కథావార్షిక 2010
వ్రాసిన వారు: అరి సీతారామయ్య
************
మధురాంతకం నరేంద్ర గారు 1999 నుండి ప్రతిసంవత్సరం ప్రకటిస్తున్న ఉత్తమ కథాసంకలనం కథావార్షిక. 2010 లో వచ్చిన సంకలనం లో 11 కథలున్నాయి. పి. సత్యవతి గారి ఆవిడ, బా రహంతుల్లా గారి బడోంకి ఈద్, టి. ఎస్. ఎ. కృష్ణమూర్తి గారి చివరి మజిలీ ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కథలు.
పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, భార్య చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత, ఒక పెద్దాయన మళ్ళా పెళ్ళి చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయాడు. అంత్యక్రియలు చెయ్యటానికి వచ్చిన బిడ్డలూ, బంధువులూ అందరూ ఆవిడను వేరుగానే చూస్తారు. ఆయన జీవితం చివర్లో వచ్చి, కొన్నాళ్ళు ఆయనకు సేవ చేసి, ఆ ఉన్న ఇల్లు కాస్తా రాయించుకుంది మహాతల్లి అని అందరికీ కోపం. ఆమె అలా రాయించుకోలేదని తెలిసింతర్వాత ఆమె మీద కొంత సానుభూతి కలుగుతుంది ఆయన కూతురుకి. ఆస్తి తీసుకోకుండా ఆయనకు శరీరసుఖం అందించి, చివరి దశలో సేవలు చేసి ఆయన పోయింతర్వాత ఒట్టి చేతుల్తో పోతే ఆవిడ మంచి మనిషి. అలా కాకుండా ఆమె చేసిన సేవలకు బదులుగా ఇల్లు రాయించుకుంటే దుర్మార్గురాలు. ఇదీ ఆయన బంధువుల, బిడ్డల అభిప్రాయం. చివరి దశలో బిడ్డలు చెయ్యాల్సిన సేవలు ఆవిడ చేసింది. ఆవిడ స్థానం ఏంటీ? ఆవిడను ఎలా చూడాలి? ఎలా గౌరవించాలి? ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నామని అనుకునేవాళ్ళలో కూడా మానవ సంబంధాలు చాలావరకు ఆర్థిక సంబంధాలే అనిపిస్తుంది ఈ కథ చదివింతర్వాత. ఆర్థిక సంబంధం లేకుందా మిగిలిన ప్రేమలూ, అభిమానాలూ, స్నేహాలూ అవే నిజమైన సంబంధాలు.
బడోంకి ఈద్ పోయిన వారిని స్మరించే దినం. పాతిక సంవత్సరాలు నిండకుండానే చనిపోయిన చెల్లిని గురించి ఆమెను అమితంగా ప్రేమించిన అన్న జ్ఞాపకాలే ఈ కథ. ఇది నిజంగా కథ కాదేమో. ఒక విషాద కావ్యం, ఒక సూఫీగీతం అన్నాడు సంకలకర్త. చాలా సులభంగా చదివించే, అందమైన భాషలో ఉన్న కథ. కళ్ళనీళ్ళు తెప్పించే కథ.
కొందరు ఉన్న దాంతో తృప్తిపడి సాదాసీదా జీవితాలు గడుపుతుంటారు. మరికొందరు ఏదో విధంగా పైకి రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసే ప్రయత్నాలనుబట్టి వారి స్వభావాలను అంచనా వెయ్యొచ్చు. ఈ కథలో ఒకాయన ఆర్.ఎం.పీ. చేసి హాస్పిటల్ పెడతాడు. రోగులకూ రోగాలకూ కరువులేని దేశంకాబట్టి రెండుచేతులా సంపాదిస్తాడు. రెండుమూడేళ్ళు బాగానే సాగుతుంది. ఏదో ఒక రోగికి చేసిన చికిత్స బెడిసికొట్టడంతో రోగి మన డాక్టర్ మీద కేసుపెట్టడం, మరికొందరు రోగులుకూడా అలాగే చెయ్యడంతో, డాక్టర్ గారు హాస్పిటల్ మూసేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతాడు. ఆ తర్వాత ఒక ఐటీ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత రియలెస్టేట్ వ్యాపారం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తాడు. ఇలాంటి వారికి చివరి మజిలీ/పర్మనెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ రాజకీయాలే అని అతని స్నేహితుడి అభిప్రాయం.
హెచ్చార్కె గారి అల్-ఫతా హోటల్, ఎ. ఎస్. జగన్నాధశర్మ గారి పులి, పి. చిన్నయ్య గారి పంపకాలు మంచి కథలు.
అల్-ఫతా హోటల్లో టీ తాగుతున్న కథకునికి పరిచయమైన ఒక నిరుద్యోగి కథ ఇది. తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో కొత్త నిర్మాణాలు ఆగిపోవటం, కార్మికులకు పనులు దొరక్కపోవటం, యాదృచ్ఛికంగా కలిసిన వీరిద్దరి మనోభావాల గురించి అతిసున్నితంగా చెప్పిన కథ ఇది. కాని కథా సమయంలో కథలోని ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలూ రావు కాబట్టి ఇదికూడా నిజంగా కథ కాదేమో.
మరో అన్నా చెల్లెళ్ళ కథ జగన్నాథ శర్మ గారి పులి. వూరి పెద్దమనిషి చేతుల్లో నలిగి చనిపోయిన చెల్లెలి చావుకు పులిగా మారి ప్రతీకారం తీర్చుకున్న అన్న కథ. కళింగాంధ్ర మాండలికంలో రాసిన కథ అన్నారు సంకలనకర్త. సులభంగా చదివించిన కథ.
ప్రభుత్వంఇచ్చిన భూములను పంచుకోవటంలో, కట్టిన అంబేద్కర్ భవనంలో వాటాలు పంచుకోవటంలో మాదిగ మాల కులాల మధ్య జరుగుతున్న పోట్లాటల చిత్రీకరణ పంపకాలు. అస్తిత్వ పోరాటాల పేరుతో కొందరు నాయకులు తయారుకావటం, పోరాట ఫలితాలను వారు స్వప్రయోజనాలకు వాడుకోవటం, చివరకు “పంపకాల్లో అన్యాయం చేసేటోల్లు మన ప్రాంతపోడయితే ఏంది, మన కులపోడయితే ఏంది, ఎవరి మీదనైన కొట్లాడల్సిందె,” అనే చైతన్యం పోరాడుతున్న వారికి రావటం కథా సారాంశం.
ఇక మిగిలిన ఐదు కథల్లో ఏదో ఒక లోపం ఉందని నా అభిప్రాయం.
భగవంతం గారి చిట్టచివరి సున్నా, వాడ్రేవు చినవీరభద్రుడు గారి పాఠాంతరం, ఈ రెండు కథల్నూ వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్లు కూడా 2010 లో వచ్చిన ఉత్తమ కథల జాబితాలో చేర్చారు (కథ 2010).
నా అభిప్రాయంలో ఈ రెండూ కృత్రిమ కథలు, ఇంగ్లీషులో చెప్పాలంటే manufactured stories or fabricated stories. తెలుగులో మాత్రమే కనపడే వింత కథలు.
మైదాపిండి కట్టిన పాత న్యూస్‌పేపర్ మార్జిన్ లో “జీవిత సత్యాన్ని తెలిపే ‘ఆ’ పదార్థంతో పులుసు వండుకొని చివరిసారి తృప్తిగా భోంచేసి వెళ్ళిపోవాలి,” అని రాసి వుంటుంది. అది చదివిన మన కథా నాయకుడు రెండు నెలలపాటు “ఆ” పదార్థం ఏమిటో అన్వేషించటానికి బయలుదేరి హైదరాబాద్ లో, ఢిల్లీ లో ఫుడ్ ఫెస్టివల్స్ లో తిరుగుతాడు. చిత్తు కాగితాల్లో రాసున్న మాటలను ఇంత సీరియస్ గా తీసుకుని ఎవడన్నా రెండు నెల్లు వేస్ట్ చేస్తాడా? చేస్తే మాత్రం దాని గురించి పాతకపేజీలు రాసి మనందరికీ బోర్ కొట్టించాలా? “ఆ” పదార్థం అంటే ఆనియన్ అట. ఇదీ చిట్ట చివరి సున్నా కథ. కథా వార్షిక 2010 లో బాగా బోర్ కొట్టించిన కథ ఇది.
మంచి కథలో అనవసరమైన మాట ఒక్కటీ ఉండకూడదు. ఉదాహరణగా సత్యవతి గారి ఆవిడ ను చెప్పుకోవచ్చు. అనవసరమైన చర్చలే ముఖ్యాంశంగా ఉన్న కథ పాఠాంతరం. ఇందులో ఒక పత్రిక నడుపుతున్న పెద్దాయనా, ఒక కార్పొరేట్ స్కూల్స్ నడుపుతున్న కుర్రవాడూ షేక్స్‌పియర్ నాటకం హామ్లెట్ గురించి దీర్ఘంగా చర్చిస్తారు. అసలు హామ్లెట్ దేని గురించీ? జ్ఞానాన్ని కథానాయకుడు కర్తవ్యంగా మార్చుకోలేకపోయాడని చెప్పటానికా? స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటానికి అతడు చేసిన అన్వేషణ గురించా? అతడి స్ప్లిట్ పర్సనాలిటీ గురించా? లేక ఒక కరప్ట్ స్టేట్ గురించా? అసలు హామ్లెట్ ట్రాజెడీ అని ఎందుకు అంటారూ? తన దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలించే అవకాశం హామ్లెట్ సరిగ్గా వాడుకోకపోవటం వల్లా? ఒఫీలియా చావటం వల్లా? ఇలా సాగుతుంది వీరి మధ్య చర్చ. కథలో దాదాపు ఎనభైశాతం కు పైగా జరిగేది ఈ చర్చే. దీనికీ కథకీ సంబంధం ఏమిటీ? మన కుర్రవాడు నడుపుతున్న కార్పొరేట్ కాలేజీలో ఒక విద్యార్ధినిని ఆమె క్లాస్మేట్స్ వేధిస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా కాలేజీ యాజమాన్యం దాని గురించి పట్టించుకోలేదు. మన పెద్దాయన నడుపుతున్న పత్రికకు తెలియజేస్తే ఆయన కాలేజీ యాజమాన్యానికే ఆ వార్త అందజేస్తాడు. చివరికి దాని గురించి ఎవరూ ఏమీ చెయ్యరు. విషయాన్ని పరిశీలిస్తున్నామంటాడు మన కుర్రవాడు. ఒక రోజు ఆ అమ్మాయిమీద యాసిడ్ దాడి జరుగుతుంది. తను సకాలంలో ఎలాంటి చర్యా తీసుకోకపోయినందుకు మన పెద్దాయన విచారిస్తాడు. ఈ కథలో హామ్లెట్ చెయ్యగలిగీ చెయ్యకపోయిన పనుల గురించి పెద్ద చర్చ ఉంది. కార్పొరేట్ కాలేజీ వారూ, పత్రిక వారూ సకాలంలో కాలేజీ అమ్మాయిమీద జరుగుతున్న వేధింపు గురించి తాము చెయ్యగలిగిందేదో చేసినట్లయితే యాసిడ్ దాడి జరిగేదికాదేమో. ఈ మాత్రం సారూప్యానికే హామ్లెట్ గురించి ఇంత చర్చ అవసరమా? నాకైతే ఇది కథ ముసుగులో హామ్లెట్ మీద రాసిన వ్యాసం అనిపించింది.
మల్లిపురం జగదీష్ గారి టెహిలికి పెళ్ళి గిరిజన సంస్కృతీ, ఆచారాల గురించి చెప్పటానికి చేసిన ప్రయత్నం. అయితే ఇందులో చెప్పుకోదగ్గ కథనం లేదు. కథ చదివింతర్వాత గిరిజనుల గురించి కొంత తెలిసింది అనిపిస్తుంది కాని, మళ్ళా దీని గురించి ఆలోచింపజేసే కథ కాదు.
పాఠాంతరం లాంటిదే మరో కథ శ్రీపతి గారి మోనాలిసా. ఇందులో కూడా కథకు సంబంధంలేని సంభాషణలే కథలో ఎక్కువ భాగం. కలలో లింకన్ కనిపించటం, అదీ రెడ్ స్క్వేర్ లో. అది రెడ్ స్క్వేరా తీన్ ఆన్ మన్ స్క్వేరా? అని ఒక చర్చ. (Tiananmen square ని తీన్ ఆన్ మన్ స్క్వేర్ అంటారు రచయిత). అక్కడ ఒక పెద్ద మోనాలిసా చిత్రం ఉందట. మొనాలిసాని ఒక అందాల విలాసినీ మణి అంటాడు కథకుడు. నాకు తెలిసినంతవరకు మోనాలిసా చిరునవ్వు వెనక ఏదో గుప్త భావం దాగి ఉందంటారు కాని మోనాలిసా ఒక అందాల విలాసినిగా పేరుపొందిన స్త్రీ కాదు. అంతే కాదు, ఈ కథలో కథకుడు మోనాలిసా అనేది చిర్నవ్వులు చిందించే రెండు సంవత్సరాల పాపని. నాకైతే ఒక చిన్న పాప నవ్వుల్ని మోనాలిసాతో పోల్చటం పూర్తిగా అసందర్భంగా ఉందనిపించింది. ఈ కథలో కొన్నిచోట్ల భాషకూడా వింతగా ఉంది: “ఎన్నిసార్లు రాజ్‌ఘాట్ దగ్గర …మొక్కుకున్నానో” అంటాడు ఒక జర్నలిస్ట్; “ఏకైక సంపన్న అగ్రరాజ్య అమెరికా” – ఇది ఇంగ్లీషు మాటలను తెలుగులో ఇరికించటానికి చేసిన ప్రయత్నం; “నువ్వు ఇంట్లో దొరకుతావా? ” – Will you be home? కి అనువాదం ఇది.
పశ్చిమ దేశాల కళల గురించో సాహిత్యం గురించో నాకు బాగా తెలుసు అని చెప్పుకోవటానికి తెలుగు రచయితలు ఉబలాట పడుతున్నారనిపిస్తుంది మోనాలిసా , పాఠాంతరం లాంటి కథలు చదువుతుంటే.
ఇక స. వెం. రమేష్ గారి అడివంచుపల్లె గురించి రెండు మాటలు రాస్తాను. ఈ కథ గురించి రాస్తూ, “జానపదుల జీవిత గతుల్ని, …వారి సాహస పోరాటాల్నీ…సాధికారంగా, అద్భుతమైన సహానుభూతితో చిత్రించి, సాహిత్యాన్ని చరిత్రకూ, ఆంత్రొపాలజీకీ గొప్ప ప్రత్యామ్నాయంగా నిరూపిస్తున్నారు” అన్నారు సంపాదకులు. నిజమే. ఇది చదువుతున్నప్పుడు చరిత్రో మరేదో చదువుతున్నట్లు అనిపించింది కాని కథ చదువుతున్నట్లు అనిపించలేదు. పాఠకులకు మాదిగల చరిత్ర గురించీ జీవితాల గురించీ బోధించటానికి చేసిన ప్రయత్నం ఇది. కథా కథనం సూన్యం. ఇక మెస్సేజ్ దగ్గరకు వస్తే, “జీవానికి కూడూ కునుకూ ఎంత అక్కరో కోరిక తీర్చుకొనేదానికి తోడుకూడా అంతే అక్కర. బుద్ధ మతపు ప్రచారంకోసరం సంసారంతోపాటు సర్వమూ ఇడిసిన వాళ్ళకి కూటి అక్కరనూ కునుకక్కరనూ సమాజమే తీర్చింది… మూడో అక్కర తీర్చే దెవురు? … మాదిగ కులం ముందుకొచ్చిందబుడు. తన ఆడ బిడ్డలను కొందురిని బౌద్ధం కోసరం అర్పణం చేసుకునింది.” ఇదీ రచయిత చెప్తున్న చరిత్ర. ఇది చరిత్రో కాదో తర్వాత చెప్తాను. కులం ఏదైనా కాని ఎవరైనా ఇంటి ఆడబడుచులను ఇష్టపూర్వకంగా ఎదటి వారి సెక్స్ కోసం అర్పణం చేస్తారా? ఇది బౌద్ధులకేగాదు, శైవులకూ, జైనులకీ కూడా చేశారట. ఈ అర్పించుకోవటం ఈ మధ్య మానేశారనుకుంటారేమో. మన కథకుడికి కూడా అర్పించటానికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారట. నాకైతే ఈ అచారం (నిజమైనా కాకపోయినా) అసహ్యంగా అనిపించింది. దీన్ని గురించి గొప్పగా రాయాల్సిందేంటో అర్థం కాలేదు. ఇక ఈ అర్పించటం చారిత్రాత్మక వాస్తవమో కాదో నాకు తెలియదు. “బుద్ధయుగపు మాదిగల త్యాగం లంజదిబ్బల పేరున బౌద్ధ స్తూపాలతోపాటు కాలం కడుపులో కలిసిపొయ్యింది” అంటాడు సాకన్న, ఈ కథలో ఒక పాత్ర. ఇది రచయిత అభిప్రాయం అని వేరే చెప్పనక్కర్లేదు. బౌద్ధమత ప్రచారంలో స్త్రీలూ పురుషులూ పాల్గొన్నారనీ, బౌద్ధారామాల్లో అందరూ కలిసి ఉండేవారనీ, ఈ కారణంగా గిట్టనివాళ్ళు బౌద్ధారామాలను లంజలదిబ్బలు అనేవారని ఎక్కడో చదివాను. ఏది నిజమో నాకు తెలియదు.
ఇక ముగిస్తాను. మొత్తం మీద కథావార్షిక 2010 లో వచ్చిన కథల్లొ దాదాపు సగం కథలు బాగానే ఉన్నాయి. 170 పేజీలు నింపటానికి కథలు ఎంపిక చెయ్యటం కాకుండా మంచి కథలు మాత్రమే ఎంపిక చేసి చిన్న పుస్తకం వేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. కృత్రిమ కథలూ, బోధించి బాధించే కథలూ వెయ్యటం ఇక మానేస్తే మంచిదేమో.
జొన్నవిత్తుల
టీఎస్సే కృష్ణమూర్తిగారి కథని మీరు ప్రత్యేకంగా మెచ్చుకోవడం నాకు బాగా నచ్చింది.
తెలుగులో ఎంతో మంది రాసే కథల్లాగే ఆయన కథలు కూడా ఎంతో ఉన్నతమైనవి. అయితే మిగిలినవాళ్ళలో లేనిదీ ఆయనలో ఉన్నదీ ఒక ప్రత్యేకాంశం ఏమిటంటే, వారి కథల కంటె ఆయన మరింత ఉన్నతుడు. నేనీమాట అంటున్నది ఆయన నాకు మిత్రుడు కావడం వల్ల అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే అది వారి తప్పు కాదు. ఎందుకంటే అలా వ్యాఖ్యానించకపోతే వారిని తెలుగుతక్కువ మనుషులనుకోవచ్చు. వాళ్ళని వదిలేస్తే మిగిలినవారందరికీ నేను మనవి చేసేదేమిటంటే, రచయితలు రాసే కథల్లోని పాత్రలు, వాటి ఆదర్శాలూ వాటి పట్ల నిబద్ధతా వాటిని ఆచరణలో పెట్టే సహృదయతా మొదలైనవాటిని ఆయా పాత్రలతోబాటుగా ఆ పాత్రలని సృష్టించిన రచయితలు కూడా పాటించడమనేది ఆయన ప్రత్యేకత. ఆయన కథల్ని “ఆదర్శవంతమైన నీతి పాఠాలు”గా అభివర్ణించేవారు కూడా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో గౌరవిస్తారు. తాము ఆ విధంగా తమని తాము తీర్చిదిద్దుకోలేక పోతున్నామని బాధపడతారు. వాళ్ళలో కనీసం కొందరయినా ఆయన పాటించే విలువల్లో కొన్నింటినయినా తాము కూడా పాటించడానికి ప్రయత్నిస్తారు. అలా కర్తవ్యోన్ముఖుల్ని చెయ్యడం అనేది రచనల బాధ్యత మాత్రమే కాదు, రచయితల బాధ్యత కూడా అని నిరూపిస్తుంది ఆయన జీవన శైలి. అదే ఆయనలో అందరినీ ఆకర్షించే విశిష్టత.
కొత్తపాళీ
బాగా రాశారు.
Aripirala Satyaprasad
సూటిగా, ధాటిగా, మేటిగా వుంది.
చిట్టచివరి సున్నా కొంత మేజిక్ రియలిజం లక్షణాలు చూపించినా అనవసరపు ఫుడ్ ఫెస్టివల్స్ గొడవతో సాఆఆగిందని ఇంతకు ముందు నేనూ కూడా ఎక్కడో చర్చలో అన్నాను. పాఠాంతరం నేను పూర్తిగా చదవలేకపోయాను… సంవత్సరానికి మూడు నాలుగు కథల సంకలనాలు వస్తున్నాయన్న సంతోషం కన్నా అందులో పస వుండటంలేదని నిరూపించి బాధపెడుతుందీ పుస్తకం.