27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]
ప్రవహించే జ్ఞాపకం-కాలం. ఆకాలంలో తరాల వెంకటగిరి రాజుల చరిత్ర నిక్షిప్తమై ఉంది. 1875లోనే 27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర వెలుగులోనికి తీసుకువచ్చిన అపురూప గ్రంథం – ’బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ది రాజాస్ ఆఫ్ వెంకటగిరి’. ఈ గ్రంథాన్ని టి.రామారావు మద్రాసు ఆషియాటిక్ ప్రెస్ లో 132ఏళ్ళ క్రితమే ముద్రించారు. 96పేజీల ఈ ఆంగ్ల గ్రంథం రాజుల ప్యాలెస్ రికార్డుల మేరకు తయారుచేశారు. అప్పట్లో సర్వజ్ఞ కుమార యాచేంద్ర రాజా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు వారి దర్బారులో ఈగ్రంథంతో పాటు వారసత్వంగా వస్తున్న అపురూపమైన రెండు కత్తులను బహుకరించారు. మద్రాసు హైకోర్టు వకీలుగా పనిచేస్తున్న రామారావు – చారిత్రక అంశాలు, 27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర, సంఘటనలతో దీన్ని అపురూపంగా మలిచారు. ఈపుస్తకంలో పేర్కొన్న ప్రకారం వెలుగోటివారు తెలంగాణా నుండి రాయలసీమకు, అక్కడనుండి వెంకటగిరి పాలకులుగా వచ్చినట్లు తెలుస్తోంది. 1802 ఆగస్టులో లార్డ్ క్లైవ్ ఈకుటుంబంతో శాశ్వత ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం జమీందారు హోదాతో జమీందారు వంశస్తులుగా గుర్తించారు. సంవత్సరానికి లక్షా పదకొండువేల యాభై ఎనిమిది నక్షత్ర పగోడాలను సంస్థాన శిస్తుగా నిర్ణయించారు. మద్రాసు ప్రెసిడెన్సీకి అతి ముఖ్యమైన ప్రదేశంగా, జమీందారీగా వెంకటగిరి సంస్థానం నిలిచింది. వెంకటగిరి సంస్థానంలో తొమ్మిది తాలూకాలుండేవి.
Leave a Reply