అనువాదకుడి మరణం

వ్రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
********
కేశవరావు గారి సంస్మరణలో

జీవితంలో మనం నమ్మలేని విషయాలు ఎన్నో, అలాగే , మన సన్నిహితుల మరణం. మనమెంతో ప్రేమించిన వారిని మృతి, మెరుపులా ఒక్కసారి కబళించి, కేవలస్మృతిగా మార్చివేస్తే మనం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాము. ద్రవించి పోతున్న మన హృదయంలో వారి జ్ఞాపకం మాత్రం అస్తమించే సూర్యబింబంలా సజీవంగా నిలిచి పోతుంది.

హిందూపురంలో అనువాదాల కర్మాగారం ఒక పనివాడి చేతిలో ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను, అదృష్ట వశాత్తు , నాకు ఆంగ్లం బోధించిన అధ్యాపకుడు ఆ నిపుణమతికి సన్నిహితుడు అని తెలిసి ఆనందించాను. నా ప్రమేయం లేకుండానే , నా అనువాదాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి అని ఆ ఉద్దండుడు తెలిపారని తెలిసి సంతోషించాను. రెండు పదుల వయస్సులోని తాజాతనం, నిలువని మనసు, నా దారి వెతుక్కోవడంలో నేను నిమగ్నమై పోయాను.

ఇస్మాయిల్ గారి ముఖతః మళ్ళీ కేశవుల గురించి నేను వినడం, వారి అనువాదాలు అమెరికాలో వీలయితే ప్రచురించగల అవకాశాలను అన్వేషించమని ఆనతి .. గురువుగారి జీవితకాలంలో అది నెరవేరలేదు. అప్పటికే, కేశవరావుగారు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నారు, ఎలాగోలా నలుగురం పూనుకొని , ఆ పని చేయగలిగాము. Tree,My Guru, పుస్తకం వెలువడిన రోజు కేశవరావుగారు ఎంతో ఆనందించారు. ఇస్మాయిల్ కవితలు పుస్తక రూపంలో రావడానికి ముందు , నాలుగు పేరుపొందిన పత్రికల్లో అనువాదాలు చోటు చేసుకొంటే బావుంటుందని నా ఆలోచన. మొత్తానికి, కొంత ఆలస్యంగా , CIRCUMFERENCE అన్న అనువాద పత్రికలో ‘Tree, my Guru, (చెట్టు నా ఆదర్శం) కవిత వచ్చింది , గొప్ప విషయం ఏమిటంటే , అనువాదంతో పాటు తెలుగు లిపిలో మూల కవితను కూడా ముద్రించారు. ఈ అనువాద పత్రిక ప్రతులు అందిన మరుక్షణమే, వారెంతో ఉద్వేగానికి లోనయి రాసిన వాక్యాలు మరచి పోలేను.

మా చర్చల్లో , తరచూ చోటు చేసుకొనేవి , అనువాదకుల సాధకబాధకాలు. వారికి సాహిత్యంలో ప్రతీ అంశం మీద నిశ్చితాభిప్రాయం ఉన్నప్పటికీ ఎప్పుడో గాని వెల్లడించే వారు కాదు. ఇస్మాయిల్ గారితో సహా హైకూలు ఎవరివీ పెద్దగా నచ్చేవి కావు అవి జపనీయులకే సాధ్యం అంటూ ఉండేవారు. వారు నిలువెత్తు అనువాదకులు, చదివినది గ్రహించి పల్లెత్తు తేడా రాకుండా తర్జుమా చేయడంలో అందె వేసిన చేయి. ఘంటసాల గొంతులో ఆంధ్రపత్రిక సంపాదకీయం కూడా గానయోగ్యం అయినట్టే, తెలుగులో కవిత్వం కాని రాతలు కూడా ఆంగ్లంలో కవిత్వ గుణాన్ని సంతరించుకొనేవి. కేశవుల శంఖంలో పడిన పద్యం కవిత్వ తీర్థం కావలసిందే.

ప్రతి క్షణం కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అన్న ప్రయత్నంలో చాలా open-mind తో ఉండేవారు. అనువాదాల్లో , సిద్ధాంతాల కన్నా మూల విధేయంగా ఉండడం ముఖ్యం ;open-mind తో ఉండటం చాలా ముఖ్యం అని పలు సందర్భాల్లో చెప్పగా నాకు గుర్తున్నది. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి అనువాదాలు ఆయనకు ఎంతగానో నచ్చినవి , వాటిమీద ఒక పరిశోధక వ్యాసం రాస్తూ ఉన్నారు. అంత చక్కటి ఇంగ్లీష్ , వారికి ఎలా పట్టుబడిందో నా ఊహకందని విషయం. చిన్న ఉత్తరం ముక్కలో కూడా,సలక్షణమైన ఆంగ్లం తొంగి చూసేది.అనువాదాల్లో పరకాయ ప్రవేశం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

వారు ఎన్నో కష్టసాధ్యమైన పనులు చేపట్టారు, ఇటీవలి కాలంలో తెలుగు యువకవుల కవిత్వాన్ని అనువదించి యావద్భారతానికి పరిచయం చేశారు. Indian లితెరతురె సాహిత్య పత్రికలో ఎన్నో కవిత్వానువాదాలను వెలయించారు. తెలుగు జాతి అనువాదంలో ఉన్న పెద్ద దిక్కును కోల్పోయింది. తెలుగు సాహిత్య మాగాణంలో నిత్య కృషీవలులకు పెద్ద గుర్తింపు లేదు. పెద్ద వయసులో తమ బాధ్యతలు నెరవేర్చుకొంటారా ? సాహిత్య పిపాసను నిలబెట్టుకొంటారా ?? సంపన్న
దేశాల్లో , జీవితకాల కృషి చేసిన కవులకు , అనువాదకులకు మంచి గుర్తింపు ఉన్నది, వారి సహాయార్థం, ఎన్నో సంస్థలు ధారాళంగా నిధులు సమకూర్చుతున్నవి. తెలుగులో, ఉడతా భక్తిగా , బ్రౌన్ పురస్కారం మొదలు పెట్టడానికి కారణం కేశవరావు గారి అవిరళ అనువాద కృషియే. తమ బాధ్యతను నేరవేర్చుతున్న పెద్దలను గౌరవించడం జాతి కర్తవ్యం.

మా పరిచయం ఉత్తరాలకు , మాటలకు మాత్రమే పరిమితం, ఎన్నోసార్లు ,కలవాలి అనుకొన్నా కలవ లేకపోయాను. గత కొద్ది సంవత్సరాలుగా వారిని బాధించినవి అనేకం, అనారోగ్యం అందులో ఒకటి మాత్రమే..నాలుగయిదు నెలలుగా, నానా పనుల్లో , తలమునకలుగా ఉండి వారితో మనసారా మాట్లాడలేక పోయాను. ఇకపై మాట్లాడటానికి అక్కడ ఎవరున్నారు ?? వచ్చిన పని ముగించుకొని, కలవలేని లోకాలకు తరలి పోయారు. ఎంతో ఆప్యాయత కురిపించే -వినయం ఉట్టిపడే-మృదువైన కంఠ స్వరం ఇకపై వినిపించదు.

అనువాదకుడి కళ కనిపించడంలో కాదు కనుమరుగవడంలోనే ఉంది.

తమ్మినేని యదుకుల భూషణ్
7 మే 2012

(వ్యాసానికి జత చేసిన ఫొటో కేశవరావు గారు సి.పి.బ్రౌన్ పురస్కారం అందుకుంటున్నప్పటిది. ఫొటో అందించినందుకు ముకుందరామారావు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

One Comment

  1. anwar

    శ్రీ కేశవ రావు గారి గురించి దాదాపు మూడు సంవత్సరం మరి కొన్ని నెలల క్రితం నించి వింటూ వస్తున్నా మిత్రులు నాయుని కృష్ణమూర్తి గారి ద్వారా, నిన్నే ఆయన కథలతొ అనంద భైరవి అనే కథా సంకలనాన్ని కూడా అందుకున్నా, తనగురించి వ్రాస్తూ పీజీ వొఢౌస్ గారితొ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపారని తెలుసుకుని అదిరా.
    ఆయన మిత్రులకోసం లేదా ఆయన రచనలు చదవాలని అనుకునే వారికోసం ఈ సమాచారం ఆయన వ్రాసిన ఎనిమిది కథల తొ ఆచ్చైన పుస్తకం ‘ఆనంద భైరవి’ బహూశా ఏ పుస్తకాల షాపులోనూ అంత వీజీగా దొరక్క పోవచ్చు కావల్సిన వారు 08581-256090 లొ సంప్రదించండి

Leave a Reply