దొంగదాడి కథ -2

(మొదటి భాగం ఇక్కడ)

1955 ఫిబ్రవరి 8న, అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగు ఇంకా కొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న సమయంలో, ఆంధ్రప్రభ దినపత్రిక, “ప్రజాస్వామ్య చైతన్య శక్తులతో సహకారానికై తెలుగు ప్రజానీకానికి రచయితల, కళాకారుల ప్రబోధం, నియంతృత్వ వ్యవస్థ భారతీయాత్మకు విరుద్ధమైనదని ఉద్ఘాటన, పార్లమెంటరీ పద్ధతిద్వారా శ్రేయోరాజ్య స్థాపనకు కృషి చేయాలని ఉద్బోధ” అన్న శీర్షికలతో ఒక వార్త ప్రచురించింది (ఇదే వార్త ఆంధ్రపత్రికలో కూడా ప్రచురితమైనట్లే ఉంది కాని, ఈ పుస్తకంలో ఆంధ్రప్రభ వార్త మాత్రమే ఇచ్చారు). “150 మందికి పైగా తెలుగు రచయితలు, కళాకారులు” మద్రాసులో ఫిబ్రవరి 7న చేసిన ప్రకటన ఇది:

“ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో, మన సంప్రదాయములను, సంస్కృతిని, వ్యక్తి స్వాతంత్ర్యమును సంరక్షించుకొనుచు నూతన సమాజ నిర్మాణము సాగించవలెను కనుక, ఈ తరుణములో ఆంధ్ర రచయితలు, కళాకారులు కూడ ప్రజలకు తమ మనస్సులను వ్యక్తపరచవలెను గాని, ఊరక ఉండుట భావ్యము కాదని, తెలుగు రచయితలము, కళాకారులమైన మేము మా లక్ష్యాన్ని వివరిస్తూ ఈ క్రింది ప్రకటన చేస్తున్నాము :-
తెలుగు రచయితలము, కళాకారులము అయిన మేము, శ్రేయోరాజ్య లక్ష్యము పట్ల మా అచంచల విశ్వాసమును ప్రకటించుచున్నాము.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారానే శ్రేయోరాజ్యమును స్థాపించి సంరక్షించుకోగలమని మేము విశ్వసించుచున్నాము.
నియంతృత్వము పట్ల – అది వామపక్ష నియంతృత్వమైన గాని, లేక తద్వ్యతిరేకుల నియంతృత్వమైన గాని – మా ప్రబల వైముఖ్యమును చాటుచున్నాము.
భారతీయ సంప్రదాయములకు, సంస్కృతికి, భారతీయాత్మకు విరుద్ధమైన సాంఘిక వ్యవస్థను మేము పూర్తిగా వ్యతిరేకించుచున్నాము.
భావ స్వాతంత్ర్యము మానవునికి సహజ జన్మహక్కని, ప్రభుత్వమును విమర్శించు హక్కు భావ స్వాతంత్ర్యములోనే అంతర్భూతమై ఉన్నదని మేము భావించుచున్నాము.
విభిన్న సిద్ధాంతములయెడ గౌరవ సహన భావములపై ఈ స్వాతంత్ర్యపు మనుగడ ఆధారపడియున్నది.
అభ్యుదయ సాధన కేవలము తన లక్ష్యమేనని ఏ సిద్ధాంతముగాని అహంకరించుట భారతీయతత్వమునకే విరుద్ధమని మా విశ్వాసము.
వ్యక్తిని “ఒక వర్గముగాని, ఒక పక్షముగాని, వ్యాపార సంస్థగాని, ప్రచార వ్యవస్థగాని అణచివేయని సంఘములోనే సారస్వతము, కళలు వర్ధిల్లగలవు. మానవాత్మ స్వాతంత్ర్యము క్లిష్టము, సునిశితము; దానికి సంరక్షణ లేనిచో ఉత్తమ కళావిర్భావము దుస్సాధ్యము.”
భారత పౌరులందరకు –
సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయము, వాగ్భావ మత స్వాతంత్ర్యము, అవకాశ ప్రతిపత్తులలో సమానత్వము చేకూర్చుటకు, మానవ ఔన్నత్యము జాతీయ ఐకమత్యము ధ్యేయములుగా సౌభ్రాత్రము పెంపొందించుటకు కృషిచేయు ప్రజాస్వామ్య చైతన్య శక్తులతో సహకరించి వాటిని పటిష్టము చేయుట ప్రతి భారతీయ పౌరునికి జాతీయ ధర్మమని విశ్వసించుచు ఈ ప్రకటన చేయుచున్నాము.”

నూటొక్కమంది కవులు, పండితులు, 14 మంది నటులు, దర్శకులు, 11మంది సంగీతవిద్వాంసులు, ముగ్గురు నర్తకులు, 12మంది చిత్రకారులు, 29 మంది పత్రికా రచయితలు (ఇలా ప్రకటనలోనే వర్గీకరణ ఉంది) సంతకం చేశారు. మొదటిపేరు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిది. విశ్వనాధ, కృష్ణశాస్త్రి, జాషువాలతో సహా లబ్ధప్రతిష్టులైన రచయితలు, ద్వారం వేంకటస్వామి, బాలమురళీకృష్ణ, నటరాజ రామకృష్ణ, బి.ఎన్.రెడ్డి. కె.వి.రెడ్డి, చక్రపాణి, నాగిరెడ్డి, ఎ.నాగేశ్వర్రావు, అ.పైడిరాజు, వరదా వెంకటరత్నం వంటి కళాకారులు సంతకాలు చేసినవారిలో ఉన్నారు. పత్రికా రచయితల్లో నార్ల వేంకటేశ్వరరావు, శివలెంక శంభుప్రసాద్‌లతో పాటు “ఒక రచయిత” పండితారాధ్యుల నాగేశ్వరరావు ఉన్నారు (ఒకానొక రచయిత – నండూరి రామ్మోహనరావు లేరు; మొక్కపాటి నరసింహశాస్త్రి పేరు కూడా లేదు). ఆరుద్ర, దాశరధి, సినారె, బైరాగిల పేర్లు కూడా ఉన్నాయి.

ఈ ప్రకటన చివర “…తోడ్పడిన మిత్రులందరికీ, ముఖ్యంగా పాలగుమ్మి పద్మరాజుగారికీ, శ్రీరంగం నారాయణబాబుగారికి” ప్రకటనకర్తలు కృతజ్ఙతలు తెలియచేసి, తమతో ఏకీభవిస్తున్న రచయితలు, కళాకారులు తమ సమ్మతి తెలియచేయటానికి ఒక చిరునామా (సిమ్లా హౌస్, హబీబుల్లా రోడ్, టి.నగర్, మద్రాసు) ఇచ్చారు.

ఫిబ్రవరి 10వ తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ ప్రకటనతో ఏకీభవిస్తున్న ఇంకో 72 మంది పేర్లు, అబ్బూరి రామకృష్ణారావుతో మొదలుబెట్టి ప్రచురించారు. తర్వాత ఆరు రోజుల్లో ఇంకో నాలుగు జాబితాలు ప్రచురించారు. మొత్తానికి 576మంది రచయితలు, కళాకారులు, 113 మంది కావలి కళాశాల విద్యార్థులు ఈ ప్రకటనపై సంతకం చేశారట.

ఫిబ్రవరి 10వ తేదీ పత్రికలోనే రెండు లేఖలు ప్రచురించారు.

మొదటి ఉత్తరం ఆరుద్రది. అయిదు పంక్తులు. “…ఆ లక్ష్య ప్రకటనపై సంతకం పెట్టినవారి జాబితాలో నా పేరు కూడా ఉంది. గాని నేను సంతకం పెట్టలేదు. నా అభిప్రాయం కోసం ఒక ప్రతిని నా చేతికివ్వగా, దానిలోని విషయాలను రచయితల సమావేశంలో చర్చించాలని వాచ్యంగా సూచించాను. గమనించ ప్రార్థన”.

రెండవ ఉత్తరం పాలగుమ్మి పద్మరాజు, శ్రీరంగం నారాయణబాబులది: “…ఆరుద్రగారు ఈ సందర్భంలో చెప్పిన మాటలు వారి అంగీకారాన్ని సూచించినట్లు మాకు అర్థమై వుండొచ్చు. వారు తమ అభ్యంతరాన్ని తెలియపర్చామని అనుకొని ఉండొచ్చు. పొరపాటు మాది. అందుకు విచారిస్తున్నాం…” అంటూ సమాధానం చెప్పి, ప్రకటనలో పడ్డ కొన్ని అచ్చుతప్పుల్ని సవరిస్తూ, ప్రకటన గురించి కొన్ని వివరణలు ఇస్తూ ఒక పేజీన్నర ఉత్తరం వ్రాశారు.

మర్నాడు, ఫిబ్రవరి 11 న, ఆరుద్రగారి లేఖ చదివిన పిలకా గణపతిశాస్త్రి “..కొన్ని యదార్థ విషయాలు పాఠకులకు తెలియజేయడం అవసరమని భావించి…” వ్రాసిన ఉత్తరం ప్రచురింపబడింది. జనవరి 14న దేశిరాజు కృష్ణశర్మగారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని వుడ్‌లాండ్స్ హోటల్లో సాయంత్రం అయిదుగంటలకు ఆరుద్ర, గణపతిశాస్త్రిలతో సహా పదిమంది రచయితలు పాల్గొన్నారట. ఆ సమావేశంలో పద్మరాజు లేరు. “…చాలాసేపు చర్చ జరిగిన మీదట అందరమూ ఒక తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించి సంతకాలు చేశాము. శ్రీ ఆరుద్రగారు ఈ చర్చలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు…” సమావేశంలో ఒకాయన, ప్రభుత్వ ఉద్యోగి, సంతకం చేయలేదు. సమావేశంలో పాల్గొనని పద్మరాజు తర్వాత సంతకం పెట్టారు. సంతకం పెట్టిన మిగతావారు: దే. వేం. కృష్ణశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, విన్నకోట మాధవరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి.

వీరు సంతకం చేసిన తీర్మాన ప్రతి ఫొటోను ప్రచురించి, మళ్ళీ తీర్మానం మొత్తాన్నీ కూడా అచ్చులో వేశారు ఆంధ్రప్రభవారు (ఆ ఫొటో ఈ పుస్తకంలో లేదు). ఆ తీర్మానపాఠం:

“ప్రస్తుత పరిస్థితులలో రచయితలు తమ స్వాతంత్ర్యం విశిష్టత శ్రేయస్సు సంరక్షించుకొనుటకు ఏ మార్గం నవలంబించవలెనో నిర్ణయించుకొనుటకు కొందరు మిత్రులము సమావేశమై ఈ దిగువ తీర్మానమునకు వచ్చినాము.
“వ్యక్తి స్వాతంత్ర్యములకు భంగములేని ప్రజాస్వామికా దర్శములతో రాజకీయ పక్షాలకతీతులై రచనలు గావించుటే రచయితల లక్ష్యం.”
దీనిని సవరించుటకు ఆమోదించుటకును రచయితల సమావేశమును ఏర్పాటు చేయ నిశ్చయించినాము”.

ఒక మహాసభ జరిపి దానిద్వారా ఈ లక్ష్యం వెలువరిద్దామని మొట్టమొదట అనుకున్నారట కానీ, .”.. కొందరు మిత్రులతో సంప్రదించిన మీదట ఈ లక్ష్యప్రకటనకు కొంత విపులీకరణ అవసరమని అనిపించింది. విపులీకరణ జరిగింది…” గణపతిశాస్త్రిగారి దృష్టిలో మొదటి తీర్మాన పాఠానికి, తర్వాత విపులీకరించి ప్రచురించిన పాఠానికి ప్రధాన సిద్ధాంతంలో భేదమేమీ కనిపించలేదు. “ఇందువల్ల మొదటి పాఠం ఆమోదించి సంతకం చేసిన శ్రీ ఆరుద్రగారికి రెండవ పాఠానికి అభ్యంతరం ఉండవలసిన ఆవశ్యకత కనపడడం లేదు…”

దీనికి ఆరుద్ర రెండున్నర పేజీలసమాధానం వ్రాశారు. “… మేము జనవరి 14వ తారీఖున తీర్మానం చేసి ఒక నిర్ణయానికి వచ్చాము. సరైన ప్రజాస్వామ్య పద్ధతులలో అఖిలాంధ్ర రచయితల సమావేశం జరపాలనుకొన్నాం. అటువంటి సమావేశంలోనే మా తీర్మానాన్ని విపులీకరించి చర్చించాలనుకున్నాం. ఆ చర్చ జరిగిన మీదటే లక్ష్య ప్రకటన చేయాలనుకున్నాం. అందుకే మా తీర్మానంలో విస్పష్టంగా “దీనిని సవరించుటకు ఆమోదించుటకును అఖిలాంధ్ర రచయితల సమావేశమును ఏర్పాటు చేయ నిశ్చయించినాము” అని ప్రకటించాం…” తీర్మానం ముసాయిదాలో ముందు అఖిలాంధ్ర అని వ్రాస్తే, తర్వాత దాన్ని కృష్ణశాస్త్రిగారు ఆంధ్ర అని మార్చారట (ఈ పదం, గణపతిశాస్త్రిగారి లేఖలో ఉన్న పాఠంలో లేదు). “పత్రికలకి విడుదల చేస్తామని మొక్కపాటి నరసింహశాస్త్రిగారు తీసుకువెళ్ళారు…” కాని విడుదల చేయలేదు. ఈ సమావేశం తర్వాతే గణపతిశాస్త్రి, మొక్కపాటి గార్లు ఆంధ్రపత్రికలో (శ్రీశ్రీకి వ్యతిరేకంగా) లేఖలు వ్రాశారు కానీ, అ లేఖల్లో వుడ్‌లాండ్స్ సమావేశం ప్రసక్తే లేదు.

ఆరుద్ర తనకు తెలిసినదిగా చెప్పిన ఇంకో విషయమేమిటంటే వుడ్‌లాండ్స్ సమావేశం అయ్యాక కొంతమంది మిత్రులు నార్ల వేంకటేశ్వరరావుగారింట్లో సమావేశమయ్యారట. వారిలో ఆరుద్ర లేడు. అక్కడ ఏం జరిగిందో ఆయనకు తెలీదు. రచయితల మహాసభ ఏర్పాటు చేయకుండానే ప్రకటన ఇస్తున్నామని గానీ, పాఠం మార్చామనిగానీ ఆరుద్రతో ఎవరూ చెప్పలేదట. వుడ్‌లాండ్స్‌లో చేసిన తీర్మానం, పత్రికలో ప్రకటించిన తీర్మానం ఒకటి కావనీ, మొదటిది రాజకీయ పక్షాల కతీతం కావాలని చేసిందని, రెండవది రాజకీయ పక్షాల లబ్ధి కోసం చేసిందని, రెండవ (పత్రికలలో ప్రకటించిన) తీర్మానానికి తన సమ్మతి లేదని ఆరుద్ర స్పష్టం చేశాడు. ఈ సమాధానం ఆరుద్ర 13న వ్రాస్తే, 17న ప్రచురించారు.

ఆ తర్వాత ఆరుద్రను విమర్శిస్తూ కొంపెల్ల కామశాస్త్రి (బొంబాయి), రంధి సోమరాజు (ఏలూరు)ల లేఖలు ప్రచురించి, అంతటితో ఆ చర్చకు సంపాదకులు ముగింపు చెప్పారు. బహుశా అప్పటికి పోలింగు పూర్తై ఉండవచ్చు.

* * *

ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ప్రచురితమవుతున్న విషయాలపై, కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక విశాలాంధ్రలో ప్రచురించిన కొన్ని సంపాదకీయాలు, వ్యాసాలు, లేఖలు ఈ పుస్తకంలో ఒక భాగంగా ఉన్నాయి. ఒక సంపాదకీయం (ఫిబ్రవరి మధ్యలో రాసినదిగా అనిపించింది) “ఒక రచయిత” ను “రంగా భక్తుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు” అని వర్ణించింది.

ఎన్నికల ముందు కె.వి.రమణారెడ్డి, ఎన్నికల తర్వాత కొడవటిగంటి కుటుంబరావు విశాలాంధ్రలో వ్రాసిన వ్యాసాలు ఈ భాగంలో ఉన్నాయి. కుటుంబరావుగారు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, “క్రిందటి ఎన్నికలలో కంటే నాలుగు లక్షలు మాత్రమే హెచ్చు వోట్లు తెచ్చుకున్న కాంగ్రెసు ఫ్రంటుకు 146 సీట్లు ఎలా వచ్చాయి? క్రిందటిసారి కంటె 12 లక్షల వోట్లు (ఎక్కువ) తెచ్చుకున్న కమ్యూనిస్టులకు 15 స్థానాలే ఎందుకొచ్చాయి? కమ్యూనిస్టులు పోటీ చేసినన్ని స్థానాలకూ పోటీ చేసినా, వారిలో సగం వోట్లు కూడా తెచ్చుకోలేకపోయిన స్వతంత్రులకు 22 సీట్లు ఎలా వచ్చాయి? ఇటువంటి ప్రశ్నలకు ఒక సమాధానం “ఇది ప్రజాస్వామిక యంత్రంలో సహజంగా ఇమిడివున్న ఒకరకమైన జూదమని చెప్పవలసి ఉంటుంది” అని అన్నారు.

ఈ భాగంలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి రెండు. మొదటిది పద్మరాజు, నారాయణబాబులకు నార్ల చిరంజీవి రాసిన లేఖ, రెండవది ఆంధ్రప్రభ సంపాదకీయాలను విశ్లేషిస్తూ ప్రవాసి పేరిట, తర్వాత రోజుల్లో సినీ దర్శకుడిగా ప్రఖ్యాతి గాంచిన కె. ప్రత్యగాత్మ వ్రాసిన వ్యాసం.

ప్రత్యగాత్మ గురించి నాకు తెలిసింది కొంచెమే. ఈ వ్యాసం గురించి ఇలా మిగిలేంలో చదివేవరకూ ఆయనకూ కమ్యూనిస్టు పార్టీకి సంబంధాలు ఉన్నాయని కూడా నాకు తెలీదు. ఆంధ్రప్రభలో నార్ల వేంకటేశ్వరరావు ప్రగతి పేర తొమ్మిది కమ్యూనిస్టు వ్యతిరేక సంపాదకీయాలు వ్రాశారని పైన చెప్పాను కదా, ఆ సంపాదకీయాలని విమర్శిస్తూ “అభివృద్ధినిరోధక కూటమిలో ప్రగతిని కాంచిన పరిశోధకులు – ఆంధ్రప్రభ సంపాదకీయాలపై ఒక పరిశీలన” అంటూ పెద్ద వ్యాసం వ్రాశారు.

నార్ల చిరంజీవి (1925 – 1971) కవి, కథకుడు. భాగ్యనగరం నాటకం, అనేక కథలు, పిల్లల సాహిత్యం ద్వారా ఆంధ్రపాఠకులకు పరిచితులు. కాటూరు గ్రామస్థులు. కమ్యూనిస్టులపై నిర్బంధం ఉన్న రోజుల్లో, కాటూరు గ్రామంలో పోలీసులు జరిపిన అత్యాచారానికి చిరంజీవిగారు సాక్షి. 1955లో ఆయన విశాలాంధ్రలో పనిచేస్తున్నారని నాకెందుకో గుర్తు (ఈ పుస్తకంలో ఆ విషయం లేదు). పాలగుమ్మి పద్మరాజు, శ్రీరంగం నారాయణ బాబుల నుంచి తమ ప్రకటనపై ఆయన సంతకం కోరుతూ ఒక ఉత్తరం వచ్చింది. ఆ ప్రకటన చేస్తున్నవారిగా 24 పేర్లు ఉన్నాయి. వారిలో వుడ్‌లాండ్స్ హోటల్లో సంతకం పెట్టిన వారితో పాటు (ఆరుద్ర, మొక్కపాటిల పేర్లు మాత్రం ఇక్కడ లేవు) నార్ల వేంకటేశ్వరరావు, శివలెంక శంభుప్రసాద్‌లు కూడా ఉన్నారు. ప్రకటనపై సంతకాలు కోరుతూ పద్మరాజు, నారాయణ బాబు ఇలాంటి ఉత్తరాలు తెలుగు రచయితలు, కళాకారులు అందరికీ పంపినట్లున్నారు. ఆ ఉత్తరానికి సమాధానంగా చిరంజీవిగారు పద్మరాజుగారికి ఫిబ్రవరి 7న ఒక ఉత్తరం వ్రాశారు (ఈ ఉత్తరాన్ని నేను మొదట ఇలా మిగిలేంలో చదివాను). ఈ పుస్తకంలో పన్నెండున్నర పేజీలు ఉంది ఆ ఉత్తరం.

చిరంజీవిగారి ఉత్తరం మూడు భాగాలుగా చదువుకోవచ్చు. మొదటి భాగంలో పత్రికాధిపతులు శ్రీశ్రీ మీద సాగిస్తున్న వేటను (ఇంతకన్నా తీవ్రశబ్దం దొరకనందుకు విచారిస్తున్నాను అని అంటారు చిరంజీవి) గర్హిస్తారు. రెండవభాగంలో 1940లలో కమ్యూనిస్టు సాహితీకారుల, కళాకారులపైన ప్రభుత్వం నిర్వహించిన దమనకాండను వర్ణిస్తారు: చిరంజీవిగారి స్వంత గ్రంథాలయంలో పదివేల గ్రంథాలను, మరెన్నో అముద్రిత వ్రాతపతులను పోలీసులు ధ్వంసం చేశారట. వాటిలో గురజాడ అముద్రిత రచన “ఋతశతకం” వ్రాతప్రతి కూడా ఉందట. తేలప్రోలు వేమన గ్రంథాలయము, ప్రజాశక్తి గ్రంథాలయాలో ఉన్న పుస్తకాలన్నిటినీ తగలపెట్టటం, గ్రంథాలు రచించటమే కారణంగా రచయితలను డిటెయిన్ చేసిన సంఘటనలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంలోనే, ఆయన స్వగ్రామం కాటూరులో (కృష్ణా జిల్లా) జరిగిన సంఘటనను వర్ణించారు.

“ ఆంధ్ర రైతాంగానికి, ప్రజానీకానికి ఆత్మాభిమానం ప్రథమ లక్షణమని ఆందరికీ తెలుసు. అలాంటి మానధనులైన గ్రామీణ ప్రజల్ని 16-7-1949న ఈ ‘ప్రజాస్వామ్య పరిపాలకులు’ ఏం చేశారో వినండి.

నాటి తెల్లవారు జామున ఐదారు వందలమంది సైనికులు గ్రామన్ని చుట్టుముట్టారు. వయోభేదాన్ని పాటింపకుండా ప్రతి మగవాణ్ణి పట్టి తన్నుకుంటూ వీధులగుండా నడిపించి ఒక చోటికి చేర్చారు. రెండువేల ఎనిమిదివందలమంది పైచిలుకు మగవారిని ఇలా చేర్చారు. వారిని మూడు తరగతులుగా విభజించారు. 350 మందిని ప్రత్యేకించి విడదీసి వారిని కొన్ని వందలమంది సైనికులు కలిసి కట్టుగా కర్రలతో బాదారు. అది ఎలాంటి కొట్టుడో తెలియాలంటే నాటి యీ బాదుడులో రెండుబళ్ళకు పైచిలుకు ములుగర్రలు విరిగి ముక్కలయ్యాయి. అవి కాక లాఠీల సంఖ్య అతీతం. అప్పటికే స్పృహతప్పి పదిపోతున్న వారిని మొత్తం దిగంబరుల్ని చేశారు. మర్యాదని కాపాడుకుందామని చేతులు అడ్డం పెట్టుకున్న వారినల్లా తిరిగి చేతులు నలగగొట్టారు. ఆ తర్వాత వారినందరినీ పంక్తులుగా నిలబెట్టించి, చేతుల్ని నిలువుగా పైకెత్తించారు. ఆ పంక్తులకు వెనక రైతుల ఇల్లాండ్రను, తల్లులను కొందరిని పట్టి తెచ్చి నిలబెట్టారు. వారి వెనుకనే మిగిలిన ప్రజల్ని తగినన్ని దెబ్బలు వడ్డించి నిలబెట్టారు. ఈ దిగంబరుల ఊరేగింపును దాదాపు మూడుగంటలసేపు సాగించారు. పైకెత్తిన చేతుల్ని దింపనీయలేదు. “పోలీసు రాజ్యానికీ జై’, ‘గాంధీకి జై’ (పాపం శమించు గాక!) అనే నినాదాలు ఇవ్వమని నిర్బంధించి అనిపించారు. ఆఖరున ఊరికి మధ్యనున్న బాపూజీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేయించి మధ్యాహ్నం రెండు గంటలకు శవప్రాయులైన జనాన్ని వదిలివేశారు.

ఈ సంఘటన గురించి చాలా చాలా క్లుప్తంగానే చెప్పాను. నేనీ వాక్యాలు వ్రాస్తున్నపుడు నాటి ‘దిగంబర’ దృశ్యాలు కళ్ళముందు మెదుల్తున్నాయి. కారుణ్యానికీ, మానవతకూ నిలయాలు మీ హృదయాలు. మీరు నావలెనే ఆనాటి దృశ్యాన్ని ఊహించగలరు.

మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. ఇది ఏ నాగరికతకు, ప్రజాస్వామ్యానికి చిహ్నప్రాయమో ఆలోచించి చెప్పగలరా?

(ఈ సంఘటనకు రెంఢు రోజుల ముందు, సమీప గ్రామం యలమర్రులో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. పళనియప్పన్ అనే అధికారి నేతృత్వంలో మలబారు పోలీసు దళాలు ఈ పనులు చేశాయి).

ఉత్తరం మూడవ భాగంలో, ఇవన్నీ తెలిసీ కూడా, “…ఆ క్లిష్ట పరిస్థితులలో, ఒక్కుమ్మడిగా కళాసంస్కృతులమీద దెబ్బ పడుతున్న స్థితిలో, ప్రజల స్వాతంత్ర్యానికి భంగం కలిగిన స్థితిలో, భారతీయాత్మకు విరుద్ధంగా హింసావిధానం చెలరేగినప్పుడు మీ అందరి కంఠాలు ఎంచేత మార్మోగలేదు? ఎందుకని మూగపడిపోయాయి?” అని ప్రశ్నిస్తారు. “..ఒక చేత్తో ఏవేవో లక్ష్యాలను ప్రకటిస్తూ, మరో చేత్తో రచయితల మేధా స్వాతంత్ర్యాన్నీ, గౌరవాన్నీ మలినపరచే పత్రికా వ్యాపారుల, వ్యాపారసంస్థల యజమానుల సరసనే నేను సంతకం పెట్టి కోట్లాది ప్రజలకూ, సాహితీప్రియులకూ అవమానకరంగా ప్రవర్తించలేను. నన్ను నేను వంచించుకోలేను.” అంటూ తన ఉత్తరం ముగించారు నార్ల చిరంజీవి.

(సశేషం)

***

దొంగదాడి కథ – 1955 ఎన్నికలు, చారిత్రక వాస్తవాలు
జూన్ 2006
ప్రచురణ: విశ్వేశ్వరరావు, సాహితీ మిత్రులు
విజయవాడ
ఫోన్: 9392971359
ప్రతులకు: నవోదయ, విజయవాడ; ఇతర పుస్తకవిక్రేతలు
254 పుటలు; 100రూ.
కినిగె.కాం కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. దొంగదాడి కథ -3 | పుస్తకం

    […] భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ) ****** ఈ పుస్తకం ఆఖరు భాగంలో, శ్రీశ్రీ […]

  2. దొంగదాడి కథ -1 | పుస్తకం

    […] విశాలాంధ్రల గురించి తర్వాత […]

Leave a Reply