కాశీభట్ల వేణుగోపాల్: నేనూ-చీకటీ

“రచన అంతా గగనంలోకి ఎగిరే విస్ఫులింగాలు, దారినంతా దగ్ధం చేస్తూ ప్రవహించే కొండచిలువల్లాంటి లావా ప్రవాహాలు, వాక్యాలు వాక్యాలు కావు. భాష భాష కాదు. వ్యాకరణానికి డైనమైట్ పెట్టినట్లైంది. శబ్దాలు శబ్దాలుగా, ముక్కలు ముక్కలై చెల్లాచెదురై ఎగిరిపడుతున్న అగ్నికణాలు. మీద పడితే ఒళ్ళు కాలుతుంది. హృదయం జ్వలిస్తుంది. భావావేశ విస్ఫోటనను ఏ భాష పట్టుకోగలదు? ఇది బుద్ధిపూర్వక ఆలోచనాసహిత వాస్తు నిర్మాణం వంటి రచన కాదు. అంటే ప్లాను వేసి రాసింది కాదు…”
-గుంటూరు శేషేంద్రశర్మ

“ఇక కదలండి నా అక్షరాలతో కదనానికి
I wish you win”

-ముందుమాట చివర్లో కాశీభట్ల సవాల్

“ఈ నవలను రచయిత కర్నూల్లో రాసి కళ్యాణదుర్గం హోటల్గదుల్లో వినిపిస్తే, ఇంకొంచెం అర్థమయ్యేటట్టుగా రాయకూడదా అని మూలిగాడు విశ్వప్రేమికుడనబడు షేక్షావలి మిత్రుడు.. డిక్షనరీ ఎన్సైక్లోపిడియాలవైపు పాఠకుల్ని పరుగెత్తించడం తగ్గిస్తే మాలాంటి సోమరి పాఠకులు మరింత సంతోషపడతారు కదా! అని ఆశపడతాను. కానీ, “నేను” పాత్ర భూమికకు ఈ వ్యక్తీకరణ అతికినట్లు సరిపోయిందని మాత్రం ఒప్పుకోకుండా ఉండలేను”

-మొదటి వెనుకమాటలో స్వామి.

చాలా సామాన్యమైన మధ్యతరగతి “మేధావి అనార్కిస్ట్” అంతరంగం కథనం ఈ “నేనూ-చీకటీ”. కృష్ణశాస్త్రి “అయ్యోమనిషి” అని ఒక గీతం రాశారు. అందులో ఒక చరణం –
“క్షుద్రతిత్తిరికుటిలవృశ్చికకౄరవృక
రుద్రమారణయంత్రరుగ్మతలు తానైన
మనిషిలోనే పెద్ద మడతుంది
మనిషికే పెడబుద్ధి పుడుతుంది”
-అని వస్తుంది. మనిషిలో ఈ పెద్ద మడతల్ని పెంచే చీకటి గురించి శ్రీ వేణుగోపాల్ మాట్లాడదలచినట్టు ఈ “నేనూ-చీకటి” నవల చదివితే తెలుస్తుంది. ఇటువంటి పుస్తకాలు ఎవరి ఏకాంతంలో వారు చదవాల్సిందే. నేనూ-చీకటి నవల వెంటాడి చదివిస్తుంది. చదివాక వెంటాడుతుంది”

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

ఈ నవలని పరిచయం చేసే ఉద్దేశ్యం నాకు ఏ కోశానా లేదు. అందుకే, పైన పెద్దలు రాసిన వాక్యాలు ఉటంకించి ఆపేస్తున్నాను. ఇవన్నీ ఈ నవల ఏమిటో చెప్పేవే. ఇకపోతే, నా అభిప్రాయానికొస్తే, శ్రీకాంతశర్మ గారన్నట్లు, వెంటాడి చదివించి, చదివాక వెంటాడుతుందన్నది నిజం – కారణాలనేకం. ఇందులో నన్ను వెంటాడిన కొన్ని వాక్యాలను చెప్పడానికే ఈ ఉపోధ్ఘాతమంతానూ!

“నిన్నలను ఈరోజులు చెరిపేసే చరిత్ర
మరో పేజీ…నేనే పుస్తకాన్ని
కాలం పఠిత!”

“భగవాన్లకి తెలుసు..నేనంత ఉదయాన్నే వక్రరేఖనై వాడి గది గోడల మధ్య ఉదయిస్తే, నా కడుపులో ఓ ఇథియోపియానూ, నా జేబుల్లో ఆకాశాలనూ నింపుకొచ్చుంటానని”

“మౌనముద్రలో జ్ఞాననేత్రం…సుమమై, సుమ సంవర్తికలైన కనురెప్పలు…రెప్పలు ముచ్చెపు చిప్పలు…చిప్పలు చేతికీ…కప్పలు నూతికీ…మరి మూతికీ? చివర్ననేన్నీవందరూ కల్సి…కల్గల్సి…గోతికి…గో…తి…కి”

“తలుపులు…తెరవని తలపుల, తలుపుల, వలపుల, పూమాలలకై మూరల…కొలతల…వ్యథల, గాథల…శిథిల తలపుల..తట్టాను.”

“ప్రజ్వరిల్లే నేత్ర సూర్యుల జ్వాజ్వల కాంతుల వాంతుల తప్పుకునే ప్రయత్నంలో…చేతులడ్డం పెట్టుకుని…”

“కొన్ని కోట్ల వత్సరాల నాగరకత పతనమై, విగతమై, శ్లథమై, ఆమె గదిలో, మదిలో, హృదిలో, వ్యథలో, నన్నో క్షణాన పురాతన శిలాజాన్ని చేసి…తలుపులు తీసి, నన్ను లోపలికాహ్వనించి…విహ్వల చిత్తుడిని చేసి…”

“మనోమందిరం శూన్యమై, శూన్య మానస మందిర ఏకాంతంలో సామాజిక చైతన్యాభాతి భీతి చే అభివ్యక్తి వాకిట్లో ఆవలి వైపో భావన. విప్పి చెప్పుకుంటేనేం? మనుషులం…సామాజికులం…”

మనస్సంచీలో రకరకాల ముఖాలు దాచుకుని….కావల్సినప్పుడో కావల్సిన ముఖాన్ని తగల్చుకుని మనసలు ముఖమేదో మనమే మరిచి….”

“అశాంతులు చల్లడం నా జన్మహక్కా?”

“మౌనాలై మేము గాయాల గానసభలు చేస్తున్నాం”

“జీవిత పూర్ణత్వం గురించి, నానా శకలాలైన మనస్సాలోచన చేయడం వింత.. షేన్బర్గ్…బోమ్ లతో కృష్ణమూర్తి తత్వచింతన సామాన్యుడి జీవితానికేం వండి వారుస్తుంది?”

“మేధావుల్లారా! ఈ మనసును విశ్లేషించి మాకో దారి చూపండి”

“నా ఆలోచనల్ని కప్పుకుని నే చంక్రమణం చేసే విహాయస వీథుల నేను నాశనమౌదామని, ఆశని అందాల సౌదామిని అని క్రీడిస్తూ నే కాంక్షించే క్షణాల..నే…నేను…మనిషినై, మనుష్య తపస్సునై, తపిస్తూ, నేను నేనై…మళ్ళీ నేను…చీకటి….”

-అదీ సంగతి!

పుస్తకం వివరాలు:
నేనూ-చీకటి (Nenu-Cheekati)
కాశీభట్ల వేణుగోపాల్ (Kashibhatla Venugopal)
వెల: నలభై రూపాయలు
ప్రతులకు: వాహిని బుక్ ట్రస్ట్

You Might Also Like

9 Comments

  1. పాపుదేశి ఝాన్సీ

    సౌమ్యగారూ!
    కాశీభట్ల వేణుగోపాల్ గారి ‘నేనూ- చీకటి’ పుస్తకావిష్కరణ నేను జర్నలిజం చదవడం పూర్తిచేసి, ఆంధ్రజ్యోతిలో ట్రెయినీగా చేరిన రోజుల్లో జరిగింది. చిక్కడపల్లిలోని త్యాగరాజ మండపం లో జరిగిన ఈ సభకు నేను వెళ్ళాను. జర్నలిస్ట్ పేరు చెప్పి ఒక పుస్తకాన్ని ఫ్రీగా సంపాదించాను. ఒక రోజులోనే చదవడం పూర్తిచేసేశాను … ఏమీ అర్థం కాకుండానే! పదప్రయోగం చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ చదివాను. అప్పటి నుంచి ఇప్పటివరకు లెక్కలేనన్ని సార్లు చదివాను. ప్రతిసారీ కొత్తగా ఉంటుంది. చదువుతుంటే ప్రతి వాక్యమూ, ప్రతి భావమూ కత్తుల్లాగా గుండెల్లో దిగబడిపోతుంటాయి.ఊపిరాడదు…నా వరకు నాకైతే జాకీచాన్ సినిమాలు చూస్తున్నట్టు ఉంటుంది వేణుగోపాల్ గారి పుస్తకాలు చదువుతుంటే. పోస్ట్ చూశాక మళ్ళీ చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.

  2. రమణ

    ఈ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేసి మంచిపని చేశారు. ఎక్కువ మందికి చేరుతుంది. ఈ పుస్తకాన్ని గురించి కనీసం నా బ్లాగులో రాద్దామనుకుంటూ రాయలేకపోయాను.

  3. తృష్ణ

    చాలా థాంక్స్ సౌమ్య గారు.

  4. anil

    I like this novel….I love KASIBATLA works…”MANCHU PUVU” is one of his best work.

  5. చౌదరి జంపాల

    @తృష్ణ:
    శ్రీకాంతశర్మ గారు ఆంధ్రప్రభ వారాపత్రిక సంపాదకుడిగా ఉన్న రోజుల్లోనే కాశీభట్లగారి నేనూ-చీకటీ ధారావాహికగా ప్రచురించబడింది. ఐతే తపన నవలను ప్రచురించటానికి ఆంధ్రప్రభవారు నిరాకరించారని విన్నట్లు గుర్తు.

    1. హాసన్

      సర్., ఎన్నో ఏళ్లుగా కాశీభట్ల గారి రచనల కోసం వెతుక్కుంటున్నా.
      ఇటీవల నికషం దొరికింది.
      మిగిలిన రచనలు కాపీలు లేవు. పిడిఎఫ్ ఫైల్స్ ఉంటే పంపగలరా.
      haasan2006oct@gmail.com కి

  6. Gks Raja

    Review and comment — both are excellent -‘మంచుపూవు’ of Sri Venugopal is the only book I read long back which haunted me for too long. Now I can not wait any long to buy both these books, after reading this preview. Thank you.
    gksraja.blogspot.com

  7. తృష్ణ

    సౌమ్య గారూ, ఎంత విచిత్రం ! నిన్ననే వేణుగోపాల్ గారి రెండవ నవల “తపన” పూర్తి చేసి శర్మగారన్నట్లు “చదివాకా వెంటాడుతున్న” ఆ పుస్తకం గురించి టపా ఎలా రాయాలో.. ఎక్కడ మొదలెట్టాలో తెలియక తికమకపడుతున్నా ! అయితే నిజ్జంగా నేను కూడా ఇలానే పుస్తకం లోని కొన్ని వాక్యాలను మాత్రమే రాద్దామనే ఉద్దేశంలో ఉన్నాను…:)) చదివిన ఫ్రెష్నెస్ పోకుండా టపా రాయాలని ప్రయత్నం !
    బావుంటాయి కొనండి అని శ్రీకాంత శర్మగారే నాన్నగారితో ఈ రెండు నవలలు కొనిపించారుట !

Leave a Reply