శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము-పంచమాశ్వాసము-ఎఱ్ఱాప్రెగ్గడ

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి?
ఆరణ్యపర్వ పంచమాశ్వాసము – ఎఱ్ఱాప్రెగ్గడ
***************
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో నాలుగో వ్యాసం ఇది. మొదటి మూడు వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
****************
ధర్మరాజు మార్కండేయ మహర్షిని, గొప్ప పతివ్రతల కథలను వినాలని ఉంది – చెప్పమని అడుగుతాడు. మఱియు తల్లిదండ్రులిరువురిలో సంతానవిషయాన పడే శ్రమలో ఎవరు ఎక్కువ శ్రమ పడతారు? తల్లిదండ్రులవిషయంలో పుత్త్రుడు ఎట్టి నడవడి కలిగి ఉండాలి ? తక్కువకులంలో జన్మించిన మనుజుడు గొప్ప ధర్మాత్ముడు పొందే లోకాలను ఏ విధంగా పొందగలడో కూడా చెప్పమని కోరతాడు. దానికి మార్కండేయుడు –

జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుద! రంబునం గరము భరంబుతోడ
భరియించి పదపడి ప్రాణసంశయ దశ ! నొంది పుత్త్రుని గాంచు నెందుఁ దల్లి;
తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు ! దేవతా సజ్జన సేవనములుఁ
గావించుఁ బుత్త్రుని గామించి జనకుఁ ; డి ! ట్లిరువుర పాటును సరియె తలఁపఁ;

దనయుఁ గని తల్లిదండ్రులు దమకు నతఁడు ! భక్తుఁ డగుటకు ధర్మానురక్తుఁ డగుట
కాసపడుదురు; విను మట్టియాస సిద్ధిఁ ! బొందఁ జేయు నతఁడ చువ్వె నందనుండు.3-5-5

(కొడుకును తల్లి – తొమ్మిది నెలలు తన కడుపులో మోసి, మిక్కిలి ప్రయత్నంతో మిక్కుటమైన శ్రమకు ఓర్చి, ఆస్థితిలో అసువులు కోల్పోతానేమో అనే సందేహ స్థితికి వచ్చి ప్రసవిస్తుంది. తండ్రి – కొడుకు పుట్టవలెననే కోరికతో ఉపవాసాది వ్రతాలు చేసి, క్రతువులు నిర్వహించి, దాన ధర్మ కార్యాలు సలిపి, నోములు నోచి, దేవతలను సజ్జనులను పూజిస్తాడు. ఈ విధంగా సంతానానికై పడే శ్రమ తలిదండ్రులు ఇరువురకూ సమానమైనదే అని చెప్పవచ్చును. (?) తలిదండ్రులు – కొడుకు పుట్టిన పిదప అతడు తమయెడ ప్రేమ కలిగి తమను ఆరాధించాలనీ ధర్మాచరణలో ఆసక్తికలవాడు కావాలనీ కోరుకొంటారు. అందుచేత, తలిదండ్రుల కోరిక లీడేర్చేవాడే నిజమైన పుత్త్రుడు అని చెప్పాలి కదా!)
ఇక్కడ నందనుడు అనే మాట సాభిప్రాయంగా వాడబడింది. నందనుడు అంటే సంతోషింపజేసేవాడు అని అర్థం.

జననియు జనకుఁడు నెవ్వని ! యనువర్తనమునఁ బ్రియంబు నందుదు రెదఁ ద
త్తనయుడు ధర్మముఁ గీర్తియు ! ననూనముగఁ బడయుఁ బొందు నక్షయగతులన్. 3-5-6

(ఏ కుమారుడు తనను కన్న తలిదండ్రులకు తన నడవడివలన మిక్కుటమైన సంతోషాన్ని కలిగిస్తాడో ఆ కొమరుడే ధర్మాన్ని కీర్తిని గొప్పగా సంపాదిస్తాడు. అట్టివాడే శాశ్వతమైన పుణ్యలోకాలను ఆర్జిస్తాడు.)

మార్కండేయుడు ధర్మరాజుకు పతివ్రతామహాత్మ్యాన్నిలా చెప్తాడు. మఱియు నిజభర్తృశుశ్రూషయందు నిత్యాసక్త యయిన పతివ్రతకు నఖిలయజ్ఞదానతపఃఫలితంబులు సులభంబు లగు – ఓ ఇతిహాసాన్ని చెప్తాను విను, దానితో నీ సందేహాలన్నీ తీరుతాయి అని ఇలా చెప్తాడు.

పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఒకానొక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు,తపస్వి. ఎల్లప్పుడూ వేదాలను వల్లె వేసేవాడు. ఒకనాఁడు అతడు ఒక చెట్టుమొదట కూర్చుని వేదాలు వల్లెవేస్తుండగా, ఆ చెట్టుకొమ్మపై వాలివున్న ఒకకొంగ అతడిపై రెట్టవేసింది. అంతట ఆ కౌశికుడికి మిక్కుటమైన కోపం వచ్చింది. అతడు ఆగ్రహంతో ఆ పక్షిని చూశాడు. వెంటనే ఆ పక్షి ప్రాణాలు కోల్పోయి నేలపై పడిపోయింది.అప్పుడు అతడు పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పలురీతుల విచారించి, అప్పుడు మిట్టమధ్యాహ్నసమయం కావటం చేత, ఏతత్కాలకృత్యాలైన సంధ్యావందనాదికాలు నిర్వర్తించి, సమీపగ్రామానికి వెళ్ళి, పరిశుభ్రత, పవిత్రత కల బ్రాహ్మణగృహాలకు పోయి,”భవతి భిక్షాం దేహి“ అన్నాడు. అట్లా అంటూ ఒక పుణ్యగృహంముందు నిలచి భిక్షను కోరాడు. అంతట ఆ ఇంటి ఇల్లాలు మిక్కిలి వేగిరపాటుతో ఆ బ్రాహ్మణయోగికి భిక్ష సమర్పించటానికై పాత్రను కడుగసాగింది. ఆ సమయంలో ఆమె భర్త ఆకలితో తూలుతూ ఇంటికి వస్తాడు. ఆమె భర్తృపరిచర్యలో మునిగి ఆయనకు సపర్యలు చేస్తూ ఉండిపోతుంది. ఆమె పతి భోజనం చేసి విశ్రాంతిగా పడుకున్న పిదప ఆమె ఆ బ్రాహ్మణుడు జ్ఞాపకానికి రాగా బిచ్చం పెట్టడానికి పాత్రతో అన్నం తీసుకొని రాగా ఆమెను కోపరంజితలోచనుడై చూస్తూ ఇలా అంటాడు.

‘అడిగినయప్పుడ చెచ్చెరఁ! గడపినఁ బో నవ్వ! యేను గడుదుర్మతి వై
పడఁతి ! నను నిలిపి భిక్షం ! బిడక కడు నవజ్ఞ సేసి తేల మదమునన్?’ 3-5-13

(‘ఓ గృహిణీ! నేను నీ గుమ్మం దగ్గఱ నిలిచి భిక్ష వేడి చాలాసేపు అయింది. ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? అప్పుడే నన్ను పొమ్మంటే వెనువెంటనే పోయి ఉండేవాడను కదా! ఎందుకు దుర్బుద్ధివై గర్వంతో నన్నిట్లా అవమానించావు?’) అంటాడు.

అప్పుడామె – అయ్యా ! నా పెనిమిటి మిక్కిలి ఆకలితో ఇంటికి వచ్చాడు. అందుచేత భక్తితో ఆమహాత్మునికి సేవలు చేస్తూ మిమ్ము స్మరింపజాలక పోయాను. దీనిని మీరు అపరాధంగా గ్రహించరాదు. సహనంతో ఓర్చుకొనదగును. అనగా ఆ బ్రాహ్మణుడు ఆమెతో

‘నీ మగఁ డంత యెక్కుడె? మనీషులు భూసురు లింత తక్కువే?
కోమలి ! యేల యిట్లు గడుఁ గ్రొవ్వునఁ గానవు లోకవంద్యులన్?
భూమిసురేంద్రులన్ దివిజపుంగవుఁ డాదిగ భక్తి గొల్చుచో
నేమిట నొక్కొ వారు గడు నెల్లిద మై రిటు నీకు నిచ్చటన్.’ 3-5-16

‘ఏమమ్మా! నీ భర్తయే అంత గొప్పవాడని తలపోస్తున్నావా ? నీ ఉద్దేశ్యంలో విజ్ఞానులైన విప్రులు అంత తక్కువ వారైనారా ? బ్రాహ్మణులు జగత్సంపూజ్యులు. దేవేంద్రుడు సయితం బ్రాహ్మణులను భక్తితో ఆరాధిస్తాడు కదా! నీవు మాత్రం గర్వంతో అట్టివారిని చులకనగా చూడటం నాకు మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నది – అని అంటూ ఇంకా – అవమానితులైన బ్రాహ్మణులు ఈ పుడమినీ కొండలతో, అడవులతో, దీవులతో పాటుగా దహించివేస్తారు . వారి మహిమ తిరుగు లేనిది సుమా! నీవు ఇంతమాత్రం తెలుసుకోలేదు’ అంటాడు. అప్పుడామె అతనితో-

‘దేవతాసములు భూదేవతావరు లౌట! యేను దన్మాహాత్మ్య మెఱుఁగ నయ్య?
యొక విప్రుఁ డలిగి పయోధిజలము ల ! పేయముల్ గాఁగ శపింప డెట్లు;
దండకవిషయంబు దగ్ధంబు సేయండె ! యలుకమై నొక్క మహాద్విజుండు;
వాతాపి యను దైత్యవరు మ్రింగి యఱిగించు ! కొనఁడె భూదేవుఁ డొక్కరుఁడు గినిసి;

ధరణి మఱియును బెక్కువిధంబులందు ! బ్రహ్మవిదు లైన బ్రాహ్మణప్రభుల మహిమ
వినమె! యెఱిఁగి యెఱింగి సద్వినుత చరిత ! కొఱవి గొని వెఱ్ఱినే తలఁ గోఁకి కొనఁగ? 3-5-19

(‘ పుడమివేల్పులైన బ్రాహ్మణులు దేవతలతో సమానులే.నాకు వారి గొప్పతనం తెలియదా? ఒక బ్రాహ్మణుడు కోపించి సముద్రజలాలు త్రాగకూడనివయ్యేట్లుగా శపించలేదా? మరొక బ్రాహ్మణోత్తముడు దండకప్రదేశం తగులబడిపోయేటట్లుగా చేయలేదా? ఒక విప్రుడు వాతాపి అనే గొప్ప రక్కసుడిని, తిని జీర్ణించుకొనలేదా? అంతేకాక, భూలోకంలో బ్రాహ్మణోత్తముల మహిమ వినమా ? మంచివారలచేత పొగడబడిన నడవడి గల ఓ విప్రోత్తమా ! తెలిసి తెలిసి నేను బ్రాహ్మణోత్తములను అవమానించి కొఱవితో తలగోకుకునే పిచ్చిదాననా ? – నేను అనుసరించే మార్గాన్ని చెప్పుతాను; – వినవలసింది.)

పతియచూవె నాపాలికిఁ బరమదైవ; మేను వాఙ్మనఃక్రియలఁ దద్ధితమ యెపుడుఁ
గోరి యొనరింతు ; దీని మిగులఁగ నొండు ! ధర్మువులు గాన నెందును దలఁచి చూచి. 3-5-21

( నా దృష్టిలో నా పాలికి గొప్పదేవుడు నా భర్త మాత్రమే. నేను త్రికరణశుద్ధిగా, మనస్సుచేత, మాటలచేత, కర్మలచేత నా పతి శ్రేయస్సునే కాంక్షిస్తాను. ఆ విధంగానే నా ఆచరణను తీర్చిదిద్దుకొంటాను. ఎంత ఆలోచించి చూచినా ఇంతకంటె గొప్ప ధర్మాలు నాకు కనిపించటం లేదు సుమా !)

వ. నీ వతిక్రోధనుండ వగుటయు నెఱుంగుదు ; నీకోపంబున నొక్కకొక్కెర నిహతం బయ్యెం గాదె! యిది మదీయ పాతివ్రత్యమహిమం జేసి కాంచితిం ; గాన క్రోధంబు గొనియాడుట లగ్గు గా ‘ దని యిట్లనియె. 3-5-22

(నీవు తీవ్రకోపంతో కూడిన స్వభావం కలవాడ వని నాకు తెలియును. నీ కోపం వలన ఒకకొంగ చనిపోయింది కదా! ఈ విషయం నా పాతివ్రత్య మహిమ వలన నేను తెలిసికొన్నాను. కావున, కోపాన్ని వహించటం మంచిది కాదు సుమా!’అని చెప్పి, మఱియు ఆమె ఇట్లా అన్నది.)

‘ క్రోధ మోహ నామకు లైన ఘోరశత్రు! లిరువు రెరియించుచుండుదు రెపుడు నంత
రంగ మయ్యుభయంబు నడంగకున్నఁ ! గలదె యూరక బ్రాహ్మణగౌరవంబు? 3-5-23

( మానవుల హృదయాలలో, కోపం మోహం అనేపేర్లు కల శత్రువులు ఇద్దరు మిక్కిలి భయంకరమైనవారు నివసిస్తుంటారు. వారిని ఇద్దరను అణచివేయకపోతే, బ్రాహ్మణులకు నిజమైన గౌరవం ఎట్లా ఏర్పడుతుంది?)

ఎప్పుడు సత్యంబ యెప్పుడుఁ బల్కు హిం ! సావిదూరుఁడు గురుజనహితార్థి
యింద్రియంబుల నోర్చి యెల్లవారలఁ దన ! యట్ల కాఁ జూచు ధర్మాభిరతుఁడు
గామంబు దగులండు కర్మంబు లాఱును ! సముచిత సంప్రయోజ్యత నొనర్చు
నట్టి పుణ్యాత్ముని ననఘు బ్రాహ్మణుఁడని ! యనిశంబుఁ గీర్తింతు రమరవర్యు;

లార్జవంబు శమము నధ్యయనంబును ! బరమధనము సువ్వె బ్రాహ్మణునకు
ధర్మగతికి నివియ తగు సాధనంబులు ! వేదవిహితముఖ్యవిధులు నివియ. 3-5-24

( ఎవడు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణగౌరవం చెందదగింది ? ఎవడు ఎల్లప్పుడును సత్యాన్నే పలుకుతాడో ; ఎవడు ఎప్పుడును ఎవరినీ పీడించడో. ఎవడు తల్లిదండ్రులు ఒజ్జలు మొదలైన గురువులకు మేలు తలుస్తాడో, ఎవడు సర్వభూతాల యెడ సానుభూతి కలిగి ఉంటాడో, ఎవడు కోరికలను విసర్జిస్తాడో, ఎవడు షట్ కర్మలను తగినట్లుగా ఆచరించే అనుష్ఠాన వేదాంతియో, అట్టి పుణ్యాత్ముడే, అట్టి మహాత్ముడే బ్రాహ్మణుడు. అట్టి మహానుభావుడినే అచ్చమైన బ్రాహ్మణుడిగా దేవతలు ప్రస్తుతిస్తారు. ఆర్జవ, ఇంద్రియనిగ్రహ, వేదాధ్యయనాలే బ్రాహ్మణుడికి గొప్ప ధనాలు. ధర్మపథానికి ఇట్టి సద్గుణాలే సాధనాలు. ఇవియే వేదాలచేత ఆదేశించబడిన కర్తవ్యాలు.) (ఇక్కడో గమ్మత్తు. ఆంధ్రమహాభారతంలో ఈ పతివ్రత పేరును ప్రస్తావించలేదు. ఇదే ప్రేరణతోనే నేమో తెలియదు, తెనాలి రామలింగకవి కూడా నిగమశర్మోపాఖ్యానంలో నిగమ శర్మ అక్కకు కూడా పేరు చెప్పకుండా వదలిపెట్టాడేమో ననిపిస్తుంది నాకు.)

విశేషం:(1) గురుజనులు:- తండ్రి, మేనమామ, అన్నగారు, చదువు చెప్పిన ఉపాధ్యాయుడు, మంత్రమును ఉపదేశించినవాడు, మున్నగువారు గురుజనాలుగా పరిగణింపబడతారు.(ii) షట్ కర్మలు:-1.యజనం 2. యాజనం 3. అధ్యయనం 4. అధ్యాపనం 5. దానం 6. ప్రతిగ్రహం.(iii) ధమ్మపదంలో ‘ఎవడు బ్రాహ్మణుడు’ అని ఒక ప్రత్యేక ప్రశ్న పరంపర ఉన్నది. అందును ఎన్నో సద్గుణగణాలు కలవాడే బ్రాహ్మణుడని చెప్పబడింది. మహాభారతంలోను, వైదికవాఙ్మయంలోను బ్రహ్మజ్ఞానం, సౌశీల్యం, సద్ గుణగణసంచయాలే బ్రాహ్మణత్వ లక్షణాలుగా పలుమారులు నొక్కి వక్కాణించబడింది.జన్మచేత బ్రాహ్మణత్వాన్ని ఎన్నటం అర్వాచీన లౌకిక సాంప్రదాయమే.
(ఇటువంటి ఎన్నెన్నో ఆణిముత్యాల గుఱించి తెలియజేస్తుంది, కాబట్టే మనం అందరం భారతాన్ని అధ్యయనం చేయాలి. అటువంటి జిజ్ఞాసను పాఠకులలో రేకెత్తించాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం.)

వ. ధర్మంబు బహుమార్గదృష్టం బయి సూక్ష్మంబయియుండు ; నీవు కేవల స్వాధ్యాయపరుండవు గాని ధర్మసూక్ష్మత యెఱుంగవు ; గావునం దడయక మిథిలానగరంబున కరుగు ; మందు జితేంద్రియుండును సత్యవాదియు మాతాపితృభక్తుండును నయినవాఁడు ధర్మవ్యాధుం డను కిరాతుండు నీకు నఖిలధర్మంబులు నెఱింగించి, సంశయచ్ఛేదంబు సేయు ; నాదెసం బ్రసన్నుండ వగునది; వనితలకుం బరిజ్ఞానంబు లేదు గావున వా రెట్టి యపరాధంబు సేసినను సహింపవలయుఁ గదా!’యనినఁ గౌశికుం డి ట్లనియె. 3-5-25

(‘ధర్మం మిక్కిలి క్లిష్టమైనది. స్థూలదృష్టికి ఒక విధంగా , సూక్ష్మదృష్టికి మరొక తీరుగా కన్పిస్తుంది. ధర్మం యొక్క తీరుతీయాలు పెక్కు తెఱగులు. నీవు వేదాలను వల్లెవేయటంలో మాత్రమే ఎక్కువనిష్ఠ కలవాడవు గాని ధర్మసూక్ష్మత గుర్తించగలిగిన విచక్షణ ఉన్నవాడవు కావు. కావున నీవు మిథిలానగరానికి వెళ్ళి, ఆ పట్టణంలో ‘ధర్మవ్యాధుడు’ అనే పేరుతో విలసిల్లే బోయవాడిని సందర్శించు. అతడు జితేంద్రియుడు. నీ సంశయాల నన్నింటినీ పోగొట్టి నీకు విచక్షణాజ్ఞానం ప్రసాదించగలడు. నా ఎడ అనుగ్రహం చూపుము. ఆడువారికి విజ్ఞానం ఉండదు కదా! అజ్ఞానంలో పడి కొట్టుకునే నాబోటి ఆడువారు ఎటువంటి నేరం చేసినా క్షమించవలెను కదా‘ అని చెప్పిన ఆమె మాటలు విని కౌశికుడు – అమ్మా! నీవు కేవలం ఒక ఆడుదానివి కావు. మేటి ఇల్లాండ్రకు మేలుబంతివై కర్మయోగినివి అయిన నీ మూలంగా నాకు జ్ఞానోదయం అయింది. నా మనస్సుకు ప్రశాంతత లభించింది. నీ ఆదేశం ప్రకారం నేను మిథిలకు వెళ్తాను. నీకు మేలు కలుగు గాక ! అని మిథిలకు ప్రయాణమౌతాడు.)

కౌశికుడు పతివ్రత యెఱుకకు విస్మయాన్ని పొందుతూ మిథిల చేరి ధర్మవ్యాధుని మాంసం దుకాణం దగ్గఱికి వెళ్ళి రోత పుట్టించే ఆ వాతావరణాన్ని భరించలేక ఓ ప్రక్కగా నిలబడి ఉండగా ధర్మవ్యాధుడు అతడి రాకను తన మనోనేత్రంతో గుర్తించి అతనిని చేరి అభివాదం చేసి మిక్కిలి ప్రీతితో అతనిని సంభావించాడు.

అనఘ ! నితంబినీతిలక మైన పతివ్రత నా తెఱంగు సె
ప్పినఁ జనుదెంచి తీవు ననుఁ బ్రీతిఁ గనుంగొన; నీ మనోరథం
బును మదిలో నెఱుంగుదుఁ; బ్రమోదముఁ బొందితి; రమ్మ మద్గృహం
బున’ కని తోడుకొని పోయె నతండు మహీసురోత్తమున్. 3-5-29
(‘ఓ పుణ్యాత్ముడా! నీకు నన్నుగూర్చి ఆ పతివ్రత చెప్పింది గదా! అందుచేత నీవు నన్నుచూడవలెననే కోరికతో నా దగ్గఱకు విచ్చేశావు. ఈ విషయాన్ని నేను నా మనస్సుచేత తెలిసికొన గలిగాను. ఎంతో సంతోషం పొందాను. దయచేసి నాయింటికి రమ్ము’ అని సగౌరవంగా స్వాగతం చెప్పి కౌశికుని తన గృహానికి తీసుకొని వెళ్ళాడు.)

కౌశికుడికి ధర్మవ్యాధుడి మాటలు రెండవ వింతగా తోచాయి. అతడికి మొట్టమొదట వింతగొలిపినవి – పతివ్రత మాటలు. ఈ రెండు వింతలను గూర్చి ఆలోచిస్తూ కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటికి వెళ్ళి, అచట అతిథి సత్కారాలను పొంది, ఉచిత సంభాషణలు సలిపి , అతడితో – నీవు ధర్మమార్గం ఎట్టిదో బాగా తెలిసినవాడవు కదా! ’జీవహింస’ ను బ్రతుకుతెఱువుగా గైకొని ప్రవర్తించటం న్యాయమా? నీవు చేస్తున్న భయంకరమైన ఈ పాపకృత్యం వలన నా మనస్సు మిక్కిలి పరితపిస్తున్నది – అంటాడు. దానికి కౌశికుడు – ‘ఎవరికి అనువైన ధర్మాలు వారు ఆచరించవలసి ఉన్నది. బ్రాహ్మణులు నిర్వహించవలసిన ధర్మాలు – తపస్సు, వేదాలను చదవటం, పరిశుభ్రతను పాటించటం, ఇంద్రియనిగ్రహంతో కూడి జ్ఞానసముపార్జన చేయటం; క్షత్రియుప్రభువులు పాటించవలసిన ధర్మం – శిష్టరక్షణం, దుష్టశిక్షణంతో గూడిన పరిపాలన; వైశ్యులు ఆచరించవలసిన ధర్మాలు – వ్యవసాయం, వర్తకం, పాడిపంటలు అభివృద్ధి చేయటం; శూద్రులకు విహితమైన ధర్మం – పరిచర్య. అట్లే, వ్యాధులు నెఱవేర్చదగిన ధర్మం మాంస విక్రయం. మాంసోపజీవనం మాకు వంశానుగతంగా సంక్రమించిన ఆచారం. అంతేకాక, ఇది మిథిలారాజ్యం. ఈ దేశానికి ప్రభువు జనకమహారాజు ఎవరి వంశవృత్తులు వారు నిర్వహించ వలె నని శాసించేవాడు. ఆ శాసనం మీరేవాడు తన కొడుకైనాసరే దండన విధిస్తుంటాడు. ఇన్ని కారణాలచేత నేను నా స్వధర్మమైన మాంసవిక్రయాన్ని వీడజాలకున్నాను. స్థూలదృష్టికి నా ప్రవర్తన ఈ రీతిగా కన్పించవచ్చును కాని నా అంతట నేను ఎప్పుడూ ఎట్టి జీవహింసకూ పాల్పడను. ఇతరులు మృగాలను చంపి తెచ్చి ఇచ్చిన మాంసాన్ని నేను కొని, కొద్ది లాభాన్ని మాత్రమే చూచికొని సరిఅయిన ధరకు విక్రయిస్తాను. ఆ విధంగా లభించిన ధనం వలన జీవిస్తాను. నాధనం వలన నాకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. అదే నా పరమార్థం. (‘జీవించుట కొఱకు మాత్రమే ధనం, కాని ధనం కొఱకే జీవించటం కూడదు’ అనేది అతడి సందేశం.) నేను మిక్కిలి అణకువతో కూడిన ప్రవర్తనతో గురువులను, పెద్దలను, అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తాను. సత్యవ్రతాన్ని పాటిస్తాను. పరిశుభ్రతను ఎన్నడూ మఱవను. సేవకులకు దానా లిస్తాను. బంధువులను మర్యాదలు చేసి మన్నిస్తాను. ఓర్పును వహిస్తాను. అసూయ చెందను. ఎట్టి విషయాలలోను మిక్కుటమైన కోరికలను పెంచుకోను. ఇతరుల దోషాలను గూర్చిన ప్రసంగాలను వినను. నేను ఎల్లప్పుడున్నూ ఆహార విహారాలలో నిష్ఠ, నియమాలను పాటిస్తాను. ఉపవాస వ్రతాలను పాటిస్తాను. ఏకపత్నీవ్రతుడను. ఋతుకాలాలను అనుసరించి సంభోగిస్తాను. నామనస్సులో పొగడ్తకు ఉబ్బను. తెగడ్తకు వెత జెందను. అందుచేత, నేను తక్కువకులంలో పుట్టినప్పటికిన్నీ, మంచి శీలం ఏర్పఱచుకొన గలిగాను. ఇది నీకు చెప్పటం నాగొప్పదనం చాటుకొనటానికి కాదు. సంభాషణ చేయవలసి వచ్చింది కాబట్టి ఇంత చెప్పక తప్పింది కాదు. నీవు నా దగ్గఱకు వచ్చింది ధర్మసూక్ష్మాలను తెలిసికొనటానికే కదా . నీకు ధర్మాలలోని ప్రత్యేక భేదాలను తెలుపుతాను. సావధానంగా వినవలసింది. అని కౌశికునికి అనేక ధర్మసూక్ష్మాలను వివరంగా బోధిస్తాడు. ఇవన్నీ చాలా చాలా మంచి బోధనలు. మనమందరం సదా గుర్తులో ఉంచుకోవలసినవి. అందుచేత వాటినన్నింటినీ యథాతథంగా ప్రస్థావించుకొందాం.

తన కులధర్మము విడువక ! మనుట పరమధర్మ మండ్రు మాన్యులు; చిత్తం
బునఁ గృప గలుగుట ముఖ్యపుఁ ! బని; సైరణ వలయు నఖిలభావము లందున్. 3-5-37
(పెద్దలు చెప్పే గొప్పమాట ఏమంటే – తన కులానికి చెందిన ధర్మాన్ని విడువకుండా ఆచరించటం మంచిది. అసలు మనస్సులో దయ అనేభావం ఉండాలి. దయాగుణమే అన్నింటికంటె గొప్పది. ఈ ప్రపంచంలో విభిన్నభావాలు ఎన్నో ఉండవచ్చును. తన అభిప్రాయమే మంచిది, ఇతరుల భావాలు చెడ్డవి అనే భావం మంచిది కాదు. అన్ని భావాలయెడ సమభావం ఉండాలి. ’సైరణ వలయు నఖిలభావము లందున్’ – అనేది మహాభారతం అందించిన సందేశాలలో మేల్తరంగా ఎన్నదగింది.)

విడువవలయు విషయవాంఛల నెద ! విడుపుఁబోలు గుణము వెదకి యెందుఁ
గానరైరి బుధులు గలదె పరిత్యాగ ! శీలునకు నసాధ్యసిద్ధి యెందు. 3-5-38
(ఇంద్రియసుఖాలపై గల కోరిక హృదయపూర్వకంగా వీడాలి. త్యాగంతో సరిసమానమైన లక్షణం ఎక్కడా కనపడదని అనుభవపూర్వకంగా అన్వేషించి పెద్దలు చెప్పిన తీర్పుమాట. – త్యాగం చేసే స్వభావం గలవాడికి ఎచటనైన అసాధ్యమైన దెక్కడైనా ఉన్నదా? ‘న కర్మణా, న ప్రజయా, న ధనేన త్యాగే నై కే అమృతత్వ మానశుః ‘ – ఇది వేదవచనం.)

సత్యహితాలాప చతురత యర్హంబు, ! సంతత సుజన పూజనము వలయు,
విను కామసంరంభవిద్వేషములఁ జేసి ! మతి గలంగినను ధర్మంబు దప్పఁ
ద్రొక్కక నడచు టత్యుత్తమసరణి; య ! ప్రియములయందును బ్రియములందు
దైన్యహర్షంబులఁ దగులక యున్నట్టి ! కల్యాణవర్తనకాంక్ష లెస్స;

యెగ్గు సేసినవారికి హితము సేఁత ! యార్యజనములు గీర్తింతు; రన్యదోష
కారి దనపాపమునఁ దాన కాలిపోవు; !వేఱ వానికిఁ గీడు గావింప నేల ? 3-5-39
(ఎల్లప్పుడూ మంచివారిని పూజించాలి. సావధానంగా ఆలకించుము: ఒక్కొక్కవేళ కోరికలు సందడి కలిగించినప్పటికిని ధర్మమార్గాన్ని తప్పకుండగా తన నడవడి తీర్చిదిద్దుకొనాలి. ఇది మిక్కిలి మంచి పద్ధతి. తనకు శుభం కలిగినా అశుభం ప్రాప్తించినా, పొంగిపోరాదు క్రుంగిపోకూడదు. అపకారం చేసినవారికి సయితం ఉపకారం చేయటమే ఆర్యులు పొగడే పద్ధతి. అపకారం చేసిన పాపాత్ముడు తన పాపం చేత తానే కాలిపోతాడు కదా! ఇక అట్టి పాపాత్ముడికి వేరే హాని చేయటం అనవసరం.)

ధార్మికులు సలుపు నుత్తమ ! కర్మముఁ జెడనాడు నాస్తికజనము; విను! మా
దుర్మతుల తెఱఁగు గైకొని ! ధర్మమునెడఁ బ్రీతి వదలఁ దగదు బుధునకున్. 3-5-40
(వేదప్రామాణ్యాన్ని అంగీకరించక దేవుడు లేడు అని వాదించేవారు, ధర్మాత్ములు చేసే మంచిపనులను నిందిస్తారు. అట్టి దురాత్ముల పద్ధతిని అంగీకరించి , బుధుడు ధర్మంపట్ల అభిమానాన్ని వీడకూడదు.)
విశేషం : నాస్తికుడు – అనేమాటకు లేదు అని ఎంచేవాడు అని అర్థం. వేదములందు, భగవంతుడియందు, పరలోకములందు నమ్మకం లేనివాడు అనే అర్థంలో నాస్తికశబ్దం బహుళంగా ప్రయోగించబడింది.

మది మఱపునఁ బాపము దన ! కొదవుటయును బిదప వగచి యొక సగమును నే
నిది సేయ నింక ననియెడు ! మదిఁ బెఱసగమును నరుండు మలుఁగు నఘంబున్. 3-5-41
(ఆలోచించకుండ తనకు పాపం సంప్రాప్తమయినపుడు తాను చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే చేసినపాపంలో సగభాగాన్నీ, ఇక అట్టి పాపాన్ని తాను చేయనని అనుకొనటం వలన మిగిలిన సగభాగం పాపాన్నీ నరుడు తొలగించుకొనవచ్చును.)

పాపముల కెల్ల నెక్కుడు పాతకములు ! సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ!
వాని రెంటి జయించినవాఁడు గాని ! యెందుఁ బరమధార్మికుఁ డని యెన్నఁబడడు. 3-5-42
(ఓ మహర్షీ ! అన్ని పాపాలలో మిక్కిలి చెడ్డవైన పాపాలు కోపం, లోభం. కోపలోభాలను జయించనివాడిని ధర్మాత్ములలో గొప్పవాడు అని ఎచటను ఎవరును ఎంచరుసుమా!)

వ. శిష్టచరితంబులుగాని మార్గంబులు గొన్ని తృణసంవృతంబులైన కూపంబులుం బోలెఁ గపట ధర్మసంవృతంబులై యుండు; వాని దవ్వులన పరిత్యజించి శిష్టాచారంబుల నడపుట ధర్మలక్షణం’ బనినం గౌశికుండు ‘శిష్టాచారంబు లెయ్యవి? యెఱింగింపు’ మనుటయు ధర్మవ్యాధుం డి ట్లనియె. 3-5-43
(సజ్జనులు పాటింపని కొన్ని మార్గాలు పైకి ధర్మాలుగా కన్పించవచ్చును. దట్టంగా మొలచిన గడ్డిచేత కప్పబడిన నూతులు పైకి నేలమాదిరిగానే గన్పించినా లోపల లోతైన గోతులుగానే ఉండి తెరువరులకు భ్రాంతి కల్పించవచ్చును. అందుచేత, దూరంనుండే కపటధర్మాలను పరిత్యజించాలి. శిష్టాచారాలను స్వీకరించి ఆచరించటం ధర్మలక్షణం’ అని ధర్మవ్యాధుడు చెప్పగా విని, కౌశికుడు, ‘మహాత్మా! శిష్టాచారాలు ఏవి?; తెలుపుము’ అని ప్రార్థించాడు. అంతట, ధర్మవ్యాధుడు కౌశికుడికి ఇట్లా బదులు చెప్పాడు.)

‘ దానంబు, సత్యంబుఁ, దపము, యజ్ఞము, నార్జ! వముఁ, గామలోభాది వర్జనంబు,
గురుజన శుశ్రూష, క్రోధరాహిత్యంబు ! దమము, సంతోష, మధ్యయన నిరతి,
దాంభికత్వము లేమి, దైన్యంబు వొరయమి,! యనసూయ, యనహంక్రియాభియుక్తి,
డలఁపంగ నాద్యమై తనరు ధర్మమ యెప్డుఁ ! గొనియాట, నాస్తికగోష్ఠిఁ జనమి,

శీలసంరక్ష, తీర్థసంసేవ, శౌచ ! మఖిలభూతంబులందు దయార్ద్రుఁ డగుట,
మితహితోక్తులు, సంశ్రితమిత్రగుప్తి ! యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత ! 3-5-44
(మహానుభావా! ఎన్నియో గొప్పగుణాలు కలిసినగాని శిష్టాచారం సిద్ధించదు. శిష్టాచారాన్ని వింగడిస్తే ఈ క్రింది గుణాలను ఎన్నవచ్చును. ఉపకారార్థం తన ద్రవ్యాన్ని ఇవ్వటం, ఎల్లప్పుడును నిజమే మాట్లాడటం, ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించటం, క్రతువులను నిర్వహించి విశ్వశ్రేయం ఒనగూర్చటం, ఇతరులను మోసగించనట్టి నిర్మల శీలం అలవరచుకొనటం, కామం కోపం మున్నగు గుణాలను అనగా కామ క్రోధ లోభ మోహ, మద మాత్సర్యాలను ఉజ్జగించటం, తల్లి తండ్రి విద్యాదానం చేసిన ఉపాధ్యాయుడు మున్నగు వారిని సదా మన్నించటం, కోపం లేని శాంతస్వభావాన్ని ఆర్జించటం, ఇంద్రియనిగ్రహం దీక్షతో సాధించటం, ఎల్లప్పుడు సంతోషంతో సంతృప్తితో ఉండటం, వేదాధ్యయన తత్పరత్వం, పటాటోపం ప్రదర్శించక సదా వినయం గలిగి ఉండటం, ఎన్నడును నీచత్వానికి దిగజారి పోవకుండటం, అసూయ లేకుండా ఉండటం, అహంకారం లేకుండా పనులు చేయటం, ధర్మాన్ని ఎప్పుడూ కొనియాడుతుండటం, నాస్తికుల కూటమిలో చేరకుండటం, శీలాన్ని కాపాడుకొనటం, తీర్థయాత్రలు చేయటం, అఖిలభూతాలపట్ల దయకలిగిన ఎడద గలిగిఉండటం, మితభాషణం చేయటం, హితభాషణం చేయటం, ఆశ్రయించిన స్నేహితులను కాపాడటం.)

ఈ పద్యంలో ఇంచుమించుగా సనాతన భారతీయ సంస్కృతి అంతయు వివరించబడి ఉన్నది. దానం అనగా త్యాగంతో కూడిన ఈవి. దశదానాలు కలవు. షోడశదానాలు ఉన్నవి. ఇచట సందర్భాన్ని బట్టి త్యాగపూరితమై పరోపకారార్థం ఇచ్చే ద్రవ్యం అనే అర్థమే చెప్పుకోవాలి. (చతురుపాయాలలో దానం ఉన్నది కాని అది ఇచట వర్తించదు) యజ్ఞం అనగా పూజ. యజ్ఞయాగాలు బహుళాలు. పంచమహాయజ్ఞాలు పేర్కొనదగినవి. 1. బ్రహ్మయజ్ఞం, 2. దేవయజ్ఞం, 3. పితృయజ్ఞం, 4. భూతయజ్ఞం, 5. మనుష్యయజ్ఞం. (ధర్మవ్యాధుడు చేసిన మాతాపితృశుశ్రూష యజ్ఞం గానే పేర్కొనదగింది.)

విను శిష్టచరిత గైకొని ! యనసూయత నడవ నడవ నంతఃకరణం
బునఁ బొదలు నట్టి సమ్మద ! మనఘా! దుర్లభము సూవె యన్యపథములన్. 3-5-45
( పుణ్యాత్ముడవైన ఓ కౌశికమునీ! ఆలకింపుము. సత్ప్రవర్తనతోకూడి, అసూయను విడనాడి ప్రవర్తిస్తే లభించే సంతోషం ఇతర మార్గాలను అనుసరిస్తే అంత సులభంగా దొరకదు సుమా!)

విశేషం: ‘వ్యాధగీత’ అని ప్రసిద్ధి నార్జించిన ధర్మవ్యాధోపాఖ్యానం అందించే సందేశం సుస్పష్టం. కర్మయోగం వ్యాధగీతకు అంతరాత్మ. ఇందు ముఖ్యపాత్రలుగా ఎన్నదగిన పతివ్రత కర్మయోగిని. అట్లే ధర్మవ్యాధుడును కర్మయోగియే. భర్తృశుశ్రూషచేత ఇల్లాలు తరించింది. మాతాపితృసేవచేత , కులధర్మమైన మాంసవిక్రయంచేత వ్యాధుడు ‘ధర్మ’ వ్యాధు డయ్యాడు. అందుచేత శిష్టచరిత వలన లభించే సమ్మదం ఇతర పథాలలో అంత సులువుగా దొరకదని ధర్మవ్యాధుడు చాటిచెప్పగలిగాడు. అయన ఆ ‘ఇతర పథములు’ ఏవి ? అవి భక్తిజ్ఞానాదులు. ధర్మవ్యాధుడు జ్ఞాని కాకపోలేదు. అయినను అతని నిష్ఠ కర్మయోగంలోనే ఉంది. ఇచట ధర్మవ్యాధుడు కర్మయోగి, తదుపరి జ్ఞానయోగి. తలిదండ్రుల సేవ ఉజ్జగించిన కౌశికుడు కేవల ‘స్వాధ్యాయ నిరతుడు’. అందుచేత ధర్మవ్యాధుడు- కౌశికుడితో, నీవు చేసిన యకార్యం బొక్కటి గలదు – అది మాతాపితృసేవ విడనాడటం అని నొక్కి వక్కాణించవలసి వచ్చింది.

వ.కావున శిష్టాచారనియతిం జేసి గురుశుశ్రూష సలిపి కృతాధ్యయనుండ వై పరమజ్ఞానపరిపక్వం బైన చిత్తంబుతోడం గామక్రోధ మహామకరసంకీర్ణయు విషయజలపరిపూర్ణయు నైన మోహజలధి నస్ఖలితధైర్యంబను తెప్పం జేసి యశ్రమంబున నిస్తరించి కృతార్థుండ వగు‘ మని మఱియు నిట్లనియె. 3-5-46
(కాబట్టి నీవు శిష్టాచారం చొప్పున నీ ప్రవర్తన తీర్చిదిద్దికొని, గురుజనులైన వారి పరిచర్య చేయునది. తదుపరి సంక్రమించే జ్ఞానంచేత పండిన మనస్సు కలవాడవై మోహసముద్రాన్ని దాటునది. ఆ మోహసముద్రం కామక్రోధా లనెడి మొసళ్ళతో కూడి, ఇంద్రియార్థములనెడి నీటితో నిండిన గొప్పసముద్రం. ఆ సముద్రాన్ని దాటటానికి విడిచిపెట్టబడని ధైర్యం అనెడి పడవ అవసరం. అప్పుడు నీవు ధన్యుడవు కాగలవు’ అని చెప్పి, మఱియు ఇట్లా పలికాడు.)

‘క్రమమున శిష్టాచార! క్రమ మెఱుఁగఁగ ధర్మమునకు గడు వాటం బై
విమలం బగుఁ జిత్తము స ! త్యమును నహింసయును దనకుఁ దావలములుగన్. 3-5-47
(మంచి నడవడికయొక్క వరుస తెలిసినప్పుడు ఆచరించినప్పుడు, ధర్మానికి మిక్కిలి అనువైనదై, అహింస సత్యం తనకు ఉనికిపట్టులు కాగా, మనస్సు స్వచ్ఛత సంపాదించుకొంటుంది. అనగా – చిత్తం నిర్మల మై ధర్మానికి నెలవు కావలసిన అంశం అహింసతో సత్యంతో జతగూడిన శిష్టాచారం.)

విను మహింస ధర్మవితతి కెల్లను మేటి;! యదియు సత్యయుక్త మైన వెలయు
ననఘ ! శిష్టచరితలందు సత్యమ కడు ! నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు. 3-5-48
(పుణ్యాత్ముడవైన ఓ కౌశికమునీ ! ఆలకింపుము. అన్ని ధర్మాలలోను అహింస గొప్పది. ఆ అహింస సత్యంతో కూడిన యెడల వెలుగొందుతుంది. శిష్టాచారంలో సత్యమే గొప్పదైనదని పెద్దల ప్రవచనం.)

వేద విహితంబులును శాస్త్రవిహితములును ! శిష్టచరితంబులును ననఁ జెప్ప నొప్పి
ధర్మములు మూఁడువిధములఁ దనరుచుండుఁ ! గడఁగి యిన్నియు సద్గతికారణములు. 3-5-49
(ధర్మాలు మూడు తెరగులు. ఒకటి – వేదాలచేత విధించబడినట్టివి. రెండు – శాస్త్రాలచేత నిర్దేశించబడినట్టివి. మూడు – పెద్దల మంచి నడవడికలు. పై మూడుపద్ధతులున్నూ సద్గతికి హేతువులే.)

అనయంబున్ శృతవంతుఁడై వినుత శిష్టాచారమార్గంబులం
జను పుణ్యాత్ముఁడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్మ్యసంరూఢుఁడై
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందఁగా నవ్వుచున్. 3-5-50
(ఎల్లప్పుడును వేదాలలో పరిపూర్ణజ్ఞానం కలిగిన విద్వాంసుడు ప్రజ్ఞ అనెడి మేడను అధివసించి, క్రింద ఉన్న మోహమనే బురదనీటిలో కూరుకుపోయి దైన్యంతో మిక్కిలి దుఃఖించే లోకాన్ని చూచి నవ్వుకుంటాడు.)

వ. అని పలికి ధర్మవ్యాధుండు మఱియు నిట్లనియె: ’నయ్యా నీవు దొలుత నావర్తనంబు గనుంగొని యిది హింసాబహుళంబు గాదె? యని పలికితివి; దాని కేను దగు తెఱంగు సెప్పితి; నది య ట్లుండె; హింస యిట్టిది యహింస యిట్టి దని విభాగింప నెవ్వరికి నేర నగు? 3-5-51
(అని చెప్పి, ధర్మవ్యాధుఁడు ఇంకనూ ఇట్లా అన్నాడు: ‘ఆర్యా, నీవు మొదట నాకొక ప్రశ్న వేశావు. నేను చేస్తున్న మాంసవిక్రయం హింసాయుతమైన కార్యంకదా? అని అప్పుడు అడిగావు. ఆ ప్రశ్నకు అప్పుడు నేను నాకు తోచిన ప్రత్యుత్తరం ఇచ్చాను. అది అప్పటికి సరిఅయిన సమాధానమే. ఇప్పుడు – ఆ విషయాన్నే సూక్ష్మంగా విమర్శించి చెప్పదలచాను. ఇది – ‘హింస’, ఇది ‘అహింస’ అని ఎవ్వరు సుస్పష్టంగా నిర్వచించగలరు? అట్టి నిర్వచనం సాధ్యం కాదని నా అభిప్రాయం.)

మును తన చేసిన కర్మం ! బునఁ జూవె నశించు భూతములు సంపెడు వాఁ
డు నిమిత్తమాత్రమింతయె ! యని చెప్పఁగ వినమె యంచితాచారులచేన్. 3-5-52
( పెద్దలు చెప్పెడిమాట, జనశ్రుతిలో తఱచు వినబడుతున్నది. అందరికి తెలిసింది ఉన్నది కదా. ప్రాణులు క్షయం పొందటానికి మూలకారణం ఆ యా ప్రాణులు చేసిఉన్న కర్మయే. చంపేవాడు కేవలం ఒక వ్యాజం మాత్రమే సుమా.)

వ. అదియునుం గాక 3-5-53
ఫలమూలౌషధిశాకం ! బులుఁ బశుమృగతతులు భక్ష్యములుగా భూతం
బుల కజుఁడు సేసె నని య ! స్ఖలితంబుగ మ్రోయు శ్రుతులఁ గాదన వశమే! 3-5-54
(మఱియును, పండ్లు, వేళ్ళు, ధాన్యాలు, కూరలు వివిధ జంతు సంతతులు ప్రాణులకు ఆహారంగా బ్రహ్మదేవుడు ఏర్పఱచినట్లు వేదాలు నొక్కి వక్కాణించాయి కదా! ఇక అట్టి వేదప్రామాణ్యాన్ని ఎట్లా తిరస్కరించగలం?)

అనఘ ! యౌశీనరుం డగు శిబి నిజగాత్ర ! హింస నింద్రాగ్నుల కిడఁడె మాంస;
మతనికి లేదయ్యె నయ్య యుత్తమ గతి? ! రంతిదేవుం డనురాజు తొల్లి
యనుదినంబును గోసహస్రద్వయంబుం దా ! వధియింపడే వేయి వత్సరములు;
దురిత మమ్మహితాత్ముఁ దొడరెనే? వేదార్థ ! నిరతులై యత్యంత నియతు లైన

ధారుణీసురముఖ్యు లధ్వరములందుఁ ! బశువరింపరే పశువులఁ; బరమపుణ్య
గతులు గలుగవె వారికిఁ ? గడఁగి యగ్ను లధికమాంసార్థు లని శ్రుతులందు వినమె! 3-5-55
(పుణ్యాత్ముడవైన ఓ కౌశికమునీ ! ఉశీనరుడి పుత్రుడైన శిబిచక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇంద్రుడికీ అగ్నిహోత్రుడికీ ఇవ్వలేదా ? ఆ శిబి చక్రవర్తికి పుణ్యం లభించలేదా? రంతిదేవుడు అనే మహారాజు పూర్వకాలంలో వేయి సంవత్సరాలపాటు ప్రతిదినం రెండువేల ఆవులను వధించి సంతర్పణం చేయలేదా ? ఆ మహానుభావుడికి పాపం చుట్టుకొన్నదా? వేదవేదాంగ పారంగతులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదులలో పశువులను సంహరించలేదా ? వారికి పుణ్యలోకాలు సమకూరలేదా ? అగ్నులు మాంసాహారాన్ని మిక్కుటంగా కోరేవి అని వేదాలు ఘోషించటంలేదా ? అందుచేత మాంసాహారం కేవలహింసగా పరిగణించటానికి వీలులేదు.)

పితృదైవత కార్యములం ! దతిభక్తిని మాంస మిడుట యర్హమనియుఁ ద
త్పితృదైవశేషములు స ! మ్మతి భోజ్యము లనియు మునుల మతములు గావే. 3-5-56
(పితృదేవతలకు శ్రాద్ధక్రియలలో నైవేద్యంగా మాంసం సమర్పించటం సరైన పద్ధతి అనిన్నీ, ఆ శ్రాద్ధాలలో నివేదించబడిన పిమ్మట మిగిలిన మాంసం ఆహారంగా స్వీకరించదగింది అనిన్నీ పెద్దలైన ఋషుల అభిప్రాయమే కదా!)

హలికుం డెంతయు నోజతో దునఁగ సీరాగ్రమునం జోఁకి ప్రా
ణు లనేకంబులు సచ్చు, హింస యది యౌనో కాదొ ! వేయేల? మ
ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కంబడు బెక్కు జం
తులు హింసావిధి గాదనంగ వశమే? దోషజ్ఞ! యూహింపుమా! 3-5-57
(ఓ పండితోత్తమా! నాగలితో రైతు భూమిని దున్నేటప్పుడు, ఆ నాగలికర్రును తాకి ఎన్ని జీవాలు చచ్చిపోవటం లేదు? అది హింస కాదని వాదించటానికి వీలున్నదా? తర్జన భర్జనలు అనవసరం. మనుజులు నేలపై నడచేటప్పుడు కూడ వేలకొలది ప్రాణులు చనిపోతున్నాయి. అది హింస కాదని వాదించటానికి వీలు లేదు కదా! ఈ విషయాన్ని దయచేసి నీవే ఆలోచించి తేల్చుకొనుము.)

విశేషం: ఇచట ధర్మవ్యాధుడు కౌశికుడిని, ‘దోషజ్ఞ’ అని సంబోధించాడు. దోషజ్ఞ అనే శబ్దానికి ‘పండితుడు’ అని రూఢ్యర్థం. వాచ్యార్థం – దోషాలను ఎఱిగినవాడు. ఈ ప్రకరణంలో దోషజ్ఞ శబ్దప్రయోగంలోని స్వారస్యం గమనించదగింది. కౌశికుడు ధర్మవ్యాధుడిని మాంసవిక్రయాన్ని దోషంగా ఎన్నిఉన్నాడు గదా!)

సలిలము లుర్వి యాకసము సర్వము జంతుమయంబు గావునం
గలుగు నవశ్యమున్ సకలకర్మములందు హింస, హింసకుం
దొలఁగిన దేహయాత్రయును దుర్ఘట మైనటు లుండు; నింతయుం
దలఁపరు హింస సేయ మని తారు తలంతురు గొంద ఱిమ్మహిన్. 3-5-58
(జలాలు, భూమి, ఆకాశం, అన్నీ ప్రాణులసమూహాలతో నిండిఉన్నవి. కాబట్టి, అన్ని పనులలోను ఏదో కొంత హింస జరుగక తప్పదు. హింస అసలే చేయనట్లు మానవజీవితం సాగించటం సాధ్యం కాదు. కొందరు ఈ విషయాన్ని గుర్తించక తాము ఎన్నడూ ఎట్టి హింస చేయమని అహింసావ్రతుల మని అనుకొని భ్రమిస్తుంటారు.)

పనివడి యహింస వ్రతముగఁ ! గొని వనమున నున్న మునులకుం దొడరదె హిం
సనము తరుమూల ఫలశా ! కనిపీడన మదియు హింస గాదొకొ తలఁపన్. 3-5-59
(తాము కేవలం అహింసావ్రతాన్నే పాటిస్తూ అరణ్యాలలో నివసిస్తున్నవారం అనుకొని కందమూలఫలాలను ఆహారంగా స్వీకరించే మునులు కూడ నిజానికి అహింసావ్రతులు కాజాలరు. కందమూలఫలాలలో కూడ ప్రాణం ఉన్నది. అదికూడ జీవహింసయే అని యోచన చేస్తే తేటతెల్లం అవుతుంది.)
(ఈ లోకంలో హింస చేయనివాడు ఒకడైనా ఉండడు. అయినప్పటికిని తమకు వీలైనంతమేరకు హింస చేయకయే జీవయాత్ర సాగించాలి. ఆ విధంగా యథాశక్తి ప్రాణిపీడన చేయకపోవటమే ‘అహింస’ అని చెప్పనొప్పును.)

హింస సేయనివాఁడు లేఁ డిజ్జగమున ! నొక్కఁడైనను, దమతమ, యోపినట్లు
హింసతెరువున కెడఁగల్గి యేఁగవలయు ! నదియ చూవె యహింసనా నతియసిల్లు.3-5-60
(ఈ లోకంలో హింస చేయనివాడు ఒకడైనా ఉండడు. అయినప్పటికిని తమకు వీలైనంతమేరకు హింస చేయకయే జీవయాత్ర సాగించాలి. ఆ విథంగా యథాశక్తి ప్రాణిపీడన చేయకపోవటమే ‘అహింస’ అని చెప్పనొప్పును.)

వ. ధర్మంబు బహుప్రకారమై యుండుఁ; దదీయసూక్ష్మగతి దురవబోధంబు; గావున శ్రుతిప్రమాణంబు వలనను వృద్ధాచారనిదర్శనంబులను నెఱింగికొనునది.3-5-61
( ధర్మాన్ని తెలియటం కష్టం. ధర్మం పెక్కురకాలుగా ప్రవర్తిల్లుతుంది. ధర్మసూక్ష్మత తెలియరానట్టిది. కాబట్టి ధర్మాన్ని తెలియటానికి వేదాల ప్రమాణం, పెద్దల నడవడిక ఆధారాలుగా గ్రహించదగును.)

విశేషం: ప్రాచీనులు తార్కికులు సత్యనిరూపణానికి కొన్ని ప్రమాణాలను నిర్వచించారు. అందులో ముఖ్యమైనవి. 1.ప్రత్యక్షం, 2.అనుమానం, 3.ఉపమానం, 4.శబ్దం, 5.అర్థాపత్తి, 6.అనుపలబ్ధి, 7.సంభవం, 8.ఐతిహ్యం. ఇందు మొదటి నాలుగింటిని తార్కికులు, ఆరింటిని వేదాంతులు, ఎనిమిదింటిని పౌరాణికులు అంగీకరిస్తారు. శబ్దప్రమాణం అనగా శ్రుతిప్రమాణం.

భూతహితంబుగాఁ బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చుఁ; ద
ద్భూతభయాస్పదం బగు ప్రభూతపు సత్యము బొంకు నట్ల; ప్రా
ణాతురుఁ డైనచోఁ, బరిణయంబునయందును బల్కు బొంకు స
త్యాతిశయంబ యండ్రు; మహితాత్మక ! యట్టివి ధర్మసూక్ష్మముల్.3-5-62
(ఓ మహానుభావా ధర్మాన్ని ప్రస్తరిస్తే అగోచరా లైనను ముఖ్యాలైన చిన్న అంశాలుగా విడివడుతుంది. ప్రాణికోటికి మేలు జరగడానికై చెప్పబడిన అసత్యం సత్యం కంటె కూడా గొప్పది. ప్రాణికోటికి కీడు గలిగించే సత్యం అసత్యంతో సమానం. ప్రాణరక్షకూ వివాహం జరిపించటానికీ ఆడిన అసత్యం సత్యం కంటె ఘనమైనది.) పోతనగారు కూడా భాగవతంలో ఈ విషయాన్నే ‘వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు నఘము వొంద దధిప!’అని వామనావతార ఘట్టంలో అన్నారు.

వ. అని తెలిపి మఱియు నతండు 3-5-63
‘ఒప్పెడునది యైనను గడు!నొప్పనియది యైన నిజకులోచితపథముం
దప్పఁ దగదండ్రు ధార్మికు! లప్పని నిజభాగ్యవిహిత మని యుండఁదగున్. 3-5-64
(తన కులవృత్తి సరిపడేది కావచ్చును; సరిపడనిది కావచ్చును. ఎట్లయినా అట్టి కులవృత్తిని వీడ రాదని ధార్మికులు చెప్పుతారు. అట్టి కులవృత్తి తనకు దైవంచేత ఏర్పరచబడినట్లుగనే భావించుకొనాలి.)

విను, పూర్వకర్మఫలములు ! దనకు వశము గాక పొందుఁ దఱితో వానిం
గనుఁగొననేరక మూఢుడు ! దన కాపద యైనచోట దైవము దూఱున్. 3-5-65
(ఎవడు చేసిన కర్మల ఫలితం వాడు అనుభవించక తప్పదు. వాటిని ఆపటానికి ఎవరికీ సాధ్యం కాదు. ఆ యా వేళల అవి సంప్రాప్తిస్తాయి. ఆ సంగతి తెలియని మూఢుడు తనకు ఆపద వచ్చినప్పుడు దేవుడిని దూషిస్తాడు.)

కార్యఫలములయెడఁ దాన కర్త ననుట! కడు నెఱుంగమిఁ జువ్వె! తాఁ గర్తయేని
తగిలి తనదైన కార్యజాతంబు నెల్లఁ! జెడక ఫలియించునట్లుగాఁ జేయరాదె! 3-5-66
(తాను చేసే కర్మలు కొన్ని ఫలిస్తాయి; కొన్ని ఫలించవు; కాబట్టి తాను చేసే పనులయొక్క జయాపజయాలు తన సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటాయి అని భావించటం అజ్ఞానం కదా! అట్లుగాక, తాను చేసేపనులకు తానే సర్వసమర్థుడైన యెడల, అన్ని పనులలో విజయాలనే సాధించవచ్చు గదా!)

వ. అది యెట్లంటేని 3-5-67
నీతిమంతులు ధర్మనిరతులు దక్షులు ! నగువారు సేయు కార్యములు గొన్ని
సిద్ధిఁ బొందవు, దుష్టచిత్తులు క్రూరు లై! చేయఁ గొన్ని విశేషసిద్ధిఁ బొందు;
నూరక యుండంగ నొందుఁ గొందఱ విపు! లార్థముల్; గొంద ఱాయాస పడియు
నిష్ఫలారంభు లై నిలుతురు; గొందఱు ! పేదవారికిఁ బ్రజ పెల్లు వొడము

నర్థవంతులు గొందఱ కర్థి నధిక దానములు ధర్మములు సువ్రతములుఁ జేయఁ
బ్రజలు వుట్టరు ; విను మిట్టి భంగి సుమ్ము కర్మఫల మాత్మతంత్రంబు గాక యుండు. 3-5-68

( ‘ఆ కర్మఫలకర్తృత్వం ఎటువంటిది?’అని నీవు అడిగితే నా సమాధానం వినుము. ఈ ప్రపంచంలో అన్ని విషయాలు ఏయేరీతులలో జరుగుతాయో ఆయాపద్ధతులను న్యాయాన్ని తెలిసి ప్రవర్తించేవారున్నూ, ధర్మాత్ములున్నూ, సామర్థ్యంకలవారున్నూ చేసే పనులు కొన్ని జయప్రదాలు కాకపోవచ్చును. దుర్మార్గులు, క్రూరులు, అవివేకులు అయినవారు చేసే పనులు కొన్ని విజయవంతాలు కావచ్చును. కొందఱు, ఏపనీ చేయక ఊరకే కూర్చుని ఉన్నప్పటికీ, వారికి ఐశ్వర్యవిజయాలు లభించవచ్చును. కొందఱు ఎంతో కష్టించి, గొప్ప పరిశ్రమ చేసినా వారికి జయం లభించదు. నిరుపేదలకు మిక్కుటంగా సంతానం కలుగుతుంది. ధనవంతులైన కొందఱికి దానధర్మాలు యజ్ఞయాగాలు చేసినా, సంతానం కలుగదు. ఇది కర్మ విపరిపాకం. తన అభీష్టానుసారంగా కర్మఫలం లభించదు.)

పురుషుఁడు కర్మాధీనత ! నరుగక తనవశమ యనిన నాపదలు రుజల్
మరణంబును నివి యేమియుఁ ! బొరయక యుండంగ బ్రదుకఁబోలదె చెపుమా! 3-5-69
(మనుజుడు కర్మాధీనుడు కాకుండగా, తన ఇష్టప్రకారమే అంతా తీర్చిదిద్దుకో గలిగితే – తనకు ఇక్కట్టులు, రోగాలు, చావు మున్నగునవి ఏవీ సంప్రాప్తించకుండానే జీవితాన్ని గడపవచ్చునుగదా! నీవే చెప్పుము.)

కర్మవశతఁ జూవె కలుగు దేహము; దేహ! వర్తనంబు కర్మవశతఁ బుట్టు;
దేహపాత మైన దేహస్థుఁ డగు జీవుఁ ! డరుగుఁ గర్మవిహిత మైన యెడకు.’
(పూర్వం చేసిన కర్మవిపరిపాకం చేతనే మానవశరీరం ఏర్పడుతుంది. శరీర ప్రవర్తన కూడా కర్మపరిపాకాన్ని బట్టియే ఏర్పడుతుంది. మరణించిన పిదప జీవుడూ తన కర్మపరిపాకం నిర్దేశించిన చోటికే వెళ్ళుతాడు.) అందుకే పెద్దలు ‘బుద్ధిః కర్మానుసారిణీ’ అన్నారు.

వ. అనినం గౌశికుండు ‘జీవుం డెట్టివాఁ?’ డని యడిగిన లుబ్ధకుం డి ట్లనియె. 3-5-71
( అని ధర్మవ్యాధుడు చెప్పగా, కౌశికుడు ‘జీవుడు ఎటువంటివాడు?’అని ప్రశ్నించాడు.)

‘ విను జీవుండు సనాతనుఁ! డనఘుఁడు నిజకర్మవశత నద్రువదేహం
బునఁ బొందు దేహపాతం ! బున నెప్పుడు జెడఁ డతండు భూసురవర్యా! 3-5-72
( ‘బ్రాహ్మణులలో ఉత్తముడవైన ఓ కౌశికమహర్షీ! వినుము. జీవుడు శాశ్వతంగా ఉండేవాడు. పాపరహితుడు. అతడు తన కర్మవశాన అశాశ్వతమైన నశించే శరీరాన్ని తాలుస్తాడు. దేహం మరణసమయాన నశిస్తుంది కాని శాశ్వతుడైన ఆ జీవుడు నశించడు సుమా! )

ఈ యొడలు విడిచి వేఱొక ! కాయముఁ గైకొని శరీరి కర్మవశగతిం
బోయి సుఖదుఃఖములు గనుఁ;! బాయక వెండియును దేహబంధముఁ బొందున్.’ 3-5-73
(ఈ శరీరాన్ని విడిచి, జీవుడు తాను చేసిన కర్మకు అనురూప మైన ఇంకొక జన్మలో సుఖదుఃఖాలను అనుభవిస్తాడు. అట్లే అతడు ఎన్నో జన్మలు పొందుతాడు.’)

వ. అనిన విని బ్రాహ్మణుండు లుబ్ధకునితోడం ‘బుణ్యపాపానురూపంబు లయిన దేహబంధంబు లెట్టి?’వనిన వాఁ డి ట్లనియె. 3-5-74
( అని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఆ మాటలు విని కౌశికుడు ధర్మవ్యాధుడిని మరల ఈ విధంగా ప్రశ్నించాడు. ‘ పుణ్యకర్మలవలన ఎట్టి పునర్జన్మ ఏర్పడుతుంది? పాపకర్మలవలన ఏర్పడే మరుజన్మ ఎటువంటిది?’ అని. ధర్మవ్యాధుడు ఆ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పాడు.)

‘స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగుఁ, బుణ్యపాప సం
కరమున మానుషత్వ మగుఁ, గల్మషముల్ పశుకీటభావముం
బొరయఁగఁ జేయు; నిప్పగిదిఁ బుట్టుచుఁ జచ్చుచుఁ మోహవార్ధిలోఁ
దిరుగుచునుండుఁ గాని యొకతీరము సేరడు జీవుఁ డెన్నఁడున్.3-5-75
(శాశ్వతమైన పుణ్యకార్యాలు చేస్తే దేవలోకంలో జన్మ లభిస్తుంది. పుణ్యాలు పాపాలు కలగలిపి చేస్తే మనుజజన్మ కలుగుతుంది. కేవలం పాపాలే చేస్తే, జంతువులుగా పురుగులుగా పుట్టుతారు. ఈ విధంగా జీవుడు పుట్టుతూ చస్తూ సదా భ్రాంతిసాగరంలో తిరుగుతాడే కాని ఎన్నటికిని ఒక ఒడ్డు చేరుకొనలేడు.)

ఇది సకలంబుఁ గాంచి బుధుఁ డెన్నడుఁ బాపము పొంతఁ బోక ని
ర్మదనిరహంక్రియాత్ముఁడును మత్సరదూరుఁడు నై చరించుఁ బెం
పొదవఁగ ధర్మమార్గమున నొయ్యన ధర్మము తీ పెఱింగి తా
వదలఁడు సత్క్రియావిధము వారక యెక్కు డొనర్చు ధర్మముల్. 3-5-76
( జీవుడు మోహసముద్రంలో పడి చావుపుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటాడన్న సంగతినంతా పండితుడైనవాడు బాగా గమనించి ఎప్పుడూ పాపపు పనులజోలికి పోకుండా, పొగరు అహంకారంలేని మనస్సుతో, అసూయను వదలిపెట్టి ధర్మమార్గంలో నడుస్తూ పెంపును పొందుతాడు. అట్లా ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించటంవలన దానిలోని రుచిని మరుగుతాడు. దానివలన మంచిపనులు సదా చేస్తుంటాడు. ధర్మకార్యాలను ఎక్కువగా చేస్తుంటాడు.)

చిరముగ ధర్మముల్ నడపఁ జిత్తము దేఱుఁ బ్రసన్నచిత్తుఁ డై
పరువడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెఱింగి చె
చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్యశీలతం
బరిణతి నొందుఁ బొందుఁ బిదపం బరమార్థపదప్రభావమున్.’ 3-5-77
(చిరకాలం ధర్మాలను ఆచరించటం వలన మనస్సు నిర్మలమౌతుంది. చిత్తం ప్రశాంతిని బొందటంచేత ఇంద్రియసౌఖ్యాలు వ్యర్థాలైనవి అని తెలుస్తుంది. అట్టి జ్ఞానం లభించిన వెంటనే వాటిని విడనాడి తపస్సు, ఇంద్రియనిగ్రహం, సత్యవ్రతం, మున్నగు సద్గుణాలచేత ఆధ్యాత్మికమైన ఉన్నతస్థితిమహిమ గోచరిస్తుంది. అదియే గొప్ప పరిణతస్థితి.’)

వ. అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె.3-5-78
( అనగా ఆ ఉత్తమబ్రాహ్మణుడైన కౌశికుడు ధర్మవ్యాధుడితో ఇలా అన్నాడు.)

(ధర్మవ్యాధోపాఖ్యానం నాకిష్టమైన ఉపాఖ్యానాలలో ముఖ్యమైనది. దానికి కారణం ఈ పాఠ్యభాగం చిన్నప్పుడు పాఠశాలలో తెలుగు పద్యభాగంలో పాఠ్యాంశంగా చదువుకున్న గుర్తు. అందుచేతనే దీనిని ఉన్నదున్నట్లుగా వ్రాయాలని అన్పిస్తున్నది. మిగతాది తఱువాతి భాగంలో)

You Might Also Like

2 Comments

  1. నరసింహారావు మల్లిన

    వివేకానందులవారి పుస్తకాలు నేను ఇంతవరకూ ఏమీ చదవలేదు. ఈ కర్మయోగం పుస్తకాన్ని సంపాదించి చదువుదామనుకుంటున్నాను. మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు.

  2. రాఘవ

    వివేకానందులవారి కర్మయోగం పుస్తకంలో కూడా ఈ ధర్మవ్యాధోపాఖ్యానం చర్చకు వస్తుందండీ. బాగుంది.

Leave a Reply