తిరుపతి వెంకట కవులు
రాసిన వారు: నేదునూరి రాజేశ్వరి
(ఈ వ్యాసం సాహిత్యం గూగుల్ గుంపులో దాదాపు మూడేళ్ళ క్రితం నేదునూరి రాజేశ్వరి గారు వ్రాసినది. వ్యాసాన్ని పుస్తకం.నెట్లో ప్రచురించడానికి అనుమతించిన రాజేశ్వరి గారికి ధన్యవాదాలు. ముఖచిత్రం వికీపీడియా నుండి తీసుకున్నాము.-పుస్తకం.నెట్)
**************
మనం చెప్పుకో దగిన వారిలో, ప్రసిద్ధులైన కవులు, తిరుపతి వెంకట కవులు. “వీరినే” జంట కవులు అని కుడా అంటారన్న సంగతి జగద్విదితం. వారిలో ఒకరు “దివాకర్ల తిరుపతి శాస్త్రి”, మరొకరు “చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి”. వీరిద్దరూ తిరుపతి వేంకట కవులనీ, జంట కవులనీ ప్రసిద్ధి కెక్కినారు. వీరు తెలుగు సాహిత్యంలో దిట్ట. తెలుగు కవిత్వం, అవధానములు, నాటకములు వీరి ప్రత్యేకత. వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదములు వ్రాసారు. అవధానములలో వీరి పాండిత్యం, వీరి ప్రతిభ, చతురత నేటికీ సాహితీ సమాజంలో కొనియాడ దగినది. ఇప్పటికీ వీరి నాటకములలోని పద్యాలు (“పాండవోద్యోగ విజయము” మున్నగు వాటిలోనివి) తెలుగు నాట పండిత పామరుల నోట విన బడుతూనే ఉంటాయి-“బావా ఎప్పుడు వచ్చితీవు, “జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో” మున్నగునవి.
తిరుపతి శాస్త్రి గారు, ౧౮౭౨[1872],మార్చి ౨౬[26]న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద, యండగండి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటావధాని గారూ గొప్ప వేద పండితుడే గాక సూర్యోపాసకుడు కూడా. ఇక తిరుపతి శాస్త్రి గారి విద్యాభ్యాసం, గరి మెళ్ళ లింగయ్య, బూర్ల సుబ్బారాయుడు, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద జరిగింది. అయితే ఈ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చదువుకునే రోజుల్లోనే, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తొ పరిచయం కుదిరింది. ఆ రోజుల్లోనే తిరుపతి శాస్త్రి గారి వివాహం కూడా ౧౮౯౮[1898]లో జరిగింది. కాకపొతే వీరు మధుమేహ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే ౧౯౨౦[1920]లోనే మరణించారు.
ఇక చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు ౧౮౭౦[1870]లో ఆగస్టు ౮[8]వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించారు. ఈయన ముత్తాతగారి తమ్ముడు, వెంకటేశ్వర విలాసం, యామినీపూర్ణతిలక విలాసం వంటి మహాద్గ్రంథాలను రచించిన గొప్ప పండితుడు. ఆయన రచించిన తాళపత్ర గ్రంథాలు వేంకటశాస్త్రికి అందుబాటులో ఉండేవట. ఇకపోతే ఈయన యానాంలో తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలు అధ్యయనం చేసారు. ఇక వీరి గురువులు, కానుకుర్తి భుజంగ రావు, అల్లంరాజు సుబ్రహ్మణ్యం, కవిరాజు మున్నగు వారు. యితడు ౧౮ ఏండ్ల వయస్సులోనే “యానాం వెంకటేశ్వరస్వామి గురించి” శతకం వ్రాశాడట. అందులోని వ్యాకరణ దోషాలను గురించి, అచ్చటి పండితులు విమర్శించగా, అవమానంగా భావించి, మన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి వారణాసికి వెళ్లాలని నిశ్చయించుకొన్నాడట. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన వెళ్ళలేకపోయాడు. అంతేగాక అతడికి పుట్టుక నుండీ ఒక కన్ను సమస్యగా ఉండేదట.
పిమ్మట శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, తిరుపతిశాస్త్రితో పరిచయం కావడం, ఇద్దరు వెంకటశాస్త్రి అధ్యాపకుని వద్ద శిష్యులుగా ఉండేవారు. పిమ్మట, ప్రసిద్ధులైన విశ్వనాథ, వేటూరి, పింగళి మున్నగు వారివద్ద జంట కవులుగా ప్రసిద్ధి పొందారు. అసలు మొదటి నుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేదట. మరి చెళ్ళపిళ్ళవారు ఉపన్యాసాలివ్వడం, మెరుపులా పద్యాలల్లడంలో దిట్ట. అయితే ఒకసారి వినాయక చవితి ఉత్సవాల్లో చందాలు వసూలు చేయడం కొరకని, ఒకరిని మించి మరొకరు, తమ ప్రతిభను ప్రదర్శించారట. దాంతో వారి స్నేహం మరింత బలపడింది. తుదకు వెంకటశాస్త్రి వారణాసి వెళ్ళి తిరిగి వచ్చాక, ఇద్దరు జంటగా కాకినాడలో శతావధానం ప్రదర్శించారు. తరువాత జీవితాంతం వారిరువురు ఒకరి కొకరు తోడుగా జంట కవులుగానే మిగిలి పోయారు. తిరుపతిశాస్త్రి మరణానంతరం కూడా వెంకటశాస్త్రి తన రచనలను జంట రచనలు గానే ప్రచురించాడు.
ఇద్దరు కలసి అసంఖ్యాక మైన అవధానములు చేసి, అనేక సన్మానములు, పలు ప్రశంసలు అందుకొన్నారు. అడయార్ వెళ్ళినపుడు అనిబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. అంతేగాక “వేంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయ నగరం, పిఠాపురం మున్నగు సంస్థానాలలో తమ తమ ప్రతిభను ప్రదర్శించి సత్కరింపబడటమే గాక, ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి “కళా ప్రపూర్ణ” బిరుదును పొందారు. పోలవరం జమీందారు వారి ప్రతిభను గుర్తించి, “ఎడ్విన్ ఆర్నాల్డ్” రచించిన “లైట్ ఆఫ్ ఆసియా” అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని కోరగా, ౧౯౦౧లో కాకినాడకు నివాసం మార్చి, ౧౮౮౯లో పిఠాపురం రాజు ప్రారంభించిన సాహితీ పత్రికను నిర్వహించి, బాల రామాయణం, ముద్రారాక్షసం, మృచ్ఛకటికం వంటి గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు. ఇక వీరి రచనలు, సంస్కృతంలో ౧౦ స్వతంత్ర రచనలు, ౧౫ అనువాదములు, ౨౫ ఠాగూర్ కథలు [ఆంగ్లము నుండి తెలుగు లోనికి] ఇంకా స్వతంత్ర కవితా రచనలు, నాటకములు, తెలుగు వచన రచనలు.
ఇక పొతే వీరి రచన నుండి మచ్చుకి కొన్ని:
“అమ్మా సరస్వతీ! నీ దయ వలన మేము ఎన్నో సన్మానాలు అందు కొన్నాము.” అంటూ చెప్పిన పద్యము.
“ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానము లందినాము బహుమానములన్ గ్రహియించి నార మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞాన విధులంచు జేరు గొనినాము నీవలనన్ సరస్వతీ!”
ఇక కవులకు మీసాలెందుకు? అని ఎవరో ఆక్షేపించగా, తెలుగు లోను సంస్కృతం లోను మమల్ని మించిన వారెవరైనా ఉంటే, మీసాలు తీసి మొక్కుతామని సవాలు చేస్తూ చెప్పిన పద్యం చూడండి:
“దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా
రోసము కల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము దీసి మీ పద సమీపములం దలుంచి మ్రొక్కమే !” అంటూ చమత్కరించారు.
ఇకపోతే మనందరి నోటా నిరంతరము పలికెడి పద్యాలు “పాండవోద్యోగ విజయం” లోనివి.
“బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్ల భ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖో పెతులే
నీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చిం చున్.”
అల్లాగే ” చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు” మున్నగు ప్రసిద్ధమైన పద్యాలు మనందరికీ విదితమే. ఇంతటి ప్రసిద్ధ కవులే మనమందరము నిరంతరము తలచుకునే జంట కవులు. వారె దివాకర్ల తిరుపతి శాస్త్రి. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.
rajeswari.n
ధన్య వాదములు శర్మ గారు
ka va na sarma
వారి హాస్య సంభాషణలు వేసిన చురకలు మా నాన్న గారు కథలు గా చెప్పేవారు