శరత్ సాహిత్యం-10: కథలు
విశాలాంధ్ర వారు ఓ ఐదారేళ్ళ క్రితం క్రితం శరత్ సాహిత్యాన్నంతటినీ తెలుగులో పది భాగాలుగా ముద్రించే పనికి పూనుకున్నారు. (తర్వాత భాగాల సంఖ్య పెంచారేమో నాకు తెలీదు). దేవదాసుతో మొదలై, ఆయన నవలలూ, నవలికలూ, నాటకాలన్నీ అయ్యాక, చివరి భాగంగా 2008లో ఈ కథలు ముద్రించారు. దీని అనువాదకులు బొందలపాటి శివరామకృష్ణ గారు.
(నేనూ శరత్ అభిమానినే అని ముందే చెప్పేసి ఈ వ్యాసం రాస్తున్నాను. అయితే, ఆ అభిమానం కొన్ని నవలలకి మాత్రమే పరిమితం.)
కథల విషయానికొస్తే, మొత్తం ఇరవై రెండు కథలు. మూకుమ్మడి ఏడుపు కథలు. ఇవి చదివితే ప్రపంచం మొత్తంలో అదృష్టహీనులే అన్న భావన కలుగుతుంది. అరే! ఒక్క కథలో అయినా కాస్తైనా ఆశావాదం కనబడదే! కథలన్నాక మనుషులు రకరకాలుగా రాస్తారు – ఒప్పుకుంటాను. కానీ, 22 కథలు ఒకేలాగ రాస్తే, మిగితా సంగతులటుపెడితే value for money ఎక్కడిది? ఆయన శరత్తే అయినా కూడా, దీన్ని ఎలా అంగీకరించగలను?
అన్ని కథల్లో దాదాపు ఒకే రకం సీక్వెన్స్. ఒక దురదృష్టవంతుడైన నౌకరు తానెంతో సహృదయంతో యజమానులకి సేవచేసినా కూడా తనకి ఒళ్ళుతెలీని జ్వరంలో యజమానిచేత దెబ్బలు తిని, చివరాఖరుకి జ్వరంతోనే కన్నుమూయడమో (హరిచరణ్), ఒకానొక విధవకు తన ఇంట్లో స్థానమిచ్చి, ఆమె ఎవర్నో పెళ్ళి చేసుకొమ్మంటే చేస్కుని ఆ తరువాత కూడా ఈమె మీద ధ్యాసతో ఆమెని పట్టించుకోకుండా ఉండటమూ, దీని వల్ల ఎవరికీ సుఖం లేకపోడమూ (ఛాయా-ప్రకాశ్), నవలలూ గట్రా ఎక్కువ చదివేసి, ఏదో ఊహించేసుకుని, వివాహా సమయానికి ఆమె ఇష్టపడ్డవాడు పారిపోతే, యాభైఏళ్ళ ఉబ్బసరోగికి ఆమెని కట్టబెడితే, అతను చనిపోతే, ఈమె అన్న పంచన చేరితే, అన్న విలనైతే… (అనుపమ ప్రేమ).. ఇలా…ప్రపంచంలోని కష్టాలన్నీ ఈ పాత్రల్లోనే ఉంటాయి. కష్టాల తరువాత ఇంకేమీ ఉండదు. వాళ్ళా కష్టాల్లో కరిగి కన్నీరై, వంగి వడియాలైపోతారు. అంతే!
నిజ జీవితంలో చాలా మంది ఇప్పటికీ అలాగే ఐపోతూ ఉండవచ్చు. కానీ, కథలో అలా వాళ్ళు చస్తూ బ్రతుకుతున్నారనో, మూకుమ్మడి కష్టాల దాడికి బలౌతున్నారనో అనేసి ఊరుకుంటే ఏమి లాభం? అలాగని ఈ జీవితాల గురించి అందరికీ తెలియాలి అని రాసాడు అనుకుందాం…తెలిసాక? శరత్ కథల్లో ఎప్పుడూ ఇంతేగా…విషాదాలూ ఇవేగా? అని కొట్టి పారేయొచ్చు. కానీ, ఓ ‘శ్రీకాంతా’ నో, ఓ ‘పథేర్ దాబీ’ నో (రెండూ వేర్వేరు రకాల నవలలనుకోండి) రాసిన శరత్ ఇలా ఊరికే ఏడుపుగొట్టు కథలు ఏడుపుగొట్టుగానే మిగిల్చి వదిలేస్తే…. అభిమానులకు ఏడుపు రాదూ?
మీరు మామూలుగా ఉన్నప్పుడూ ఓకేగానీ, మీరే బాధల్లో ఉన్నప్పుడు మాత్రం చస్తే ఈ పుస్తకం చదవకండి. చించి అవతల పారేయబుద్ధేసినా ఆశ్చర్యం లేదు. (130 రూపాయలకి రెక్కలు అప్పుడు!!). పెళ్ళి కాబోయే ముందో, ఉద్యోగం లో చేరబొయ్యే ముందో, ప్రమోషనొచ్చినప్పుడో – అలాంటి మూడ్లో కూడా చస్తే చదవకండి. చీ! వెధవ జీవితం! అనిపిస్తుంది అప్పుడుకూడా. ఆనందమా, ఆలోచనా, ఆరాటమా, విషాదమా…ఏమిటో.. అనుకుంటున్నప్పుడు కూడా చదవకండి. చదివితే ఇంకా అయోమయం ఎక్కువౌతుంది. ఏదో టైంపాస్… అనుకుని మాత్రం చదవండి. చదివి ఆలోచిస్తూ ఉండిపోకండి. అప్పుడు మళ్ళీ ఛీ! అనిపిస్తుంది పెపంచికం మీద. చదివితే చదివారు కానీ, ఇలా అభిప్రాయం రాయాలని ప్రయత్నిస్తే, అప్పుడు మీమీద మీకే చిరాకేస్తుంది చివరికి.
కథలన్నింటిలోనూ ఓ సందేశమూ, ఓ సామాజిక స్పృహ, ఓ స్పూర్తీ…ఇలా ఉండాలన్న నియమాలేవీ నాకు లేవు. కానీ, మూసలాగా ఒకే పద్ధతిలో ఉండడాన్ని మాత్రం నేను భరించలేను. అందుకేనేమో ఈ అసంతృప్తి. అందులోనూ, పూర్తి 200% నిరాశావాదాన్ని భరించే స్థితిలో చదవలేదు నేను ఈ పుస్తకాన్ని. అదో కారణం కావొచ్చు. ఈ కంప్లైంట్లలో అనువాదం విషయం మరిచాను. అనువాదం పర్లేదు. అయితే, ఆంగ్లంలో చదవడం నయమేమో అనిపించింది.
ఇప్పుడీ పుస్తకం గురించి రాసేది చదివి నా మీదకి దండెత్తడం దండగ అని కూడా ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ ఏ ‘పథేర్ దాబీ’ లాంటిదో లేక ‘శ్రీకాంతా’ లాంటిదో, లేక కొంతలో కొంత ‘పల్లి సమాజ్’ లాంటిదో తగిలితే, మళ్ళీ శరత్ నమోనమః అనడానికి నాకెలాంటి సంకోచం ఉండదు అంటే నేను ఆయన అభిమానినే అని అర్థం చేసుకోండి. అంచనాలూ,ఆశలూ ఎక్కువ ఉన్న అభిమానిని అనమాట.
పుస్తకం వివరాలు:
శరత్ సాహిత్యం – పదవ సంపుటం: కథలు
ముద్రణ: విశాలాంద్ర పబ్లిషింగ్ హౌజ్, హైదరాబాద్
ప్రధమ ముద్రణ 2008
వెల : 130/-
ramanarsimha
సుజాత గారు,
చాలా చాలా ధన్యవాదాలు..
సుజాత
రామనరసింహ గారూ,
మీరు లేఖినిలో టైప్ చేసిన మాటర్ ని కాపీ చేసి ఈ మెయిల్ పంపేటపుడు పేస్ట్ చేయడమే! ఒకవేళ జీ మెయిల్ అకౌంట్ ఉంటే అక్కడే మీకు డైరెక్ట్ గా తెలుగులో టైప్ చేసుకునే సౌకర్యం ఉంది కూడా!
ramanarsimha
@SOUMYA:
I can type in Lekhini..
But.. my problem is how to send the e-mial..
after typing in Lekhini..
srinivasarao
telugulo type elagante evaru chhepparentandi babu.natopatu krishna gaaru kuuda adugutunnaru mari.
సౌమ్య
@Srinivasarao: You can use lekhini.org for typing in Telugu.
desha raju
౮౦ లో శరత్ గారి srikantha చదివాను. అంత గ్యాపకం లేదు. translator యవరో తెలిదు. అ బుక్ కూడా ఉండాలి ఇంట్లో వెతకాలి పాత విషయం గుర్తుకు చేసారు . చాలా thanks .
krishna
telugu lo type ela
విజయవర్ధన్
@మేధ:
మేధ గారు, thank you.
మేధ
@విజయవర్ధన్ గారు:
ఇప్పుడు విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి ..
విజయవర్ధన్
@సుజాత:
సుజాత గారు, Thank you.
సుజాత
విజయవర్ధన్ గారు,
మరో రెండు సెట్ల పుస్తకాలు చక్రపాణి గారివి ఉన్నాయట. అవి ప్రస్తుతం తమ వద్దలేవనీ, త్వరలో వస్తాయనీ వాల్డన్ వాళ్ళు చెప్పారు. శ్రీకాంత్ ని ఆయన అనువందించినట్లు లేదు.
హైద్రాబాదులో వాల్డన్ బేగం పేట లో పుల్లారెడ్డి స్వీట్స్ పక్కనే ఉంది. బ్లూ మూన్ హోటల్ ఎదురుగా! (ఇప్పుడు బ్లూ మూన్ హోటల్ పక్కన లాండ్ మార్క్ కూడా ఉంది)
రెండో వాల్డన్ బంజారా హిల్స్ లో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పటల్ పక్కన ఉంది. (సినీమాక్స్ మల్టీప్లెక్స్ ఎదురుగా)
అలాగే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఒడిస్సీ షో రూం ఉంది. అక్కడ కూడా ఉన్నాయి ఈ పుస్తకాలు!
విజయవర్ధన్
@సుజాత:
సుజాత గారు, Thank you. చక్రపాణి గారి అనువాదాల్లో (మీ టపాలో చదివా) ఇవి మాత్రమే వున్నాయి:
దేవదాసు
శ్రీవారు
నవ విధాన్
బడదీది
సుభద
కాశీనాథ్
పరిణీత
జ్ఞానద
సవిత
పల్లీయులు
బిందుగారబ్బాయి
రాముని బుద్ధిమంత తనం
నా దగ్గర దేశీ పబ్లికేషన్స్ వారి ప్రచురణలు కొన్ని వున్నాయి (బెజవాడ గోపాలరెడ్డి గారనుకుంటా అనువదించారు). నేను చదివిన version అదే. ఐతే చక్రపాణి గారు “శ్రీకాంత” నవల అనువదించలేదా. లేక వేరేగా ప్రచురించారా?
Walden ఎక్కడుందండి? నాకు హైదరాబాదు పుస్తకాల దుకాణాలు తెలియవు.
సుజాత
సౌమ్య,
నాకసలు చక్రపాణి గారి అనువాదాలు దొరికిందే వాల్డన్ లో! ఆస్ఛర్యం పడి ఆ అననందంలో ఒక పోస్టు కూడా రాశాను చూడండి.
http://manishi-manasulomaata.blogspot.com/2009/07/blog-post.html
లాండ్ మార్క్ నేను డీవీడీల కోసం, ఇంగ్లీష్ పుస్తకాల కోసం వెళ్తాను. ముఖ్యంగా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తే జేబుకు పెద్ద చిల్లు పడుతుంది.
సౌమ్య
@Sujatha garu: oh… వాల్డన్, లాండ్ మార్క్ వంటి షాపుల్లో తెలుగుపుస్తకాలు కూడా దొరుకుతున్నాయా- వావ్!
(నేను వాల్డెన్ వెళ్ళి నాలుగేళ్ళైంది. లాండ్మార్క్ అసలు వెళ్ళలేదు. అజ్ఞానాన్ని మన్నించండి).
సుజాత
విజయవర్ధన్ గారూ, చక్రపాణి గారి అనువాదాలు వాల్డన్ లోనూ, నవోదయ బుక్ స్టోర్స్(ఆర్య సమాజ్ ఎదురు సందులో, బడి చౌడి)లో దొరుకుతున్నాయి.లాండ్ మార్క్ లో కూడా ఒక కాపీ చూశాను.
విజయవర్ధన్
@సుజాత:
చక్రపాణి అనువాదాలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి తెలిజేయండి.
మాలతి
పెళ్ళి కాబోయే ముందో, ఉద్యోగం లో చేరబొయ్యే ముందో, ప్రమోషనొచ్చినప్పుడో – అలాంటి మూడ్లో కూడా చస్తే చదవకండి – హాహా, బాగుంది మీ స్పందన. నేను చదివినప్పుడు, బొందలపాటి ప్రచురణలు, ఆరోజుల్లో ఎందుకు చదివేనో, చదివి ఏం అనుకున్నానో గుర్తులేదు. కానీ ఒకే రచయితవి తీసుకుని చదివినప్పుడు, ఇలా ఒకే కోణం కనిపించడం ఎక్కువే అనుకుంటాను. అందులోనూ ఏదో ఒకవాదం తీసుకుని రాసే రచనలు. శరత్ స్త్రీవాదం అనో మరో వాదం అనో చెప్పకపోయినా, ఆ రోజుల్లో దేశపునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా, ఆనాటి సామాజిక పండితుల (సోషల్ సైంటిస్టులు)ఆలోచనాధోరణికి అనుగుణంగా రాసేరేమో. మీరు కొంచెంసేపు మరేవేనా కథలు చదువుకుని మళ్లీ రండి. :))
సుజాత
శరత్ సాహిత్యంలో vulnarable పాత్రలెక్కువ! అభిమానమూ, కన్నీళ్ళూ, ప్రేమ, ద్వేషమూ, ద్వేషాన్ని క్షమించగలిగే హృదయ సౌందర్యమూ,నిరాశ, ఓదార్పులు,మనుషుల్లోని మనో వైకల్యాలు,(ఎంతమందిని చూశాడో కదా),ఇవన్ని వొత్తుగా ఉంటాయి.వీటన్నింటినీ నగ్నంగా భరించగలిగే ఓపికా, మూడ్ ఉన్నపుడే ఆయన పుస్తకాలు చదవాలి. టైమ్ పాస్ కోసం అసలు చదవలేం!
అనువాదం విషయానికొస్తే చక్రపాణి గారు అనువదించిన శరత్ సాహిత్యం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. దాన్ని మించిన అనువాదాలు(శరత్ పుస్తకాలకు సంబంధించి)నాకు ఇంకెక్కడా కనపడలేదు. అద్భుతం! వీలైతే చదవండి.