నిర్జనవారధి – కదలించిన ఆత్మకథ

నిర్జనవారధి – మనుషుల్లేని వంతెన. ఈ పుస్తకం గురించి మొదట విన్నప్పుడూ, పుస్తకం చదివాక కూడా, ఈ పేరు గుండెను తొలిచేస్తూ ఉంది. ఈ మాటను తలచుకున్నపుడల్లా ఏదో అస్పష్టమైన విచారం కమ్ముకొస్తుంది. ఒక విషాద దృశ్యం కళ్ళ ముందు పరచుకొంటుంది.

కానీ మనుషులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. స్థిరంగా అలాగే నిలిచి ఉంటుంది తర్వాత రాబోయేవారిని అవతల దరి చేర్చటం కోసం. విషాదం వారధిది కాదు; వారధిని వాడుకోలేనివారిది.

మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకువచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కల్గేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహసప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే ఎంతో ఆశ్చర్యం.

తొంభై వసంతాలు చూసిన కోటేశ్వరమ్మ చాలా శిశిరాల్ని కూడా చూశారు. మన చరిత్రలో కొన్ని ముఖ్యఘట్టాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఈ కాలంలో చరిత్రతోపాటు ఆమె జీవితమూ అనేక మలుపులు తిరిగింది. స్వాతంత్ర్యోద్యమం, సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, మహిళా వ్యక్తిత్వ జాగరణోద్యమం, నక్సలైటు ఉద్యమాలతో ఆవిడకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయి. నాలుగు తరాల మనుషుల మధ్యే కాదు, కోటేశ్వరమ్మ గారు ఈ ఉద్యమాల మధ్య కూడా వారధే.

… మరికొందరి జ్ఞాపకాలు
ముళ్ళు ముళ్ళుగా గుచ్చుకుంటాయి
గుండెల నిండా దిగుళ్ళు నింపి
ఊపిరిని స్థంభింపచేస్తాయి
మనోఫలకంపై కత్తిగాటులా పడి
పచ్చిపచ్చిగా సలుపుతూనే ఉంటాయి
ఆశలు, ఆశయాలన్నీ ఆవిరై
అడగనివేవో అదాటున మీదపడి
శకలాలుగా విడిన జీవితం ఒక నెంటాడే జ్ఞాపకమై
గుండె భళ్ళున పగిలిన అద్దమయిపోతుంది
ఇవిగో, ఆ పెంకులనుంచి పేర్చిన జ్ఞాపకాలే ఇవన్నీ

అంటూ మొదలవుతాయి ఆమె జ్ఞాపకాలు.

కోటేశ్వరమ్మ కృష్ణా జిల్లా పామర్రులో 1920లో పుట్టారు. నాలుగైదేళ్ళ వయస్సులో మేనమామతో పెళ్ళైంది. పెళ్ళైన రెండేళ్ళలోపునే భర్త మరణించాడు.

ఏడేళ్ళ వయసులో వితంతువు. తర్వాత చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొనటం, సంప్రదాయాలకు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా పునర్వివాహం. కమ్యూనిస్టు భావజాలంతో ఉత్తేజితుడై, దీక్షగా కార్యకర్తగా పనిచేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో మమేకమై తాను కూడా పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా ఎదగటం, జైలుపాలవడం, పార్టీ నిషేధంలో ఉన్నప్పుడు, బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరీ, నాగపూర్, రాయచూర్, గోంధియాలలో భర్తకూ, పిల్లలకూ దూరంగా అజ్ఞాతంగా రహస్య జీవనం సాగిస్తూ పార్టీకి సహాయపడటం, నిషేధం తర్వాత పార్టీ కార్యకర్తగా ఊరూరూ తిరగడం.

ఇంతా చేశాక, ఏదో కారణంతో సీతారామయ్య ఆమెను విడచి, వేరే ఊరు (వరంగల్) వెళ్ళి అక్కడ వేరే ఆమెతో ఉండటం ప్రారంభించాడు. ఫిల్లలిద్దర్నీ తనదగ్గరే ఉంచుకున్నాడు. హైస్కూల్‌చదువు కూడా లేని ముప్పై ఐదేళ్ళ కోటేశ్వరమ్మకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. నిషేధకాలంలో కమ్యూనిస్టుపార్టీ అవసరాలకోసం అమ్మిన నగల విలువను పార్టీ ఆమెకు తిరిగి ఇవ్వబోతే, సీతారామయ్య ఆమెను తీసుకోనివ్వలేదు. ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్ళపై తాను నిలబడడానికి నిశ్చయించుకొని, ఆ వయసులో ఆమె హైదరాబాదు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరింది. ప్రభుత్వం వారిచ్చిన స్టైపెండ్ ఫీజులకు సరిపోతే, రేడియో నాటకాలలోనూ, కార్యక్రమాలలోనూ పాల్గొంటూ, కథలు వ్రాస్తూ సంపాదించుకున్న కొద్ది డబ్బు మాత్రం స్వంత ఖర్చులకు సరి పెట్టుకునేవారు. పరీక్షలు వ్రాసి మెట్రిక్ పాసయ్యారు. ఇంకా చదవటానికి వీలుకాక, కాకినాడ గవర్నమెంట్ పాలీటెక్నిక్ కాలేజ్ గరల్స్ హాస్టల్లో మేట్రన్ ఉద్యోగంలో చేరారు. కాకినాడలో సాహిత్య సభలలో పాల్గొంటూ రచనావ్యాసంగం చేయటం మొదలుబెట్టారు.

వరంగల్ మెడికల్ కాలేజ్‌లో చేరిన కుమార్తె కరుణ, ఆమె సహాధ్యాయి కావూరి రమేష్ బాబు వివాహం చేసుకున్నారు. కోటేశ్వరమ్మగారి సమ్మతితోనే ఈ వివాహం జరిగినా, వరంగల్‌లో జరిగిన ఆ వివాహానికి ఆమెకు ఆహ్వానం రాలేదు. ఆమె వెళ్ళలేదు.

కొండపల్లి సీతారామయ్య నక్సలైటు ఉద్యమానికి నాయకుడయ్యాడు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్న కుమారుడు చందు (కొండపల్లి చంద్రశేఖర్ ఆజాద్) విప్లవోద్యమంలో చేరాడు. గుత్తికొండ బిలంలో చారుమజుందార్‌తో సమావేశానికి హాజరైనవారిలో కె.జి.సత్యమూర్తితో పాటు చందు కూడా ఉన్నాడు. తండ్రిని వ్యక్తిగా గౌరవించకపోయినా, ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు గౌరవించాడు చందు. పార్వతీపురం కుట్రకేసులో కొంతకాలం జైల్లో ఉన్న చందు ఒకరోజున మాయమయ్యాడు. కొన్నేళ్ళ తర్వాత ఎవరో పోలీసులు వచ్చి చందు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ కబుర్లో నిజమెంతో ఆవిడకు తెలీదు. కుమారుడి శవాన్ని కూడా కోటేశ్వరమ్మ చూడలేకపోయింది. కుట్రకేసులో బెయిల్లో ఉన్నప్పుడు విజయవాడలోతమతో గడపిన ఒక్క సంవత్సరమే ఆమె “చందు నుంచి అందుకున్న సంతోష సంపద”.

కరుణ, రమేష్‌బాబు ఢిల్లీలో ఉద్యోగంతోపాటు తాము స్థాపించిన ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తెలుగువారికి సహాయం, తెలుగు సాహిత్యానికి సేవ కూడా చేస్తూ ఉండేవారు. గురజాడమీద మంచి సావెనీర్ ప్రచురించిన డాక్టర్ రమేష్ బాబు, గిడుగు రామ్మూర్తిపై ఇంకో సావెనీరుకు వివరాలు సేకరించటానికి తిరుగుతూ విజయవాడ వచ్చి వడదెబ్బతో ఆకస్మికంగా మరణించాడు. ఆ మానసిక విఘాతాన్నుంచి కోరుకోలేకపోయిన కుమార్తె డాక్టర్ కరుణ కొన్నేళ్ళ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. “పేదరికంలో ఉన్న రోగులను ఆదుకుంటూ సంఘమిత్రగా జీవిస్తుందనుకున్న కరుణ, చెడును వేలుబెట్టి చూపుతూ తర్జని కథలు రాస్తూ బ్రతుకుతుందనుకున్న కరుణ, తండ్రిలేని తన పిల్లలకు తల్లిని కూడా లేకుండా చేసి వెళ్ళిపోయింది”.

చిన్నప్పట్నుంచీ కోటేశ్వరమ్మకి బాసటగా నిలచిన తల్లి అంజమ్మ కూడా కరుణ కన్నా ముందే మరణించారు. కోటేశ్వరమ్మ ఒంటరిగా మిగిలింది.

ఈలోపు సీతారామయ్య నిర్మించిన పీపుల్స్‌వార్ పార్టీ ఆయననే బయటకు నెట్టింది. ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. బంధువెవరో వచ్చి, “సీతారామయ్యగార్కి నిన్ను చూడాలని ఉందట. తీసుకువెడతాను, వస్తావా” అని అడిగితే, “ఆయనకు చూడాలని ఉంటే.. నాకు ఆయన్ని చూడాలని ఉండొద్దా?.. లేదుగాబట్టి రాలేను” అని జవాబిచ్చింది కోటేశ్వరమ్మ.

జైలునుంచి విడుదలైన సీతారామయ్యని మనవరాళ్ళు (కరుణ కుమార్తెలు) ఇంటికి తీసుకు వచ్చారు. సీతారామయ్యని చూడడానికి ఆమె ముందు నిరాకరించినా, కాళోజీ నారాయణరావు, కాట్రగడ్డ నారాయణరావు, మహీధర రామ్మోహనరావుల ప్రోద్బలంతో ఆమె సీతారామయ్యని చూడ్డానికి వెళ్ళింది. అన్నేళ్ళ తర్వాత చూస్తున్నప్పుడు సీతారామయ్య ఆమె కళ్ళకి మామగారిలా కనబడ్డాడే కానీ సీతారామయ్యలా కనపడలా! మతిస్థిరత్వం తగ్గిన సీతారామయ్యని చూడడం బాధగా అనిపించి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో జీవించటం మొదలు బెట్టింది.

కొన్నాళ్ళకు సీతారామయ్యకూడా మరణించాడు. ఎనభయ్యేళ్ళ జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం ధారపోసిన మనిషి చనిపోతే చూడ్డానికి కూడా పార్టీ వాళ్ళెవరూ రాలేదు. “కోటేశ్వరమ్మను సీతారామయ్య తనకి అనుకూలంగా లేదని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను పార్టీ వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?”

రెండేళ్ళుగా కోటేశ్వరమ్మ విశాఖపట్నంలో మనవరాండ్ర దగ్గర ఉంటున్నారు.

సీతారామయ్యతో ఆమె విజయవాడలో ఉన్నప్పుడు ఆమె ఇల్లు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక కార్యకలాపాలకు వేదికగా ఉండేది. కుమార్తె డాక్టర్ కరుణతో కలసి ఉన్న రోజుల్లో ఆమె ఇల్లు విప్లవరచయితలకు, సానుభూతిపరులకూ కేంద్రంగా ఉండేది. మనవరాలు, ఆమె భర్త మానవ హక్కుల వేదికలో కార్యకర్తలుగా ఉండటంతో ఇప్పుడూ ఆమె ఉంటున్న చోట ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

“భూత భవిష్యత్తులకు పట్టుకొమ్మగా నిలిచి, అటు తల్లి తరానికీ, ఇటు బిడ్డల తరానికీ బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటు ఒకరు, ఇటు ఒకరు వెళ్ళిపోతే… కోటేశ్వరమ్మ నిర్జనవారధిగా మిగిలిపోయింది” అన్నారట కవిమిత్రుడు సోమసుందర్. ఎందరి బలవంతంచేతనో ఆమె వ్రాసిన ఆత్మకథకు సోమసుందర్ మాటనే శీర్షికగా ఎంచుకున్నారు కోటేశ్వరమ్మ.

ఈ కథలో ముఖ్యపాత్రలు ముగ్గురు – కోటేశ్వరమ్మ, ఆమె తల్లి అంజమ్మ, సీతారామయ్య. భర్త వద్దంటున్నా, ఊరు కాదంటున్నా, పట్టు పట్టి కూతురికి పునర్వివాహం చేయించింది అంజమ్మగారు. తాను చనిపోయేవరకూ కూతురికీ, కూతురు బిడ్డలకూ అండగా నిలబడింది ఆవిడ. అనేక సందిగ్ధసమయాల్లో అంజమ్మగారి కామన్ సెన్స్ సలహాలే కోటేశ్వరమ్మకి దశానిర్దేశాన్ని చేశాయి. కూతురి కుటుంబంతో పాటు, ఆమె పార్టీ అభివృద్ధికీ, కార్యకలాపాలకీ -ముఖ్యంగా రహస్యపు రోజుల్లో – ఆమె చాలా కృషి చేసింది. చనిపోవటానికి వారం రోజులముందు ఆవిడ వెల్లడించిన చివరి కోరిక -ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలిసి పనిచేయమని. ఉభయపార్టీలవారికి ఆమె గుర్తుగా చెరొక వేయి రూపాయలివ్వటానికి ఏర్పాట్లు చేసి మరీ చనిపోయింది ఆవిడ.

కొండపల్లి సీతారామయ్య వ్యక్తిత్వమూ, జీవిత పరిణామాలూ ఈ పుస్తకంలో ఆవిష్కృతమౌతాయి. వివాహపు తొలిరొజుల్లోనూ, పార్టీ నిర్మాణక్రమంలోనూ, నిషేధపు రోజుల్లోనూ ఆదర్శ జీవితాన్ని గడపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ధీరోదాత్త త్యాగమూర్తిలా ప్రకాశిస్తాడు (సంపన్నుడు కాకపోయినా త్యాగ సంపన్నుడు అని ఒకసారి కోటేశ్వరమ్మే అనుకొంటుంది, అతని ఆస్తిని కమ్యూనిస్టు పార్టీకి రాసిచ్చేసిన సంఘటనను గుర్తుచేసుకొని). పార్టీతో గొడవలు పెట్టుకుని, కోటేశ్వరమ్మని ఒంటరిగా వదిలేసి, ఆవిడ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు మొండివాడిగా, నిర్దయుడిగా, దుర్మార్గుడిగా కనిపిస్తాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రజలకూ, ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేస్తే, ఆ ప్రజలూ, ఉద్యమమూ మతిస్థిమితం తప్పి ఆసరా అవసరమైన రోజుల్లో అతన్ని పట్టించుకోకుండా వదిలేశారు. చివరికి మనుమరాలు చేరదీసి సేవ చేయవలసి వచ్చిన దైన్యావస్థ చూస్తే జాలి వేస్తుంది. “అతను కూడా సుఖంగా బతుకలేదు. అతడు దుర్మార్గుడు కాడు. అతని బలహీనతలు చూడకుండా అతనిలో ఉన్న ఉద్యమకారుణ్ణీ, త్యాగనిరతినీ చూసి, గౌరవించ”మనే వారి మాటను తోసివేయలేము.

కోటేశ్వరమ్మవంటి నాయికను ఏ రచయితైనా సృష్టిస్తే అబ్బురపడుతూ ఆ కథను చదువుతాం. ఎంతటి చిత్రమైన జీవితం? ఇంత జరిగినా ఆమె ఎవరిగురించీ కోపంతో, ద్వేషంతో, కసితో రాయలేదు. క్షమించే తత్వం పుష్కలంగా ఉంది ఆమెలో. సీతారామయ్య చివరిరోజుల గురించి మాట్లాడుతూ, ఆయనంటే, “అప్పటికి నాకే ఆసక్తీ లేదు. ప్రేమా లేదు, ద్వేషమూ లేదు! మొదట్లో ఇంత దుర్మార్గమా అనుండేది కానీ ఆ తరవాత, ఏమోలే, అతను మాత్రం ఏం సుఖపడ్డాడు అనుండేది” అంటారు. సీతారామయ్యని చూడడానికి, కలవడానికి ముందు నిరాకరించినా, తర్వాత జాలిపడి కలత చెందారు. అతనికి తానేమీ సేవలు చేయలేదని చెప్తూనే, తన పిల్లలకు వండి పంపినట్లే అతనికి ఇష్టమైన కూర వండి పంపేదాన్నంటారు. సీతారామయ్య మృతదేహాన్ని చూసినప్పటి ఆమె ఆలోచనలు చదివితీరాలి. అతని ముఖం ఆఖరుసారిగా చూసినప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది అతను తనకు చేసిన అన్యాయం కాదు, 1940 మేడే నాడు గొంతెత్తి ఎగరాలి ఎగరాలి మా ఎర్రజెండా అంటూ అతను పాడటం.

జీవితక్రమంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, జీవితమంతటా ఆమె తనను ఉద్యమకారిణిగా, కార్యకర్తగానే భావించుకుంది, అలానే జీవించింది. ఆర్థికంగా కష్టాలు పడుతున్న రోజుల్లో, ఆమెకు సహాయపడటానికి సిద్ధమైన ఆప్తులను సున్నితంగా తిరస్కరించడానికి ఎంతటి ఆత్మాభిమానం, మనోధైర్యం కావాలి? ఉద్యమనాయకురాలిగా, కళాకారిణిగా జేజేలు అందుకున్న మనిషి ముప్పైఏడేళ్ళ వయసులో పదో తరగతి పాఠశాలలో చేరటానికి ఎంతటి ధైర్యం కావాలి?

ఈ పుస్తకానికి అనుబంధాలుగా సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, సుంకర సత్యనారాయణ, తాపీ రాజమ్మ, మోటూరు ఉదయం వంటి తొలితరం కమ్యూనిస్టు నాయకులగురించి కోటేశ్వరమ్మ వ్రాసిన స్మారక వ్యాసాలు, వివిధ సందర్భాల్లో వ్రాసిన ఇతర వ్యాసాలు, చందు పెంచిన చెట్టు, మనది తెలుగు దేశమమ్మా కవితలు ఉన్నాయి. ఈ వ్యాసాలలో ఉన్న విషయాలు (ముఖ్యంగా ఉదయంగారి గురించిన వ్యాసం) చదువుతుంటే, కోటేశ్వరమ్మ ఈ పుస్తకంలో తన అనుభవాల్ని కొద్దిగానే చెప్పారనీ, ఆవిడకు తెలిసిన విషయాలన్నీ చెప్పి ఉంటే ఇది నిజంగానే పెద్ద గ్రంథమే అయ్యేదనీ, ఆ కాలపు చరిత్రను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవటానికి వీలయ్యేదనీ అనిపిస్తుంది. తొంభైయేళ్ళ కోటేశ్వరమ్మగారిది ఇప్పటికీ వెనుకచూపు కాదనీ, ఆమెకు వర్తమానం పట్ల అలజడి, భవిష్యత్తుపై నమ్మకం ఉన్నాయని ఆమె వ్యాసాలు చెపుతాయి. విస్తృతంగా చదివారనీ, మంచి జ్ఞాపక శక్తి ఉందనీ అర్థమౌతుంది ఆమె రచనలని చూస్తే. సాహితీ వ్యాసంగంపై ఆమె లక్ష్యం నిలపి ఉంటే ఆమెకూ, సాహిత్యానికీ లాభించేది.

సీతారామయ్య విడిపోయి వెళ్లిపోవటానికి కారణాలు, అప్పటి సంఘటనల క్రమం సరిగా అర్థం కాలేదు (సరిగా వివరించలేదు). పుస్తకంలో మరెక్కడా చూపని దాపరికం, తమ వివాహంలో మూడో వ్యక్తి ఐన ‘ఆమె’ విషయంలో చూపారు ఎందుకో. ‘ఆమె’ గురించి ఎక్కడా ఒక్కమాట కూడా విమర్శనాత్మకంగా వ్రాయకపోవడాన్ని కోటేశ్వరమ్మగారి సంస్కారానికి నిదర్శనంగా అర్థం చేసుకున్నాను.

చాలా సరళంగా, నిజాయితీగా వ్రాసిన ఈ పుస్తకం వేగంగా చదివిస్తుంది. ఈ ఆత్మకథలో ఆత్మస్తుతీ, పరనిందా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆత్మకథ 104 పేజీలు మాత్రమే. ముందు మాటలూ, అనుబంధాలూ కలిపి 200 పేజీలు. పుస్తకాన్ని శ్రద్దగా ముద్రించినట్లుగా అనిపిస్తుంది. రెండొందల పేజీల పుస్తకంలో ఒకటో రెండో మాత్రం అచ్చుతప్పులు కనిపించాయి. ముఖపత్రం ఆకర్షణీయంగా ఉంది. కోటేశ్వరమ్మతో వ్రాయించినవారికి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు.

ఈ పుస్తకాన్ని నేను ఇంకా అచ్చుప్రతిగా చూడలేదు; కినిగె వారి ఇ-పుస్తకంగా I-Padలో Bluefire Reader సాయంతో చదివాను. I-Padలో నేను పూర్తి చేసిన మొదటి కినిగె పుస్తకం ఇది. ఇంత దూరంలో ఉన్నా, ప్రచురణ ఐన వెంటనే ఆలస్యం లేకుండా చదువుకోవటానికి వీలు కలిగించినందుకు కినిగెవారికి (ముఖ్యంగా నన్ను తెలుగు ఇ-పుస్తకం బాట పట్టించడానికి చిరకాలంగా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్న చావా కిరణ్ కు) ధన్యవాదాలు. క్రెడిట్‌కార్డుతో ఎకౌంటు రీఛార్జ్ చేయటానికి కొంత సమయం పట్టినా, పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవటం సులభంగానే జరిగింది. ఏ కారణం చేతనో Bluefire Reader రెండేసి పేజీలను ఒక్క పేజీగా చూడటం వల్ల ఇంతకు ముందు చదివిన ఇ-పుస్తకాలతో పోలిస్తే, ఈ పుస్తకం స్వల్ప ఇబ్బందిని కలిగించింది. ఆ విషయం తెలియచేయగానే, కినిగె నిర్వాహకులు పుస్తకాన్ని సింగిల్ కాలమ్ పార్మాట్ లోకి మార్చటంతో ఆ ఇబ్బంది తొలగిపోయింది. కస్టమర్ సర్వీస్ కు మంచిమార్కులే వెయ్యాలి.

తప్పక చదవవలసిన పుస్తకం.

పుస్తకం వివరాలు:
నిర్జన వారధి
కొండపల్లి కోటేశ్వరమ్మ
సెప్టెంబరు 2012
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500 006
ఫోన్ – 40 2352 1849
www.hyderabadbooktrust.blogspot.com
194 పేజీలు; 100 రూ.
పుస్తకం కినిగె.కాం ద్వారా ఈబుక్ గా, మామూలు పుస్తకంగా కూడా కొనుక్కోవచ్చు. లంకె ఇదిగో.

You Might Also Like

15 Comments

  1. Devipriya taadikonda

    A very good intro to Koteswaramma GaariGaari Nirjana vaaradhi. Jampaala Prasad comes out as an impassionate commentator through out his review.According to me this is the best of the pieces written on Madam K’ s brief autography. Congratulations Choudari gaaruu ! – dp

  2. నిర్జన వారధి — కొండపల్లి కోటేశ్వరమ్మ | పుస్తకం

    […] *** ఈ పుస్తకంపై జంపాల చౌదరి గారి పరిచయం ఇక్కడ. […]

  3. 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం

    […] * కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ “నిర్జన వారధి” : చాలా స్ఫూర్తిదాయకమైన కథ. * “అభ్యుదయ […]

  4. R.V. Raju

    kondapalli seetharamaiah gari gurinchi andarikee thelusu. kaani aayana bhaarya gaariki koodaa yintha katha undani thelisi aascharya pothunnanu. aamenu gurinchi prapanchaaniki thelipina vaarandarikee naa dhanyavaadaalu.

    R.V. Raju.

  5. m RAjendra Prasad

    a reasonably good effort to give all the essence of the Authors mind. HAts off to Com Koteswaramma. It is not that easy to revolt and to stay as a revolt till end. May be some circumstances made KS to differ with her and with the party,but the sad end of a Great revolt who has built the PWG single handedly is painful.. I will certainly buy and read this book. RP

  6. వీక్షణం – 1 (కొత్త శీర్షిక ప్రారంభం) | పుస్తకం

    […] వచ్చిన వ్యాసాలను సమీకరిస్తూ – జంపాల చౌదరి గారు ఇక్కడ పుస్తకం.నెట్లో రాసిన […]

  7. sasi

    Just now completed reading the book.Manasu matalu kaduga.Oka jeevitam oka charitra oka vedana oka dhairayam.Lal salam Koteswaramma

  8. Dr.Rayadurgam Vijayalakshmi

    నిర్జనవారధి పుస్తకపరిచయం చాలబావుంది. ఎన్నో సాంఘిక ఆంక్షలున్న ఆరోజుల్లోనే స్త్రీలు ఎంతో వీరోచితంగా ఉద్యమాల్లో పాల్గోవడం చదువుతుంటే మనసు పులకరించింది. తానెన్ని కష్టాలననుభవించినా ఎవరినీ పల్లెత్తుమాట అనకపోవడం, ఆమె తల్లి, ఆమె కార్యకలాపాల పట్ల తోడుగా నిలవడం ఇవన్నీ ఆమె ఒక బలమైన స్త్రీశక్తి ప్రతీక అని చాటుతున్నాయి. ఎంతో ఆలోచింపచేసే నిర్జనవారధిని పరిచయం చేసిన జంపాలచౌదరిగారికి అభినందనలు.
    రాయదుర్గం విజయలక్ష్మి

  9. సౌమ్య

    ఈ పుస్తకంపై చరసాల ప్రసాద్ గారి బ్లాగులో వ్యాసం:
    http://www.charasala.com/blog/?p=244

  10. A.Krishna Rao

    ఒక గొప్ప పుస్తకం, కాదు జీవితం.

  11. cbrao

    92 ఏళ్ళ వయసులో ఆత్మకథ, మీ మొదటి కినిగె ఇ-పుస్తకం సమీక్ష ప్రత్యేకతలుగా ఉన్న ఈ సమీక్ష పుస్తకం లోని బాగోగులని చక్కగా చూపి, పుస్తకం చదవాలనే ఆసక్తిని కలిగించింది.
    cbrao, Mountain View, CA.

  12. Jayasree Devineni

    Reading your review made my heart heavy Chowdarygaru. I will buy the book and read about this “so sure of herself lady”.
    Felt good about her grandchildren for taking care and showering love on her at this age.

  13. g.n.m.rao

    కన్నీట దార………,.,,

  14. pavan santhosh surampudi

    ఇటువంటి ఆత్మకథల్ని చదివితట్టుకోవడం కష్టమే. అటువంటి జీవితాన్ని అనుభవించడం గురించి ఏం చెప్పాలిక??

    1. Ramanarao

      I agree with Mr.Santosh.what can we say about such life of self denial and sacrifice?

Leave a Reply