ఇరవై ఏళ్ళ కథ

రాసిన వారు: జంపాల చౌదరి
[రెండు దశాబ్దాలు కథ 1990 – 2009 సంకలనానికి జంపాల చౌదరి గారు రాసిన ముందుమాట ఇది. పుస్తకం.నెట్ లో ప్రచురణకు అంగీకరించినందుకు చౌదరిగారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్]
****************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

****************

కథాసాహితి పేర మిత్రులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లు ఉత్తమ తెలుగు ‘కథ’ సంకలనాలు ప్రచురించటం ప్రారంభించి ఇరవై సంవత్సరాలు గడిచాయి. ఏ స్వచ్ఛంద కార్యక్రమమైనా ఇరవై ఏళ్ళు నిరాఘాటంగా నిర్వహించటం సామాన్య విషయం కాదు; నిర్వాహకుల దీక్షకు, శ్రమకు మెచ్చుకోదగ్గ దృష్టాంతం ఈ మైలురాయి. ఇది సంతోషించి, సంబరాలు చేసుకోవాల్సిన సమయమే. ఒక్క సారి ఆగి, చేసిన పనిని చేయాల్సిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవాల్సిన కాలమే.

ఈ ఇరవయ్యవ వార్షికోత్సవానికి అర్హమైన జ్ఞాపిక గురించి జరిగిన చర్చకు ఆఖరి రూపం ఈ ‘రెండు దశాబ్దాలు’ కథాసంపుటం. ఈ రెండు దశాబ్దాల ‘కథ’ వార్షిక సంకలనాలలో ప్రచురించిన కథలనుండి 20 ఉత్తమకథలను ఎంపిక చేసి ఒక ప్రత్యేక సంపుటాన్ని అందించాలని ఈ ప్రయత్నం ప్రారంభించాము. ఇరవై సంకలనాలు మళ్ళీ చదివాక 20 కథల పరిమితి చిన్నదనిపించింది. ముందు 25కు, ఆ పైన 30 వరకూ ఆ సంఖ్య పెరిగింది. ఇంకా పెంచినా బాగుంటుందన్న ఆలోచన వచ్చినా, ప్రచురణ పరిమితులను దృష్టిలో పెట్టుకొని అక్కడే ఆగిపోయాము.

ఏ సంకలనానికయినా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ సంపుటానికి మేము విధించుకొన్న పరిమితులు మూడు: ’కథ’ 1990 – 2009 సంకలనాలలో ప్రచురితమైన కథలు మాత్రమే ఎంపికకు అర్హం. ఒక రచయిత కథలు ఎన్ని అర్హమైనవి ఉన్నా, వాటినుంచి ఒక్క కథని మాత్రమే ఎన్నిక చేసుకోవాలి. కథల సంఖ్య 30ని మించకూడదు.

ఈ సంపుటానికి మేము ఎంచుకొన్న కథలే ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన ఉత్తమ తెలుగు కథలు అని మేము అనుకోవడం లేదు. గత రెండు దశాబ్దాలలో నాకు బాగా నచ్చిన కథలు కొన్ని, ఏ కారణాల చేతైనా, ’కథ’ వార్షిక సంకలనాలకు ఎక్కలేదు. అటువంటి కథలకు ఈ సంపుటంలో ఉండే అవకాశమే లేదు. వాటిని పక్కనపెట్టినా, ఈ ఇరవై ఏళ్ళ ’కథ’లలో ఈ కథలే ఉత్తమమైనవి అనుకుందామన్నా, పైన చెప్పిన పరిమితులకు తోడు సంపాదకుల వ్యక్తిగత అభిరుచుల పరిమితుల ప్రభావాన్ని ఉపేక్షించలేము. ముగ్గురు సంఫాదకులలో ఏ ఒక్కరి జాబితాను ఈ కథల జాబితాతో పోల్చినా కొన్ని తేడాలు ఉంటాయి; ఈ సంపుటిలో ఉండవలసినవి అని మేము విడివిడిగా అనుకొన్న కొన్ని కథలు ఈ సమిష్టి జాబితాలో చేరలేదు. ఏ కథాప్రియుడు 30 కథల జాబితా తయారు చేసినా కొంత తేడా ఉంటుందనే నా నమ్మకం.

నా సహసంపాదకులతో నాకు పూర్వ ప్రత్యక్ష పరిచయం స్వల్పం. వారి అభిరుచులు, దృక్పథాల గురించి నాకు తెలిసింది తక్కువ. ఐనా, ఈ 30 కథల్లోనూ, 10 కథలు మా ముగ్గురి మొదటి జాబితాలలో ఉన్నాయి. ఇంకో పదకొండుమంది కథకులు మా మొదటి జాబితాలలో వేరు వేరు కథలతో ఉన్నారు. మిగతా కథల విషయంలో ముగ్గురమూ భిన్నమైన కథకులను, కథలను మొదట ఎంపిక చేసుకొన్నాము. అన్ని కథల గురించి కూలంకషంగా చర్చించుకోవటం మొదలుబెట్టి, కొన్ని పట్టువిడుపుల తర్వాత 31 దగ్గర కొద్దిసేపు ఆగి, చివరకు ఈ సంకలనంలో తప్పకుండా ఉండవలసినవి అని ముగ్గురమూ ఏకాభిప్రాయానికి వచ్చిన కథలు ఇవి. ఈ ఎంపిక పూర్తిగా కథల సమగ్రస్వరూపంపైనే ఆధారపడింది కాని ఇతర విషయాల జోలికి వెళ్ళలేదు.

ఈ సంపుటం గత రెండు దశాబ్దాల తెలుగు కథల వస్తు, భావ, భాషా, శిల్ప, శైలీ వైవిధ్యాలకు దర్పణం పడుతుంది. నాలుగు తరాల రచయితల కథలు ఈ సంపుటంలో ఉన్నాయి. విస్తృతంగా వ్రాసిన కథకులూ, బహుకొద్ది కథలు వ్రాసినవారూ ఈ సంపుటిలో చోటు చేసుకొన్నారు. వామపక్ష రాజకీయపు కథలనుండి తాత్వికాన్వేషణ వరకూ భిన్నవస్తువులపై కథలున్నాయి. ఈ రెండు దశాబ్దాలలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక ఉద్యమాల, రాజకీయ సాంఘిక పరిస్థితుల ప్రభావం చాలా కథల్లో స్పష్టంగా గోచరిస్తుంది. అదృశ్యమైపోతున్న జీవనవిధానాల దగ్గరనుండి ఇంతకుముందెన్నడూ కనని వినని నూతన విషయాల వరకూ ఈ కథల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నలుచెరగులనుండి రకరకాల వ్యక్తులు తమ తమ మాండలికాల్లో ఈ కథలు వినిపిస్తారు. పౌరాణిక కథల పునర్మథనం దగ్గరనుంచి మ్యాజికల్ రియలిజం వరకూ రకరకాల ప్రక్రియలు కనిపిస్తాయి. నవరసాల అనుభూతులు , ముఖ్యంగా రావిశాస్త్రి కథల్లో కనిపిస్తుందని శ్రీశ్రీ చెప్పిన రసన, ఈకథలు అందిస్తాయి.

ఎంపిక చేసిన కథలన్నీ ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ చదువుకొన్నవే.. సుజాత, అడుసు నారయణప్ప, చీకటి డిబిరిగాడు, పిలకతిరుగుడు పువ్వు మాజిస్ట్రేటు, సీఐ, బంగారు మురుగు బామ్మ, కిందనేల ఉంది డాక్టరు, ఆమె కుమారుడు, అతడు, తాయమ్మ వంటి ఎన్నో వెంటాడే పాత్రలు ఈ కథల్లో ఉన్నాయి. జీవన వాస్తవాలపై, మానవప్రవృత్తిపై మనకున్న అభిప్రాయాల మూలాలను ప్రశ్నిస్తాయి కొన్ని కథలు. మనుషుల మనుగడపై మారుతున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రభావాల్ని చిత్రీకరిస్తాయి మరికొన్ని కథలు.

’కథ’ 10వ వార్షిక సందర్భంగా, సమకాలీన చరిత్రకు ఈ సంకలనాలు అద్దం పడుతున్నాయని అన్నాను (కథ-99). ఐతే, ఈ సంపుటిలోని కొన్ని కథలు ఆ బేరీజుకి లొంగవు. అతడు, జాడ, టైటానిక్ వంటి కథలు 90వ దశకంలోనే రావటానికి వీలుంది. సాలభంజిక, కింద నేల ఉంది వంటి కథలు 2000 దశకంలోనే రాగలవు. కానీ, బంగారు మురుగు, చీకటి, మాయిముంత, అస్తిత్వానికి అటూ ఇటూ వంటి కథలకు ఈ కాలస్పృహ లేదు. ఆ కథలు ముప్పై ఏళ్ళ క్రితమైనా లేక 2010లో ఐనా వ్రాసి ఉండవచ్చు.

జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కథలన్నింటిలో కనిపించే సామ్యం, సన్నివేశ చిత్రీకరణలో, పాత్రీకరణలో ఈ కథకుల నేర్పు. అర్థరాత్రిపూట పిట్టలవేటైనా, పురిటినెప్పులు పడుతున్న గేదెను బ్రతికించుకోవాలన్న ప్రయత్నమైనా, తమకు ప్రియమైన నాయకుణ్ణి కోల్పోయి కుతకుత ఉడుకుతున్న పట్టణ వాతావరణమైనా, కాశీలో నిమజ్జన వ్యాపారం సాగించే పాండా సత్రమైనా, బసివిని చేస్తున్న గేరిలో పిల్లల సందడి ఐనా, ఏదైనా కానీ, ఉత్తమ చిత్రకారుడు అనేక వన్నెలతో చిత్రించిన చిత్రాల్లా సజీవంగా ఈ పాత్రలు, వారి జీవన స్థితిగతుల నేపధ్యం కళ్ళకుగట్టేలా, మనస్సుపై బలంగా ముద్రపడేలా చిత్రీకరించారు ఈ రచయితలు.

ఈ కథల్లో చాలావరకూ పరిమాణంలో పెద్దవి కావటం కూడా గమనించదగ్గ విశేషమే. ఇంత పెద్దవి కాకపోతే ఈ కథలు ఇంత బలంగా ముద్ర వేయగలిగేవా అన్నది ఆలోచించవలసిన ప్రశ్న. అదే నిజమైతే ఇంతింత పెద్ద కథల్ని ఇప్పుడెవరైనా వ్రాస్తే ప్రచురించే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? లేకపోతే ఇలాంటి కథలు ఇంకా వచ్చే అవకాశం తగ్గిపోతుందా లేక ఇప్పటికే పూర్తిగా మృగ్యమయిపోయిందా అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు.

ఆందోళన కలిగించే ఇంకో విషయమేమిటంటే, ఈ సంపుటిలో కథల్లో మూడింట రెండొంతులు (20 కథలు) మొదటి దశకం నుంచి వచ్చాయి. రెండో దశకంనుంచి పదే కథలు. 2000 దశకంలో ఐదు వార్షిక సంకలనాలనుంచి ఒక్క కథ కూడా ఈ సంపుటి కెక్కలేదు. ఇది సంపాదకుల దృక్పథాన్ని సూచిస్తుందా లేక తెలుగు కథాప్రపంచంలో ఏర్పడుతున్న మాంద్యాన్ని సూచిస్తుందా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ రెండోదే నిజమైతే దానికి నివారణ మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత కథాభిమానులందరి పైనా ఉంది.

ఈ సంపుటికి కథలు ఎన్నుకొనే ప్రయత్నంలో ఈ 20 ’కథ’ సంకలనాలలో 140మంది కథకులు రచించిన 272 కథలనూ శ్రద్ధగా పలుమార్లు చదివితే నాకు తోచిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తాను. ఏ సంకలనానికి ఆ సంకలనం విడిగా చదివినప్పుడు కథల్లో చాలావరకు మంచి కథలుగానే అనిపించినా, అన్ని కథలూ ఒక్కసారే చదివినప్పుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కథల్లో, ముఖ్యంగా ఈ దశాబ్దపు కథల్లో, వస్తువైవిధ్యం బాగా తగ్గిపోతుంది. కొన్ని వస్తువులు ప్రతి సంకలనంలోనూ మళ్ళీ మళ్ళీ దర్శనమిస్తున్నాయి. పంటలు పండక అప్పులపాలైన రైతు కథ, ఆధునికీకరణ వల్ల పనులుపోయిన వృత్తిపనివారి కథ, కంపెనీ మూతపడి ఇబ్బందులు పడుతున్న కార్మికుని/ఉద్యోగస్తుని కథ, పిల్లలకు భారమైన ముసలివాళ్ళ కథ, ’వాడి’ చేత మోసపోయిన వాళ్ళ కథ, బలవంతంగా వలస వెళ్ళిన కథ, దాదాపు ప్రతిసంపుటంలోనూ కనిపిస్తున్నాయి. ఒకోసారి ఒక రచయిత అదే వస్తువుని మళ్ళీ మళ్ళీ రాయటమూ కనిపిస్తుంది.

ఈ సంకలనాల్లోఉన్న కథల్లో చాలావాటిలో ప్రధానంగా కనిపిస్తున్నవి రెండే రసాలు: విషాదం, భీభత్సం. ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశానికి దూరంగా నివసిస్తున్న వాడిగా అడుగుతున్నాను. తెలుగు జీవితాలలో మిగతా రసాలన్నీ ఉడిగిపోయాయా? లేక ఆ రసాలు కథావస్తువులుగా మలుచుకొనే నైపుణ్యం కరువైందా? ఆ రసాలు కథకు అవసరం లేదని సమిష్టిగా నిర్ణయించుకొన్నామా? లేక ’కథ’ సంపాదకులు విషాద, భీభత్స ప్రధాన కథలనే ఎంపిక చేస్తున్నారా? కథలు ఇలాగే కొనసాగితే తెలుగు కథకు పాఠకులు మిగులుతారా?

కథల్లో వస్తువైవిధ్యం లేనట్టే, శిల్ప వైవిధ్యమూ తక్కువగానే కనిపిస్తుంది. తొలినాళ్ళలోనే తెలుగు కథను పరిపుష్టం చేసిన తాత్వికత, మార్మికత దాదాపు మృగ్యమైపోయాయి. సింగిల్‌పాయింట్ కథలు ఎక్కువైపోయాయి. మళ్ళీ మళ్ళీ చదువుకొని కొత్త పొరలను పక్కకు తీసి కొత్త అందాలు, కొత్త విశేషాలు గమనించి, కొత్త ఆలోచనలు, అనుభూతులు పొందే అవకాశాలిచ్చే కథలు బాగా తక్కువ. పాఠకుణ్ణి రచయితలు తక్కువగా అంచనా వేస్తున్నారని అనిపిస్తుంది. చాలా కథలు సెంటిమెంటు, నోస్టాల్జియాల చుట్టూ తిరిగుతున్నాయి. ఆర్థికసంబంధాలపై పెడుతున్న దృష్టి, మనస్తత్వ విశ్లేషణపై, మానవసంబంధాలపై పెడుతున్నట్టు లేదు. ఒకవేళ పెట్టినా పైపొరలు దాటి శోధిస్తున్నట్లు లేదు. మాయమైపోతున్న పాత గురించి వెతలు చెందటం, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నట్లు రచయితలు సూచించటం అభిలషణీయమా?

నాకు కనిపించిన ఇంకో సమస్య. ఉపరితలాన్ని మాత్రమే స్పృశిస్తున్న వార్తాకథానాలు లేక వ్యాసాలు కథలుగా చలామణి కావటం. కథలకు నిత్యజీవితమే ఆలంబన ఐనా, కథ వార్తాకథనం స్థాయి మించనప్పుడు కథలు చదవవలసిన అవసరమేముంది? వార్తాపత్రికలు, ఇరవైనాలుగు గంటల న్యూస్‌ఛానెళ్ళు చాలా అందుబాటులో ఉన్నాయి కదా? పాత్ర చిత్రణ, శైలి, శిల్పం వంటి విషయాల మీద దృష్టి పెట్టని కథల్ని ప్రోత్సహించటం వల్ల మనం తెలుగు కథావికాసానికి మేలు చేస్తున్నామా, హాని చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

సమకాలీన సమస్యను వస్తువుగా తీసుకోవటమొక్కటే మంచి కథ లక్షణం అని మనం భావిస్తున్నామా? సమకాలీన విషయాన్నే చిత్రిస్తున్నా, సార్వకాలీనత, సార్వజనీనత, తాత్వికత లేకుండా గొప్ప కథలు అరుదుగా ఉంటాయని మనం మర్చిపోతున్నామా? శైలీ, శిల్పాలపై దృష్టి పెట్టకపోతే వస్తువొక్కటే కథని బలోపేతం చేయలేదు, గొప్ప కథ స్థాయికి తీసుకు వెళ్ళలేదు.

ఈ రెండు దశాబ్దాలు సంపుటానికి ఎంచుకొన్న కథలు తెలుగులో గొప్ప కథలుగా నిలబడుతాయి అని నేను అనుకోవటానికి కారణం ఈ కథలు పైన చెప్పిన లోపాలను చాలావరకూ అధిగమించాయి. ఈ కథలన్నీ బలమైన వస్తువును తీసుకొని, శైలికీ, శిల్పానికీ తగు ప్రాధాన్యమిచ్చాయి. తరచిచూసిన కొద్దీ కొత్త అంశాలు, అందాలు కనిపిస్తాయి. పాఠకులలో ఆలోచననూ, ఆసక్తినీ రేపెట్టే ఈ కథలు ఔత్సాహిక రచయితలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి అని నేను భావిస్తున్నాను.

ఈ సంపుటానికి సంపాదకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చిన కథాసాహితి నిర్వాహకులు, మిత్రులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లకూ, సహృదయ వాతావరణంలో కార్యనిర్వహణలో తోడ్పడిన కొత్త మిత్రులు సహసంపాదకులు ఏ.కే. ప్రభాకర్, గుడిపాటి గార్లకూ నా కృతజ్ఞతలు.

డా. జంపాల చౌదరి,
మండలైన్, ఇల్లినాయ్, యు.ఎస్.ఏ
నవంబరు 12, 2010

రెండు దశాబ్దాలు: కథ 1990 – 2009
(30 కథలతో రెండు దశాబ్దాల ఉత్తమ కథా సంకలనం)
కథల జాబితా ఇక్కడ చూడవచ్చు.

సంపాదకులు:
జంపాల చౌదరి
ఏ.కే. ప్రభాకర్
గుడిపాటి

ప్రచురణ:
కథాసాహితి
164 రవి కాలనీ
తిరుమలగిరి, సికందరాబాద్, 500015
ఫోన్: 040 2779 7691

424 పేజీలు
175 రూ. /25 డా.
ఆవిష్కరణ : నవంబరు 21, 2010 (ఆహ్వానా ప్రకటన ఇక్కడ చూడవచ్చు)

You Might Also Like

40 Comments

  1. తమ్మినేని యదుకుల భూషణ్

    ఆసక్తి గల పాఠకుల కోసం, ఈ చర్చలో పేర్కొన్న
    వ్యాసానికి లింకు .

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    @చౌదరి జంపాల: గతంలో కూడా కథా చర్చ కంద పద్యాల్లోకి దూకింది. నా ముక్తాయింపు కందం:

    కరవూ కాటకమేనా
    పరికించ గుణము?కథనము,పటుతర వాతా
    వరణము- కథకు ప్రాణము
    ఎరగనిదే ఎదగదు కథ, ఎడిటరు గారూ !!

  3. తమ్మినేని యదుకుల భూషణ్

    @Srinivas Vuruputuri:

    సంపాదకులుగదా మరి,
    చింపేయగలరు నిఘంటుచిట్టాలన్నీ
    నింపాదిగా నిజార్థము-
    చంపేయగలరు జనులను,చాలు సురేశా!!

  4. అనురాగ్ శర్మ

    కందం చివరి పాదంలో అచ్చు తప్పు దొర్లినది,

    “కరణులు కరణాలాయెనె? కలియుగమయ్యా!!” అని చదువుకోగలరు

    వీలైతే సంపాదకులు సరి దిద్దగలరు.

    అనురాగ్ శర్మ

  5. Srinivas Vuruputuri

    @సురేశ్ కొలిచాల: రామాయణాన్ని వదిలేసి పిడకల వేటలో చాలా దూరం వచ్చేస్తున్నామని తెలిసీ, చాపల్యం కొద్ది రాస్తున్నాను:

    వ్యాకరణ శాస్త్రము తెలిసినవాడు వైయాకరణుఁడు అని తెలుగు నిఘంటువులో చూసాను. వ్యాకర్తృ శబ్దానికి one who develops or creates , creator లేదా Expounder అని సంస్కృత నిఘంటువు చెప్పింది.

  6. సురేశ్ కొలిచాల

    అనురాగ్ శర్మ గారు: నిజానికి వైయాకరణలు, వైయాకరణులు రెండూ తప్పే. కరణ- క్రియ అయితే, అది చేసే వాడు కర్త అవుతాడు. అంటే వ్యాకరణ- చేసే వాడు వ్యాకర్త అవుతాడు. — సురేశ్.

  7. అనురాగ్ శర్మ

    వ.

    డు ము వు లు ప్రథమా విభక్తి.

    కం.

    కరణాలెపుడో పోయిరి
    సురేషు కొలిచాలగారు, చురుకున “వైయ్యా
    కరణ”ల నెక్కడ బట్టిరి
    కరణులు కరణాలయెనె? కలియుగమయ్యా!!

    అనురాగ్ శర్మ

  8. తమ్మినేని యదుకుల భూషణ్.

    ఘనమైన అయ్యా, ఒక వత్తు కోసం కంద పద్యం వేసుకు రావాలా ?? ఆ పాటి వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేక పోయారా ?? బ్రాకెట్లో వివరణ చూడలేదా : (వ్యాకరణ వేత్తలు , ఏ వయ్యారము లేని వారు).నేను ఉద్దేశించింది ఆ ‘య్యా’ నే. జంపాల గారు వైయాకరణులు అన్న రూపాన్ని వయ్యాకరణులు అని తప్పుగా రాస్తే అది గమనించే నేను సరదాగా వైయ్యాకరణులు అని రాసి బ్రాకెట్లో వివరణ ఇచ్చాను నర్మగర్భంగా . రెండవ పోస్టు లో నేను అదే రూపాన్నే (బ్రాకెట్లో వివరణ లేకుండా ) రాసే సరికి నేను తప్పుడు రూపం వాడుతున్నానని మీకు అనిపించింది. అలా మీ కంద పద్యం బయల్పడింది. ( మీ గురువు బూదరాజు గారి అలవాటు మీకు వచ్చినట్టుంది. ఉత్సాహం వచ్చినప్పుడు పద్యాలు కట్టడం ).
    ఇంత కష్టపడ్డందుకు గాను మీకు వైయాకరణ భూషణ సార చంద్రికనో, వైయాకరణ సిద్ధాంత కౌముదినో బహూకరిస్తాను !! సరే , ఇప్పటికైనా ఈ పిడకల వేట పక్కన బెట్టి , అసలు చర్చలోకి వచ్చే స్వారస్యమున్నదా మీకు అన్నది నా ప్రశ్న.

  9. సురేశ్ కొలిచాల

    అయ్యా, భూషణ్ గారూ
    “వైయ్యాకరణల” పొగడుచు కయ్యాలేలా?
    వైయ్యాకరణల పదమున
    ఆ “య్యా” వత్తెటులవచ్చె నేర్పడ చెపుమా?

  10. చౌదరి జంపాల

    @తమ్మినేని యదుకుల భూషణ్: మహాప్రభో, ముచ్చటగా మూడోసారి, వేరే క్లాజులేమీ లేకుండా ఒప్పేసుకొంటున్నా; ఇంకా ఈ ఇంపోజీషను ఆపేయొచ్చా? 🙂

    ఎదురుగా ఉన్నానని నామీద బాధ్యతలు పెట్టేస్తే ఎలా? నేను ‘కథ’ సిరీస్‌కి సంపాదకుడిని కాదు. ఆ కథల ఎన్నిక జవాబుదారీ ఆ సిరీస్ సంపాదకులది. నాకూ, నా సహసంపాదకులకూ దానితో సంబంధం లేదు. పుస్తకాలు తక్కువ ధరకు అందుబాటులో ఉండటానికి కొంత విరాళం ఇవ్వడం తప్పించి, కథల ఎన్నికలో తానా ప్రచురణల కమిటీ కల్పించుకోదు.

  11. తమ్మినేని యదుకుల భూషణ్

    @చౌదరి జంపాల:
    ఒక్క మాటలో ఒప్పుకొని ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు.
    ” ఆర్యవ్యవహారంబులందు దుష్టంబు గ్రాహ్యంబు ” అని గుంజాటన పడుతుంటేను మీరు పూర్తిగా సమాధాన పడినట్లు లేరు అనిపిస్తుంది.
    ” నేను రాసిన విధంగా వాడుకలో ఉన్నా, పాఠకులు నేను ఉద్దేశించినట్లుగానే అర్థం చేసుకున్నా, తప్పొప్పులు మీరు మళ్ళీ చెప్తునప్పుడు తప్పు ఒప్పు కాదని మళ్ళీ మళ్ళీ ఒప్పేసుకొంటున్నాను. ” అన్న మీ జవాబు చూస్తే నేను అనుకున్నది నిజమే అని తేలుతుంది. వైయ్యాకరణులు భాషను నియమిస్తే ,
    నియమిత భాషను సంపాదకులు కాపు కాయవలసి ఉంటుంది. అమెరికా లో ఏకైక తెలుగు మాస పత్రికకు (అచ్చులో ) సంపాదకులు కావున, భాషకు పాత కాపుగా వ్యవహరిస్తున్నారు కనుక నొక్కి వక్కాణించ వలసి వచ్చింది. సంపాదకులకు కావలసినది నిక్కచ్చి వైఖరి (critical attitude) , రాజకీయ నాయకుల్లో కనిపించే దౌత్యం (diplomacy ) కాదని నా అభిప్రాయం.

    రామాయణంలో పిడకల వేటను పక్కకు నెడితే వంశీ , కనక ప్రసాద్ లాంటి రచయితలు రెండు దశాబ్దాలుగా కథా సంపుటాల్లో కనిపించక పోవడానికి కారణం సహ సంపాదకులను కనుక్కుని
    పుస్తకం పాఠకులకు చెప్పే బాధ్యత మీ మీదే ఉంది అని మరవొద్దు.

  12. చౌదరి జంపాల

    @తమ్మినేని యదుకుల భూషణ్:
    > ఈ తప్పుల దండకం ఆగేట్టు లేదు.

    🙂

    దశకాల విషయంలో మీరు కరెక్టేనని ముందే ఒప్పుకొన్నాను.
    నేను రాసిన విధంగా వాడుకలో ఉన్నా, పాఠకులు నేను ఉద్దేశించినట్లుగానే అర్థం చేసుకున్నా, తప్పొప్పులు మీరు మళ్ళీ చెప్తునప్పుడు తప్పు ఒప్పు కాదని మళ్ళీ మళ్ళీ ఒప్పేసుకొంటున్నాను.

  13. సురేశ్ కొలిచాల

    భూషణ్ గారు:

    నవంబర్ 2002 ఈమాట సంచికలో మూడే వ్యాసాలు కనబడుతున్నాయన్న సంగతి మీరు ఇక్కడ pustakam.net లో చర్చిస్తున్నారని నాకు నిన్న మాధవ్ గారు ఫోన్ చేసి చెప్తే తెలిసింది. 2005-06లో యూనికోడ్/వర్డ్ ప్రెస్ కి మారిన తరువాత పాత సంచికలలోని రచనలను మా శక్తిమేరకు యూనికోడ్ లోకి మార్చడానికి ప్రయత్నించాము. అయితే, కొన్ని సంచికలలో వేర్వేరు ఫాంట్లు వాడడం వల్ల ఆయా సంచికలోని అన్ని రచనలను యూనికోడ్ లోకి మార్చలేక పోయాము. ఇప్పుడే మీ జయప్రభశబ్ద కవిత్వం, జంపాల చౌదరి గారి తెలుగు కథ సమకాలీనత, సార్వజనీనత వ్యాసాలను తర్జుమా చేసి నవంబర్ సంచికకు జత చేసాము. సరి చూసుకోగలరు.

    ఇంకా వేరే రచనలేవైనా ఈమాట పాతసంచికల్లో కనబడక పోతే ఈమాట సంపాదకులకు ఈమెయిల్ పంపండి. ఆ రచనలను వెతికి, యూనికోడ్ లోకి మార్చి ఈమాటలో ఉంచడానికి ప్రస్తుత సంపాదకులకు వీలైనంత సాయం చెయ్యడానికి నేను సిద్ధం. ఈమాట సంపాదకుల ఈమెయిల్ అడ్రస్: editors AT eemaata DOT com

    సురేశ్.

  14. తమ్మినేని యదుకుల భూషణ్

    @చౌదరి జంపాల:
    అసలు ప్రమాదమంటే అదే !! ప్రమాదో ధీమతామపి !! ఈ తప్పుల దండకం ఆగేట్టు లేదు.
    వైయ్యాకరణులు ( వ్యాకరణ వేత్తలు , ఏ వయ్యారము లేని వారు ) ఒక తప్పును మాటి మాటికి
    ఎక్కువ మంది చేసినప్పుడు ఆ సూత్రం వర్తిస్తుంది అని చెబుతారు.. చాలా కాలం క్రిందే ఇది పరిహరించవలసిన తప్పుగా మన వారు గుర్తించారు. కాబట్టి , ఆ అవకాశం జారిపోయింది.

    ఎక్కువ మంది (తప్పుగా ) 90 వ దశకం , 80 వ దశకం అని వాడటం నేను చూశాను
    2000 దశకం అన్న వాడుక చూడటం ఇదే మొదటి సారి. అలాగే , ఇన్ని రకాల వాడుకలు
    ఒక చోట చూడటం ఇదే తొలిసారి. ముందు మాటలకు ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి,
    లేదంటే ప్రమాదం. మొదటి దశకం ,రెండో దశకం అన్న వాడుక ఒప్పయినా , ఆ సందర్భానికి
    అతకలేదు. 1990 -1999 ల్లో వచ్చిన కథలు ( ఆఖరి /చివరి దశకం ) 2000 -2009 ల్లో
    వచ్చిన కథలు (తొలి /మొదటి దశకం) అని వాడితే గందరగోళానికి తావు లేదు. మీరు కాల వ్యవధిలో కథల ఎంపిక చేశారు కనుక , కాల మానాన్ని ఖచ్చితంగా వాడవలసిన అవసరం ఉంద ని నా అభిప్రాయం. అందుకే ఎత్తి చూపవలసి వచ్చింది. మామూలు రాతల్లో ఆ తప్పును నేను ఎవరికీ ఎత్తి చూపను.

    అందరూ చేసే ఇంకొక తప్పు రుజువు / ఋజువు
    కాంతి ఋజు మార్గంలో పయనించును. ( ఈ ఋజు సంస్కృత ధాతువు )
    నీవు రుజువు చేయగలవా ?? ( ఈ రుజు పారసీ ధాతువు )
    ఈ మాట సంపాదకులు ( వేలూరి గారు ) తమ సంపాదకీయంలో ఈ తప్పు చేశారంటే ఇక సామాన్య పాఠకుల సంగతి దేవుడెరుగు. బూదరాజు రాధా కృష్ణ గారు రచించిన ఈనాడు భాషా స్వరూపం
    రాతలో తప్పులను నమోదు చేసిన తొలి తెలుగు పుస్తకం. పుస్తకం పాఠకులు కొన దగిన పుస్తకం.

  15. చౌదరి జంపాల

    @తమ్మినేని యదుకుల భూషణ్.:
    >>మొదటి దశకం రెండో దశకం అన్నప్పుడు వాడుక ఒప్పు. 90 వ దశకం , 2000 వ దశకం
    అన్నప్పుడు వాడుక తప్పు.
    మీరే కరెక్టు.
    ఐతే ఆర్యవ్యవహారంబులందు దుష్టంబు గ్రాహ్యంబు అని వయ్యాకరణులు చెప్పినట్టు గుర్తు. అదీ కాదన్నా refudiateని నిఘంటువులో చేర్చినవారు మనకు ప్రామాణికమనుకున్నా సరిపోదూ?

    తా.క: ప్రమాదో ధీ మతాపిలో ఒక మ తప్పిపోయినట్లుంది?

  16. తమ్మినేని యదుకుల భూషణ్.

    @VenkaT Rao:
    “కథలలో ఆశించే విభిన్నతను విమర్శలో ఎందుకు ఆశించరాదు ?”
    మీ ఆలోచనలను కొంచెం విశదీకరిస్తే మంచిది.
    “పాపినేని తను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అనే విమర్శకుల కోవలోకి వస్తాడనుకోను.”
    ఆ కోవలోకి వచ్చే విమర్శకుల పేర్లు, వారి రచనలు ప్రస్తావిస్తే మరీ మంచిది.

  17. తమ్మినేని యదుకుల భూషణ్.

    @చౌదరి జంపాల:
    ” బలమైన వస్తువు వాతావరణ కల్పన ఆలంబన లేకుండా నిలబడగలదు కానీ బలహీనమైన వస్తువుని వాతావరణ కల్పన మాత్రమే నిలబెట్టలేదు.”

    కథ వ్యక్తమయ్యేది ఒక వాతావరణం ద్వారా ; వాతావరణం లేనిది అక్కడ కథే లేదు.
    అక్కడ కథే లేనప్పుడు వస్తు బలాబలాలు చర్చలోకి రావు. అదే విధంగా ,కవిత వ్యక్తమయ్యేది ఒక రూపం ద్వారా. రూపం లేనిది అక్కడ కవితే లేదు. అక్కడ కవితే లేనప్పుడు వస్తు బలాబలాలు చర్చలోకి రావు.
    వస్తువులోని బలం సాపేక్షకం, నిరపేక్షకం కాదు. విశదీకరిస్తే,మీకు నచ్చిన వస్తువు నాకు నచ్చక పోవచ్చు. మీకు బలమనిపించినది నాకు బలహీన మనిపించవచ్చు. కాబట్టి ,
    కథకుడు కేవలం వస్తువుతో ఆకట్టుకోలేడు.తగిన వాతావరణం సృష్టించి దాని ద్వారా
    కథను వ్యక్తం చేసి , మనల్ని ఆ ప్రపంచంలోకి రవాణా చేస్తాడు. కథ మనలోకి
    జొర బడేది ఉద్వేగాల రూపంలో, కాబట్టి కథను చదువుతున్నంత సేపు మనకు
    రచయిత మార్క్సువాదా మరొకటా అన్న స్పృహే కలగదు.కథ కథ కావడం ముఖ్యం.

    మీరన్నట్టు ,’బలమైన వస్తువు వాతావరణ కల్పన ఆలంబన లేకుండా నిలబడగలదు’,
    కానీ ప్రక్రియ మారుతుంది , అంటే అది కథ కాదు , వ్యాసమో మరేదో అవుతుంది.

    “ఈ సంకలనంలోని కథల గురించి మీరడిగిన ప్రశ్నకు కథలు చదివిన వేరేవారెవరైనా చెప్తే బాగుంటుందేమో ”
    మీరన్నది సబబు , సంపాదకుడే అన్ని పనులు తలకెత్తుకోనవసరం లేదు.
    యశస్వి గారికి మీరిచ్చిన జవాబు :
    “ఈ మూసల వెలుపల అర్థవంతంగా, సమర్థవంతంగా వ్రాయబడ్డ కథలు చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నది నా ఫిర్యాదు”
    అటువంటి పంక్తిబాహ్యులను గుర్తించడానికి వాతావరణ కల్పన ఉపయోగ పడుతుందని
    నా నమ్మిక. పదేళ్ళ నాటి నా వ్యాసాన్ని సంపాదకులలో ఎవరు మనసు పెట్టి చదివినా , మీరు కథ బలహీన పడుతుంది అని భావించిన దశకంలోనే కనకప్రసాద్ లాంటి ప్రతిభా వంతులను గుర్తించడానికి వీలయ్యేది.

    రామాయణంలో పిడకల వేట :
    మీరు దశకం అన్న పదాన్ని ఒక్కో చోట ఒక్కో రకంగా వాడినట్టనిపించింది.
    “అతడు, జాడ, టైటానిక్ వంటి కథలు 90వ దశకంలోనే రావటానికి వీలుంది. సాలభంజిక, కింద నేల ఉంది వంటి కథలు 2000 దశకంలోనే రాగలవు. ”
    “ఆందోళన కలిగించే ఇంకో విషయమేమిటంటే, ఈ సంపుటిలో కథల్లో మూడింట రెండొంతులు (20 కథలు) మొదటి దశకం నుంచి వచ్చాయి. రెండో దశకంనుంచి పదే కథలు.
    2000 దశకంలో ఐదు వార్షిక సంకలనాలనుంచి ఒక్క కథ కూడా ఈ సంపుటి కెక్కలేదు. ”

    మొదటి దశకం రెండో దశకం అన్నప్పుడు వాడుక ఒప్పు. 90 వ దశకం , 2000 వ దశకం
    అన్నప్పుడు వాడుక తప్పు. ప్రమాదో ధీ మతాపి , పెద్ద విషయం కాదు, రెండో ముద్రణలో
    దిద్దు కోవచ్చు.

  18. VenkaT Rao

    తమ్మినేని గారూ
    సారీ. మీరు లింకు ఇవ్వడం మూలంగా అది మీరు రాసిన వ్యాసం అనుకున్నాను. మీరన్నట్లు కనకప్రసాద్ మంచి రచయిత. రా.రా వల్లంపాటి వంటి మంచి విమర్శకులు లేకపోవడం మన తెలుగు సాహిత్యానికి పెద్దలోటు. ఆర్.ఎస్.సుదర్శనం వంటి విశ్లేషకులు కూడా.

    సాహిత్యం – మౌలిక భావనలు రాసిన పాపినేని తను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అనే విమర్శకుల కోవలోకి వస్తాడనుకోను. జ్ఞానప్రదర్శన, బుకాయింపు, అహంకారం, గర్వం, హేళన, వెటకారం ఆయన సమీక్షలలొ, విమర్శలలో నాకైతే కనిపించలేదు(వ్యక్తిగా ఆయన నాకు పరిచయం లేడు).

    పైన చెప్పిన అవలక్షణాలన్నీ ప్రస్తుత తెలుగు సాహిత్యంలో విమర్శగా చెల్లుబాటవుతున్నాయి. వీటన్నిటిని పరిహరించుకుని సద్విమర్శ రావాలని కోరుకునేవాళ్ళలో నేనూ ఒకడిని.

  19. చౌదరి జంపాల

    @yasasvi:
    యశస్వి గారూ:
    సంపాదకుల, సంకలనకర్తల అభిరుచి, దృక్పథం, భావజాలం వంటి వైయక్తికమైన పరిమితులపైనా, కార్యనిర్వహణకు సంబంధించిన ఇతర పరిమితులపైనా ఈ సంకలనాల్లో కథల ఎంపిక ఆధారపడుతుందని పై వ్యాసంలో స్పష్టంగానే చెప్పాననుకొన్నాను.
    ఐతే ‘కథ’ సంకలనాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని నేనెత్తిచూపిన ఇతివృత్తాలకి ‘కథ’ సంపాదకుల దృక్పథమొక్కటే కారణం అనుకోను. ఎందుకంటే ఆ ఇతివృత్తాలతో నిండిన కథలు అన్ని పక్కలా విస్తృతంగా కనిపిస్తున్నాయి. కాకపోతే అలాంటి కథల్లో ఆయా సంవత్సరాలలో బాగా రాయబడినవి ఈ సంకలనాల్లో కనిపిస్తున్నాయి. ఈ మూసల వెలుపల అర్థవంతంగా, సమర్థవంతంగా వ్రాయబడ్డ కథలు చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నది నా ఫిర్యాదు.

  20. చౌదరి జంపాల

    @తమ్మినేని యదుకుల భూషణ్: భూషణ్ గారూ:

    మీ పుస్తకంలో రెండు వ్యాసాలూ మళ్ళీ చదివాను. పాత వాదనలు గుర్తుకు వచ్చాయి. ఒక కథ గొప్పకథ అవటానికి వాతావరణ కల్పన ముఖ్యపాత్ర వహించగలదు అని ఒప్పుకుంటాను కానీ, వాతావరణ కల్పనే ముఖ్యం అంటే ఒప్పుకోలేను. బలమైన వస్తువు వాతావరణ కల్పన ఆలంబన లేకుండా నిలబడగలదు కానీ బలహీనమైన వస్తువుని వాతావరణ కల్పన మాత్రమే నిలబెట్టలేదు. ఐనా, అన్ని కథలకూ ఒకటే సూత్రం ఒప్పదు. వేర్వేరు కథలకు వేర్వేరు విషయాలు ముఖ్యమౌతాయి.

    ఈ సంకలనంలోని కథల గురించి మీరడిగిన ప్రశ్నకు కథలు చదివిన వేరేవారెవరైనా చెప్తే బాగుంటుందేమో. నా అభిప్రాయం మాత్రం ఈ వ్యాసంలోనే ఉంది. మీరు వాతావరణ కల్పన అని ఉద్దేశించినదాన్ని నేను సన్నివేశ కల్పన అని అన్నాను.

  21. తమ్మినేని యదుకుల భూషణ్

    @VenkaT Rao: ఈ మాటలోని వ్యాసం రాసినవారు ఆరి సీతారామయ్య గారు .ఆయన కథకులు, అనువాదకులు. సంపాదకులలో ఒకరైన జంపాల గారు గతంలో కథలు రాశారేమో నాకు తెలియదు.
    మరో సంపాదకులైన పాపినేని శివశంకర్ గారు కథకులు ,కవి , విమర్శకులు ఇత్యాది. వారి కథ కూడా ఈ సంకలనంలో ఉంది.
    నాకు నచ్చిన కథలు ఇతరులకు నచ్చాలని లేదు. నేను చేయగలిగినదల్లా నాకు ఎందుకు నచ్చిందో సవిమర్శకంగా రాయడం. అవి నచ్చని వారు ఎందుకు నచ్చలేదోసవిమర్శకంగా రాయగలగాలి.అప్పుడు చర్చకు ఆస్కారముంది.నిజానిజాలు నిగ్గు తేల్చవచ్చు. ఇది నాణ్యమైన ,నాగరికమైన పద్ధతి. నచ్చడం , నచ్చకపోవడం అన్నది ఇష్టానిష్టాలకు సంబంధించినది. వాటి వెనుక ఉన్న కారణాలు తెలిపినప్పుడు మాత్రమే ఇతరులు వారి దృష్టి తో ఆయా కథలను ఇంకో సారి చదివి బేరీజు వేసుకొనే అవకాశం కలుగుతుంది. కుటుంబరావు కథల్లో ఒక అందంలేని స్త్రీ పట్ల ఒక రచయిత ఆకర్షితుడవుతాడు. రా.రా. ఇది తనకు బాగా నచ్చిన కథల్లో ఒకటి గా పేర్కొని దానికి వెనుకగల కారణాలను రాసినప్పుడు ,మనకు సహృదయత పెరిగి మనం అదే దృష్టితో చదవ గలుగుతాము.
    కథా విమర్శలో రా.రా తర్వాత నాకు తెలిసిన పేరు వల్లంపాటి. ఒక కృతి కి తగిన స్థానం కల్పించడమే
    విమర్శ , ఆ స్థాయిలో లేనిది విమర్శ కాదు. మీరు చెబుతున్న వీర విమర్శకులు నాకు తెలియదు.
    చర్చలోకి లేవదీశారు కనుక, వారి గురించి రాయడం శాస్త్రీయం , పుస్తకం పాఠకులు తెలుసు కొంటారు.
    ఇంకో మాట ,విమర్శ పేరిట రాసినదంతా విమర్శ కాదు, కవిత్వం పేరిట రాసినదంతా కవిత్వం కానట్టే.

    నేను నలుగురికి తెలిసిన నాలుగు పేర్లు ఇచ్చానంతే . బుడుగోయ్ చెప్పినట్టు కనకప్రసాద్ గారిని
    ఇందులోకి కలుపుకోవచ్చు. కథా రచనలో ఆయన కూడా ఎంతో ప్రతిభా వంతులు.

  22. VenkaT Rao

    తమ్మినేని గారూ

    చాలా చక్కగా చెప్పారు.

    వచ్చిన పేచీ అంతా ఏమిటంటే అందరికీ ఒకే వైద్యం చేస్తాననే పిచ్చివైద్యులు బయలుదేరారు. వీరు రాళ్లేయడం మినహా చేసేదేముండదు. ఈ వీర విమర్శకులు కథలలో సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నామంటూనే సిద్ధాంతాలు చేయబోతారు. అందరి తరపున వకాల్తా పుచ్చుకుంటారు. తీర్మానాలకు, ప్రతిపాదనలకు కూడా తేడా తెలియదు. విమర్శ అంటే వెటకారం, హేళన, కూర్చుని రాళ్ళేయడం ఐపోయింది ఇవాళ.

    మీరు సూచించిన కథకుల పేర్లతో ఎవరికీ పేచీ ఉంటుందనుకోను. (ఒక్క శ్రీపతి కథలు నేను చదవలేదు). గతమెప్పుడు మేలున్ అని మీరు కూడా చెబుతున్నట్లుంది మీరు సూచించిన కథకులను చూస్తుంటే. జంపాల గారు కథలు రాసినట్లు నాకైతే తెలియదు. మీరు కథలు రాసారేమో అని పొరపడ్డాను. మన ఖర్మకాలి తెలుగులో కొందరు కవులు, కథకులు, విమర్శకులు కూడా.

    ఈమాటలో మీ వ్యాసం చదివాను. మీరేది చెప్పారో జంపాల గారు కూడా అదే చెప్పారు. మీరు సూచించిన కథలు కొమ్మిపూలు, వొంటేపమను కూడా “కథ” సంకలనాలలోనే చదివాను. మీకు నచ్చిన అవి అందరికీ నచ్చాలనేముంది. అవి ఏమాత్రం కథలు కావు అంటే మీరు అంగీకరించరేమో. కథలలో ఆశించే విభిన్నతను విమర్శలో ఎందుకు ఆశించరాదు. నేను చెప్పిందే సత్యం అనే అహంకారం, గర్వంతో హేళణకు, వెటకారానికి విమర్శను దిగజార్చి వెకిలితనాన్ని చాటుకుంటున్నారు కొందరు విమర్శకులు. కాదంటారా..

  23. budugoy

    @తమ్మినేని యదుకుల భూషణ్ : స్తబ్ధత గురించి మీరన్నది ఆలోచించదగ్గ విషయం. అదొక సమస్య/కారణం అని తేలితే, పీరియాడిక్‌గా సంపాదకులను మార్చడంతోనో (ఇంటర్నెట్ పత్రిక ఈమాటలా), లేదా ముఖ్య సంపాదకులతో పాటు ఏటా ఒకరిద్దరు గెస్ట్ సంపాదకులను ఆహ్వానించడంతోనో దాన్ని అధిగమించవచ్చు.
    @వెంకట్ రావ్ : one contemporary name that fits the bill and immediately comes to my mind is సరిపల్లి కనకప్రసాద్. ఈమాట ఆర్కైవుల్లో ఈయన కథలున్నాయి. (http://www.eemaata.com/em/authorindex/కనకప్రసాద్)

    imho గత రెండు దశాబ్దాల్లో తెలుగులో వచ్చిన ప్రతీ ఉత్తమ కథ ఖచ్చితంగా ఈసంకలనాల్లో చోటు చేసుకోలేదనీ, ఈ సంకలనంలో కథలు ఆయా సంపాదకుల అభిరుచి/పరిమితులని బట్టి ఉంటాయని ఒప్పుకోగలిగితే ఇంత గొడవకి తావులేదు.

  24. yasasvi

    జంపాల చౌదరి గారూ !! కధల ఎంపికలో సంపాదకుల పాత్ర గణనీయమైనది కాదా?? కధల ఇతివృత్తం లో మీకు కనిపించిన మూస కీ ఆయా సంపాదకుల దృక్పధానికీ మధ్య కనిపించని ఒక లింక్ ఏమన్నా ఉన్నదేమో ఆలోచించారా??

    yasasvi.

  25. తమ్మినేని యదుకుల భూషణ్

    @VenkaT Rao: పిచ్చి కుదిర్చే వైద్యుడు పిచ్చివాడు కానవసరం లేదు.విమర్శకుడు కవి కానవసరం లేదు. కథలు రాయనవసరం లేదు.జంపాల గారు తమకు తోచిన మంచి కథల లక్షణాలు వివరించారు , అంత వరకే , ఆయనే పూనుకొని అటువంటి మంచి కథలను రాయాలని కాదు. అదలా ఉండనిస్తే –
    తెలుగులో తొలి కథలు ( గురజాడవి) మహత్తరమైనవి. తర్వాత , ఎంతో మంది కథకులు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు. ( మచ్చుకు అందరికీ తెలిసిన నాలుగు పేర్లు: పాలగుమ్మి పద్మరాజు , చాగంటి సోమయాజులు, కరుణ కుమార, శ్రీ పతి ). తెలుగులో గొప్ప కథలకు కొదవ లేదు. ఒక కథ ఎందుకు గొప్పదో గుర్తించే విమర్శక బుద్ధి కొరవడింది అని నా అభిప్రాయం. మరిన్ని వివరాలకు ,
    అన్న వ్యాసానికి చర్చలో గల నా అభిప్రాయాలను పరిశీలించండి.

  26. VenkaT Rao

    తమ్మినేని గారూ
    అటువంటి మహత్తరమైనకథలను మీరేమైనా రాసారా. ఉంటే మీ కథల పుస్తకం పేరు చెప్పండి? దయచేసి ఇంగ్లీషు రచయితల పేర్లు చెప్పకండి.

    వెంకట్

  27. తమ్మినేని యదుకుల భూషణ్

    @Purnima:

    అనువాదాలు చాలా ముఖ్యం. మన మాతృభాషలో మనకున్న పట్టు వేరు. ఇంగ్లీషు ఉపయోగ భాష , అంత వరకే. రాతకోతలు తెలుగులో సాగించడం చాలా సహజం, సులువు కూడాను.ప్రపంచంలో , చాలా మంది గొప్ప రచయితలకు ఇంగ్లీషు బాగా వచ్చినా , అనువాదం ఉంటే మాతృభాషలో చదవడానికే ప్రాధాన్యత నిస్తాము అనే వారే అధికం. ఉదాహరణకు , నోబెల్ బహుమతి గ్రహీత , మన మధ్య బ్రతికి ఉన్న మహా రచయితా మార్కెజ్ ఆలోచనలు గమనించండి.

  28. తమ్మినేని యదుకుల భూషణ్

    @చౌదరి జంపాల:
    మీకు చాలా బాగా గుర్తుంది, ఇది కథల మీద మీకున్న ఆసక్తిని సూచిస్తుంది. నేను నా వాదనను పూర్తిగా అందులో రాసినట్టు గుర్తు. మీ దగ్గర నా విమర్శ పుస్తకం ఉంటే కథన కుతూహలం ( పు 78 – 79 ),
    కథ -వాతావరణం (పు. 80 – 81 ) అన్న వ్యాసాలు తిరగేయండి. నేను ఇటీవల ,గురజాడ కథల్లో వాతావరణ కల్పన మీద చేసిన ఉపన్యాసం ఎందులోనూ ప్రచురించ లేదు ). కథన కుతూహలం
    thatstelugu డాట్ కాం లో వచ్చినా , వారు కూడా (ఈమాట వారిలా )ఈ వ్యాసాన్ని గల్లంతు చేశారు.
    కాబట్టి లింకు ఇవ్వలేక పోతున్నాను. ఈ సందర్భంలో ఈ- పత్రికలు తమ బాధ్యతను గుర్తెరిగి వివేకంతో వర్తించాలని విజ్ఞప్తి చేయడం మినహా , ఏమి చేయలేక ,నా వ్యాసం లో ఒక పేరా ఉటంకించి ఊరుకుంటాను.

    ” నేను చెప్పే వాతావరణం కేవలం భౌగోళికం (geographical)కాదు. అలా అని అది పూర్తిగా
    మానసికం (psychological)కాదు .మన అంతరంగం , మన చుట్టూ ఉన్న పరిసరాల సంకర్షణ (interaction) వల్ల మనలో జనించిన అద్భుత ప్రపంచం అది .వాతావరణం మనందరిలో ఉంది.అది ఆవిష్కరించిన వాడు గొప్ప రచయిత.తతిమా వారి రచనలన్నీ మోత బరువు. సిరా నష్టం . ఈ ఎరుక ఉన్న వాడు రాసే కథల్లో జవజీవాలు , ఒక వింత ఆకర్షణ కనిపించి తీరతాయి. ”
    వాడగా వాడగా పరికరాలు మొద్దు బారతాయి. అలాగే, సిద్ధాంతాలు ..మంచి కథను ఎంపిక చేయడానికి నా ప్రాతిపదిక ఇది. చివరగా నా ప్రశ్న , ఈ ప్రాతిపదికన , మీరు ఎంపిక చేసిన ముప్ఫై కథల్లో ఎన్ని కథలు ఉత్తమ కథలుగా నిలుస్తాయి ??

  29. తమ్మినేని యదుకుల భూషణ్

    @Purnima:
    సంపాదకుల అజ్ఞానానికి అంతూ పొంతూ లేదు. కాబట్టే , కథలకు, వ్యాసాలకు నిడివిలో ఇన్ని ఆంక్షలు.
    కే.వీ.ఎస్ రామా రావు గారు ఈమాట సంపాదకులుగా ఉన్నప్పుడు మా మధ్య ఈ చర్చ వచ్చేది.
    ఆయన -” వారికున్న ఇబ్బంది మనకు లేదు , హాయిగా రాయండి ” అని చెప్పేవారు. లేదంటే జయప్రభ కవిత్వం మీద అంత లావు విమర్శ ( రాతలో అరవై పుటలు, అచ్చులో అందులో సగం- నవంబర్ సంచిక , 2002 , ఈ సంచిక archives నిర్వహణలో ఏదో పొరబాటు జరిగింది, ఒక మూడు వ్యాసాలు తప్ప , మొత్తం సంచిక గల్లంతు ) నేను రాయగలిగి ఉండేవాణ్ణి కాదు. కాబట్టి , సీరియస్ విమర్శకు , కథలకు అచ్చు పత్రికల్లో కాలం చెల్లింది. ఇప్పుడు , ఇక ఆ బాధ్యత, ఈ -పత్రికలదే. కానీ, archives నిర్వహణ
    చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే , గతకాలమే మేలు —, అని వాపోవలసి ఉంటుంది.

  30. చౌదరి జంపాల

    @Purnima:
    ఒకటిన్నర తరాల వెనుక వరకూ తెలుగు రచయితలు చాలావరకూ తెలుగులో చదువుకున్నవారే. కొంతమంది ఇంగ్లీషు, బహుతక్కువమంది మిగతా భాషలు కొంతవరకు నేర్చుకొన్నవారు. అప్పుడు ఇంగ్లీషు అందుబాటులో తక్కువ ఉన్నా, పుస్తకాలు ఇచ్చిపుచ్చుకొంటూనో లేక అనువాదాలు చదువుకొంటూనో చాలామంది రచయితలు సాహిత్యాన్ని గురించి విపరీతంగా చర్చించుకొనేవారని పూర్వపు సంగతులు చదివేటప్పుడు అర్థమౌతుంది. ఇప్పుడు భారతదేశంలోని వివిధ భాషల్లోని రచనలు, ఇతర భాషలలోని రచనలు ఇంగ్లీషులో వివరంగా లభ్యమౌతున్నాయి. చదవాలి అన్న ఆసక్తి ఉన్నవారు ఇంగ్లీషులో చదువుకోవటం ఇప్పుడు ఇంతకుముందుకన్నా సులభం; అనువాదాలు దొరకటంలేదని చదవకపోవడం పెద్ద కారణం కాకూడదు అని చెప్పటం నా ఉద్దేశం.

  31. Purnima

    అన్నట్టు ఇంకో పిట్ట కథ.. నేను ఎలాంటి పుస్తకాలను చదవడానికి ఇష్టపడతానో తెల్సిన నేస్తం, పుస్తకం.నెట్ లో నా రివ్యూలు ఒకటీ అరా చూసి, “నువ్వు ఒక తెలుగు పుస్తకం గురించి తెలుగులో రాస్తే అర్థముంది కాని, ఇంగ్లీషు పుస్తకాల గురించి తెలుగులో రాయటం ద్వారా నువ్వేం సాధిస్తున్నావ్? ఆ పుస్తకం చదవాలనుకున్నవాడు ఎటూ ఇంగ్లీషు వచ్చినవాడై ఉండాలి. అప్పుడు రివ్యూ కూడా ఇంగ్లీషులో ఉండాలి గాని, తెలుగేంటి మధ్యన?” అని నన్నో వెర్రిదాన్ని చూసినట్టు చూసింది.

    “నేను కొన్ని తెలుగులోనే రాయగలను.. ఇంగ్లీషులో రాయడానికి ప్రయత్నిస్తే ఎబ్బెట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది” అని ఏదో చెప్పుకున్నాను.

    ఎందుకో ఇది ఇక్కడ చెప్పాలనిపించింది.

  32. చౌదరి జంపాల

    @Purnima:
    పూర్ణిమ గారూ:

    చదువుకున్న తెలుగువాళ్ళలో ఇంగ్లీషు రానివారు లేని రోజుల్లో అనువాదాలు లేకపోవడం పెద్ద సమస్య కాకూడదు కదా? చదవాలి, చదివినదాన్ని గురించి ఆలోచించాలి, మాట్లాడాలి అన్న కోరిక ఉండటం ముఖ్యం.

    1. Purnima

      చౌదరి గారు, నాకు సమస్యే అనిపిస్తుంది. ఇంగ్లీషును ఎంత మంది పూర్తిగా స్వీకరించగలిగారు అన్నది కూడా ఒక పాయింట్ అనుకుంట. ఎందుకంటున్నాను అంటే, ఉద్యోగరిత్యా ఇంగ్లీషులో గడగడా మాట్లాడగలిగినా, సాహిత్యం విషయానికొచ్చేసరికి “తెలుగులో చదూకోవడంలో ఉన్న సుఖం వేరు!” అన్న అభిప్రాయం నాకు పదే పదే వినబడ్డం చేత.

      వితండ వాదం అనుకోకపోతే, ఇంకో మాట. చదువుకున్న తెలుగువాళ్ళలో ఇంగ్లీషు రానివారు లేని రోజుల్లో తెలుగు సాహిత్యం ఎటు పోతే మనకేం? ఇదీ పెద్ద సమస్య కాకూడదు గద!

      “చదవాలి, చదివినదాన్ని గురించి ఆలోచించాలి, మాట్లాడాలి అన్న కోరిక ఉండటం ముఖ్యం.” – నిజం! ఇవ్వన్నీ ఏ భాషలో జరుగుతున్నాయి అన్నది కూడా ముఖ్యమేనని నేను అనుకుంటాను.

  33. చౌదరి జంపాల

    @తమ్మినేని యదుకుల భూషణ్: భూషణ్ గారూ:

    కథకు వాతావరణం ముఖ్యం అని మీరు ఇంతకు ముందు వేరే చర్చలో (చాలా ఏళ్ళ క్రితం, రచ్చబండలో) కూడా అన్నట్లు గుర్తు. వాతావరణం, వాతావరణ కల్పన అన్న మాటలు మీరు ఏ అర్థంలో వాడుతున్నారు?

  34. Purnima

    తెలుగు కథతో కాని, తెలుగు సాహిత్యంతో గాని, నాకు చెప్పుకోదగ్గ పరిచయం లేదు. అందుకని, ఇక్కడ వ్యాఖ్య రాయడానికి నాకు అర్హతలు లేవనుకుంట. కాని తెలుగును చదవటానికి ఇష్టపడే ఒక సగటు పాఠకుడిగా నావి రెండు మాటలు.

    ఉపరితలం దాటి లోపలికి పోలేకపోవడమనేది అసలు సమస్యే అని నా అభిప్రాయం. Alcoholism is not *just* about alcohol. ఇది గ్రహించలేనివాడు ఆ ఉపరితలాన్ని ఎలా దాటగలడు? ఒక ఉదాహరణ తీసుకుంటాను. మొన్నటి దాకా పట్టి పీడించిన రెసెషన్ లో కథలు ఎలా ఉన్నాయి? సాప్ట్ వేర్ జీవుల పై అప్పటిదాకా నిద్రాణమై ఉన్న పగను లేపి, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి. “అబ్బ..ఈ సాప్ట్ వేర్ వాళ్ళ వల్లే ధరలు పెరిగిపోయి, డబ్బుకు విలువ లేకుండా పోయింది” అన్నది తరుచుగా వినిపించే మాట. దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తే ఒక తెలుగు కథ అయ్యిపోతుంది. And being a software engineer myself, it hurts, big time, to see those superficial observations highlighted in all the leading magazines as stories.

    When the writer himself can’t see beyond a certain point, how will (s)he show it to the world?

    ఇప్పుడు తెలుగులో అచ్చ తెలుగు కథల లోటెంతుందో, అనువాద సాహిత్యానికీ అంతే లోటు ఉంది అని నాకనిపిస్తుంది. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన సాహిత్యం కూడా తెలుగులోకి అనువదించబడ్డం లేదు. Sad! అందుకని మేం ఇంగ్లీషుపైనే ఆధారపడవలసి వస్తుంది. [బహిరంగంగా ఇది ప్రకటించినందుకు, నాకు తలంటేస్తారు ఇప్పుడు!]

    తెలుగు మాత్రమే నేర్చిన పాఠకుడికి ప్రపంచ సాహిత్యం ఎంత తెలిసే వీలుంది? రాయాలనుకునేవాడు ముందు బాగా చదివుండాలి అంటారు గద. చదవడానికి సరిపడా సరుకు లేనివాడు ఏం చేస్తాడు? [ఒక్క పోతన్ను చదూకుంటే చాలు అంటే, ఇక నేనేం అనలేను.]

    ఇప్పుడే గుర్తొచ్చిన ఒక ఫ్రెండు మాట: “ఇన్ని పేజీలు, ఇన్ని కాలమ్స్, ఇన్ని అక్షరాలకు మించి కథ ఉండకూడదని రూల్సు! ఆ లెక్కన శ్రీపాద, విశ్వనాధ ఇప్పటి వారైతే, వాళ్ళ కథలు ప్రచురింపబడి ఉండేవి కావు.” ఏమంటారు? కథలో శిల్పం, వైవిధ్యం, కథనం అన్నీ కావాలి కాని రెండు పేజీల్లో అంటే? అరగంటలో అరిసెలు వండడానికి ప్రయత్నించినట్టు ఉండదూ?

    అసలు ఒక్క కథ విషయంలోనో, సాహిత్యం విషయంలోనో కాదు, మొత్తానికి ఒక సంస్కృతిని, భాషని, తెలుగన్నదేన్నైనా కూడా ఒక తరం నుండి మరో తరం చేతుల్లోకి భద్రంగా మారలేకపోయాయి. అక్కడ ఒక జాతిగా మనం పూర్తిగా విఫలమయ్యినట్టేనని నాకనిపిస్తుంది. [ఇలా వాగుతున్నందుకు, నాకు మూడిందిక అని కూడా అనిపిస్తోంది.]

    చివరిగా ఒక్క మాట. ఒక డాక్టరుగా మీరు ఇలాంటి కేసులు చాలానే డీల్ చేసుంటారు. ఒక్కోసారి రోగికి ఒకటి కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలుంటాయి. అన్నీ ప్రాణాంతక స్థాయిలోనే ఉంటాయి. అప్పుడు ఎటు నుంచి నరుక్కురావాలో అన్నది మీమాంస.ఎక్కడో చోట మొదలెట్టాక, దాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నం వేరే దాన్ని ఎక్కువ చేస్తుంది. రోగికి హాని కలగకుండా, బాధ హెచ్చినా, ఒక్కోదాన్ని నయం చేసుకుంటూ రావటం కత్తి మీద సామే కద. అలాంటి ధీర్ఘ కాలిక చికిత్స జరిగితే గాని, సమకాలీన తెలుగు కథను ప్రపంచ శ్రేణిలో చూడ్డం కష్టం.

    నన్నూ, నా అజ్ఞానాన్నీ మన్నించగలరని భావిస్తున్నాను.

  35. తమ్మినేని యదుకుల భూషణ్

    కవితకు ఒక రూపం, కథకు ఒక వాతావరణం ముఖ్యం అని సంపాదకులకు తెలియనంత వరకు
    మనం రోజు చదివే వార్తలే కథల్లో కవితల్లో దర్శన మిస్తుంటాయి. గురజాడ నుండి చాసో దాకా వచ్చిన కథలను వాతావరణ కల్పన దృష్టితో విమర్శించి చూసుకొంటే గాని సంపాదకులకు బుద్ధి బులపాటం తగ్గి హృదయ పరిపాకం పెరిగి ఏది మంచి కథ అన్న ప్రశ్నకు సరయిన సమాధానం దొరకదు. మనలోని బుద్ధి మాంద్యం మనం చూసుకోలేము కనుక అది చుట్టుపక్కల కనిపించడం ఒక రకమయిన సైకలాజికల్ ప్రొజెక్షన్.కవి జ్వాలాముఖి కవిత్వంలో స్తబ్ధత వచ్చింది అని వాపోతే ఇస్మాయిల్ తనలోని స్తబ్ధతనే జ్వాలాముఖి కవిత్వంలో చూస్తున్నారు అన్న సమాధానం గుర్తుకు వస్తుంది నాకు.
    దిశా నిర్దేశం చేయగల సంపాదకులు లేని లోపం సాహిత్య రంగంలో బాగా కనిపిస్తోంది. ఈ సంపాదకులు ఇటాలియన్ ఫ్రెంచి లాంటి ఇతర భాషలలో వచ్చిన కథలు చదివారా ?? పొరుగు దేశాలయినా పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , శ్రీ లంకల్లో కథా పరిణామం గురించి ఏమయినా తెలుసా ..(సమస్యలతో అతలాకుతలమవుతున్న ఈ దేశాల్లో కథకులు ఎలా స్పందించారు ,ఎటువంటి కథలు రాస్తున్నారు అని తెలుసుకోవడం మనకు లాభించే విషయం , ఎందుకంటే , వీటితో పోలిస్తే, మన దేశంలో అంత సంక్షుభిత వాతావరణం లేదు ) ఇవన్నీ దొంగలు దోలిరి ..కనీసం తెలుగు కథను సవిమర్శకంగా చదువుకున్నారా ?? అన్నది సందేహమే. సందేహం ఎందుకంటే అధ్యయన ఫలం ఉత్తమాభిరుచి , అది కథల /కవితల ఎంపికలో కనిపించదు. కథ అంటే కరవు ,సమస్య అన్న స్థాయికి దిగజార్చారు. కథ అంటే పాఠకులు పారి పోయే స్థాయికి తీసుకువచ్చారు. (ఇది కవిత్వానికి ఇది వర్తిస్తుంది). కథను ప్రోత్సహించ డానికి
    ఇక్కడ ఒన్ స్టొరీ అన్న పత్రిక వస్తుంది.
    నెలకు కేవలం ఒకటే కథను ప్రచురిస్తారు. ఇలాంటి ప్రయోగాలూ తెలుగులో మనమూ చేయవచ్చు.
    దేనికయినా కావలిసినది ఉత్తమాభిరుచి . దురదృష్ట వశాత్తు అది అంగట్లో దొరికే సరకు కాదు.

    చర్చకు తెర లేపినందుకు జంపాల గారికి అభినందనలు .

Leave a Reply