పొత్తూరి విజయలక్ష్మి రచనలు

తెలుగునాడి పత్రిక తొలి రోజుల్లో ప్రతి సంచికలోనూ ఒక హాస్యకథను ప్రచురించాలని ప్రయత్నించాము. ప్రతి నెలలో వచ్చిన తెలుగు పత్రికలన్నిటిలోనూ మంచి (అంటే మా అభిరుచికి సరిపడే అని అర్థం) హాస్యకథలకోసం వెతికేవాళ్ళం. తెలుగులో హాస్యం కన్నా అపహాస్యమే ఎక్కువ అని తెలిశాక ఆ ప్రయత్నం మానేశామన్నది వేరే సంగతి. ఆరోజుల్లో పొత్తూరి విజయలక్ష్మిగారి కథలు కొన్ని నచ్చాయి; తెలుగునాడిలో ప్రచురించాము. అంతకు ముందు ఆమె కథలు ఎక్కువ చదివినట్లు గుర్తులేకపోయినా, శ్రీవారికి ప్రేమలేఖ అనే విజయవంతమైన జంధ్యాల / ఉషాకిరణ్ మూవీస్ చిత్రానికి ఆమె వ్రాసిన ప్రేమకథ అనే నవల మూలమని తెలుసు. కొన్నినెలల క్రింద నవ్య పత్రికలో ఆమె ఇంటర్వ్యూ చదివినప్పుడు ఆవిడ కథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది.

ఫిబ్రవరి ఇండియా ప్రయాణంలో, విజయలక్ష్మిగారివి నాలుగు పుస్తకాలు దొరికాయి: ఒక నవల (ప్రేమలేఖ), మూడు కథల పుస్తకాలు (మా ఇంటి రామాయణం 2009; ఆనందమే అందం 2010; పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు 2011). చంద్రహారం అనే కథల సంపుటం, ఆత్మకథ (?) అనే పుస్తకం కూడా వచ్చాయట కాని నాకు దొరకలేదు.

విజయలక్ష్మిగారు గుంటూరు జిల్లలో యాజలి అనే గ్రామంలో పుట్టారు; గుంటూర్లో పెరిగారు. 1970లో వివాహమైన తర్వాత రైల్వేస్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీవారితో బీహార్ రాష్ట్రంలో బహుకాలం ఉన్నారు. అక్కడ ఉండగానే కథలు వ్రాయటం మొదలు పెట్టారు. ఆంధ్రప్రభ వారపత్రికలో 1982లో ప్రచురింపబడ్డ మరికొద్ది వారాలలో అన్న కథ ఆమెకు చాలా పేరు తెచ్చిందట. అప్పట్నుంచీ ఇప్పటికి 150 కథలు, 14 నవలలు రాశారట. ఇవి కాక సినిమాలకు కథలు, టీవీ సీరియల్స్, రేడియోనాటకాలు చాలానే రాశారు.

ప్రేమలేఖ నవల ముందు చతుర పత్రికలో ప్రచురింపబడి, ఆ తర్వాత సినిమాగా రూపు దిద్దుకొంది. ఆ సినిమాలో జంధ్యాల సృష్టిగా నేను భావించిన పాత్రలు విజయలక్ష్మిగారివే అన్న విషయం ఈ పుస్తకం చూశాకే తెలిసింది. కథా వస్తువు గొప్పదేమీ కాదు. వోడ్‌హౌస్ నవలల్లో లాగా కొన్ని అసాధారణమైన సంఘటనలు, కొందరు విచిత్రమైన మనుషుల కలగూర్పు. ఆనందరావు అనే పెళ్ళికాని యువకుడికి సోనీ అనే అమ్మాయి రాసిన అందమైన ప్రేమలేఖ అందుతుంది. ఆ సోనీ ఎవరో తెలియకపోయినా, ఆమెనే పెళ్ళాడాలని నిశ్చయించుకొని, తీవ్రంగా వెతికేస్తూ ఉంటాడు. ఈలోగా ఆనందరావు నాన్న పరంధామయ్య – మంచి కోపదారి మనషి లెండి – ఆనందరావు పెళ్ళి స్వర్ణలత అనే అమ్మాయితో కుదిర్చేస్తాడు. ఆ పెళ్ళి నుంచి తప్పించుకోవటానికి ఆనందరావు పడే పాట్లు, అతనికి సాయం చేయబోయిన పేకాట పిచ్చి అన్నయ్య, సినిమాల పిచ్చి వదిన వగైరాల ప్రహసనాలు నవ్వు తెప్పిస్తాయి.

పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు సంపుటంలో 24 కథలున్నాయి. ఇవన్నీ ఈనాడు దినపత్రికలో వచ్చాయట. ఇవన్నీ నామిని బాటలో వచ్చిన ఆత్మకథాత్మక హ్రస్వ కథలు. యాజలిలో మాతామహుల ఇంట్లోనూ, గుంటూర్లో పితామహుల ఇంట్లోనూ రచయిత్రి బాల్యం గురించిన కథలు. సోమరాజు సుశీలగారి ఇల్లేరమ్మ కథలను గుర్తుకు తెచ్చాయి. యాజలివారు అమాయకులు, పట్నవాసం పోకడలు, నాగరికత ఎక్కువ తెలియనివారు. గుంటూర్లో నలుగురు తాతగార్ల ఉమ్మడి కుటుంబం. ఇంటినిండా నాలుగు తరాల మనుషులు, వచ్చీపోయే చుట్టాలు. తాతగారేమో ప్రేమలేఖ నవలలో పరంధామయ్య పాత్రకి ఆధారమట. వీరందరి మధ్యా ఆరిందా అమ్మాయి, రాలుగాయి అబ్బాయిలు. ఇంకా సందడికి లోటేం ఉంటుంది? పాతరోజుల్లో గుంటూరు శంకర్‌విలాసూ, శేష్‌మహల్ గురించి చెప్తుంటే కొంత నోస్టాల్జియా. ఈ పుస్తకాన్ని చాలా సరదాగా చదివేయొచ్చు. ఐతే క అక్షరాన్ని సరిగ్గా పలకలేక త అని పలికే పిల్లవాడు, “తన్నయ్యా, నల్లని తన్నయ్యా, నిన్ను తనలేని తన్నులుండునా” అని పాడుతుంటే నవ్వాపుకోలేకపోతున్నప్పుడు, ఆ పిల్లాడే, “నేనూ, మా అమ్మ ఈ లాతిలి నూతిలో దూతి తత్తిపోవాలి” అని అమాయకంగా చెప్పేసినప్పుడు గొంతు పట్టేస్తుంది.

మా ఇంటి రామాయణం సంపుటంలో 14 కథలున్నాయి. మృణాళిని ముందు మాట రాశారు. మొదటి కథ మా ఇంటి రామాయణం పాతకాలపు మామగారికి భార్యపట్ల కొంత సానుభూతితో ఉండటంవంటి కొత్తబుద్ధులు నేర్పిద్దామని ప్రయత్నించిన కోడలి పిల్ల కథ; సంఘటనలు అతిగా ఉన్నా సంభాషణలు సరదాగా ఉంటాయి. అత్తగారూ-స్వర్గంలో సీరియస్సూ కథ భానుమతి గారు స్వర్గస్థురాలయినప్పుడు కాబోలు ఆమెకు నివాళిగా, ఆవిడ స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆమె అత్తగార్ని కలుసుకున్నట్లుగా రాసిన కథ; రచయిత్రికి భానుమతి మీద ఉన్న అభిమానాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రారంభం బాగానే ఉంది కానీ, కొద్దిగా పొడుగయ్యింది. ప్రసాదరావు వంటసరస్వతీ కథ కొద్దిగా మాఇంటి రామాయణంలానే అనిపించే అధిక్షేప కథ. స్వాములవార్లని నమ్ముకొనే భక్తుల మీద వేళాకోళపు కథ వైరాగ్యస్థితి. సినిమా పిచ్చిమీద రాసిన కథల్లో తీరని కోరిక సరదాగానే ఉన్నా, తిక్క కుదిరింది కొంత అతిగా అనిపించింది. మిగతా కథల్లో కొన్ని కాలక్షేపానికి బాగానే ఉన్నాయి. కొన్ని పేలవంగా ఉన్నాయి.

అందమే ఆనందం సంపుటంలో 20 కథలున్నాయి. ముందు మాట శ్రీరమణగారిది. విశ్వనాథ వారి పేరడీతో మొదలై, టీవీన్యూస్‌ని కాసేపు అనుకరించి, మరికొన్ని పిట్టకథలు చెప్పి కథల్ని మోతాదు మించకుండా మెచ్చుకున్నారు. లేదని అనుకోకుండా ఉన్నదాన్నే తృప్తిగా అనుభవిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నవారి కథ మొదటి కథ ఆనందమే అందం. పెళ్ళిచూపులు పడుచుదనం చిలిపికథ. మిగతావి చాలావరకూ మృణాళినిగారి భాషలో అధిక్షేప కథలు – సినిమాలకు కథలు వండే వాళ్ళ గురించి, మోడర్న్ పెళ్ళిళ్ళ , ఇంటి ఇల్లాళ్ళ భాధల గురించి, మారుతున్న విలువలు, ప్రవర్తనల గురించి. మరికొన్ని కథలు తిక్కలమనుషుల కథలు. కొన్ని నవ్విస్తాయి. కొన్ని నవ్వొస్తాయి.

విజయలక్ష్మిగారికి సరళంగా రాయటం తెలుసు. నిత్యజీవితంలో హాస్యాన్ని గుర్తుపట్టడం బాగా తెలుసు. నిశితమైన చూపు. ముందొకసారి వోడ్‌హౌస్ పోలిక తెచ్చాను కానీ అది అంత సబబైన పోలిక కాదు. విజయలక్ష్మి గారి కథల్లో వోడ్‌హౌస్ కథల్లో లాగానే అసంబద్ధమైన సంఘటనలూ, తిక్కల మనుషులూ కొల్లలుగా కనిపిస్తారు. ఐతే మాటల్ను గిరికీలు తిప్పించి గిలిగింతలు పెట్టే వోడ్‌హౌస్ ప్రజ్ఞ ఈ కథల్లో లేదు. ఈ కథల్లో హాస్యం చాలా వరకూ మనుషుల తిక్క ప్రవర్తనల వల్ల జరిగే సంఘటనలనుంచి వస్తుంది. ఆ తిక్క మనుషులు హాస్యం బదులు చిరాకు కలిగించటం మొదలుబెట్టారంటే కథలు హాస్యంగా అనిపించవు.

ఈ నాలుగు పుస్తకాలలో నాకు బాగా నచ్చింది పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు పుస్తకం. మిగతా మూడు పుస్తకాలలో కొన్ని కథలు నచ్చాయి. చాలా కథలు పర్వాలేదనిపించాయి. కొన్ని కథలు అతిగా అనిపించాయి. కాలక్షేపానికి అన్ని పుస్తకాలూ బాగానే ఉంటాయి.

పుస్తకాలు అందంగా ముద్రించారు. అచ్చు తప్పులు బాధించలేదు.

******
రచయిత్రి రచనల ఆన్లైన్ కొనుగోలుకు ఏ.వీ.కె.ఎఫ్. లంకె ఇక్కడ


మా ఇంటి రామాయణం (కథలు); 2009; 117 పే , 80 రూ.
ప్రేమలేఖ (నవల); 1982, 2010; 142 పే; 80 రూ.
ఆనందమే అందం (కథలు); 2010 ; 193 పే; 120 రూ.
పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు (కథలు); 2011; 70 రూ.

Sri Rishikaa Publications
Flat No. 201; Vikasini Apartments
2-2-1121/3 & 3A, New Nallakunta
Hyderabad 500 044
pvlakshmi8@gmail.com; 040-2763 7729

You Might Also Like

9 Comments

  1. danda bharati

    ee sameeksha chadivaanu . kangaarugaa rasesaaru . pottoori best book chandrahaaram sameeksha lekapovatam veltigaa vundi
    famous writer annipusta kaalameeda okesaari sammksha raayinchaalanukunnappudu aa staayiki tagina sameekshakula cheta raayiste baagundedi .

    1. Jampala Chowdary

      Ouch! 🙁

  2. mr

    నాకు పొత్తూరి విజయలక్ష్మిగారి కథలు చాలా ఇష్టం. ఏ వుడ్ హౌస్ నో అనుకరించక తనదైన శైలిలో మనసారా నవ్వుకునేటట్లు వ్రాస్తారు. అదే నాకు చాలా నచ్చేది.

  3. Sree Ganga

    పొత్తూరి విజయలక్ష్మి గారి కథలు హాయిగా నవ్వుకోవడానికే కాదు, మనిషిగా బ్రతకడానికి, కాస్తంతన్నా మానవత్వం పరిమళించడానికి కూడా ఉపకరిస్తాయి. తిథి-నక్షత్రం, ప్రసాదరావు- వంట సరస్వతి, నగల గోవిందం వంటి కథలు ఆమె అలవోకగా రాసేస్తారు. నాకైతే ఆమె కథల్లో ‘ఎత్తుగడ’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కథలలో ఒక చిన్న చిక్కుముడి, దాని తాలూకు తమాషా పరిష్కారం వంటివి సాధారణంగా ఆమె రచనలలో కనిపిస్తుంటాయి. ‘గుండె మీద బండ ‘ అనే కథ కాబోయే కథకులకు ఒక రెఫెరెన్స్ లాంటి కథగా చెప్పుకోవచ్చు.

  4. jayalakshmi

    aaviDa abhimaanini ani garvam gaa prakaTinchukunTaanu…aa nuDikaram..baasha meeda paTTu… spashTata..chaalaa takkuva amndi rachyitrulaloa/ rachayatalaloa choostaam…Hats off to her

  5. kanthip

    పొత్తూరి విజయలక్ష్మిగారు హాస్యకథలే కాదు ‘మనసుని తడిచేసే ‘ కథలలో కూడా రాస్తారని ‘మేరా భారత్ మహాన్ ‘ కథ చదివాక తెలిసింది.
    కాంతి

  6. nagaraju

    pottoori vijayalakshmi padahaaranaala telugu rachayitri . telugu nudikaaram chakkani padaprayogam draaksha paakam vant saili aame sottu . ameni english rachayitaloto polchatam nachhaledu
    sunnitamaina haasyaaniki maaru peru pottoori aavida haasyam atigaa anipinchindante
    aascaryam gaa vundi

  7. రామ

    పొత్తూరి విజయలక్ష్మి గారంటే నాకు ఎప్పుడో ఈనాడు ఆదివారం లో చదివిన రేడియో కథే గుర్తుకి వస్తుంది. కథ పేరు గుర్తు లేదు కాని, వాళ్ళ చిన్నప్పుడు మొదటిసారి రేడియో కొన్నప్పుడు వాళ్ళింట్లో జరిగిన హడావిడి అంతా చాలా హాస్యం రంగరించి చెబుతారు.

    1. kavana sarma

      nenu potturi vijaya lakshmi gaari abhimaanini. avidatho maatlaadatam avida vrasina pusthakamu chadavatamu okalaative.aavida kathala mida vachchina samiksha chadivaanu .vaari abhipraayam thelisindi
      naaku aavida poga katha chaalaa istam

Leave a Reply