కల్నల్ సి.కె.నాయుడు

తెలుగుజాతిరత్ర్నాలు పేరిట గత కొన్నాళ్ళుగా సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు వరుసగా కొన్ని పుస్తకాలు వెలువరిస్తున్నారు. కొంతమంది గొప్పవారైన తెలుగువారి గురించిన సంక్షిప్త జీవితచరిత్రలీ పుస్తకాలు. అలా వీరు ఇప్పటిదాకా దాదాపు ఇరవై జీవితచరిత్రలు విడుదల చేశారు. ప్రస్తుత పుస్తకం భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ కటారి కనకయ్య నాయుడు గారి గురించి ప్రముఖ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేశ్ రాసినది.

పుస్తకం లో నాయుడి గారి వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి, ఆయన క్రికెట్ కెరీర్ గురించి, అప్పట్లో ఆయనకి ఉన్న ఫాలోయింగ్ గురించీ – ఇలా అయన జీవితం లోని అన్ని కోణాల గురించీ కొంచెం కొంచెంగా పరిచయం చేసారు. నాయుడు గారంటే ఈ పుస్తక రచయితలాగానే నాక్కూడా గొప్ప ఫ్యాసినేషన్. అక్కడికి ఆయన గురించి నాకేదో తెలుసని కాదు. ఆ మధ్య రామచంద్ర గుహ రాసిన ఒక పుస్తకంలోని (The states of Indian cricket) వ్యాసం ఒకటి చదివాక, ఆ ఫ్యాసినేషన్ మరింత రెట్టింపైంది. ఇదివరలో కూడా నాయుడు గారి ఫిట్నెస్ గురించి తలచుకుంటే నాకు అద్భుతంగా అనిపించేది. యాభై ఏళ్ల వయసులో కూడా డబుల్ సెంచురీ చేయగలిగేంత ఫిట్నెస్ ఆయనది. ఆ తరువాత పదేళ్ళ తరువాత కూడా ఆయన అద్భుతంగా ఆడిన దాఖలాలు ఉన్నాయి – అదీ ఆయన సత్తా! అయితే, అప్పటి కాలంలోనూ క్రీడా రాజకీయాలు తీవ్రంగా ఉండేవని తెలిసి ఆశ్చర్య పోయాను. నాయుడు గారికి ఎదురైన ఇబ్బందుల గురించి చదువుతూ ఉంటే, ఇక్కడా రాచారికానికే పట్టమా! అనిపించింది. అప్పట్లోనే నాయుడు గారికి ఉన్న క్రేజ్ ని వ్యాపార ప్రకటనల్లో వాడుకున్నారు. నాయుడు గారు పాల్గొన్న ఒక టీపొడి ప్రకటన ఫోటో కూడా ఉంది ఈ పుస్తకంలో 🙂

నాయుడు గారి గురించి జనసామాన్యంలో/సామాన్యజనంలో తెలిసిన విషయాలు చాలా తక్కువని నా అభిప్రాయం. నీకెలా తెలుసునంటారా? ఇన్నాళ్ళ బట్టి క్రికెట్ న్యూస్ చూస్తూ ఉన్నా, రామచంద్రగుహ రాసిన వ్యాసాల్లో (ముఖ్యంగా – “స్టేట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్” పుస్తకంలో) చదివిన కాస్త తప్పిస్తే, పత్రికల్లో ఎప్పుడన్నా కనబడ్డా అవే విషయాలు మళ్ళీ‌మళ్ళీ కనబడేవి. ఈ పుస్తకం తెలుగులో, తెలుగువారైన నాయుడుగారి గురించి ఇప్పటిదాక సమగ్రమో, అసమగ్రమో – ఏమీ లేకుండా ఉందన్న లోటు కొంతవరకూ తీర్చింది (క్షమించాలి, నాకు ఇప్పటి దాకా అయితే నాయుడు గారిపై తెలుగు పుస్తకాలు కనబడలేదు). నాణ్యత పరంగా సాధారణంగా ఉన్నా, విలువైన ఫొటోలెన్నో కూడా సేకరించారు ఈ పుస్తకం కోసం. రాసిన శైలి స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా ఉంది. నాయుడి గారిపై వచ్చిన పుస్తకాల జాబితా కూడా చివర్లో పొందుపరిచారు (ఎంత ప్రయత్నించినా నాకు దొరకట్లేదు బయట అన్నది వేరే సంగతి). అసలు నాయుడు గారిపై వచ్చిన తెలుగు పుస్తకం అన్న ఒక్క కారణం వల్ల అందరూ దీన్ని కొనుక్కోవాలి అని నా అభిప్రాయం. అయితే, ఎందుకు కొనడం తప్పనిసరి కాదు? అన్న విషయంలో కూడా నాకు కొన్ని వాదనలు ఉన్నాయి.

మొదటగా, పుస్తకం అసమగ్రంగా అనిపించింది. అసలుకే ఆయన గురించిన పుస్తకాలేవీ దొరకట్లేదన్నప్పుడు, ఈ రచయితకు కొన్నైనా దొరికినప్పుడు, ఇంకాస్త వివరంగా పరిశోధించి రాసి ఉండాల్సింది అనిపించింది. మనకి ఈ‌పుస్తకం ద్వారా తెలిసే విషయాలకంటే కూడా, కలిగే కుతూహలం, సందేహాలే ఎక్కువని నా అభిప్రాయం. ఉదాహరణకి – సి.కె. గారి చిన్న తమ్ముడు సి.ఎస్.నాయుడు గారు కూడా క్రికెటర్. అంతర్జాతీయంగా కూడా ఆడారు. కానీ, ఆయన ప్రస్తావన ఒకే ఒక్కసారే వస్తుంది పుస్తకంలో. అలాగే, నాయుడు గారి కుటుంబం గురించీ, ఇతర సోదరుల గురించీ, పిల్లల గురించీ, అసలు ఆయన వ్యక్తిగత జీవితం గురించీ – చాలా నామమాత్రంగా ప్రస్తావిస్తారు ఇందులో. అలాగని నాయుడు గారి క్రికెటింగ్ కెరీర్ గురించి సుదీర్ఘంగా చెప్పిందేమీ లేదు. నాయుడు గారి కెరీరే పుస్తకం కంటే సుదీర్ఘమైనది 🙂 అలాగే, రామచంద్ర గుహ గారు రాసింది మరీ పెద్ద వ్యాసం కాకపోయినా, అయన చర్చిన్చినంత విశదంగా నాయుడి గారి కెరీర్ గురించి ఈ పుస్తకంలో చర్చించలేకపోయారు అనిపించింది.

రెండో విషయం: అన్ని మంచి ఫొటోలు సేకరించారు. ధర కూడా మరీ తక్కువేమీ కాదు (ఆ పుస్తకం పరిమాణానికి). అలాంటప్పుడు ఆ ఫొటోలు మంచి క్వాలిటీతో ముద్రించడంలో శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది అనిపించింది. పుస్తకాలు ఆకర్షణీయంగా, అందంగా ముద్రించడం కూడా ఒక కళే! అనుకున్నాను.

ఇవి రెండు కాక, ఎప్పుడూ ఉండే కంప్లైంటు ఒకటేమిటంటే‌ – పుస్తకాలకి రూపాయిల్లో, డాలర్లలో రెండు లెక్కలు దేనికీ? అని. ఎలాగో ఇండియా నుంచి షిప్ చేయించుకుంటే, వంద రూపాయల పుస్తకమన్నా కూడా బోలెడు ఖరీదవుతుందిగా! ప్రింటు పుస్తకానికీ, ఈబుక్ కూ ఒకే ఖరీదు ఎందుకుండాలి? అన్న ప్రశ్నకు మల్లే దీనికీ సమాధానం దొరకదేమో నాకు!

అయితే, ఇలాంటి పేచీలు ఎన్ని ఉన్నా, ఇందాకే అన్నట్లు, అసలు తెలుగులో తెలుగువాడు మన నాయుడు గారి గురించి అసలే వివరమైన వ్యాసాలూ/పుస్తకాలూ లేవని నాకు అనిపిస్తూ ఉండేది కనుక, ఈ పుస్తకం ఆ లోటు కొంతైనా తీర్చిందని చెప్పాలి. వెంకటేష్ గారు భవిష్యత్తులో ఇలాగే మరి కొందరు తెలుగు క్రీడాకారులపై (కానీ, మరింత సమగ్రంగా) రాస్తారని ఆశిస్తున్నాను.

నాయుడు గారు తనగురించి తాను ఇంటర్వ్యూలు, వ్యాసాలూ…ఏమీ ఇవ్వలేదా/రాయలేదా? – ఈ భేతాళ ప్రశ్నకి సమాధానం తెలిసిన వారు ఇక్కడ వ్యాఖ్య రాయగలరు.

పుస్తకం వివరాలు:
సి.కె.నాయుడు (౧౮౯౫-౧౯౬౭)
ప్రచురణ: సి.పి.బ్రౌన్ అకాడెమీ
ఈమెయిల్: info@cpbrownacademy.org
ISBN: 978-93-81035-18-4
వెల: తొంభై ఐదు రూపాయలు
పుస్తకం ఎ.వి.కె.ఎఫ్ సైటు ద్వారా కొనుగోలుకి లభ్యం.

You Might Also Like

Leave a Reply