దొంగదాడి కథ -1

1955లో ఆంధ్రరాష్ట్రంలో జరిగిన మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలకు చాలా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. అప్పటి ఎన్నికల ప్రచారం గురించి మా నాన్నగారు, ఆయన తరంవారు కథలు కథలుగా చెబ్తుంటారు. కమ్యూనిస్టులు, వామపక్ష సానుభూతిపరులు అప్పటి విషయాల గురించి ఇప్పటికీ ఉద్వేగంగా మాట్లాడుతుంటారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, నార్ల వెంకటేశ్వరరావు పేర్లు చెబితే కోపంతో రగిలిపోతారు. శ్రీశ్రీ ఆత్మకథ అనంతంలోనూ, చలసాని ప్రసాదరావుగారి ఇలా మిగిలేంలోనూ ఆ ఎన్నికల ప్రస్తావన ఉంది. వాటన్నిటివల్లా నాకు అర్థం అయినదేమిటంటే ఎన్నికల ముందు కమ్యూనిస్టులపైనా, ముఖ్యంగా శ్రీశ్రీపైనా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలు తీవ్రమైన వ్యతిరేకప్రచారం చేశాయని, ఆ ఎన్నికలలో ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసిన శ్రీశ్రీ ఒక సమయంలో మానసిక అస్వస్థతకి లోనై ఆసుపత్రిలో నెలరోజులు ఉండాల్సి వచ్చిందని, ఎన్నికలలో గెలుపును ఆశిస్తున్న కమ్యూనిస్టులు అనుకోని విధంగా దెబ్బ తిన్నారని, కమ్యూనిస్టులు దెబ్బ తినటానికి, శ్రీశ్రీ మానసిక అస్వస్థతకి గురి అవటానికి ఆ రెండు పత్రికలూ ఒక కారణమని వారి విశ్వాసమని. ఆ పత్రికల్లో ఎవరు ఏం వ్రాశారు అన్నదాని గురించి అప్పుడప్పుడూ కొన్ని విషయాలు (నార్ల చిరంజీవి, ప్రత్యగాత్మల లేఖలు వగైరా) తెలిసినా, పూర్తి అవగాహన మాత్రం నాకు కొద్దికాలం క్రితం వరకూ కలుగలేదు.

విజయవాడ సాహితీ మిత్రులు (అంటే ముఖ్యంగా శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారు, వారి మిత్రులు) పూనుకొని, అప్పటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర పత్రికలనుంచి చాలా వ్యాసాలు, ఉత్తరాలు సేకరించి “దొంగదాడి కథ – 1955 ఎన్నికలు, చారిత్రక వాస్తవాలు” అనే పుస్తకంగా 2006లో ప్రచురించారు. అట్టమీద దొంగదాడి కథ అనే ఉన్నా, లోపలి పేజీలలో శ్రీశ్రీపై దొంగదాడి అని ఉంటుంది. ఈ పుస్తకం చదివాక, అప్పటి చారిత్రక విషయాలపట్ల నాకు కొంత అవగాహన కలిగింది.

ఈ పుస్తకంలో ఐదు భాగాలున్నాయి: చారిత్రక నేపధ్యాన్ని వివరించే ముందు మాటలు (విశ్వేశ్వరరావు, సహవాసి, కె.ఎన్.వై. పతంజలి, మోహన్, చలసాని ప్రసాద్); ఆంధ్రపత్రికలో వ్యాసాలు, లేఖలు; ఆంధ్రప్రభలో “రచయితలు, కళాకారుల ప్రబోధం”, దాని అనంతర ప్రకటనలు, లేఖలు; విశాలాంధ్రలో వ్యాసాలు, లేఖలు, (బహుశా) సంపాదకీయాలు; ఈ విషయాలకు సంబంధించి వివిధ సందర్భాలలో శ్రీశ్రీ వ్రాతలు. ఆరోజుల్లో ఆంధ్రపత్రిక ముఖ్య సంపాదకులు శివలెంక శంభుప్రసాద్. ఆంధ్రప్రభ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు. కమ్యూనిస్టుపార్టీ పత్రిక విశాలాంధ్రకు అప్పుడు సంపాదకుడెవరో నాకు తెలీదు.

ఈ పుస్తకంలో విషయాలు అర్థం కావాలంటే ఈ ఎన్నికల చారిత్రక నేపధ్యం తెలుసుకోవాలి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యాక కూడా కొంత కాలం పాటు భారత కమ్యూనిస్టుపార్టీ తెలంగాణాలో సాయుధపోరాటం కొనసాగించింది. ఆ కాలంలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీపైన, పార్టీ సాంస్కృతిక శాఖలపైన ప్రభుత్వం, నిషేధం, నిర్బంధం, నిఘాలతో దమనకాండ సాగించింది. (కృష్ణా జిల్లాలో మలబారు పోలీసుల ఆగడాలను గురించి పెద్దవాళ్ళు కథలు కథలుగా చెపుతుండగా విన్నాను). కాటూరు, యలమర్రు గ్రామాల్లో పాశవికంగా ప్రవర్తించారు. చాలామంది కమ్యూనిస్టు కార్యకర్తలు చంపివేయబడ్డారు. కమ్యూనిస్టులు సాయుధపోరాటం విరమించాక, పార్టీపై నిషేధం తొలగించారు. 1952 ఎన్నికలలో కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన ప్రకాశంగారికి కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. చాలా స్థానాలు గెలుచుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది. ప్రకాశం పంతులు కాంగ్రెసులో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఏడాది తర్వాత అవిశ్వాసతీర్మానం వల్ల ఆయన పభుత్వం పడిపోయింది. 1955 ఫిబ్రవరిలో ఐదు విడతల పోలింగ్‌తో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1954 డిశంబరులోనే ఎన్నికల హడావుడి మొదలయ్యి వాతావరణం బాగా వేడెక్కింది.

కమ్యూనిస్టు పార్టీ స్వతంత్రంగా ఎన్నికలలో పోటీ చేయటానికి సంకల్పించింది. 1952లో వచ్చినదానికన్నా ఎక్కువ సీట్లు గెల్చుకోగలమని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని కమ్యూనిస్టులు భావించారు. ఉధృతంగా ప్రచారం మొదలుబెట్టారు. ప్రజా నాట్యమండలి కళాకారులు, సాంస్కృతిక బృందాలు, కొందరు సినీ ప్రముఖులు (నటి జి.వరలక్ష్మి వగైరా) బాహాటంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చాలా మంది అభ్యుదయ రచయితలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికే అభ్యుదయ రచయితల సంఘం కమ్యూనిస్టు రచయితల సంఘంగా పేరు తెచ్చుకొంది. శ్రీశ్రీ స్వయంగా “నెల్లూరు జిల్లా గూడూరునుంచీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు వరకూ కమ్యూనిస్టు పార్టీ బహిరంగసభల్లో పాల్గొని, ఆ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యమని ఒక వాలంటీరులాగా పనిచేశాడు”.

కమ్యూనిస్టులను ఓడించటానికి రాష్ట్రంలో ఉన్న భూస్వామ్య శక్తులు అన్నీ ఏకమయ్యాయి. అప్పటివరకూ జస్టిస్‌పార్టీలో ఉన్న చల్లపల్లి రాజా కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక అయ్యాడు. ఇంతకు ముందు కాంగ్రెస్‌నుండి చీలిపోయిన పక్షాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ జండా కిందకు వచ్చాయి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలు వారికి సాయం చేశాయి. నార్ల వెంకటేశ్వరరావు కమ్యూనిస్టులను విమర్శిస్తూ వరుసగా సంపాదకీయాలు వ్రాశాడు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అంటూ కార్టూన్లు ఆంధ్రప్రభలో రోజూ ప్రచురించేవారు.

ఎన్నికలకు కొన్నిరోజులముందు ఒక సాంస్కృతికబృందంలో భాగంగా శ్రీశ్రీ శాంతి సభకు మాస్కో వెళ్ళి రష్యా పర్యటించి తిరిగివచ్చాడు. తర్వాత ఎవరితోనో మాస్కో విశ్వవిద్యాలయ భవనం గురించి మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన శిశువును ఆ భవనంలో ప్రతిరోజూ ఒక క్రొత్తగదిలో నిద్ర చేయిస్తే, అన్ని గదుల్లోనూ నిద్ర చేయించడానికి నూరేండ్లు పడుతుంది అన్నాట్ట.

అదీ నేపథ్యం.
*****

మొదట ఆంధ్రపత్రిక సంగతులు చూద్దాం. 1955 జనవరి 4న, “ఒక రచయిత” వ్రాసిన “ఆంధ్ర రచయితల గురుతర బాధ్యత” అనే వ్యాసం ఆంధ్రపత్రికలో ప్రచురించబడింది (ఈ ఒక రచయిత ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్న పండితారాధ్యుల నాగేశ్వరరావు అని ఈ పుస్తకంలో చెప్పారు. ఆయన తర్వాత ఆంధ్రప్రభకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారని గుర్తు). ఈ పుస్తకంలో చిన్న అచ్చుసైజులో నాలుగు పేజీలున్న ఈ వ్యాసంలో ప్రధానంగా మూడు విషయాలు ఉన్నాయి: 1) కమ్యూనిజం వల్ల రష్యాకు ఒరిగిందేమీ లేదు. 2) శ్రీశ్రీ (ఆయన పేరు చెప్పకుండానే) మాస్కో విశ్వవిద్యాలయం గురించిన మాటలు చెప్పి అవి అబద్ధాలని ధ్వనిస్తూ ఎగతాళి చేయటం. 3) ఆంధ్ర రచయితలు (కమ్యూనిజానికి వ్యతిరేకంగా వ్రాస్తున్న స్పెండర్, కోస్లర్ వంటివారివలె) విషయాలను తెలుసుకొని “ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజలను అభ్యుదయ – వాస్తవమైన, స్థిరంగా ఉండగల అభ్యుదయ పంధాన నడిపించాలి”.

ఆ వ్యాసానికి సమాధానంగా శ్రీశ్రీ ఒక ఉత్తరం వ్రాశాడు. ఉత్తరం తేదీ జనవరి 4 అనే ఉంది. అది ఉత్తరం వ్రాసిన తేదీనో, ప్రచురించబడ్ద తేదీనో స్పష్టంగా తెలీలేదు (7వ తేదీన ప్రచురించారని నా అనుమానం). మాస్కో విశ్వవిద్యాలయం ఫొటో జతపరుస్తూ వ్రాసిన ఆ చిన్న ఉత్తరంలో, భారతదేశ పరిస్థితుల మీద, ఆంధ్రపత్రిక మీద, పత్రికల మీద విసుర్లున్నాయి. “ఈ ఉత్తరం మీరు ఎడిట్ చేయకుండా ప్రకటించి వ్యక్తి స్వాతంత్ర్యం మీద నిజంగా మీకు నమ్మకముందని ఋజువు చేసుకోండి” అని సవాలు చేస్తూ ఈ 25 పంక్తుల (ఒక పేజీ) ఉత్తరాన్ని ముగించాడు శ్రీశ్రీ.

దానికి సమాధానంగా “ఒక రచయిత” (జనవరి 6న) ఈ సారి ఇంకా పెద్ద వ్యాసం వ్రాశాడు. శ్రీరంగం శ్రీనివాసరావుగారికి (ఈ వ్యాసంలో ఎక్కడా శ్రీశ్రీ అన్న పేరు కనబడదు; అప్పుడప్పుడూ శ్రీనివాసరావుగారు అని ఉంటుంది), ఆయన శిష్యబృందానికీ “మృదువుగా, మర్యాదగా చెప్తే” బోధపడదు కాబట్టి “వారి లేఖ స్థాయిలోనే, వారి భాషలోనే” దీర్ఘంగా ఇంకో వ్యాసం వ్రాశాడు. ఈ పుస్తకంలో ఐదు పేజీలున్న ఈ వ్యాసంలో మరో ప్రపంచానికి పేరడీలాంటి కవిత కూడా ఒకటి ఉంది. ఈ ఉత్తరంలో శ్రీనివాసరావు గారి తెలియనితనాన్ని గురించీ, తనకు తెలిసినతనాన్నిగురించీ చాలా ఉంది. శ్రీనివాసరావుగారు ఏంచేస్తే బాగుంటుందో అన్న సలహాలు కూడా చాలా ఉన్నాయి.

ఈ మూడిటి తర్వాత జనవరి11న “ఒకానొక రచయిత” పేర ఇంకో వ్యాసం ప్రచురించారు (ఈ ఒకానొక రచయిత నండూరి రామ్మోహనరావు; ఆయన కూడా ఆంధ్రపత్రికలోనే, కాకపోతే వారపత్రికలో, పని చేస్తుండేవారు). ఒక రచయిత వాదనలో తనకు కనిపించిన లోపాల్ని, అసంగతాల్ని ఒకానొక రచయిత ఎత్తి చూపారు.

బహుశా అదేరోజున (స్పష్టంగా తెలియలేదు), శ్రీశ్రీ “ఒక రచయిత” రెండవ వ్యాసానికి వ్రాసిన సమాధానం ప్రచురించబడింది. రెండుపేజీలకు తక్కువగా ఉన్న ఈ లేఖలో శ్రీశ్రీ తన మొదటి లేఖను ప్రచురించినందుకూ, ఈ దుమారం లేవగొట్టి సత్యాన్వేషణ చేస్తున్నందుకూ ఆంధ్రపత్రికను అభినందించాడు. మొదటి ఉత్తరంలో నెహ్రూ చిట్కాలు అని అనడం తప్ప తాను ఎవర్నీ వ్యక్తిగతంగా నిందించలేదని గుర్తుచేశాడు. నెహ్రూ అంటే తనకి ఉన్న సదభిప్రాయాన్ని చెప్పాడు. “అబద్ధాల గద్యరచయిత” “అజ్ఙానాన్ని” ఎత్తి చూపాడు. కమ్యూనిస్టులను ఆంధ్ర ప్రజలు గెలిపిస్తారన్నవిశ్వాసాన్ని ప్రకటించాడు. చిన్నతనంలో తిరుపతిలో వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూస్తే తనకు కలిగిన చిత్తశాంతి మాస్కోలో లెనిన్, స్టాలిన్‌ల మాసోలియం చూసినప్పుడు మళ్ళీ కలిగింది అని చెప్పాడు. భగవంతుడి దిక్కుగా మానవుడు చేస్తున్న మహాప్రయాణంలో రష్యా అగ్రేసరంగా నడుస్తుండటం తనకు కనబడిందనీ, ఆ సత్యాన్ని ఎలుగెత్తి చూపడానికే తన రచనాశక్తిని వినియోగించటం రచయితగా తన బాధ్యత అని ఉత్తరాన్ని ముగించాడు శ్రీశ్రీ.

శ్రీశ్రీ మొదటి ఉత్తరం ప్రచురించిన రోజే ఆంధ్రపత్రిక వారు ఈ విషయంపై పాఠకుల అభిప్రాయాల్ని ఆహ్వానించినట్లున్నారు (ఈ పుస్తకంలో ఆ ప్రకటన లేదు). వ్యక్తిదూషణ లేని అభిప్రాయాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లున్నారు. అప్పటినుంచి మార్చి 1 వరకూ (ఈ పుస్తకంలో చిన్న అచ్చులో 132 పేజీలు) పాఠకుల ఉత్తరాలను ప్రచురించారు. చివరికి వచ్చేసరికి ఉత్తరాలు పూర్తిగా ప్రచురించకుండా కొన్ని లేఖల “సారాంశా”న్ని ప్రకటించారు. ఇవికాక, వీరు కూడా తమ అభిప్రాయాలు పంపించారు అంటూ ఇంకో రెండు పేజీల పేర్లు ప్రకటించారు. ఉత్తరాలు వ్రాసినవారిలో మొక్కపాటి నరసింహశాస్త్రి, పిలకా గణపతిశాస్త్రి వంటి పెద్దవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం కలిగించిన ఇంకో పేరు – కె. రోశయ్య, గుంటూరు.

వీటన్నిటి మధ్య, “ఒక రచయిత” ఇంకో మూడు వ్యాసాలు వ్రాసినట్లుంది. ఫిబ్రవరి 3న దారి తెలియని బాటసారులు అంటూ ఒకటి. ఇంకొకటి, ఫిబ్రవరి 7న రచయితలకు రాజకీయాలకు మధ్య దూరం ఎంత అనే పెద్ద వ్యాసం. “ఒక రచయిత” ఫిబ్రవరి 16న “రష్యాలో రచయితలు: ఆంధ్ర రాష్ట్రములో జరుగవలసిన పని” అనే వ్యాసం వాసినట్లు వేరేవారి లేఖలో ఉంది కానీ, ఈ పుస్తకంలో ఆ వ్యాసం లేదు. ఫిబ్రవరి 23 న, రచయిత పేరు లేకుండా ప్రచురించబడ్డ “సంస్కృతీ సుహృద్భావ సంఘాల ముసుగులో” అన్న వ్యాసం కూడా, శైలినిబట్టి, “ఒక రచయిత” వ్రాసినట్లే ఉంది. శ్రీశ్రీ, ఒకానొక రచయిత (నం.రా) మళ్ళీ ఈ చర్చలో పాల్గొనలేదు.

రెండు తప్ప ప్రచురింపబడ్డ ఉత్తరాలన్నీ శ్రీశ్రీని, అభ్యుదయ రచయితల్ని, కమ్యూనిస్టుల్ని, రష్యాను విడివిడిగానో కలివిడిగానో రకరకాల పద్ధతుల్లో విమర్శిస్తూ, తిడుతూ వ్రాసినవే. ఒక్క వేగుంట కనకరామబ్రహ్మం (వట్లూరు; సాహిత్యంలో అప్పుడప్పుడూ ఈయన ప్రస్తావన వస్తుంది. మో కొన్నిసార్లు ఆయనకు తన పుస్తకాల్లో కృతజ్ఙత తెలిపినట్లు, ఒక పుస్తకం అంకితం ఇచ్చినట్లు గుర్తు) వ్రాసిన ఉత్తరంలో మాత్రం ఈ విమర్శలన్నీ సరైన పద్ధతిలో జరగడం లేదనీ, శ్రీశ్రీ రాజకీయాలు ఆమోదయోగ్యం కానివారు అతని కవితాశక్తిని విమర్శించటం సమంజసం కాదని వ్రాశారు.

(ఆంధ్రప్రభ, విశాలాంధ్రల గురించి తర్వాత భాగంలో)

* * *

దొంగదాడి కథ – 1955 ఎన్నికలు, చారిత్రక వాస్తవాలు
జూన్ 2006
ప్రచురణ: విశ్వేశ్వరరావు, సాహితీ మిత్రులు
విజయవాడ
ఫోన్: 9392971359
ప్రతులకు: నవోదయ, విజయవాడ; ఇతర పుస్తకవిక్రేతలు
254 పుటలు; 100రూ.
కినిగె.కాం కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

9 Comments

  1. దొంగదాడి కథ -3 | పుస్తకం

    […] భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ) ****** ఈ పుస్తకం ఆఖరు […]

  2. Jampala Chowdary

    1955లో విశాలాంధ్ర దినపత్రికకు కాట్రగడ్డ రాజగోపాలరావు సంపాదకులు అని ఒక మిత్రుడు తెలిపారు. కాని, 1955నాటికి ఇంకా మద్దుకూరి చంద్రశేఖరరావు (చంద్రం) గారే సంపాదకులుగా ఉన్నారేమోనని నా అనుమానం.

    1. తిపిర్నేని

      కాట్రగడ్డ రాజగోపాలరావు గారు కా దు అప్పటికి, ఆయనకు మా వూరు పసుమర్రుకు అవినాబావ సంబంధం వుంది, ఆయన భార్య(కాజ హనుమాయమ్మ) మావూరు ఆడపడుచు.తెలంగాణ రజకార్ల వుద్యయంలో మావూర్లోనే అఙా్తాంలో వున్నారు

  3. ముత్తేవి రవీంద్రనాథ్

    ఆధునికాంధ్ర చరిత్రపై పెద్దగా చెప్పుకోదగ్గ రచనలేవీ వెలువడని నేపథ్యంలో విజయవాడకు చెందిన శ్రీ శ్రీ విశ్వేశ్వర రావు, తదితర సాహితీ మిత్రులు నాటి వార్తా పత్రికల క్లిప్పింగ్స్ ఆధారంగా, ఈ చక్కటి పుస్తకాన్ని ప్రచురించడం నిజంగా ప్రశంసనీయం.నిజానికి యూనివర్సిటీల స్థాయిలో చరిత్ర పరిశోధకుల బృందాలు ఒక పరిశోధనాంశంగా చేపట్టి కృషి చెయ్యాల్సినంత విస్తృత పరిధి గల అంశమిది.డా.జంపాల గారి సమీక్ష ఈ పుస్తకాన్ని లోగడ చదవని నాబోటి చదువరులకు కూడా దాన్ని చదివితీరాలనే కుతూహలాన్ని రేపేదిగా ఉంది. పెద్దలద్వారా నేను విన్నదేమంటే — 1955 ఎన్నికల నాటి ఘటనాక్రమాన్ని ప్రభావితం చేసిన ప్రధాన అంశాలు రెండు.
    ఒకటి- 1952 ఎన్నికలలో కమ్యూనిస్టులు సాధించిన ఊహించని విజయాలను చూసి ఖంగుతిన్న కమ్యూనిస్టు వ్యతిరేకులంతా తమ తమ పార్టీ విభేదాలను మరచి ,
    1955 ఎన్నికలలో కమ్యూనిస్టులను ఎలాగైనా ఓడించి తీరాలనే పట్టుదలతో ఒక్కతాటి పైకి
    వచ్చారు.కాంగ్రెస్, జస్టిస్ పార్టీలు కమ్యూనిస్టులకు ప్రతిగా ఒక్కటయితే, కమ్యూనిజం పొడ
    గిట్టని మతవాదులు, కార్మికవర్గ నియంతృత్వం అన్న కమ్యూనిస్టుల మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించే బూర్జువా ప్రజాస్వామికవాదులు, స్వేచ్చావాదులు వగైరాలు వారికి ప్రత్యక్ష, పరోక్ష మద్దతునిచ్చారు.వీరంతా వివిధ వర్గాల ప్రజలలో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వక్రీకరించి, విష ప్రచారం చేసి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించారు.
    రెండు- 1955 ఎన్నికల ప్రచార సభలలో ఒకదానిలో నాటి సుప్రసిద్ధ కమ్యూనిస్టు నేత
    మాకినేని బసవపున్నయ్య మాట్లాడుతూ ‘ భూస్వాముల భార్యలు మెడలలో బరువైన బంగారు నగలు ధరించడం కారణంగా వారికి మెడలపై అర్రు ఏర్పడుతుంది. ఎన్నికలలో
    కమ్యూనిస్టులు గెలవడం ఖాయం.ఆ తర్వాత ఏర్పడే ప్రజా ప్రభుత్వం భూ సంస్కరణలు
    పక్కాగా అమలు జరుపుతుంది. భూమి దున్నేవాడికే దక్కుతుంది.ఈనాడు మోయలేని బంగారునగల భారంతో మెడలపై అర్రు పట్టివున్న భూస్వాముల భార్యల మెడలమీద కాడి
    వేసి, వారిచేత పొలాలన్నీ దున్నిస్తాం. కమ్యూనిస్టు రాజ్యంలో కష్టపడేవాళ్ళకే తిండి,’ అంటూ ఉద్వేగభరితంగా ఆయన చేసిన ప్రసంగం భూస్వాముల మనోభావాలను రెచ్చగొట్టి, వారంతా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చావో, రేవో అన్న రీతిలో తిరగబడేటట్లు చేసింది.(ఆయన ఇలా మాట్లాడడంతో స్త్రీల మనోభావాలను రెచ్చగొట్టే బంగారు అవకాశాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులకు కల్పించినట్లయిందనీ, ఆయన తన ఉపన్యాసంలో మరికొంత సంయమనం పాటించివుంటే ఎన్నికల్లో విజయం కమ్యూనిష్టులకే దక్కేదనీ పార్టీ కమిటీలలో జరిగిన సమీక్షలలో అభిప్రాయపడ్డారట.)
    పుస్తకాన్ని చక్కగా సమీక్షించిన డా.జంపాల గారికి ధన్యవాదాలు.
    –ముత్తేవి రవీంద్రనాథ్,తెనాలి.

  4. gksraja

    ఎప్పటిలాగే జంపాల గారు చాలా మందికి ఎరుకలో లేని పుస్తకం గురించి ప్రస్తావించి, చక్కటి విశ్లేషణ ఇస్తున్నారు. ధన్యవాదాలు. నాకు నాలుగేళ్ల క్రితం ఈ పుస్తకం అనుకోకుండా పుస్తక ప్రదర్శనలో దొరికింది. అప్పటి (1955) రాజకీయ, సామాజిక ఆంధ్రరాష్ట్రం కొంతవరకూ కనబడుతుంది. అప్పటి పత్రికల నిర్వహణ, భాష వగైరాలు ఈ తరానికి పరిచయం అవ్వడంతో బాటు, ఒక కుట్రగా జరిగిన దాడికి పత్రికా రంగం ఎలా ఉపయోగపడుతుందో అర్ధం అవుతుంది. ఇప్పటి పరిస్థితి కూడా అంతే, కాకపొతే మరీ బొత్తిగా సొంత డబ్బాలుగా, వారి వారి పార్టీల బ్రోచర్లు గా తయారయ్యాయి. జంపాలగారు ప్రస్తావించిన ‘కె.రోశయ్య’ గారి ఉత్తరం నన్ను కూడ ఆకర్షించింది. నేను చదివేసిన తరువాత, ఆయనకు స్వయంగా తీసుకెళ్ళి చూపించాను. ‘ఇలా పుస్తకంగా ముద్రణ అయ్యిందా’ అంటూ ఆయన లేఖను ఒకసారి చదువుకొని, గతాన్ని నెమరు వేసుకొన్నారు. మీ సమీక్ష రెండో భాగం కూడా చదివాక, మళ్ళి ఇంకోసారి ఈ పుస్తకం చదవాలి.
    రాజా. gksraja.blogspot.com

  5. drsjatinkumar

    even though i am in telugu land i did not read this book. i gathered some information from some other books and was interesed to know more about this episode . thanks jampala garu to write about this part of history which is interesting not only to communists but also to literary people

  6. Sreenivas Paruchuri

    This is a book or to be more precise a big academic project that should have been carried at one of the universities in A.P. But, as usual, it did not happen, as there is no one who wants to dig deep into dusty archives, nor is there a faculty doing serious work on modern history of Andhra Pradesh. (Ironically even the Communists, neither the Right nor the Left, never even considered it as worth pursuing project. How sad!) So, no surprize, one individual, in form of Visweswararao gaaru, with all his limitations i.r.t time, resources, scholarship and tools, had to take up this mammoth task single-handedly. Personally speaking I have some pre-knowledge of this publication as Visweswararao gaaru showed me his file a couple of times with all the paper clippings years before it went into print. I myself was/am excited about this project, as very little, serious stuff has been written on A.P. politics of 1950s, but I am geographically located far away from the source materials. Off-hand I can only think of materials in English, for e.g. Selig Harrison’s papers from 1955-56, but not in Telugu. While the memoirs of prominent CP-leaders including Sundarayya and Makineni Basavapunnayya recorded as part of the Oral History Programme at Nehru Memorial Museum & Library (NMML) provide some valuable insights into Telangana struggle and Andhra state formation they do not go into our subject.

    Today, thanks to significant amount of digitized data (e.g. APPA website) a better kind of work can be done. Hope someone takes the lead provided by Visweswararao gaaru and at least compiles more data or even better provides an analysis.

    I have seen only one review on this book in Telugu media, when it was published. It was late Prof. Kovela’s in Andhrabhoomi, which was not so ‘positive’.

    Regards,
    Sreenivas

    P.S. Sundarayya’s major book, on Telangana people’s struggle does not go deep into the elections details.
    P.P.S. A scholar-firend has been recently looking into fascinating materials in US archives as US embassy/consulates sent extensive reports on A.P politics and communists of 1950s.

  7. సౌమ్య

    Looking forward for the next part(s)!

Leave a Reply