బాలమేధావి – ఆసక్తికరమైన శాస్త్ర విజ్ఞాన కథలు
ఈ పుస్తకాన్ని మొదటిసారి నా చిన్నప్పుడు ఇంటూరు లైబ్రరీలో చదివాను. ఈ పుస్తకంలో ఉన్న మూడు కథల్లో రెండు కథలు – బాలమేధావి, గాంధీలోకం కథలు అప్పటినుంచీ బాగా గుర్తుండిపోయాయి. ఈ కథల అనువాదకుడు పాలగుమ్మి పద్మరాజు అన్న విషయం కూడా అలాగే గుర్తుంది. మూల రచనల వివరాలు తెలీకపోయినా, అమెరికా వచ్చాక ఈ కథలు ఇంగ్లీషులో ఎక్కడైనా తగులుతాయేమోనని చూసేవాణ్ణిగాని, ప్చ్, దొరకలేదు. ఒక ఇండియా ట్రిప్పులో, బెజవాడలో ఒక పాత పుస్తకాల కొట్టులో ఈ పుస్తకం కనిపిస్తే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ముచ్చటపడి కొనుక్కొన్నాను. ఈ చిన్న పుస్తకం ఇప్పటివరకూ వేరే పుస్తకాల మధ్య దాక్కుండిపోయి ఈ మధ్యే కనిపించింది.
ఈ పుస్తకంలో మూడు శాస్త్ర విజ్ఞాన కథలు (తెలుగులో చెప్పాలంటే సైన్స్ ఫిక్‌షన్ కథలు అన్న మాట) – బాలమేధావి, ఫెస్సెండన్ సృష్టించిన విశ్వం, గాంధీలోకం ఉన్నాయి:. ఈ పుస్తకం చదివేనాటికి నేను ఎక్కువ సైన్స్ ఫిక్‌షన్ చదువలేదు. జూల్స్‌వెర్న్, హెచ్.జి.వెల్స్‌ల పుస్తకాలు, డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్, ఫ్రాంకెన్‌స్టీన్ వంటి కథలు మాత్రమే పరిచయం. ఈ కథల్లో ఉన్న వైవిధ్యం నన్ను ఆకట్టుకొంది. ఈసారి చదివినప్పుడు, అనువాదం చాలా సరళంగా ఉండటం, మూలంలో ఉన్న హాస్యాన్నీ, చమత్కారాన్నీ ఒడుపుగా తెలుగులోకి తేవడం కూడా కారణాలై ఉండవచ్చు అనిపించింది.
మొదటి కథ బాలమేధావికి మూలం సి.ఎం. కార్న్‌బ్లత్ (C M Cornbluth) వ్రాసిన గోమెజ్ (Gomez) అనే కథ. మన శ్రీనివాస రామానుజం వంటి బాలమేధావి కథ (శ్రీనివాస రామానుజం ప్రసక్తి ఈ కథలో వస్తుంది. అతనే ఈ కథకు స్ఫూర్తేమో అన్న అనుమానం వచ్చింది). ఒక పత్రికా విలేఖరికి భౌతిక, గణిత శాస్త్రాల్లో అసమానమైన ప్రజ్ఞ కల ఒక పదిహేడేళ్ళ పిల్లవాడి గురించి యాదృచ్ఛికంగా తెలుస్తుంది. ఆ పిల్లవాడు అమెరికా అణ్వస్త్ర పరిశోధనా సంస్థలో బలవంతంగా చేర్చబడడానికి ఈ విలేఖరి పరోక్షంగా కారణమౌతాడు. ఆకలిదప్పులు మరచి, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని కనిపెట్టడంలో ఆ పిల్లవాడు పూర్తిగా మునిగిపోవడం ఈ విలేఖరికి ఆశ్చర్యాన్నీ, భయాన్నీ కలుగజేస్తుంది. ఇంతలో కథ ఉన్నట్లుండి అనుకోని మలుపు తిరుగుతుంది. ఈ కథ ఆంగ్లమూలం అంతర్జాలంలో ఇక్కడ దొరుకుతుంది.
రెండో కథ ఫెస్సెండన్ సృష్టించిన విశ్వం కూడా బాగా ప్రసిద్ధి పొందిన కథ. సైన్స్ ఫిక్‌షన్ బాగా చదివే వాళ్ళకు ఎడ్మండ్ హామిల్టన్‌తోనూ, ఆయన వ్రాసిన ఈ కథతో (Edmond Hamilton – Fessenden’s Worlds) ఇప్పటికే పరిచయం ఉందవచ్చు. హామిల్టన్ సైన్స్ ఫిక్‌షన్ తొలిదశలోని గొప్ప రచయితల్లో ఒక్కడుగా గుర్తింపు పొందిన రచయిత. బ్రాడ్లీ అనే భౌతిక శాస్త్రజ్ఞుడు చాలా కాలం తర్వాత తన పూర్వ సహాధ్యాయి ఫెస్సెండన్ ని కలవటానికి అతని లేబరేటరీకి వెడతాడు. అక్కడ ఫెస్సెండెన్ తాను సృష్టించిన ఒక అద్భుత ప్రపంచాన్ని బ్రాడ్లీకి చూపిస్తాడు. గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా మాయమైన క్షేత్రాన్ని రెండు రేకు పళ్ళాల మధ్య సృష్టించి, ఆ శూన్యంలో కొత్త ఖగోళ ప్రపంచాన్ని తయారు చేయగలిగాడు ఫెస్సెండన్. పరిణామంలో చిన్నగా ఉన్నా ఖగోళంలో ఉన్న అనేక విశ్వాలవంటిదే ఈ కొత్త విశ్వం కూడాను. ఇందులోనూ నక్షత్రాలూ, సౌర కుటుంబాలు, గ్రహాలు పుట్టి పెరిగి నశిస్తుంటాయి. ఐతే ఈ గ్రహాల సృష్టి స్థితి లయాలు ఫెస్సెండెన్ చెప్పుచేతల్లో ఉంటాయి. ఇంతటి శక్తి ఒక మనిషి చేతిలో ఉండటంలోని మంచి చెడ్డల గురించి, మన ప్రపంచపు అస్తిత్వాన్ని గురించి, భవిష్యత్తు గురించి ఆలొచనలు రేకెత్తించే కథ. ఈ కథ ఆంగ్ల మూలం ఇక్కడ.
మూడో కథ గాంధీలోకం. అండ్ దెన్ దేర్ వర్ నన్ (And Then There Were None) అన్న పేరుతో ఎరిక్ ప్రాంక్ రస్సెల్ (Eric Frank Russell ) మంచి తమాషాగా వ్రాసిన కథ. కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఒక దూరగ్రహం మీద జరిగే కథ. అప్పటికి ఎన్నో ఏళ్ళుగా ఖగోళయానం తేలికగా, అందరికీ అందుబాటులో ఉంది. భూలోకం నుంచి దూరగ్రహాలకు మనుషులు వలసలుగా వెళ్ళారు. భూలోకం ప్రపంచమంతటా ఆధిపత్యం చెలాయిస్తుంది. దూరంగా ఉన్న ఒక గ్రహం పైన భూలోకం నుండి వచ్చిన ఒక యుద్ధనౌక దిగుతుంది. దూరంగా ఉన్న గ్రహాలను పరిశీలించి, అక్కడ ఉన్నవారిపై భూమి ఆధిపత్యాన్ని ప్రతిష్టింపచేయడం ఆ నౌకాయానపు లక్ష్యం. నౌకను నడిపే సిబ్బంది, నౌకలో వచ్చిన భూలోకపు రాయబారి అదుపాజ్ఞలలో ఉంటారు. ఈ గ్రహం మీద మాత్రం వారికి ఒక వింత పరిస్థితి ఎదురవుతుంది. ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో, ఈ లోకపు ముఖ్యపట్టణమేమిటో తెల్సుకొందామంటే వీల్లేకుండా పోతుంది. వారికి కనిపించిన పౌరులంతా, వింతగా, లెక్కలేనితనంతో ప్రవర్తిస్తుంటారు. గట్టిగా అదమాయిస్తే అవామొమో అనేసి పోతారు. ఈ గ్రహం వివరాలు తెలుసుకోవటానికి సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తారు. చివరికి తెలిసేదేమిటంటే ఈ గ్రహవాసులందరూ గాంధేయులు. గాంధీ గారి సహాయనిరాకరణ సిద్ధాంతాన్నీ, స్వేచ్ఛాజీవిత నిర్వచనాన్నీ పూర్తిగా నమ్మినవాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నవారు. వాళ్ళ మంత్రం ఒక్కటే – స్వే. నే. చే (స్వేచ్ఛ – నేనా పని చేయను). ఏ పని చేయడానికైనా చేయకుండా ఉండటానికైనా ప్రతి వ్యక్తికీ పూర్తి స్వేఛ్ఛ. ఇష్టం లేకపోతే, నేనాపని చేయను అని చెప్పటమే. అందరూ సమానులే. డబ్బు, పరిపాలన, విధేయత అన్న మాటలు వాళ్ళకి తెలీదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం మొమో (మొగమోటం) అనే మార్పిడి పద్ధతి (బార్టర్ సిస్టం) మీద ఆధారపడుతుంది. యుద్ధనౌకనుంచి తీరపు సెలవుపై ఈ గ్రహం మీదకివెళ్ళిన సిబ్బందిలో సగం మందికి ఆ సమాజం పద్ధతులు నచ్చి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకొంటారు. దీనితో బుర్రతిరిగిన రాయబారి, నౌక కెప్టెన్‌లకు పెద్ద సమస్య ఎదురవుతుంది. ఈ కథలో వర్ణనలు, సంభాషణలు గొప్ప చమత్కారంగా ఉండి తెగ నవ్వు పుట్టిస్తాయి – అనువాదంలో కూడా. ఈ కథ ఆంగ్ల మూలం ఇక్కడ. (And then there were none అన్న పేరుతోనే అగాతా క్రిస్టీ నవల కూడా ఒకటి ఉంది; ఆ నవల బ్రిటిష్ ఎడిషన్‌కు Ten Little Indians అనే వేరే పేరు కూడా ఉంది; గుమ్నామ్ అనే పాత హిందీ సినిమాకి ఈ నవల మూలం).
ఈ మూడుకథల్లో శాస్త్ర విజ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడింది ఫెస్సెండన్ సృష్టించిన విశ్వం ఒక్కటే. మిగతా రెండిటిలోనూ శాస్త్ర విషయం కన్నా ఆ కథలు రేపే తాత్విక ప్రశ్నలు ముఖ్యం. మూడు కథల్లోనూ, శాస్త్ర విజ్ఞానం పెరుగుదలపట్ల, అధికార దుర్వినియోగం పట్ల అనుమానమూ, తిరస్కార దృష్టి ఉండటం గమనార్హం. మంచి కథలకు ఉండవలసిన లక్షణాలు – ఉత్కంఠ కలిగించే కథా వస్తువు, తాత్వికమైన ఆలోచనలని రేకెత్తించడం, ఆకర్షణీయమైన శైలి – ఈ మూడు కథల్లో ఉన్నాయి. అందుకే ఇన్నేళ్ళపాటు గుర్తున్నాయి.
తెలుగులో ఇప్పటికీ సైన్స్ ఫిక్‌షన్ కథలు తక్కువే. కె.ఆర్.కె మోహన్, కె.సదాశివరావు ఈ దిశలో కొన్ని ప్రయత్నాలు చేశారు. మల్లాది, యండమూరి కొన్ని నవలలు వ్రాశారు. అమెరికానుంచి వేమూరి వెంకటేశ్వరరావుగారు కొన్ని మంచి సైన్స్ ఫిక్‌షన్ కథలు వ్రాశారు (కించిత్ భోగే భవిష్యతి – వంగూరి ఫౌండేషన్ ప్రచురణ – లోనూ, వేమూరిగారి వెబ్‌సైట్లోనూ దొరుకుతాయి). ఈ మధ్య రమణ జీవి (చివరి మనిషి, నవ్య, తెలుగునాడి, కథ-2004), అనిల్ రాయల్ (నాగరికథ – ఆంధ్రజ్యోతి, తెలుగునాడి, కథ-2009) వ్రాసినవి మంచి సైన్స్ ఫిక్‌షన్ కథలు చదివాను.
ఈ పుస్తకాన్ని దక్షిణ భాషా పుస్తక సంస్థ (The Southern Languages Book Trust) ఆధ్వర్యంలో ప్రచురించారు. ఈ సంస్థ వెనుక బాపుగారి గురుతుల్యుడు, పుస్తకప్రియుడు, ఫోర్డ్ ఫౌండేషన్ దక్షిణ భారత ప్రతినిధి ఆర్టూర్ ఐసెన్‌స్టీన్ ఉన్నారని విన్నాను. వేల్చేరు నారాయణరావు మాస్టారు కూడా ఈ సంస్థని నడిపినవారిలో ఉన్నట్టు గుర్తు. 1960లలో ఈ సంస్థ సహకారంతో చాలా తెలుగు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఈ పుస్తకం మూడు వేల కాపీలు ప్రచురించటం ఆశ్చర్యమే. అచ్చు తప్పులు లేనట్లే. మూల రచనల వివరాలు వివరంగా ఇవ్వటం అభినందనీయం.
ఈ పుస్తకం అనువాదకులుగా ఇద్దరి పేర్లున్నాయి. శ్రీమతి ఏ.సి.కృష్ణారావుగారి గురించి ఇంతకు ముందు వినలేదు. పాలగుమ్మి పద్మరాజుగారు అందరికీ తెలిసినవారే. అనువాదం చాలా బాగుంది. తర్వాత రోజుల్లో పద్మరాజుగారి కొన్ని పుస్తకాల్లో – బ్రతికిన కాలేజీ, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన వంటి పుస్తకాల్లో – ఉన్న చమత్కారధోరణి ఈ అనువాదంలో కూడా కనిపిస్తుంది.
ఎక్కడన్నా (లైబ్రరీల్లోనో, పాత పుస్తకాల కొట్లలోనో) మీకు ఈ పుస్తకం దొరికితే తప్పకుండా చదవండి. దొరకకపోతే, ఇంగ్లీషు మూలాల లింకులు ఎలాగూ పైన ఇచ్చాను.
* * *
బాలమేధావి – ఇతర శాస్త్ర విజ్ఞాన కథలు
మార్చ్ 1964
అనువాదం: శ్రీమతి ఏ.సి. కృష్ణారావు, పాలగుమ్మి పద్మరాజు
విజయా పబ్లికేషన్స్, మద్రాసు -17
215 పేజీలు.
Snigdha
chana baga rasaru
Madhu
Thank you Dr Chowdary Garu. We had 5 meetings in Zilla Parishad Schools to crete Scientific Temper in students this week. The speaker was Shri C V Sarveswara Sarma from Konaseema Science Parishat. He gave 1825 lectures to students and wrote more than 8,000 articles on Science. I will try for this book, if not I have to borrow from you. I would like to get this book printed and make students to read. My goal is to make 10 Scientists every year from Kankipadu Mandal starting from 2020.
సౌమ్య
కథల ఆంగ్ల మూలాలకి లంకెలు కూడా ఇచ్చినందుకు థాంక్స్. రెండు కథలు చదివాను.
1) గోమెజ్ – క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపించింది. ఇక, బహుశా రామానుజన్ స్పూర్తి తో రాసినదే ఏమో అని నాకు అనిపించింది. ఈ కథ గురించిన రివ్యూలలో కూడా ఆ ప్రస్తావన చదివాను నిన్న.
2) Fessenden’s Worlds” – మీరిచ్చిన గూగుల్ బుక్స్ లంకెలో మూడు పేజీలు ప్రివ్యూలో లేవట. కానీ, ఆ మూడు పేజీలు లేకుండా కూడా కథ చాలా నచ్చింది నాకు. వీలైతే మొత్తం కథ దొరకబుచ్చుకోవాలి. అలాగే, ఈ రచయిత రాసిన తక్కిన కథలు కూడా చదవాలి అనిపించింది. థాంక్స్.
Indrani
Thank you s………..o much for the links.
Srinivas Vuruputuri
జంపాల చౌదరిగారికి బోలెడన్ని కృతజ్ఞతలు. ఇప్పుడెక్కడా కనబడని పుస్తకాన్ని పరిచయం చేసినందుకు. మా బాల్యస్మృతులను తట్టిలేపినందుకు. “తెలుగు పుస్తకపు ప్రతులు దొరకవేమో” అని హెచ్చరించి మా పిల్లల కోసం ఇంగ్లీషు కథల లింకులు ఇచ్చినందుకు.
అంతకన్నా ముఖ్యంగా, ఎన్నెన్నో పనుల నడుమ వీలు చేసుకొని ఏకదీక్షగా పుస్తక పరిచయాలు చేస్తున్నందుకు.
శ్రీనివాస్