Interpreter of Maladies – Jhumpa Lahiri
రాసి పంపిన వారు: క్రాంతి గాయం
జుంపా లాహిరి రాసిన Interpreter of maladies అనే పుస్తకానికి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది అని వినడమే కాని చదివే అవకాశం రాలేదు అప్పట్లో.అదేంటో ఎన్ని పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకం గురించి అడిగినా కాని “ప్రస్తుతానికి స్టాకు లేదు,ఒకవారం తరవాత రండి తెప్పించి ఉంచుతాము” అనే సమాధానమే ఎదురయ్యేది.వారం తరవాత వెళితే మళ్ళీ అదే డైలాగు.ఈ పుస్తకం కోసమని తిరుగుతూ ఆవిడ రాసిన మిగతా రెండు పుస్తకాలు(Unaccustomed Earth,The Namesake)చదవడం జరిగింది.ఈ రెండు పుస్తకాలు చదివిన తరవాత ఎలాగైనా Interpreter of maladies చదివి తీరల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నాను.అదృష్టవశాత్తు మా లైబ్రరీ కేటలాగ్ లో ఈపుస్తకం కనిపించింది,కాని అవైలబిలిటి స్టేటస్ చూస్తే in-use అని చూపించింది కంప్యూటర్.మూడువారాల తరవాత కూడ స్టేటస్ లో మార్పు లేదు.ఇక తప్పదని అక్కడి కోఆర్డినేటర్ ని అడిగాను.ఆవిడ ఒక గంటసేపు వెతికి “పొరపాటున ఎవరో వేరే అరలో పెట్టారు,కంప్యూటర్ లో కూడ స్టేటస్ అప్ డేట్ చేసినట్టులేరు” అని పుస్తకాన్ని తెచ్చి నాచేతిలో పెట్టింది.అలా దాదాపు ఏడు,ఎనిమిది సంవత్సరాల తరవాత నాకోరిక తీరింది.
పుస్తకం గురించి…
ఈపుస్తకం గురించి చెప్పాలంటే,సింపుల్ గా తొమ్మిది షార్ట్ స్టోరిస్ అని చెప్తే సరిపోదేమో!అవడానికి తొమ్మిది వేరు వేరు కథలే అయినా అంతర్లీనంగా ఈ కథల మధ్య ఏదో కనెక్షన్ వున్నట్టు అనిపిస్తుంది.బహుశా ఈ కథలన్నింట్లోను ప్రధాన పాత్రలు కలకత్తా/బెంగాల్ నుండి అమెరికాకి వలస వచ్చిన వారై ఉండటం వల్ల కావచ్చు.ఆ మాటకొస్తే ఒక్క బెంగాలీలనే కాదు,ఇండియా నుండి అమెరికాకి వచ్చిన మిగతావారు కూడ ఈ కథలలో ఏదో ఒక సందర్భంలో తమని తాము ఐడెంటిఫై చేసుకోవచ్చు.ఈ పుస్తకం లో ఉన్న అన్ని కథల గురించి చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి నాకు బాగా నచ్చిన రెండు,మూడు కథల గురించి(అంటే మిగతావి నచ్చలేదని కాదు)రాస్తాను.
The Third and Final Continent
ఈకథ 1969లో కథకుడు ఇంగ్లాండు నుండి అమెరికాకి రావడంతో మొదలవుతుంది.కథకుడు MIT లో లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరుతాడు.YMCA గదుల్లో ఉండలేక ఏదైనా అద్దె ఇంట్లోకి మారాలని నిర్ణయించుకుంటాడు.సరిగ్గా అదే సమయంలో వారానికి ఎనిమిది డాలర్ల అద్దెతో Mrs.Croft తన ఇంట్లోని గదిని అద్దెకి ఇవ్వడానికి లోకల్ పేపర్ లో ప్రకటన ఇస్తుంది.ఆ ప్రకటన చూసిన కథకుడు Mrs.Croft ఇంటికి వెళ్ళడం జరుగుతుంది.ఇంగ్లాండులో ఉన్నప్పుడు ఒక్కొక్క గదిలో అయిదారుగురితో కలసి ఉన్న అతనికి Mrs.Croft ఇంట్లో గది ఎంతో సౌకర్యంగా అనిపించి ప్రతి శుక్రవారం ఉదయం కల్లా అద్దె చెల్లించే ఒప్పందం మీద ఆ గదిలో అద్దెకి దిగుతాడు.Mrs.Croft ఎప్పుడు పియానో పక్కన కూర్చొని కిటికి గుండా బయటకి చూస్తూ ఉంటుంది.అస్తమానం తలుపు గడియ వేసి ఉందా లేదా అని ఆందోళన పడటం మొదట్లో కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.ఒకరోజు Mrs.Croft కూతురు హెలెన్ వస్తుంది.మాటల సందర్భంలో Mrs.Croft వయస్సు దాదాపు 103 సంవత్సరాలు అని తెలిసి కథకుడు ఆశ్చర్యంతో పాటు భయపడతాడు.Mrs.Croft ప్రాక్టికల్ గా బయటి ప్రపంచం నుండి తనని తాను వేరు చేసుకొని ‘తలుపు గడియ వేసుకొని’ బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. Mrs.Croft ఈ తరం వాళ్ళకి మర్యాద తెలియదని,ఒంటినిండా బట్టలు వేసుకోరని చిరాకు పడుతుంది.కొన్నాళ్ళకి కథకుడు పెళ్ళి చేసుకొని వేరే ఇంట్లోకి మారిపోతాడు.తన భార్య మాల ని Mrs.Croft కి పరిచయం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు నిండుగా చీర కట్టుకున్న మాల ని చూసి Mrs.Croft ముచ్చటపడుతుంది.అతనికి,Mrs.Croft కి ఏ బంధుత్వం లేకపోయినా పేపర్లో ఆమె మరణవార్తని చూసి కథకుడు చలించిపోతాడు.ఎక్కడో ఇండియాలో పుట్టిపెరిగి,ఆ తరవాత ఇంగ్లాడులో చదువుకొని అమెరికాలో సెటిలయిన కథకుడు Mrs.Croft తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్తాడు.
Interpreter of maladies
Mr&Mrs దాస్ ఇండియాలో ఉన్న తమ తల్లితండ్రుల్ని చూడటానికి అమెరికా నుండి వస్తారు.అలా వారు ఒకరోజు కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని చూడాలని తమ ముగ్గురి పిల్లలతో బయలుదేరుతారు.వారి టాక్సీడ్రైవర్ కాపసి దారి పొడుగునా వారికి విశేషాలన్నీ వివరిస్తూ ఉంటాటాడు.మాటల సందర్భంలో కాపసి తాను వారాంతంలో మాత్రమే టాక్సి నడుపుతానని మిగతా రోజుల్లో ఒక డాక్టర్ దగ్గరికి వచ్చే గుజరాతి పేషంట్లకీ డాక్టర్ కీ మధ్య అనువాదకుడిగా పనిచేస్తానని చెప్పడంతో Mrs.దాస్ అతని వృత్తి గురించి ఆసక్తి ప్రదర్శిస్తుంది.టాక్సిడ్రైవర్ కాపసి ఆమెని ఇంప్రెస్ చెయ్యాలని తన వృత్తిలో ఎదురైన అనుభవాలని వివరిస్తుంటాడు.ఈక్రమంలో Mrs.దాస్ తన భర్త లేనప్పుడు కాపసికి తనని గురించిన ఒక రహస్యం చెబుతుంది.తరవాత వారి ప్రయాణం ఏ మలుపులు తిరిగింది అనేది కథ చదివి తెలుసుకోవలసిందే.
The most funny thing about this book is…
అదేంటో కాని ఈ పుస్తకంలో అనే కాదు,జుంపా లాహిరి రాసిన మిగతా పుస్తకాల్లో కూడా food గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది.కథల్లో పాత్రలు భోజనం తయారు చెయ్యడం,భోజనం చెయ్యడం,చేపలు కొనడానికి బజార్ కి వెళ్ళడం,చేపలు వండటం…ఇలాంటివన్నమాట!బెంగాలీలు elaborated meals భుజిస్తారని తెలుసు కాని మరీ ఇంతలా వర్ణించాలా! 🙂 🙂
కాబట్టి ఈ పుస్తకం చదివేటప్పుడు మనం కూడా ఏదైనా తింటూ చదివితే ఇంకా బాగుంటుందన్నమాట!
******************************************
పుస్తకం వివరాలు :
Interpreter of maladies
రచయిత్రి : జుంపా లాహిరి
పబ్లిషర్ : Houghton Mifflin Company,Newyork.
కేటగిరి : ఫిక్షన్
పేజీలు : 198 వెల :$12
ఆన్లైన్ కొనుగోలుకు:
1. భారతదేశానికైతే, ఫ్లిప్‌కార్ట్ లంకె ఇక్కడ
2. అమేజాన్ లంకె ఇక్కడ.
sujata
Splendid. Isnt it ? 😀
పుస్తకం » Blog Archive » Interpreter of Maladies
[…] (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ) […]
Satish
rachayitaku dhanyavadhamulu.
mee article chadivina taruvata, nenu maa county library lo ee book kosam adiganu. naaku hopes chala takkuva, ee book vuntundi ani. kaani aascharyanga, ee pustakam shelf lo vundi annaru, ventane techhukunnanu. kaani inko urgent work valla nenu NY veltunnanu. tirigi vachaka tappakunda ee pustakam chadivi naa abhiprayam cheptanu.
inko saari dhanyavadamulu … nenu chadivenduku utsukatato vunnanu …