మీసాలొచ్చినవాడి తొలి డ్రెస్

రాసిన వారు: మాధవ్ శింగరాజు
***********************
(2009లో ప్రచురితమైన మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్ (రచన: పూడూరి రాజిరెడ్డి) పుస్తకానికి ముందుమాట ఇది. ఈ పుస్తకం పై గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవండి.)

బాలుడు రాజిరెడ్డితో ముక్కలు ముక్కలుగా నాకు ఒకటిన్నరేళ్ల పరిచయం. ముక్కల్ని మాత్రమే కలిపిచూస్తే… కొన్ని పని గంటల పరిచయం. ఒక స్మాల్ పెగ్గు నిడివైనా లేని పరిచయం. ఈ నిడివిలోనే అనేకసార్లు అసందర్భంగా అతడితో కలిసి టీ తాగాను. నిరర్థకంగా కలిసి భోజనం చేశాను. నిస్సారంగా ఆఫీసు లిఫ్టులో కిందికీ, పైకీ కలిసి ప్రయాణించాను.

బాలుడు రాజిరెడ్డిలో నాకెలాంటి ఆసక్తీ లేదు. నిజం. స్త్రీని తట్టుకునే శక్తి రాజిరెడ్డికి లేదని నేను గ్రహించేవరకూ… అతడిలో నాకెలాంటి ఆసక్తీ కలగనేలేదు. స్త్రీ సౌందర్యం నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా జరిపే అత్యాచారానికి చేతులు అడ్డుపెట్టుకోవడం ఇష్టంలేక దుఃఖితుడౌతున్నాడంటే… వాడిక బాలుడు కాడు. మనసును గట్టిగా కావలించుకుని వెళ్లిన ఆడమనిషి కోసం అన్నం నీళ్లు మాని, పులుపు తింటున్నాడంటే వాడు బాలుడు కాడు. రాజిరెడ్డి బాలుడు కాదని తెలిశాక, నేను స్త్రీగా పుట్టకపోవడంలోని సృష్టి అనౌచిత్యానికి అనేకసార్లు ఆకాశంలోకి చూశాను.

రాజిరెడ్డి “టచ్” బాగుంటుంది. స్త్రీని రఫ్ గా నిమురుతాడు. స్త్రీ కోరుకునే మొరటుతనం అది! బయట నిలబడి చూస్తే ఏమీ అర్థం కాదు. అతడి పక్కన పడుకోవాలి. అప్పుడు ఏ అపార్థాలూ ఉండవు. రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం… రామదాసు శ్రీరాముడిని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం… భక్తుడు దేవుడి కాళ్లమీద పడినట్లు ఉంటుంది. నిజమైన స్త్రీకి, నిజమైన దేవుడికి తప్ప మిగతావాళ్లకి రాజిరెడ్డి అందడు. వాడు మగాడు. మీసాలొచ్చాక రాజిరెడ్డి ముచ్చటపడి కుట్టించుకున్న మొదటి డ్రెస్… ఈ పుస్తకం. విప్పిచూస్తే అతడెంత పెద్ద మగాడో తెలుస్తుంది. కొన్నిచోట్ల అతడి గడ్డం మాసి, కళ్లు గుంటలు పడి వుంటాయి. కొన్నిచోట్ల అతడి ఒంటికి బొట్టుబిళ్లలు అంటుకుని ఉంటాయి. ఫ్రాయిడ్, ఫుకుఓకా, పాలోకొయిలో… కృష్ణమూర్తి, గాంధీ, గోపీచంద్… బుద్ధుడు, లూథర్ కింగ్, టాల్ స్టాయ్… ఇంతమంది తెలివిగా, తాత్వికంగా పెంచుకున్న రాజిరెడ్డిని… బొడ్డూడని ఒక ఆడపిల్ల… చేతిలో గరిటెతో, కళ్ల కాటుకతో ఆటాడించడంలోని ప్రకృతి ఆంతర్యం పుస్తకంలో అక్కడక్కడా కనిపిస్తుంది. పైపై చూపులకు కనిపించని రాజిరెడ్డి మాత్రం… పుస్తకం చివర్లో ఒంటరి తాత్వికుడై దిగంబరంగా నిలబడి ఉంటాడు… “నేనెవరు?” అనుకుంటూ!

రాజిరెడ్డి నవ్వు బాగుంటుంది. కడుపులో ఉన్నదంతా నవ్వేస్తాడు. ఆఫీస్ ఎదురుగా “సర్వీ”లో ఇటాలియన్ బేకరీ ఐటమేదో తింటున్నాం ఒక వేసవి మధ్యాహ్నం నేను, రాజిరెడ్డి. రాస్తున్నదాన్ని సగంలో ఆపి వచ్చాడు నాకోసం. రాజిరెడ్డి వాక్యం “స్ప్రయిట్”లా ఉంటుంది. సుత్తి పట్టుకుని తీర్పులివ్వడు. అసలు పీఠం మీద కూర్చోడానికే ఇష్టపడడు. హోదాను మరిచి కిందికి దిగుతాడు. బోన్లోనుంచి నిందితుడిని విడిపించుకుని, భుజం మీద చెయ్యి వేసి వరండాలోకి నడిపించుకుని వెళ్తాడు. ఆ వెళ్లడం… తన సమస్యను చెప్పుకోడానికి వెళ్లినట్టు ఉంటుంది! రాజిరెడ్డి రక్తనాళాలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కుట్టొచ్చు.

ఆ మాటకు పెద్దగా నవ్వాడు రాజిరెడ్డి. రాయడం మన అవసరమేగానీ ఎవరికీ పెద్దగా అక్కర్లేదని అన్నాడు. అని, మళ్లీ పెద్దగా నవ్వాడు! పుస్తకం వెయ్యడమంటే వెయ్యిరూపాయల నోట్లను బౌండు చేయించి పరిచయస్తులకు పంచిపెట్టడమేనని అన్నాడు.

కేర్ హాస్పిటల్ దగ్గర రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నాం… తిరిగి ఆఫీసులోకి.
వెహికల్స్ మమ్మల్ని దాటనివ్వడం లేదు. మనుషులు మేఘాల్లో వెళుతున్నారు.
అంత వేగంతో “న్యూ ఎరైవల్స్”కోసం పుస్తకాల షాపుకు వెళ్లేవారెవరైనా ఉంటారా?!
ఉంటారన్న నమ్మకం రాజిరెడ్డికి కలగడానికి కాస్త టైమ్ పట్టింది అంతే.

మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్)
రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 126
వెల: రూ. 45
ప్రతులకు: పాలపిట్ట పబ్లికేషన్స్
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెన్సీ
సలీంనగర్, మలక్ పేట్
హైదరాబాద్-36
ఫోన్: 9848787284
మెయిల్: palapittabooks@gmail.com

You Might Also Like

2 Comments

  1. నేనూ, పుస్తకాలూ, రెండువేలపన్నెండూ … | పుస్తకం

    […] పుస్తకానికి కొన్ని అందమయిన పరిచయాలు మీసాలొచ్చిన వాడి తొలి డ్రెస్ మరియు […]

  2. స్వాతి

    ఈ పుస్తకం నేను ఈ మధ్యె చదివాను.చదువుతున్నంత సేపు ముందు ఆడవాళ్లను తిట్టి ,తర్వాత వారిని బుజ్జగించినట్టు అనిపించింది. తిట్టడం అంటే మరోలా అర్ధం చేసుకొవద్దని నా మనవి. ఆడవారి గురించి కొంచం వ్యంగ్యంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. కొన్ని కొన్ని చొట్ల మాత్రం ఆడవారి మనసును పూర్తిగా అర్ధం చేసుకుని రాసినట్టు అనిపించింది.కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే..మొత్తానికి చదవడానికి బాగుంది.

Leave a Reply