పుస్తకం
All about booksపుస్తకభాష

November 17, 2010

మహా ‘గణపతిం’ మనసా స్మరామి

More articles by »
Written by: అతిథి
Tags:

రాసిన వారు: శారద
************
(గమనిక- తెలుగు వారికి చిరస్మరణీయులూ, గర్వ కారణమూ అయిన కీర్తి శేషులు చిలకమర్తి వారి శైలిని నేననుకరించి వ్రాయుట- కేవలము పులిని చూచి నక్క వాత పెట్టుకొను ప్రక్రియయే తప్ప ఆ మహా రచయితని వేళాకోళం చేయటమో, వెక్కిరించటమో కానే కాదని మనవి. నాకటువంటి అభిప్రాయము లేదూ – ఆ అర్హతా రాదు! ఎవరినేని నొప్పించినచో హృదయపూర్వక క్షమాపణలు.
–శారద )

జీవితమువలెనే సాహిత్యమునూ ఎన్నో రసానుభూతుల చెలమ. సాహిత్యమునందు పోషించబడు అన్ని రసములకంటే హాస్య రసము మిక్కిలి కష్టతరమని జనాభిప్రాయము. హాస్యము హద్దు మీరినచో అపహాస్యమగును కదా! మోతాదులోనున్నప్పుడు చక్కిలిగింతలు పెట్టు హాస్యము, శృతిమించినచో వెగటుగా తోచును.

వెగటుగా వుండు హాస్యమునకు ఉదాహరణమీయవలెనన్న తెలుగులో కానీ, మన సోదర భాష తమిళములో కానీ చలన చిత్ర రాజములు చూసిన చాలును. తమిళ చిత్ర ములలోని హాస్యము చాలా వరకు సెంథిల్ అను విదూషకుడు గౌండమణి అను సహ నటునిపై గోధుమ పిండి డబ్బా బోర్లించుటో, లేదా, గౌండమణి తిని పారవేసిన అరటి పండు తొక్కపై కాలూని సెంథిల్ జారి పడుటో వంటి సన్నివేశముల వరకే పరిమితమై వుండును. అవి చూచిన నవ్వు రాదు, కాని “అక్కటా! ఇటువంటి నటుల చేత చిక్కితిమే” యన్న బాధతో ఏడుపు వచ్చుటకు అవకాశము కలదు. అటువంటి హాస్యము సాహిత్యమందునూ కలదు. అది అటులుండనిండు.

ఇప్పుడు మనము ముచ్చటించబోయేది మనసుని ఆహ్లాదపరచే హాస్య రస పోషణ గురించి. సాహిత్యములో హాస్య రసావిష్కరణ పలు విధములుగా నుండును. చిత్ర విచిత్రములైన సన్నివేశాల కూర్పుతో, ఇంకా చిత్రములైన పాత్రలతో, రసాభాస వంటి హాస్యము కలదు. కేవలం నానా రకములైన యాసలతో కూడిన భాషలతోనూ, చమత్కారముతో కూడిన సంభాషణలతోనూ హాస్యమును పండించవచ్చును. కొన్నిసార్లూ శారీరక అవకరములను చూపించి నవ్వించు వారలూ వున్నారు. అయితే ఎవరినీ నొప్పించకుండా ఈ పధ్ధతిని వ్రాయుట బహు కష్టతరమగు ప్రక్రియ!

ఆంగ్లమున ప్రసిధ్ధి చెందిన పీ.జీ.వోడ్ హవుస్ అను రచయిత “సిట్యుయేషనల్ కామెడీ” తో ప్రజలను కడుపుబ్బ నవ్వించిరి. తద్విరుధ్ధముగా, అదే ఆంగ్లమున జెరోం.కే.జెరోం అను ఇంకొక రచయిత మన దైనందిన జీవితంలోని హాస్య పూరిత సంఘటనలతో “త్రీ మెన్ ఇన్ ఏ బోట్” అను అద్భుతమైన నవల రచించెను. ఈ నవల చదవని హాస్య ప్రియ పాఠకులందరూ వీలైనంత త్వరలో దానిని చదివి పగలబడి నవ్వుతూ సంతోషించెందరు గాక! వీరిరువురి గురించీ ఇంకొక పరి ముచ్చటించుకొందము.

నాకు చిన్నతనములో జ్వరము వచ్చినదనో తల నొప్పిగా యున్నదనో సాకులు చెప్పి బడి మానివేసి ఇంట్లో పుస్తకములు చదువుతూ కాలక్షేపము చేసెడి యలవాటు యుండెడిది. ఆ కాలమున దీనిని “డుమ్మా” యనియు, సదరు విద్యార్థి ని “డుమ్మా మాస్టరు” యనియు పిలిచెడి వారు. ఇప్పుడేమందురో మరి! అయితే ఈ “డుమ్మా” ఎప్పుడూ హద్దులు మీరి యుండకపోవుటచే మా తలి తండ్రులు దీనిని అంత తీవ్ర విషయముగా పరిగణించలేదు!

ఆరు-ఏడు తరగతులలో అటువంటి ఒకానొక “డుమ్మా” రోజులలో నేను మా ఇంట నుండిన చిలకమర్తి గారి “ప్రహసనములు” చదివితిని. మా తండ్రి గారి వద్ద ఇటువంటివి,ఇంకను చాలా గ్రంథ రాజములు కలవు. ఆ ప్రహసనములూ, అందులో వున్న సంభాషణలూ నాకెంతగానో నచ్చినవి.

క్రిందటి సంవత్సరము మేము హైదరాబాదు సందర్శించినప్పుడు కూడా మరల యా పుస్తకము చదివి ఆరో తరగతి విద్యార్థిని వలె కిచ కిచ మంటూ నవ్వితిని.ఇన్ని వర్షములు గడచిన పిమ్మట నాకింకొక చిలకమర్తి గా గ్రంథము చేజిక్కినది! మా అడిలైడ్ నగరమున ఒకానొక మారుమూల గ్రంథాలయములో తెలుగు పుస్తకములు యున్నవని నమ్మకముగా తెలిసిన పిమ్మట నాలుగైదు వారముల కింద కుటుంబమంతయూ బయలుదేరి యా గ్రంథాలయమును దర్శించితిమి.

అన్నన్ని తెలుగు పుస్తకములు చూచుటచే నేనున్నూ, తమిళ పుస్తకములు చూచుటచే మా శ్రీవారున్నూ, నోటినుండి జాలువారు లాలా జలమునకు ఆనకట్టలు వేసి, ఏనుగుల మీదికి లంఘించు సింహముల వలె పుస్తకముల మీదికి లంఘించితిమి. ఆ దినము నా భాగ్య ఫలము బాగుండుటచే మంచి పుస్తకములు లభించినవి. వీటిని గురించియూ మరియొక పరి ముచ్చటించుకొందము. (మనము ముచ్చటించుకొనవలసిన విషయ సూచిక పెరిగిపోవుచున్నది!). కానీ అన్ని పుస్తకముల కింద దొంగలా దాగుకొని నన్ను చూసి కొంటెగా నవ్వుచుండెను చిలకమర్తి వారి “గణపతి”. వెంటనే పుస్తకము చేజికించుకొని యాగకుండ చదివి ముగించినాను. కథ కంటే కథనమూ, కథనము కంటే అక్కడక్కడా వున్న బొమ్మలూ చాలా బాగుగా నున్నవి.

మీరెప్పుడైనా మీ యిళ్ళల్లో వున్న పెద్దతరం బామ్మ గార్లతోనో తాత గార్లతోనో తీరుబడిగా ముచ్చటించి యున్నారా? వారిని వారి వారి చిన్నతనపు ముచ్చట్లను జెప్పమనుడు. వారు ఆ చిన్నతనంలోని చిన్న చిన్న కష్ట నష్టములనూ, సమస్యలనూ, ఎంత సున్నితముగా, అవేవొ నవ్వుకో వలిసిన విషయములుగా చెప్పెదరో గమనింపుడు.

గణపతి కథనమంతయూ నాకటువంటి సున్నితమైన హాస్యమే గోచరించెను. కథ స్థూలముగ చెప్పవలెనన్న గణపతి యను నామధేయము గల యొకానొక “అసమర్థుని జీవ యాత్ర”. అయితే ఈ అసమర్థుని పాట్లకూ, ఓటములకూ కారణం కేవలం అతని సోమరితనమూ, అబధ్ధాల కోరు తనమూ, ఇంకనూ అతని వ్యక్తిత్వములందలి అనేకానేక వీశేషములవల్ల కావటమే ఒక విశేషము.

గణపతి కుటుంబములోని మూడు తరాల చరిత్రనుపయోగించి చిలకమర్తి వారు ఆనాటి స్థితిగతులనూ, ముఖ్యముగా విద్యా వ్యవస్థలోని యవకతవకలనూ గొప్పగా చిత్రీకరించిరి. ఆ వేళాకోళమంతయూ ఆనాటి బ్రాహ్మల పధ్ధతులనూ చాదస్తములనూ వెక్కిరించుటకేమోనన్న యాలోచన నన్ను కొంచెము బాధించిన మాట నిజము. అయితే ఆ వెక్కిరించుటకు ఉపయోగించిన భాషా, చమత్కారములూ, ఉపమానములూ, చెప్పనలవి కానివి.

మందపల్లికి చెందిన పప్పుభొట్ల పాపయ్య అన్నంభొట్ల పిచ్చమ్మల సంసార ఫలమే గంగాధరుడు. గంగాధరుని చిన్నతనములోనే పాపయ్య అసువులు బాయుట చేతనూ, పిచ్చమ్మ తండ్రి కపటోపాయము చేత వారి యాస్తి పాస్తులను చేజిక్కించుకొనుట చేతనూ, పిచ్చమ్మా, గంగాధరులు వీధిని పడు యవస్థ యేర్పడును. గంగాధరుడు పేరుకు తగినట్టే కావళ్ళతో ఇంటింటికీ నీరు పోసి కుటుంబమును నడుపును. అతనికి సింగమ్మ యను బాలికతో వివాహము జరిగిన యంత, కథానాయకుడైన గణపతి యుదయించును. గణపతియున్నూ చిన్నతనముననే తండ్రిని కోల్పోయి మేన మామ గారి పంచన చేరును. మిగతా కథ యంతయూ గణపతి, తల్లినీ మేనమామను పెట్టు యవస్థలూ, యతని పెండ్లి ప్రయత్నములున్నూ!

మొదటనే చెప్పినట్ట్లు నాకు కథ కంటే కథనమే ఎక్కువగా నచ్చినది. ఒక వర్గం వారిని (ఏ వర్గమైనా) సరే యంతగా వెక్కిరించుట నా మనస్తత్వమునకు సరిపడకపోవుట ఒక కారణమై వుండవచ్చు. ఇంకొక కారణము, అక్కడక్కడా రచయిత శారీరిక అవకరములు గలవారిని వెక్కిరించుట! బహుశా యా కాలమున “పొలిటికల్ కరెక్ట్నెస్సు” యను వాదము అంతగా ప్రాచుర్యము పొంది యుండకపోవచ్చును!

ఈ రెండు విషయములూ పట్టించుకోక పోయినచో, ఈ పుస్తకమొక చమత్కార మాయాజాలము. ఒక అవకరమును, అవగుణమును మంచి పదములతో నవ్వు పుట్టునట్టు చెప్పవలెనన్న, భాషతో చమత్కారములు చేయు విద్యయు, ఇంచుక పురాణ కథా ఙ్ఞానమున్నూ కావలె.

గణపతి గార్ధభమునెక్కి ఊరేగుటయే కాక, దానిని తెలివిగా సమర్ధించుకొను విధము చూసి నేను మా ఇంటిలోని మిగతా వారందరికీ చదివి వినిపించినాను. పూజనీయులూ, మహనీయులైన దేవతలే నానా రకములైన జంతువులనూ, పక్షులనూ యధిరోహించి తిరుగాడ్చుండగా, గణపతి గార్ధభమునెక్కుట యెందుకు చిన్నతనమని రచయిత వ్యాఖ్య. ఆ సందర్భమున-

“…….ఇంక శివుని మాట తడవబనియె లేదు. ఆయన యెద్దు నెక్కి విహారము చేయును! అడ్డమైన గడ్డి కరుచునట్టి పశువు మీదనా శివెడెక్క వలసినది? మహేశ్వరుడెంత వాడు? లలాట నేతృజ్వలన కీలల చేత నిముషార్ధమున విష్ణు పుత్రుడగు దర్పకుని బిడికెడు బూడిద చేసినాడు. అట్టి మహనీయుడెద్దెక్కుట బాగున్నదా? ఈయన కుమారుడగు కుమారస్వామి జగత్రయ కంటకుడగు తారకాసురుని శక్తి ప్రయోగమున సంహరించి వేల్పుల కృతఙ్ఞతకు పాత్రుడయ్యెను. అతడు దేనిమీద నెక్కునో యెరుగుదురా? నెమలి మీద! వన్నెల చిన్నెల బండారమే కాని నెమలి గొప్ప యేమున్నది?…..” మొదలగు వాక్యములూ, పోలికలూ చక్కిలిగింతలు పెట్టినట్లుండెను.

ఇట్టి యుదాహరణలీ కథయందున లెక్కకు మిక్కిలి కలవు.

సంఘముననున్న చెడ్డ యలవాట్లనూ, కుసంస్కారములనూ సంస్కరించవలెనన్న హాస్యముకన్న మంచి ఆయుధము లేదు. పెద్ద పెద్ద విమర్శనలూ, సంస్కరణోపన్యాసములతో సామాన్య ప్రజానీకము ఆత్మ విమర్శ చేసికొందురన్న నమ్మకము లేదు. కానీ సున్నితముగా వాత పెట్టినట్టు మన యాలోచనలలోని విపరీతములను వెలికి తీసినచో ఆత్మ విమర్శకూ, తదుపరి సంఘ సంస్కరణకూ దారి సులువగునేమో!About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.13 Comments


 1. చెప్పడం మరిచాను. పూర్వపు భాషను అనుకరించేటప్పుడు, ఱ, ఞ్ ఎక్కువగా వాడండి. ఉదా:- సఞ్కల్పం.


 2. చక్కటి వ్యాసాన్ని వ్రాశారు శారదగారు. మీ ప్రయత్నం చాలా బాగుంది.


 3. మాలతి

  శారదా, చాలా బాగా రాశారు. గణపతి పేరు వినడమే కానీ చదవలేదు. పుస్తకాన్ని గురించి అదే శైలిలో చెప్పడం కొత్తపాళీ చెప్పినట్టు చక్కగా నప్పింది. అభినందనలు.


 4. sangeetha

  sarada garu,

  Thanks for letting me know about the library. Now I am really jealous of all telugu people in adelaide. Inspite of having a larger telugu population here in melbourne there are no telugu books here. There are very good collections for Tamil, Hindi, Bengali though. I shall bring this to the notice of council authorities here.

  Thank you so much.

  Regards,
  Sangeetha


 5. శారదగారికి అభినందనలు,
  గణపతి నవల యొక్క గొప్పదనం శైలిలోనే ఉంది.
  “సమాజం చెడిపోయేది ఎక్కువగా చదువుకొన్న వారి వల్లే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విద్యావంతులమనుకొనే మూర్ఖుల వల్ల. వీరు అటు సనాతన సంప్రదాయాలను గౌరవించలేరు, వాటిని విమర్శించడమే ఆధునికత, నాగరికత అనుకుంటారు. అలాగని కొత్త, మంచి సంప్రదాయాలను ప్రారంభించలేరు. అందుచేత విద్యావంతులను మారిస్తే దిద్దితే వ్యవస్థ దిద్దబడుతుంది.” అప్పట్లో సమాజంలో విద్యావంతులు ఎక్కువ బ్రాహ్మణులు. వారు అటూ ఇటూ కాకుండా ఉన్నారు. అందుచేత చిలకమర్తి, పానుగంటి మొదలగువారు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా విమర్శించారు(వారూ బ్రాహ్మణులే అయినప్పటికీ)
  అది ఇప్పుడు మోటుగా అనిపిస్తుంది. సహజం, అత్త,కోడలిని వరకట్నం కోసం వేధించడం, చదువుకొని బంగారుపతకాలు పొందినవారు నిరుద్యోగులుగా రోడ్డుమీద తిరగడం ఇప్పుడు మోటుగా అనిపిస్తాయి. కానీ పాతికేళ్ళ క్రితం అవన్నీ, అన్ని సాహిత్యప్రక్రియలకూ ఆధారాలు కదా. మరి వందేళ్ళ క్రితం పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.
  ఇదంతా నా ఆలోచనను పంచుకోవాలని మాత్రమే, మిగిలిన వాళ్ళకంటే అధికంగా తెలుసని కాదు


 6. యోగి గారూ & అర్పితా
  ధన్యవాదాలు.
  శారద


 7. @కొత్తపాళీ: @కొత్తపాళీ:

  కొత్త పాళీ గారూ,
  అసలు ఈ మాత్రం తెలుగే నాకొచ్చని నేననుకోలేదు :)!
  Stereo typing ఎక్కువైనప్పుడు చిరాకు కలగటం సహజమే.
  శారద


 8. @sangeetha:
  సంగీత గారూ,
  ఇక్కడ అడిలైడ్ లో చార్ల్స్ స్టర్ట్ లైబ్రరీలో తెలుగే కాక, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ పుస్తకాలూ సినిమాలూ కూడా దొరుకుతాయి.
  మీరు మెల్బోర్న్లో మీ కౌన్సిల్ ఆఫీసులో వాకబు చేస్తే అక్కడ భారతీయ భాషా పుస్తకాలు దొరికే లైబ్రరీ గురించి వివరాలు ఇస్తారు.
  శారద


 9. Arpitha sharma

  hello Sarada garu

  i read ur artical it was excellent and i feel like studying the book Ganapathy immediately.

  thanq so much for posting.


 10. brilliantly written.
  గ్రాంధిక శైలి అక్కడక్కడా గాడీ తప్పిందిగానీ, మొత్తానికి చాలా బాగా రాశారు. అసలీ పుస్తకాన్ని గురించి ఈ శైలిలో రాయాలన్న మీ ఆలోచనకే జోహారు.
  చిన్నప్పుడు, ముఖ్యంగా రేడీయో నాటకం ప్రభావంతో గణపతి అంటే ఒక ఇష్టం ఉండేది. కానీ పెద్దయ్యాక ఆ పుస్తకాన్ని రెండు మూడు సార్లు చదివాక, నాకైతే ఏవగింపు పుట్టింది పుస్తకమ్మీదా, ఆ పాత్రమీదా. చిలకమర్తివారి వంటి ప్రజ్ఞావంతులు ఏ ప్రయోజనాన్ని ఆశించి అటువంటు ముతకహాస్యం రాశారో జీర్ణించుకోలేకపోయాను.


 11. sangeetha

  Sarada gaaru,

  I live in melbourne and never came across any telugu books in the libraries. Could you please let me know the name of the library in
  adelaide which has telugu books ?

  Thanks..

  Regards,
  sangeetha  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0