మల్లెమాల – ఇదీ నా కథ
గత ఏడాది ఏప్రిల్, మే మాసాలలో చాలా తెలుగు వెబ్‌సైట్లు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (మల్లెమాల సుందరరామిరెడ్డి) గారి ఆత్మకథలోంచి కొన్ని విశేషాలను ప్రచురించాయి. వెబ్‌సైట్లలో ప్రచురించబడ్డ విశేషాలన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది సినిమా పరిశ్రమ ప్రముఖుల (నటులు ఎన్.టి.ఆర్, చిరంజీవి, జమున, జయలలిత, శోభన్‌బాబు, రాజశేఖర్, జూ.ఎన్టీఆర్, దర్శకుడు గుణశేఖర్ వగైరా) గురించి ఆయన విమర్శనాత్మకంగా వ్రాసిన విషయాలే. విపరీతమైన సంచలనాన్ని సృష్టించాయి ఆ వ్యాఖ్యలు. చిత్రరంగంలో ప్రముఖనిర్మాతగా కొనసాగుతున్న ఆయన కుమారుడు శ్యాం ప్రసాద్ రెడ్డి బలవంతంపై ఆ పుస్తకం అమ్మకాలని నిలిపివేసి మార్కెట్లోంచి తీసేశారని ఆ తరువాత వార్తలు వచ్చాయి. ఏదేమైనా, ఆ పుస్తకం మార్కెట్‌లోంచి మాయమయ్యింది. ఫిబ్రవరి ఇండియా ట్రిప్పులో మిత్రులు దేవినేని మధుసూదనరావుగారి దగ్గర ఆ పుస్తకం కనిపించింది. ఆయన్ని బాగానే మొహమోటపెట్టి ఆ పుస్తకాన్ని స్వంతం చేసుకున్నాము.
నిజానికి ఈ పుస్తకాన్ని చాలా రోజుల క్రితమే – వార్తల్లోకి వచ్చిన రోజుల్లోనే – చదివాను. సినిమాలపై ఆసక్తి ఉన్న ఒక ఇంటర్నెట్ మిత్రుడు – అయాచితంగానే – ఇంటర్నెట్లో ఈ పుస్తకం అనధికారికంగా లభ్యమయ్యే లంకె పంపాడు. ఆసక్తితో చదివేశాను. కానీ పుస్తకం అధికారిక ప్రతి చేతికి దొరికేదాక కొంత అపరాధభావం. ఈ పుస్తకం మొదటిసారి చదివినప్పటినుండీ దీన్ని పుస్తకం పాఠకులకు పరిచయం చేయాలనే అనుకున్నాను కానీ, ఇబ్బందిగా అనిపించి మానేశాను. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. దీనికి ముందు రాంగోపాలవర్మ నా ఇష్టం పుస్తకం కూడా ఇలాగే ముందు ఇంటర్నెట్లోనే చదివాను కానీ అప్పటికే నాకోసం మిత్రులు ఇండియాలో ఆ పుస్తకం కొనేసి, నాకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు; అందుకని అప్పుడు తప్పుగా అనిపించలేదు.
ఈ పుస్తకం గురించి ప్రాచుర్యంలో ఉన్న విషయాలన్నీ సినిమా పరిశ్రమకు సంబంధించినవే ఐనా, సినిమాలకు ముందుకూడా మల్లెమాలగారిది చాలా ఆసక్తికరమైన జీవితం. తీవ్రదారిద్ర్యం నుంచి స్వయంకృషితో పైకొచ్చిన మనిషి. పాఠశాల చదువు లేకుండా, గురు ముఖతా తెలుగు చదువుకోకుండా ఛందస్సులో పద్యాలు వ్రాసిన సహజ కవి. తన సినిమాలలో చాలావాటికి పాటలు కూడా వ్రాశారు. శ్రమకు వెనుకాడే తత్వం కాదు. ఆత్మవిశ్వాసమూ, మొండితనమూ, కొద్దిగా భోళాతనమూ (బహుశా శీఘ్రకోపం కూడా) ఉన్నట్లు అనిపిస్తారు. ఈ పుస్తకంలో ఆ లక్షణాలు ప్రతిబింబిస్తాయి. మల్లెమాల గారిని 1981 తానా మహాసభలకు చికాగో వచ్చినప్పుడు కలిశాను. ఆ సభలో ఆయన “ఎంత కమ్మని భాష మనది, ఎదను కదిపే భాష మనది…” అన్న గేయం చదివారు; స్థానిక మిత్రుడు హరనాధరాజు ఆ పాటకు వరసగట్టి తర్వాత ఒక పిక్నిక్‌లో పాడటం బాగా గుర్తు.
ఆయన అసలు ఇంటి పేరు మన్నెమాల. ఆ పేరుకు అర్థం పర్థం లేదు అనిపించి చిన్నతనంలోనే దాన్ని మల్లెమాలగా మార్చుకుని, మహిత వినయశీల మల్లెమాల అన్న మకుటంతో ఆటవెలది పద్యాలు వ్రాయటం మొదలుబెట్టారు. స్వగ్రామం నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలో అలిమిరి అనే మారుమూల గ్రామం. 1924 ఆగస్టు 15న పుట్టారు. తల్లితండ్రులకు మొదటి సంతానం. తరువాతివాడి కంటే ఐదేళ్ళు పెద్ద. నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లి. తండ్రి ఊరికి పెద్ద; చాలా గౌరవంగా బతికినవాడు. ఐతే ఊళ్ళోవాళ్ళ కోసం పెట్టిన ఖర్చులకోసం చేసిన అప్పులకు ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకోవలసివచ్చింది. తల్లికి పుట్టింటివారిచ్చిన ఆస్తి కుటుంబ అవసరాలకు చాలలేదు. ఉన్న ఊరిలో కొద్దిపాటి వీధిబడి చదువు చదువుకున్నారు. ఏకసంతాగ్రహే ఐనా, పట్నం వెళ్ళి చదువుకునే అవకాశం లేదు. గూడూర్లో ఇద్దరు పెద్దమనుష్యులను సాయమడిగి అవమానం పొందారు. దానితో పదకొండేళ్ళ వయసులో చదువుమీద ఆశ వదలుకున్నారు. కోమటికొట్లో పనిచేస్తూ అక్కడ సరుకులు పొట్లాలు కట్టటానికివచ్చే పాత దినపత్రికలను శ్రద్ధగా చదివేవారు. వేమన పద్యాలపై ఉన్న ఇష్టంతో ఆటవెలది పద్యాలు చెప్పటం అప్రయత్నంగానే వచ్చింది. “తర్వాత పోతన భాగవతంలోని పద్యాలను ప్రతినిత్యం చదవడం అలవాటు చేసుకున్నాను. ఆ అలవాటే నాకు పద్యం ఎంత సరళసుందరంగా వ్రాయాలో నేర్పింది. క్రమక్రమంగా ఆ పద్యాలు నా గుండెచప్పుడుగా మారాయి. ఆ చప్పుడే నాకు ఛందస్సు నేర్పింది. కాని… ఇప్పటికీ నాకు గణవిభజన తెలీదు. అయినా కలం అందుకోగానే యతులు ప్రాసలు గణాలు తమంతట తామే వచ్చి వాటి వాటి స్థానాల్లో కూర్చుంటాయి…పద్యం నా ఆరో ప్రాణం. ఎప్పుడూ నీడలా నాతో కలసి నడుస్తుంది. నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను ఏది రాద్దామనుకుని కలమందుకున్నా పద్యం నా కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది”. మల్లెమాల పద్యాలను హర్షించిన జమీన్‌రైతు పత్రిక సంపాదకుడు వెంకటరామిరెడ్డిగారు ఆయనను “సహజకవి”గా పాఠకులకు పరిచయం చేశారు.
బ్రతుకుతెరువుకోసం చిన్నతనంలోనే వ్యవసాయప్పనులూ, చిన్నచిన్న ఉద్యోగాలూ చేసిన ఎం.ఎస్.రెడ్డిగారు పదిహేడేళ్ళ వయస్సులో మైకాడిపోలో ఉద్యోగం చేయడం మొదలుబెట్టారు. మూడేళ్ళు గడిచాక జీతం పెంచమని అడిగినప్పుడు యజమాని చులకనగా మాట్లాడగా, రోషం వచ్చి ఉద్యోగం మానివేసి ఒకరికింద ఊడిగం చేయవద్దని నిర్ణయించుకొన్నారు. నాలుగు వారాలు మట్టిపని చేయగా వచ్చిన ఇరవై రూపాయలతో తాటిపీచు కొట్టించి అమ్మే వ్యాపారం మొదలుబెట్టి, రకరకాల వ్యాపారాలు చేసి రెండేళ్ళలో నలభైవేలు సంపాదించి, తండ్రి అమ్మిన పొలాలన్నీ రెట్టింపు ధర ఇచ్చి కొని, వాటిలో కొంతభాగాన్ని దాయాదులకు పంచియిచ్చారు. మైకా గని యజమాని, సాహిత్యప్రియుడు గోగినేని వెంకటేశ్వరరావు గారికి ఒక పద్యమిచ్చి మెప్పించి, ఆయన సహకారంతో స్వయంగా మైకా డిపోను ప్రారంభించి, నాణ్యతగా మైకాను ‘ఒలిపించటం’లో పేరు తెచ్చుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు. మలెమాల నిజాయితీని, వ్యక్తిత్వాన్నీ, పనితనాన్నీ మెచ్చిన రావుగారు, మాగుంట సుబ్బరామిరెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి గార్లు ఆయనకు చాలా సహకారం అందించారు. ఒకసారి అన్యాయమని తోచినప్పుడు తిక్కవరపు రామిరెడ్డిగారి గారి మేనేజరుతో మల్లెమాలగారు ఒక అణా దగ్గర పేచీ పెట్టుకొన్నారట.
కాంగ్రెస్ ఉద్యమాల్లో పాలు పంచుకోవటం మొదలుబెట్టారు. గ్రామంలో అంటరానితనాన్ని నిర్మూలించటానికి కృషి చేశారు. వెంకటగిరి జమీందారుకు, జమీందారీలకు వ్యతిరేక పోరాటాల్లో క్షేత్రస్థాయిలో పాల్గొన్నారు. ప్రకాశంపంతులు, ఏ.సీ.సుబ్బారెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటివారు మంచి మిత్రులయారు. తన వూరిని చాలా అభివృద్ధి పరిచారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సమితి ప్రెసిడెంటు పదవికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకొన్నారు.
మైకా వ్యాపారంలో సఫలమయ్యాక నెల్లూరులో సుందరమహల్ అనే అధునాతమైన సినిమా థియేటర్ ప్రారంభించారు. ఆ తర్వాత కుమరిప్పెణ్ అనే తమిళ సినిమాను కౌముదీ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకం కింద కన్నెపిల్ల పేరుతో డబ్ చేశారు (1966). ఆ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మరో రెండు డబ్బింగ్ సినిమాలతో నష్టం వచ్చినా, కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో భార్య అనే రీమేక్ చిత్రాన్ని తీశారు. ఆ చిత్రంతో వచ్చిన లాభాలు ఆ తర్వాత తీసిన కలసిన మనసులుతో తుడిచిబెట్టుకుపోయాయి. ఐనా, ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, జయలలిత, జమునలతో శ్రీకృష్ణవిజయం చిత్రాన్ని నిర్మించారు. దానిలోనూ కొంత నష్టం వచ్చింది. ఆ తర్వాత చలంతో తీసిన ఊరికి ఉపకారి చిత్రం విజయవంతమయ్యింది. అలా కొన్నిచిత్రాలు హిట్లుగా, మరికొన్ని ఫట్లుగా ఆయన సినీ ప్రస్థానం సాగింది. కోడెనాగు, ముత్యాలపల్లకి, ఏకలవ్య, పల్నాటి సింహం, (పిల్లలతో తీసిన) రామాయణం చిత్రాలు ఆయన నిర్మించిన చిత్రాలలో కొన్ని. ఆయన కుమారుడు శ్యాం దామోదర్ రెడ్డి తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అరుంధతి వంటి చిత్రాలు నిర్మించారు. అంకుశం చిత్రంలో ఎం.ఎస్. రెడ్డి గారు ధరించిన ముఖ్యమంత్రి పాత్రకు మంచి పేరు వచ్చింది.
ఐనా చలనచిత్రాల వల్ల తనకు కలసివచ్చినదానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అంటారు మల్లెమాలగారు. “కొన్ని సందర్భాలలో ఆత్మను చంపుకున్నాను. కృతజ్ఙత అనే పదం సినిమా నిఘంటువులో కాగడాపెట్టి వెదకిచూసినా కనిపించదన్న నిజం తెలుసుకున్నాను. వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోయాను. కొన్ని చీకటితప్పులు చేశాను. సినిమా పరిశ్రమకు రాకముందు నేను ఏ వ్యాపారంలోనూ ఒక్క రూపాయి నష్టపోలేదు. పరిశ్రమకు వచ్చాక కష్టాలు, నష్టాలు నన్ను కొరివిదెయ్యాల్లా వెంటాడాయి. నా ఆస్తులన్నీ హరించుకుపోయాయి” అని చెప్తారు.
మద్రాసు కళాసాగర్ సంస్థకు అధ్యక్షుడుగా పనిచేశారు. సినిమా పరిశ్రమకు చెందిన అనేక సంస్థలలో ముఖ్యపదవుల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షులుగా కొన్నాళ్ళు పనిచేశారు. హైదరాబాదులో శబ్దాలయ పేరుతో రికార్డింగ్ థియేటర్ ఏర్పాటు చేశారు. కవితా వ్యాసంగాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. “మల్లెమాల రామాయణం” అనే పద్యకావ్యం వ్రాసి నలభైవేల ప్రతులు పంచిపెట్టారు. ఇంకో తొమ్మిది పుస్తకాలు (ఆత్మకథ కాకుండా) వ్రాశారు.
ప్రగతి ఆర్ట్స్ ప్రింటర్స్ పరుచూరి హనుమంతరావుగారి ప్రేరణతో మల్లెమాలగారు ఆత్మకథ వ్రాయటం మొదలుబెట్టారు. “ఆత్మకథ వ్రాయటం కత్తిమీద సామువంటిది. యదార్థాలను దాచకూడదు. అబద్ధాలను చేర్చకూడదు” అన్న మల్లెమాలగారు చెప్పిన కొన్ని విషయాలు కొన్నాళ్లపాటు గొప్ప కలవరాన్ని సృష్టించిన మాట నిజం.
మల్లెమాలగారు 2011 డిసెంబరు 11న మరణించారు.
మల్లెమాలగారి కవిత్వంలానే ఈ పుస్తకంలో వచనమూ సాఫీగా, సూటిగా సాగుతుంది. చకచకా చదివిస్తుంది. పద్యాలు చాలానే ఉన్నాయి. చాలా ఆత్మకథలమల్లే ఇందులోనూ ఆత్మస్తుతీ, పరనిందా ఉన్నాయి కానీ రెండూ మోతాదు మించలేదు. మంచి కాగితం, పెద్ద అక్షరాలు, విశాలమైన మార్జిన్లు, చక్కటి ముద్రణ, నాణ్యమైన బైండింగుతో పుస్తకం ముచ్చటగా ఉంది. పేజ్‌కార్నర్లో ఫొటోలను అమర్చటం అందాన్నిచ్చింది. తక్కువే ఉన్నా అచ్చుతప్పులు అక్కడక్కడా ఇబ్బంది పెట్టాయి.
ఈ పుస్తకం ఇక మార్కెట్లో లభించకపోవచ్చు. 2000 ప్రతులు ఏమైపోయాయో. అనధికార ప్రతులు ఇంటర్నెట్‌లో ఇప్పటికీ దొరుకుతున్నట్లున్నాయి.
అన్నట్లు నాకు తెలిసి అమ్మకాలు నిలిపివేసిన తెలుగువారి ఆత్మకథల్లో ఈ పుస్తకం మొదటిది కాదు. కొన్నేళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి ఆత్మకథ కూడా ప్రచురించిన కొన్నిరోజుల తర్వాత మార్కెట్లోంచి వెనక్కి తీసేసుకున్నారు. ఒక మిత్రుడి ద్వారా నేను ఒక కాపీ సంపాదించుకున్నానన్నది వేరే విషయం.
ఇదీ నా కథ
మల్లెమాలఏప్రిల్ 2011
మల్లెమాల ప్రచురణలు
శబ్దాలయ, ఎల్.వి.ప్రసాద్ మార్గ్
బంజారా హిల్స్, హైదరాబాద్ – 34.
244 పేజీలు, 300 రూ.
Mohan
మనస్సుకు హత్తుకున్న ఆత్మ క థ గురించి,’
బాగా వ్రాసారు కానీ,
సుందర మహల్ గూడూరు లో నిర్మించారు
Seeta Rama Raju
నమస్తే,
మీ సమీక్ష చాలా బాగుంది. దయచేసి ఆ internet link ఇవ్వగలరా?
~సీతారామరాజు
VARAPRASAD
EVARO EDO ANUKONTARANI AYANA ATMAKATHALONI SATYALANU MARUGUPARICHENDUKU PUSTAKANNE DORAKKUNDACHEYATAM,JANANNI AVAMANINCHADAME,SYAM PRASADREDDY GARU KOODA ANDULO CHERITE MALLE MALANU INKEVARU TELUSUKUNTARU,AYANA PRAJALAKU TELIYALANEKADA RASINDI,DANNI MEERU PROCCHAHINCHALI KANI MAMMALNI BADAPETTELA CHESARU,AFTOL MAHA AYITE 4 CALLSHEETS POYEVI,KANI IPUDU PATAKULU ENTA NASTAPOYAROTELUSA ,ISTARO CHASTARO TELIYANI CALLSHHTLA KOSAM MEERU VYKTITWANNE PHANAM PETTALA ANNADE NAA PRASANA,,,,,,BABU EVARAINA PUNYAM KATTUKONI KASTA TELUGULOKI MARCHANDI.
Srinivas Nagulapalli
ఓపికతో ఎన్నో విషయాలు, వివరాలతో అందించిన సమీక్షకు జంపాలగారికి కృతజ్ఞతలు.
పిల్లల Halloween Trick or Treat కు candy ఇవ్వకుండా, candy wrappers ఇచ్చినట్లనిపించింది.
“సహజ కవి”, “పద్యం నా ఆరో ప్రాణం” అని చెప్పుకున్న కవి పుస్తకంలో పద్యాలు చాలానే ఉన్నాయి అని చెప్పి మరీ ఊరించి, ఒక్కటంటే ఒక్కటైనా పంచుకోకపోవడం వెలితి. పిల్లలకు candy బదులు wrappers ఇచ్చినట్లుంది. పైగా ఆ పుస్తకం అమ్మరు, ఇంకెట్లా చదవడం! కవి గురించి తన కవిత్వం తప్ప, మిగితా సమస్తం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తెలిసిన రెండు కవితా పంక్తులు చెప్పుకోవడం.
ఆంధ్ర సారస్వత పరిషత్తు, అప్పటి అధ్యక్షులు సినారే పుణ్యమా అని “పరిణతవాణి” అనే పుస్తక రూపంలో వచ్చిన ప్రసంగ పరంపరనుండి కొన్ని పంచుకోవడం.
“పరువ ముడుగకుండ ప్రజల నాల్కలపైన
నవరసమ్ములొలుక నాట్యమాడి
గణుతికెక్కనట్టి కావ్యమ్ము కావ్యమా” అని ప్రశ్నించి, అందించిన చివరి పాదం
“ఒట్టి కాగితాల కట్టగాక” కొసమెరుపు గొల్పుతుంది.
ఉగాది కవితలో అంటారు
“పంచాంగంలో ఉండే వర్షం
పంటలకుపయోగిస్తుందా?
పున్నమి ఘనతను వల్లెవేసితే
అమవస చీకటి పోతుందా?”
రేపటి దీపావళి గురించి మల్లెమాల అంటారు పాటలో
“వెన్నెలరోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమిరోజు”
టంగుటూరి ప్రకాశం పంతులుగారు వారిని కలిసినప్పటి ఉదంతం ఆసక్తికరం. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ రాజాజీ హాలు మెట్ల మీద పాడుతున్న గేయాలు విన్న ప్రకాశంగారు మల్లెమాలతో జరిపిన సంభాషణ, వారి మాటల్లో క్లుప్తంగా…
———————————————–
(ప్రకాశంగారు) “నీ ప్రతిపద్యంలో సహజత్వం ఉంది. నువ్వు నాకొక మాటివ్వాలి. నీ కవిత్వాన్ని జాతి శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తానని” అంటూ చెయ్యి చాచాడు. నేను వణికిపోయాను. అది ఆనందమో, భయమో తెలియదు. ఒక్క క్షణం నిశ్శబ్దం చోటు చేసుకుంది. వెంటనే వెంకట్రామానాయుడుగారు నా భుజం తట్టి “పంతులుగారి ప్రతి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నువ్వు నిజంగా సహజకవివి. ధైర్యంగా మాటివ్వు” అన్నాడు. అప్పుడు ధైర్యం చేసి ఆశువుగా ఈ పద్యం చెప్పాను:
” రాజశ్రీ గురుబంధు తుల్య మనసారన్ నీవు చూపించి న
వ్యాజప్రేమకు నే కృతజ్ఞుడను, నీ వాశించుచున్నట్లు నా
సాజంబైన కవిత్వమున్ సతతమున్ జాతీయ శ్రేయస్సుకై
పూజా పుష్పమొనర్చు వాడను ప్రజామోదానుసారమ్ముగన్” ఆ ఇద్దరూ మహదానందపడ్డారు.
ఆ మరుసటి వారమే వెంకట్రామానాయుడు గారు జమీన్ రైతులో నన్ను “సహజకవి” గా పరిచయం చేశాడు.
———————————————–
నిజంగా అట్లాంటి నాయకులు ఉండేవారా, నిజంగా అటువంటి ఆదర్శాలు ఉండేవా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక తన గురించి తాను చెప్పుకున్న రెండు పద్యాలు
“గణనాథు కరముతో ఫణిరాజు పడగతో
కరచాలనము సల్పు కలము నాది
మిన్నేటి అలలతో మేఘ గర్జనలతో
కలసి గానము జేయు గళము నాది
అక్రమార్జనవలన వక్రమార్గములను
నిలదీసి వెలివేయు నియతి నాది
మూఢవిశ్వాసాలు మూర్ఖ సిద్ధాంతాలు
మదిలోన జొరనీని మతము నాది
వర్ణమేదైన, ఏ దేశ వాసుడైన
సకల మానవులొక్కటే జాతియన్న
పరమ ధర్మమె గమ్యమౌ బాటలోన
నడక సాగించు విశ్వమానవుడ నేను”
చివరగా వారు ఆ ప్రసంగంలో చెప్పుకున్న పద్యం
“అతిగా ఆర్జన చేసి సంతతికి అష్టైశ్వర్యముల్ గూర్చినన్
బ్రతుకింతేనియు ధన్యతన్ గానన్ నాకు లోకమ్మునన్
అతి విఖ్యాతి నొసంగినట్టి కవితన్ ధ్యానించి సేవించి నే
శతజన్మమ్ములకైన మంచి కవిగా జన్మింప వాంఛించెదన్”
——
ఆయన ఆత్మకథ వచనంలో కాక పద్యాల్లో రాస్తే తెలుగు పద్యానికి మరింత మేలు చేసేవారేమో!
ఎందుకంటే, తెలుగువారు తెలుగు పద్యాలు చదవరు కాబట్టి అది నిషేదింపబడే అవకాశాలు తక్కువ.
పోనీ నిషేదించినా, ఫలాన పద్యంలో ఫలాన అన్నారు అని చెప్పడానికైనా ఒకటి రెండు పద్యాలు తెలుగు వాళ్ళు చదివేవారు చెప్పుకునేవారు కాబట్టి తెలుగు పద్యానికి ఇంకొంత ప్రాచుర్యం కలిగేది. ఎటు జరిగినా పద్యానికి మాత్రం మేలు జరిగేది, పద్యం తన ఆరోప్రాణం కాబట్టి ఆయనకూ ఆనందాన్నే మిగిల్చేది అనిపించింది.
===========
విధేయుడు
శ్రీనివాస్
Srinivas Nagulapalli
ఒక అక్షరంలో typo దొర్లింది. మొదటి పాదంలో “చి” కాదు “చు” అని చదువ మనవి. సౌలభ్యంకోసం పూర్తి పద్యం
” రాజశ్రీ గురుబంధు తుల్య మనసారన్ నీవు చూపించు న
వ్యాజప్రేమకు నే కృతజ్ఞుడను, నీ వాశించుచున్నట్లు నా
సాజంబైన కవిత్వమున్ సతతమున్ జాతీయ శ్రేయస్సుకై
పూజా పుష్పమొనర్చు వాడను ప్రజామోదానుసారమ్ముగన్”
అస్పష్టంగా ఉందేమో అని రాయడం. మల్లెమాలగారి వ్యాసం ప్రకారం ప్రకాశం గారే మొదటగా అతనిని born-poet అని అభినందించిన తరువాతనే వెంకట్రామానాయుడుగారు కూడా అంగీకరించి అభినందించి ఆనందించి “సహజకవి” గా పరిచయం చేసారు అన్నట్టుగా ఉంది.
======
విధేయుడు
శ్రీనివాస్
the tree
మంచి రివ్యూ
Nellore Anil Kumar
అంతా బావుంది కానీ జమీన్‌రైతు పత్రిక సంపాదకుడు వెంకటరామిరెడ్డిగారు కాదు నెల్లూరు వెంకట రామా నాయుడు అనుకుంటా…
Sreenivas Paruchuri
Yes, “జమీన్‌రైతు”‘s editor was: నెల్లూరు వెంకటరామానాయుడు. Incidentally the film “raitubiDDa” (1939) was dedicated to him.
kb lakshmi
dear friend,mallemalagaru chaalaa sahrudayulu.ayanatho journalist(as vipula,chathura editor)gaa,litt personalitygaa manchi parichyam.interview chesinapudu,maatladinapudu he was very out spoken.book kuda alage compromise kakunda openga rasaru.nijam epudu nisttooramgaane vuntundi.kumaarudu cine fieldlo vunnaadu kadaa adukemo ban!! kaanee thats wrong.meeru ivvadam baagundi.keep it up
kb.lakshmi
muthevi ravindranath
కొలిచాల సురేశ్ గారి వివరణకు కొంత జతపరచాల్సి ఉంది.మన్నెం అంటే ఎత్తైన కొండ ప్రాంతం అనే అర్థం ఒక్కటే కాదు.మన్నెం అనే తెలుగు పదానికి మూలం ‘మాన్యమ్’ అనే సంస్కృత పదం.రాజులు, జమీందారులు ఎవరినైనా సన్మానించి ఇచ్చిన భూమిని మాన్యం అంటారు.ఎవరికో మాన్యంగా ఇచ్చిన భూమి అయినందున మన్నెం+ఆల–మన్నెమాల అయివుండొచ్చు కూడా.(చూ.చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువు).లింగ+ఆల:లింగాల;మునగ చెట్టు (Moringa oleifera) మీదుగా మునగ+ఆల: మునగాల ;వావిలి (వావిలి చెట్టు- Vitex negundo) +ఆల -వావిలాల ;కాన (అడవి)+ఆల -కానాల ;నంది+ఆల -నంద్యాల మొదలగు గ్రామనామాల్ని విశ్లేషించడం సులువే.అలాగే పేర్(ప్రసిద్ధి గాంచిన ) ఆల -పేరాల, మామిడి ఆల, పొన్న చెట్టు (Calophyllum inophyllum)మీదుగా పొన్నాల వగైరా గ్రామనామాల్ని కూడా తేలిగ్గానే విశ్లేషించవచ్చు.రౌతులపూడి ఉన్నట్లే రాజమండ్రి దగ్గర రౌతు ప్యాల కూడా ఉంది.ఈ ప్యాల,డ్యాల,ట్యాల,మ్యాల వగైరా పదాలతో అంతమయ్యే గ్రామ నామాలను విశ్లేషించడం అంత సులువేం కాదు.పెంట్యాలనే పెంటేల అనీ
అంటారు.(ఉదా: చెస్ క్రీడాకారుడు పెంటేల హరికృష్ణ); పెండ్యాలను పెండేల గానూ వ్యవహరిస్తారు.(ఉదా:పెండేల
వెంకట్రావు).అలాగే కొడిమ్యాలను కొడిమెల అనీ అంటారు (ఉదా: కొడిమెల రామచంద్రమూర్తి).రౌతు ప్యాల లో
గానీ,డ్యాల, ట్యాల,మ్యాల మొదలగు పదాలతో అంతమయ్యే పలు గ్రామనామాలలో అర్థవంతంగా ఆల శబ్దాన్ని విడదీయలేం.న్యాలి కల్లును నేలకల్లు, న్యాలి కొండపల్లిని నేల కొండపల్లి అనడాన్నిబట్టి న్యాలి అనే శబ్దం ‘నేల’కు
పూర్వరూపమని గ్రహించవచ్చు.మంచిర్యాల, ర్యాలి, చీతి ర్యాల (చీరాల) మొదలగు గ్రామనామాలలోని ర్యాలి (ర్యాల) శబ్దం కూడా ఇలాంటిదే. వీటిలో కొన్ని తెలుగు భాష ఏర్పడక పూర్వపు ప్రాగ్ద్రావిడ భాషలలోని శబ్దాలై వుండొచ్చు.కోలమ్ (మిరియాలు) అన్న సంస్కృత శబ్దాన్నుంచి కోలాచలం (మిరియాల గూడెం లాగా మిరియాల కొండ) ఏర్పడి దానినుంచి కోలాచల,కొలచల, కొలచాల,కొలిచాల వగైరా ఇండ్లపేర్లు ఏర్పడి ఉంటాయి.కొలిచాల లో కూడా ఆలను విడదీసి అర్థం చెప్పుకోలేం.అలాగే జంపాల గ్రామనామానికి మూలం జమ్ము(Typhus angustifolia) అనే నీటిలో పెరిగే మొక్క అనీ, రౌతు ప్యాల లాగే జమ్ము ప్యాల అనే గ్రామనామం ఏర్పడి, అదే కాలవశాన జంపాల గా రూపాంతరం చెంది ఉంటుందనీ నా అభిప్రాయం. ఇంతకంటే ఎక్కువ రాస్తే ఇక్కడ అసందర్భంగా ఉంటుంది.
డా.జంపాల గారు మల్లెమాల గారి గ్రంథంలోని వివాదాస్పద విషయాలజోలికి వెళ్ళకుండా ఆ
గ్రంథాన్ని సమీక్షించిన తీరు హృద్యంగా ఉంది.పోతే జంపాల చౌదరిగారు ఎం.యస్.రెడ్డి గారి కుమారుడి పేరు
శ్యాం దామోదర్ రెడ్డి అని పేర్కొన్నారు.కానీ సినిమా ప్రకటనలన్నిట్లో ఆయన పేరు మల్లెమాల శ్యాం ప్రసాద రెడ్డి అని ఉంటుందే! మొత్తానికి రివ్యూ బాగుంది.
— ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.
Jampala Chowdary
శ్యాం ప్రసాద్ రెడ్డి కరెక్టు. థాంక్స్. సవరించుతాను.
శ్యాం దామోదర్ రెడ్డి పాత రోజుల్లో వచ్చిన అపరాధపరిశోధన మాసపత్రికకు సంపాదకుడు (బహుశా ప్రచురణకర్త కూడా).
మా ఇంటిపేరుపై మీ విశ్లేషణకు కృతజ్ఙతలు.
సురేశ్ కొలిచాల
నా అభిప్రాయానికి విపులమైన వివరణను జతపరిచిన ముత్తేవి రవీంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. మల్లెమాల పుస్తక చర్చలో ఈ పదాల చర్చ ఎక్కువగా చేస్తే అసందర్భంగా ఉంటుంది కాబట్టి స్థూలంగా నా సమాధానాలు:
1. బ్రౌణ్యంలో ఇచ్చిన వ్యుత్పత్తులపై నాకంత నమ్మకం లేదు. ద్రావిడ భాషలలో ఇప్పుడు లభ్యముతున్న తులనాత్మక పదజాలం ఆ రోజుల్లో లేదు కాబట్టి బ్రౌన్^ను అంతగా తప్పు పట్టలేం.
2. నేల అన్న పదానికి మీరిచ్చిన వివరణ బాగుంది. ఈ పదానికి తమిళ, మళయాళ భాషలలో సోదర పదాలు (cognates) ఞాల- అన్న తాలవ్య అనునాసికంతో ఉండటం విశేషం.
3. నంది+ఆల అన్న పదాలు తెలుగు సంధుల ప్రకారం నందాæల అవుతుంది (తాటి+ఆకు = తాటాæకు అయినట్టుగానే). అలాగే, పెంటి + ఆల = పెంటాæల అవుతుంది. /æ/ శబ్దానికి తెలుగు లిపిలో ప్రత్యేకవర్ణం లేదు కాబట్టి దాన్ని పెంటేలగా , పెంట్యాలగా రాయడం కద్దు. అయితే, -*ఞాల శబ్దమే తరువాత కాలంలో నేలగానూ, -ఆల గానూ మారి ఉండవచ్చననుకుంటే, ఈ పదాల్లో ఞాల శబ్దపు ప్రాచీన రూపాన్ని య-వత్తుతో మనకు సూచిస్తూ ఉండవచ్చు.
4. నా దృష్టిలో కొలిచాలకు కోలాచాలానికి సంబంధం లేదు. వివరాలకు మల్లినాథ సూరి ఇంటి పేరు గురించి జరిగిన చర్చలు చూడండి. ఆయన పుట్టిన ఊరు కొలచెలమ (మెదక్ జిల్లాలోని ఇప్పటి కొల్చారం). కొల- అన్న పదంతో ప్రారంభమయ్యే తెలుగు ఊర్లు, తెలుగు ఇంటిపేర్లు చాలా ఉన్నా (ఉదా: కొలను, కొలనువాటి, కొలనువాడ, కొలసాని, కొలిత, కొలిపాక, కొలిపాకుల, కొలనుపాక) కొలచెల(మ)- ను కోలాచలంగా మార్చి దానికి కోలా = వరాహం; అచలం = కొండ; పందికొండ అని గాని, మిరియాల కొండ అని అర్థాలు చెప్పడం ఆ రోజుల్లోని అమిత సంస్కృతీకరణను (rampant Sanskritization) సూచిస్తుంది నా నమ్మకం.
5. మీరు చెప్పిన అర్థంలో జంపాల అన్నపేరు గల ఊరు ఆంధ్రదేశంలో ఉన్నట్టు నాకు తెలియదు. జంపాల అన్న పదానికి “పొడుగైన కాయగల ఒకరకపు పార” అన్న అర్థం కూడా ఉన్నది. కత్తి-, కొడవలి- (కొడవళ్ళ), గొడ్డలి- వంటి ఇంటిపేర్లలాగే జంపాల అన్న ఇంటిపేరుకు ఆ పేరుతో ఉన్న పనిముట్టుకు సంబంధం ఉందని నా ఊహ.
muthevi ravindranath
ప్రియమైన సురేశ్ గారూ!
గ్రామనామాల వ్యుత్పత్తి పై మనం చేసే ఊహలు వీలైనమేరకు శాస్త్రీయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మూలరూపాలను ఇదమిత్థంగా నిర్దారించలేని సందర్భాల్లో పలు ప్రతిపాదనలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కనుకనే మనం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాల్సి ఉంటుంది.
నరి (నక్క)మెట్ట నర్మెట్ట (అంటే నక్క కొండ -వరంగల్ జిల్లా), దోమ కొండ (నిజామాబాద్ జిల్లా),నందికొండ (నల్గొండ జిల్లా) ఉన్నట్లే, గీసర (అంటే ఓ విధమైన లేడి) మీదుగా గీసర కొండ (గీసు కొండ) ఏర్పడినట్లే , ఇంకా పంది పాడు ఉన్నట్లే పంది కొండ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
కొలిచాల పూర్వ రూపం ‘కొల్లి (కొలను)చాల’ కూడా అయి వుండొచ్చు.ఎందుకంటే వెలిచాల అనే గ్రామనామమూ మనకి ఉంది.వెలి అంటే’ బయటి’ అనే అర్థంలో అది ఏర్పడిందనుకుంటే ‘చాల’ శబ్దానికి అర్థమేమిటో ఆలోచించాలి.
ఈ చర్చ ద్వారా మీ విలువైన అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉన్నప్పటికీ ఇది మీరన్నట్లు అసందర్భమే కాగలదు. నా ఇ-మెయిల్ ఐడి ‘ravindranath52@gmail.com’. మనం తరచు విద్యుల్లేఖల ద్వారా సంభాషించుకుందాం.నా ప్రతిపాదన మీకూ ఆమోదయోగ్యమే అనుకుంటాను.
మీ,
ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.
sarma
మిత్రులందరికి నమస్కారం,
గ్రామ నామాల ఉత్పత్తి, అపభ్రంశాలు వగైరా సంగతులన్నీ “కైఫీయత్” లలో దొరుకుతాయి. ఇవి ఎక్కడ ఉంటాయన్నది పూర్తిగా చెప్పలేను కాని బ్రవున్ గ్రంధాలయం కడపలో దొరకచ్చు. ఇది మీకు తెలిసిన సంగతే అయివుండచ్చు. గుర్తు చేస్తున్నానేమో!
SIVARAMAPRASAD KAPPAGANTU
Mark Twain was right when he ordained that his autobiography should be published only after 100 years from his death. His Autobiography was published recently both as book and audio book.
Truth is always bitter and hats off to Shri M S Reddy for being forthright and frank, the sentiments of the so called “Fans” notwithstanding. “Fans” anyhow have been spoiling the “acting” (if any) of their “heros” and if they start flexing their imagined muscles w.r.t. autobiographies also, its highly objectionable and should be condemned by everybody who think they believe in free expression.
Ramarao Kanneganti
I didn’t find anything that could cause consternation — why did the son recall the books?
Jampala Chowdary
సినిమావ్యక్తుల గురించిన సంచలనాత్మక విషయాలకు వచ్చిన ప్రచారంలో ఆసక్తికరమైన ఆయన జీవనప్రస్థానం పూర్తిగా విస్మరించబడింది. అందుకని ఈ పరిచయంలో దృష్టి, మసాలా విషయాల కన్నా, ఆయన జీవితకథపైనే ఉంచాను. తన సినిమాల అనుభవం గురించి నేను ఉటంకించిన ఆయన మాటలు చాలు అనిపించింది. ఇంటర్నెట్‌లో వెతికితే వివాదాస్పదమైన విషయాలన్నీ ఇప్పటికీ దొరకవచ్చు. అప్పటి TV9 ప్రసారం, Times of India లంకెలు ఇస్తున్నాను. చిరంజీవి, జూ.ఎన్టీఆర్, గుణశేఖర్, రాజశేఖర్ వంటి ప్రస్తుత సినీ ప్రముఖులతోనూ, ఎన్టీఆర్, జమున, శోభన్‌బాబు వంటి పాత తరం ఆర్టిస్టులతోనూ తనకు కలిగిన అనుభవాలను(మంచీ, చెడ్డా కూడా) నిర్మొహమోటంగానే వ్రాశారు. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏం ఇబ్బందులు వచ్చాయో?
సురేశ్ కొలిచాల
మన్నెం అంటే ఎత్తైన ప్రదేశం. -ఆల అంటే నివసించే ఊరు. నెల్లూరు జిల్లా చిట్టమూరుమండలంలో మన్నెమాల అనే ఊరు ఉంది.
-ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్ని ఉదాహరణలు.