2011లో నా పుస్తకాలు: ఓ సింహావలోకనం
’ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేట’ని తెలిసిననూ జీవితాంతం ప్లాట్‍ఫారంపై ఎదురుచూడ్డమే జీవితం కాబోలు! ’ఇదో 2011’ అనుకునేలోపు 2012 వచ్చేసింది. కాలెండర్లో అంకెలూ, భారత్ బాటింగ్ అప్పుడు స్కోర్ బోర్డులో వికెట్ల కాలమ్‍లోని అంకెలూ ఒకటే హడావుడిపడిపోతాయెందుకో!
చదివిన పుస్తకాలు ఇవీ! అని ఒక జాబితా ఇక్కడ పెట్టి పక్కకు తప్పుకుంటే నేను నేను అవ్వను కాబట్టి, యెప్పటిలానే యధాశక్తిగా ఈ-వేస్ట్ కు నా వంతుగా..పంచాగాల్లో ఆదాయవ్యయాల గురించి చెప్తారుగా. అలా నేను గడిచిన ఏడాదిలో కొన్ని గణాంకాలను తయారు చేసుకొని చూసుకుంటే:
కొన్నవి: 150(ఆనుకుందాం.. లెక్కెట్టే ఓపిక లేదు) – చదివినవి: 60
చదవటం మొదలెట్టి, నచ్చినా పూర్తి చేయనవి: 30 – నచ్చలేదని వదిలిపెట్టేసినవి: 15
చదివినవి: 60 – పరిచయం చేసినవి:25
ఎప్పటిలానే ఒక పద్ధతి పాడూ లేకుండా, ఎప్పుడు వీలైతే అప్పుడు, ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకం, ఎలా కుదిరితే అలా చదివేయటం తప్ప, కనీసం ఈ ఏడాదైనా కొంచెం భక్తిశ్రద్ధలతో ’పనికొచ్చేవో’, లేక పనికొచ్చే విధంగా చదవటం అవ్వలేదు. ఏడాది మొదట్లోనే సరమాగో పుస్తకాలన్నీ ఒకే చోట కిండిల్ ఎడిషన్ దొరికినా కూడా, అందులో నుండి పట్టుమని మూడు నవలలు కూడా పూర్తిచేయలేదు. ఇలాంటి పోస్టులో ’మొత్తం పద్దెనిమిది నవలల పరిచయాల చిట్టా’ ని ఇవ్వాలని గాల్లో మేడలు కట్టానుగానీ, కింద పునాది వేయలేకపోయాను. ఇటాలో కాల్వినో పుస్తకాలన్నీ దాదాపుగా దొరకబుచ్చుకున్నాను. అవీ పూర్తిచేసాయాలి అనుకున్నాను. ఊహు. అలానే పిరన్‍దలో కొత్త రచనలు కనిపించాయి. అవీ చదవలేదు..
అయినా, చివరి మూడునెలలను వదిలిపెడితే, మిగితా నెలల్లో పుస్తకపఠనం బెమ్మాండంగా కొనసాగింది. goodreads.comలో ఏడాది పాటు యాభై చదువుతానని ఛాలెంజ్ తీసుకొని, ఇంకా చాలా సమయం ఉండగానే పూర్తి చేసాను. చివరి నెలల్లో మాత్రం అసలు పుస్తకమే ముట్టుకోలేదు. మళ్ళీ కొత్త ఏడాదిలో గాడిలో పడుతున్నాను.
అసలు, 2011 స్వాగతోత్సవాలలో భాగంగా జనాలంతా బాణాసంచా కాలుస్తుంటే, నేను ఎంచక్కా ముళ్ళపూడి రమణగారి రచనలను విశ్లేషిస్తూ వచ్చిన పుస్తకం చదువుతూ స్వాగతించాను. జనవరి నెలలో విజయవాడ బుక్ ఫేర్‍కు వెళ్ళటం, అంతకు ముందే హైదరాబాదులో బోలెడు పుస్తకాలు కొనటం, విదేశాలకు పోతున్న స్నేహితురాలు కొన్ని అరుదైన పుస్తకాలు ఇచ్చి వెళ్ళటం లాంటివి కలిసొచ్చి మంచి మంచి పుస్తకాలు చదివాను. వాటిలో చెప్పుకోదగ్గవి:
- ’మల్లెపందిరి’, ’శంకరాభరణం’, ’ముత్యాల ముగ్గు’ లాంటి సినిమా నవలలు (ఇంతకు మునుపెప్పుడూ నేను ఇలాంటివి చదవలేదు),
- అనార్కో – మంచి పుస్తకం వారి ప్రచురణ. బుక్ ఫేర్‍లో ’చదవండంటూ!’ చేతిలో పెట్టేసారు. గదికొచ్చాక, సౌమ్య చదివి వినిపించింది, నేను హాయిగా పవళిస్తూ ఉండగా.
- కరుణశ్రీ సాహిత్యం ౧ – అలతి పదాలతో, తేలిగ్గా అర్థమయ్యే పద్యాలు. జాతీయోద్యమం, పురాణాలు, దేశభక్తి తదితర అంశాలపై చక్కని కవిత్వం.
- జాషువా ఖండకావ్యాలు – చాలా కష్టపడ్డాను చదవడానికి గానీ, పద్యం పూర్తిగా అర్థమయ్యేక కలిగే భావావేశం అబ్బుర పరిచింది.
- మల్లాది రామకృష్ణ కథల గురించిన పరిశోధనా గ్రంధం – మల్లాదిని గురించి చదవడానికి తహతహలాడిపోతున్న వేళలో తారసపడింది. పూర్తి నిడివి వ్యాసం రాయనిదే న్యాయం చేకూరదు ఈ ప్రయత్నానికి.
- కినిగె వారి పుణ్యమా అని మరుపురాని మాణిక్యాలు, తలిశెట్టి రామారావుగారి కార్టూన్లూ, శారద శ్ర్రీనివాసన్ గారి పుస్తకం, సునాయసంగా దొరకడంతో చక్కగా చదువుకునే వీలు కలిగింది.
ఈ ఫోకస్ ఎటూ ప్రకటిస్తాము కదా అని మొన్నెప్పుడో ’2011లో తెలుగు పుస్తకాల జాబితా’ అని తయారుచేసుకోవటం మొదలెడితే పట్టుమని పది పుస్తకాలు కూడా తట్టలేదు. దిగులు పుట్టేసింది, అసలెలా సంవత్సరం గడిచిపోయింది, నేనేం చదవకుండానే అని. పట్టి పట్టి గుర్తు తెచ్చుకుంటే ఆ జాబితా ఎలాగోలా పాతిక వరకూ సాగింది గానీ, నాకేం తృప్తి కలుగలేదు. హయ్యో! అనుకొని నా గోడు వెళ్ళబోసుకున్నాను, భరించేవాళ్ళ (= ’హిహిహి.. నువ్వంతేనా? అదే నేను చూడు..’) దగ్గర .
అప్పుడు గొర్తొచ్చింది పుస్తకం.నెట్ కోసం రాసి పక్కకు పెట్టేసిన డ్రాఫ్టుల్లో ’ నేనీ మధ్య బోలెడు తెలుగు చదువుకుంటున్నాను తెల్సా?!.. ఉహుహహుహుహ ’ అని రాసుకున్న పోస్టు కనిపించింది. కాలదోషం పట్టకుంటే, ఎప్పడో బూజు దులిపి వేయాలి దాన్ని. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే, ఓ పదిహేను రోజులు ఉద్యోగపు బెడద, చదువుల బరువు లేని కాలంలో వరసబెట్టి ముళ్ళపూడి కథలూ, మల్లాది కథలూ, బైరాగి కవితలూ, జాషువా కావ్యాలు ఎడాపెడా చదివేసానన్న మాట. మీగడపెరుగు తిన్నంత చల్లగా అనిపించింది, ఆ పదిహేను రోజులున్నూ! సంఖ్యాపరంగా తక్కువే చదివాననుకున్నా, మృష్టానభోజనం లాంటి తెలుగు మాత్రం ఈ ఏడాదే ఎక్కువ అని చెప్పుకోవాలి. మధ్యమధ్యలో ఆంధ్రమహాభారతంలో పద్యాలూ బట్టీ కొట్టాను.
ఎంత వంటబట్టిందో తెలీదు గానీ, తెలుగనే అమృతం సేవించి ధన్యురాలినయ్యాను.
ఇహ, ఇంగ్లీషు విషయానికి వస్తే, ఏమని చెప్పను, ఎంతను చెప్పను.
“అమ్మాయ్.. ఇప్పుడు గానీ నాకో పుస్తకం చదవడానికి లేదనుకో, పిచ్చెక్కిపోవటం ఖాయం!” అని స్నేహితురాలి కప్‍బోర్డ్ తెరుస్తూ అల్టిమేటం ఇచ్చాను.
“ఏమో తల్లీ! నా పుస్తకాలు నీకు నచ్చవు.. అయినా చూసుకో” అంది.
అదృష్టవశాస్తూ కళ్ళు “A fraction of the whole” మీద పడింది. అంతే, ఆ క్షణం నుంచి ఆ పుస్తకజపం మొదలెట్టాను. సర్వకాల సర్వావస్థల్లో ఆ పుస్తక ప్రస్తావన తప్ప మరో ధ్యాస లేదు. నా గోల భరించలేక కొందరు కొని చదివారు. నచ్చినవారూ ఉన్నారు. నచ్చనివారూ ఉన్నారు. కానీ అది కాదుగా నా సమస్య! ఏడొందల పేజీలు ఏకధాటిగా నవ్వించే గుణం ఉన్న పుస్తకంలో ఎన్నేసి విషయాలు – తొలిప్రేమ, జీవితం, కోమా, డెమాక్రసీ, హ్యూమన్ ఎవల్యూషన్, తండ్రిబిడ్డల బాంధవ్యాలు, మీడియా, అస్థిత్వవాదం – గురించి కొత్త కోణాలు చూపెట్టిందో ఈ పుస్తకం. కొన్ని వాక్యాలలా నిలిచిపోయాయి నాతో! మిగితా పుస్తక పఠనమంతా ఒక ఎత్తు, ఈ ఒక్క పుస్తకమూ ఒక ఎత్తు.
అలానే, ఎట్టకేలకు ధైర్వం చేసి ఈ ఏడాదే నబకొవ్ రాసిన ’Lolita’ చదివాను. ఎంతగా నచ్చేసిందో మాటల్లో చెప్పలేను. నబకొవ్ ఒక రచయితగా కాక, ఎవరో మహామునిగా గోచరించారంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన తక్కిన రచనల్లానే ఇందులో వచనం ఉత్కృష్టం. కానీ ఇందులో కథాంశం, ఆ కథాంశాన్ని నడిపిన తీరు, ఒక అతి నీచుడి మనోభావాల మధ్య దాగున్న హాస్యం, అసహాయత, ఆవేదనల మేళవింపు ఆలోచించే కొద్దీ కొత్తగా అనిపించే రచన! అదే ఈయన ’Pnin’ కూడా చదివాను. He makes me fall in love with English-అంతే చెప్పగలను.
నబకొవ్ రాసిన ఒక కథ ఉంది. పేరు ’Sounds’. ఇది చదివి చదివి.. మళ్ళి చదివి, తనివి తీరక, ఒక నాలుగైదు సార్లు కాగితం మీద రాసుకున్నాను. అంతిష్టం!
మధ్యలో కార్టూన్ల మీద పడ్డాను. అదేదో సినిమాలో చిన్నప్పటి నుండి మాట్లాడాలనుకున్న మాటలన్నీ శ్రీలక్ష్మి పెళ్ళాయ్యాక వాగినట్టు, నేను కార్టూన్ల పై ఎక్కడాలేని మోజును ఏర్పర్చుకున్నాను. ‘Calvin and Hobbes’, ‘Peanuts’ వీలైనంత క్షుణ్ణంగా చదువుకున్నాను. Peanuts సృష్టికర్త రాసిన ’My life with Charlie Brown’ ప్రత్యేకమైన పుస్తకం. గొప్ప విజయాలు సాధించారని కాదు, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వారి మాటలు చదువుతుంటే కలిగే ఆనందం బహు అరుదు. మన బాపుగారి బొమ్మల పుస్తకం కూడా ప్రముఖంగా చదువుకున్నాను.
‘Find of the year!’ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన రచయితలు Kleist, Etgar Keret and Tahir Shah. వీరి గురించీ పూర్తి నిడివి వ్యాసాలు రాయాలి త్వరలో.. ఒక్క ముక్కలో చెప్పడానికి కుదరదు. (అదేలే, చేతకాదు!)
క్రికెట్ సాహిత్యమంతా ఒక ఎత్తు, Cardus ఒక ఎత్తు అని తెలిసొచ్చింది ఈ ఏడాదే! మనవాళ్ళు ప్రపంచ కప్ గెలిచాక వచ్చిన పుంఖానుపుంఖల పుస్తకాల జోలికి అందుకే పోబుద్ధి కాలేదు.
Knut Humsun ఆకలి గురించి రాసిన నవల ‘Hunger’ మెల్లిగా సాగిందనిపించినా చదవటం సాగలేదు. కానీ అది స్టీవ్ టోల్జ్ నచ్చిన రచనల్లో ఒకటని తెలియగానే చదివేసాను, ఆలస్యం చేయకుండా! ఇంకొందరి ఆస్ట్రేలియన్ రచయితలనూ చదివాను. మధ్యన చైనీస్ కథలేవో చదివాను, నచ్చాయి. జపనీస్ పుస్తకం కూడా!
కాబోవు రచయితలకు సూచనలంటూ కొనసాగే పుస్తకాలు కొన్ని చదివాను, ఉత్తినే! కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చటం కన్నా ముఖ్యంగా ఉపయోగించుకోవటంలో ఉంటుంది అసలు మజా! అది చేయలేదు. వాటి పేర్లు మాత్రం ఇస్తున్నాను ఇక్కడ:
- Self Editing for Fiction Writers
- How to write like Chekhov?
- Zen in the Art of the writing
- Reading like a writer
హిందిలో ఒకే ఒక్క పుస్తకం ’మధుశాల’ చదివాను. ఆహా.. మునిగాను, ఇంకా తేలలేదు! తేలినప్పుడు కల్సుకుందాం..
ఇవీ పోయినేడాదిలో నా చదువుకు సంబంధించినంతవరకూ ముఖ్యాంశాలు. వీలువెంబడి పరిచయం చేయని పుస్తకాలను గూర్చి దఫాలవారిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సాహిత్యాభిమానులకు నచ్చవచ్చననే ఆశ! అంతే..
ఈ ఏడాది కూడా గ్రాండ్ ఓపెనింగ్ అన్నట్టు, తాహీర్ షాహ్ ’Sorcerer’s Apprentice’ మొదలుపెట్టాను. Enriching book, to say the least!
మీ అందరి పుస్తక పఠనం కూడా నిరాటంకంగా కొనసాగుతూ, మంచి పుస్తకాలు ప్రాప్తించాలి, వాటిని ఆస్వాదించే సమయం, తీరిక మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎప్పటికప్పుడు నా ramblingsను భరిస్తున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు!
Naagini
మీ పుస్తకాల లిస్టు మా లాంటి వాళ్లకు గైడ్ లాగా ఉపయోగపడుతున్నాయండీ …:-)..Thanks for the post..:-)
RK
Recently read the bio on Dr.Nayudamma ( in Telugu,Pub by CP Brown Academy)
An excellent read about a scientist trying to bridge the tech diparities
and help the communities.
Should be part of school text books.
See this article in AJ
వెంటాడే నాయుడమ్మ వాక్యం – డా. నాగసూరి వేణుగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/dec/30/edit/30edit4&more=2011/dec/30/edit/editpagemain1&date=12/30/2011
కొత్తపాళీ
Impressive stats. సింహావలోకనం చెయ్యాల్సినన్ని పుస్తకాలు చదవలేదు. బాగా మనసుకి హత్తుకున్న పుస్తకాల్ని గురించి నా బ్లాగులోనే రాశాను. రాయాల్సి ఉండి రాయనిది – Cutting for Stone, novel by Dr. Abraham Verghese. Hope to write some time.
Purnima
>> సింహావలోకనం చెయ్యాల్సినన్ని పుస్తకాలు చదవలేదు.
సింహావలోకనానికి ఎన్ని పుస్తకాలు చదవాలో నాకూ తెలీదండి. బహుశా, వీటి కన్నా ఎక్కువ పుస్తకాలు చదివి కూడా చదివామని చెప్పుకోని వాళ్ళుంటారనుకుంటాను. It’s not about numbers here, it’s about willingness to communicate, a passion to share, not necessarily only knowledge, but one’s experiences, ups and lows and anything related to book reading. వాటిలో స్వోత్కర్షలను మాత్రమే చూడగలవారికి, అంతే ప్రాప్తం అని సరిపెట్టుకోగలం. 🙂
మీ బ్లాగులో పరిచయాలు రాస్తున్నందుకు సంతోషం. మీ వీలువెంబడి మీ బ్లాగు పాఠకులకు మరిన్ని మంచి పుస్తకాలను పరిచయం చేయగలరని కోరుకుంటున్నాను.
Wish you a year filled with amazing books! Happy reading!
చంద్రహాస్
60 పుస్తకాలు చదవడం మాటలు కాదు. అభినందనలు. మీ జాబితాలో రెండవసారి, మూడవసారి చదివిన పుస్తకాలు వుండితీరాలి. అభ్యంతరం లేకపోతే ఆ list చెప్పండి. “అనార్కో” పుస్తకం అనువాదమా? మల్లాది రామకృష్ణశాస్త్రి గారి రచనలంటే నాకు మహా గౌరవం. వారి గురించి రాసిన పరిశోధన గ్రంథం పేరెమిటి, ఎవరు రాశారో, ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియచేయగలరు. మీరు హిందీ పుస్తకాలు కూడా చదువుతారా? చాలా సంతోషం. 2012 సంవత్సరంలో మీ బహుభాషా సాహిత్య పఠనా కార్యక్రమం నిరాటంకంగా సాగాలని కొరుకుంటున్నాను.
Purnima
హమ్మ్.. నాతో సమస్యమేమిటంటే, నేను చదివిన పుస్తకాల జాబితా ఒకటి రాసుకుంటూ ఉండను, ఏడాది పొడుగునా. ఇదో పుస్తకం.నెట్ మొదలయ్యాక, ఇట్లాంటి పోస్టుల కోసం ఏడాసి చివర్న గుర్తొచ్చిన పుస్తకాల జాబితా తయారుచేస్తాను. మీరడిగిన వాటికి గుర్తున్నంతలో సమాధానాలు ఇవిగో:
మల్లాదిగారి పై సిద్ధాంత వ్యాసం రాసింది, డా|| గుమ్మా శంకరరావు గారు. యనభైల్లో వెలువడిన పుస్తకం. ఇప్పుడు దొరుకుతుందా? అన్నది అనుమానమే, పాత లైబ్రరిల్లో వెతుక్కోవాలి. నాకు ముళ్ళపూడిగారి లైబ్రరిలో కనిపించింది. ఫోటోకాపీ తెచ్చుకున్నాను.
ఈ ఏడాది మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకాలున్నాయి. That has been the feature of my reading. ముళ్ళపూడిగారి కథలు, బాపు బొమ్మల పుస్తకం మళ్ళీ మళ్ళీ చదివాను. A fraction of the whole అనే నవల చదువుతూనే ఉన్నాను. Groucho Marx పుస్తకాలు మళ్ళీ చదివాను.
తాహీర్ షాహ్ ’ఇన్ అరేబియన్ నైట్స్’ ఎలా పరిచయం చేయాలో తెలీక, మళ్ళీ చదవటం మొదలెట్టాను. అయినా తెలియలేదులెండి. (ఆవునూ! మీరు Idries Shah పుస్తకాలు కొన్నట్టున్నారుగా, మొన్నెప్పుడో Landmarkలో.. వాళ్ళ అబ్బాయే తాహీర్ షా! తప్పక చదవండి, భలే ఉంటాయి ఆయన పుస్తకాలు. నేనింకా idiries Shahవి ఏవీ మొదలెట్టలేదు.)
అవును. అనార్కో అనువాదమే! ఇరవై రూపాయల చిట్టి పుస్తకం. భలే ఉంటుందిలే. హింది నుండి అనువదించినా, తెలుగుసేత భలే నచ్చేసింది మాకు(నాకూ, సౌమ్యకు) అసలు, అనువాదం ఇలా చేస్తే చదువరులకు ఎంత హాయిగా ఉంటుందో అని అనుకున్నాం. ఈ పుస్తకాన్ని, దానిలోని అనువాదపు లక్షణాలను సరిగ్గా పరిచయం చేయగల మనిషి, సౌమ్యే!
ఇహ, హిందీ పుస్తకాలంటారా? వాటితో చాలా నత్తనడకలెండి. రెండేళ్ళ బట్టి గుల్జార్ కథలు చదువుతూనే ఉన్నాను. ఒక కొలిక్కి రావటం లేదు. ’మధుశాల’ చదువుకోడానికి తేలిగ్గా ఉంటుంది. అయినా కవిత్వాన్ని ’చదివేశాం..పో’ అనుకోడానికి ఉండదు కదా! మిత్రులెవరో అన్నట్టు, కవిత్వంతో కాపురం చేయాలిగా!
సరే.. ఇంతకీ మీరెప్పుడు రాసి పంపుతున్నారు, ఇలాంటి ఓ జాబితాను? ఎదురుచూస్తుంటాను.
పూర్ణిమ
koundinya
thanks a bunch for your valuable info…..:)
Purnima
🙂