రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి
రాసిన వారు: మంజరి లక్ష్మి
****************
ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది.
ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి, ‘కళ్ళు తెరిచిన సీత’ అనే సీరియల్ ప్రారంభమైంది. దానిలో హీరోయినైన సీత, పెళ్ళి విషయం వచ్చేటప్పటికి, ప్రతిదాన్లోనూ ఫ్యూడల్ ఆచారాలకు లొంగిపోతూ వుంటాన్ని చూపిస్తూ, రంగనాయకమ్మ గారు “పది సార్లు జానకి విముక్తి చదివిన సీత” ఇలా చేసిందీ, అలా చేసిందీ అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తూ రాశారు. అది చూసి, ఎప్పుడో చదివిన “జానకి విముక్తి” పుస్తకాన్ని, ఇప్పుడు మళ్ళా చదివాను. ఎప్పుడు చదివినా, ఈ పుస్తకంలో, ఏదొ ఒక కోణంలో, మనం నేర్చుకోవలసిందీ, తెలుసుకోవలసిందీ వుంటూనే వుంటుంది.
రంగనాయకమ్మగారు “జానకి విముక్తి”ని, తన భావాలన్నిటినీ అత్యుత్తమ స్థాయిలో రంగరించి, తన నవలన్నిటిలోకీ మిన్నగా, తీర్చి దిద్దారని నా అభిప్రాయం. ఈ నవల, మొత్తం మొదట మూడు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 1977 లో, రొండవ భాగం 1980 లో, మూడవ భాగం 1981 లో వచ్చాయి. 2005 లో ఈ మూడు భాగాలూ కలిపి, ఒకే పుస్తకంగా ప్రచురించారు.
అమాయకురాలైన జానకి, మూర్ఖుడైన తన భర్త వెంకట్రావు చేతిలో తిట్లూ, తన్నులూ తింటూ ఉంటుంది. అది చూసి, వాళ్ళ అన్న సత్యం ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి పోతే, మళ్ళా ఆమె భర్త వెంకట్రావు వచ్చి ఏవో మాయమాటలు చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. దాంతో సత్యానికి కోపం వచ్చి, తన స్నేహితుడైన మూర్తికి ఉత్తరం రాస్తే, దానికి సమాధానంగా మూర్తి రాసే ఉత్తరం ఈ నవలలో హైలెట్. స్వతంత్ర ఆలోచన, ఎదిరించే చైతన్యం వాళ్ళలో కలిగించకుండా, మన భావాలను వాళ్ళ మీద రుద్దితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదనీ, జానక్కి పరిస్థితుల్ని ఎదిరించే చైతన్యాన్ని కలిగిస్తూ, తనకు అండగా నిలబడటమే మన పని అనీ ఎంతో గొప్పగా చెపుతాడు. జానకి చిన్న, చిన్నగా తన చైతన్య స్థాయిని పెంచుకుంటూ, ఆ నికృష్టుడైన భర్త కబంధహస్తాల్లోంచి బయట పడి, స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ళ మీద తను నిలబడి, పిల్లవాణ్ణి తనే పెంచుకుంటూ, తన భావాలను అభివృద్ధి చేసుకుంటూ, అటువంటి భావాలు కల వ్యక్తినే మరల ఎన్నుకుంటుంది. ఆమె తన చైతన్యాన్ని మెల్ల మెల్లగా ఎలా పెంచుకుంటూ వచ్చినదీ, ఆమె అన్న సత్యం దానికి ఎలా దోహద పడిందీ, ఈ నవలలో రంగనాయకమ్మగారు చాలా చక్కగా రాశారు.
మాకు తెలిసున్న వాళ్ళ కుటుంబంలో కూడా ఒక ‘వెంకట్రావ్’ ఉన్నాడు. మా బంధువు లావిడ మొగుడు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూ, ప్రేమించి(?), పెళ్ళి చేసుకున్నారు. మగ పెళ్ళి వాళ్ళు తిరుపతిలో పెళ్ళి చేయించమంటే, అలాగే చేయించి, వాళ్ళ ఊళ్ళో విడిదిలో ‘సత్యన్నారాయణ వ్రతం’ చేసుకున్నారు. దాని చివర బహుమతులు చదివించేటప్పుడు, పెళ్ళికొడుకు బంధువు లెవరో ఆవిడను, “ఏం చదువుకున్నావమ్మాయీ?” అని అడిగారు. ఆవిడ, “ఎం.ఏ.” అని చెప్పింది.
దాన్తో వాడు కాస్తా అలిగి, ఎంతమంది బతిమిలాడినా వినక, ఆవిడ అడిగితే, “నీకు పొగరు. నా కన్నా ఎక్కువ చదువుకున్నానని అహంభావం. నాకన్నా నువ్వు ఎక్కువ చదువుకున్నావనీ, నన్ను నలుగురిలో చులకన చెయ్యాలనీ, అలా చెప్పావూ?” అని తిట్టి తిట్టి పోశాడు. దానికి ఆవిడ, “అడిగారు కాబట్టి చెప్పాను. వాళ్ళడిగితే నిజం చెప్పకుండా ఎట్లా ఉంటానూ?” అని ఒకటే గోల. చివరకి, పెద్దదయిన వాళ్ళ నాయనమ్మ వెళ్ళి, క్షమాపణ అడిగితే, ‘మూడు నిద్రలకు’ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
ఆ చివరి రోజు, నేను, నా స్నేహితులెవరికో వాళ్ళని పరిచయం చేస్తూ, వాళ్ళడిగితే, ” ఆయన ఫలానా చోట ‘ఎల్.డీ.సీ’ గా పనిచేస్తాడూ, ఆవిడ అక్కడే ‘యూ.డీ.సీ.’ గా పనిచేస్తుందీ” అని చెప్పాను.
అంతే! ఆ రోజు వాళ్ళ ఇంట్లో శివరాత్రే. మళ్ళా వాళ్ళ నాయనమ్మే ఎట్లాగో సర్ది చెప్పింది.
“జానకి విముక్తి” చదివిన తరువాత, మా ఇంట్లో మేము మా వాళ్ళతో పోరాడి, ఆ మూడు రోజులూ ‘వాకిట ఉండే’ కార్యక్రమాన్ని తీసేయించాము. మా బంధువు లింట్లోనూ అదే పరిస్థితి. మా బంధువు లావిడ అత్తారింటికి వెళ్ళేటప్పటికి, వాళ్ళత్త గారికి ‘మడి’ కాబట్టి, తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. మొగుడు కూడా దానికే వత్తాసు పలికాడు. మా బంధువు లావిడ అత్తగారి కోసం, వాళ్ళ ఇంట్లో అలవాటు లేకపోయినా, పొద్దున్నే లేచి ‘మడి’తో వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్ళేది. ఆ మూడు రోజులూ మాత్రం, ఆవిడను, వాళ్ళ ఇంటికి పంపించేసే వాళ్ళు. మిగతా రోజుల్లో “రోగమని” చెప్పి వంట చెయ్యని మా బంధువు లావిడ అత్తగారు, ఆ మూడు రోజులూ మాత్రం ‘మడి’తో వంట చేసుకుని, తన కొడుకూ, తనూ, సుబ్బరంగా మింగి, కూచునే వాళ్ళు.
మా బంధువు లావిడ భర్తకి పదిహేను రోజులకో, నెల రోజులకో ఒక సారి పూనకం వస్తూ వుండేది. ఇంక పొద్దున్నే, నిద్ర మంచం మీద మొదలెట్టేవాడు స్త్రోత్రం. “పెళ్ళినాడు ఆడ పెళ్ళి వాళ్ళు వాళ్ళకి తిరుపతిలో సరయిన ఎకామడేషన్ చూపించలేద”నీ, “భోజనాలు ఆలస్యంగా పెట్టించార”నీ, “అవి ఛండాలంగా ఉన్నాయ”నీ, “వాళ్ళ అప్ప చెల్లెళ్ళకి మర్యాదలు సరిగా జరపలేద”నీ, “కట్నాలు నాసిరకంవి ఇచ్చార”నీ, తిట్టేవాడు. అప్పటికీ, అంతకుముందే, వాళ్ళ నాయనమ్మ, “మా వూళ్ళో చేసుకుంటే అన్నీ సవ్యంగా జరిపించే వాళ్ళం నాయనా! మీరే తిరుపతిలో చెయ్యాలన్నారు. పరాయి చోట మేము మాత్రం ఏం చేస్తాం?” అని చాలా సార్లు చెప్పింది.
“మా బంధువు లావిడకు ‘తను ఎక్కువ చదువుకున్నా’ ననీ, ‘ఉద్యోగంలో తనకన్నా ఎక్కువ గ్రేడ్లో ఉంద’నీ, గర్వం, పొగరూ అనీ, ‘ఆ రోజు అది చెయ్యలేదు, ఈ రోజు ఇది చెయ్యలేదూ'” అంటూ దండకం రాత్రి పడుకునే వరకూ నడిచేది. కొన్నాళ్ళకు ఆవిడ డిపార్ట్మెంట్లోనే వాణ్ణి కూడా వేశారు. ఇకంతే! మూడు నెలలు సెలవు పెట్టి, ఆవిడ నగలు తనఖా పెట్టి, తన చేత లోన్లు పెట్టించి, మొత్తం డబ్బులు తీసుకొని, హైదరాబాద్ వెళ్ళి, ‘యూ.డీ.సీ.’ పోస్టు తెచ్చు ‘కొన్నాడు’. ఆ తరవాత, కొన్నాళ్ళు, కొంత ప్రశాంతంగా నడిచింది ఆ కాపురం. ఈ లోపల ఆవిడ ప్రమోషన్ మీద ‘సూపరిండెంటు’ అయింది. ఇంకేముంది? మళ్ళా నిత్య నరకం. మాక్కూడా వాళ్ళతో తగాదా అయి, మేం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళింటికి వెళ్ళటం మానేశాం.
ఈ మధ్యనే ఆవిడ రిటైర్ అయితే, వీడ్కోలు పార్టీ ఇస్తే, దానికి మేం కూడా వెళ్ళాం. ఆ సభలో ఆవిడ కొలీగ్స్, ఉద్యోగం పట్ల ఆవిడ చూపించిన సిన్సియారిటీని మెచ్చుకొంటూ, ఆవిడని కూడా మాట్లాడమన్నారు. అప్పుడు ఆవిడ “నేను ఉద్యొగంలో, ఇంత అభివృద్ధి లోకి రావటానికీ, నేను నా ఉద్యోగాన్ని ఇంత బాధ్యతాయుతంగా నిర్వర్తించటానికీ నా భర్తే కారణం. ఆయన ఇచ్చిన తోడ్పాటూ, ప్రోత్సాహం తోనే నేను నా బాధ్యతల్ని ఇంత సక్రమంగా నిర్వర్తించగలిగాను. ఈ విషయంలో ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను” అని చెప్పింది.
ఈ పుస్తకం ఎలాంటి మనుషులతో జీవించ కూడదో మాత్రమే కాదు, ఎటువంటి మనుషులతో జీవించాలో కూడా చెబుతుంది. ఇందులో సత్యం, శాంతల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమా, సహ జీవనం చాలా స్పష్టంగా వివరించారు. స్త్రీ, పురుషుల మధ్య ఎటువంటి సంబంధాలు వైరుధ్యాల కతీతంగా వుంటాయో కూడా ఈ పుస్తకం చెబుతుంది.
బఫే భోజనాలంటి వర్ణనలు చాలా నవ్వు పుట్టిస్తాయి. వెంకట్రావు గురించి చదువుతూ వుంటే, మనకి కూడా వాణ్ణి పట్టుకుని చితక బాదాలని అనిపిస్తుంది. అయినా, జానకి వాణ్ణి వదిలెయ్యడమే వాడికి తీరని శిక్ష లెండి. ఇంటా, బయటా సమానంగా పని చేయని భార్యాభర్తల మధ్య సమానత్వం కుదరదని ఈ కధ స్పష్టంగా చెబుతుంది. మంచి భర్త/భార్య దొరికితే జీవితం మంచి గానూ, చెడ్డ భర్త/భార్య దొరికితే జీవితం చెడ్డ గానూ వుండటం లాగా కాకుండా, ప్రతీ స్త్రీ/పురుషుడూ తనకి సరైన స్త్రీని/పురుషుణ్ణి తానే ఎన్నుకోవాలి అని ఈ పుస్తకం నేర్పిస్తుంది.
“జానకి విముక్తి” వచ్చిన కొత్తల్లో, మా ఇంటికి ఎదురుంగా ఒక కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ ఇంట్లో నా ఈడమ్మాయే ఉండేది. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఆ అమ్మాయికి రంగనాయకమ్మగారి పుస్తకాలంటే ప్రాణం. నాకూ అంతే కాబట్టి, ఆమెతో బాగా స్నేహం కుదిరింది. వాళ్ళింట్లో రంగనాయకమ్మగారి అన్ని పుస్తకాలతో పాటు, ఆవిడ సంపాదకీయంలో వచ్చిన “ప్రజాసాహితి” పుస్తకాలు కూడా ఉండేవి. ఆ అమ్మాయి చెవుల దుద్దులు మాత్రం ఉంచుకుని, మిగిలిన నగలేవీ పెట్టు కోకుండా తిరిగేది. ‘అందం’ కోసమని చెప్పి, చిన్న బొట్టు కూడా ఉంచుకునేది. ఉండటానికి, కావలసినంత నాస్తికత్వం వుంది ఆ అమ్మాయి దగ్గర.
నేను కుతూహలంతో, “ఎందుకలా ఏ నగలూ పెట్టుకోకుండా ఉంటారు? బంగారంవి లేకపోతే రోల్డుగోల్డువైనా, పెట్టు కోవచ్చు కదా?” అని, ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసు కోవాలని అడిగాను. దానికి పార్వతి, “రంగనాయకమ్మగారు స్వీట్ హోమ్ లోనూ, ముఖ్యంగా జానకి విముక్తి లోనూ ‘నగలనేవి బానిసకాలం నాటి చిహ్నాలని, అవి పెట్టుకోవటం ఆడవాళ్ళకు అవమానమని’ చెప్పారు. అది చదివి నప్పటి నించీ నగలు తీసెయ్యాలని అనిపించింది” అని చెప్పింది.
“మరి దిద్దులు మాత్రం వుంచుకున్నారెందుకూ? బొట్టు సంగతేమిటీ?” అని అడుగుదామనుకున్నాను గానీ, ఆ అమ్మయిలో చూసిన ఆ కాస్త చైతన్యానికే ముచ్చటేసి, ఆ అమ్మాయిని చిన్నబుచ్చ కూడదని, వూరుకున్నాను. తర్వాత కాలంలో ఆ అమ్మాయికి ఒకబ్బాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ఒక చిన్న సైజు ప్రేమ లోకి దారి తీసింది.
ఆ అబ్బాయి, “చేతికి గాజులందమూ, ముక్కుకు పుడక లందమూ” అని సినిమా పాట పాడేటప్పటికీ, ఆ ప్రేమకి మురిసి పోయి, పారేసిన గాజులూ, ముక్కు పుడకా తెచ్చుకుంది.
ఆ తర్వాత నెమ్మదిగా మెడలో గొలుసూ, వేలికి వుంగరమూ తిరిగి వచ్చాయి. ఆ అబ్బాయి వడ్డాణం కోసం కూడా ప్రయత్నించాడు గానీ, మరీ నాటుగా వుంటుందని పార్వతి ఒప్పుకోలేదు. నీరసంగా వూరుకున్నాడు.
ఆ తర్వాత అమ్మ కోసం పీటల మీద పెళ్ళీ, నలుగురిలో గొప్ప కోసం కట్నమూ కావాలని కోరాడు. ఇంకా చాలా సినిమా పాటలు పాడాడు. ఒంటి మీద నగలన్నీ అతని ఆస్తి కోసం అని అప్పుడు అర్థం అయింది. అప్పటికి కళ్ళు తెరుచుకున్న పార్వతి, ముందరగా వాణ్ణి వదిలేసింది. విప్పారిన కళ్ళతో, జానకి విముక్తి మళ్ళీ చదవడం మొదలు పెట్టింది.
ప్రజాసాహితిలో రంగనాయకమ్మ గారి “ప్రశ్నలూ-జవాబులూ” శీర్షికకి, ఎవరో ఒక అమ్మాయి, “నగలు తీసెయ్యాలనే ఉంది కానీ, అలా ఒక్కసారే తీసెయ్యటం చేతకావటం లేదు, ఎలాగా?” అని ఉత్తరం రాస్తే, అప్పుడు రంగనాయకమ్మగారు, “ఒక సారి తీసి, ఒక సారి పెట్టు కుంటూ, కొన్నాళ్ళు తీసి, కొన్నాళ్ళు పెట్టుకుంటూ, ఒక్కక్కటే తీసేస్తూ అలవాటు చేసుకోమని” జవాబు చెప్పారు.
కళ్ళు తెరుచుకున్న వాళ్ళు అలాగే వుండిపోరు కదా? పార్వతి కొన్నాళ్ళు సాధన చేసి అన్నీ, దిద్దులతో సహా, బొట్టుతో సహా, తీసేశానని చెప్పింది. “రంగనాయకమ్మ గారు చెప్పిందాన్ని, అలా తూ.చా. తప్పకుండా పాటించే వాళ్ళున్నారా?” అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
ఇది తప్పక చదివి తీర వలసిన పుస్తకం.
పుస్తకాలకు:
అరుణా పబ్లిషింగ్ హౌస్,
ఏలూరు రోడ్డు,
విజయవాడ – 520 002
(ఫోన్: 0866 – 2431181)
nagamurali
>> కమ్యూనిస్టు యువతీ యువకులు శాస్త్రీయ సంగీతం వినటం ఏవిటి? కర్ణాటక సంగీతంలో భక్తినీ, కళనీ విడదీయటం కుదరదు కదా? ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాము?
ఇది చదివితే నాకో (హాస్య) సంఘటన గుర్తొచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం రిచర్డ్ డాకిన్స్ ‘నాకు క్రిస్మస్ కేరల్స్ అంటే చాలా ఇష్టం, సంస్కృతిపరంగా నేను క్రైస్తవుణ్ణి’ అన్నాడు. దానిమీద దుమారం చెలరేగింది. అప్పుడూ పాపం రంగనాయకమ్మగారిలాగే వివరణలు ఇచ్చుకుని శ్రమపడ్డారు నాస్తికులు. 🙂
> కాపిటల్ పరిచయం చదివే టైం వచ్చినట్లుంది
🙂 నేను రెండేళ్ళ క్రితం చదివాను. ఆషామాషీగా కాదు, ఒక ఏడాదిపాటు దీక్షగా. All the best!! వీలైతే దాని తర్వాత స్టీవెన్ పింకర్ రాసిన బ్లాంక్ స్లేట్ పుస్తకం కూడా చదవండి. మజా వొస్తుంది.
ప్రసాద్
1. ఈ నవలలో సత్యం, శాంతా “క్లాసికల్ సంగీతం” వింటారు. కమ్యూనిస్టు యువతీ యువకులు శాస్త్రీయ సంగీతం వినటం ఏవిటి? కర్ణాటక సంగీతంలో భక్తినీ, కళనీ విడదీయటం కుదరదు కదా? ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాము?
జవాబు: ఇటువంటి ప్రశ్నకి రంగనాయకమ్మ గారు “ప్రశ్నలూ-జవాబులూ” అన్న శీర్షికలో చాలా కాలం కిందట జవాబిచ్చారు. అచ్చు అవే మాటలు కాక పోయినా, అదే అర్థంతో నా వివరణ. అవును, శాస్త్రీయ సంగీతంలోనూ, శాస్త్రీయ నృత్యంలోనూ భక్తీ, కళా కలిసి పోయి వున్నాయి. “భక్తి” అని అనడం కన్నా, “దేవుళ్ళ కధలూ, విషయాలూ” అనంటే, ఇంకా వివరంగా వుంటుంది. నమ్మకం వున్న వాళ్ళకి అదే భక్తి కూడా. సంగీతంలో రాగం, తాళం వుంటాయి. పాడే వారి గొంతుక లోని మాధుర్యం వుంటుంది. అలాగే, నృత్యంలో ఒక లయ వుంటుంది. నృత్యం చేసే వారి ‘లావణ్యం’ వుంటుంది. ఇవీ ముఖ్యమైన విషయాలు, ఈ సంగీత, నృత్యాలు భక్తి వున్న వారినీ, లేని వారినీ అలరించడానికి. ఈ రోజుల్లో చాలా మంది శాస్త్రీయ సంగీతంతో ప్రస్తుత సామాజిక విషయాలని తీసుకుని పాటలు అల్లారు. నృత్య కారులు వాటికి అనుగుణంగా, అభినయిస్తూ, నృత్యాలు చేశారు. ఈ కళల మీద ఆశక్తి వున్న వారు, భక్తి మీద నమ్మకం లేనప్పుడు, వాటిలో వున్న భక్తిని వదిలేసి, కళని మాత్రమే ఆస్వాదిస్తారు. గట్టి నాస్తికురాలయిన మా అమ్మాయ, “నాగేంద్ర హారాయ, త్రిలోచనాయ” అన్న పాటకి, చక్కగా నాట్యం చేస్తుంది. నేను చక్కగా ఆస్వాదిస్తాను. ప్రస్తుతం ఈ కళల్లో వున్న సాహిత్యం లోంచి ఎక్కువగా వున్న భక్తిని విడదీయటం కుదరక పోతే, దాన్ని పట్టించుకోకుండా, కళని మాత్రమే ఆస్వాదించడమే చేయగలిగిన పని. ఒక పాట, భక్తి పాట అయినా సరే, ఆ రాగాన్ని విని సంతోషిస్తాము.
2. దోపిడీ చేయకుండా సొంత ఆస్తి ఏర్పడదా? శ్రమ విలువ గా మారాక అది పూర్తిగా ఖర్చవకపొతే… అది మిగులుగా ఉందిపోయి కొంతకాలానికి పోగు పడిపోతుంది కదా. ఆ “మిగులు మేట” ఆస్తే కదా? ఆ రకంగా ఆస్తి ఏర్పడటంలో తప్పేమిటి?
జవాబు: ఆస్తి అనేది రెండు రకాలుగా వుంటుంది. 1. సొంత శ్రమతో ఏర్పడేది. ఇది అతి చిన్నగా వుంటుంది. అన్ని అవసరాలూ, అంటే తిండి, మామూలు బట్టలూ, అతి చిన్న ఇల్లూ, పిల్లల పెంపకం, వృద్ధుల పోషణా, జబ్బుల నివారణా, లాంటి వన్నీ తీరాక, మిగిలేది చాలా చిన్నదిగా వుంటుంది. 2. ఇతరుల శ్రమతో వచ్చిన ఆస్తి. ఇది చాలా పెద్దదిగా వుంటుంది. ఇది రాను రానూ పెరిగి పోతూ వుంటుంది. ఇది ఎంతో జల్సా జీవితాన్నిస్తుంది.
మొదటి రకం ఆస్తి, దోపిడీ ఆస్తిగా వుండదు. పెద్ద పెద్ద ఆస్తులు స్వంత శ్రమతో ఏర్పడవు. “కాపిటల్ పరిచయం” పుస్తకంలో, “లాభం” అనే చాప్టరులో, 204 వ పేజీలో, “ఆస్తి అంటే ఏమిటీ?” అనేది చదవండి. అలాగే, “పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం” అనే పుస్తకంలో, 39 వ చాప్టరు, “‘ఆస్తి’ గురించి రావలసిన ప్రశ్న!” చదవండి. చిన్న చిన్న సొంత ఆస్తులతో జరగదు. చిన్న చిన్న పొలాలు పండక పోవడం లాంటివి జరుగుతాయి. ఎవరి చిన్న ఆస్తి వారి కుంటే, జరిగే పని కాదు. మీరు “కాపిటల్ పరిచయం” చదవండి.
2.1 కాపీ రైట్లూ, స్వయంశక్తితో గొప్పవాళ్ళవటమూ – మార్క్సిస్టు సమాజంలో ఉండవా?
జవాబు: “గొప్ప” అంటే మీ దృష్టిలో అర్థం ఏమిటీ? చాలా డబ్బు సంపాదించడమా? మార్క్సిస్టు సమాజంలో డబ్బు అనేదే వుండదు. ఉన్నత సమాజం ఊహించితే, అందులో ఆస్తి అనేదే వుండదు. ఆ ఉన్నత సమాజం వచ్చే లోపల, ఒక దశలో సోషలిజం అనే దశ వస్తుంది. అప్పుడు, ఒక రచయిత శ్రమ ఆ రచయితకే చెందడం లాంటివి ఉంటాయి. ఈ కాపీ రైట్లూ, అవీ ఆస్తి హక్కులు. ఉన్నత సమాజంలో అవి వుండవు. ఇది చాలా చిన్న జవాబు.
3. ఖర్చవగా మిగిలిన డబ్బును బాంకుల్లో పొదుపు చేసుకొని వడ్డీలు తెచ్చుకోవటం తప్పా ఒప్పా? షేర్లలో పెట్టటం?
జవాబు: మనం వడ్డీ వ్యాపారం చేయడం కోసం, మన డబ్బుని బాంకులో దాచుకోము. అలా బాంకులో దాచుకోవడం వల్ల, చిన్న చిన్న వడ్డీలు వచ్చినా, మన దృష్టి దాని మీదే వుండదు. అలా వచ్చిన డబ్బు కూడా మంచి పనులకు ఖర్చు పెడతాము.
వడ్డీ వ్యాపారం లోని “వడ్డీ” అంటే ఏమిటీ? ఇంకొకరి శ్రమ. మనం ఏమీ చెయ్యకుండా, మనకి వేరొకరి శ్రమ వచ్చేస్తోందీ అంటే, మనం “శ్రమ దోపిడీ” చేస్తున్నట్టే. షేర్లు కూడా ఇంతే. మన శ్రమ లేకుండా, ఇంకొకరి శ్రమ మనకు వస్తే, అది తప్పే కదా? షేర్ల ద్వారా ఇంకొకరి శ్రమని మనం తీసుకోవడం జరుగుతుంది.
కాబట్టి, యాంత్రికంగా, మనం మన డబ్బుని బాంకులో దాచుకోవడం వల్ల వచ్చే చిన్న చిన్న వడ్డీల గురించి బాధ పడి పోనక్కర్లేదు. అలాంటివి మనం మంచి పనులకే వాడతాం.
4. అన్నట్లు ఈ నవలలో లంచాల గురించి చర్చ లేకపోవటం ఆశ్చర్యకరమనిపించింది. ప్రభుత్వ కార్యాలయాలలో/సంస్థలలో కనబడే అసమర్థతల గురించి కూడా ప్రస్తావించలేదు. ఎందుకనో? గ్రంథ విస్తరణ భీతి వల్ల కాదని అనుకుంటాను.
జవాబు: లంచం అనేది పెట్టుబడి దారీ సమాజంలోని అనేక అవినీతుల్లో ఒకటి. ఈ నవలలో, ముఖ్యమైన విషయం – స్త్రీ విముక్తి – సమాజంలోని స్త్రీపురుష సంబంధాలు, శ్రమ సంబంధాల మీద ఎలా ఆధారపడి వున్నాయీ, విముక్తి అనేది ఎలా జరగ గలదూ అని. సమాజం లోని ప్రతీ అవినీతి గురించీ రాయడం కాదు ఈ నవల ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచం లోని విషయాలన్నింటినీ ఈ నవల లోనే రాయడం కుదరదు.
మీరు “కేపిటల్ పరిచయం” చదివితే, మీ అనుమానాలు చాలా నివృత్తి అవుతాయి.
– ప్రసాద్
SrInivas Vuruputuri
వారం ఏకదీక్షగా చదివి జానకి విముక్తి చదివేసాను. ఫుస్తకం నాకు నచ్చింది కానీ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి.
1. ఈ నవలలో సత్యం, శాంతా “క్లాసికల్ సంగీతం” వింటారు. కమ్యూనిస్టు యువతీ యువకులు శాస్త్రీయ సంగీతం వినటం ఏవిటి? కర్ణాటక సంగీతంలో భక్తినీ, కళనీ విడదీయటం కుదరదు కదా? ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాము?
2. దోపిడీ చేయకుండా సొంత ఆస్తి ఏర్పడదా? శ్రమ విలువ గా మారాక అది పూర్తిగా ఖర్చవకపొతే… అది మిగులుగా ఉందిపోయి కొంతకాలానికి పోగు పడిపోతుంది కదా. ఆ “మిగులు మేట” ఆస్తే కదా? ఆ రకంగా ఆస్తి ఏర్పడటంలో తప్పేమిటి?
2.1 కాపీ రైట్లూ, స్వయంశక్తితో గొప్పవాళ్ళవటమూ – మార్క్సిస్టు సమాజంలో ఉండవా?
3. ఖర్చవగా మిగిలిన డబ్బును బాంకుల్లో పొదుపు చేసుకొని వడ్డీలు తెచ్చుకోవటం తప్పా ఒప్పా? షేర్లలో పెట్టటం?
అన్నట్లు ఈ నవలలో లంచాల గురించి చర్చ లేకపోవటం ఆశ్చర్యకరమనిపించింది. ప్రభుత్వ కార్యాలయాలలో/సంస్థలలో కనబడే అసమర్థతల గురించి కూడా ప్రస్తావించలేదు. ఎందుకనో? గ్రంథ విస్తరణ భీతి వల్ల కాదని అనుకుంటాను. 🙂
కాపిటల్ పరిచయం చదివే టైం వచ్చినట్లుంది
Praveen Sarma
నాకు మార్క్సిజం-లెనినిజం పరిచయం చేసినది ఒక అమ్మాయి. మా అమ్మానాన్నలు పల్లెటూర్లో బ్యాంక్ ఉద్యోగం చేసే రోజులవి. అప్పట్లో నేను కంప్యూటర్లు రిపైర్ చెయ్యడం నేర్చుకోవడానికి టౌన్‌కి వెళ్ళేవాడ్ని. టౌన్‌లో సరదా కోసం ఇంటర్నెట్ కేఫ్‌కి వెళ్ళేవాడ్ని. అప్పట్లో ఆన్లైన్‌లో పరిచయమైన ఒక అమ్మాయి ద్వారా నాకు గతితార్కిక చారిత్రక భౌతికవాదం గురించి తెలిసింది. ఆమె సొంతూరు వైజాగ్. ఆమె అశీల్‌మెట్ట జంక్షన్‌కి దగ్గర్లో ఉన్న ప్రజాశక్తి బుక్ హౌస్‌కి వెళ్ళమని చెపితే నేను అక్కడ మార్క్సిస్ట్ పుస్తకాలు కొన్నాను. జానకి విముక్తి నవల మార్క్సిస్ట్ నవల అనే విషయం అప్పట్లో నాకు తెలియదు. రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ అనే విషయం కూడా అప్పట్లో నాకు తెలియదు. చాలా ఆలస్యంగా, అంటే 2006లో జెయుబివి ప్రసాద్ అనే అతను చెపితే తెలిసింది. జానకి విముక్తి నవల చదివిన తరువాత నేను అంతకు ముందు చదివిన గతితార్కిక చారిత్రక భౌతికవాద రచనలు తిరిగి చదవాలనిపించింది కానీ బోర్ కొట్టలేదు.
d.l.vidya
జానకి విముక్తిలో సిధ్ధాంతబోధన ఎక్కువైపొయింది,దాంతో కధ ఆగిపోతూ విసుగు తెప్పించింది అని కొందరి అభిప్రాయం .నేను ఆ పుస్తకాన్ని 20 ఏళ్ళ కన్నా చిన్న వయసులో చదివేను.అంత చిన్న వయసులో కూడా నాకది,ఆ సిద్ధాన్మ్ చెప్పడం వల్లే ఎక్కువ ఇష్టం అయింది.సిద్ధాంత జ్ఞానాన్ని జీవితాంతో సమన్వయ పరచుకోవడం ఎలాతెలుస్తుంది,అలాంటి పుస్తకం చదవకపోతె,దాంట్లో సిద్ధాంత చర్చే లేకపొతే?కొందరికి తెలుస్తుందేమో ,ఎక్కువమందికి తెలియదు.కష్తం కలిగితే విడాకులు తీసుకుని ,మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్ళి చేసుకున్న కధలు ఎక్కువే ఉన్నాయి .ఈ కధకీ, వాటికీ హస్తిమసకాంతర భేదం ఉంది.30 ఏళ్ళ తర్వాతా కూడా ఈ నవలని ఎంతో ఇష్తపడే పాఠకులు ఉన్నారంటే,ఇంకో 50 ఏళ్ళ తర్వాతా కూడా ఉంటారంటే,ఆ భేదమే కారణం.విడాకులు తీసుకుని,మరో పెళ్ళి చేసుకోవడానికి మార్క్సీజం తెలియక్కరలేదు,అది నిజమే.కానీ ఆ కధలో ఉన్నదంతా అంతేనా? మార్క్సిజం ఏమీ తెలియకుండానే, పెళ్ళి అనే తతంగమే లేకుండా ,బాధ్యతగా కుటుంబ జీవితం గడపడం గురించి తెలుస్తుండా?మార్సిజం తెలియకుండానే ,ఉత్త నాస్తికత్వంతోనే,నిరాడంబరమైన పెళ్ళీ,నిరాడంబరమైన జీవితం గురించీ తెలుస్తాయా?మార్సిస్ట్లూ,మార్క్సిస్త్టు దేశాలూ ,మార్క్సిజం వేరని తెలియకుందానే ఫెళ్ళి తతంగం లేకుందానే బాధ్యతాయుతమైన కుటుంబ జీవనం,నిరాడంబరమైన జీవితం గడపడం ఇష్టమవుతుందా మార్సిటులకైనా?మార్సిస్టు మూలపురుషులు దాంపత్య జీవితం గురించి కూడా ఎంతో మంచి సూచనలు ఇచ్చేరన్న విషయం, పెళ్ళి సమావేసంలో ఆ మంచి విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలన్న విషయం, రంగ్నాయకమ్మగారు పెళ్ళిళ్ళలో కమ్మూనిస్తులు చేసే ప్రసంగాల మీద వ్యంగ్యాస్త్రం విసరకుండానే సామాన్య పాఠకులకి అర్ఢం అయిపోతుందా?ఎంత మంది నాస్తికులు, జానకి విముక్తిలో “సత్యం-శాంతా” “జానకి-ప్రభాకర్” లు చేసుకున్న లాంటి పెళ్ళిళ్ళు చేసుకుని అలాంటి కమనీయమైన కుటుంబ జీవితాలు గడుపుతున్నారు?అలాంటి జంటని ఒక్క జంటనైనా చూపించగలరా?”జానకి విముక్తి”లో చూపించినది అలాంతి దాంపత్య జీవితాన్ని.పెనం మీంచి పొయ్యలో పడ్డ దాంపత్యాలనో ,సద్దుకుపొయే దాంపత్యాలనో కాదు.సద్దుకుపోవలసిన అగత్యం లేని భావ ఐక్యత ఉన్న దాంపత్యాలాని చూపించేరు ఆవిడ.ఇద్దరూ అజ్ఞానంలో,మూర్ఖత్వంలో ముచ్చతపడిపోతూ అన్యోన్యంగా జీవిత రధాన్ని లాగెయ్యడమూ కాదు ఆ నవలలో చూపించినది .విజ్ఞానంతో,కుటుంబ ,సమాజ జీవితాల్లో వెలుగుల వైపు అడుగులు వేసే భార్యా-భర్తల్ని చూపించేరు.మనకి ఊహల్లోకీ,కలల్లోకీ అయినా వచ్చే అవ్కాశమే లేని గొప్ప దాంపత్య బంధాన్ని చూపించేరు రంగనాయకమ్మగారు ఆ నవలలో.ఆ నవల చదివేకే చాలామంది అలాంటి ఊహలకి రెక్కలిచ్చేరు.కొంతమందికైనా,స్త్రీ సాంగత్యం /పురుష సాంగత్యం లేకుండా గొప్ప ఆదర్శం కోసం దానిని ఒదులుకోగలిగే ధైర్యాన్ని,నిశ్చల మన్స్తత్వాన్ని ఇస్తుంది ఆ నవల “లోకంలో నాకు తారసపడే వాళ్ళంతా చెత్త మనుషులే అయితే ఏ చెత్త మనిషీ నాకు
జీవిత భాగస్వామిగా ఒద్దు,” అనే రాజీలేని నిర్ణయాన్ని ఇస్తుమింది కొందరికైనా.ఇలాంటి నవలని కేవలం “విడాకులు తీసుకుని ,మళ్ళీ పెళ్ళి చేసుకునే “నవలలాగా చూడడం మెటూరిటీ కాదు . పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూసుకోవాలి, ముసలివాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి , పేదవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి -ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆనవలలో.ఆ నవలలో చెప్పిన ప్రతి విషయానికీ మార్క్సిజమే మూలం.మార్క్సిజం తనకే తెలియని రోజుల్లో అయితే రంగనాయకమ్మగారైనా ఈ కధని ఈ విధంగా రాసేవారు కాదు.ఆ తెలియని రోజుల్లో అయితే ఎలా రాసేరవారో అలా కావాలనుకుంటున్నరు కాబోలు కొందరు ఈ నవలని.మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిత్య జీవితంలో ఎలా మననం చేసుకోవాలో తెలిసిన రంగనాయకమ్మగారు దాన్ని ఎంతో కళాత్మకంగా కధలో పొదిగేరు. మార్క్సిజం విప్లవాలకోసమే కాదు,సమాజాన్ని ఉద్ధరించడం కోసమే కాదు,మనని మనం ఉద్ధరించుకోవడం కోసం,మన కుటుంబాల్ని మనం ప్రశాంతంగా గదుపుకోవడం కోసం కూడా.”సత్యం గురించీ ,శాంత గురించీ రాయలేదు మంజరి లక్ష్మిగారు అన్నారు”.మార్క్సిజం తెలియని సత్యం శాంతల పాత్రలు లేవు రంగనాయకమ్మగారి జానకి విముక్తిలో .మార్క్సిజం తెలియడంవల్లే ఆ పాత్రలు అలా ఉన్నాయి .మార్క్సిటు స్సిద్ధాంతం గురించి చెప్పకపోతే ఆ పాత్రలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాయో పాఠకులకి అర్థం అవదు.కధ మధ్యలో మార్సిజమే అడ్డు అనుకున్నవాళ్ళు,మార్క్సిజంతో సత్యం,శాంత పాత్రల్ని ఎలా ఇష్తపడుతున్నరు? రెవ్యూలో ఆ పాత్రల గురించి రాయకపోవడాన్నే ఓ లోపంగా గుర్తించగలిగినవాళ్ళు ,ఆ నవలలో మార్క్సిజం ఊసులేకపొయిఉంటే ,అది ఆ నవలకి లోపం అని ఎందుకు అనుకోలేకపోతున్నారు?మార్క్సిజం గురించి తెలియని ఎంతో మందికి ,దాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసని రేకెత్తించిన నవల అది. అది మామూలు నవల కాదు.
చిన్నప్పుడు ఒక జానపద కధ చదివేను.దాంట్లో మనుషులు మొక్కలు, చెట్లు,ఆకులు, పువ్వులు, కొమ్మలు,రెమ్మలు రూపాలలో ఉంటారు.వాటన్నిటికీ హ్రుదయాలుంటాయి .ప్రతి హృదయానికీ దానికే ప్రత్యేకమయిన ఓ ‘లయ ‘ ఉంటుంది.అక్కడికి ఒక నిజం మనిషి వస్తుంది,ఆకుగానో,పువ్వుగానో…….మారిపోయిన తన మనిషిని గుర్తుపట్టడానికి. హృదయ లయ ద్వారానే గుర్తు పట్టాలి తన మనిషిని.
ఆ కధలో లాగా ‘రంగనాయకమ్మాగారిని ‘ గుర్తు పట్టాలంటే ఆవిడ ‘హృదయ లయనీ గుర్తు పట్టాలి. మార్క్సిజం రంగనాయకమ్మగారి హృదయ లయ.ఆ లయే ‘జానకి విముక్తీ నవలలో మృదు మధురంగా వినిపిస్తుంది.ఆ లయని తీసేస్తే ఆ కధకి జీవం ఏం ఉంటుంది?మంజరి లక్ష్మి గారి రెవ్యూ బాగుంది.ఒక పెద్ద నవలలో ప్రతీ పాత్ర గురించి రాయాలంటే పెద్దదయిపోతుంది అది.ఆవిడ రాయగలిగింది ఆవిడ రాసేరు. రాసింది బాగందా లేదా అనది చూదాలి.ఒక సారి ఈనాడులో “ఈయనే రోజూ కనిపించే వెంకత్రావు”అని వెంకత్రావు గురించే రాసేరు.మంజరిగారు చెప్పినట్టు “ఎలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకోకూదదో మాత్రమే కాదు, ఎలాంటి వాళ్ళ్ని చేసుకోవాలో” చెప్పే నవల ఇది.”కళ్ళు తెరిచిన సీత” లో అంటారు రంగనాయకమ్మాగారు రేపు ఒదిలెయ్యవలసిన వాణ్ణి ఇవాల పెళ్ళి చేసుకుని ఎల్లుండి ఒదిలెయ్యడం అదేమంత జ్ఞానం,ముందుగానే తెలుసుకోగలగడం “వివేకం గానీ” అని. జానకి విముక్తిలో శారద చిన్న సంఘటనతోనే పెళ్ళికి ముందే చేసుకోబోయేవాదు తన బతుక్కి ఓ నియంతగా తయారవ్వబోతున్నాడని తెలుసుకుని వాడితో పెళ్ళి మానుకుంటుంది.అడవాళ్ళకి మాత్రమే జాగ్రత్తలు సూచించలేదు ఆనవలలో,సత్యం వసంత మూర్ఖంగా ఉందని గ్రహించుకుని ఆమెతో తన ప్రేమని మానుకుంటాడు.ఇలాంతి ఎన్నెన్నో వివేకాలని నేర్పే నవలని,మార్క్సిజమే తెలియకపోతే అలాంటి విషయాలు రాయనేలేకపోయే నవలని,మార్క్సిటు సిద్ధాంతం తెలియకపోతే చెప్పే మంచి విషయాలు అర్ధమేకాకుండాపోయే ప్రమాదం ఉన్న నవలని,విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకునే నవలలాగా అర్ధం చేసుకోవడం విడ్డూరం.
Praveen Sarma
ఇప్పుడు కూడా అమెరికాలో స్త్రీల పరిస్థితి ఏమీ మెరుగ్గా లేదు. ఉద్యోగాలు చెయ్యడానికి బయటకి వస్తున్నారు కానీ ఇంటిలో చేసేది భర్తకీ, పిల్లలకీ వండి పెట్టే పనే, భార్యాభర్తలకి సమాన బాధ్యతలు ఉండవు. రేప్‌లు లాంటి లైంగిక నేరాల విషయంలో అమెరికా కంటే పాకిస్తానే నయం అని ఒక సర్వే చెప్పింది. నేను పుట్టినది 1983లో (భారత దేశానికి మహిళా ప్రధానమంత్రి ఉన్న రోజుల్లో). కానీ నేను స్కూల్‌లో చదువుకునే రోజుల్లో అమెరికాలో మహిళా పార్లమెంటేరియన్ల సంఖ్య ఇండియా కంటే తక్కువ అని విన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఇండియాలో గానీ అమెరికాలో గానీ మహిళల పరిస్థితిలో మార్పేమీ రాలేదు. కాకపోతే మహిళలకి రిజర్వేషన్లు ఇస్తామనో, పావలా వడ్డీ ఋణాలు ఇస్తామనో చెప్పి వోట్లు వెయ్యించుకుని తరువాత వాగ్దానాలని గాలికొదిలేసే రోజులు వచ్చాయి. జానకి విముక్తి నవలలోని జానకి స్థాయికి వెళ్ళిన స్త్రీలని నా నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు.
అకాశరామన్న
ప్రవీన్ శర్మ,
నేను రంగనాయకమ్మ రచనలు చదవను అన్నాను కానీ, ఇది వరకు చదవలేదు అని మీరెలా అనుకున్నారు? ఆవిడ రచణలను , ఆవిడ ధోరణులను చూసిన తరువాతే, ఆమెది కేవలం మతబోధకురాలి స్థాయి అని నిర్ణయించుకున్నాను.
కాబట్టి మీరు ఎదుటివారు చెప్పినదానిలోంచి మీకు తోచింది అనుకోవడం మానేసి, వారు రాసింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఒకప్పుడు అమెరికన్ సెనేట్ (పార్లమెంట్)లో మహిళల సంఖ్య భారతీయ పార్లమెంట్ కంటే తక్కువ ఉండేది. వాళ్ళు మన కంటే ఎక్కువ చదువుకోలేదా? వాళ్ళెందుకు లింగ వివక్షని నమ్ముతున్నట్టు?
మీకో విషయం తెలుసా, భారత దేశములో స్త్రీలకు ఓటుహక్కు బ్రిటనులో స్త్రీలకంటే ముందే వచ్చిందని విన్నా. అంత మాత్రాన భారత దేశములోని స్త్రీల స్థితిగతులు ప్రస్తుతం బ్రిటనులోని స్త్రీల స్థితిగథులకన్నా మెరుగ్గా ఉన్నాయని అనలేము.
ప్రస్తుతం అమెరికాలో స్త్రీల పరిస్థితి మరే దేశములోని స్త్రీల పరిస్థితికన్నా మెరుగ్గానే ఉంది. నిజానికి అక్కడ మగవారి పరిస్థితే ప్రస్తుతం దారుణంగా ఉంది. వారు గట్టిగా నమ్మే సిద్దాంతమేమిటో తెలుసా..
better dead rather red.
మనమూ అదే పాటిద్దామా?
Praveen Sarma
మతాన్ని నమ్మేవాళ్ళు మత గ్రంథాలలోని నియమాలని పాటించకపోవడానికి వారి మీద ఉన్న ప్రభవాలు వేరు. మత నియమాలని ధిక్కరిస్తే నరకానికి పోతారని మత పెద్దలు అంటారు. నరకం నిజంగా ఉందో, లేదోనని సందేహంతో ధిక్కరించేవాళ్ళు ధిక్కరిస్తారు. అంతే కానీ మత నియమాలని కొంత వరకు నమ్ముతారు, కొంత వరకు నమ్మరు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మత చట్టాలు అమలులో ఉన్న ఇరాన్ లాంటి దేశాలలోనైనా కేవలం నరకం పేరుతో భయపెట్టకుండా పోలీసులనీ, కోర్టులనీ ప్రయోగిస్తారు. మనిషి ప్రధానంగా డబ్బు కోసం నేరాలు చేస్తాడు. క్షణికావేశంలో నేరాలు చేసేవాళ్ళు ఏ ఒకరో ఇద్దరో ఉంటారు. సామాజిక వైరుధ్యాలు లేకపోతే నేరాలు జరగవు కదా. ఈ విషయాలన్నీ ఇక్కడ వ్రాయడానికి టైమ్ సరిపోదు. రచన చదవకుండా విమర్శించేవాళ్ళకి సమాధానం చెప్పగలిగేది ఏమీ ఉండదు. చదివిన తరువాత అందులోని వాటి గురించి సందేహం అడిగితే సమాధానం చెప్పగలము.
Praveen Sarma
సుజాత గారు, మీరు ఒకరిద్దరు స్త్రీలని రోల్ మోడల్స్‌గా తీసుకోమంటున్నారు కదా, పల్లెటూర్లలో ఇప్పుడు కూడా విడాకులు పేరు చెపితే నవ్వుతారు. ఒకప్పుడు పట్టణాలలో కూడా పెళ్ళి ప్రకటనలలో విడాకులు తీసుకున్న స్త్రీలు వద్దు అని ఓపెన్‌గా ప్రకటించేవాళ్ళు. ఈ సమాజంలో కేవలం ఒకరిద్దరు స్త్రీలు విడాకులు తీసుకుని రెండవ పెళ్ళి చేసుకున్నంతమాత్రాన వాళ్ళని చూసి సమాజం మారిపోతుందా?
Praveen Sarma
మీరు ఆ నవల చదవకపోతే మీతో చర్చించడానికి ఏమీ ఉండదు. మీరు చెప్పినది వేరు, రచయిత్రి వ్రాసినది వేరు అని తెలిస్తే ఏమి సమాధానం చెప్పగలరు? అందుకే రచయిత్రి వ్రాసినది చదవకుండా విమర్శించకూడదు అనేది. స్త్రీవాదం గురించి కబుర్లు చెప్పడం సులభమే కానీ ఆచరించడం కష్టం. ఒకప్పుడు అమెరికన్ సెనేట్ (పార్లమెంట్)లో మహిళల సంఖ్య భారతీయ పార్లమెంట్ కంటే తక్కువ ఉండేది. వాళ్ళు మన కంటే ఎక్కువ చదువుకోలేదా? వాళ్ళెందుకు లింగ వివక్షని నమ్ముతున్నట్టు?
ఆకాశరామన్న
లక్ష్మి గారూ,
నేను నాస్తికున్ని కాను. నేను దేవున్ని నమ్ముతాను. కాకపోతే నేను నమ్మిందే గొప్పని చెప్పుంకోను. ఇక మార్స్కిజము సైన్సు కాదని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. మార్క్సిజానికి సమాజమే ప్రయోగశాలైతే, ఇప్పటి వరకూ మార్క్సిజము సాధించింది ప్రమాదాలు, విపత్తులూ వైఫల్యాలే తప్ప విజయాలు కాదు. చిత్రమైన విషయమేమిటంటే మార్క్సిజాన్ని నమ్ముకుని సర్వనాషనమైన సమాజాన్ని చూపించి నప్పుడు, మార్క్సిజాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేక పోయారనీందుకే అలా జరిగిందని, తప్పు మార్క్సిజములో లేదని సమర్ధించుకునే వాల్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం. అందులో నాకు ఎస్కేపిజమే ఎక్కువగా కనిపిస్తుంది.
సైన్సులో ఉన్న గొప్ప గుణం, తప్పును సరిదిద్దుకోవడం. అప్పటివరకూ ప్రతిపాదించినది తప్పని నిరూపితమైతే దాన్ని వదులుకోగలగడం. కానీ దురదృష్టవషాత్తూ మార్క్సిజములో ఆగుణం లేదు. మార్క్సు చెప్పిన సిద్దాంతాలు తప్పని నిరూపించబడినవి, లోపాలుగా గుర్తించినవి చాలానే ఉన్నాయి. ఉదాహరణ: వ్యక్తి స్వేచ్ఛ, మానవ స్వభావానికి విరుద్దమైన ఆదర్శాలు. నిజానికి, మార్క్సిజాన్ని సైన్సు అనే కంటే, ఒక మత గ్రంధము అని అనుకోవచ్చు. అందులో కూడా అన్నీ నీతి సూక్తులూ ఉంటాయి. పాటించ గలమా లేదా అన్నదానితో సంబందము లేకుండా. మార్క్సిజాన్నే కాదు ఆ మతగ్రంధాలను అందరూ పాటించినా సమాజము చాలా గొప్పగా ఉంటుంది.కానీ పాటించే దెవరు?
ఇక రంగనాయకమ్మ నవలలని నేను చదవను. ఎందుకంటే, నాకు ఆవిడలో ఒక మత బోధకుడు కనిపిస్తాడు. మా మతము మాత్రమే దేవుని సమ్మతమైనది, మా మతమును పాటిస్తేనే దేవుడు స్వర్గానికి తీసుకెలతాడు లాంటి మాటలు మతబోధకులు చెబుతూ ఉంటారు. రంగనాయకమ్మ గారు కూడా ఆకోవలోకే చెందుతారు. కాకపోతే అవిడ మార్క్సిజాన్ని గురించి రాస్తుంది అంతే తేడా.
Marxism – Some general points of criticism
M.lakshmi
సుజాత గారూ,
స్త్రీల సమస్యలు, వాటి స్వభావం పైకి చూడటానికి విడి, విడి గానూ, వేరు,
వేరు గానూ ఉన్నట్లు కనిపిస్తాయి కానీ, వాటి మూలాలు ఈ సమాజంలోనే ఉన్నాయి.
స్త్రీల సమస్యలకు కారణం, స్త్రీల మీద
పురుషుల ఆధిపత్యం. అది కొనసాగటానికి కారణం స్త్రీలు పోషణ కోసం పురుషుల
మీద ఆధారపడటం. ఆ ఆధార పడటానికి కారణం వారి మధ్యనున్న శ్రమ విభజన.
దీన్నంతా చెప్పాలీ అంటే సమాజంలో ఉన్న శ్రమ దోపిడి గురించీ, శ్రమ విభజన గురించీ
చెప్పాలిసిందే కదా! “జానకి విముక్తి” నవల “జానకి” అనే ఒక హీరోయిన్ కధలాగా
మొదలై, చివరి చివరికొచ్చేటప్పటికి, “జానకి” అనే పేరు స్త్రీలందరికీ
సింబాలిక్‍గా నిలబడి స్త్రీలందరి విముక్తికి కావలసిన సామాజిక పరిస్తితుల
గురించి చెపుతుంది. మార్క్సిజం అనే సిద్ధాంతం ఒకటి ఉందనీ, దానికీ స్త్రీ
విముక్తికీ సంబంధం ఉందనీ, అది సమాజంలో అనేక సమస్యలతో పాటు, స్త్రీ
సమస్యని కూడా పరిష్కరిస్తుందనీ చెప్పాలనే ఈ నవల రాయటంలోని రంగనాయకమ్మ
గారి ముఖ్యోద్దేశం.
. ఒకళ్ళో, ఇద్దరో స్త్రీలు, మీరు చెప్పిన అరకొర చైతన్యం ద్వారా వాళ్ళ
జీవితాలను కొంత సౌఖ్యవంతంగా మార్చుకుంటే మార్చుకొని ఉండవచ్చు. కానీ,
అలాంటి వారి జీవితాల్లో కూడా పూర్తి సమానత్వం అనేది ఉండదు. మీరు
చెప్పిననట్లుగానే, చెప్పినంత వరకే అయితే, అటువంటి కధలు ఇదివరకు చాలా
మంది, చాలా చాలా రకాలుగా రాసేవున్నారు. కానీ ఈ “జానకి విముక్తి” నవలలో
రంగనాయకమ్మ గారు స్త్రీలందరి విముక్తికి కావలసింది ఏమిటీ అనేది
చెప్పదలచుకున్నారు. స్త్రీలందరి విముక్తి జరగాలంటే దానికి ఏకైక మార్గం
మార్క్సిజం ఒక్కటే. మార్క్సిజం అయితేనే ఎవరి మీద ఎవరికీ ఆధిపత్యాలు
ఉండటానికి వీల్లేదని చెపుతుంది. అన్ని ఆధిపత్యాలకూ వ్యతిరేకంగా
పీడితులందరూ కలసి పోరాడాలని చెపుతుంది. ఆ పోరాటాలలో భాగంగానే స్త్రీలు
కూడా పురుషుల ఆధిపత్యం నుంచి బయట పడగలుగుతారు. చైనాలో ఆ మార్పులు
జరుగుతున్న కాలంలో అక్కడి స్త్రీల గురించి చెపుతూ “చైనాలో విడాకులు”
ఉదాహరణగా చూపించారు. వాళ్ళకు, అట్లా పోరాడే ధైర్యాన్ని ఆ సమాజంలో
జరుగుతున్న మార్పులే కలిగించాయి. స్తీల విముక్తిని కలిగించే మార్క్సిజం
మూల సూత్రాలు చెప్పకుండా, ఇంకేం చెప్పినా ఉట్టి ఉపన్యాసాల లాగా ఉంటుంది.
అందుకే హేతువాదం మీద, మార్క్సిజం మీద సంభాషణలూ, చర్చలూ ప్రవేశ పెట్టారు
రంగనాయకమ్మగారు. బానిసలకీ, స్త్రీలకీ ఉన్న పోలికల్ని కధలో సత్యం ఎంత
గొప్పగా చూపిస్తాడు. అతనికి మార్క్సిజం మీద ఉన్న అవగాహనను చూపించకుండా
ఇది చెప్పటం కుదురుతుందా? అన్నీ ఆ నవలకూ, రంగనాయకమ్మ గారు ఎన్నుకున్న కధ
ముఖ్యోద్దేశానికీ, సంబంధించినవిగానే ఉన్నాయి. తర్క సంబంధమైన విషయాలు చదవాలంటే
కొంచం ఎక్కువ కష్ట పడవలసిందే. కొత్తగా ఉన్నప్పటికీ, మన కవసరమైన
చైతన్యాన్ని కలిగించే వాటిని వదల కూడదు.
మీరు ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడితే స్త్రీలకు విముక్తి
అయినట్లే అంటున్నారు. మరి ఈ సమాజంలో అందరి స్త్రీలకూ ఉద్యోగాలూ, వారి
పోషణకు సరిపడిన జీతాలూ రావాలంటే ఇప్పుడున్న సమాజంలో కుదురుతుందా?
మగవాళ్ళకూ, ఆడవాళ్ళకూ కూడా నిరుద్యోగ సమస్య ఎందుకుందో మీరెప్పుడైనా
ఆలోచించారా? దానికి కారణం, పరిష్కారం కూడా మార్క్సిజంలో ఉన్నాయి. అందుకే
స్త్రీ విముక్తికి బయట సమాజంలో మార్పులు కూడా అవసరం. అందుకనే జానకి పని
చేసే ఫ్యాక్టరీలోని పరిస్థితులూ, అవి మారటానికి కావలసిన విషయాల గురించి
చెప్పటానికే రంగనాయకమ్మ గారు శ్రమ, డబ్బు, విలువ లెక్కలు చెప్పవలసి
వచ్చింది. ఆ విషయాలు, ఉద్యోగం చేసుకొని, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే
స్త్రీలకు ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన విషయాలుగానే ఉంటాయి కదా!
M.లక్ష్మి
M. lakshmi
ఆకాశరామన్నగారు,
మీరు `మార్క్సిజం సైన్సు కాదూ, అది నమ్మకమనీ, మార్క్సిష్టు రచయితలు కొంత సైన్సును కలిపి చెప్తారనీ, కొద్ది పాళ్ళు సైన్సనీ, మార్క్సిజంలో మంచిలేదనననీ’ ఇన్ని రకాలుగా చెపుతున్నారు. మీ మాటలు చూస్తే మీరు నాస్తికులుగా అనిపిస్తున్నారు. మరి దేవుడు లేడనే విషయాన్ని మీరు హేతుబద్ధమైన తర్కంతోనే కదా నిరూపించేది.ఇలా నిరూపించటాన్నే సైన్సు అంటారు. సైన్సు అంటే శాస్త్రము అని అర్ధం. సామాజిక శాస్త్రాలూ అంటే సోషల్ సైన్సెస్ అని అర్ధం. లాబొరేటరీల్లోనూ, టెస్టుటూబులతోనూ నిరూపింపబడితేనే సైన్సులవ్వవు. సామాజిక శాస్త్రాలకు, సమాజమే లాబొరేటరీ, సామాజిక సంబంధాలే టెస్టు ట్యూబులు. మనుషులు ఎక్కువ తక్కువలుగా ఉండటానికీ, కోట్ల మంది మనుషులు తమ అవయవాలతో చెయ్యగలిగినన్ని పనులు చేస్తున్నా కూడా నిరుపేదలుగా ఉండటానికీ, ఏమీ శ్రమ చెయ్యకుండానే కొద్ది మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులుగా ఉండటానికీ మూలమైన శ్రమ దోపిడీని మార్క్సిజం భవుతిక పునాది మీద నిలబడి ఎంతో హేతుబద్ధమైన తర్కంతో, లెక్కలతో, లెక్కలంత కచ్చితమైన సూత్రాలతో నిరూపించిన సామాజిక శాస్త్రం. ఇదంతా కార్ల్ మార్క్స్ రాసిన కాపిటల్ పుస్తకంలో ఉంది. అది చదవకుండానే మీరీ తర్కం చేస్తున్నారనిపిస్తుంది. కనీసం రంగనాయకమ్మ గారి” పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం పుస్తకమన్నా” చదివి, అందులోని ప్రశ్నలకు జవాబులు చెప్పుకోగలిగితే, మార్క్సిజం ఎంత తర్కబద్ధమైన సైన్సో మీకు ప్రాధమికంగానైనా అర్ధం అవుతుంది. ఆ తరువాత ఇంకా చాలా విషయాలు, రంగనాయకమ్మ గారి “కాపిటల్ పరిచయం చదివి” తెలుసుకోవచ్చు.
M.lakshmi
Praveen Sarma
జానకి విముక్తి నవల సీరియల్‌గా వస్తున్న రోజుల్లో ఆ సీరియల్‌ని నిలిపివెయ్యించినది విశాఖపట్నం హేతువాద సంఘంవాళ్ళు. మన రాష్ట్రంలో ఒకప్పుడు మూడు నాస్తిక సంఘాలు ఉండేవి. అవి విశాఖపట్నం హేతువాద సంఘం, భారత నాస్తిక సమాజం & భారత నవ్యమానవవాద సంఘం. ఈ మూడు సంఘాలవాళ్ళూ మతం పోతేనే అన్ని సమస్యలూ పోతాయని వాదించేవాళ్ళు. మతం పోయినంతమాత్రాన మౌలిక సమస్యలు పోవు, కుల వివక్ష & లింగ వివక్ష లాంటి సమస్యలు కూడా పోవు అని రంగనాయకమ్మ గారు వాదించారు. ఆ విషయం చెప్పడానికి నీడతో యుద్ధం & జానకి విముక్తి రచనలు వ్రాసారు. జానకి విముక్తి నవలలో ప్రభాకర్ నాస్తికుడు. మొదట్లో అతను కూడా మతం పోతేనే సమస్యలన్నీ మాయమవుతాయనుకుంటాడు. తరువాత ప్రభాకర్ తన అభిప్రాయాన్ని మార్చుకుని మార్క్సిజం చదువుతాడు. సామాజిక వ్యవస్థలో అనేక లొసుగులు ఉండగా కేవలం కులం, మతం మాత్రమే లొసుగులు అనుకుంటే సమాజం గురించి అర్థం కాదు. Religion is a shadow but not a superstructure of the existing social institution. So, the fight with religion in class society is equivalent to fight with shadow. ఈ విషయం అర్థం చేసుకోకుండా నాస్తికులు రంగనాయకమ్మ గారిపై వ్యక్తిగత విమర్శలు చేశారు.
Snkr
Well said, Sujata garu. I too felt the same from his comments. I don’t understand what is wrong in thinking of the women in his examples. Why he thinks ‘only understanding Marxism alone gives a permanent solution to such problems’.
Though his arguement makes sense, looks more like a belief than science! Marxism is a science like alchemy :))
Praveen Sarma
జానకి విముక్తి నవల సాధారణ స్త్రీవాద నవల కాదు. భర్త చనిపోయిన తరువాత, భర్తకి విడాకులు ఇచ్చిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవడం గురించి చాలా కథలలో చదివాము. డాక్టర్, సైంటిస్ట్ లాంటి ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడా సామాజిక కట్టుబాట్లకి ఎందుకు లొంగిపోతున్నారో చాలా మంది రచయితలు చెప్పలేకపోయారు. మా అమ్మగారి చిన్నప్పుడు వాళ్ళ ఊరిలో కొంత మంది డబ్బున్నవాళ్ళు ఆడపిల్లలని స్కూల్‌కి పంపించేవారు కానీ స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తరువాత గడప దాటి బయటకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మిడిల్ క్లాస్‌వాళ్ళు కూడా అమ్మాయిలని చదివిస్తున్నారు కానీ ఆడవాళ్ళ జీవితాలలో అంతగా మార్పులేమీ రాలేదు. అందుకే ఇప్పటి చదువులు స్త్రీల జీవితాలని మార్చలేవు అని రంగనాయకమ్మ గారు అన్నారు.
సుజాత
దుర్గ గారూ, నవ్య వీక్లీ ఆన్ లైన్లో ఉంది. అక్కడ మీరు కళ్ళు తెరిచిన సీత సీరియల్ చదవొచ్చు.
Here…….
http://www.navyaweekly.com
అలాగే రంగనాయకమ్మ గారు రాసిన పుస్తకాలన్నీ (లేటెస్ట్గా రాసినవాటితో సహా) అన్నీ ప్రముఖ పుస్తకాలన్ని షాపుల్లోనూ దొరుకుతున్నాయి కదా! వీలు చేసుకుని చదవండి.(మీరు ఇండియా లో ఉంటే)
దుర్గ
చాలా రోజుల తరవాత ‘ జానకి విముక్తి,’ నవల గురించి సమీక్ష రావడం దానిపైన చర్చ జరగడం చూసి
చాలా సంతోషమేసింది. నేను నవ్య వీక్లీలో సీరియల్ చదవలేదు, మొదటినుండి చదవాలంటె ఏం చేయాలో
చెబుతారా? రంగనాయకమ్మ గారు రాసినవి ఈ మధ్యన ఏవి చదివే అవకాశం రాలేదు. ఆమె పేజిలో, వెబ్ సైట్ లో పెట్టిన పోస్ట్స్ అన్నీ తీరికగా చదువుతాను. చాలా రోజుల తరవాత ఆమె ఈ మధ్యన రాస్తున్నవి చదివే అవకాశం కలిగిస్తున్నందుకు ఈ పేజి, వెబ్సైట్ మానేజ్ చేస్తున్నవారికి ధన్యవాదాలు.
అకాశరామన్న
మార్క్సిజం అనేది సైన్సు కాదు, కేవలం అది ఒక నమ్మకం. సైన్సుకీ, నమ్మకానికీ తేడా తెలీక పోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. మతాన్ని నమ్ముకునే హిందువు ముస్లిము లాగా, మార్క్సిజాన్ని నమ్ముకునే వారు కూడా ప్రవర్తించడం మనం చూడచ్చు. అన్ని సమస్యలకూ దేవుడున్నాడు, వాటికి మూలాలు తరుణోపాయాలూ పురాణాలలో, పవిత్ర గ్రంధాలలో ఉన్నాయని భావించే మత విశ్వాశకుడికీ, ప్రతీ సమస్యకీ మందు మార్క్సిజమే అనుకునే రంగనాయకమ్మ లాంటి రచయిత్రులకూ పెద్ద తేడా లేదు.
Hotch-patch , అదే మార్క్సిస్టు రచయితలు చేసేది. కొంత Scince కొంత prejudice, రెండింటినీ కలిపి చెప్పడం. దురదృష్టవశాత్తూ మార్క్సిజములో సైన్సు పాల్ల కన్నా ఈ నమ్మకాల పాళ్ళు చాలా చాలా ఎక్కువ అందుకే, అది కూడా సైన్సులా కాక మరో నమ్మకములా మిగిలిపోయింది. మార్క్సిజములో మంచి లేదని నేనన్ను. కాకపోతే వారు చేసే Claims సత్యదూరమని నేనంటున్నాను. ఉదాహరణకి స్త్రీకి స్వాతంత్రము రావాలంటే మార్క్సిజము తెలుసుకోవడం మినహా వేరే దారిలేదన్న అభిప్రాయాలు అందుకు ఉదాహరణ. దీన్నే సరదాగా కొంత మంది, మా ఇంటి కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని నమ్మడం అంటూ ఉంటారు.
విశేఖర్
జానకి విముక్తి నవల పైన సమీక్ష రాయడం, సమీక్షపైన అర్ధవంతమైన చర్చ జరగడం నాకు ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తున్న విషయాలు.
కొద్దిగా రాయాలని మొదలు పెట్టీన ఈ కామెంటు ఎక్కువగా వచ్చింది. అందుకుని నా బ్లాగ్ లో పోస్టుగా పెట్టి లింక్ ఇస్తున్నాను.
http://teluguvartalu.wordpress.com/2011/05/14/1425/
Praveen Sarma
జానకి విముక్తి నవల మళ్ళీ చదవండి. ఒకరిద్దరు స్త్రీలు డాక్టర్, సైంటిస్ట్ లాంటి ఉద్యోగాలు చేస్తే స్త్రీలందరినీ సమాజం గౌరవిస్తుందా? మిగిలిన స్త్రీల సంగతి సరే, ఆ ఒకరిద్దరు స్త్రీలు కూడా సామాజిక కట్టుబాట్లకి లొంగిపోవడం జరుగుతుంది.
సుజాత
ప్రసాద్ గారూ,
ఏదైనా విషయం మీద చర్చించేటపుడు తర్కం సంగతి సరే, వెటకారాలు, వ్యంగ్యాలు లేకుండా ఉంటే అవతలి వారికి చర్చిచాలనే ఆసక్తి ఉంటుంది. ఈ వ్యాఖ్యకు జవాబిస్తే ఎదురయ్యేవి కూడా ఇలాంటి వెటకారాలే అన్న భావన కల్గితే చర్చ అనవసరమనే భావన కల్గుతుంది.
సంబోధన లేకపోయినా మీరు జవాబు రాసింది నా వ్యాఖ్యకే కాబట్టి నేను స్పందిస్తున్నాను.
నేను స్వయంగా చూసిన ఒక ఉదాహరణను మీరు “అఘాయిత్యంతో” కాపురం నిలబెట్టుకున్న మరో ఉదాహరణతో పోల్చి “తన అవగాహనతో చైతన్యంతో తన సమస్యను తానే పరిష్కరించుకున్నానని మురిసిపోయిందట ఆవిడ! ఇలా ఉంటాయి ఆ పరిష్కారాలు. ఆవిడకు తెలిసింది ఇంతే మరి” అని మీకు తోచిన మాటల్ని మీరు విసిరేశారు.
“ఈ కథ చాలా మందికి జానకి తన కాళ్ల మీద తాను నిలబడి, ఇష్టమైనట్టు ప్రభాకర్ రావుని చేసుకుని వెంకట్రావుని తన జీవితంలోంచి తుడిచిపెట్టేయడం మాత్రమే”_____ఇక్కడా వెటకారమే, వ్యంగ్యమే! నా మాటలని కోట్ చేస్తూ నా పేరు ప్రస్తావించకపోవడం_________ “మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు” అనే ఆప్షన్ మీ దగ్గరే ఉంచుకునేట్టుగా!
ఇలాంటి సందర్భాల్లో, నేను తర్కబద్ధమైన చర్చ కాదు కదా, సరదా చర్చకు కూడా సిద్ధపడను.
చివర్లో మీ మాటల్లో వైరుధ్యం మీరు గ్రహించినట్టు లేదు.
ప్రతీ పాఠకుడికీ తన చైతన్యాన్ని బట్టి, తన కిష్టమైనట్టు, నవలని అర్థం చేసుకునే హక్కు వుంటుంది. అన్నారు.
సరే, మీకు అర్థమైంది వేరు, నాకు అర్థమైంది వేరు.
ఆ పాఠకుడు పబ్లిక్ లోకి వచ్చి, తనకి అర్థమైనవి ఇతరులకి చెప్పుకుంటాడో, ఆ చెప్పుకున్న వాటి మీద ఇతరులు కూడా, వారి చైతన్యాన్ని బట్టి, ఏదో చెప్పుకుంటారని గ్రహించాలి____________కదా!
మరి “నాకిలాగే అర్థం అయింది, ఇది నా అభిప్రాయం, నా ఇష్టం” అని అనకూడదు. అనడం ఎలా న్యాయం? “అనకూడదు” అని మీరు వేరే పాఠకులను ఎలా నిర్దేశిస్తారు? మీ చైతన్యాన్ని మీరు చెప్పుకున్నట్లే నాకు తోచింది నేను చెప్పుకున్నాను. మీ మాటలను మీరే ఖండిస్తున్నారన్నమాట.
ఎప్పుడైనా వ్యాఖ్య రాసేవారు తనకు తెలిసిందంతా అవతలి వారికి బోధించేయాలనే తీరులో వ్యాఖ్యలు రాయడం, అవతలి వారికి “మీరు ఇలాగే మాట్లాడాలి” అని చెప్పడం పబ్లిక్ ఫోరం లో అనుసరించాల్సిన పద్ధతి కాదని నా విశ్వాసం!
ప్రవీణ్ శర్మ గారూ, నవల ఎవరికి అర్థం కాలేదు? నాకా ? ప్రసాద్ గారికా? మీరు కూడా స్పష్టంగా చెప్పాలండీ!
Praveen Sarma
జానకి విముక్తి నవల మీకు అర్థమైనట్టు లేదు. ఒకరిద్దరు స్త్రీలు తమ భర్తలకి విడాకులు ఇచ్చేసి రెండవ పెళ్ళి చేసుకుంటున్నా ఇంకా చాలా మంది స్త్రీలకి ఇంకా విడాకులు ఇచ్చే ధైర్యం రావడం లేదు. పరువుమర్యాదల కోసం ఇష్టం లేని కాపురాలు చేస్తున్నారు. స్త్రీ-పురుష సంబంధాలలోని వైరుధ్యాలకీ, ఇతర విషయాలలోని వైరుధ్యాలకీ ఒక రకమైన తేడా ఉంది. పరువుమర్యాదలు అనేవి భూస్వామ్య సమాజం విధించిన అడ్డుగోడలు అని చెపితే ఎంత మంది స్త్రీలకి అర్థమవుతుంది? అందరూ పరువుగానే బతుకుతున్నారు, మనమూ పరువుగానే బతుకుదాం అనుకుంటారు కానీ కట్టుబాట్లని దాటి బయటకి వచ్చే ధైర్యం చెయ్యరు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే జాతి నాయకుడు తనకి మార్క్సిజం గురించి తెలియకపోయినా జాతీయ విముక్తి కోసం పోరాడగలడు. పెట్టుబడి వృద్ధి చెందని, భూస్వామ్య సంబంధాలు కూడా వృద్ధి చెందని కుర్దిస్తాన్, బెలూచిస్తాన్ లాంటి వెనుకబడిన ప్రాంతాలలో కూడా జాతి సంబంధాలూ, రక్త సంబంధాలూ బలంగా ఉంటాయి. వాళ్ళు బయటి సమాజం కంటే జాతికీ, రక్త సంబంధాలకే ఎక్కువ విలువ ఇస్తారు. స్త్రీ-పురుష సంబంధాలలో సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజికాంశాలని వేరు చేసి చూస్తే స్త్రీవాదం అర్థం కాదు. స్త్రీవాదం గురించి కబుర్లు చెప్పేవాళ్ళు కూడా సామాజికాంశాల దగ్గరకి వచ్చేసరికి సమాజంతో రాజీ పడిపోతారు. అందుకే స్త్రీల పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు.
ప్రసాద్
సమాజంలో పురుషుల కుండే ప్రతీ సమస్యా, స్త్రీలకు కూడా వుంటూ, స్త్రీలకు మాత్రమే అదనంగా వుండే సమస్య, “పురుష పెత్తనం” అని రంగనాయకమ్మ గారు స్పష్టంగా చెప్పారు. అలాగే, ఆ “పురుష పెత్తనానికి” మూలం, సమాజ శ్రమ సంబంధాల మీదే ఆధార పడి వుంటుంది అని కూడా చెప్పారు. సమాజ శ్రమ సంబంధాలలో మార్పు రాకుండా, స్త్రీల విముక్తి పరిపూర్ణంగా ఎప్పటికీ సాధ్యం కాదు. అయితే, సమాజంలో మార్పులన్నీ పూర్తయ్యే వరకూ ఎవరూ ఆగకూడదు కాబట్టి, తమ తమ పరిధిల్లో, తమ తమ చైతన్యాలతో, స్త్రీల సమస్యలకి తాత్కాలిక పరిష్కారాలు కొన్ని సంపాదించ వచ్చు. అయితే, ఈ తాత్కాలిక పరిష్కారాలు రాబోయే శాశ్విత పరిష్కారాలతో వైరుధ్యంలో లేనప్పుడే, అవి ఆహ్వానించ తగినవిగా వుంటాయి.
ఎంతో బాగా చదువుకుని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్త్రీలు, తమ సమస్యల పట్ల తమకి అవగాహన వుందని అనుకున్నప్పటికీ, పురుష పెత్తనానికి గురవుతూనే వున్నారు. ఉత్త ‘అవగాహనలూ, ఆలోచనలూ’, స్త్రీలకి పరిపూర్ణ విముక్తి కలిగిస్తుందనుకోవడం అమాయకత్వం. సమాజ శ్రమ సంబంధాలని పట్టించు కోని ధోరణి, ముఖ్యంగా స్త్రీలకి హాని చేస్తుంది.
“మార్క్సిజం ఎందుకు తెలుసు కోవాలీ?” అని ఎవరి కయినా ప్రశ్న ఉదయిస్తే, దానికి సమాధానం తెలుసు కోవాలని ఆసక్తి కలిగితే, వారు, కనీసం “కేపిటల్ పరిచయం” చదివి తీరాలి. ఎందుకంటే, ఈ సైన్సు మాత్రమే, సామాజిక శ్రమ సంబంధాలలో వున్న అసమానత్వాన్ని ఎలా తీసెయ్యాలో చెబుతుంది. అదే పరిపూర్ణ పరిష్కారం అవుతుంది.
ప్రస్తుత సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య ఎటువంటి శ్రమ విభజన వుందీ? ఉత్త సాంప్రదాయ శ్రమ విభజన వుంది. ఆడ వాళ్ళు ఇంటి పని చేస్తారు. మగ వాళ్ళు బయటి పని చేస్తారు. కొందరు ఆడ వాళ్ళు బయటి పని కూడా చేసినా, సమాజంలో అది మెజారిటీ కాదు. అయినా, బయటి పని చేసే ఎక్కువ మంది ఆడ వాళ్ళకి కూడా, ఇంటి పని అదనపు బాధ్యత గానే వుంటోంది. ఇటువంటి సాంప్రదాయ శ్రమ విభజన పద్ధతి వల్లనే పురుషుల డామినేషన్ మొదలవుతోంది. అది పోవాలంటే, ఆ అసమానత్వ, సాంప్రదాయ శ్రమ విభజన పోవాలి, స్త్రీ, పురుషుల మధ్యన. ఇది మారాలంటే, మార్క్సిజం తెలియాలి. ఇలాంటి సైన్సు తెలియక పోతే, ఒక భర్తని మార్చుకుంటే, మార్చుకోవచ్చు. అది సామాజిక సమస్యకి పరిష్కారం అవదు.
ఈ పురుష డామినేషను భార్యా,భర్తల మధ్య మాత్రమే కాదు. సమాజం లోని స్త్రీ, పురుషు లందరి మధ్యా వుంది. పురుషుల కున్నన్ని అవకాశాలు స్త్రీలకు వుండవు. అదీ మారాలి. దానికి, సామాజిక సైన్సు తెలియాలి. ఉదాహరణకి, ఆడ డాక్టర్లకీ, మగ డాక్టర్లకీ సమాన అవకాశాలు వుండవు. ఏవో కొన్ని కేసులు మాత్రం కాకుండా, సమాజంలో వున్న మెజారిటీ పరిస్థితి చూడాలి.
“జానకి విముక్తి” నవలలో, స్త్రీ విముక్తికి మార్క్సిజం జ్ఞానం అవసరం కాబట్టి, దాన్ని చెప్పారే గానీ, సందు దొరికింది కదా అని చెప్పి, మధ్యల్లో పిట్ట కధల్లా, మార్క్సిజాన్ని చొప్పించ లేదు. బాధితులకి ఈ సైన్సు తెలిసి తీరాలి. అందుకే, ఆ జ్ఞానం ఈ పుస్తకంలో వుంది.
ఇలాంటి కామెంట్లలో, ఇంత కన్నా విషయాలు వివరంగా చర్చించడానికి కుదరదు.
ఈ పుస్తకంలో మగ వాళ్ళు కూడా సామాజిక సైన్సు తెలుసుకుని, తమ డామినేషను పోగొట్టు కోవాలీ అని సత్యం పాత్ర ద్వారా చూపించారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా మారాలి. పురుషులు కూడా ఈ సైన్సు నేర్చుకోవాలి. సత్యం కూడా ఈ సైన్సు నేర్చుకుని, తన డామినేషన్ని వదుల్చు కుంటాడు. ఉత్త మంచి తనాల తోనే బతుకులు సరిగా అయిపోవు. సరైన జ్ఞానం కూడా అవసరం.
స్త్రీ, పురుష సమానత్వం మీద సరైన అవగాహన లేకపోతే, ‘అఘాయిత్యాలతో కాపురాలు నిలబెట్టుకోవడం” కూడా స్త్రీ సమస్యని పరిష్కరించే ధోరణి లోకే వస్తుంది. మాకు చిన్నతనంలో తెలిసిన ఒక ప్లీడరు, ఐదో క్లాసు మాత్రమే చదివి, డిటెక్టివ్ సాహిత్యాన్ని మాత్రమే ఇష్టపడే ఒకావిడిని (ఆస్తులని కూడా దృష్టిలో పెట్టుకుని) పెళ్ళి చేసుకున్నాడు. ఆవిడ చెప్పిన మాట వినడం లేదని, కొట్టేవాడట. ఆవిడ ‘తెలివి’గా, అరిచి, గోల చేసి, నలుగురి లోకి తీసుకు వెళ్ళిందట విషయాన్ని. ‘పరువు’ అంటే భయపడే ఆ ప్లీడరు, అప్పట్నించీ కొట్టడం మానుకున్నాడట. ‘తన చైతన్యంతో, తన అవగాహనతో, తన సమస్యని తానే పరిష్కరించుకున్నా’నని ఆవిడ మురిసి పోయిందట. ఇలా వుంటాయి ఈ పరిష్కారాలు. ఆవిడికి తెలిసింది అంతే మరి.
నేననుకున్నట్టు గానూ, అన్నట్టు గానూ, ఈ కధ, చాలా మందికి, ‘జానకి తన కాళ్ళ మీద తను నిలబడి ఇష్టమైనట్లు ప్రభాకర్ ని చేసుకుని వెంకట్రావు అనే పాత్రను జీవితంలోంచి తుడిచిపెట్టేయడం’ మాత్రమే. అంతే కానీ, “జానకి, మానవ శ్రమ సంబంధాల విషయాలు అర్థం చేసుకోవడానికీ ఇష్ట పడుతోందనీ, అవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందనీ, స్త్రీల సమస్యలకు మూల కారణాలు అర్థం చేసుకునే ప్రయత్నంలో వుందనీ; అందువల్లనే, భవిష్యత్తులో ప్రభాకర్ మరో వెంకట్రావు అవడనీ, ఒక వేళ అయినా, అది జానకి చాలా చక్కగా ఎదుర్కో గలదనీ; జానకికే విముక్తి దొరికింది గానీ, విశాలాక్షికో, వాళ్ళ పని మనిషికో ఇంకా విముక్తి పధం కొస కూడా దొరక లేదనీ; సరైన జ్ఞానం లేనప్పుడు, స్త్రీలు ఒక రకమయిన సమస్య ల్లోంచి ఇంకో రకం సమస్యల్లోకి దుంకుతారనీ, ఆ అవగాహన వారికి సరిగా వుండదనీ; ఇంకా ఇలాంటి చాలా విషయాలు వున్న కధ” ఇదని, ఎంతో మందికి అర్థం కాదు. అర్థం కాక పోవడం తప్పు కాదు. ఎవరైనా సరైన అర్థం చెప్పినపుడు, దానికి పెడ మొహం పెట్టడమే తప్పు.
అయినా, ప్రభాకర్ లాంటి మార్క్సిజం తెలిసిన మనిషి, అభ్యుదయ భావాలూ, జ్ఞాన పిపాసా లేని వాళ్ళని ఎందుకు ‘పెళ్ళి’ చేసుకుంటాడూ? ఉన్నత అభిప్రాయాలు వున్న వాళ్ళనే అతను ఇష్ట పడతాడు.
“భర్తని వదిలేసి, ఉద్యోగం చేసుకుంటూ, ఇంకో మగ మనిషిని పెళ్ళి చేసుకోవడమే” స్త్రీల విముక్తి పరిష్కారం అయితే, “జానకి విముక్తి” చదవడం ఎందుకూ? ఏదో, మామూలు కధ చదువు కోవచ్చు. ఎంతో మంది, సాధారణ స్త్రీలు కూడా, ఏమీ చదువు కోకుండానే, ఈ మాత్రం పరిష్కారాన్ని చక్కగా అనుసరిస్తున్నారు. అయితే, అది పరిపూర్ణ విముక్తి కాదనేది వారికే అర్థం కాని విషయం.
సామాజిక శ్రమ సంబంధాలకి పెడ ముఖం పెట్టే వారికి, స్త్రీ,పురుష సంబంధాలూ, వారి మధ్య సమానత్వం సరిగా అర్థం కావు. అర్థం కాకపోతే, ఫరవా లేదు. వూరుకోవచ్చు. కానీ, అసలైన జ్ఞానాన్ని విసుక్కుంటారు. అక్కడొస్తుంది సమస్య. అజ్ఞానం వల్ల, స్త్రీలు కూడా స్త్రీల సమస్యలకి శతృవులుగా తయారవొచ్చు, జానకి అత్త లాగా, ఆడ పడుచు లాగా.
ఒక పాఠకుడు తన నిజ జీవితంలో ఒక కేపిటలిస్టుగా వుండి వుండ వచ్చు. లేదా, ఒక కేపిటలిస్టు దగ్గర పెద్ద జీతగాడిగా వుండి వుండ వచ్చు. సొంత బాధలు వుండి వుండక పోవచ్చు. అయినా, తర్క బద్ధమయిన సైన్సు నేర్చుకునేటప్పుడు, సొంత విషయాలని పక్కన పెట్టి, ఆ సైన్సు నేర్చుకోవాలి. అప్పుడే ఆ జ్ఞాన సంపాదనలో న్యాయం జరుగుతుంది.
చివరగా, ప్రతీ పాఠకుడికీ తన చైతన్యాన్ని బట్టి, తన కిష్టమైనట్టు, నవలని అర్థం చేసుకునే హక్కు వుంటుంది. అయితే, ఎప్పుడయితే, ఆ పాఠకుడు పబ్లిక్ లోకి వచ్చి, తనకి అర్థమైనవి ఇతరులకి చెప్పుకుంటాడో, ఆ చెప్పుకున్న వాటి మీద ఇతరులు కూడా, వారి చైతన్యాన్ని బట్టి, ఏదో చెప్పుకుంటారని గ్రహించాలి. “నాకిలాగే అర్థం అయింది, ఇది నా అభిప్రాయం, నా ఇష్టం” అని అనకూడదు. అలా అంటే, అది తర్క బద్ధమయిన చర్చ అవదు. ఎవరి అభిప్రాయాలని వారు బయట పెట్టుకోవడం, వాటి మీద సరైన తర్కంతో చర్చ జరుపుకోవడం మాత్రమే సరైన పద్ధతి అవుతుంది.
– ప్రసాద్
Praveen Sarma
సిద్ధాంతాలు లేకపోతే సమాజం ముందుకి నడవదు. అందుకే నవలలో సిద్ధాంతాల చర్చ ఎక్కువగా పెట్టడం జరిగింది. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రష్యన్ పార్లమెంట్‌లో 35% మంది మహిళలు ఉండేవాళ్ళు. ఇక్కడ మహిళలకి రాజకీయాలలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు, పైగా 33% రిజర్వేషన్లు ఇస్తామంటూ నక్షత్రాలు చూపిస్తున్నారు. వర్గ సమాజంలో కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు కానీ అవి ఆచరణలోకి రావు.
సుజాత
స్త్రీలు తమ సమస్యల నుంచి బయట పడాలంటే తమ గురంచి తాము ఆలోచించగలిగి, తమ సమస్య స్వభావం పట్ల చైతన్యం, అవగాహన కల్గి ఉంటే చాలని నా అభిప్రాయం. సొంత సంపాదన ఉండాలనే జ్ఞానం ఉండాలి. ఇది తెలియడానికి మార్క్సిజం కంపల్సరీగా తెలిసి ఉండాలంటే ఇక వాదించడానికేమీ లేదు.
కూడు,గుడ్డకి లోటు లేకున్నా జానకి లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న స్త్రీలను వెంకట్రావు లాంటి మనుషులు ఎలా మానసికంగా నాశనం చేసేస్తారో ఒక్క రెండో భాగం చదివితే చాలు, అర్థమవుతుంది.
జానకి సత్యం దగ్గరికి రావడం, అతడి సహయాంతో సొంత కాళ్ల మీద నీలబడటం ఇదంతా ఓకే! కానీ కార్మిక సమస్యలూ, ఉత్పత్తి, శ్రమ,డబ్బు వీటి మీద సుదీర్ఘ ఉపన్యాసాలూ, క్లాసులూ ఇవన్నీ నవల కథా గమనాన్ని పక్కదారి పట్టించాయి.
జానకి తన కాళ్ళ మీద తను నిలబడి ఇష్టమైనట్లు ప్రభాకర్ ని చేసుకుని వెంకట్రావు అనే పాత్రను జీవితంలోంచి తుడిచిపెట్టేయడం అనే కథకు మార్క్సిజం పాఠాలూ ఉపన్యాసాలూ నవల నిండా లేకపోయినా నష్టం లేదు. అవి ఉన్నా లేకపోయినా పాఠకులు నవల సారాంశాన్ని గ్రహించే తీరతారు.
నవల్లో ఈ చర్చలు సుదీర్ఘంగా వచ్చినపుడల్లా వాటిని పక్కన పెట్టి కేవలం జానకి కథను మాత్రమే చదివి ఉత్తేజితమై, జీవన మార్గాన్ని దిద్దుకున్న్న స్త్రీలు కనీసం నాకు ఇద్దరు తెలుసు. అందులో మా చిన్నక్క ఒకరు!ఎందుకంటే వాళ్ళాయనా వెంకట్రావుకు కవల సోదరుడే!
లలిత (తెలుగు4కిడ్స్)
” స్వతంత్ర ఆలోచన, ఎదిరించే చైతన్యం వాళ్ళలో కలిగించకుండా, మన భావాలను వాళ్ళ మీద రుద్దితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదనీ, జానక్కి పరిస్థితుల్ని ఎదిరించే చైతన్యాన్ని కలిగిస్తూ, తనకు అండగా నిలబడటమే మన పని ”
ఈ సారం చాల ముఖ్యం.
ఐతే బాధితురాలిగా, లేకపోతే చేతకాని వాళ్ళలా వారిని చూడడం, లేదా బలవంతంగా మనం అనుకున్న మార్పేదో వచ్చెయ్యాలనుకోవడం, ఇవన్నీ అండగా నిలిచే వారి అసహాయత, బలహీనత, తెలియని తనం. ఇందువల్లే చాలా మంది ఇటువంటి పరిస్థితులలోంచి బయటికి రారు. అలా అండగా నిలబడడానికి మన మీద, మనం సాయ చెయ్యదల్చుకున్న వారి పరిస్థితి అవగాహన మీద మనకి గట్టి నమ్మకం ఉండాలి. మనుషుల మనస్తత్వాన్ని ఏ లెవెల్లో చూపించవచ్చో చూపారు రంగనాయకమ్మ గారు ఇందులో. ఒప్పుకోవడానికి కాదు, ఏ అభిప్రాయం ఏర్పరుచుకోవడానికి కాదు, అలాంటి రచన చదవడం కోసమే ఐనా చదవాలి. ఆ పాత్రల గురించి నా లాంటి వారు మాటలలో చెపితే అన్యాయం జరగచ్చు పాత్రల స్వరూప స్వభావాలకి. ఆడపడుచు పాత్ర గురించి మాత్రం నాకు కొంత నచ్చనట్టు గుర్తు. ముఖ్యంగా ఆమె అందంగా లేదనో అలాంటిది ఏదో అనుకుంటాను. మళ్ళీ చదివితే ఏమనిపిస్తుందో తెలియదు. ఐతే జానకి పాత్ర ద్వారా తన వదినతో ముందు తన ప్రవర్తించిన తీరులో పొరపాట్లు తెలుస్కుని స్నేహంగా మెలగడం నేర్చుకోవడం చూపించడం నాకు నచ్చిన విషయాలలో ఇంకొకటి.
ఈ వ్యాసంలో వ్యాసకర్త గమనించిన కాపురాలలో విషయాల గురించి రాయడం దానిని పుస్తకానికి రిలేట్ చేస్తూ చెప్పడం ఈ వ్యాస పరంగా సబబే అనిపించింది. ఐతే పురుషాహంకారం ఒక్కటే కాదు కదా జానకి చూసినది. ఆకుటుంబమే ఆమెకు సరిపడలేదు, ఆ కుటుంబం వారికి కుటుంబ విలువలు తెలియలేదు.
వేణు
నా వ్యాఖ్యలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ బదులు పురాణం సుబ్రహ్మణ్యం అని పొరపాటు దొర్లింది. సీరియల్ ఆపివెయ్యటం గురించిన వివరాలు ‘జానకి విముక్తి’ సంపుటంలో మూడో భాగం ప్రారంభానికి ముందు 195-197 పేజీల్లో ఉన్నాయి.
జానకి భావాల్లో క్రమంగా వచ్చిన పరిణామాన్ని రచయిత్రి ప్రతిభావంతంగా చిత్రించారు. సత్యం, శాంతల అనుబంధం సహజంగా, అపురూపంగా ఉంటుంది!
ప్రసాద్
ఈ నవల రెండో భాగం సీరియల్గా వస్తున్నప్పుడు, నేను ఢిల్లీలో వుండే వాడిని. అక్కడకి ఈ పత్రిక ఒక వారం ఆలస్యంగా వచ్చేది. మరి హైదరాబాదు నించి నెమ్మదిగా ఢిల్లీ, గూడ్సు బండిలో చేరుకోవాలో, ఏమో మరి! ఆ హిందీ కొట్టబ్బాయి నా కోసం ఒక పత్రిక కాపీ అట్టే పెట్టే వాడు. ఢిల్లీలో వుండటం ఇష్టం లేని రోజుల్లో, హైదరాబాదుకి దగ్గిరగా, మా వాళ్ళ దగ్గిరకి వెళ్ళి పోవాలనీ, నాకు ఢిల్లీ నించి విముక్తి దొరకాలనీ కోరుకునే వాడిని. “జానక్కి విముక్తి దొరికినప్పుడే, నాక్కూడా విముక్తి దొరుకుతుందని” అనుకుంటూ, ఆ సీరియల్ చదువుతూ వుండే వాడిని. అలా వుండేది ఆ రోజుల్లో నా జ్ఞానం, చైతన్యం. ఆ రోజుల్లో నాక్కూడా, మార్క్సిజానికి సంబంధించిన విషయాలు బోలెడు అర్థం అయ్యేవి కావు. అప్పుడు నేను కూడా, కధకి ఆ విషయాలు అడ్డు వస్తున్నాయనే అనుకునే వాడిని. ఎంత సేపూ, ఇంకేం సంఘటనలు రాస్తారూ, ఆ పాత్రలు ఇంకేం చేస్తాయీ అన్న తపన తప్ప, అసలు విముక్తికి దోహద పడే జ్ఞానం ఏమిటీ అని పట్టింపు వుండేది కాదు. అదే చైతన్య స్థాయి, మూడో భాగం లోకి కూడా సాగింది.
అయితే, మనుషులెప్పుడూ, ఒకే లాగా ఎదగకుండా వుండి పోరు కదా? ఇంకా పుస్తకాలు చదివీ, మంచి స్నేహితులతో సావాసం చేసీ, ఇంకొంచెం జ్ఞానం, చైతన్యం పెంచుకున్నాక, అర్థం అయింది, అసలు జానకి విముక్తికి దోహద పడే విషయాలు ఏమిటీ అని. మార్క్సిజంతో సంబంధం లేకుండా స్త్రీల విముక్తి పరిపూర్ణంగా ఎప్పటికీ సాధ్యం కాదన్న విషయం అప్పుడు అర్థం అయింది.
సరిగా అర్థం చేసుకోక పోతే, ఈ కధ, అత్త చేతా, భర్త చేతా బాధలు పడే ఒకమ్మాయి, ఆఖరికి ఆ భర్తని వదిలేసి, అన్న దగ్గర చేరి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పిల్లాణ్ణి పెంచుకుంటూ, కొత్త జీవిత సహచరుణ్ణి ఎన్నుకుంది అని మాత్రమే అర్థం అవుతుంది. దీనర్థం, ఇలా అర్థం అయింది తప్పని కాదు. అయితే, పూర్తి అర్థం ఇక్కడితో ఆగి పోదు. ఏవో కొన్ని పాత్రలు పెట్టేసి, వాటి చేత కొన్ని మాటలు చెప్పించేసి, పాఠకుల మెప్పు సంపాదించెయ్యాలని ‘కమర్షియల్’ రచయితలు మాత్రమే చూస్తారు. పాఠకుల జ్ఞానాన్నీ, చైతన్యాన్నీ పెంచి, సమాజ అభివృద్ధికి దోహద పడాలని, ‘నిజమైన’ రచయితలు చూస్తారు. అలాగే, పాఠకులు, వారి వారి జ్ఞానాన్ని బట్టీ, చైతన్యాన్ని బట్టీ, తమకి నచ్చిన వాటిని మెచ్చుకుని, నచ్చని వాటిని పక్కకి నెట్టేస్తారు. జ్ఞానం, చైతన్యం అనేవి, మందు లాగా చేదుగా వున్నా (మొదట్లో అజ్ఞానం కొద్దీ అలా అనిపిస్తుంది), అవి మనిషికి మేలు చేస్తాయి కాబట్టి వాటిని పెంపొందించు కోవాలి.
– ప్రసాద్
వేణు
‘జానకి విముక్తి’లో పాత్రల చైతన్యానికి అనుగుణంగానే వాళ్ళు మాట్లాడుకునే చర్చోపచర్చలూ, వాదనలూ ఉన్నాయి. అవి సుదీర్ఘంగానే ఉన్నాయి. మొదటి రెండు భాగాల్లోనూ కథ చకచకా సాగి, మూడోభాగంలో ఇలా ఉండటం వల్ల కథ మందకొడిగా సాగిన భావం కలుగుతుంది!
ఈ నవల సీరియల్ గా వస్తున్నపుడు కథలో మార్క్సిజం ప్రస్తావనల గురించి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యం గారు వెలిబుచ్చిన అభ్యంతరమూ, దానికి రంగనాయకమ్మ గారు ఇచ్చిన సమాధానమూ ఈ పుస్తకం ముందుమాటలో చదవొచ్చు!
Praveen Sarma
మా ఇంటిలో ఆ నవల మొట్టమొదట చదివినది నేనే. 1980ల టైమ్‌లో ఆ నవల సీరియల్‌గా వస్తున్నప్పుడు మా అమ్మగారు కొన్ని ఎపిసోడ్‌లు చదివారు. తరువాత ఆ సీరియల్ పత్రికలో ఆగిపోయింది. మార్క్సిజాన్నీ, స్త్రీవాదాన్నీ వ్యతిరేకించే ఒక వర్గంవాళ్ళు ఆ నవలకి వ్యతిరేకంగా పత్రికకి ఉత్తరాలు వ్రాసారు. ఆ ఉత్తరాలని ఎడిటర్ సుబ్రహ్మణ్య శర్మ రంగనాయకమ్మ గారికి చూపించారు. ఆ ఉత్తరాలు వ్రాసినవాళ్ళలో ఎక్కువ మంది వైజాగ్‌కి చెందిన నాస్తికులు. అంతకు ముందు నీడతో యుద్ధం పుస్తకంలో నాస్తిక, హేతు, నవ్యమానవవాద ఉద్యమాలపై రంగనాయకమ్మ గారు విమర్శలు చేశారు. అందుకే వైజాగ్‌కి చెందిన నాస్తికులు ఆ సీరియల్‌ని ఆపి వెయ్యించారు.
సౌమ్య
@సుజాత:
నాకు కూడా సరిగ్గా ఈ భాగం లో రివ్యూ కొంచెం నిరాశ కలిగించింది. అంటే, నేనింకా వివరంగా చర్చిస్తారనుకున్నా..
ఇంతకీ, నేనసలు జానకి విముక్తి చదవనేలేదు. ఈ సమీక్ష చదివి వ్యాఖ్యానించాలంటే, పుస్తకం చదివి ఉండాలి కనుక, నో మోర్ కామెంట్స్.
సుజాత
mమూడో భాగంలో మార్క్సిజం పాలు ఎక్కువైందన్న సంగతి నా వ్యక్తిగతాభిప్రాయం లెండి!
సుజాత
మంజరి లక్ష్మి గారూ, మీరు నవ్యలో రాసిన ఉత్తరం కూడా చదివాను.:-))
వెంకట్రావు అనే పాత్ర యూనివర్సల్. ఈ పాత్ర ఎక్కడ చూసినా, ఆ మాటకొస్తే ప్రతి ఇంట్లోనో లేకపోతే బంధువుల్లోనైనా కనిపిస్తూనే ఉంటుంది.
అది సరే,మీరు ఈ రివ్యూలో నవల గురించి చర్చించాల్సిన అనేక విషాయలు వదిలేసి కేవలం రెండు వ్యక్తిగతానుభవాలు చెప్పి వదిలేసి నిరాశపరిచారు.
శాంత, సత్యం,మూర్తి,ముఖ్యంగా శాంత అక్క హేమ, వీళ్ళందరి ఎంత విపులంగానో చర్చించవచు అనిపించింది నాకు.
అలాగే నవల్లో మార్క్సిజం పాలు ఎక్కువై మూడో భాగం లో కథ కు అది అడ్డం పడటం, జానకి అత్త, పక్కింటి విశాలాక్షి, ప్రమీల వీళ్లందరి గురించీ రాయొద్దా మీరు?
Praveen Sarma
జానకి విముక్తి నా అభిమాన నవల. 2006లో చదివాను. చదివినా తిరిగి చదవాలనిపిస్తుంది ఆ నవల.