అనువాద కళను వివరిస్తూ ’Performing without a Stage’

నాకిష్టమైన రచయితలెవరూ? అన్న ప్రశ్న ఇంకా పూర్తి కాకముందే ’కాల్వినో, సరమాగో, కుందేరా, మార్క్వెజ్’ల పేర్లు చదవటం మొదలుపెట్టేస్తాను. వీరి రచనలతో పరిచయం కలిగి ఓ మూడునాలుగేళ్ళు అవుతున్నా, నా ధ్యాసంతా ఎంత సేపూ ఆయా రచయితలపైనే ఉండేది గానీ, ఇవ్వన్నీ నేను ఆంగ్లానువాదంలో చదువుతున్నాననీ, ఇవ్వన్నీ నాకు చదవటం రాని వేరే భాషలో రాయబడియున్నాయని నాకు స్ఫురించేది కాదు. పిరన్‍దలో నవల ఒకటి చదవబూని, చదవలేక సతమతమైనప్పుడు గానీ నాకు అనువాదకుల పేర్లు చూసి పుస్తకాలు కొనుక్కోవాలన్న సంగతి తట్టలేదు. అప్పుడే మొట్టమొదటిసారిగా కాల్వినోలనూ, సరమాగోలనూ పక్కకు పెట్టి విలియమ్ వీవర్‍లనూ, మార్గరట్ జుల్ కోస్తాలనూ పరిచయం చేసుకున్నాను. వారు అనువాదకులుగా ఎలా మారారో, వారి వృత్తిలో ఉన్న సాధకబాధకాలేంటో, వారి రొటీన్ ఎలా ఉంటుందో – ఇలాంటి వివరాలకై ఆసక్తి చూపాను. ఎక్కడో, ఎప్పుడో నాకు తెలీకుండానే కాల్వినో-వీవర్, సరమాగో-కోస్తా ద్వంద్వాలు నా మస్తిష్కంలో స్థిరపడిపోయాయి. నిరుడు, ఇదే అంశాన్ని తీసుకొని ప్రపంచ సాహిత్యాన్ని నాకు అందుబాటులోకి తెచ్చిన అనువాదకుల గురించి ఒక వ్యాసం రాయాలనుకున్నాను గానీ కుదరలేదు. ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నది అనువాదాల గురించిన పుస్తకం కనుక, ఈ ఉపోద్ఘాతం రాయకతప్పలేదు, అనువాదపక్రియపై నా ఆలోచనలు పరిచయం చేయడానికి.

పోయిన నెల, అనువాదాల్లో వచ్చే సమస్యల గురించి గూగుల్‍లో వెతుకుతుంటే, అనువాద సాహిత్యాన్ని చదివే పాఠకులు చదవాల్సిన పుస్తకం అని ఒక వాక్యం కనిపించింది. ఆ వెనువెంటనే కామన్ క్రియేటివ్ లైన్సెన్స్ కింద ఆ పుస్తకం పూర్తి పాఠం నెట్‍లోనే లభించింది. ఆ పుస్తకమే, Performing without a stage. అమెరికా సాహిత్యంలో అనువాదాలకున్న స్థానాన్ని కేంద్రబిందువుగా తీసుకుంటూనే అనువాదం అనే కళలో ఉన్న ఎన్నో ఒడిదుడుకులనీ, అనువాదాలు పనిజేసే తీరుతెన్నులనీ, అనువాదాలకు సంబంధించిన అన్ని విషయాలనూ కూలంకషంగా చర్చించడానికి రచయిత ఈ పుస్తకం రాశారు.

అసలు అనువాదాలు అవసరమా? అన్న ప్రశ్న వేసుకుంటే ’అవున’నే సమాధానమే వస్తుంది. ’ఎందుకు?’ అని తిరిగి ప్రశ్నించుకుంటే, మనుష్యులందరికి ఒక భాష లేకపోవటం చేత. అది శాపమో (టవర్ ఆఫ్ బాబిల్ ప్రకారం) లేక మరేదో మనకి తెలీదుగానీ, మనుషులందరూ ఒకే భాషను మాట్లాడరు / చదవరు / రాయరు గనుక, ఒకరి సాహిత్యాన్ని మరొకరు చదవాలనే ఉత్సుకత మనుషుల్లో ఉంటుంది గనుక, అనువాదాలు తప్పనిసరి. అనువాదాల ద్వారా మనకి తెలీని మరో సంస్కృతి, జీవనవిధానం, సామాజిక పరిస్థితులు తెలియరావడమే కాక, ప్రతి కథ వెనుకా, ప్రతి ఆలోచన వెనుకా మనుషులందరికి వర్తించే ఏవో విషయాలు ఉంటూనే ఉంటాయి. ఒకరి ఆలోచనలను చేరుకోడానికి వేరొకరికి భాష అడ్డంకి అయ్యినప్పుడు అనువాదాలు ఆ అడ్డంకి తొలగిస్తాయి. ఒకరి దగ్గరికి ఒకరిని తీసుకొస్తాయి.

అయితే, అడ్డంకులు తొలగించే ఈ అనువాదాలకే బోలెడు అడ్డంకులు. దినదిన గండం నూరేళ్ళాయుష్షు! అన్నట్టుగా ఇన్ని భాషలున్న ప్రపంచంలో, ప్రతి భాషలోనూ ఎంతో కొంత సాహిత్యం ఉన్నప్పటికీ, ’అనువాదం’ తప్పనిసరి అయినప్పటికి దానికో సముచిత స్థానం లేదు. (అమెరికాలో ఉందేమోనని అనుకున్నాను, ఈ పుస్తకం చదివేవరకూ!) అనువాదాలు చేసేవారికి గుర్తింపు లేదు. ఉపోద్ఘాతంలో చెప్పినట్టు, నాకో కాల్వినో రచన నచ్చితే నేను మరో కాల్వినో రచన వెతుక్కున్నానే గానీ, వీవర్ ఇంకే అనువాదాలు చేసారు? ఆయన స్వయంగా రాసినా పుస్తకాలున్నాయా? అని వెతకలేదు. ఇలా అనువాదకుడిని పూర్తిగా మర్చిపోయి, కేవలం మూలరచయితతో మమేకమైపోవటం అనువాదకుడి లభించే గొప్ప ప్రశంస అని వీవర్ ఒకానొక సందర్భంలో అభిప్రాయపడ్డారని ఈ పుస్తకంలో రాశారు. ఆ ప్రశంస సంగతి పక్కకు పెడితే, అనువాదకులకు కవర్ పేజి మీద తమ పేరు కనిపించటం దుర్లభం. అనువాదం చేసినందుకుగానూ ముట్టే డబ్బు ఏ మూలకూ రానిది. తమకు నచ్చిన ఒక రచనను తమ భాషలో పంచుకోవాలని ఉబలాటంతో అనువాదాలు చేసేవారే అత్యధికులు. ఎక్కడో పేరొందిన అనువాదకులు ఉన్నా, వారూ వారి పనితనానికి తగినంత విలాసవంతమైన జీవితాలు గడిపినవారు కారు. ఇన్ని సమస్యల మధ్య అనువాదం ఎలా మనగలుగుతుంది అన్న ప్రశ్నకు కాస్తో కూస్తో జవాబు దొరుకుతుందీ పుస్తకంలో.

నిర్లక్ష్యానికి గురవుతున్న ఒక కళని గురించి మాట్లాడేటప్పుడు, ఆ కళతో ముడిపడి ఉన్న వారిపై అసహనం చూపటం మామూలే! ఈ పుస్తకంలో రచయిత టోన్ అచ్చం అలాగే ఉంటుంది. ఆయన అనువాదాల తరుఫున వాదించే ప్రతి సందర్భంలో ఈ అసహనపు గొంతు వినబడుతూనే ఉంటుంది. తగిన గుర్తింపు రావటం లేదన్న నిస్పృహ కనిపిస్తూనే ఉంటుంది. కానీ అనువాదానికి తగినంత గుర్తింపు రాకపోవటంలో ప్రతి ఒక్కరి పాత్రనూ ఆయన బాలెన్సడ్ గా చూపడానికే ప్రయత్నించారు.

ఈ పుస్తకంలో ద్వారా నాలో కొత్త ఆలోచనలు కొన్ని సంగతులు —

నీ దారా? నా దారా? మన దారా? – Fidelity

ఏ అనువాదం గొప్పది? మూలానికి అతి దగ్గరగా ఉంటూ ముక్కముక్కలుగా విరిగిపోయిన వాక్యాలతో నిండి ఉన్నదా? లేక మూలం నుండి దూరమైనా అనువాదం చేయబడ్డ భాషలో చక్కగా చదివింపజేసేదా? రచయిత రాసినదానికి అనువాదకుడు తన సొంత interpretation ఇచ్చుకొని అనువాదం చేస్తే, అది మూలరచయిత సృజనను ఎద్దేవా చేసినట్టా? అనువాదకుడు రచయితకు, మూలరచనకు ఎంత faithfulగా ఉండాలి? – అనువాదాలకు సంబంధించి బోలెడు తర్జనభర్జనలు జరుగుతూ ఉంటాయి కదా! ఈ ఒరిజినల్‍ అత్యంత దగ్గరగా ఉండడాన్ని Fidelity అని, దాన్ని నిర్వర్తించటానికి క్లాసిక్స్ నుండి ఉదాహరణ తీసుకొని చెప్పారు. Ulysses కొన్ని దశాబ్దాలుగా ఇంటినుండి దూరంగా ఉన్నప్పుడు, అతడి కొడుకు వ్యవహరించిన తీరు, అనువాదకుడికి ఆదర్శం అని రచయిత అభిప్రాయం.

“Telemachus is the only one of the three who has multiple obligations: to his mother, to his father, to his island, to himself. Unlike the others, he does not even know his father, so the obligation to him is weaker than the others’. Yet it is he who acts on his fidelity to his father by going out to find word of him. He doesn’t simply lie around, like the dog, or come up with a ploy, like his mother; he takes his own odyssey, he speaks and acts cleverly like his father, and eventually he becomes his father’s ally, to save his island, to save his mother, and to find himself. Telemachus, who is not generally considered an example of fidelity, is the true representative of the translator, because he fulfills all of his obligations at once, and he acts, he imitates, he travels out of his world and out of himself in order to grow and help his whole world grow as well. And all while, staying faithful to his father. “

అటా? ఇటా? ఎటు? – Decision making

ఒక మంచి అనువాదానికి, అంత బాగా రాని అనువాదానికి గల కీలకమైన తేడాను చాలా సరళంగా చెప్పారు.

“Translation is above all a pattern of decisions,” Richard Sieburth told me, “and every local decision will commit you to decisions elsewhere. The mark of a bad translation is the completely erratic nature of the decisions. . . . Unlike a close reader, as a translator you are stuck with your decisions. You are forced to commit. The thing about translation is that it involves commitment. And another sign of a bad translation is when people are not willing to commit.”

ఈ మాటలకు ముందు, అనువాదాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, ఆ తీసుకోవటంలోని ఇబ్బందుల గురించి చర్చించారు. అనువాదాలు చేయబూనినప్పుడు ఉత్పన్నమైయ్యే సవాలక్ష ప్రశ్నలని దేనికి దానికి విడివిడిగా చూడకుండా, అన్నింటికిని నప్పే జవాబుని వెతకమన్నారు. ఇది అనువాదం చేయబోయేవారికి చక్కని సలహా అని నాకనిపించింది.

Translation is a pattern of decisions, not just a bunch of them. This is one reason why it’s impossible to criticize a translation by pointing out isolated mistakes; those “mistakes” might actually be the result of a great deal of balancing, for example, making up in one place for what had to be left out in another part of the work. As Sieburth added, “Someone once asked Richard Howard, ‘How would you translate this word?’ And he came back saying, ‘I do not translate words.’ What you translate is a system of relationships.” Or, as Ben Belitt has written, “great translation moves by touch, finding the matching shape, the corresponding rugosity even before it looks for the counterpart of meaning.”

కాకపోతే అనువాదాలు చదివేవారు, ఏది మెరుగైన అనువాదం అని ఎలా ఎంచుకోగలరు? అన్నదానికి ఈ సలహా వర్తిస్తుందా అంటే నాకు అనుమానమే! అనువాదాలు చదవడానికి ప్రధానకారణం మూలభాష వచ్చి ఉండకపోవటం. ఒకవేళ వచ్చినా, మూలాన్ని, అనువాదాన్ని పక్కపక్కనే పెట్టుకొని చదవటం వల్ల నిరుత్సాహమే తప్ప మరో మాట ఉండదు. అసలెప్పుడూ అనువాదాలనీ, మూలాన్నీ ఒకే చోట వేయకూడదు అన్న అభిప్రాయమూ వెల్లడించారు. నేను చదివిన కొంత మంది కవుల కవితలు బై-లింగ్వుల్ ఎడిషన్స్ ఉన్నాయి. గుల్జార్ / జావేద్ అఖ్తర్ కవితలు హింది-ఇంగ్లీషుల్లో ఉంటే, పాబ్లో నెరుదావి స్పానిష్, ఇంగ్లీష్లో ఉంది. మరప్పుడు ఒక పాఠకుడు మంచి అనువాదమని ఎలా ఎంచుకోగలడు? ఈ విషయంలో రివ్యూలు రాసేవాళ్ళూ అసలు కథను, అసలు కథనానికి ఎక్కువ స్థలం కేటాయిస్తారు గానీ, అనువాదాన్ని ఒకట్రెండు వాక్యాలలో తేల్చిపారేస్తారని ఈయనే అన్నారు. మరి ఒక పాఠకునికి అనువాదాల నాణ్యత ఎలా తెలుస్తుంది? అన్నది నా ప్రశ్న.

అనువాదమనెడి కళ!

అనువాదాల గురించిన పుస్తకం కాబట్టి, ఆ క్రాఫ్ట్ ను బాగా వివరించారు. అనువాదాలు చేసేవారిని సెకండ్ రేట్ ఆర్టిస్టులుగా కాకుండా  కళాకారులుగా ఎందుకు గుర్తించాలో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుంది. ముఖ్యంగా అనువాదమనగానే అంతా పనంతా ఒరిజినల్ రచయిత రాసేసి ఉంటాడు, దాన్ని కేవలం ఇంకో భాషలోకి మార్చటమే అని అనుకునేవారికి అర్థమయ్యేలా వివరించారు. ఒక భాషలోని పదాలకు మరో భాషలో సమానార్థాలు వెతికి పెడితే సరిపోతుందనుకుంటే అది అనువాదం కాలేదు. అనువదించేటప్పుడు మరెన్నో సమస్యలు ఎదురవ్వచ్చు. ఉదాహరణకు, నేను చదివిన ఒక చైనీస్ కథకు ఆంగ్లానువాదంలో reversible son-in-law అని పదం కనిపించింది. దాని గురించి ఫుట్‍నోట్లో వివరణ ఇచ్చారు, పెళ్ళాయ్యాక అమ్మాయి ఇంట్లోనే ఉండే అల్లుడు అని. అంటే మన భాషలో ఇల్లరికపు అల్లుడు. ఇది చదవగానే ఒక ఫ్రెండ్‍ని అడిగాను: మరి తెలుగు కథలో ’లెంపలు వేసుకోవడం’ అని ఉంటే, ఇంగ్లీషులో ఏమని రాయొచ్చు, self-slapping? ఆయన నవ్వేశారు. మరి మీరు?

అనువాదం, ది ఛాలెంజ్:

అనువాదాలు చేయడానికి కావాల్సిన problem solving skills గురించి ఈ మాటలు చూడండి:

Writing is neither a mystical event nor a series of conscious decisions. It’s a constant process of making decisions, solving problems, partly conscious and partly not. Translating involves every sort of decision a writer makes except for most of the ones critics and readers like to think and talk about, those minor things like characters, plot, imagery, theme. But then translators make a lot of decisions writers rarely have to make, about things extraneous to the original work, such as intent, consistency, essentiality, accuracy, and the relationships and lack of relationships between languages. As Jean Le Rond d’Alembert wrote in 1758, “If we were to measure merit merely according to problems solved, we would often encounter fewer problems in creating literature than in translating it.”

ఇందులోని కొన్ని ఛాప్టర్స్ కవితానువదాలకు, క్లాసిక్స్ అనువాదాలకు కేటాయించారు. నేను ఆయా చాప్టర్లను పైపైనే చదివాను. రెండూ నాకంత ఆసక్తి ఉన్న విషయాలు కావు కదా అని. కానీ, క్లాసిక్స్ అనువాదాలను గూర్చి చెప్పేటప్ప్డుడు ఒకే క్లాసిక్ మారుతున్న కాలం బట్టి అనువాదాల భాష ఎలా మారుతూ ఉంటుందో బాగా చెప్పారనిపించింది. అలాగే, వేరే సందర్భంలో ఏదో ఒక కాలంలో ఒక దేశంలో వాడే భాషను, ఆంగ్లంలో అనువదించేటప్పుడు అట్లాంటి భాష లేదు కాబట్టి, అనువాదకుల స్వయంగా ఒక style of englishను ప్రవేశపెట్టటం లాంటివి ఆసక్తికరంగా అనిపించింది. అంతదాకా ఎందుకు, హారీ పాటర్ సీరీస్ ను హిందిలోకి అనువదించేటప్పుడు మంత్రాలకి వాటికి సంస్కృతాన్ని వాడుతున్నారట.

“Rowling invented a great number of words and phrases for the books such as spells, incantations, magical words, items, and place names. Many of these words involve wordplay, rhyming, and historical references that are difficult to translate. A large number of spells are drawn from or inspired by Latin, and have a certain resonance with English speakers. For example, priori incantatem (a spell which causes the last spells performed by a wand to be reproduced in reverse order) would be familiar to many English-speaking readers as the words prior (previous) and incantation (spell, charm). To create a similar effect in the Hindi version, the Sanskrit, typical in mantras, has been used for the spells. Some translators have created new words themselves; others have resorted to transliteration.” 

అనువాదాలూ, మానవసంబంధాలు.

ఇహ, అనువాదాల చేసే మనుషుల గురించి, వారి మధ్య అనుబంధాల గురించి చదువుతుంటే భలే ముచ్చటేసింది. ముఖ్యంగా ఒకే కుటుంబసభ్యులు కలిసిమెలిసి అనువాదం చేయటం. వేర్వేరు భాషా నేపథ్యంగలవారు అనువాదాలు చేస్తూ ప్రేమలో పడ్డమో, లేక అనువాదాలు చేస్తూ కాపురాలు చేస్తున్నారనో చదవటం ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగించింది.

రచయిత-అనువాదకుడు-ఎడిటర్-పబ్లిషర్ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలను అమెరికా కోణం నుండి చెప్పుకొచ్చారు. అంత ఆశాజనకంగా లేదు పరిస్థితిని అని పెదవి విరచినట్టే అనిపించింది నాకు. అనువాదుకులకు జీతభత్యం సరిగ్గా లేకపోవటం, అనువాదుకులే తాము చేస్తున్న పనిని గురించి చులకనగా మాట్లాడ్డం, పబ్లిషర్లు అనువాదుకుల కన్నా రచయితలకే అధిక ప్రాధాన్యం ఇవ్వటం లాంటి ఎన్నో సంగతులు చర్చించారు.

రచయిత-అనువాదకుడి మధ్యనుండే గిల్లికజ్జాల గురించి, కొన్ని సమయాల్లో ఉండే అనుబంధం గురించి వీలైనన్ని చోట్ల సోదాహరణంగా వివరించారు. అనువదించేటప్పుడు రచయిత జోక్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అన్నదీ చర్చించారు. పోయినోళ్ళ రచనలు అనువదించుకోవటం ఉత్తమం అననిపించినా, రచయిత రాసినదాన్నే కాకుండా రచయిత భావావేశాలని కూడా అర్థం చేసుకుంటే అనువాదం మరింత బాగుండచ్చు అని కూడా అన్నారు. అనువాదాల విషయంలో వివాస్పద రచయితగా పేరు తెచ్చుకున్న మిలన్ కుందేరాను మాత్రం ఏ మాత్రం జంకకుండా అనాల్సినవి అన్నారు. అనువాదకుడూ, రచయితా మధ్య సఖ్యత కుదిరితే ఆ అనుబంధం ఎంత బాగుంటుందో తెలిపే విధంగానూ ఉదాహరణలు ఇచ్చారు.

అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో ట్రాన్సలేషన్ కోర్సులు గురించి చాలా చెప్పారు. నాకా అకెడమిక్ బాక్‍గ్రౌండ్ లేకపోవటం అందులో చాలా విషయాలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ట్రాన్సలేషన్ కోర్సును నడపడంలో సాధకబాధకాల గురించి ఆ నేపథ్యం ఉన్నవారికి బాగా అర్థం అవుతుందనుకుంట.

చివరిగా..

రైటింగ్ ప్రాక్టీస్ చేసేవారిలో, సొంత సృజన అంతగా అక్కరకురాని రోజుల్లో, రచనపై పట్టు సన్నగిల్లకుండా ఉండేందుకు అనువాదాలు చేస్తూ ఉండచ్చు అన్నది నేను విన్న అభిప్రాయం. ఖాళీగా ఉండే బదులు, అనువాదాలైనా ఒకే! అన్న వైఖరి మాట. కానీ ఈ పుస్తకం చదివాక, అసలు రచనపై ఏ మాత్రం ఆసక్తి ఉన్నవారైనా ఒకటో అరో రచనలను అనువాదం చేయడం సర్వోత్తమం అనిపించింది. ఏకకాలంలో మనలోని పాఠకునినీ, రచయితనీ పరీక్షించే exercise అనువాదం. ఒకవైపు ఒరిజినల్‍లో ఉన్న పనితనాన్ని తీక్షణంగా పరిశీలించే అవకాశం ఇస్తూనే, మరో వైపు ఆ పరిశీలన్నింటిని మరో భాషకు, సంస్కృతికి తగ్గట్టుగా సమకూర్చటంలో ఉన్న నేర్పుని వెలికితీస్తుంది. ఆ విషయం బాగా బోధపడేట్టు చెప్పారీ పుస్తకంలో.

అనువాదాలపై ఆసక్తి, కాస్తంత తీరకా ఉంటే చదవదగ్గ పుస్తకమనే చెప్తాను. రాసేవారికి చక్కని సలహాలు ఉన్నాయి. చదివేవారికి అనువాదకులపై గౌరవం పెంపొందించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకేసారి చదువుకోవడం కన్నా, అప్పుడప్పుడు కొన్నేసి అంశాలు చదువుకుంటూ పోతే అనువాదాలపై లోతైన విశ్లేషణ చేసే అవకాశం కలిపించగల పుస్తకం.

ఇది మొత్తం అమెరికా నేపథ్యంతో ఉన్న పుస్తకం. మన అనువాదాల గురించి ఏవైనా పుస్తకాలున్నాయా? తెలుగు నుండి ఇతర భాషలకు, ఇతర భాషల నుండి తెలుగుకి అనువాదితమైన రచనలు ఎలాంటివి? వాటి మార్కెట్ ఏంటి? ఇన్ని భాషలున్న మన దేశంలో అనువాదం ఏ స్థానంలో ఉంది?  లాంటివి బేతాళ ప్రశ్నలు అనిపించకపోతే ఓపికున్నవారు అభిప్రాయాలను పంచుకోగలరు.

Book Details:

Performing without a Stage – The Art of Literary Translation

Author: Robert Wechsler

Download link for the book under Creative Common License. 

Further links on Translation:

William Weaver talking about translation, with Paris Review

Interview with Margaret Jull Costa on BookSlut

Thirwell’s “The Joyful Side of Translation”

 

You Might Also Like

11 Comments

  1. కొత్తపాళీ

    కొన్ని వోల్గా రచనలకి ఆరి సీతారామయ్యగారు మంచి ఆంగ్లానువాదం చేశారు. సులేఖ లో ఇంకా ఉండి ఉండొచ్చు.

  2. కొత్తపాళీ

    మంచి సమీక్ష, మంచి విషయం. మనలో చాలా మందికి అనువాదాలతో తొలి అనుభవం బహుశా నండూరి ప్రభృతులు చేసిన ఇంగ్లీషు క్లాసిక్స్ వల్ల కావచ్చు. తరవాత రష్యను సాహిత్యం. రష్యను సాహిత్యానువాదాలు తెలుగులోనే కమ్మగా ఉండేవి, ఇంగ్లీషులో పలుగు రాళ్ళని నవిలినట్టే. అమెరికా వచ్చాక ఇక్కడి తర్జుమా ఒకటి (బహుశా క్రైం అండ్ పనిష్మెంట్ అనుకుంటా) చదివి, వార్నీ రష్యను నవల ఇంగ్లీషులో ఇంత హాయిగా చదవొచ్చా అని ఆశ్చర్యపడ్డాను. నే చదివిన మరో అద్భుత ఆంగ్లానువాదం The Last Temptation of the Christ. దురదృష్టవశాత్తు అనువాదకుడెవరో ఇప్పుడు గుర్తు లేదు. కానీ ఆ పుస్తకం ముందుమాటలో మూలానికి తగిన న్యాయం చెయ్యలేకపోయానేమోనని ఆయన వెలిబుచ్చిన వేదన గుర్తుంది. ప్రస్తుతం సమకాలీన తెలుగు సాహిత్యానికి వస్తున్న ఆంగ్లానువాదాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

  3. జంపాల చౌదరి

    ముఖ్యమైన విషయం. మంచి పుస్తకం. చక్కటి పరిచయం.
    థాంక్స్.

  4. లలిత (తెలుగు4కిడ్స్)

    అన్నట్లు ఇంకో విషయం. పాఠకురాలిగా మంచి అనువాదానికి నాకు తట్టే ఉదాహరణ సుధా మూర్తి గారి “అమ్మమ్మ చదువు”. నాకు గాంధీ గారి జీవిత చరిత్ర చదవడానికి కష్టం అనిపించడానికి ఉన్న కారణాలలో ఒకటి అది అనువాదం కావడం, ఆ అనువాదం ఇంకా బాగా చేసి ఉంటే బావుండును అనిపించడం. అనువాదం గురించి నా ఆలోచనలు ముందుగా పాఠకురాలిగానే ప్రారంభమయ్యాయి. అందువల్లే అనువాదం చెయ్యాలన్న ఉత్సాహం కూడా పుట్టింది. ముఖ్యంగా తెలుగులోకి, అందునా బాలసాహిత్య అనువాదం BookBox కథలను తెలుగులో లభించేలా చెయ్యాలని, అది కూడా తేలికగా అందంగా ఉండాలనే ఆలోచనతో మొదలు పెట్టాను. (అప్పట్లో అవి నాకు బానే అనిపించాయి, ముఖ్యంగా నాకంటే ముందు వేరే వారు చేసినవి చూశాక. ఇప్పుడు చదివితే ఇంకా బాగా చెయ్యవచ్చు అనిపిస్తుంది. అంతే కాక అనువాదం చెయ్యడంలో నా పరిమితులు కూడా నాకు బాగా తెలుస్తున్నాయి). బాలసాహిత్యంలో అనువాదాలు చాలానే ఉన్నట్లున్నాయి. అందులో నేను చదివిన కొన్నిట్లోనూ నాకు నచ్చినవి లేవనే చెప్పాలి. రైలు బడి అనువాదం బావుందని విన్నాను. రాజు-పేద వంటి పుస్తకాల అనువాదాలు కూడా బావున్నాయని విన్నాను. చదివి చూడాలి. తెలుగులో నాకెందుకో నేరుగా వచ్చిన సాహిత్యం ఎక్కువ చదవాలి అనే కోరిక. వేరే భాషలనుంచి, మరీ ముఖ్యంగా ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించినవి చదవాలంటే ఎక్కువ ఇష్టపడను, ముఖ్యంగా fiction లో. ఈ మధ్యే సైన్స్ అనువాదాలతో పని బడడం వల్ల ఆ వైపు కొద్దిగా ఆసక్తి పెరిగింది. అందులోనూ కొన్ని చాలా బావున్నవి చూశాను. కొన్ని చాలా సంక్లిష్టంగా ఉన్నవీ చూశాను.
    ఈ సందర్భంలో మాలతి గారి తూలిక.నెట్ ను కూడా గుర్తు చేసుకోవాలి అనిపిస్తోంది.

  5. లలిత (తెలుగు4కిడ్స్)

    “Translation is a pattern of decisions, not just a bunch of them. This is one reason why it’s impossible to criticize a translation by pointing out isolated mistakes; those “mistakes” might actually be the result of a great deal of balancing, for example, making up in one place for what had to be left out in another part of the work” – Hmmm… interesting perspective about translating.
    “ఏకకాలంలో మనలోని పాఠకునినీ, రచయితనీ పరీక్షించే exercise అనువాదం” – Yes!
    పరీక్షించడం కన్నా, పాఠకుడిని మేలుకొలుపుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివేలా చేస్తుంది. ఊరికే చదివే దానికన్నా జాగ్రత్తగా చదివి ఎక్కువగా ఆలోచించి రెండు భాషలలోనూ బుర్రకీ, ఆలోచనకీ, సృజనాత్మకతకీ పదును పెడుతుంది. అనువాదం చేసేటప్పుడు ఎన్ని కొత్త విషయాలు గమనిస్తున్నానో. ఎన్ని విషయాలు “తెలియవు” అని తెలుసుకుంటున్నానో. ఎన్ని కొత్త విషయాలు, పదాలు నేర్చుకుంటున్నానో, ఎన్ని భావాలు స్పృశిస్తున్నానో. .
    బూదరాజు రాధాకృష్ణ గారి “అనువాద పాఠాలు” కినిగేలో చూశాను. త్వరలోనే కొని చదువుతాను.
    ఇంతకు ముందు పుస్తకం.నెట్ లోనో ఇంకేదైనా గుంపులో చర్చలోనో ఎవరో ఈ పుస్తకమే అనుకుంటాను చదవమని చెప్పినట్లున్నారు. మరి ఇంకేదైనా పుస్తకాలు కూడా సూచించారేమో. వీలైతే వెతికి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అసలు నేను ఈ వ్యాఖ్య వ్రాసే లోపలే ఇంకెవరైనా కొన్ని పుస్తకాల పేర్లు ప్రస్తావిస్తారనుకున్నాను. సౌమ్యా, నీ వ్యాఖ్య అర్థం కాస్త విశదీకరించవా? అది వ్యంగ్యమా? నువ్వనే పుస్తకాలు ఏవి?
    పూర్ణిమా, ఈ వ్యాసం నేను కొంచెం కొంచెమే చదివాను ఇప్పటికి. కానీ మళ్ళీ మళ్ళీ చదవాలి, నువ్వు ఇచ్చిన resources అన్నీ చూడాలి. Thanks. మంచి ఆర్టికల్.
    ఈ సందర్భంలో నాకు నచ్చిన ఇంకో ఆర్టికల్:
    http://momshomeroom.msn.com/articles/4/28838522 ఇక్కడ కూడా అనువాదం గురించిన కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి.

  6. V R Veluri

    it is a nice and informative article. I am glad Purnima garu and I like the same authors, in particular Jose saramago.

    I am douby glad since I have read Weaver and Wechsler, from which she has quoted.
    One of the translators of repute in Europe is Tim Parks. He has extensively translated from Italian to English and vice versa. Also, he is a novelist of some repute in both the languages. In his articles on translation ( a couple of them came in New York Review of Books during the last decade), he says the same things Wechsler pointed out.

    Rachamallu Ramachandra Reddi ( affectionately known as RARA) wrote a fairly decent book entitled ” anuvaada samasyalu.” Unfortunately the 1987 edition I have has thousands of typos. I do not know if a new edition is available.

    He mentions a bunch of examples as bad translations, mostly from English to Telugu. He is very fond of Alexandler Tytler’s book, Essay on the Principles of Translation (1791). Yes! it is 1791 – book!! As a matter of fact a large number later authors who wrote on translations over the past 200 years have repeated much of Tytler. RARA also quotes from Theodore Savory, although he does not agree with him completely.

    I repeat; I have thoroughly enjoyed reading Purnima gari article!

    Best Regards, — Veluri Venkateswara Rao

    1. సౌమ్య

      Veluri garu:
      “Anuvada Samasyalu” was re-published last year..and its available in the market. Here is an article about the book, in pustakam.net .
      http://pustakam.net/?p=7966

  7. sathyavathi

    Thank you for introducing this wonderful book with the link also

  8. సౌమ్య

    Good review! Now, finally, i feel like reading it 🙂
    “మన అనువాదాల గురించి ఏవైనా పుస్తకాలున్నాయా? ”
    -అయ్యో! ఎందుకు లేవూ! నువ్వు మరీనూ!! గొప్ప పుస్తకాలున్నాయిలే కొన్ని. 😉

  9. Kolluri Soma Sankar

    Very nice article. The book and the blog post are very useful for the translators like me. Thanks to Pustakam.net and Purnima garu.
    Soma Sankar

Leave a Reply