కొప్పులవారి కతలూ…కబుర్లూ

రాసిన వారు: అమరశ్రీ
***********
PL 480 అంటే ఈ తరం వాళ్ళకు తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన పది సంవత్సరాలకే మన దేశ జనాభా ఆకలికోరల్లో చిక్కుకుని అలమటిస్తున్న నేపథ్యంలో PL 480 ప్రోగ్రాం పేరిట మనకు గోధుమలు ఎగుమతి చేసారు అమెరికన్లు. 1955వ సంవత్సరం నుండి దాదాపు పదేళ్ళు ఇది సాగింది. అలా అమెరికన్లు మనల్ని ఆకలిబారి నుండి రక్షించారు. ఆకలి చావులు తగ్గిపోయాయి. తర్వాత మనకి బుద్ధి వచ్చి హరిత విప్లవం (Green Revolution) చేపట్టాము. ఆహారధాన్యాలు పండించడంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాం. PL 480 గోధుమ పుణ్యమా అని మనం ఆకలిరాక్షసిబారినుండి బయటపడ్డాం కానీ ఆ గోధుమతోపాటు దిగుమతైన పార్థీనియం అనే కలుపుమొక్క మహమ్మారిబారిన పడ్డాం. వయ్యారాలుపోతున్న పార్థీనియం మొక్కను చూసి మన రైతులు దాన్ని వయ్యారిభామ అన్నారు. ఈ weed వున్నచోటల్లా ఉబ్బసం ప్రబలిపోయింది. ముఖ్యంగా పూనా, బెంగళూరు నగరాల్లో. పార్థీనియం మొక్కని వయ్యారిభామ అంటారని డాక్టర్ కొప్పుల హేమాద్రి గారి పుస్తకం “కొప్పులవారి కతలూ…కబుర్లూ” చదివితే తెలిసింది.

“కొప్పులవారి కతలూ…కబుర్లూ” పుస్తకం కవర్ పేజి multi-colour లో వేశారు. ఆ illustrationలో వున్నవి diagonalగా — పార్థీనియం కలుపుమొక్క ఒక చివర, మధ్యలో ఒక భామ, ఆ పైన ఖళ్ ఖళ్ మంటూ దగ్గుతూన్న ఓ వ్యక్తి. పుస్తకం తిరగేస్తే 127 పేజీలో ఈ “వయ్యారిభామ” వ్యవహారం వుంది. పుస్తకం ముఖచిత్రం 127 పేజీలో వ్యాసానికి సరిగ్గా సరిపోయింది. కాకపోతే 127వ పేజీ వరకూ ఈ చిత్రం ఏమిటో, ఎందుకో అర్థం కాదు. పుస్తకం cover jacket పై వున్న మాట “కొప్పులు” plus అదొక రకంగా వున్న భామ చిత్రం, నీలిరంగు border అన్నీ కలిసి ఇదేదో బూతు పుస్తకమేమో అన్న వూహ వస్తే పప్పులో కాలేసినట్లే. ఇది అలాంటి పుస్తకం కాదుకదా, చిన్నా, పెద్దా అందరూ చదివి ఆనందించాల్సిన పుస్తకం. అసలీ పుస్తకానికి కవరు పేజీ పుస్తకం లోపల వున్న చక్కటి sepia-tinted black & white ఫోటో అయితే ఎంతో బావుండేది. ఆ ఫోటోలో ఒకాయన టోపీ పెట్టుకుని, భుజానికి ఓ సంచీ తగిలించుకుని, ఎక్కడో సహ్యాద్రి కొండల్లో కూర్చున్నారు. అతనే ఈ పుస్తక రచయిత డాక్టర్ కొప్పుల హేమాద్రి. హేమాద్రిగారు మందుమొక్కల గురించీ, గిరిజనవైద్యం గురించీ రాసిన చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆయన పుస్తకం (తెలుగు అకాడమి ప్రచురణ) “ఆంధ్రప్రదేశ్ లో మందుమొక్కలు” ఎన్నో రిప్రింట్లకు నోచుకుని ఇప్పుడు రివైస్డ్ ఎడిషన్ కూడా రిప్రింట్ దిశగా పయనిస్తోందని పుస్తకంలో వుంది.

“కొప్పులవారి కతలూ…కబుర్లూ” పుస్తకమంతా మంచి art పేపర్ పై ముద్రించారు. అందులో ఎన్నో ముచ్చటైన ఫొటోలు. కొన్ని black& white, మరి కొన్ని కలర్. ప్రతి వ్యాసానికీ దుర్గాప్రసాద్ (Cartoonist బాబు) illustrations వున్నాయి.

పుస్తకం ముందుమాట డాక్టర్ ఆవత్స సొమసుందర్ గారు రాశారు. ఇంకొక ముందుమాట డాక్టర్ సామల రమేష్ బాబు (‘నడుస్తున్న చరిత్ర’ సంపాదకులు) రాస్తూ ఈ పుస్తకం వల్ల సమాజానికేమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్న వేసుకుని, సమాధానం ఆయనే చెపుతారు: “ఆత్మకథల వల్ల సమాజానికి ఒనగూడేదానికంటే ఎక్కువ ఉపయోగం జీవితానుభావాలను సామాజిక స్పృహతో రచించడం వల్ల వుంటుంది.” ఈ పుస్తకంలో అనుభవాలు సామాజిక స్పృహతో రాసినవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నా దృష్టిలో విశిష్టమైనది ముందుమాటలో డాక్టర్ సామల రమేష్ బాబు చెప్పిన మరో విషయం: “దీన్ని చదివినవారిలో కొందరైనా తమ జీవితానుభూతుల్ని కూడా తోటి సమాజంతో పంచుకోవడానికి పూనుకుంటారని నా ఆశ”. ప్రతి ఒక్కరి అనుభవాలు విలువైనవే. ప్రయత్నం చేసి చెప్పాలేగానీ ప్రతిఒక్కరి జీవితమూ ఓ కథే. ముఖ్యంగా యాభయ్యేళ్ళు దాటినవారు రాయకపోతే వాళ్ళ జీవితం ఒకతరం దాటింతర్వాత వారి కుటుంబీకులకు కూడా తెలియని పరిస్థితి కలగవచ్చు. కథ వుంటే వుండవచ్చుగానీ పాఠకులుంటారా అన్న సందేహం వద్దు. ప్రతి ఒకరికీ ఒక కథవున్నట్లే ప్రతి కథకీ కొంతమంది పాఠకులుంటారు. కదా?

“కొప్పులవారి కతలూ…కబుర్లూ” పుస్తకంలో సగం కబుర్లు తనవూరు గొల్లప్రోలు గురించి. ఇందులో కనిపించే వ్యక్తులు — రచయిత తాతగారు, అమ్మా నాన్నలు, అక్కలు, బళ్ళో గురువు, స్నేహితులు, మంత్రగాళ్ళు — ఇలా ఎందరో. అందరి గురించి తీయటి జ్ఞాపకాలు. చదివిన ప్రతి ఒకరికీ వారి చిన్ననాటి విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. పల్లె వాతావరణంలో పెరిగిన వారికైతే ఇది మృష్టాన్నభోజనమే. మిగత సగం వ్యాసాల విషయాలు — కాలేజి చదువు, కాలేజి గురువులు, colleagues, ఉద్యొగంలో దోహదపడ్డ పెద్దలు, వృక్షశాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా గిరిజన వైద్యం (herbal medicine).

హేమాద్రి గారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రిజర్వేషన్ అసిస్టెంట్ గా పని చేస్తున్నప్పుడు ఆ వుద్యోగం లోకల్ వాళ్ళకు ఇవ్వలేదని మరాఠి వాళ్ళు గునిశారట. “అలారే! ఆంధ్రావాలా!” (వచ్చాడురా ఆంధ్రోడు) అని గుసగుసలాడేవారట. ఉద్యోగం లో చేరిన కొత్తలో బొటనిస్టులంతా మహా మేధావులని అనుకున్నారట హేమాద్రిగారు. వారికి వారు చేస్తున్న పనిమీద శ్రద్ధలేదని కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నారాయన. అప్పటికింకా సైంటిస్టు కాకపోయినా తను చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. అతితక్కువ సమయం లో 22 కొత్త జాతి మొక్కలని కనిపెట్టిన ఘనత దక్కింది. ఆ పరిశోధనల ఫలితాలే తర్వాత తన పిహెచ్.డి.కి దోహదకారి అయ్యాయి.

భివాడికుర్డ్ గిరిజనగూడెంలో మకాం చేసి, పూర్వాశ్రమంలో బందిపోటు ముఠాలో పనిచేసిన ఠాకుర్ అనే లోకల్ గైడ్ సహయంతో సహ్యాద్రిలో తన పరిశోధనల అనుభవాలు “మెట్టపీతల పులుసూ… అక్షయపాత్ర పెరుగూ” అన్న వ్యాసం లో చాలా అందంగా పొందుపర్చారు. అందులోనే ఠాకూర్ నేర్పిన “కీరదోస ప్యూరిఫికేషన్ టెక్నిక్” వుంది. మనం కీరదోస కాయని ఎలా తింటాం? చిన్న సైజుదైతే అలాగే లాగించేస్తాం. కాస్త పెద్ద సైజయితే గుండ్రంగా ముక్కలుగా కోసి తింటాం. ఇది తప్పు(ట). కీరదోసను కాడ వున్న చోట సెంటిమీటర్ మందాన చక్రంలా కోసి ఆ ముక్కను మిగతా కాయనుండి విడదీయకుండా గంధం చెక్కలా రుద్ది కాయలో వున్న పసరును తీసి పారెయ్యాలి. ఆ పసరు ఆరొగ్యానికి మంచిది కాదు. దాన్ని తీసేసిన తర్వాత తింటే ఎంతో మంచిది అని గిరిజనులకు తెలుసు. గిరిజనులకు తెలిసిన ఈ విషయం మన ప్రకృతివైద్యులకు, మరెవరికీ తెలియదే అని రచయిత హేమాద్రిగారికి కోపం.

తన సరికొత్త ఆవిష్కరణలు, అందులో ఒకటో రెండో ఎలా chance discovery లో ఇంకో వ్యాసంలో. అందులోనే శ్వేత పునర్నవ అనే మొక్క వ్యవహారం వుంది. ఆ మొక్కను సాహా, కృష్ణమూర్తి అనే వృక్ష శాస్త్రవేత్తలు కొత్త discovery గా C.S.I.R. జర్నల్లో ప్రకటించుకున్నారు. తర్వాతెప్పుడో పూనా సదరన్ కమాండ్ కాంపౌండ్ లో ఆ మొక్కను చూసిన హేమాద్రిగారి గుండె ఝల్లుమంది. ఆ మొక్క సాహా, కృష్ణమూర్తి discover చేసేంతవరకూ అనామికగా వుందని నమ్మలేక గ్రంథాలన్నీ వెతికితే దాన్ని లిన్నెయస్ అనే సైంటిస్టు 1753 లోనే discover చేసారని తేలింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ హేమాద్రిగారు రాసిన వ్యాసం C.S.I.R. జర్నల్ ప్రచురించలేదట. మన intellectual honesty అంత గొప్పది మరి.

పాలకూర తీగ/ ముక్కుతుమ్ముడు తీగ/ సుకాలకాడ పేరు విన్నారా? ఈ ఆకును తిన్న పశువులు ఎక్కువ పాలిస్తాయి. కోళ్ళు ఎక్కువ గుడ్లు పెడతాయి. ఈ ఆకు తిన్న కోళ్ళ గుడ్ల yield 60% పెరిగిందట! ఈ ఆకు చూర్ణాన్ని తన బంధువులమ్మాయికి ఇచ్చారట హేమాద్రిగారు. పెళ్ళయి ఐదేళ్ళయినా పిల్లల్లేని ఆమె సంవత్సరంలోగా తల్లి అయిందట. ఈ ఉదంతం “పాలూ, గుడ్ల ఉత్పత్తికి పాలతీగ కూర” వ్యాసంలో వుంది.

అశ్వగంధ అంతటి గొప్పదే గోమూత్ర శిలాజిత్. దక్షిణ భారతదేశంలో గోమూత్ర శిలాజిత్ కనుగొన్న ఖ్యాతి హేమాద్రిగారిదే. దీన్ని ఎలా discover చేశారన్నది “కడప కొండల్లో గోమూత్ర శిలాజిత్” వ్యాసం. గోమూత్ర శిలాజిత్ లోకల్ పేరు “రక్తమండలం” — తస్సాదియ్యా! కడపకు తగ్గ పేరే అంటారు రచయిత. ఇది క్షయ, diabetis, HTN రోగాలకే కాక anti ageing గా పనిచేస్తుంది. గోమూత్ర శిలాజిత్ antacid గా కూడా దివ్యంగా పనికొస్తుందంటారు హేమాద్రిగారు.

నేలమర్రి ఆకు గురించి వ్యాసం “సొమ్మొకడిది…సోకొకడిది”. ఈ ఆకుకి క్యాన్సర్ ను అరికట్టే గుణం వున్నట్లు గిరిజన వైద్యులకు తెలుసు. అదే విషయం అమెరికన్ల ప్రాథమిక ప్రయోగాల్లో తేలింది. ఈ ఆకు ప్రభావమేమిటో హేమాద్రిగారు తనపైనే ప్రయోగం చేసుకున్నారు. తన బుగ్గమీద ఒక గడ్డ మూడేళ్ళుగా పెరిగింది. అప్పుడు నేలమర్రి ఆకును ఆ గడ్డపై రుద్దడం మొదలెట్టారు. వారానికల్లా గడ్డ పూర్తిగా కరిగి మాయమైందంటారు రచయిత.

“కీళ్ళవాతానికి కోయదొర వైద్యం” అనే వ్యాసంలో హేమాద్రిగారు తన బంధువుల అమ్మాయికి కీళ్ళనొప్పులు ఎలా తగ్గిపోయాయో రాస్తారు. అమెకు విపరీతమైన కీళ్ళ వాపులు, నొప్పి. కాలు కింద తీసి పెట్టలేని పరిస్థితి. హేమాద్రిగారికి ఈ జబ్బుపైన అవగాహన అంతంతమాత్రమే. అయినా ఒక కోయదొర చెప్పింది ఆ అమ్మాయికి మందుగా ఇచ్చారు. రెండ్రోజుల్లోనే కీళ్ళవాపులు తగ్గిపోయాయి. నొప్పి మాత్రం అలాగేవుంది. అప్పుడు మళ్ళీ కోయదొర చెప్పిన “తల్లి మందు” చికిత్స చేసారు. మూడంటే మూడురోజుల్లో నొప్పులు తగ్గుముఖం పట్టాయి. “తల్లి మందు” ఏమిటి? నెమలిచెట్టు లేత ఆకుల్ని మహాముదురు ఆకులో పొట్లం కట్తి, కుమ్ములో (కాలి, బూడిద అయిపోతున్న నిప్పు) ఉడికించి రసం తియ్యాలి. ఆ రసమే తల్లిమందు. ఆ మందు ఎలాంటి ఫలితాన్నిచ్చింది? మంచంలో కదల్లేని స్థితిలో వున్న ఆవిడ మందుతీసుకున్న కొన్నాళ్ళకి, అరవై మెట్లెక్కి, హేమాద్రిగారి అపార్ట్ట్మెంట్లోకి వచ్చి ఆయన ఎదురుగా కూర్చుని ఆశ్చర్యంలో ముంచెత్తిందట. ఆశ్చర్యమేకదా!

“పొలుసు చర్మానికి గొల్లప్రోలు తైలం” వ్యాసం సోరియాసిస్ కు అంకుడాకులను కొబ్బరినూనెతో కలిపిన నూనెను పూతపూస్తే ఎంత మంచి ఫలితాన్నిచ్చిందో తెలియచేస్తుంది.

పుస్తకంలో వ్యాసాలు — ముఖ్యంగా గిరిజన వైద్యంకు సంబధించినవి — చాలా ఆసక్తికరంగా వున్నాయి. గిరిజన వైద్యం చాలా మేలు చేస్తుంది అని రచయిత సోదాహరణంగా చెప్పారు. ఈ అమూల్య సంపద ఇప్పటికే చాలావరకు కాలగర్భంలో కలసిపోయిందంటారు రచయిత. మిగిలిందైనా మనం కాపాడుకోవాలి. దానికి NGOలు, ప్రభుత్వం విడివిడిగానూ, కలిసికట్టుగానూ కృషిచేయాల్సిన అవసరం ఎంతేనా వుంది. అంతేకాదు. గిరిజన వైద్యం అశాస్త్రీయం అన్న అపోహ తొలగిపోవాలంటే ఈ వైద్య విధానంపై విస్తృత పరిశోధనలు జరగాలి. దానిక్కూడ అందరూ నడుం కట్టాలి.

ఏకబిగిన చదివిస్తుందీ పుస్తకం. హేమాద్రిగారు రాసిన విధానం బాగుంది. ఏ వ్యాసమూ రెండు మూడు పేజీలకు మించి లేదు. అనవసర విషయాలను రాసి పేజీలు నింపే ప్రయత్నం జరగలేదు. ఎక్కడా విసుగనిపించదు. చాలా సరళంగా, అక్కడక్కడా సరదా మాటలతో అందరికీ అర్థమయ్యేవిధంగా రాసారు. ఆత్మకథల్లో స్వోత్కర్ష సహజం. హేమాద్రిగారు ఈ విషయంలో సమ్యమనం పాటించారు. ఆత్మకథల్లో పునరుక్తిదోషం కూడా మామూలే. అదికూడా ఇందులో లేదనే చెప్పాలి.

******

కొప్పులవారి కథలూ…కబుర్లూ
Price: Rs.225
పబ్లిషర్: డాక్టర్ కొప్పుల హేమాద్రి, విజయవాడ
Year of publication: 2011
Dr. Koppula Hemadri’s House of Tribal Medicine
Phone: 08662541711, 9848296865
e-mail: koppulahemadri@yahoo.com

You Might Also Like

4 Comments

  1. Subhashini Yalamanchi

    Is it possible for me to subscribe “Koppulavari kathalu—-kaburlu” ?

    1. Mafhu

      You can buy the book from the Author. You can contact him through his email or telephone number.
      The author lives in Bijayawada. If you send full price he will send by Curior if you are located on India.

  2. budugoy

    మంచి పరిచయం. కవర్ పేజీ చూసి, పుస్తకం దాకా ఎందుకూ..వ్యాసమే చదవొద్దనుకున్నాను..వెల్..almost missed it.

  3. రామ

    చాలా బాగుంది. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply