Economy of Permanence – J.C.Kumarappa
వ్రాసిన వారు: Halley
**************
జే సి కుమారప్పగారు రాసిన “Economy of Permanence” అనే పుస్తకం గురించి ఈ పరిచయం. గాంధియన్ ఎకనామిక్స్ అంటే ఏమిటో తెల్సుకోవాలనే కుతూహలం ఉన్న వారందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఇది వరకు కుమారప్ప గారి పుస్తకం “Philosophy of Village movement” గురించి రాసిన వ్యాసం లంకె ఇది.
అయితే ఇప్పటి కాలంలో ఈ సిద్దాంతాలను ఎవరన్నా పట్టించుకుంటున్నారో లేదో అన్నది అనుమానమే, కొద్దో గొప్పో అక్కడా ఇక్కడా ఉండే గాంధేయవాదులని మినహాయించి! ఐ.ఐ.ఎం లక్నో లో నేను మా ఎకనామిక్స్ ప్రోఫెస్సరును ఈ విషయమే అడిగితే “యు నో .. దట్ ఈజ్ ఇన్ ఫాక్ట్ ది రియల్ ఎకనామిక్స్.. బట్ ” అని నిట్టూర్చారు. బహుశ సమాధానము లేని ప్రశ్నలలో ఇది కూడా ఒకటి అనుకుంటా. అచ్చుపుస్తక రూపం లో ఇది ఇంకా దొరుకుతోందో లేదో నాకు అనుమానమే. నాకు “scribd” లో ఈ పుస్తకం తాలుకా ఈ-బుక్కు దొరికింది.
మనం నేటి కాలంలో పురోగతి, ఆధునికత, ప్రగతి అని అనుకుంటూ వేటి గురించైతే గొప్పగా అనుకుంటున్నామో వాటన్నిటి గురించి సమూలంగా చర్చించి ఇందులో చాలా భాగం ఎందుకు పనికి రాని ప్రగతి అని నిస్సంకోచంగా తేల్చి చెప్తారు కుమారప్ప గారు ఈ పుస్తకం లో. గ్లోబల్ వార్మింగ్ మరియు ఇతర పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన హెచ్చరికలు పెల్లుబుకుతున్న ఈ కాలంలో కుమారప్ప గారు చేసిన సూచనలు తప్పక ఉపయోగపడగలవు .
ఇటువంటి పుస్తకాలకు పరిచయం ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. అందుకని నన్ను ఆలోచింపచేసిన కొన్ని వాక్యాలను ఇక్కడ పంచుకుంటున్నాను అందులో ఏదో విషయం ఉన్నట్టుగా మీకు కూడా అనిపిస్తే తప్పక పుస్తకం చదవండి.
మనం మార్కెటులో కొనే వస్తువులను ఏ విధంగా విలువ కట్టాలో చెబుతూ ఇలా అన్నారు- ఉదాహరణకు ఒక దొంగ ఒక బాలికను హత్యచేసి ఆమె మెడలో ఉన్న హారాన్ని తెచ్చి మార్కెట్టులో అమ్మాడే అని అనుకుందాం. ఇపుడు ఆ హారంలో కేవలం కొన్ని తులాల బంగారం కాదు ఒక పసిప్రాణం రక్తం కూడా కలిసి ఉంది. ఆ హారం ఎంత తక్కువ ధరకి అమ్మినా కూడా ఎవరూ ఆ పాపపు సొమ్ములో పాలు పంచుకోటానికి ఇష్టపడరు. ఈ విధంగా మనం కొనే ప్రతి వస్తువుకి కొన్ని విలువలు ఆపాదించపడి ఉంటాయి. ఇవన్ని వదిలేసి మనం “business is business” అని అనలేము. ఉదాహరణకి ఒక కంపెనీ కాంట్రాక్టు కూలీలను నిర్దిష్ట మోతాదుకు మించి పని చేయిస్తూ సరైన జీతాలు ఇవ్వక ఎన్నో కష్టాలకు గురిచేస్తూ పని చేయిన్చిందే అనుకుందాం. ఇవన్ని తెలిసి కూడా ఆ వినియోగదారుడు ఏ రకమైన మొహమాటం లేకుండా ఆ కంపెనీ వస్తువలను ఖరీదు చేస్తే ఆ వినియోగదారుడికి కూడా ఆ తప్పు లో భాగం ఉన్నట్టే. అందుకనే మనం మార్కెటు లో కొనే వస్తువుల గురించి తెల్సుకోవటం మన భాద్యత అని అన్నారు . (ఇటువంటి కేసు ఆ మధ్యన యాపిల్-ఫాక్స్కాన్ విషయంలో జరిగింది).
ఫాషన్ ప్రపంచపు పోకడలను విమర్శిస్తూ ఇలా అన్నారు- తను ఏది కొన్నుకోవాలి ఏది ధరించాలి అని వినియోగదారుడు స్వతంత్రంగా ఆలోచించి కొనుక్కునే యుగం అంతరించింది అని అన్నారు. నేడు ప్రసార మాధ్యమాల ద్వారానూ మరి ఇతర సాధనాల ద్వారానూ ఉత్పాదకుడు తను ఏది తాయారు చేస్తాడో దానినే ప్రజలు కావాలని అనుకునేటట్టుగా చేయగెలుగుతున్నాడు. ఇలాంటి సేల్సు ప్రొపగండాలకు బలి అయిపోయిన వినియోగదారులలో ఒకరకమైన ఆత్మ న్యూనత భావం వస్తుంది అనీ, ఇలా పుటకి ఒకసారి మారే ఫ్యాషన్లను పాటించటం వల్ల ఉత్పాదకుల చేతిలో వినియోగదారులు తోలుబోమ్మలలా తయారవుతున్నారు అని అభిప్రాయపడ్డారు. ఆర్ధిక శాస్త్ర నిపుణులు “డిమాండ్” అని అదేదో జనాలు కోరుకుంటున్నారు అనే భావం వచ్చేట్టుగా చెప్తున్నారే కానీ నిజానికి చాలా వరకు వస్తువుల కోసం కృత్రిమంగా డిమాండు తయారు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. (ఈ మధ్యన అంతర్జాలంలో బాగా పాపులర్ ఐన ఈ వీడియోలో ఇదే విషయం ఎంతో చక్కగా వివరించారు. ఈ లంకె లో చూడచ్చు (16:18 నుంచి 16:45 వరకు))
ఇది కాక “జీవన ప్రమాణాల” (Standards of Living) మీద కూలంకషంగా చర్చించారు. నేల మీద కూర్చొని విస్తరాకులో తిన్నంత మాత్రాన భారతీయ పద్ధతి ఎందుకు తక్కువ అవ్వాలి? టేబుల్ పైన కూర్చొని స్పూన్లతో తిన్నంత మాత్రాన పాశ్చాత్య పధ్ధతి ఎందుకు ఎక్కువవ్వాలి? ఇటువంటి విషయాల గురించి ఈ అధ్యాయంలో చర్చించారు.
మన మోడరన్ ఫ్యాక్టరీలలో కూలీల కష్టాలని వివరిస్తూ ఒక బంగారు గని గురించి ఇలా ఒక కథ చెప్పారు. ఆ గనిలో ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన కార్మికులు ఆ కష్టాన్ని మర్చిపోటానికి తప్ప తాగి వేస్యల చుట్టూ తిరిగి లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటూ కష్టాలు పడే వారట. ఆ గని మేనేజర్ ఒకసారి కుమారప్పగారిని గని కార్మికుల శ్రేయస్సు కోసం ఏం చేస్తే వారి జీవితం బాగుపడుతుందో చెప్పమని అడిగారట. కుమారప్పగారు అప్పుడు ఇలా అన్నారట. “నిజంగా మీరు ఆ కార్మికుల శ్రేయస్సు కోరేట్టుగా ఉంటే ఆ కార్మికులని ఆ నరకం నుంచి విముక్తుల్ని చేసి ఆ గనిని ముసేయ్యండి. లేదా మరిన్ని మద్యం దుకాణాలను గని చుట్టూ తెరవండి. ఇంతకు మించి మీరు ఏమి చేయలేరు” అని చెప్పారట. ఎన్నో బంగారు గనులు గల ఒక జిల్లాలో కటిక పేదరికం ఎందుకు తాండవిస్తోందో చెబుతూ ఈ కథ చెప్పారు కుమారప్పగారు.
తర్వాత పుస్తకం రెండవ భాగం లో ప్రభుత్వం, పాలన, వ్యుత్పత్తి, వ్యవసాయం, పంపిణి వ్యవస్థ వంటి ఎన్నో విషయాల గురించి రాసారు. ఒక వైపు ఆర్ధిక వ్యవహారాలలో వ్యుత్పత్తిదారుడి గుత్తాధిపత్యం ఉన్నప్పుడు రాజకీయాలలో ప్రజాతంత్రం ఉన్నా అటువంటి ప్రజాతంత్రం వల్ల ఏ ఉపయోగం లేదు అని తేల్చి చెప్పారు (We cannot have dictatorship in economics and at the same time, democracy in politics. Such claims to democracy are mere smoke screens).ఎప్పుడైతే వ్యుత్పత్తి వికేంద్రికరణ జరుగుతుందో అప్పుడే నిజమైన ప్రజాతంత్రం సాధ్యమనీ, తన “Economy of Permanence” కి అదే మూలమని వివరించారు.
ఈ పుస్తకానికి గాంధీ గారు ముందుమాట రాసారు. ఇది ఒకసారి చదవగానే అర్థమైపోయే పుస్తకం కాదని దీనిని రెండు మూడు సార్లు శ్రద్ధగా చదివితేనే పూర్తి భావం అర్ద్తమౌతుందని అన్నారు. ఈ పరిచయం పుస్తకంలోని సిద్ధాంతాలకు పూర్తి న్యాయం చేయలేకపోయినా ఎంతో కొంత కుతూహలాన్ని కలిగించింది అనే అనుకుంటున్నాను.
పూడూరి రాజిరెడ్డి
హేలీ గారూ, మనసుకు నచ్చే అంశం రాశారు. అవసరమైన లింకులు కూడా ఇచ్చారు. థాంక్యూ.