పుస్తకం
All about booksపుస్తకలోకం

November 17, 2011

పద్మలతతో మాటామంతి

” మరో శాకుంతలం ” కవితా సంకలనానికి ఇస్మాయిల్ అవార్డు (2011) లభించిన సందర్భంగా అభిరుచి గల కవయిత్రి పద్మలతతో తమ్మినేని యదుకుల భూషణ్ మాటా మంతి.

*************************************

మీరు కవిత్వం రాయగలనని ఎప్పుడైనా అనుకున్నారా ??

నేను ఒకనాడు కవిత్వం రాయగలని ఎన్నడూ అనుకోలేదు. ఇంట్లో మంచి సాహిత్య వాతావరణం అయితే ఉండేది. అమ్మమ్మ సందర్భోచితంగా ఎన్నో పద్యాలూ చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేదాన్ని ; అలాగే నాన్నగారి ముఖతః ఎన్నో విన్నాను. నేను బాగా కబుర్లు చెప్పేదాన్ని. జరిగిన వాటిని రసవంతంగా చెప్పగల నేర్పు ఉండేది. చదువుకొనే రోజుల్లో ఉపన్యాసాలు , చర్చల్లో పాల్గొని మెప్పు పొందాను. కానీ , కవిత్వాల వైపు మనసు పోలేదు.

మరి తొలి కవిత ఎప్పుడు రాశారు ??

నాన్న గారి మరణం నన్ను కదిలించింది. నాన్న నాలో మానవత్వాన్ని పాదుగొలిపిన వ్యక్తి. తాను ట్రేడ్ యూనియన్ లీడర్ అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా సరే , సాయం కోరి తలుపు కొడితే ఉన్న ఫళాన లేచి వెళ్ళేవారు. అటువంటి నాన్న లేని ఒక శూన్యం నుండి పుట్టుకొచ్చింది నా తొలి కవిత.

మీకు మీ మీద కవిగా నమ్మకం కలిగిన క్షణం ??

‘ ఒంటరిగా నేనున్నా
తుంటరిలా నన్ను వదలని
నీ జ్ఞాపకం ‘

అని కవిత మొత్తం ఒక్క క్షణంలో ప్రత్యక్షమయింది. ఆ క్షణం నాకనిపించింది నేను కవిత్వం రాయగలనని.

మీరు విరివిగా కవిత్వం రాసిన కాలం ??

2001 మొదలుకొని ఎన్నో కవితలు రాశాను. వాటికి తారీఖులు వేయడం, జాగ్రత్త చేయడం వంటి పనులు నాకు రావు. కాబట్టి సంకలనం తేవడానికి దాదాపు పదేళ్ళు పట్టింది.

మీ పుస్తకంలో ఏ కవితకీ పేరు లేదు ? కారణం ??

పుస్తకానికి పేరు పెట్టే సరికే తల ప్రాణం తోకకు వచ్చింది. ఇక ఇన్నేసి కవితలకు పేర్లు పెట్టడం నా వల్ల కాదనిపించి అలా వదిలేశాను. కవిత రాయడం , ఒకరిద్దరు రస హృదయులకు వినిపించడంతోనే నా ఉత్సాహం తీరిపోతుంది. అంతకు మించి కష్టపడలేను.

మీ కవితలకు ప్రథమ శ్రోత ??

ఎంతో ఆదరంతో వెనుక మాట రాసి ఇచ్చిన వేల్చేరు నారాయణ రావు గారు

నేటి కాలపు కవుల మీదా కవిత్వాల మీద మీ అభిప్రాయం ??

మారిన ఆర్ధిక పరిస్థితులవల్ల తీరిక లేని పాఠకుడిని ఒక పక్క టీవీలు, మరో పక్క పత్రికలూ- సినిమా రాజకీయ వార్తలతో , వారి వారి agenda లతో హోరెత్తిస్తూ ఉంటే, కవులు కూడా కలసి ఉండక పొతే , కొత్త, పాత కవిత్వాన్ని ప్రోత్సహించుకోకపోతే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోల్పోతాం. ఈ విషయం లో కవులకు ఎక్కువ స్వార్ధం ఉండాలి అన్నది నా ఆలోచన.నావరకు, కవి ముందు మంచి మనిషి కావాలి, ఆ తర్వాత కవిత్వాలు అనిపిస్తుంది. ఇక కవిత్వాల విషయాని కేమో గాని కవిత్వగౌరవానికి వస్తే, తెలుగు దేశంలో కవిత్వ పుస్తకాలని కొని చదివే రోజు వస్తుందని ఆశిస్తున్నా ను.అటువంటి ఆత్మస్థైర్యం విషయంలో కూడా తొలుత కవిదే ముందడుగు కావాలి.

కవిత్వ విమర్శ మీద మీ అభిప్రాయం ??

సదభిప్రాయమే. నా కవిత్వాన్ని విమర్శకు గురి చేయమనే చెబుతాను.

మీ కవితలన్నీ మీరు అవలీలగా పుస్తకం చూడకుండానే చెబుతున్నారు ?

నా కవితలే కాదు , నాకు నచ్చిన పద్యాలూ పాటలు అన్నీ నాకు కంఠతా వచ్చు.

మీకు ఇష్టమైన కవులు రచయితలు ??

నేను అందరినీ ఇష్టంగా చదువుకున్నా ..ఎందరో ప్రాచీన కవులు, తిలక్ , శ్రీ శ్రీ , విశ్వనాథ , జాషువా
చలం ఇలా.

మీ కవితలు క్లుప్తంగా , బలంగా ఉన్నా కొన్ని చోట్ల వాటిని మరింత బలంగా మార్చవచ్చు అనిపించింది.

అదెలా ??

మీ అనుభవాల గూర్చి మీరు చెప్పినప్పుడు అవి బలంగా వస్తాయి. అందులో ఆలోచనలు ప్రవేశించాయా ఆ మేరకు అవి బలహీన పడతాయి.

( సాలోచనగా ) కొన్ని ఉదాహరణలు కావాలి !!

‘నేనంటే ఇష్టం లేదని ‘ కవిత ప్రథమార్థంలో ఆలోచనలు తీసి వేస్తే సున్నితమైన అనుభవం మరింత వెలిగేది అన్నది నా అభిప్రాయం.సాధారణంగా చాలా మంది కవితా సంకలనాల్లో ిపది శాతం కూడా కవిత్వం కాదు. మీ కవితలెన్నో కవిత్వ పరీక్ష లో నెగ్గడం నాకు ఆనందం కలిగించే విషయం.

మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీరు నిష్కర్షగా నా కవిత్వంలోని బలాన్ని , బలహీనతని విశదపరిచినందుకు ఆనందంగా ఉంది. నాకు అవార్డుకన్నా మిన్నగా ఇటువంటి పరిశీలన ఎంతో ఉపకరిస్తుంది.మీరు తప్ప , ఇంతవరకూ నా కవిత్వాన్ని అందరూ ‘అహో ఓహో ‘ అని పొగిడిన వారే.

సరే, మీకు గుర్తుండి పోయిన ఒక ప్రశంస ఏదైనా ఉందా ??

ఎందుకు లేదూ?? అది వేటూరి సుందర రామ్మూర్తి గారిది. అయన ఎంతో ఆదరంగా మాట్లాడి , ‘అమ్మాయి నీ పుస్తకం కావ్యమే , నాకు శిష్ట్లా ఉమా మహేశ్వర రావు గుర్తుకొస్తున్నాడు’ అన్నారు.

వేటూరి శిష్ట్లా తో పోల్చారు అంటే మీ కవిత్వం అసలు సిసలైనది అని చెప్పక చెప్పారు. శిష్ట్లా లో originality ఎక్కువ. శ్రీ. శ్రీ కన్నా ముందు రాసిన వాడు.విశ్వనాథ ముందు మాట రాశారు వారి కవిత్వానికి.చాలా సంతోషం , మీ కవిత్వం దిన దినాభివృద్ధి చెంది ఆంధ్రావని మోదమందు గాక. స్వస్తి.

(అజోవిభొ ఫౌండేషన్ వారి వెబ్సైటులో పద్మలత గారి పుస్తకం కొనేందుకు ఈ లంకె నొక్కండి.)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


 1. Award Vachinanduku Santosham, enka book konaledu, konali, tvaralone koni chaduvutani.


 2. Srinivas Nagulapalli

  “మీ అనుభవాల గూర్చి మీరు చెప్పినప్పుడు అవి బలంగా వస్తాయి. అందులో ఆలోచనలు ప్రవేశించాయా ఆ మేరకు అవి బలహీన పడతాయి.”

  ఆలోచనల చేత కవిత్వం ఎందుకు బలహీన పడుతుంది? ఏదైనా ఎందుకు బలహీనమవుతుంది? ఆలోచనలు సరిగ్గా లేకపోవడమే బలహీనత, కవితకైనా భవిత కైనా ఎక్కడైనా ఎప్పుడైనా. అనుభవాలకు బలం కూర్చేది, అసలు సార్థకత ఇచ్చేది ఆలోచనలే! మగపక్షి చస్తే ఒక ఆడపక్షి విలపించడం ఏమంత పెద్ద అనుభవం? అంతకు మించిన ఘోరాలు చూస్తున్న మన అనుభవాలతో పోల్చితే వాల్మికి అనుభవం ఎంత తక్కువ! ఐతేనేం, అది ఉద్దీపించిన ఆలోచనల లోతులు, స్పృశించిన ఎత్తులే ఆదికవ్యాన్ని ఆవిష్కరించాయి అంటాం కదా! పక్షి నేలకూలితే ఒకరికి కంటినీరు రావడానికి, మరొకరికి నోరు ఊరడానికి తేడా అనుభవం కాదు, ఆలోచనలే. అందుకే ఆలోచనామృతం సాహిత్యం అన్నారు, ఎంతో ఆలోచనతోనే.
  =======
  విధేయుడు
  _శ్రీనివాస్


 3. రమణ కుమార్

  chaalaa baagundil


 4. కావేరి

  చాలా బావుంది. పద్మలత కవిత్వం చదవగానే ఎనభయ్యేళ్ల ఒక పెద్దాయనకు ‘‘ఒక్కసారి ఒళ్లు జలదరించింది. చర్మం జీవం పోసుకుంది. గుండె కొత్తగా కొట్టుకోవడం ఆరంభించినట్టు, కళ్లు కొత్త ప్రపంచాన్ని కనిపెట్టినట్టు తెలిసింది’ట. అలాగని ఆయనే తన చివరి మాటలో చెప్పేరు. చిన్నప్పటి నుంచీ తెలిసిన అమ్మాయి కాబట్టి, తన స్నేహితురాలయిన జయప్రభగారి బంధువు కావడం వల్లా ఆయనకివ్వన్నీ అనిపించి ఉండొచ్చు. తప్పేం లేదు. ఆయనింకా ఇలా చెప్పారు – ‘’కవిత మొదలవుతుంటే ఇది మొదలులా ఉండదు, కాని నిజంగా ఒక కొత్త మొదలు యిదే అని తెలుస్తుంది. అయిపోగానే మీరనుకోరు అయిపోతోందని. కాని అయిపోయాక తెలుస్తుంది, నిజంగా ఒక కొత్త ప్రపంచపు అంచులు చూశానని.’’ రామరామ. ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగులాగా లేదూ ఇది? ఏది మొదలో ఏది ‘తుదలో’ (ఇది ఘనత వహించిన వేటూరి ప్రయోగమేలెండి) తెలియని కవిత్వానికి అవార్డు వచ్చింది. తన కవితలకు కనీసం పేరు పెట్టేంత ‘బలం’ (ప్రాణం తల నుంచి తోకకొచ్చిందని ఆమెగారే చెప్పారు పైన) లేని అర్భక కవయిత్రికి అవార్డులిస్తే వాటినామె మొయ్యగలదోలేదో చూసుకోవద్దూ? అసలు ఈ మాటామంతీ కన్నా ముందు అవార్డులిచ్చిన పెద్దవారు పద్మలత కవిత్వం చదివినప్పుడు తమలో ఏయే జీవద్భావాలు కలిగాయో, ఎందుకని ఆమె కవిత్వానికి ఆ అవార్డునిచ్చారో, ఆ ఏడు పోటీపడిన కవిత్వ పుస్తకాలతో పోల్చినప్పుడు ‘మరో శాకుంతలం’ ఈ అవార్డుకెలా అర్హమయిందో నాలుగు ముక్కలు చెబితే బాగుండును. అయినా ప్రవాసప్పిల్లలు ఏం చేసినా ప్రవాసులకు ముచ్చటగానే ఉంటుందిలెండి. ముచ్చటగా మూడు నెలలు ఇండియాకొచ్చి ముగ్గురు పత్రికల ఎడిటర్లను కలిసి నైసుగా మాట్లాడి గ్రీనుపార్కుల్లో పార్టీలకు ఆహ్వానిస్తే వెంటనే పత్రికల్లో సమీక్షలు పడతాయి, ఏదో ఒక అవార్డూ పండుతుంది.
  ‘మంచిగంధం
  ఒలకబోయకు
  మల్లెపూవు
  వాడనీయకు
  అగరొత్తులు
  ఆర్పివేయకు
  చుట్టిన తాంబూలం
  పక్కన పెట్టకు
  వలచిన చిన్నది
  నీకై ఉన్నది
  అందమైన అనుభవంలో
  దీపానికెపుడూ తావుండదు’
  ఇందులో కవిత్వం ఏమిటో, పద్యత్వం ఏమిటో తమ్మినేని గారు అర్థమయ్యేలా చెబుతారా ప్లీజ్?
  పోనీ ఇందులో….
  ‘స్నేహమంటే ఇష్టమనీ
  ఇష్టమంటే కోరికనీ
  కోరికంటే కామమనీ
  కామమంటే దాహమనీ
  దాహమంటే నీరనీ
  నీరంటే నిప్పనీ
  నిప్పంటే నువ్వనీ
  నువ్వంటే నేననీ
  నేనంటే నువ్వనీ
  కొత్త అర్థం చెబుతా’

  అంతా మా తలరాతనీ చెప్పకనే చెబుతుంది ఆమె కవిత్వం. ఏం చెప్పినా, ఏం చేసినా ఈ ఏటికింతే కద పద్మలతా?


  • Ganga Prasad

   Kaveri garu seems to be envied with the author.

   I am truly anazed at the powerful meaning(sringaram) with simple words – “andamaina anubhavamulo deepaniki eppudu tavundadu”

   There are more to quote..

   Ganga


  • కావేరి

   గంగ ప్రసాదుగారూ, అసూయ ఎప్పుడు, ఎవరిమధ్య కలుగుతుందో తెలుసా మీకు? నేను కపిత్వం రాయను, ఇప్పటిదాకా రాయలేదు. అథవా ఎప్పుడయినా రాసినా ఈ స్థాయిలో అసలే రాయలేను. రచనపై విమర్శను విమర్శగా చూడండి అంతే.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పునశ్చరణం

వ్యాసకర్త: తమ్మినేని యదుకులభూషణ్ ****** వైదేహి రెండవ కవితా సంకలనం ‘ పునశ్చరణం ‘ లో నన్ను ...
by అతిథి
0

 
 

వేయి అడుగుల జలపాతపు వేగాన్ని!

(ఈరోజు, నవంబర్ 24, ఇస్మాయిల్ గారి ఎనిమిదవ వర్ధంతి. ఈ సందర్భంగా, ఈ ఏటి ఇస్మాయిల్ అవార్డు అ...
by అతిథి
9