కథాసాగరం-III

వ్రాసిన వారు: శారద
(ఈ సిరీస్ లో మిగితా వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు)
***********
మనుషులు చాలా విచిత్రమైన వారు. ఎన్నెనో ద్వైదీభావనలూ, పరస్పర విరుధ్ధమైన ప్రవృత్తులూ వారిలో (మనందరిలో!) కనిపిస్తాయి. తరచి చూస్తే తప్ప వాటి ఆనవాళ్ళూ, లోతులూ అర్ధం కావు.

ఉదాహరణకి మనమందరమూ చాలా వరకు మంచి వాళ్ళమే. కష్టంలో వున్న మనిషికి స్వాంతన వచనాలు పలకటం, వరదల్లోనో, మరేదో ప్రకృతి వైపరీత్యాలలోనో చిక్కుకున్నవారికి సాయ పడటం, ఏమాత్రం వీల్లేని పరిస్థితుల్లో కూడా న్యాయం కోసమో, మరేదో abstract సిధ్ధాంతంకొరకు పోరాడటమో, ఇవన్నీ మనం చేసే పనులే! కానీ నిజానికి మనందరిలో ఎంతటి దౌర్జన్యం దాగుంది? వేరే ఏ దారీ లేక మనమీద ఆధార పడిన వాళ్ళనీ, బ్రతుకు చేతిలో చావు దెబ్బ తిని లేవ లేకుండా పడి వున్న వాళ్ళనీ మనం ఎలా స్వీకరిస్తున్నాం? వాళ్ళతో మన ప్రవర్తన ఎలా వుంటుంది? ఇలాటి ప్రశ్నలు వేసుకుంటే కొన్ని సార్లైనా తలలు దించుకోక తప్పదు. తోటి మనుషుల మీద మనం నిరంతరంగా దౌర్జన్యం bullying చేయటంలేదంటే దానికి కారణం మనలో వున్న మంచీ చెడు విచక్షణా ఙ్ఞానమా లేక దౌర్జన్యం చేసి తప్పించుకోలేమన్న భయమా? ఈ వాయిదాలో అలాటి ఆలోచనలనీ, ప్రశ్నలనీ రేకెత్తించే రెండు కథలని పరిచయం చేస్తాను.

గురుదత్ “సాహెబ్ బీవీ ఔర్ గులాం” సినిమా చూసినప్పుడూ, మొపాసా రాసిన “బౌల్ ది స్యూ” కథ చదివినప్పుడూ ఒక లాటి దిగులు మనసంతా ఆవరించి రెండు రోజులు నిద్ర పట్టక బాధ పడ్డాను. అలాటి బాధే ఈ రెండు కథలూ చదివి అనుభవించాను. కథలో ఇంటెన్సిటీ (గాఢత) అన్నది పేజీలకి పేజీల వర్ణనలూ, ఉపన్యాసాలూ, ఉపదేశాలూ లేకుండానే ఎలా చేయ వచ్చో కథకులు నేర్చుకోవటానికైనా ఈ కథలు చదవాలి. ప్రపంచంలో గొప్ప కథలు అని ఎవరైనా సంపుటి వెలువరిస్తే అందులో తప్పక ఉండాల్సిన కథలు ఇవి.

అరి కాళ్ళ కింద మంటలు

శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఈ కథా కాలమెప్పుడో నాకంతగా గుర్తు లేదు కానీ, ఆయన చాలా కథల్లో లాగే వితంతు వివాహం ఇందులో మూల వస్తువు. మూల వస్తువు కంటే కథలో ఆయన నగ్నంగా చూపించిన మనుషుల స్వార్థమూ, తోటి మనిషిని తోడేళ్ళలా పీక్కు తినటానికి వెనుకాడని దౌర్జన్యమూ మనసులని కదలించి వేస్తాయి. అన్నిటికంటే ఆయన ఉపయోగించిన కథన విధానం- కేవలం సంభాషణలతోనే కథని నడిపించడం- చాలా గొప్ప ప్రక్రియ.

వీరేశలింగంగారి విధవా వివాహాలు చాలా ఊపుగా రాజమహేంద్రవరంలో జరుగుతున్న రోజుల్లో, ఒక బ్రాహ్మణ కుటుంబంలోని విధవరాలి కథ ఇది.. పుట్టింటికి అడపా దడపా వచ్చే అక్కలిద్దరూ, చెల్లాయీ, తమ్ముడూ, తల్లీ, అమ్మమ్మా, అందరూ ఆమె పాలిటి పిశాచాలే! ఆమె చాకిరీని దోచుకుందామనుకునే స్వార్థపరులే. ఏదో చిన్న విషయంలో ఎదురు తిరిగి మాట్లాడిందని ఆమెకి శిరోముండనం చేయించాలని పట్టు బడుతుంది అమ్మమ్మ!(తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది మనకి ఈ కాలంలో! ఆ రోజుల్లో ఎంత మంది ఆడ కూతుళ్ళ మనసులనీ జీవితాలనీ అర్థం లేని సంప్రదాయాలతో కాల రాసిందో సంఘం!) కూతురి మీద ప్రేమతో మొదట నిరాకరించినా మెల్లగా మెత్త బడతాడు ఆమె తండ్రి. ఆ రాత్రి ఇల్లు వదిలి పారిపోవాలని నిశ్చయించుకుంటుంది ఆమె. ఇల్లు వదిలి ఎటు వెళ్ళాలో తెలియక నిలబడ్న ఆమెని “పంతులు గారి దగ్గరికైతే డబ్బేమీ అక్కర్లేదు, రండమ్మా,” అని తీసికెళ్తాడు ఒక జట్కా మనిషి.

ముందు చెప్పినట్టు కథంతా కేవలం సంభాషణలతోనే నడుస్తుంది. ఆఖరి నాలుగైదు వాక్యాలు తప్ప. కానీ కథలో ఏ మాత్రం అస్పష్టత వుండదు సరికదా, మన ముందు మనుషులు నిలబడి మాట్లాడుతున్నంత సహజంగా అ(వి)నిపిస్తుంది. ఆ రోజుల్లో బ్రాహ్మల ఇళ్ళలో వాడే భాషా, వాక్యపు విరుపులూ వినిపిస్తాయి. ఇదే శైలి కాకపోయినా ఇదే భాష ఆయన చాలా కథల్లో వాడారు.

ఏమీ చేయలేని పరిస్థితిలో చిక్కుకుపోయిన ఒక నిస్సహాయురాలి గురించిన కథంతా చెప్తూనే ఆయన ఇచ్చిన ముగింపు, “చీకటిని తిడుతూ కూర్చోకు” అనే సందేశాన్నిస్తుంది. ఎవరో వచ్చి తన పరిస్థితి బాగు చేయలేరు,తనే తన పరిస్థితి బాగు చేసుకోవాలి అనే ఙ్ఞానం కంటే ఆత్మ ఙ్ఞానం ఎక్కడుంది?

చాలా కథల్లో ఆయన ఇల్లు పట్టి వుండే విధవరాళ్ళని చాలా నెగెటివ్ కోణంలో చూపించారు. సరైన విద్యా, తమకంటూ ఒక ఇల్లూ సంసారమూ, వ్యాపకమూ లేని మనుషుల వ్యక్తిత్వాలు ఎంతగా దిగజారిపోగలవో ఇంతకంటే స్పష్టంగా చెప్పలేము. అయితే కనీసం నాకు అలాటి స్త్రీల గురించి చదివినప్పుడు, కోపం కంటే జాలి కలుగుతుంది. What a waste of precious human resources, అనిపిస్తుంది.

“ఈ కాలం లో అలాటి విధవరాళ్ళూ లేరు, అలాటి పరిస్థితులూ లేవు, కాబట్టి ఇలాటి కథలకి కాలం చెల్లిపోయింది,” అనే అభిప్రాయమూ కలగొచ్చు. కానీ, ఒక కాలంలో వైధవ్యం ఒక నిస్సహాయత ఐతే ఇంకొక కాలంలో ఇంకొక నిస్సహాయత వుండొచ్చు. మనకెదురు చెప్పలేని పరిస్థితిలో వుండి మనమీద ఆధార పడి వుండే వాళ్ళతోటి మన ప్రవర్తనా, మన సంబంధాలూ ఎలా వుంటాయన్నది మాత్రం కాలాతీతం. స్వార్థపుపై రంగులు మారొచ్చు, కానీ లోపలి ఆత్మ మారదు కాదా?

చెప్పుల జత

మన ప్రవర్తనని నిర్దేశించేది మన సామాజిక పరిస్థితా, మన మనస్తత్వమా, ఆర్ధిక పరిస్థితా? బహుశా మూడూ అయి వుండొచ్చు. పేదరికం అనుభవిస్తున్న వ్యక్తి ప్రవర్తనా. మూడు పూటలా కడుపు నిండా తిండి తింటున్న వ్యక్తి ప్రవర్తనా ఒకే లాగెలా వుంటాయి? వుండవు. ఈ సంగతి మనకి బాగా తెలిసిందే అయినా నిజంగా ఆ నిజం మన కళ్ళ ముందు నిలబడ్డప్పుడు మాత్రం ఉలిక్కి పడతాం. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు రాసిన “చెప్పుల జత” కథ చదివినప్పుడు అలాగే ఉలిక్కి పడతాం. అంతే కాదు, పస్తులుంటున్న మనిషినించి కడుపు నిండిన వ్యక్తి లాటి ప్రవర్తనని expect చేసినందుకు సిగ్గు పడతాం కూడా.

పేదరికం పాపం కాదు, జబ్బు అంతకన్నా కాదు. మనం కనిపెట్టిన డబ్బుకి మనమే దాసులమై ఊడిగం చేస్తున్న పరిస్థితులలో కొందరు అనుభవించే శిక్ష. మనలో ఎంతమందిమి మన బంధు వర్గంలో కొంచెం పేద వారితో సత్సంబంధాలు పెట్టుకుంటాం? “పిసిని గొట్టులనీ”, “కనపడితే చాలు అప్పడుగుతారనీ,” “మేం విడిచి ఇచ్చిన బట్టలూ, పుస్తకాలతో చదువుకున్నారనీ”, ఈసడించే వాళ్ళమే ఎక్కువ.

సృష్టిలో ఏ ప్రాణికీ లేని ఈ డబ్బు పితలాటకం మన మెడకెందుకు చుట్టుకుందబ్బా? అది మన మధ్య వుండే సంబంధాలనీ, మన ఆలోచనలనీ అభిప్రాయాలనీ ఇంతగా ప్రభావితం చేయటం ఏమిటి, మన ఖర్మ కాకపోతే! లాటి ఆలోచనలొస్తాయి ఈ కథ చదివితే. ఈ కథని ఆయన రాసిందెప్పుడో నాకు గుర్తు లేదు కానీ నేను దాదాపు పదేళ్ళకింద చదివి వుంటాను. చాలా సరళమైన భాషలో, చెప్పాల్సిన విషయం చెప్పకుండానే చెప్పటం ఎలాగో ఇలాటి కథలు చదివితే తెలుస్తుంది.

తిండికోసం మొహం వాచి ఎక్కడ ఏ కార్యక్రమానికైనా హాజరవుతూ బంధు వర్గంలో చిన్న చిన్న దొంగతనాలు చేసే వెంకట్రావు కథ ఇది. కథలో ఎక్కడా వెంకట్రావు పరిస్థితుల గురించి పెద్ద వర్ణలు వుండవు, పెద్ద జస్టిఫికేషనూ వుండదు. కానీ ఒక నిస్స్సహాయుడై, బంధువుల్లో పరువు గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో వున్న కుటుంబీకుణ్ణి తలచుకుంటే గుండె తడవక మానదు. చాలా చేయి తిరిగిన కథకులూ, మనుషుల మనస్తత్వాలని కాచి వడబోసిన మానవతా వాదులే అలా రాయగలరు.

కథలోకెళ్తే ఒకానొక వూళ్ళో ఒక బాగా డబ్బున్న బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమానికి హాజరవుతాడు కథకుడు. కథంతా ప్రధమ పురుషలోనే నడుస్తుంది. అక్కడ ఆయనకి వెంకట్రావు అనే వ్యక్తి తారసపడతాడు. వెంకట్రావూ అదే కార్యక్రమానికి వొచ్చిన బోలేడు మంది బంధువుల్లో ఒకడు. అయితే ఎవ్వరూ అతన్ని పెద్దగా గౌరవిస్తున్నట్టో, పలకరిస్తున్నట్టో అనిపించదు. అతని కూడా ఒక ఆరేడేళ్ళ అమ్మాయి వుంటుంది. కథకుడు వివరాలడిగితే, బంధువు రామేశం చాలా హేళనగా చెప్తాడు అతని గురించి.

వెంకట్రావొక పల్లెటూళ్ళో ఏదో వొక ఉద్యోగం “వెలగ బెడుతున్నాడు.” భరించలేని దారిద్ర్యమూ, తీరని సమస్యలూ అతన్ని వెన్నంటి వున్నాయి. ఎక్కణ్ణించి ఏ ఆహ్వానం వచ్చినా కుటుంబంతో సహా హాజరవుతాడు. నాలుగురోజుల తిండి ఖర్చైనా తప్పుతుందని. అంతేనా? వొచ్చిన ఇంట్లోంచో, బంధువుల దగ్గర్నించో ఏదో వొక వస్తువు కొట్టేస్తాడు. అతడు వొచ్చాడంటే జనాలు వాళ్ళ వస్తువులు భద్ర పరచుకుంటారు. ఇదీ రామేశం చెప్పిన మాటల సారంశం.

కార్యక్రమం ముగిసి అందరూ ఇళ్ళకి బయల్దేరే రోజు కథకుని కొత్త చెప్పుల జత మాయమౌతుంది. ఈ విషయం ఆ నోటా ఆ నోటా వచ్చిన బంధువులందరికీ తెలిసిపోతుంది. రామేశం కథకుని దగ్గరికొచ్చి “ఇప్పుడొక తమాషా చేస్తాను చూడు!” అని, వెంకట్రావుని ఏదో మిషమీద బయటికి పంపిస్తాడు. ఆయనా ఆయన కూతురూ బయటికి వెళ్ళగానే ఆయన చేతి సంచి వేసిన తాళం తెరిచి అందులో వెతుకుతారు. అందులో చెప్పుల జతా, తినుబండారాలూ దొరుకుతాయి. చెప్పుల జత కథకుడు తీసుకొని తినిబండారాలుంచేస్తారు. బయటికి వెళ్ళిన వెంకట్రావున్ తిరిగొచ్చి అందరితోబాటు భోజనం ముగించి కథకుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు.

నిజానికి ఈ కథలో దొంగతనం చేసినందుకు వెంకట్రావు మీద కోపం రావాలి మనకి. కానీ రాదు సరి కాదా, జాలి కలుగుతుంది. కథకుడూ అదే చెప్పి కథ ముగిస్తాడు, “మనసంతా అలజడితో నిండిపోయింది”, అంటూ.

నిజమే! మనసంతా అలజడితో నిండిపోయింది!

You Might Also Like

3 Comments

  1. జె. యు. బి. వి. ప్రసాద్‌

    ఆరి సీతారామయ్య గారి కామెంటు చదివాను. నేనా కధ చాలా సార్లు చదివాను. చదివిన ప్రతీ సారీ, ఆ వితంతు వివాహం జరిగినందుకు చాలా సంతోషించే వాడిని. ఒక సంస్కరణ జరిగిందని ఆనందించే వాడిని. ఆ సంస్కరణ అప్పుడు అలా ప్రారంభం అయి వుండక పోతే, ఇప్పుడు వితంతువుల పరిస్థితి చాలా ఘోరంగా వుండి వుండేది.

    ఆయన, “చాకిరీ మారలేదు. చేయించుకునేవాడు మారాడు.” అని అన్నారు. ఒప్పుకుందాం. అయితే, ఇది ఆ అమ్మాయికి ఆ పరిస్థితుల్లో ఏమన్నా అభివృద్ధి కరమైన విషయమేనా, కాదా? అది మాత్రమే పరిశీలించాలి.

    ఆ వితంతువులకి పెళ్ళి జరిగే పద్ధతిని విమర్శించారు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటీ? పెళ్ళి చూపులు జరగకుండానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఓ నాలుగైదు పెళ్ళి చూపులు జరగకుండానే, సంబంధాలు కుదురుతున్నాయా? మనం ఎక్కువగా జరిగే సంఘటనల గురించి మాట్టాడాలి ఇక్కడ. ఇలా జరుగుతున్న పెళ్ళిళ్ళలో, ఆడవాళ్ళు పుట్టింటి నించీ అత్తవారింటికి వెళుతున్నారు. మహా అయితే, కొంత మంది ఉద్యోగాలు చేస్తారు. ఎవరికి ఇంటి పని తప్పుతోందీ? తమ కుటుంబం కోసం పని చేసుకోవడం, వేరే విషయం పూర్తిగా.

    ఈ కధలో పెద్ద చదువూ, బయట ఉద్యోగం లేనమ్మాయి, పెళ్ళయ్యాక ఎవరికి పని చేస్తుందీ? తనకీ, తన భర్తకీ, తన పిల్లలకీ. ఆమెకి ఒక సంసారం ఏర్పడుతుంది. ఆ సంసారానికి ఆ అమ్మాయి పని చేస్తుంది. దీనర్థం ఆడవాళ్ళందరూ అలా వుండాలని నేనడం కాదు. ఆ పరిస్థితిలో వున్న ఆ అమ్మాయికి అది అభివృద్ధి కరమే.

    సాధారణంగా, ఒక మగ మనిషికి ఒకే గదిలో బోలెడు ఆడవాళ్ళని ఎవరూ చూపించరు. ఆ పద్ధతికి ఎక్కువ మంది ఇష్టపడరు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగాయని రాశారో, సీతారామయ్య గారు చెబితే, అందరం చదివి తెలుసు కోవచ్చు. సాధారణంగా ఒక అమ్మాయికి, ఒక అబ్బాయిని మాట్టాడు కుంటారు. వాళ్ళు ఒప్పుకునేటట్టు కాస్త చూసుకుంటారు. ఉద్యోగం ఇచ్చిన వాడు, పీకించేయగలడు కూడా అనే భయంతో, ఆ మగ వాళ్ళు కూడా కాస్త సవ్యంగా సంసారం చేయడానికే ఇష్ట పడతారు. ఆ వితంతువుకి అలా పెళ్ళి చేయడం, పెనం మీద నించి పొయ్యి లోకి తోసెయ్యడానికి కాదు కదా? ఆ రోజుల్లో ఆ విధమైన వితంతు వివాహాలు అలా ఘోర పరిణామాలకి దారి తీసి వుంటే, ఆ రోజుల్లో ఆ వివాహ వ్యతిరేకులు ఆ విషయాలని బాగా ఉపయోగించుకునే వారే, తమ ప్రచారానికి. అలా జరగలేదంటే, అవి అంత ఘోరంగా లేనట్టేగా? అది గ్రహించు కోవాలి. ఎందుకంటే, అలా ఘోరంగా జరిగిన విషయాలు తాను ఎక్కడా చదవలేదని, సీతారామయ్య గారే అన్నారు కూడా. ఒక వేళ, ఆ రోజుల్లో ఆ విధంగానే, ఆ వితంతు వివాహాలు జరిగాయన్నా, అది అప్పటికి అభివృద్ధికరమైన విషయమే. ఎంతో మంది వ్యతిరేకులు, దౌర్జన్యంగా వాటిని ఆపాలనీ, ఆ వితంతువులని బానిసలని తీసుకు పోయినట్టు తీసుకు పోవాలనీ ప్రయత్నిస్తారు. అది ఎంతో రహస్యంగా చేయడానికి చూస్తారు. అప్పటి పరిస్థితులు అప్పటికి వుంటాయి. వాటిని ఇప్పటి పరిస్థితులతో పోల్చుకుని, తక్కువ చేయనవసరం లేదు. ఆ నాడున్నది కూడా ఈ మగాళ్ళే. ఇప్పుడు మాత్రం జరిగే పెళ్ళిళ్ళన్నీ విజయవంతం అవుతున్నాయా? ఆ రోజుల్లో కూడా కొన్ని నిలబడి వుండక పోవచ్చు, ఈ రోజుల్లో లాగే. కొంత మందన్నా సుఖంగా వుంటారు, ఆ రోజుల్లోనూ, ఈ రోజుల్లోనూ. ఆ మార్పు చూపించారా రచయిత. అది అలాగే జరగాలి. దాన్ని అర్థం చేసుకోవాలి.

    1. పంచ భూతాలకి (అక్కచెల్లెళ్ళూ, తమ్ముడూ, తల్లీ, అమ్మమ్మా) చాకిరీ చేసే బదులు, ఒక భూతానికి (భర్తకి) చాకిరీ చెయ్యడం అభివృద్ధి కరమే.
    2. పెద్ద భూతం (అమ్మమ్మ) శిరో ముండనం చేయించ బోతోంది. ఈ కొత్త భూతంతో (భర్తతో) ఆ పర్తిస్థితి తప్పింది. ఇది అభివృద్ధి కరమే.
    3. కట్టూ, బొట్ల విషయంలో కూడా మార్పు వస్తుంది, ఆ అమ్మాయి కిష్టమైనట్టు.
    4. కొత్త భూతం (భర్త) బయట ఉద్యోగం చేస్తూ, భార్యని కాస్త ప్రేమగా చూస్తే, ఆ అమ్మాయికి ఆ ఇంటి పని కొంచెం సహించ గలిగేది గానే వుంటుంది.

    ఆ సమాజ పరిస్థితుల్లో, అటువంటి వాతావరణంలో వున్న ఆ అమ్మాయికి అది కచ్చితంగా అభివృద్ధే. బానిస యుగంలో బతికిన బానిస, పెట్టుబడి దారీ సమాజంలో కార్మికుడవడం తప్పకుండా అభివృద్ధే. అయితే, ఆ కార్మికుడికి శ్రమ దోపిడీ తప్పదను కోండీ. అటువంటి ఇంట్లోంచి బయటకి వచ్చిన అమ్మాయికి, “ప్రేమతో పెళ్ళి చేసుకోవడం” అనేది చాలా ఆదర్శవంతమైన విషయమే అయినా, సాధ్యమయే పని కాదు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా, ఏ రోజుల్లో అయినా, కొంచెం సంస్కరణ భావాలు కలవారే, అభివృద్ధికరంగా వుంటారు. ఆ తాత్కాలిక పరిష్కారాలని కొట్టి పారవేయలేము. ఆ కధ లోని ముగింపు కచ్చితంగా అభివృద్ధి కరమైన విషయమే.

    కాబట్టి, ఆ కాల మాన పరిస్థితులని బట్టీ చూస్తే, ఆ పరిష్కారం అప్పటికి సరైనదే.

  2. లలిత (తెలుగు4కిడ్స్)

    @ఆరి సీతారామయ్య: వీరేశ లింగం గారు, గురజాడ గారు ఇద్దరూ నాకు తెలిసిన పాఠ్య పుస్తకాల జ్ఞానం వల్ల ఆదర్శమూర్తులుగా అనిపిస్తారు నాకు.
    ఎప్పుడో ‘ఈమాట’లో చదివిన వ్యాసాల ప్రకారం వీరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు అర్థం అయ్యింది.
    నేను వీరేశలింగం గారి స్వీయ చరిత్ర సగం పైగా అనుకుంటా చదివాను, TeluguThesis లో.
    బాగా అనిపించింది.
    ఎవరూ పరిపూర్ణులు కాదనుకున్నా, ఇప్పుడు మీ వ్యాఖ్య చదివితే బాధేసింది. ఇది మనం ఇప్పటి పరిస్థితుల్లోంచి వెనక్కి చూసుకుని ఆయన కృషిని oversimplify చెయ్యడమా అని అనిపిస్తోంది నాకు తెలిసిన పరిమితమైన విషయ జ్ఞానంతో ఆలోచిస్తుంటే.
    వీరిద్దరి గురించీ తెలుసుకునేందుకు వీరు రాసినవి, వీరి గురించి రాసినవి పుస్తకాలు, ఇంకెమైనా ఉపయోగపడే వ్యాసాలు మొదలైన వాటి గురించి గురుంచి చెప్పగలరు.

  3. ఆరి సీతారామయ్య

    పోయిన సంవత్సరం ఈ కథను ఇంకొక సారి చదివాను. కథనం, సంభాషణలు మీరు చెప్పినట్లుగానే చాలా బాగున్నాయి. కాని ఈ వితంతువుకు శ్రీపాద గారు చూపించిన మార్గం నాకు నచ్చలేదు.

    వీరేశలింగం గారు విధవా వివాహాలు చేసింది పంధొమ్మిదో శతాబ్దం చివర్లో. శ్రీపాద గారు కథలు రాసినప్పటికి వీరేశలింగం గారి పద్ధతి అందరికీ తెలిసిందే. ఒక గదిలో వితంతువులనందరినీ కూర్చోబెట్టటం, ఒక మగవాణ్ణి తీసుకొచ్చి వాళ్ళను చూపించి వాళ్ళలో ఎవరు నచ్చారో చెప్పమనటం, పెళ్ళి చేసుకున్నందుకు అతనికి డబ్బో, ఉద్యోగమో, ఏదో లంచంగా ఇవ్వటం – ఇదీ ఆయన చేసింది. అలా వివాహాలు చేసుకున్న వితంతువుల జీవితాల గురించి ఎక్కడా నేను చదవలేదు.

    పుట్టింట్లో ఈ అమ్మాయి అందరికీ చాకిరీ చెయ్యటానికి మాత్రం పనికొచ్చింది. “అక్కచెల్లెళ్ళూ, తమ్ముడూ, తల్లీ, అమ్మమ్మా, అందరూ ఆమె పాలిటి పిశాచాలే!” నిజమే. కాని వీరేశలింగం గారు చేసిన పెళ్ళి ఆ అమ్మాయి జీవితాన్ని మెరుగుపరిచిందని చెప్పలేను. చాకిరీ మారలేదు. చేయించుకునేవాడు మారాడు. అంతే.

Leave a Reply