ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు
(ఇంటర్నెట్లో తెలుగు నిఘంటువుల గురించి తానా పత్రికలో వచ్చిన ఒక రిపోర్టు)
****
ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు – తానా తోడ్పాటుతో ఇప్పుడు లభ్యం
జంపాల చౌదరి, ఛైర్మన్, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
ఏ ఇంగ్లీషు మాటకైనా అర్థం తెలియకపోతే వెంటనే డిక్షనరీ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందినకొద్దీ ఈ పని మరీ సులువు అయ్యింది. వర్డ్‌ప్రాసెసర్‌లోనో లేక సెర్చ్ ఇంజన్‌లోనో మనకు అర్థం కావాలసిన మాట టైపు చెయ్యగానే ఆ మాట అర్థం, పర్యాయపదాలు, ఇతర వివరాలు వెంటనే స్క్రీన్ మీద ప్రత్యక్షమౌతాయి.
ఇంగ్లీషు డిక్షనరీలు తరచు చూసేవారికి కూడా, తెలుగు పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీకోసం వెతికే అలవాటు తక్కువ. దీనికి ముఖ్యకారణం మనకు తెలుగు డిక్షనరీలు (ఇక్కడే కాదు, ఇండియాలోనూ) అందుబాటులో లేకపోవటమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలుగువారు ప్రముఖపాత్రలు పోషిస్తున్నా ఇంటర్నెట్‌లో తెలుగు మాత్రం ఉండవలసిన స్థాయికి ఇంకా చేరుకోలేదు. కొన్నాళ్ళ క్రితం వరకూ తెలుగు పదానికి అర్థం కావాలంటే, ఇంటర్నెట్ తెలుగు వేదికల మీద తెలిసినవారిని సంప్రదించవలసిందే కాని స్వయంగా వెంటనే వెతుక్కునే అవకాశం ఉండేది కాదు.
ఈ లోటు పూరించటానికి వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు అనే ఇద్దరు హైదరాబాదు యువకులు స్వచ్ఛందంగా సిద్ధపడ్డారు. తాము నిర్వహిస్తున్న ఆంధ్రభారతి అనే తెలుగు సాహిత్య ఖజానా వెబ్‌సైటులో వారు తెలుగు పదాలకు అర్థం తేలికగా వెతుక్కునే సదుపాయం కల్పించటానికి సంకల్పించారు. తెలుగుకు సంబంధించిన అన్ని నిఘంటువులనూ ఒక్క చోటకు తీసుకొనివచ్చి ఒక్క మౌస్‌క్లిక్కుతో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం మొదలుబెట్టారు. జర్మనీలో ఉండే పరుచూరి శ్రీనివాస్ వీరికి సహాయపడ్డారు.
ఐతే ఇది చిన్నపనేమీ కాదు, బృహత్కార్యమనే అనాలి. ముందు నిఘంటువుల తాలూకు హక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో తెలుసుకొని వారి అనుమతి పొందాలి. నిఘంటువులో ఉన్న ప్రతి మాటనూ మళ్ళీ యూనికోడ్‌లో టైపు చేయాలి. ఆ తర్వాత జాగ్రత్తగా ఒకటికి రెండు మార్లు ప్రూఫులు సరిదిద్దుకోవాలి. ఆ తరువాత ఆ పదాలను వెతుక్కునే సెర్చ్ ఇంజన్ కంప్యూటర్ ప్రోగ్రాం తయారు చేసుకోవాలి. వేగవంతమైన కంప్యూటర్ సర్వర్లను నియోగించాలి. అంతే కాక ఈ సదుపాయం వినియోగించుకోదలచిన వారందరికీ కంప్యూటర్లో తెలుగు టైపు చేసే నైపుణ్యము, సౌకర్యము ఉండకపోవచ్చు. అందుచేత ఆ పదాలను ఇంగ్లీషులో టైపు చేసినా, తెలుగులో టైపు చేసినా వెతకగలిగేట్లుగా కంప్యూటరును ప్రోగ్రాము చేయాలి.
నిజానికి ఇంత పనిని తలకెత్తుకోవాల్సినది ఔత్సాహికులు కాదు. ప్రభుత్వమో, అధికార భాషా సంఘమో, విశ్వవిద్యాలయాలో, అకాడెమీలో చేయవలసిన పని. ఐతేనేం, ఆంధ్రభారతివారు తమ ఉత్సాహమే వనరుగా ఈపనిని ప్రారంభించారు. వారికి చేయూతనివ్వటానికి తానా ప్రచురణల కమిటీ నిశ్చయించింది. తెలుగును సంరక్షించటం, వ్యాపింపచేయటం తానా ఆశయాలలో ముఖ్యమైంది. అందుచేత తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రయత్నాన్ని ఆమోదించి ప్రోత్సహించింది. ఈ ప్రయత్నానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరగానే తానా సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అవసరమైన నిధులను సమకూర్చారు. ఈ దాతలందరికి, ముఖ్యంగా కొడవళ్ళ హనుమంతరావుగారికి, తానా సంస్థ తరపున నా కృతజ్ఙతలు.
ఆంధ్రభారతి-తానాల సహకారం వల్ల ఈరోజు తెలుగుమాటలకు అర్థాల్ని ఇంటర్నెట్‌లో వెదుక్కోవడం సులభ సాధ్యమయ్యింది. ఆంధ్రభారతి సైటుకు వెళ్తే (లేకపోతే సైటులో నిఘంటు శోధన పై క్లిక్ చేస్తే) మీరు ఏ తెలుగు మాటకైనా అర్థం తెలుసుకునే వీలున్నది. మీ వీలుని బట్టి మీకు కావలసిన మాటను ఇంగ్లీషులో కాని తెలుగులో కాని టైపు చేస్తే చాలు.
తెలుగు మాటకు తెలుగు అర్థం, తెలుగు మాటకు ఇంగ్లీషులో అర్థం, ఇంగ్లీషు మాటకు తెలుగు అర్థం, ఉర్దూ మాటకు తెలుగు అర్థం ఇప్పుడు సులభంగా వెతుక్కోవచ్చు. శంకరనారాయణ, బ్రౌన్ తెలుగు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీలతో పాటు, ఉర్దూ-తెలుగు నిఘంటువు, రవ్వా శ్రీహరి నిఘంటువు, బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశం – మొత్తం ఎనిమిది డిక్షనరీలలో ఒక్కసారే అర్థాలు, పర్యాయపదాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఈ సైటులో 8,250 డిక్షనరీ పేజీలు టైపుచేసి అందుబాటులోకి తెచ్చారు.
ఇదే మనకు గొప్పగా అనిపిస్తూ, ఉపయోగపడుతూ ఉన్నా, ఇప్పటి వరకు చేసినది సంకల్పించిన ప్రయత్నంలో చిన్న భాగమే. ఇంకా ఏడు మాండలిక పదకోశాలు, మరో రెండు పర్యాయ పద నిఘంటువులు టైపుచేయటం, ప్రూఫులు దిద్దడం పూర్తయ్యింది. ఏప్రిల్ నెలలో ఈ తొమ్మిది నిఘంటువులు (2,406 పెజీలు) కూడా ఇంటర్నెట్‌కి అప్‌లోడ్ చేయబడతాయి. ఇవి కాక ఇంకో 17 నిఘంటువులు (మొత్తం 34 వాల్యూములు, 17,835 పేజీలు) టైపు చేయటం ఐపోయింది. వీటన్నిటినీ జాగ్రత్తగా ప్రూఫులు దిద్దాక ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వస్తాయి. తరువాత దశలో ఇంకో 37 నిఘంటువులు (55 వాల్యూములు, 25,407 పేజీలు) చేర్చబడతాయి. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి కనీసం 71 నిఘంటువులు (53,898 పేజీలు) ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట.
ఈ నిఘంటువుల్లో ప్రామాణిక సాంప్రదాయ నిఘంటువులతో పాటు, మాండలిక పదకోశాలు, వివిధ వృత్తుల పారిభాషిక పదాల, పర్యాయ పదాల నిఘంటువులు కూడా ఉన్నాయి. వీటికితోడు, ఇంగ్లీషు, సంస్కృత, ఉర్దూ పదాలు, పురాణాల్లో వచ్చే పేర్లు, సంగీతం, ఆయుర్వేదం వంటి వివిధ శాస్త్రాల్లో వచ్చే పదాలు, సాంకేతిక పదాల అర్థాలు కూడా ఇక్కడ లభ్యమౌతాయి. ఈ వివరాలన్నిటినీ మీరు ఈ పట్టికలో చూడవచ్చు.
ఈ సదుపాయాన్ని మీరంతా వినియోగించుకొంటారని ఆశిస్తున్నాను. తెలుగును సంరక్షించుకోవటానికి, నేర్చుకొనడానికి, వ్యాపింపజేయడానికి అవసరమైన ఇంకా ఎన్నో ప్రతిపాదనలను మన తానా ప్రస్తుతం పరిశీలిస్తుంది. మీ అందరి సహకారంతో శాశ్వతంగా ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను మనం చేపట్టవచ్చు.
ఈ ప్రాజెక్టుకు, తానా ప్రచురణల కమిటీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులకూ మీరు సహాయాన్ని అందించదలచుకుంటే, ఈ లంకె లో Telugu On-line Dictionaries ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు. చెక్కు ద్వారా విరాళాలు ఇవ్వాలంటే, TANA Publications Committee పేర వ్రాసిన చెక్కులను V. Chowdary Jampala, 20374 Buckthorn Ct, Mundelein, IL 60060 కు పంపించవచ్చు. ఇతర వివరాలకు నన్ను (cjampala@gmail.com; 937-475-7809) సంప్రదించవచ్చు.
ఈ ప్రయత్నంలో సహాయ సహకారాలు అందించినవారందరికీ, మరోసారి నా కృతజ్ఙతలు.
Chowdary Jampala
Chairman, TANA Board of Directors
Lakshmi
I want meaning of telugu word “aaraadhylu” meaning in english.
Srinivas
Venerable.
మంత్రిప్రగడ భరతరావు.
చాలగొప్ప పనిచేశారు .అభినందనలు .
తెలుగు శబ్దసాగరం | పుస్తకం
[…] 1. ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు – జంపాల చౌదరి గారి వ్యాసం, పుస్తకం.నెట్…. 2. “మాండలిక వృత్తి పదకోశం” – 1962 […]
VSTSayee
“ఈనాడు”వారి “తెలుగు వెలుగు” అక్టోబరు సంచికలో ..
http://crm.eenadu.net/teluguvelugu/magazine.html#/10
నూర్ బాషా రహంతుల్లా
http://nrahamthulla3.blogspot.in/2012/07/1900.html
http://nrahamthulla3.blogspot.in/2012/07/2.html
Vadapalli SeshaTalpaSayee
బ్రౌణ్యంలాంటి నిఘంటువుల్లో అతికొద్దిగా ఉన్న మాండలిక (ప్రాంతీయ) వ్యావహారిక పదాలు ఇప్పుడు వివిధ సంస్థల, వ్యక్తుల పూనికతో ఆయా ప్రాంతాలవారీగా లభిస్తున్నాయి. అలాగే వివిధ రచయితల మాండలిక ప్రయోగాలకు అర్థ, వివరణలతో పుస్తకాలు ఉన్నాయి. నేడు మా సంకలిత నిఘంటుపరికల్పనలో వీటిని పొందుపరుస్తున్నాము. దీనితో ఆయా ప్రాంతీయపదరూపాలు అందరికీ అర్థం అయ్యే వీలు కలుగుతోంది. ఇప్పటివరకూ మాకు తెలిసి ప్రచురించబడ్డవాటిలో ఇంకొన్ని – నల్లగొండజిల్లా మాండలికపదకోశం, మదరాసు తెలుగు, రాయలసీమ మాండలికం: అనంతపురం ప్రాంతీయత, రాయలసీమ పలుకుబడులు, కన్యాశుల్కం: టీక-టిప్పణి, రావిశాఖీయం – మిగిలివున్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తిచేయగలము. ఈ తరగతికి చెందినవి ఇంకా ఏమైనా ఉంటే తెలియజేయ మనవి.
అలాగే పర్యాయపదాలు, సంకేతపద వివరాలు తెలియజేసే చెరొక కోశాన్ని ఆంధ్రభారతి ఇప్పుడు శోధనపరిధిలోకి తెచ్చింది.
ఇదేవిధంగా, వివిధకోశాలనూ నిఘంటువులనూ మా వీలుకొద్దీ అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం కొనసాగుతోంది.
ఇప్పుడు కొత్తగా ఆంధ్రభారతి నిఘంటుశోధనకు జతచేసిన తొమ్మిది కోశములు –
మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
మాండలిక పదకోశం (తె.అ.)
ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)
కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం)
తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)
తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)
సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
కొత్తపాళీ
ఇది నిజంగా అద్భుతమైన బృహత్కార్యం. ఆంధ్రభారతి బృందానికి అభినందనలు. తగు సహాయం అందించిన తానా కార్యవర్గానికి కూడా అభినందనలు.
Jampala Chowdary
గమనిక: ఈ వ్యాసం మొదట ప్రచురించినప్పుడు శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారి పేరును తప్పుగా వ్రాసినందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు సవరించాను.
జి కె యస్ రాజా
జంపాల చౌదరి గారికి నమస్కారం. నేను వెతుకులాటలో భాగంగా ఈ మధ్యనే ఈ నిఘంటు సేవను వినియోగించుకోవడం మొదలుపెట్టాను. వాడకం తగ్గడంవల్ల ఒక్కోసారి చిన్న పదాలకు కూడా తెలుగులో అర్ధం స్ఫురించడం లేదు. ఎవరికైనా తెలుగు మాట్లాడడమే కాని వ్రాయను, చదవనూ పరిమిత తెలివిడి కలిగినవారికి నచ్చిన విషయాన్ని అచ్చ తెలుగులో ఉత్తరం (ఇ’మెయిలు) వ్రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇదో గొప్ప వరంగా దొరికింది. ‘తానా’ బోర్డు కు మీద్వారా కృతజ్ఞతలు. అలాగే దీనికి నడుంకట్టి అందించబూనిన పరుచూరి శ్రీనివాస్, వడపల్లి శాయి, కాలెపు నాగభూషణరావు గార్లకు ప్రత్యేక అభివందనాలు. అలాగే చేయూత నివ్వడానికి ముందుకొచ్చిన ప్రతివారికీ ధన్యవాదాలు.
చిన్న మనవి, నేను ప్రస్తుతం పట్టుకు ఊరేగుతున్న ‘sony tablet-s’ android tablet pc లో తెలుగు చదవడానికీ, టైపు చెయ్యడానికీ వెసులుబాటు నాకు తెలియడం లేదు. ఏదైనా సాంకేతిక ఉపాయం ఉంటే సహాయపడగలరు.
పుస్తకం.నెట్ వారికి యధాపూర్వకంగా కృతజ్ఞతలు.
రాజా.
Madhu
Dear Dr Chowdary Garu, it is a real good effort. You and the team of “Andhra Bharati” to be complimented for such a gigantic task. Everybody knows that we are using more English words than Telugu. Myself has to write comment in Telugu. I am sorry and ashamed. I will try to write in Telugu in next 4 to 6 months.
If many of us interested in improving the communications in Telugu, nobody can eradicate our beautiful Telugu. It is in our hands. Let everyone of us who ever interested in our Telugu, let us contribute and whatever is possible.