాయండి.

You Might Also Like

Leave a Reply