శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి – ఆరణ్యపర్వం-పంచమాశ్వాసము- నాల్గవభాగం(ఎఱ్ఱన కృతం)
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో ఐదో వ్యాసం ఇది. మొదటి నాలుగూ వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
****************
ధృతరాష్ట్రుడు పాండవుల వనవాస క్లేశంబునకు దుఃఖించుట అనే ఘట్టంలో ధృతరాష్ట్రు డిలా తలపోస్తాడు.
‘అగుఁ గాక కర్మఫలములు: ! దగఁ గుడువక పోవ వశమె దైవకృతంబుల్
మగుడునె; కౌరవ్యులకుం ! దెగుకాలం బయ్యె; వగపు తెరు విం కేలా? 3-5-338
( చేసిన కర్మకు తగినఫలం అనుభవించక తప్పదు కదా ! ఇది విధి విపరిపాకం. అనుభవించక తప్పదు. దుర్యోధనుడు మున్నగువారికి మరణకాలం ఆసన్నమైంది. ఇది అవశ్యభవితవ్యం. ఇక విచారించి ప్రయోజనం లేదు.)
రాత్రి తెగుదల దినమేల రాకయుండు? ! దినము తెగుదల రాత్రి యేతేర కున్నె?
పరఁగ సుఖదుఃఖములు గాల పర్యయమున ! నెందు మనుజులఁ బొందక యేల యుడుగు ? 3-5-340
( రాత్రి ముగిస్తే పగలు ఏర్పడుతుంది. పగలు గడిస్తే రాత్రి వస్తుంది కదా, అట్లే సుఖాలు దుఃఖాలు క్రమక్రమంగా మనుజులను ఆవహిస్తాయి. అది కాలాన్ని బట్టి సహజంగా సంక్రమించే మార్పు సుమా!)
మేలున సంతసిల్లు నెడ మేకొని యాపద లొందు, నాపదల్
దూలఁగ భూరిసౌఖ్యములు దోచుఁ; గృతంబులు తప్ప వెమ్మెయిం;
బోలఁగ నింతయుం గని ప్రబుద్ధమనస్కులు ఖేదమోదని
ర్గాళితధైర్యసాగరులు గాక సుఖింతురు సర్వకాలమున్. 3-5-341
(శుభాలు ప్రాప్తించిన వని సంతోషించేటప్పుడే ఆపదలు సంభవిస్తాయి; ఆపదలు వచ్చినపుడు గొప్ప సౌఖ్యాలు ఒనగూడుతాయి. పూర్వకాలంలో చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఈ కర్మవిపరిపాకం సిద్ధించటం తెలిసిన జ్ఞానులు సుఖానికీ, దుఃఖానికీ అతీతులుగా ఉండే ధైర్యసాగరులు. ఎల్లప్పుడు వారు నిర్వికల్పంగా సుఖాన్నే అనుభవించగలరు.) (ల – ళ లకు ప్రాస)
సిరికిఁ దొలంగి కానల వసించి కృశించిన పార్థుఁ డట్టె ని
ర్జరుల వరంబునం బరమ సమ్మద లీల మహాస్త్ర లాభ వి
స్ఫురణముం బొంది యద్దివికిఁ బోయి శరీరముతోన క్రమ్మఱన్
ధరణికి వచ్చె; నిట్టివి గదా ! వివిధాద్భుత కర్మపాకముల్. 3-5-342
(చూడుము. ఆలోచిస్తే ఇది యెంతటి అద్భుతమైన వృత్తాంతమో ! సంపదలను కోల్పోయిన అర్జునుడు అడవులలో నివసిస్తూ చిక్కి శల్యమై పోయాడు కదా ! అంతలో అతడు దేవతల నుండి వరాలు సాధించి గొప్పవైన అస్త్రాలను ఆర్జించగలిగాడు కదా ! అంతేకాక అతడు బొందితో దేవలోకానికి పోయి తిరిగి బొందితో క్షేమంగా భూలోకానికి విచ్చేశాడు. ఇది ఎంత అద్భుతం? ఏ జన్మలో చేసిన కర్మకు లభించిన ఫలమో కదా!)
గాండీవము విల్లటె, యా ! ఖండల నందనుఁడు విల్లు గలవాఁడటె, త
త్కాండంబులు దివ్యము లటె, ! యొండేటికి వారిధనమ యుర్వియు సిరియున్’. 3-5-343
(గాండీవం విల్లట! అది అతిలోక మహిమ కలది. అనన్యసాధారణ మైనది. ఆ విల్లును ధరించే వాడు కూడ లోకోత్తరవీరు డైన అర్జునుడట. అతడు దేవేంద్రుడి కొడుకు. ఆ వింటి బాణాలు దేవతామహిమ కలవి. ఇక చెప్పేదేముంది ? ఈ భూమండలమంతా, ఈ లోకంలోని సంపద అంతా ఇక ఆ పాండవులకు మాత్రమే చెందే సొత్తు కదా!)
ఇలా అని ధృతరాష్ట్రుడు విచారించాడట.
తర్వాత దుర్యోధనుడి ఘోషయాత్రా ఘట్టం. అడవిలో దుర్యోధనుడు చాలా ఆవులను ఆవులమందలను చూసాడట. వాటిని ఎఱ్ఱన గారు వర్ణించిన విధం.
నానా సహస్ర సంఖ్యానంబులై సంత ! తానంద విగతభయత్వలీల
నక్కాననమున నే దిక్కు సూచిన నతి ! సంకులంబుగఁ గుంద శంఖ చంద్ర
హార నీహార డిండీర పటీర ము ! క్తాహార హీర సంకాశములును
గాదంబ కాలేయ కాదంబినీ నీల ! జాల తమాలికా సన్నిభములు
ప్రౌఢబంధూకపల్లవ భాసితములు ! వికచ కాంచన చంపక విస్ఫుటములు
నైన వర్ణంబు లొప్పు నేత్రాభిరామ ! భంగి నలరారు గోకదంబములఁ గనియె. 3-5-379
( దుర్యోధనుడు ఆ అడవిలో రంగు రంగుల ఆవులు కల మందలను సందర్శించాడు. అచట లెక్కపెట్టలేనన్ని పెక్కువేల కొలది ఆవులు స్వేచ్ఛగా ఎల్లప్పుడు ఆనందంతో తిరుగాడు తున్నాయి. ఏ వైపు చూచినా ఆవులు ఆవులు! వాటిలో కొన్ని తెల్లని రంగు కలవి. ఆ తెలుపులో కూడ ఎంచదగిన ఛాయా భేదాలు పొడగట్టుతాయి. రంగులో కొన్ని వెల్ల ఆవులు మల్లెపూలను, కొన్ని శంఖాలను, కొన్ని చంద్రహారాలను, కొన్ని మంచుగడ్డలను, కొన్ని నురుగును, కొన్ని చందనాన్ని, కొన్ని ముత్యాల పేరులను, కొన్ని వజ్రాలను పోలి ఉన్నాయి. మరికొన్ని ఆవులు నల్లగా ఉన్నాయి. ఆ నలుపులో కూడా ఛాయా భేదాలు ఎన్నదగినవే. నల్లని ముక్కు నల్లని కాళ్ళు నల్లని రెక్కలు కల హంసలవలె కొన్ని ఆవులు ఉన్నాయి. మరికొన్ని వర్షాకాలపు మబ్బుల దొంతరలను పోలుతున్నాయి. కొన్ని నల్లని వన్నెల చీకటిరంగులో ఉన్నాయి. కొన్ని ఎఱుపు రంగు కలవి. కొన్ని మంకెనపూల చిగురుటాకుల రంగులు కలవి కొన్ని ఆవులు. కొన్ని పసిడి చంపకాల వలె మిలమిలలాడుతున్నాయి. కనులపండువుగా తిరుగాడుతున్న ఆవులమందలను దుర్యోధనుడు అక్కడ చూచాడు.)
విశేషం: సంస్కృత మహాభారతంలో దుర్యోధనుడు ఆవులను చూచినట్లు ఉన్నది. తెలుగు లోని ఈ సీస పద్యం ఎఱ్ఱన మహాకవి స్వకపోలకల్పితం. ఎఱ్ఱన కవితా శిల్పానికి వర్ణనాభిరుచికి ఈ సీసపద్యం మచ్చు తునక అని చెప్పవచ్చును.
గంధర్వులతోడి యుద్ధవర్ణనలో కర్ణుడిని గంధర్వులు ఓడించిన విధానం.
కొందఱు సూతు, నశ్వములఁ గొందఱు, కొందరు చాపదండముం
గొందఱు చక్రయుగ్మకముఁ, గొందఱు విస్ఫురితాతపత్రముం
గొందఱు కూబరంబు, మఱి కొందఱు కేతువుఁ, గొంద ఱక్షమున్
దందడిఁ దున్మివైచి విరథత్వ మొనర్చిరి సూతసూతికిన్. 3-5 400
(గంధర్వభటులలో కొంతమంది సారథిని, కొంతమంది గుర్రాలను, కొంతమంది వింటిబద్దను, కొంతమంది రెండుచక్రాలను, కొందరు వెలుగొందుతున్న గొడుగును, కొందరు నొగలును, మరికొంతమంది జెండాను, కొందరు ఇరుసును ఖండించి కర్ణుడిరథాన్ని ముక్కలు ముక్కలుగా చేసారు.) ఈ పద్యంలో ‘కొందరు చాపదండముం’ అనేచోట ‘ఱు’ ను వాడకుండా ‘రు’ ను వాడారు. ఎందుకనో నాకు తెలియలేదు. ఎవరైనా తెలియపరిస్తే సంతోషం.ఇక్కడ సాధారణంగా సమస్యాపూరణలలో వచ్చే పద్యాలు ‘కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేఱి టెక్కెముల్ —- వగైరా వగైరా గుర్తుకొస్తున్నాయి.
“కాగల కార్యం గంధర్వులే తీర్చారు” అనే నానుడి ఈ కథనుండే మొదలైంది అంటారు పెద్దలు. ఎలానంటే—
దుర్యోధనుడిని గంధర్వులు బందీగా పట్టుకొని రథానికి కట్టి తీసుకొని పోతుంటే అతని సైన్యం లోని భటులు ధర్మరాజు వద్దకు వచ్చి విషయం చెప్పి రక్షించమని అర్థిస్తారు. అప్పుడు భీముడిలా అంటాడు.
‘మనకుఁ జులుకనయ్యె: మన చేయుపనియు గంధర్వవరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె! యే భారమును లేక యూరకుండ మనల నొందె జయము. 3-5-404
పుట్టుగల్లరియై పాపములకు నెల్ల దిట్టయై లోకములచేతఁ దిట్టు వడిన
కట్టిఁడికి నిట్టి కష్టంబుగా నొనర్చి తగ విధాతృఁడు చతురుఁ డై నెగడె నేఁడు. 3-5-405
విపరీతస్థితి నొంది ఘోరవిపినోర్వీవాసులై నిత్యదుః
ఖపరాధీనతఁ దూలి రంచు మనలన్ గర్వోద్ధతస్వాంతుఁ డై
యుపలాలింపఁగ వచ్చి దుర్ణయపరుం డా ధార్తరాష్ట్రుండు దో
షపరీతాత్ముఁడు దత్ఫలంబు గుడిచెన్ సత్యంబు సామాత్యుఁడై. 3-5-406
వానిదెసం గృప సేయవలదు’ అంటాడు.
భీముడిని శాంతపరుస్తూ అజాతశత్రుడిలా అంటాడు.
‘కావరయ్య యనినఁ గరము దుర్బలుఁ డైనఁ I జెనసి యోపినంత సేయు ననిన
నూరకుండునయ్య ? యుత్తమశూరుండు ! దీనజనుల యున్న తెఱఁగు సూచి. 3-5-412
శరణం బని వచ్చిన భీ ! కరశత్రువు నయినఁ బ్రీతిఁ గావఁగ వలయుం
గరుణాపరుల తెఱం గిది: ! యిరవుగ సరిగావు దీని కే ధర్మంబుల్.’ 3-5-413
(దయచేసి మీరు నన్ను కాపాడరా అని దీనంగా ప్రార్థిస్తే, బలహీనుడైనా సాయం చేస్తాడు కదా ! మరి, నీవంటి గొప్పవీరుడు దీనజనుల వెత చూచి ఏ సాయం చేయక మిన్నక ఉంటాడా ?
శరణు వేడితే భయంకరమైన శత్రువును సయితం ప్రేమతో రక్షించాలి. ఇది దయార్ద్రహృదయుల పద్ధతి. ఈ శరణాగతరక్షణతో సాటి అయిన ధర్మాలు వేరేవీ లేవు. ఇది పరమ ధర్మం)
అప్పుడు పాండవులు చిత్రసేనుడితో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపిస్తారు. ధర్మరాజు దుర్యోధనుడికిలా బుద్ధి చెప్తాడు.
‘ఎన్నడు నిట్టి సాహసము లింక నొనర్పకు మయ్య! దుర్జనుం
డన్నున సాహసక్రియలయందుఁ గడంగి నశించుఁ; గావునం
గ్రన్నన తమ్ములన్ దొరలఁ గైకొని యిమ్ములఁ బొమ్ము వీటికిన్;
సన్నుత! దీని కొండొకవిషాదముఁ బొందకుమీ మనంబునన్.’3-5-434
(నాయనా ! దుర్యోధనా ! ఎప్పుడైనా సరే ఇటువంటి పరాభవాన్ని చేకూర్చే సాహసకృత్యాలకు ఒడిగట్టకుము. ఇపుడు జరిగిందేమో జరిగిపోయింది. ఇకమీద భవిష్యత్కాలం లోనైనా బుద్ధి కలిగి ప్రవర్తించుము. దుర్జనుడు దురభిమానంతో తన అంతరం ఎదిరి గొప్పతనం తెలియక కన్నుమిన్నుకానక సాహసానికి కడంగి నశిస్తాడు. జాగ్రత్త సుమా ! ఇక శీఘ్రంగా తమ్ములను దొరలను గైకొని నీ రాజధాని నగరానికి వెడలుము. మంచివారిచేత పొగడబడినవాడా ! ఇట్టి అవమానం జరిగినందుకు, ఎటువంటి దుఃఖాన్ని నీ మనస్సులో అనుభవించవద్దు.)
విశేషం: ఎఱ్ఱన మహాకవి వ్రాసిన పద్యాలలో ఇది తలమానికం. ఎఱ్ఱాప్రెగ్గడ కవితాశిల్పానికి ఈ పద్యం సమ్యగుదాహరణంగా ఎన్న దగింది. “రమణీయార్థ ప్రతిపాదకః శబ్దః కావ్యమ్” అని రసగంగాధరకర్త శ్రీ జగన్నాథ పండితరాయల నిర్వచనం చొప్పున ఈ పద్య మొక్కటే ఒక మహాకావ్య సదృశం. ఇందు నన్నయ్యను దలపించే ప్రసన్నకథా కవితార్థ యుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తులు, ఉన్నవి. తిక్కన మహాకవిని తలపింపచేసే “సంభాషణ చారిమ” సజీవ పాత్ర చిత్రణమున్నూ ఉన్నాయి. “వాక్యం రసాత్మకం కావ్యమ్” అన్నట్లు రసభావ నిరంతరాలైన వాక్యాల సంపుటం ఈ పద్యం. “అల్పాక్షరముల అనల్పార్థ రచన“ కు ఈ పద్యం ఉత్తమోత్తమోదాహరణం. ప్రతి వాక్యంలో వెల్లివిరిసే మనోహర భావగుంఫనమే కాక వాక్యాంతరాలలో జాలువారే వ్యంగ్య వైభవం – అర్థాంతరస్ఫూర్తి సహృదయ హృదయైకవేద్యం. ఈ పద్యంలో వ్యంగ్యగర్భితంగా స్ఫురించే అంతరార్థాంతరాలు హృదయంగమాలు.
1. ఎన్నడూ ఇట్టి సాహసాలు ఇకపై ఒనర్పకు మయ్య. ఇకమీద ఇట్టి దుస్సాహసాలు చేయకుము. అనగా ఇంతకు పూర్వం దుర్యోధనుడు ఎన్నో చేసినట్లే కదా! అయితే ఇప్పుడు పాపం బ్రద్దలయింది.
2. ఇట్టి సాహసములు – ఇటువంటి సాహసాలు. వీటికే అతడు సద్యఃఫలం అనుభవించాడు. దుర్యోధనుడి చేత అద్దం పెట్టాడు “మెత్తని పులి“ ధర్మరాజు. అతడు తన మొగం అందులో చూచుకొనవచ్చును. అల మతి విస్తరేణ.
3. దుర్జనుడు సాహసక్రియలయందు నశిస్తాడని ధర్మరాజు చేసిన హెచ్చరిక దుర్యోధనుడికి అనుభవ సద్యఃసిద్ధం.
4. ‘క్రన్నన తమ్ములం దొరలఁ గైకొని యిమ్ములఁ బొమ్ము వీటికిన్.’ ‘నాయనా! దుర్యోధనా! ఇక్కడ నీవు పొందిన అవమానం నీ రాజధానిలోని వారలకు తెలియదు కదా. ఈ పరాభవాన్ని దులుపుకొని, ఏమియు జరుగనట్లుగా తిరిగి పొమ్ము.’ అన్నాడు ధర్మరాజు. అనగా, ‘ఏమి మొగం పెట్టుకొని తిరిగి నీవు రాజధానికి పోగలవు?’ అనే ఎత్తిపొడుపు ఇందులో అంతర్గర్భితం.
5. ‘సన్నుత’ అనే సంబోధనం నెత్తిమీద సుత్తితో మొత్తిన ఎత్తిపొడుపు.
6. ఇంత అవమానం జరిగింది కావున ‘కొండొక’ విషాదం పొందకుమీ మనంబునన్. ఇది దుర్యోధనుడికి విషాద సన్నివేశంగాక మరేమి. అది ”కొండొక” విషాదమా? నిలువెల్ల దహించే దుర్భరమైన అవమానాగ్ని కాదా? ధర్మరాజు చిచ్చరపిడుగు కాదు, చలిపిడుగు. గంధర్వుల బాణాలకు ధర్మరాజు మెత్తని పలుకులకున్న పదను ఉన్నదా ? ధర్మరాజు పెట్టిన సున్నితమైన చీవాట్లు దుర్యోధనుడిని ఆపాదమస్తకం దహించివేసినవి. శీఘ్రంగా దుర్యోధనుడు రాజధానికి తరలిపోలేకపోయాడు. ధర్మరాజు చేసిన హెచ్చరిక దుర్యోధనుడికి ప్రాయోపవేశానికి పూర్వరంగాన్ని తీర్చిదిద్దిన నాటకీయ ప్రస్థావనయే. గంధర్వులు చేసింది ఏమున్నది? దుర్యోధనుడిని ఓడించి బంధించారు. అర్జునుడి చేతిలో ఓడిపోయి దుర్యోధనుడిని వదలిపెట్టి వెళ్ళిపోయారు. ధర్మరాజు చేసింది మహోపకారం ఏమున్నది? ధర్మరాజు సుకుమార సుందరంగా చేసినది దుర్యోధనుడి తేజోవధ..
ఇక్కడితో ఆరణ్యపర్వం లోని పంచమాశ్వాసం ముగుస్తుంది.
Leave a Reply