పుస్తకం
All about booksపుస్తకభాష

April 27, 2009

మేల్ కొలుపు

More articles by »
Written by: అతిథి

వ్యాసం పంపిన వారు: కత్తి మహేశ్ కుమార్

male_kolupu“మగాళ్ళంతా ఇంతే” అని స్త్రీవాదులు స్వీపింగ్ జనరలైజేషన్ చేసినప్పుడల్లా, ఒక్కసారిగా నాలో ఉవ్వెత్తున ఎగిసే నిరసన స్వరాల్ని ఎప్పుడూ అక్షరబద్ధం చెయ్యలేకపోయాను. కానీ నా స్వరాన్ని సంగీతంలా వినిపించిన పుస్తకాన్ని ఇప్పుడే చదివాను. నా భావాల తీవ్రతను మించిన వ్యక్తీకరణ కలిగి ఉండటమో లేక నా ఆలోచనల తీరాల్ని తాను తాకొచ్చిన అనుభూతిని మిగల్చడమో తెలీదుగానీ ఇంస్టంట్ గా ఈ పుస్తకం నాకు నచ్చేసింది. అప్పుడప్పుడూ నాలో రేగిన భావతుంపరల్ని జడివానలాగా కురిపించిన ఈ పుస్తకం పేరు “మేల్ కొలుపు”. రచయిత అరుణ్ సాగర్.ఆంధ్రజ్యోతి లో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించారు.

ఈ పుస్తక ప్రారంభంలో చెప్పినట్లు “స్త్రీవాదం ఒక ప్రత్యేకమైన రాజకీయం. ఒక అస్థిత్వం. ఆత్మగౌరవ సిద్ధాంతంగా ముందుకు వచ్చినప్పుడు, మగగొంతుకతో రాయడం” ఈ రచయిత చేసిన సాహసం. ఇన్ని అస్థిత్వ ఉద్యమాలలోనూ ఉన్న పెద్ద లోపం ఎమిటంటే, సమాధాన స్వరానికి స్థలం ఇవ్వకపోవడం. ఈ పరిస్థితి యొక్క ఔచిత్యాన్ని ఈ సంకలనం ప్రశ్నిస్తుంది. మగాళ్ళని పీడకులుగా ఆక్షేపించిన స్త్రీవాదం మగాడి సమాధాన స్వరాన్ని త్రొక్కిపట్టడాన్ని నిరసిస్తుంది. అంతేకాక “అనేక భారాల కింద, అనేక ఒత్తిడుల కింద అపౌరుషంగా మారిపోతున్న మగజీవితాల గురించి, స్టీరియోటైపింగ్ లో అణగారిపోతున్న మంచి మగతనాల గురించి” ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. ఇలా ప్యారలల్ థాట్ లో కూడా ప్రత్యామ్న్యాయం ఉంటుందని నిరూపిస్తుంది.

‘తొలినమస్కారం తండ్రికి’ అని మొదలెట్టి “కావాలంటే నిమ్సుకెళ్ళు, ఐసీయూలో గుండెచేత పట్టుకుని వరసలు వరసలు నాన్నలు నాన్నలు…మీసాలుండని కవిత్వానికిది తెలుసా?…పత్తికాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిందెవరు. అయ్యా యువార్ నాట్ ఎప్రిసియేటెడ్!” అంటూ అన్సంగ్ హీరో నాన్నకి నమస్కారం చేసి “నీ ఆన, ఇప్పుడిక పురుషుల కోసం. వారోపవారాలుగా వాదోపవాదాలుగా!” అని ఆరంభిస్తాడు. “…ఎవ్వడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం. ఒంటరి చెట్టు. ఒంటరి ద్వీపం. ఒంటరి గీతం. కన్నీరు నిషిద్ధం. కేవలం హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు. కొన్ని బూతులు తిట్టడం తప్ప” అని ఈసడించుకుంటాడు.

ఇంత నిరసనలోనూ “మీ అనాటమీ, మీ దేహభాష అనువదించుకుని అవగాహన చేసుకోవడం, ఆస్వాదించడం మాకు చాలాచాలా ఇష్టం. ఇది బయొలాజికల్. ఇది బయోకెమికల్. హార్మోనల్. ఉయ్ లవ్ ఉమెన్.” అని డిక్లేర్ చేస్తాడు. అదే ఊపులో “ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది. లేకుంటే భిన్నధృవాల మధ్య ఆకర్షణేముంటుంది.” అని మగాళ్ళవ్వాలనుకునే ఆడాళ్ళకు చురక అంటిస్తాడు.”మీరూ మేమూ భిన్నం. అదే సృష్టికి అందం. లెటజ్ సేవిట్” అని రాజీచేసుకుంటాడు.

‘స్త్రీలు అర్థం కారు’ అనే సాధారణ నమ్మకాన్ని సెలెబ్రేట్ చేస్తూ, “జీవితమంతా స్త్రీల గురించి కొత్తకొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. న్యాయప్రయోగ తర్కంలో థీసిస్- యాంటీథీసిస్. సింథసిస్- – థీసిస్- సింథసిస్. కానీ ఈ కాంటెక్స్ట్ లో అది అప్లయి అవడం లేదేంటి” అని అబ్బురపడతాడు. “ఓపన్ మేంసాబ్..ఓపన్ ఓపన్” అని బ్రతిమాలుకుంటాడు. మగాడిలోకూడా తండ్రిప్రేముంటుందని చెబుతూ, “నాకు పిల్లలంటే ఇష్టమే. నీకెంత ఇష్టమో నాకూ అంతే. పిల్లలు కనిపించినప్పుడు నువ్వెంత ముచ్చటపడతావో నేనూ అంతే. కావాలంటే నా గుండెకు అడ్డుకోత పటం గీయి. ప్రియా!” అని సాధికారంగా తెలియజెబుతాడు.

మగాడి మూసలైన రక్షకులు-పోషకులు- యోధుల స్టీరియోటైప్ మోడల్స్ ను పెళ్ళగించి, స్వతంత్రుల్ని చెయ్యమని ఆకాంక్షిస్తాడు. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదనే సోషియల్ ప్రోగ్రామింగ్ ని కాదని, “ఒకసారి ఏడవాలి ఉంది… వెక్కివెక్కి పొంగి పొరలి ధారలు చారలుగా. నన్నొకసారి కడుక్కోవాలనుంది.” అని కోరుకుంటాడు. “వెయ్యి విఫలగాథల్లో తొమ్మిదివందల తొంభై తొమ్మిది కథల్లో మగాడే వంచకుడు. వదిలెయ్ గురూ! వారెప్పుడూ నీ డార్క్ సైడ్ చూడటానికే అలవాటుపడ్డారు.” అని ఎద్దేవా చేస్తాడు. “మనసారా ప్రేమించిన, మీ ప్రేమను పొందిన తొలిప్రేమికుడు తారపడితే దయచేసి అన్నయ్యా అని మాత్రం పిలవకండి- హైట్ ఆఫ్ హిపోక్రసీ” అని స్త్రీలలోని ద్వద్వవైఖరిని చీదరించుకుంటాడు.

“కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడేవాళ్ళు తాము విసిరే వగలవల గురించెందుకు ప్రస్తావించరు. ఎపెల్విక్ థ్రస్ట్ ఈజ్ ఎ గుడ్ కెరీర్ మూవ్! ఏస్కూలిది?” అని, వగలు విసిరి ఉద్యోగపు నిచ్చెనలెక్కే ఆడవారు, మగాడి దౌష్ట్యాన్ని గురించి మాత్రం ఫ్రేముకట్టి మరీ మాట్లాడే విధానాన్ని నిరసిస్తాడు. రెండూ ఉన్నప్పుడు ఒకదానే ఆక్షేపించడం కూడా వివక్షే అని గుర్తుచేస్తాడు. అంతేకాకుండా ఎదిగిన అర్బన్ మేల్ సహజన్యాయాల్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి వగలూ,గోమూ అనే ఆయుధాలతో ఫెమినైన్ ఛార్మ్ స్ప్రే చెయ్యఖ్ఖరలేదని ఖరాఖండిగా నచ్చజెబుతాడు. అదే ధాటున “మాకు సౌదర్య దృష్టిని ప్రసాదించిన దేవతలకు నమస్కృతులు. స్త్రీత్వపు లాలిత్యాన్ని మృదుస్పర్శతో రుచి చూపించిన మందగమనలకు వందనములు.” అని ప్రేమిస్తాడు.

“పురుషుల ఆకాంక్షలను ఎందుకలా వ్యక్తితమైనవిగా చూస్తారు” అని ప్రశ్నిస్తూ, “కనబడలేదా మగజీవుల త్యాగాల జాడలు. యుద్ధాలలో ఒరిగిన నరకంఠాల నుంచీ స్రవించిన నెత్తుటి ధారలు. గురించుడి. కీర్తించుడి. అనుకూల ధోరణి అవలోకించుడి.” అని కారణాల్ని చూపుతాడు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. ఎందుకంటే, ఎవర్ని ఉద్దేశించాలో తెలియలేదు అని నమ్రతతో ఒప్పుకుంటూనే, ఇదొక “సమాంతర స్వరం వినిపించే ప్రయత్నం” అని ముగిస్తాడు.

స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ నెస్ – చైతన్యస్రవంతిని పోలిన ఈ రచనా శైలిలో వ్యంగ్యం, నిరసన, ఆక్షేపన, ఆవేదన, విన్నపాలు, ఒప్పుకోళ్ళూ అన్నీ కలగలిపి రచయిత అందిస్తాడు. స్త్రీవాదానికి ప్రతికూలం కాకపోయినా, ఒక సాధానవాదాన్ని ప్రత్యామ్న్యాయంగా ఎంచుకోవడం ఈ కాలంలో చాలా సాహసనే చెప్పాలి. కాకపోతే ఆర్థిక సంస్కరణల నేపధ్యంలో వేగంగా మారిన సామాజిక పరిస్థితి దృష్ట్యా ఈ సమానాంతర స్వరం అత్యంత ఆవశ్యకం. అందుకే ఇదొక ముఖ్యమైన పుస్తకం. మకాలీన అవసరాలకు అనుగుణంగా మగవాడు మార్పుచెందే ప్రయత్నం చేస్తుంటే, దాన్ని ప్రశంసించి అక్కున చేర్చుకునే అవకాశాన్ని కాలదన్ని, ఇంకా పాత మూసల్లోనే మగాడ్ని కొలుస్తున్న ఫెమినిస్టులకు ఒక అవసరమైన ఛాలెంజ్.

తన భావావేశంలో రచయిత చేసే విన్యాసాలు అక్కడక్కడా సెక్సిస్టుగా, మగాహంకారిగా అనిపించేలా చేస్తాయి. బహుశా అది కొత్త స్వరం అవడం వలన అలా అనిపిస్తుందేమో అనే ఆలోచన వెంఠనే వచ్చింది. దానికి కారణం, ఈ పుస్తకాన్ని అంకితమిస్తూ “నాన్నంతటి అమ్మకి. అమ్మంతటి నాన్నకి” అని రచయిత అన్న మాటలు. ఇంత సమానత్వాన్ని కాంక్షించే రచయిత ఆక్షేపించగలడుకానీ అవమానించడు అన్న నమ్మకం. ఈ సంకలంలోని కొన్ని వ్యాసాలను యధాతధంగా ఆమోదించవచ్చు. మరికొన్నింటితో విభేధించవచ్చు. మరికొన్నింటిని ఔట్రేజియస్ అని తిట్టుకోవచ్చు. కొన్నింటిని మ్యాడ్ నెస్ అని ముద్దుగా అభ్యంతరపెట్టొచ్చు. ఏది ఏమైనా కొంత సరదాకోసం మరికొంత మెడుకి మనసుకీ మెతకోసం ఖచ్చితంగా చదవాల్సి పుస్తకం.

************************************************************
పుస్తకం శీర్షిక: మేల్ కొలుపు (Male Kolupu)
రచయిత: అరుణ్ సాగర్ (Arun Sagar)
ప్రచురణ: అండ్రొమెడా ప్రచురణలు
ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర
వెల: రూ 25/-About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.16 Comments


 1. i want a copy of this book, if anybody having an extra copy please mail me. i will come to you and collect it from you.


 2. @పూర్ణిమ: నెనరులు. 🙂


 3. @ మాలతి: “..చదివి నవ్వుకోడానికి మాత్రమే..” అనే ఇక్కడ లంకె ఇవ్వడం జరిగింది. మరొక ఉద్దేశం కాదు /లేదు. వేడిగా ఉన్న వాతావరణం మీ హాస్యం తో కాస్త చల్లబడుతుందనండి! 🙂


 4. @నెటిజన్: తెలుగులో పుస్తకాల మార్కెటింగ్ అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రచయితల పాట్లు వర్ణనాతీతం. అదీ ఒకవేళ ఖర్మగాలి తనపుస్తకం తనే ముద్రించి మార్కెట్ చెయ్యాలంటే,దింపేసి చెయ్యి దులుపుకోవడమేతప్ప చేతికి కనీసం పెట్టుబడిరాకపోగా డబ్బులు రాబట్టుకోవడానికి సంవత్సరాల తరబడి పుస్తకాల షాపులెమ్మట తిరిగే దరిద్రం తగులుకుంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి!!!


 5. @ మాలతి గారు: సరే. అలాగే చేద్దాం. మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి. పుస్తకం.నెట్ వారిని కూడ అదే కోరుకుంటున్నాను.


 6. @ మాలతి గారు: సరే. అలాగే చేద్దాం.


 7. మాలతి

  నెటిజన్, నా ఊసుపోక కతలకి ఇక్కడ లింకు ఇవ్వడం బాగులేదండీ. అవి చదివి నవ్వుకోడానికి మాత్రమే. సీరియస్గా తీసుకున్నా నాబ్లాగులోనే చర్చించుదాం. ఇక్కడ వర్తించదండీ. పాఠకులందరికీ, పుస్తకాభిమానులకీ నా మనవి. నా ఊసుపోక కత మీకు వర్తించదు. తప్పకుండా అందరూ పుస్తకాలు కొనాలి. చదవాలి. చదివి ఆలోచించుకోవాలి.


 8. @కె.మహేష్ కుమార్:
  పుస్తకం వివరాలు అందించినందుకు నెనరులు. మీరన్నట్టు,”(వివరాలన్నీ ఈ పుస్తకంలోనే ఉన్నాయి.).” అవి అందులో ఉండి ఏమి ప్రయోజనం? చెప్పండి? పుస్తకం మీ దగ్గిర ఉంది. కొనుక్కుంటాను అంటున్నది పాఠకుడు. అతనికి ఆ వివరం అందుబాటులో లేదుగా? ఇక ఈ పరిస్థితిలో పుస్తకం గురించి వివరం తెలియజేయగలిగినది ఎవరు? పుస్తక పరిచయం ప్రచురించిన వారే కదా?

  అక్కడ పుస్తకం వ్రాయడం ఒక ఎత్తు. వ్రాసిని దానిని అమ్మడం మరొక ఎత్తు. అమ్మిన దానికి సొమ్ములు రాబట్టు కోవడం ఇంకొక ఎత్తు. మీకు విషయం తెలియాలని – ఎవరినో పురమాయిస్తే విశాలాంధ్ర లో ప్రతులు లేవు అని చెప్పారంట. “ప్రసన్న” గారి దగ్గిర తీసుకోవచ్చు కాదా అని మీరు అనవచ్చు. అది కానే కాదు ఇక్కడ సమస్య. ఇంత వరకే మిమ్మల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

  * * *

  ఒక సాహితి ప్రక్రియ మొదలుబెట్టి, దానిని ప్రచురించి, తన భావజాలన్నో లేదు పాండిత్యాన్నో లేదుమరొకటో ఇతరులతో పంచుకోవడం ఒక పద్దతి. దాని కోసం ఒక పుస్తకాని, ముద్రించి, అమ్ముకోవడం ఒక ఎత్తు. అమ్ముకున్న తరువాత దానికి తగిన ప్రతిఫలం అంటే ముడి పదార్ధం – కాగితం , ముద్రణావ్యయం,కొండొకచో లాభం ఆ రచయితో, వారికి సంబంధించినవారో అందుకోవడం మరొక ఎత్తు.

  సుమారు, ఏడు కోట్ల జనాభా ఉన్న ఆంధ్ర దేశం లో, ఒక రచనకి సుమారుగా రెండు వేల ప్రతులు ముద్రణాలయం నుంచి బయట పడితే కాని, అందరికి ఆమోదయోగ్యమైన ఖరీదులో అందుబాటులో ఉండదు. ఖరీదు వరకే. పైగా అది మీ ఇంట్లో ఉందో, మరొకరి మాళిగలో ఉన్నదో తెలియదు. అది ఇంకా పాఠకుడి కి చేరలేదు. గమనించవలసింది అంశం అది.

  రెండు వేల ప్రతులలో, ఉదాహరణకు, గొప్ప రచయిత అనుకుంటే, ఒక వంద ప్రతులు విశాలాంధ్ర వారు (అబిడ్స్) వారు తీసుకునే అవకాశం ఉంది. ఒక సాధారణ రచన ఐతే పది ప్రతులు తీసుకుంటే ఎక్కువ. అమ్మకం కాని ప్రతులని తిప్పి ఇచ్చేస్తారు. పుస్తకాన్ని అమ్ముకోవడానికి, ఎక్కని మెట్టు, దిగని గడప ఉండదు. కస్తూరి మురళీ కృష్ణ గారు తన పుస్తకాలను ఎలా అమ్ముకుంటున్నారో వారి మాటల్లోనే ఇక్కడ చదవండి. మాలతి గారు తన “చిన్ని పొత్తము” అచ్చేసుకోవడానికి పడ్డ ఇబ్బందులు ఇక్కడ చదువుకోండి.

  పుస్తకమ్ నెట్ వారు, పుస్తకాలను పాఠకులను సాహితివేత్తలను ఒక చోట చేర్చే ప్రయత్నం చేయడం హర్షదాయకమే. అందులో భాగం గానే, వారు పుస్తకం గురించి వ్యాసాలు, పరిచయాలు, విమర్శలు, విశ్లేషణలు అందిస్తున్నారు.

  మంచి పుస్తకం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లు ఉన్నా అవి తమ తమ ప్రచురణల గురించి పాఠకులకి వివరాలు అందించడానికి ఏర్పడ్డవి.

  ఇప్పటిదాకా చూసినంతలో పుస్తకం నెట్, తమకి ఆమోదయోగ్యమైన ఏ పుస్తకాన్నైనా పాఠకుడి కి అందించాలన్న తాపత్రయం తోనే ఉన్నదనిపిస్తున్నది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు అందరూ విస్మరించే ‘మార్కెటింగ్’ , రచయితకి ప్రోత్సాహాన్ని ఇచ్చే ‘అమ్మకాలు’, పాఠకుడిని సంతృప్తి పరిచే పుస్తకం ప్రచురణ కర్త వివరం ను ఇస్తే బాగుంటుందని ఈ వ్యాఖ్యాత అభిప్రాయం.

  అచ్చులోనో, ప్రకటనలలోనే ఉండే “స్పేస్” ఇబ్బంది ఇక్కడ లేదు. ఉదాహరణకి ఇంకెక్కడో అనుకున్నట్టు, “పుస్తకాలు అమ్మడం కూడ ఒక కళ” . విశాలాంధ్రలో పుస్తకాలు దొరుకుతవి. పెద్ద సంస్థలన్ని కూడా పుస్తకాలను “డిస్త్రిబ్యూట్” చేస్తాయి. ఒక వంద మంది రచయితల పుస్తకాలు, తల పది చొప్పున ఐతే, వెయ్యి ప్రతులు. అన్ని పుస్తకాలు ఎన్ని చోట్ల, ఎన్ని రోజులు అలా ఉంచుకోవాలి, ఉండాలి? రోజుకి ఒక కొత్త పుస్తకం వచ్చింది అనుకుందాం. ౧౦౧ వ రోజున వచ్చిన పుస్తకనికి చోటు ఏది? పుస్తకం ఇచ్చేసి మరిచిపోయిన వారి సంగతి, గతించిన వారి రచనల ప్రతులు, ఎవరికి ఇవ్వాలి? ఇవి వారి ఇబ్బందులు. ఐనా అవి అప్రస్తుతం.

  పుస్తకప్రేమికులకి పుస్తకాన్ని అందించడానికి, ఆ రచయిత, ఆ ప్రచురణ కర్త పూర్తి చిరునామా, వీలుంటే, ఈ మైల్ ఐడి, ఇస్తే, పాఠకుడికి , ఆ రచయితని ఆ “లాస్ట్ మైల్” ని అధిగమించడానికి తోడ్పనివారవుతారు.

  @సౌమ్య:
  ప్రజాశక్తి, విశాలాంధ్ర అని వ్యాసం లో ఉందిగా అని అన్నారు. మీరు తెలుగు తెలిసిన తెలుగు వారు! ఆంధ్ర దేశం నడి బొడ్డున ఉన్నారు. పుస్తకాల మధ్యే మీ ప్రపంచం. చిక్కటి చీకట్లో లో కూడ మీ ఇంట్లో, ఏ పుస్తకం ఎక్కడ ఉన్నా అందుకో గలరు. కాని మీ ఇంటికి వచ్చిన అతిధికి తెలియదు కదా? అలాగే ఫలానా పుస్తకం ఫలానా చోట దొరుకుతుందని అందరికి తెలియాలని లేదుగా? మీరే ఒక పుస్తకం కొనుక్కోవడానికి పడ్డ శ్రమ ని గుర్తు తెచ్చుకోండి. ఒక పుస్తకాని వ్రాసి, దాని ప్రచురించడానికి ఒక రచయిత పడ్డ పాట్లు తెలుసుకోండి. పుస్తకాన్ని ముద్రించి ఒక వైపు ఉచితంగా ఇచ్చేస్తూ, మరో వైపు ఆకలితో అలమటించిన వారిని మీరు చూడలేదేమో! ఈ తెలుగు బ్లాగు ప్రపంచంలోనే అలాంటి కధలు గురించి “టపా”యించిన బ్లాగులున్నవి. మీరు చదవలేదోమో! మొన్నీ మధ్యే గతించిన ఒక రచయిత ని గురించి వచ్చిన వార్తలు చూడలేదా?
  ఈ వ్యాఖ్యనే ఒక టపా గా ఇంకెక్కడో ప్రచురించకుండా ఇక్కడ వ్యాఖానించడానికి కారణం ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించి, తరువాత నిర్ణయం తీసుకోండి!

  పుస్తకం మీద ప్రేమతో తల్లి ఇంత సమయం దీని కోసం వెచ్చించడం..


 9. నా బ్లాగులో వచ్చిన ఇతర వ్యాఖ్యలు…

  nelabaludu said…
  Great Effort..
  I take a look at it for sure!!!
  April 27, 2009 12:34 PM

  Sky said…
  తప్పక చదవాల్సిన పుస్తకం. సగం చదివి ఆపాను సంవత్సరం క్రితం- మళ్ళీ మొదలుపెట్టి చదువుతాను.
  April 27, 2009 12:36 PM

  ఆకాశరామన్న said…
  ఈ పుస్తకం గురించి నేను చాలా రోజుల క్రితమే చదివాను. చదవగానే నాకు కూడా ఆ పుస్తకం కొని చదవాలనిపించింది. ఈ స్త్రీవాద ప్రపంచంలో మగాడు తన కంఠాన్ని వినిపించడం చాలా మంది స్త్రీవాదులకు నచ్చలేదనుకుంటా! ఒకావిడ (పేరెందుకులెండి), అంధ్రజ్యోతిలో ( ఆదివారం వచ్చే బుక్-లెట్ లో) దీన్ని సమీక్షిస్తూ “మన మధ్యలో ఒక మగ కంఠం వినిపించడం ఆహ్వానిచదగిందే” అంటునే పాపం చాలా సన్నాయి నొక్కులు నొక్కారు.

  అందులో ఒకటీ…
  “రచయిత గారు మగాల్లకి కూడా ఆత్మ గౌరవముంటుందని స్త్రీలు గుర్తించాలి అని” రాసినదానికి సదరు రచయిత్రిగారి వ్యాఖ్య ఏమిటొ తెలుసా? “చా! నిజమా” అని. అంటే ఆవిడగారి దృష్టిలో మగవారికి అత్మాభిమానం వుండదన్న మాట. “హా! ఫెమినిస్ట్” అని మనసులో అనుకోకుండా వుండలేక పోయాను.
  April 27, 2009 12:37 PM

  కొత్త పాళీ said…
  ఈ రచనలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో కాలంగా వస్తున్నప్పుడు చదివాను. చాలా బాగా రాశారు. అక్కడ వ్యక్తపరిచిన ఆలోచనల్లో గొప్ప లోతుందని అనుకోను గాని వ్యక్తీకరణలో మంచి శైలి ఉంది. ఆధునిక సమాజంలో మగవాడిగా మనగలగటంలోని అనేక పార్శ్వాలని స్పృశించారు.
  April 27, 2009 4:16 PM

  సుజాత said…
  మీ రివ్యూ వెంటనే పుస్తకం కొనాలనిపించేలా ఉంది. నాకెందుకో మీరింతకు ముందొకసారి సమీక్షించిన “let me confess” గుర్తొస్తోందేమిటి?

  ఆకాశరామన్నగారు….:))
  April 27, 2009 8:14 PM


 10. @నెటిజన్: ఈ పుస్తకం కాపీలకు ప్రజాశక్తి,విశాలాంధ్రలతో పాటూ ప్రసన్న,8-3-231/ఎ/25,కృష్ణానగర్, యూసఫ్ గూడా, హైదరాబాద్-45 ఫోన్ నెం:23541915 లో సంప్రదించొచ్చు. రచయితతో స్వయంగా మీ అభిప్రాయాల్ని పంచుకోవడానికి arunsagart@rediff.com కు రాయచ్చు. (వివరాలన్నీ ఈ పుస్తకంలోనే ఉన్నాయి.)


 11. సౌమ్య

  @Netijen: Thanks a lot for the feedback.
  ఈ వ్యాసంలో అయితే మరి రాసి ఉన్నాయి కదా ప్రజాశక్తి, విశాలాంధ్ర అని?
  వీలైనంత వరకూ ప్రతి వ్యాసానికీ రాసిన వారు పంపినా పంపకున్నా ఈ వివరాలు పొందుపరచాలనే చూస్తున్నామండీ. వ్యాస రచయితలు ఇవ్వకా, మాకూ దొరక్కా అన్న పరిస్థితుల్లో వివరాలు రాయట్లేదు.లేకపోతే మరీ చాలా ప్రసిద్ధి చెందిన వాటికి కూడా ఈ విషయం అంత పట్టించుకోలేదు. మీ సూచనలు దృష్టిలో ఉంచుకుంటాము. పుస్తకం పై మీ అసక్తి కి ధన్యవాదాలు.


 12. నెటిజన్

  ఇక పుస్తకం కొని చదవక తప్పదంటారు. సరే, పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే, అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలోను అని చెప్పి ఊరుకోకండి.

  పుస్తకం.నెట్ – వింటున్నారా?

  మీరు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకుని, సూత్రికరించుకుని, వాటిని పాటించి, నిలబెట్టి, రేపటి వారికి వాటిని అందించాలి.

  అందులో ఒకటి.

  పుస్తక పరిచయం చేస్తున్న వారు – ఆ పుస్తకం ప్రచురణకర్తల చిరునామాని తప్పని సరిగా ఇచ్చేటట్టు చూసుకోవడం. పుస్తకం నెట్ వారు దానిని ధ్రువీ కరించుకుని, పరిచయాన్నో – విమర్శనో ఎదైనా కాని ప్రచురించేటప్పుడు, చిరునామాని కూడా ప్రచురించడం. ప్రచురణకర్తల వివరాన్ని ఇవ్వని వ్యాసాన్ని(?) అది అందేదాక ప్రచురించరాదు.

  ఆరంభించడమే కష్టం. ఒక పాతిక పుస్తకాలకి చేసిచూడండి. పంపేవారు కూడా దానికి అలవాటు పడిపోతారు.

  చత్వారం ఉంది, అలాగని కళ్ళు నెత్తికెక్కలేదు, కళ్ళు మూసుకున్నారు అని ఎవరు అనలేదు – కాని ఆ వ్యాసం లో ఎక్కడ దాని తాలుకు వివరాలు కనపడలేదు.


 13. Kumar

  WOW…Just loved it.

  KumarN


 14. a good introduction to the book. liked it, in deed.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నిర్వాసితుల వ్యథ – “పొద్దు ములిగిపోయింది”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ **************** అభివృద్ధి పేరిట జరుగుతున్న మాయ వల్ల ఊర్లకి ఊర్ల...
by అతిథి
0

 
 

Ramayana stories in South India – An Anthology: Paula Richman

కథ ఎవరిది? రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది. ...
by Purnima
1

 
 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 

 

కథ 2016 ఆవిష్కరణ – ఆహ్వానం

కథ 2016 పుస్తకం ఆవిష్కరణ సభకు ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: 12 నవంబర్ 2017, ఆదివారం వేదిక: శ్రీ చ...
by పుస్తకం.నెట్
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1