నాకు దొరికిన అరుదైన పాతపుస్తకాలు

రాసిన వారు: కౌటిల్య
***********
నేను ఉండేది గుంటూర్లోనే అయినా సాధారణంగా పుస్తకాలు కొనటానికి విజయవాడ పరిగెడుతుంటా. కాని నిన్న ఒకసారి ఏదో అలా వెళ్ళా, ఆదివారం సంతకి… వెళ్ళొచ్చాక అర్థమైంది,ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యానో! ఎన్నో అరుదైన పుస్తకాలు చాలా తక్కువ ధరలకే దొరికాయి…అప్పుడనిపించింది, “ఇన్నేళ్ళల్లో కనీసం నెలకో ఆదివారం వెళ్ళొచ్చినా ఎన్నో మంచి పుస్తకాలు సంపాదించగలిగేవాడిని కదా!”అని…….అక్కడ నాకు దొరికిన కొన్ని అరుదైన పుస్తకాలను, వాటి వివరాలను ఇక్కడ మీతో పంచుకుందాం అనిపించింది…

౧)మొదటిది హరికథా పితామహుడుగా మనందరకీ ఎఱుకైన ఆదిభట్ట నారాయణదాసు గారు రాసిన “నవరస తరంగిణి”. ఈ పుస్తకం ముద్రణా కాలం 1922 అని ఉంది…ఎన్నో ముద్రణ అని గాని, ఎవరు పబ్లిష్ చేశారు అనిగాని లేదు….ధర మాత్రం పది రూపాయలు అని ఉంది.(అందుకే షాపతను మూడువందలని చెప్పినా కొనేశా… :)..)…ఈ పుస్తకాన్ని వారు విజయనగరం గాన పాఠశాలకి ప్రిన్సిపాలుగా చేసినప్పుడు రాసినట్లుగా ఉంది.దీన్ని విజయనగరం రాజా వారికి అంకితమిచ్చారు… ఇక ఈ పుస్తకం కాళిదాసు,షేక్స్ పియర్ ల సాహిత్యాని విమర్శన గ్రంథం అని చెప్పుకోవచ్చు…వాళ్ళు పలికించిన నవరసాల్ని, విమర్శనాత్మకంగా చక్కటి పద్యాల రూపంలో రాశారు ఆదిభొట్ల వారు…. వారు రాసిన చక్కటి యాభై పేజీల పీఠికతో మొదలై, నవరసాల్ని చిప్పిస్తూ కఠినపదార్థాల పట్టికతో ముగుస్తుంది. ఆదిభొట్లవారు రాసిని షేక్స్ పియరు నాటకాల తెలుగుసేత ఈ పుస్తకానికి అదనపు మెఱుగు…ఒక పేజీలో ఆ కవుల అసలు రచన, ఎదురు పేజీలో దాసుగారి పద్యాలు..ఇలా సాగిపోతుంది….ఈ పుస్తకం అవిల్రెడీ మిత్రులొకరు రిజర్వు చేసేసుకున్నారు..:)..

౨) రెండవది, “భట్టు – విద్యలకే భట్టు – ఆదిభట్టు” శ్రీ నారాయణ దాసు శ్రీ శారదావతారము ( స్వయం లేఖనము) అన్న పుస్తకం….ఈ పుస్తకం విషయం సరిగ్గా నాకు అర్థం కాలేదు..చదవాలి, చదివాక ఓ సమీక్ష రాస్తాను…లేఖిక: శ్రీమతి ఉపాధ్యాయుల రాజరాజేశ్వరీదేవి అని ఉంది…ఈ స్వయంలేఖనం అన్నది ఒక సాహిత్య ప్రక్రియలా ఉంది..రాయబడింది అరవైల్లోలా ఉంది..ఈ పుస్తక ముద్రణా కాలం మాత్రం ఎనభైతొమ్మిది…. నేను కొన్న ధర ఇరవై రూపాయలు..

౩)మరొక అపురూపమైన పుస్తకం “నానార్థ రత్నమాల” సటీకము.. వావిళ్ళ వారిది. ముద్రణా కాలం 1933.. కవి “ఇరుగప దండనాథుడు”..అమరకోశాదుల వంటిది ఈ పుస్తకం…ఒక్కొక్క సంస్కృత పదానికి వచ్చే నానార్థాలు వివరించబడ్డాయి… ఆరు కాండలతో అద్భుతంగా ఉంది..ఏకాక్షర, ద్వ్యక్షర,త్ర్యక్షర,చతురక్షర,సంకీర్ణ,అవ్యయ కాండలు…..పుస్తకం అంతా చెదలుపట్టి, బొక్కలు పడి శిధిలావస్థలో ఉంది….నేనుకొన్న ధర నూటయాభై రూపాయలు..

౪)మరోటి, “సారంగు తమ్మయ్య” గారి “వైజయంతీ విలాసం” అనబడు ” విప్రనారాయణ చరిత్రము”.. వావిళ్ళ వారి ముద్రణ..1971..నేను కొన్న ధర ఎనబై రూపాయలు..

౫) రఘునాథ నాయకుడు రాసిన “వాల్మీకి చరిత్రము”.. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ప్రచురణ..కాలము 1968..పరిష్కర్త డా.బి.రామరాజు…ఈ పుస్తకం రెండు ప్రతులు దొరికాయి..ఒకటి శిధిలావస్థలో ఉంది.ఒకటి బాగానే ఉంది…ఆసక్తి ఉన్నవాళ్ళు అడిగితే ఒక కాపీ ఇవ్వగలను…ఈ పుస్తకం ముందుమాట చదివితే ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది…అప్పట్లో, అకాడమీ వాళ్ళు మొత్తం ఇరవై ఏడు ప్రబంధాలనీ, భారత భాగవతాలనీ, ఇతర పురాతన తెలుగు సాహిత్యాన్నీ మొత్తం యాభై సంపుటాలుగా వేసినట్టు ఉంది….ఒక్కొక్క సంపుటం ౨౦౦ పేజీలతో, క్యాలికో బైండుతో, నలభై పేజీల సమగ్ర పీఠికతో, ఒక్క రూపాయి ధరతో ముద్రించినట్టు ఉంది..అవన్నీ గనుక దొరికితే తెలుగు సాహిత్యం అంతా మన దగ్గర ఉన్నట్టే…:)..నేను కొన్న ధర ఇరవై రూపాయలు.

౬) “శ్రీమదాంధ్ర మహాభారతము”..భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు….ఆనందాశ్రమగ్రంథ రత్నమాల అని ఉంది..వేమూరు-వేంకటకృష్ణమ సెట్టి అండ్ సన్స్, మద్రాసు వారు పబ్లిషర్సు..ముద్రణా కాలం 1910.. తేవప్పెరుమాళ్ళయ్య గారిచేత పరిశోధితం అని ఉంది…శుద్ధప్రతి మాత్రమే…అర్థ తాత్పర్యాలు లేవు…పెద్ద బౌండు పుస్తకం….నేను కొన్న ధర ఎనభై రూపాయలు…

౭)కళ్యాణి గ్రంథమండలి,విజయవాడ వారిచే వెయ్యబడ్డ “భాస మహాకవి” “చారుదత్తమ్” సంస్కృత నాటకం…ముద్రణా కాలం 1963..పరిష్కర్త కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి గారు…టీకలేదు..ధర నలభై రూపాయలు…

౮) ఇంకా వావిళ్ళ వారి “శివానందలహరి” తెలుగు టీకాతాత్పర్యం మరియు వ్యాఖ్యానంతో, “ప్రభావతీ ప్రద్యుమ్నం” (పింగళి సూరన, టీకా తాత్పర్యాలు లేవు) ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు.

౯)ముక్కు తిమ్మన “పారిజాతాపహరణం”…వేదం వారి పబ్లికేషన్స్…టీకా తాత్పర్యాలు లేవు…ధర పదిరూపాయలు… 🙂

౧౦)ఇంకా విశ్వనాథ వారివి చాలా పుస్తకాలు దొరికాయి….భ్రష్టయోగి,గిరికుమారుని ప్రేమగీతాలు,ప్రద్యుమ్నోదయం,అల్లసానివాని అల్లిక జిగిబిగి… ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి..కాబట్టి ఎవరన్నా ఇంట్రస్టు ఉన్నవాళ్ళు కావాలంటే ఇస్తాను….వేయిపడగలు రెండు పాత ప్రతులు కూడా దొరికాయి..చక్కగా పెద్ద అక్షరాలతో, బైండు చేసి ఉన్నాయి..ఒక్కోటీ నూట యాభై అన్నాడు…మరో మాట లేకుండా కొనేశా….. :)…కొన్ని నవలలు కూడా దొరికాయి..మిహిరకులుడు, దంతపుదువ్వెన…ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి…ధర ఒక్కోటి పది రూపాయలు.. :)…

౧౧)మూడు అట్టలు లేని చారిత్రిక నవలలు దొరికాయి…మొత్తం ఇరవై రూపాయలకి ఇచ్చాడు.. :)…రచయితలెవరో తెలియలేదు…ఇంటికొచ్చి గూగులిస్తే రెంటి వివరాలు, వాటి విలువ తెలిశాయి…ఒకటి మునిమాణిక్యం నరసింహారావు గారి “వక్రరేఖ”(1931), రెండవది ధూళిపాళ శ్రీరామమూర్తిగారి “భువనవిజయం”….నాకు ఇంత వరకే తెలిశాయి..ఇంకా వివరాలేవన్నా తెలిస్తే తెలుపగలరు….”సువర్ణవాహిని,విధివిలాసం” మూడో పుస్తకం…దాని వివరాలు తెలియలేదు…

You Might Also Like

28 Comments

  1. sravani

    భారవి కిరాతార్జునీయమ్ this book i want this in telugulo pl

  2. Raghuramam Brahmandam

    సర్ , మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి లేదా 9848896404 కాల్ చేయండి. ఆదిభట్ల Naarayana దాసుగారి పుస్తకం , వారిమీద వున్నా ఇతర పుస్తకం నాకు ఇప్పించండి( అసలు లేదా ఫోటో కాపీ లేదా పిడిఎఫ్).ధన్యుయేల్ము. కనీసం , మీ లాంటి సాయం దొరుకుతోంది.
    నమస్కారములు.

  3. J.Maitreya

    అయ్యా,
    మీ అభిరుచి చాలా బాగున్నది. మీవద్దనున్న శివానంందలహరి (వావిళ్ళ వారిది) pdf file నాకు పంంపగలరా? నా email address: maitreyajonnalagadda@gmail.com మీ సహాయానికి నా కృృతజ్ఞతలు.

  4. ananth

    మీ సేకరణ అద్భుతం నేను ఉండే కర్నూల్లో ఇక్కడే ఇవి తెలియదు నానార్థ సంగ్రహాలకై వెతుకుతుంటే మీ రత్నమాల కనిపించింది దాని పిడిఎఫ్ కాపీ వీలయితే నా ఈ మెయిలుకు దయచేసి పంప గలరా ప్లీజ్

  5. basava

    chanakya arthasasthra books ekkada dhorakuthayo cheppandi

  6. కౌటిల్య

    శ్రీకాంత్ గారూ, నాకు దొరికితే తప్పకుండా తీసిపెడతానండి…ఆ పుస్తకం గురించి మరిన్ని వివరాలు తెలుపగలరా..రచయిత,కాలం..

    మురళీధరరావు గారూ, నమస్కారం…తప్పకుండా అండీ..నా దగ్గరైతే లేవు..దొరికితే తప్పకుండా తీసిపెడతాను,,

  7. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ కౌటిల్య గారికి,

    నమస్కారం. మీరు సేకరిస్తున్న పుస్తకాల వివరాలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. బమ్మెర పోతనగారి శ్రీ మహాభాగవతం 1925కి పూర్వపు ముద్రణలు మీవద్ద ఏవైనా ఉన్నాయా? మీరెక్కడైనా చూశారా? దయచేసి చెప్పండి.

    భవదీయుడు,
    ఏల్చూరి మురళీధరరావు, న్యూఢిల్లీ

  8. Sreekanth

    “సిద్దాంత శ్రుంగేరి” గ్రంథము ఎక్కడ దొరుకుతుందో తెలుపండి. ధన్యవాదములు

  9. Nagaraju.M

    Sir, i dont know who you are but your collection and way of expressing your thoughts are awesome and these efforts shows us your commitment towards reading and Sahitya Sekharana. Its nice to meet you sir. Keep it up and all the best sir.

  10. p shiva

    koutilya gaaru,

    i am also a native of guntur. your book collection and interest are very very good. my email. pshiva9090@gmail.com. please give ur email.
    i will be very glad to meet persons who like books .

    shiva

  11. SIVARAMAPRASAD KAPPAGANTU

    @cbrao:

    రావుగారూ, విజయవాడలో గాంధీనగర్ అలంకార్ సినిమా కూడలిలోనూ, అక్కడే ఉన్న వంతెన దాటి కుడిపక్కకు తిరిగి కొంత దూరం అక్కడ ఉన్న రెడీమేడ్ దుస్తుల దుకాణాలు దాటుకుని వెడితే పుస్తక దుకాణాలు ముఖ్యంగా ఆదివారం రోజున పుస్తకాల సందడి బాగా ఉంటుంది. అనేక మంది పుస్తక ప్రియులను కలుసుకోవచ్చు.

  12. M.V.Ramanarao

    read about old boosks.Thanks for info.vyjayantivilasam isavailable andinEmescopaperbacks.I want Sisupalavadha and Kiratarjuneeya m with Telugu artham and tatparyam.I am notableto procure them.Can you help?withgreetings ;ramanarao.muddu

    1. MADAN GOPAL

      Kiratarjuneeyam Emesco lo dorikuthundi.
      Cost MRP Rs. 300/-

  13. Radha Krishna

    chala baaga unnayandi mee collections. good

  14. కౌటిల్య

    “శుకసప్తతి కథలు” వివరాలు గూగులిస్తే దొరికాయి.:)..రచయిత కొవ్వలి నరసింహారావు గారు, ముద్రణాకాలం 1937…

  15. కౌటిల్య

    ఇవ్వాళ్టి మా ఆదివారం సంతలో నా కలెక్సను……:)
    ౧) పద్మపురాణం ఉత్తరఖండము -తెలుగు- సింగనామాత్య విరచితం – ముద్రణా కాలం: 1898, అంటే నూట పన్నెండు సంవత్సరాల క్రితం పుస్తకమన్నమాట! 1847 ప్రథమ ముద్రణ అని ఉంది. తరంగిణీ ముద్రాక్షరశాల వారిచే ప్రచురణ…ధర: ముప్ఫై రూపాయలు.

    ౨)భారవి కిరాతార్జునీయమ్ – మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యతో – తొమ్మిది సర్గలూ ఉన్నాయి – వావిళ్ళ వారిది – 1938- ధర: ముప్ఫై రూపాయలు.

    ౩)దణ్డి దశకుమారచరితమ్, పూర్వ పీఠికా – వేదం వెంకటరాయశాస్త్రి గారి ఆంధ్రానువాదంతో – వేదం వారిదే ముద్రణ – 1977 – ధర: నలభై రూపాయలు.

    ౪) వామన చరిత్రము(పోతన భాగవతం, అష్టమ స్కంధము), సటీకా తాత్పర్యము – వావిళ్ళవారిది – 1969 – ధర: నూట పాతిక.

    ౫) కుచేలోపాఖ్యానం(పోతన భాగవతం, దశమ స్కంధము), సటీకాతాత్పర్యము – వావిళ్ళ వారిది – 1966 – ధర: యాభై.

    ౬)విద్యాధర కవి విరచిత “ఏకావళి” అను అలంకారశాస్త్ర గ్రంథము, మల్లినాథసూరి తరళ వ్యాఖ్యానంతో, మాధవరామ శర్మ గారి ఆంధ్ర వ్యాఖ్యతో – 1974 – అభినవ భారతి, గుంటూరు వారి ముద్రణ – చాలా అరుదైన పుస్తకం – ధర: ౩౦.

    ౭)ఉద్ధవగీత(వ్యాస భాగవతం, ఏకాదశ స్కంధము), ఆంధ్రానువాదంతో – గౌడీయ మఠం వారి ముద్రణ – 1976 – ధర: వంద రూపాయలు.

    ౮)శుక సప్తతి కథలు(వచన కథలు) – శ్రీకృష్ణా బుక్ డిపో, మదరాసు – రచయిత పేరులేదు – ముద్రణాకాలం కూడా తెలియట్లేదు, బహుశా 1940 ప్రాంతాల్లో అయి ఉండొచ్చు – ధర: పదిహేను రూపాయలు.

    ౯)నోరి నరసింహ శాస్త్రి,”కర్పూరద్వీప యాత్ర” – మన “నార్నియా” సినిమాలని తలదన్నే పిల్లల నవల – 1960 – అర్జెంటుగా ఈ పుస్తకం చదివేసి ఓ బుజ్జి సమీక్ష రాయాలి…:)…ధర: పదిహేను రూపాయలు.

    ౧౦)ముదిగొండ శివప్రసాద్, “ఆవాహన” – రెండు భాగాలు, వరసగా ఆగష్టు, సెప్టెంబరు 1977 లో విజయా వాళ్ళు వేశారు – మొన్న హైదరాబాదు బుక్‍ఫెస్ట్ లో అక్షరాలా నూట ఇరవై పెట్టి కొన్నా..:(….ఇక్కడ ధర: పది రూపాయలు………వాఆఆఆఆఆఆఆఆ…:(…..(ఎవరికన్నా అరువు కావాలంటే ఇస్తాను).

    ౧౧) దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో నాటికలు – విశ్వోదయ వాళ్ళ ప్రచురణ – 1965 – ధర: నలభై.

    ౧౨) లత, “వనకిన్నెర” నవల – వంశీ,విజయవాడ వారి ప్రచురణ – 1964 – ధర: పాతిక రూపాయలు.

    ౧౩)రామాయణ రత్నమాల – వాల్మీకి రామాయణానికి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి సరళ వ్యాఖ్యానం – చాలా మంచి పుస్తకం – టిటిడి వారి ప్రచురణ -1983 – ధర: ఇరవై.

    ౧౪) చల్లా రాధాకృష్ణశర్మ గారి “విమలాదిత్య విజయం”, కొలకలూరి ఇనాక్ గారి “మునివాహనుడు” – ఒక్కోటీ పది పది రూపాయలు.
    ౧౬) బాల సాహితీసుధ పేరుతో మారుతీ పబ్లికేషన్స్ వాళ్ళూ వేసిన సంస్కృత “వేణీసంహార” నాటకానికి తెలుగుసేత,రెండవ భాగం- రచయిత, నుదురుమాటి వెంకటరమణ శర్మ – 1979 – ధర: ఐదు రూపాయలు.
    ౧౭) ఆది శంకరాచార్య విరచిత “దక్షిణామూర్తి స్తోత్రం”, సురేశ్వరాచార్య విరచిత మానసోల్లాస వ్యాఖ్యా సహితం, ఆంధ్ర టీకా తాత్పర్య సహితం – స్వామి నారాయణానంద సరస్వతి, స్వర్గాశ్రమం,హృషీకేశ్ చే ప్రచురితం – ధరః ఎనభై.
    ౧౮) విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథ మాల లో పదవ నవల “హెలీనా” – ధరః ఇరవై.

    1. saripalli venkata shastry

      భారవి కిరాతార్జునీయమ్ this book i want to buy can i get this one more thing i want is MRUTHUKATIKAM’ If possible pl tell us so tht i can buy this also

  16. కౌటిల్య

    మొన్న మా ఆదివారం సంతలో నాకు దొరికిన పాత పుస్తకాలు
    ౧.వావిళ్ళ వారి పెద్దబాల శిక్ష- 1847 ప్రథమ ముద్రణ, నేను కొన్నది 1916 edition,reprinted in 1949; cost:300rs..అద్భుతంగా ఉంది పుస్తకం.
    ౨.భానుమతి కథానికలు – ఎమెస్కో వాళ్ళది – 1965 – పాలగుమ్మి పద్మరాజు గారి పీఠికతో – ధరః ఇరవై రూపాయలు

    ౩.ఉత్తర హరివంశము, నాచన సోమనాథుని కావ్యం – వావిళ్ళ వారిది – శ్రీయుతులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారిచే పరిష్కృతం – 1921 – ధరః నలభై రూపాయలు. (ఈ కావ్యం నా దగ్గర అవిల్రెడీ ఉంది. ఎవరన్నా ఉత్సాహవంతులు కావాలంటే ఇవ్వగలను..)

    ౪.భారతాభారత రూపక మర్యాదలు – వేదం వారిది – 1940 – ధరః ఇరవై

    ౫.భర్తృహరి సుభాషితాలు(సంస్కృత శ్లోకాలు) (ఏనుగు లక్ష్మణకవి పద్యాలు మరియు తాత్పర్యంతో) – బాలసరస్వతీ బుక్ డిపో – 1986 – ధరః ఇరవై.

    ౬.ఆంధ్ర మహాభారతం – ఉద్యోగ పర్వం – సాహిత్య అకాడెమీ సిరీస్ లోది – 1971 – ధరః నలభై.

    ౭.విశ్వనాథ వారి “ఏకవీర” – msr murthy & co,vizag – 1957 – ధరః ఇరవై

    ౮.ప్రసన్న కుసుమాయుధము కావ్యం – ఎస్వీ జోగారావు- విశ్వనాథ వారి ముప్ఫై పేజీల పీఠికతో- ధరః ముప్ఫై.

    ౯. పోతన భాగవతం – సప్తమ స్కంధము(ప్రహ్లాద చరిత్ర) – కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్, రాజమండ్రి – 1964 – ధరః పదిరూపాయలు.

    ౧౦.శ్రీ మహా త్రిపురసుందరీ పూజా కల్పం – వావిళ్ళ వారిది – 1964 – ధరః డెబ్భై రూపాయలు

    మళ్ళా రేపు వెడుతున్నా…కొత్త జాబితా రేపు రాస్తా….ః)

    1. athreya

      Kautilya garu namaskaram..naku VAVILLA vari PEDDA BALASIKSHA pusthakam kavalandi…enno rojulu ga vethukuthunnanu..eroju na adrishtam koddi me POST chusanu..chala santhosham anipinchindandi…nekemanna sahayam chegalara???….
      mee javabu kai eduru chusthunnanu…

    2. athreya

      alage BHARAVI rachana KIRATARJUNEEYAM kuda kavalandi…dayachesi sahaya padagalaru..

      <strong

    3. Raghuramam Brahmandam

      అయ్యా, నమస్కారములు. శ్రీ జాడ వారు వ్రాసిన పుస్తకం , వారిమీద వేరే వారు wrasin పుస్తకాలూ నాకు కావాలి . దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే , గుంటూరు లో వున్న మా మిత్రుల ద్వారా వాటిని తీసుకొంటాను.ఉత్తర హరివాస్మా కూడా నాకు కావలెను. మీకు వీలైన మాధమం లో ఇవ్వ వచ్చు.నా కాంటాక్ట్ నెంబర్ 9848896404.

  17. కౌటిల్య

    శివరామప్రసాద్ గారూ, ధన్యవాదాలు..

    ఉష గారూ, ఎన్నాళ్ళకి కనిపించారండీ!తప్పకుండా ఇస్తానండీ..కాని మీరు అక్కడెక్కడో ఉన్నారు కదా! ఎల్లాగ!మీకు పైన నేను ఇస్తానని చెప్పినవాటిలో ఏవి కావాలో చెప్తే అవితీసి వాటిమీద మీ పేరు రాసి పక్కనపెడతాను….ః)…వేయిపడగలు కూడా కావాలంటే ఒక ప్రతి ఇవ్వగలను..ః)
    పోతే “వక్రరేఖ” వివరాలు తెలిశాయి…గురువుగారు, విశ్వనాథవారు అప్పట్లో దానికి పీఠిక రాశారట! వెతికి పట్టుకుని ఆ పుస్తకానికి ఒక బుల్లి సమీక్ష రాస్తాను..కథ చాలా బాగుంది….”భువనవిజయం” వివరాలు కూడా తెలిశాయి…ధూళిపాళవారికి అవార్డు తెచ్చిపెట్టిన పుస్తకం అట అది!

    రావుగారూ, ఇవి నేను కొంది గుంటూరులోనేనండీ! అరండేలు పేటలో బ్రిడ్జి పక్కనే ప్రతి ఆదివారం పాతపుస్తకాల సంత జరుగుతుంది..అక్కడ మన ఓపిక్కొద్దీ వెతుక్కోటమే!అరండల్ పేట మొదటిలైనులో ఉండే 15,16 నంబరు పుస్తకాల షాపుల్లో మీకు ప్రతిరోజూ పాత సాహిత్యం పుస్తకాలు దొరుకుతాయి…ఇక విజయవాడలో ప్రత్యేకంగా ఆదివారం అంటూ ఏమీ ఉండదు..ప్రతిరోజూ లెనిన్ సెంటర్ లో ప్రాచీనాంధ్రగ్రంథమాల,నవ్యాంధ్రల్లో వెతుక్కోటమే!..ః)

    ప్రశాంత్ గారూ, షాపుల వివరాలు పైన రాశాను…అవి అచ్చ తెలుగు అంకెలండీ!

    నరసింహారావు గారూ,షాపుల వివరాలు పైన రాశాను…వాళ్ళు ఫోనులకి రెస్పాండ్ అవరు..వెళ్ళి కొనుక్కోవలసిందే! పైగా ఆ పుస్తకాన్ని మనం అపురూపంగా చూసుకుంటామన్న నమ్మకం వాళ్ళకి కలిగితేనే ఇస్తారు..ః)…

  18. మల్లిన నరసింహారావు

    నాకు శ్రీమదాంధ్రమహాభారతము, ప్రభావతీ ప్రద్యుమ్నము,పారిజాతాపహరణము, ఇవి తప్ప మిగిలిన పుస్తకాలు అన్నీ కావాలి. ఈ మూడు పుస్తకాలు నా దగ్గఱ ఉన్నాయి. మిగిలిన పుస్తకాలు కావాలి. ఆ షాపు ఎడ్రసు, ఫోను నంబరు, తదితర వివరాలు నాకు దయతో ఈ మెయిలు చెయ్యగలరా?

  19. prasanth

    the way that you written numbers in telugu is unique.are they telugu or sanskrit numbers?

  20. prasanth

    excellent,could you give the shope adress?

  21. cbrao

    మంచి పుస్తకాల సేకరణ. మీ అభిరుచికి అభినందనలు. బెజవాడ లో పాత పుస్తకాలు వారాంతంలోనా లేక ప్రతిరోజూ లభ్యమవుతాయా? ఈ పుస్తకాలకై ఎక్కడ వెదకాలి?

  22. ఉష

    శ్రద్దగా ఇచ్చిన వివరణలకి కృతజ్ఞతలు. భాగ్యశాలులు. నేను విన్నవే వేలి లెక్కకి వచ్చాయి కనుకా చదివినవెన్నని చూడలేదిక. మీరు ఉదారంగా ఇస్తానన్న [ఉచితంగా వద్దు గాని] వాటికి నా పేరు రాసేసుకోవచ్చా. మీరు వివరాలకి పెట్టినవాటి గూర్చి నేను అడగగల వ్యక్తులు పుస్తకానికి పాత కాపులు కనుకా మీకు సమాధానం వస్తుందనే నా నమ్మకం.

  23. శివరామప్రసాద్ కప్పగంతు

    అద్భుతం. అభినందనలు

Leave a Reply