ప్రపంచ పుస్తక దినం

రాసిన వారు: శ్రీనిక
******************
పుస్తక పఠనం ఒక వ్యసనం. సిగరెట్, మందు తాగటం వంటి వ్యసనాల వలన ఆరోగ్యం పాడవుతుంది. కాని పుస్తక పఠనం వలన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. అసలు ఏ పుస్తకమైనా ఎందుకు చదువుతాం? ఏం అనుభవం లోకి వస్తుంది. ఏ భావనలకు లోనవుతాం? ఏ రకమైన భావోద్రేకాలు ఎలా ఉత్ధానపతన స్ఠాయికి చేరుకుంటాయి?

పుస్తకం లోకి నడవడమంటే… పరిచయ పాత్రలలోకి మనల్ని మనం వంపుకోవటమా ? లేదా మనలని రచయిత తనలో వంపు కుంటాడా? మన జీవితాల్లో పుస్తకం ఒక భాగం. ఒంటరిగా ప్రయాణిస్తున్నపుడో, ఏమీ తోచనపుడో పుస్తకం నేనున్నానంటూ మన చేతిలో ఒదిగిపోతుంది. కళ్ళతో అక్షరాల్ని ఏరుకుంటూ ఊహాలోకాల్లో మనల్ని మనం కోల్పోతాం. అంతేనా.. మనం ఆ రచయితకి అభిమానులం అయిపోతాం. కొంతమందయితే ఏకలవ్య శిష్యులవుతారు. ఇంతటి ఔన్నత్యం ఉన్న పుస్తకం ఉనికి నేడు ప్రశ్నార్ధకంగా మారింది. అంతర్జాలం (ఇంటర్నెట్) టివి చాలా వరకు పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి. ఎవరు ఇపుడు పుస్తకాన్ని కొని చదవడం లేదు. రీడర్ షిప్ గణనీయంగా పడిపోయిందని ప్రచురణ కర్తలు వాపోతున్నారు. ఏదో రాయడం అలవాటయి పోయి రాస్తున్నాం. రాతలన్నీ అచ్చులో చూసుకుని మురిసి పోతున్నాం. కాని కొనే వారేరి. వంద రూపాయిల నోటుకి బైండింగ్ చేసి ఇచ్చినట్లుగా అచ్చయిన మా పుస్తకాలని స్నేహితులకి, బంధువులకి పంచి పెట్టుకుంటున్నాం.. ఒక రచయిత ఆవేదన.

ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పుస్తక పతనావస్థను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని ( ఏప్రిల్ 23 న ) ప్రపంచ పుస్తక దినంగా జరుపుకోవాలని యు.ఎన్.ఓ ( యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ) తీర్మానించింది. ఈ రోజు ప్రపంచ పుస్తక దినం గా పరిగణించడానికి విభిన్న కధనాలున్నా చాలా మంది ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు.

1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా మొదలైన ప్రముఖ రచయితలు 1616 లో ఇదే రోజున మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును 1995 లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించడమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా కూడా జరపాలని నిశ్చయించింది. రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున పురస్కారలతో గౌరవించాలని సూచించింది. పుస్తకాలను డిజిటలైజ్ చేయడం వలన రచయితకున్న కాపీ హక్కులు హరించిపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా గ్రంధచౌర్యం ప్రబలిపోతున్నదని, కాపీ హక్కుల పరిరక్షణ చర్యలు తక్షణం చేపట్టకపోతే పుస్తకం మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుందని ఆందోళన చెందింది. అంతేకాదు యునెస్కో ఈ రోజుని ప్రపంచ పైరసీ వ్యతిరేక దినంగా కూడా ప్రకటించింది.

యువత లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేటట్లుగా కార్యక్రమాలను రూపొందించాలని స్వఛ్ఛంద సంస్థలను కోరింది. సమాజాన్ని ప్రభావితం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమసమాజ నిర్మాణానికి కృషిచేసిన రచనల గురించి రచయితల గురించి తెలుసుకోవలసిన బాధ్యత యువతకు ఉందని యునెస్కో అభిప్రాయ పడింది. ప్రభుత్వాలు, స్వఛ్ఛంద సంస్థలు ఈ దిశగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా రచయితలకు, ప్రచురణకర్తలకు మనం సమర్పించే నిజమైన నివాళులని అభివర్ణించింది. యుకె లోను ఐర్లాండులోను ప్రపంచ పుస్తక దినం ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్ లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠశాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ (Readathon) అనడం విశేషం. అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్ లను నెట్ లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పిల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు. అయితే కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. భారతదేశం లో ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు దాఖలాలు లేవు. ఇది చాలా దురదృష్టకరం.

ప్రపంచంలోని అన్ని భాషల్లోని పుస్తకాలు ఇపుడు డిజిటలైజ్ చేయబడుతున్నాయి. పురాణేతిహాసాలు, కధలు, నవలలు, కవిత ఒకటేమిటి అన్ని రకాల సాహితీ ప్రక్రియలను అంతర్జాలంలో పొందుపరచడం ఒక రకంగా ఇది ప్రపంచ సాహితీ సంపదను శాశ్వతంగా భద్రపరిచే ప్రక్రియ అయినప్పటికీ.. రచయిత కాపీ హక్కులను కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. పుస్తక పరిశ్రమపై ఆధారపడిన లక్షల మంది మనుగడని కోల్పోతున్నారు. క్రమేణా పుస్తకం కనుమరుగై పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే.. ప్రపంచ పాఠకులారా పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం.
************
పుస్తకం.నెట్ లో శ్రీనిక గారి ఇతర రచనలను ఇక్కడ చదవొచ్చు.

గత రెండేళ్ళలో World Book Day నాడు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ (2009) మరియు ఇక్కడ (2010) చదవచ్చు.

You Might Also Like

2 Comments

  1. Gks Raja

    పుస్తక పఠనం

    ఏప్రిల్  23, అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాదిన్నర క్రితం ప్రచురించిన పోస్టును మళ్ళి ప్రచురిస్తున్నాను. సందర్భానుసారం బాపు గారి కార్టూన్ చూడకపోతే పుస్తకాల పండక్కి ముగ్గు లేనట్టే— అందుకే ఇది….పూర్తి ఆర్టికిల్ కోసం … http://gksraja.blogspot.com/2011/04/blog-post_25.html
    రాజా.

  2. సావిత్రి

    పుస్తక పఠనాన్ని వ్యసనం అనకూడదు. వ్యసనం అనే పదాన్ని చెడ్డ సందర్భాల్లోనే ఉపయోగిస్తాము.

Leave a Reply