కమల

రాసిన వారు: అరి సీతారామయ్య
********************
ఎనిమిది సంవత్సరాల క్రితం, అప్పటివరకూ రాసిన కథలను ఒక పుస్తకంగా తీసుకు రావాలనే ప్రయత్నంలో, ఆ కథలన్నీ మిత్రులు రెంటాల కల్పన గారికి పంపించాను (అవును, ‘తన్హాయి’ కల్పన గారే). చదివి, పుస్తకానికి ఏం పేరు పెడితే బాగుంటుందో తన అభిప్రాయం చెప్పమని అడిగాను. గట్టు తెగిన చెరువు (ఒక కథ శీర్షిక) అని పెడితే బాగుంటుందన్నారు కల్పన గారు.
అయితే ఒక ప్రశ్న కూడా అడిగారు. చాలా కథల్లో కథానాయకి పేరు కమల అని వుంది. ఆ కథలన్నీ ఒకే మనిషి గురించా? లేక ఈ కమలలు వేరు వేరు మనుషులా? ఇదీ కల్పన గారి ప్రశ్న. అప్పటిదాకా నేను ఆ విషయం గమనిమంచలేదు. వెంటనే కథలన్నీ చదివి ఒక్క కథలో తప్ప మిగతా వాటిల్లో అన్నిట్లో కథానాయకి పేరు మార్చేశాను.
మరి నా ప్రయత్నంలేకుండానే నేను గమనించకుండానే కమల పేరు ఈ కథలన్నిట్లోకి ఎలా వచ్చింది?
నేను కమల గురించి మొదటి సారి విన్నది 1960-62 ప్రాతంలో. మామామయ్య ఒకాయన ఆమె గురించి చెప్తుండేవాడు. బురద నీళ్ళల్లో పుట్టినా తలపైకెత్తి ఆకాశంవైపు చూసి నవ్వే పువ్వు కమల. ధైర్యానికీ, ఆత్మ గౌరవానికీ మరో పేరు కమల. మూఢ నమ్మకాల బురద కొంచెం కూడా అంటని మనిషి కమల. ఇంకా ఏంటేంటో చెప్పేవాడు ఆయన. అంతా అర్థం కాకపోయినా వింటూ ఉండేవాడిని నేను.
తర్వాత కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాకు కమలతో పరిచయం అయ్యింది. మా మామయ్య గారు చెప్పింది అక్షరాలా నిజం. ఆమె గురించి ఎలా చెప్పటం. ఎంత చెప్పినా తక్కువే. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. అందంగా ఉండటమే కాదు, ఆమె ఆలోచనలూ, అభిప్రాయాలూ, ఎంతకష్టంలో ఉన్నా తలెత్తుకు తిరగ్గలిగే ధైర్యం, స్థైర్యం… అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు అనిపించింది.
కాలేజీ…ఉద్యోగం…జీవితం…. కమల ఎక్కడ పరిచయం అయిందో గుర్తులేకుండా పోయింది. కమల గురించి మర్చిపోయాను. మర్చిపోయాను అని అనుకున్నాను. కల్పన గారు నా కథల్లో కమలల గురించి చెప్పిందాకా మళ్ళా కమల గురించి ఆలోచించలేదు. అప్పుడు కల్పన గారే చెప్పారు నేను మొట్టమొదట కమలను ఎక్కడ చూశానో.
ఈ మధ్య కమలను మళ్ళా కలిశాను. అప్పటిలాగే ఉంది. అప్పుడెంత అందంగా, స్వేఛ్చగా, ధైర్యంగా, నవ్వుతూ ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అప్పుడున్న అభిప్రాయాలు ఇప్పుడూ ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఇక్కడ చెప్తాను.
కమలను ఒకతను మోసం చేశాడు. శివాలయంలో దండలు మార్చుకుని పెళ్ళిచేసుకున్నాడు. కొన్నాళ్ళతర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. అతను దుర్మార్గుడు, నిన్ను దుఃఖంలో వదిలేశాడు, క్షణికానందంకోసం నువ్వు మోసపోయావు అని ఎవరైనా అంటే కమల ఒప్పుకోదు. వెళ్ళిపోయిన భర్తను ఒక్కమాటకూడా అనదు. సుఖమూ, దుఃఖమూ రెండూ స్థిరమైనవి కాదు, వాటి చంచల క్షణాలే సత్యం అంటుంది. కొన్ని పువ్వులు చాలారోజులు ఉంటాయి, కొన్ని తొందరలోనే వాడిపోతాయి. తొందరలో పోయినవి పూలు కాకుండాపోవుకదా అంటుంది ? ఆయుఃప్రమాణమే జీవితంలో మహత్తర సత్యం కాదంటుంది.
భార్య పోయిన భర్త ఆమె జ్ఞాపకాన్ని పోషించుకుంటూ వర్తమానం కన్నా గతమే స్థిరం అనుకొని జీవితం గడపటంలో పెద్ద ఆదర్శం ఏదీ లేదంటుంది. అలాగే వితంతువుల జీవితాల్లో పవిత్రత ఏమీ లేదంటుంది. భర్త చనిపోయిన తర్వాత అతని స్మృతిలోనే విధవ జీవితం పవిత్రం అవుతుందనే అభిప్రాయాన్ని తీసిపారేస్తుంది కమల. పెద్ద పేరు పెట్టినంత మాత్రానా, పవిత్రత ఆపాదించినంత మాత్రానా లోకంలో ఏదీ మహత్తరం కాదు అంటుంది.
మన ఆచారాలు చాలా ప్రాచీనమైనవి, వాటిని అవమానించటం మంచిదికాదు అన్న వాదనకు సమాధానంగా, ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ పూజనీయం కాదు, ప్రాచీనమైనదంతా స్వతఃసిద్ధంగా మంచిదీ కాదు అంటుంది కమల.
కమల గురించి ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది. కాని నా చాలీ చాలని మాటల్లో ఎందుకూ చెప్పటం. మీరే ఒకసారి ఆమెను చూడండి. ఆమెతో మాట్లాడండి. శరత్ చంద్ర గారి అమ్మాయి. “శేషప్రశ్న”లో ఉంటుంది. ఏ పుస్తకాల షాపులోనైనా కనపడుతుంది.
డా. దార్ల వెంకటేశ్వరరావు
నిజంగా కమల గురించే చెప్తున్నారేమో…. అనుకుంటూ ఉత్కంఠతో చదివితే… అబ్బో వ్యాసాన్ని కూడా రసవత్తరం చేశారే…
దార్ల
sudarshan
कमला. . शरतजी का बेटी
manjari lakshmi
బయట ఇంత వాదించే కమల ఇంటి దగ్గర విధవల ఆచారం ప్రకారమే ఒక్క ప్రొద్దు భోజనం చేస్తుందని అందులో ఉంది. ఎందుకనీ?
నిషిగంధ
భలే విభిన్నంగా చెప్పారండి కమల గురించి! తన కోసమే శేషప్రశ్న వరుసగా మూడుసార్లు చదివాను.. ఇప్పుడు మీ పరిచయం చూశాక మళ్ళీ వెంటనే చదవాలనిపిస్తోంది.. శరత్ కధానాయికలలో నాకు అత్యంత ఇష్టమైనవాళ్ళు కిరణ్మయి, కమల
హెచ్చార్కె
భలే చెప్పారు.
Jampala Chowdary
ఉత్కంఠ కల్గించారు.