దూత మేఘము – విశ్వనాధవారి నవల

విశ్వనాధ సత్యనారాయణ గారి నవలలు ఒక పదింటిని మిత్రుడొకడు అప్పుగా ఇచ్చాడు. (అప్పిచ్చువాడు వైద్యుడు అని పెద్దలు ఊరికే అనలేదు). తాగుబోతువాడికి పది రోజులు మందు పోయించినంత పుణ్యం  ఫ్రీగా సంపాదించుకోవాలని అతనికెందుకో బుద్ధి పుట్టిందనుకుంటాను.

ఇదివరకు విశ్వనాధవారి నవలలు కొన్ని మాత్రమే చదివేను. ఎంసెట్ కోచింగుకెళ్ళి ఎవరింట్లోనో వేయిపడగలు కనబడితే రెండ్రోజులు నిద్రాహారాలు మానేసి మరీ చదివేను. మరోసారి కోచింగుకెళ్ళినప్పుడు ధూమరేఖ గట్రా ఒకటో రెండో పురాణవైర గ్రంధమాలలోంచి చదివేను. అందుకే అప్పట్లో మంచి పుస్తకాలేమీ నాకు కనబడకుండా దాచేసేవారు మా ఇంట్లోవాళ్ళు. తర్వాత్తర్వాత తీరిక దొరికినా విశ్వనాధ రాసిన నవలలన్నీ కట్టగట్టి చదవలేదు. బహుశా ఎందుకంటే- నాకు ఆయన ఆలోచనా ధోరణి చిరపరిచితంగా అనిపిస్తుంది, కొత్తగా  మనకి తెలియంది ఏముంటుందిలే అనే భావం కావొచ్చు. అయినా  ఇప్పటికీ ఆయన రాసినది ఏది కనపడినా దానికి అతుక్కుపోకుండా ఉండలేను. దానిక్కారణం ఆయన రచనల్లోని అసాధారణమైన చదివించే గుణం.

ఇప్పుడు తీసుకున్నవి కాశ్మీర, నేపాళ రాజవంశావళి నవలలు. వీటిల్లో కూడా ఒకట్రెండు ఇదివరకు చదివినవే. ఆయన నవలలు కొంచం విచిత్రంగా అనిపిస్తాయి నాకు. అద్భుతమైన ఊహలు. ఎక్కడా పట్టు చెడని, ఉత్కంఠ కలిగించే కథనం. జిగిబిగి అల్లిక. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదో వెలితి అనిపిస్తుంది. ఈ నవలలన్నీ ఆయన ఆశువుగా చెప్తూ ఉంటే శిష్యులు రాసి పెట్టినవి. అందుచేతనే కాబోలు, రచయిత మన ఎదురుగా కూచుని కథ చెప్తున్నట్టే ఉంటుంది. కథ పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ కథలోనూ, నవలలోనూ ఒక ‘ముడితనం’ ఉంటుంది. మెరుగులు దిద్దని ఒక చిత్తు ప్రతిని చదువుతున్నట్టే ఉంటుంది. ఇంకొంచం శ్రద్ధ పెట్టి మరో రెండు సార్లు తిరగరాస్తే ఇంకా ఎంతబాగా వచ్చి ఉండేదో కదా అనిపిస్తుంది.

విశ్వనాధవారి భావాల గురించీ, ఈ నవలలు వ్రాయడం వెనక ఉన్న ఉద్దేశ్యాల గురించీ నేనిక్కడ చర్చించదలచుకోలేదు. వాటి గురించి ఎవరికి తెలియదు కనక? ‘దూతమేఘము’ అన్న ఒకానొక నవలలోని కొన్ని విశేషాల గురించి పరిమితంగా మాత్రమే చెప్పదలచుకున్నాను. ఇది నేపాళ రాజవంశావళి నవల.

‘మేఘదూతం’ లేక ‘మేఘసందేశం’ అన్నది కాళిదాసు వ్రాసిన ప్రసిద్ధమైన ఖండకావ్యం. దాన్నే ‘దూతమేఘం’ అని కూడా అంటారు. ఆ కావ్య సౌందర్యానికి ముగ్ధులు కాని సాహితీప్రియులూ, కవులూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. జీవులనుభవించే ‘విరహవేదన’ కి అత్యున్నతమైన వ్యక్తీకరణ ఆ కావ్యం. అందులోని కథ చాలా సరళమైనది. కుబేరుడి కొలువులో పనిచేసే యక్షుడొకడు తన భార్య పట్ల అమితమైన అనురాగంతో ఉంటూ, తన అధికార బాధ్యతలని సరిగా నిర్వహించలేకపోతాడు. దానికి కోపించిన కుబేరుడు అతణ్ణి ఒక సంవత్సరంపాటు తన మహిమను కోల్పోయి దూరంగా పడి ఉండమని శపిస్తాడు. ఆ యక్షుడు దక్షిణానికి వచ్చి రామగిరులలోని ఆశ్రమాల్లో కాలం గడుపుతూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచిపోగా ఆషాఢమాసం వస్తుంది. ఆయన ఉన్న కొండకొమ్ము దగ్గరకి ఒక మేఘం వస్తుంది. దాన్ని చూసి, విరహబాధని తట్టుకోలేనివాడై, ఆ యక్షుడు మేఘంతో సంభాషించడం మొదలుపెడతాడు. తనని పరిచయం చేసుకుని, తన బాధ చెప్పుకుని ఒక సహాయం చెయ్యమంటాడు.

ఆ సహాయమేమిటంటే,  హిమాలయాల్లోని అలకాపట్టణంలో తనలాగే విరహంతో బాధ పడుతూ ఉన్న తన ప్రియురాలికి (భార్యకి) తనసందేశాన్ని ఇవ్వమంటాడు. మొదటగా తానున్న రామగిరుల నుంచి అలకా పట్టణం దాకా ఉన్న మార్గాన్ని వర్ణిస్తూ పోతాడు. దారిలో కనబడే పర్వతాలు, నదులు, పల్లెలు, పట్టణాలు వాటిలోని దృశ్యాలూ, విశేషాలూ ఇవన్నీ మహాద్భుతంగా వర్ణిస్తూ పోతాడు. ఆఖరికి అలకా పట్టణాన్నీ, అందులో తన ఇంటినీ, అక్కడ ఉన్న తన ఇల్లాలినీ వర్ణిస్తాడు. ఆమె ఏం చేస్తూ ఉంటుందో, ఎంత బాధలో ఉంటుందో చెప్పి, అప్పుడు తన మాటల్ని సందేశంగా చెప్పమంటాడు. తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో వర్ణించి, ఈ కష్టం ఎన్నాళ్ళో ఉండదులే అని ఆమెను ఓదార్చి ఆ మేఘాన్ని తన దారిన తాను సుఖంగా పొమ్మంటాడు.

ఈ కావ్యం యొక్క ప్రభావం భారతీయ సాహిత్యకారులమీద చాలా గొప్పది. దీన్ని అనుసరిస్తూ, అనుకరిస్తూ కొన్ని వేల కవితలూ, రచనలూ వచ్చాయి. నేనీ కావ్యానికి చాలా గట్టి అభిమానిని కావడం వల్ల విశ్వనాధవారి ‘దూతమేఘము’అన్న నవల పేరు చదవగానే చాలా ఉత్సాహపడ్డాను. నవల బాగానే ఉంది కానీ ఏదో అసంతృప్తి. పొరపాటు నాదే కావచ్చు. ఈ నవల యొక్క ఉద్దేశ్యం వేరు. నేను చదివిన ఉద్దేశ్యం వేరు. నేను చదివినది మేఘదూతం పట్ల నాకు ఉన్న ఒక సౌందర్యాసక్తి తో. ఈ నవల యొక్క ప్రయోజనం ఆ కవిత్వ సౌందర్యాన్ని మళ్ళీ అనుభవింపచెయ్యడం మాత్రం కాదు. కానీ దీన్ని చదవడం వల్ల ఆ కావ్యాన్ని గురించి విశ్వనాధ వారి ఊహలు కొన్ని తెలిశాయి.

ఉజ్జయినీ రాజైన విక్రమాదిత్యుడు ‘మ్లేచ్ఛులని’ (విదేశీయులని) తరిమికొట్టి, భారతదేశానికి చక్రవర్తి అయి, భారత ధర్మాన్ని నిలబెట్టాడని చాలామంది భావిస్తారు. ఆయన పేరుమీదనే విక్రమ శకం మొదలైంది. కాళిదాసు ఆయన ఆస్థానంలోనివాడని ఇప్పటికీ చాలామందికి నమ్మిక. భవిష్యపురాణంలో ఈ విక్రమాదిత్యుని గురించి ఒక సంగతి ఉన్నదట. భారతం మ్లేచ్ఛాక్రాంతం కాగా శివుడు తన అనుచరుడైన ఒక యక్షుణ్ణి మరలా వేదధర్మాన్ని ఉద్ధరించడానికి నియోగించాడనీ, ఆ యక్షుడే విక్రమాదిత్యునిగా జన్మించాడనీ అందులోని కథ. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని దానికి మరింత కల్పన జోడించారు విశ్వనాధ.

నేపాళ రాజు అంశువర్మ. అతనికి ఎనిమిదేళ్ళ వయసు కల మనవరాలు. ఆమెకి చదువు చెప్పే గురువు బృహస్పతి భట్టు. ఆ అమ్మాయి ఏమీ చదివేది కాదు. ఆమెకి మేడమీద కూర్చుంటే ఏదో అవ్యక్తమైన వీణాగానం వినిపించేది. ఆమెకి స్వప్నంలో ఒక పురుషుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. ఆ గానం వినడం వల్ల ఆ పిల్లకి ఆనందమూ, దుఃఖమూ కూడా కలుగుతూ ఉండేవి. ఒకేసారి ఆనందమూ, దుఃఖమూ ఎలా కలుగుతాయని ఆమెకి సందేహం. దాని గురించి తన తాతగారైన రాజునీ, ఆయన సలహామీద తన గురువైన బృహస్పతి భట్టునీ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. బృహస్పతి భట్టు గొప్ప సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అవి రాజు తెలుసుకుని అతను చాలా మహానుభావుడని గ్రహిస్తాడు. అతణ్ణి ఒక రాజకార్యం కోసం వినియోగిస్తాడు. అదేమిటంటే, విక్రమాదిత్య చక్రవర్తి నేపాళాన్ని జయించడానికి చూస్తున్నాడు. అతడితో సంధి చేసుకోవాలని రాజు కోరిక. కానీ రాజ్యంలో బలమైన మూడు క్షత్రియ వంశాలు మూడు పట్టణాలలో ఉన్నాయి. వాళ్ళు రాజుకి నామమాత్రంగానే విధేయులు. వాళ్ళు సహకరిస్తే కానీ సంధి జరగదు. వాళ్ళని అనుకూలురుగా చేసుకోడానికి ఈ బృహస్పతిభట్టు పంపబడతాడు.

బృహస్పతిభట్టు గొప్ప ఉపాసకుడు. అతను మోక్షదాయకమైన రామమంత్రాన్ని సాధన చేస్తూనే, అనుకోకుండా లభించిన ఒక యక్షవిద్యలో సిద్ధిని సంపాదిస్తాడు. దాని సహాయంతో అతను అన్ని కార్యాలూ చక్కపెడతాడు. తన మంత్రాంగాన్ని ఉపయోగించి విక్రమాదిత్యుణ్ణి నేపాళానికి ఆహ్వానింపచేసి, అతని పేర విక్రమ శకాన్ని ఆరంభింపచేస్తాడు.  అంతే కాకుండా చక్రవర్తికి ఆ బాలికని పరిచయం చేస్తాడు. ఆ బాలికకి స్వప్నంలో కనిపించే పురుషుడు విక్రమాదిత్యుడే. ఆ బాలిక పూర్వ జన్మలో ఒక యక్ష బాలిక. ఈ చక్రవర్తి పూర్వజన్మలో యక్షుడు. ఆయన శివుడి ఆదేశం మేరకు ఒక దేవ సంవత్సర కాలం పాటు (అంటే వంద మానవసంవత్సరాలు) చక్రవర్తిగా జన్మించాడు. చక్రవర్తిగా ఉంటూ ఉన్నప్పటికీ, అంతరాంతరాల్లో అతడు తనను విడిచి ఒంటరిగా అలకా పట్టణంలో ఉన్న తన భార్య గురించి విరహాన్ని అనుభవిస్తున్నాడు. ఈ బాలిక తన పూర్వ జన్మలో అలకాపట్టణంలో ఈ యక్షుడి ఇంటికి దగ్గరలో ఉండేది. యక్షుడి భార్య యొక్క వీణాగానాన్ని వింటూ ఉండేది.

అంతే కాకుండా ఆ బాలిక ఒకానొక పూర్వజన్మలో బృహస్పతిభట్టు కూతురు కూడా. ఆమె అతని శాపవశాత్తూ కొన్ని జన్మలపాటు బాలికగానే చనిపోవాలి. ఆమె చక్రవర్తికి అలకా నగరంలోని అతని ఇంటికి సంబంధించిన గుర్తులని చెప్తుంది. ఆ చెప్పడంలో చక్రవర్తికి ప్రాణ స్నేహితుడైన కాళిదాసుకి ఒక గొప్ప విరహ కావ్యం వ్రాయాలన్న ప్రేరణని ఇస్తుంది. నిజానికా కావ్యంలో ఉపయోగించాల్సిన పదాలని కూడా తానే అందిస్తుంది. ఈ నవల ప్రకారం కాళిదాసు పూర్వులు వేములవాడకి చెందినవారు. కాళిదాసు శ్రీశైలంలో పుట్టి పెరిగాడు. విక్రమాదిత్యుడూ అక్కడే పుట్టి పెరిగాడు. ఇద్దరూ గొప్ప స్నేహితులు. ఆమె చక్రవర్తితోనూ, మిగతా అందరితోనూ కలిసి బృహస్పతిభట్టు అభ్యర్థన మేరకు నేపాళాన్ని విడిచి దక్షిణాదికి వెళ్తుంది.

అక్కడ అందరూ కలిసి  వేములవాడ భీమేశ్వరస్వామిని దర్శించుకోవాలి. వేములవాడ దగ్గర రామగిరి అనే కొండ ఉంది. ఆ కొండే మేఘదూతం కావ్యంలోని కొండ. వీళ్ళంతా అక్కడకి వెళ్ళేసరికి ఆషాఢమాసం వచ్చింది. ఆ సమయంలో కొండ మీదకి ఒక పెద్ద మేఘం వస్తుంది. ఆ బాలిక వెంటనే తన శరీరాన్ని విడిచి ఆ మేఘంలో కలిసిపోతుంది. ఎందుకంటే ఆమె ఆ మేఘంద్వారా ప్రయాణించి అలకా పట్టణానికి వెళ్ళి అక్కడ యక్షుడి (విక్రమాదిత్యుడి పూర్వజన్మలోని) భార్యకి సందేశాన్ని అందచెయ్యాలి, అందుకోసం. అప్పుడు ఈ సంగతి అంతా చెప్పి బృహస్పతిభట్టు కూడా శరీరాన్ని విడుస్తాడు. కాళిదాసు యక్షుడైన తన చక్రవర్తి బాధనే మేఘదూతం కావ్యంగా వ్రాస్తాడు.

అదీ దూతమేఘం  నవలలోని కథ. ఈ కల్పన బాగానే ఉంది కానీ నాకు చాలా అసంతృప్తిని కూడా కలిగించింది. దాని గురించి చెప్పేముందు, ఈ నవలలో ఆనందం కలిగించే విషయాలు మొదట. ఇంతకాలం భవభూతే అనుకుంటూ వచ్చాను, ఇప్పుడు కాళిదాసు కూడా తెలుగువాడే. రామగిరి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న రామ్ టెక్ కాదు. మన వేములవాడ పక్కన రామగిరి. విక్రమాదిత్యుడు తెలుగువాడు, ఆట్టే మాట్టాడితే తెలంగాణా వాడు (శ్రీశైలం తెలంగాణాలోకే వస్తుందా? అయితే కాళిదాసు కూడా తెలంగాణావాడే). అదలా ఉంచితే ఈ నవలలోని మరొక ముఖ్యమైన అంశం బాలికకీ, బృహస్పతిభట్టుకీ జరిగే చర్చ. అది అలంకారశాస్త్రంలోని విషయమట. ఆలోచింపచేసే విషయం.

ఇక అసంతృప్తి ఎందుకంటే, మేఘదూతంలో హాయిగా ఒక ఏడాది పాటు కొండమీద కూచుని తీరిగ్గా విరహంతో విలపించే యక్షుడికి ఎంత పని తగిలిందిరా బాబూ అని. ఒక పక్క లోపల ఏడుస్తూనే ఉండాలి. మరో పక్క మానవుడిగా మ్లేచ్ఛరాజుల్ని తరిమికొట్టాలి, ధర్మ సంస్థాపనం చెయ్యాలి, చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని చక్కపెట్టాలి. హాయిగా ఏడవడానికి కూడా తీరిక ఉండదు. మరొక అసంతృప్తి ఏమిటంటే, మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి. అటువంటి మేఘంలో ఉన్నది నిజానికి ఎనిమిదేళ్ళ బాలిక (బాలిక యొక్క జీవుడే అనుకోండి) అనుకోడానికి నాకు మనసొప్పడంలేదు.

ఇలా ఇంకా ఎన్నైనా ఈకలు పీక్కోవచ్చనుకోండి. హాస్యానికేదో రాశాను కానీ ఇది చాలా గొప్పగా చదివించగలిగే నవల. మొదలుపెడితే ఆపడం కష్టం.

You Might Also Like

5 Comments

  1. murthy

    ఈ నా వ్యాఖ్య ఎవరి కంటైనా పడుతుందో లేదో నాకైతే తెలీదు కాని విశ్వనాధవారి సాహిత్యసర్వస్వం లో ఈ హాహాహూహూ పుస్తకం ఉంది. పూర్తి పుస్తకాలు అన్నీ కలిపి మొత్తంగానే ఇస్తున్నారు తప్ప విడి గా దొరకటం లేదు.

  2. కౌటిల్య

    రవీంద్రనాథ్ గారూ…ఆ నవలపేరు హాహాహూహూ…అది ఒక గంధర్వుడి పేరు…ఆ గంధర్వుడి రెక్కలు తెగి లండన్ నగరంలో పడతాడు…అప్పుడు కలిగే చిత్ర విచిత్ర పరిస్థితుల గురించి విశ్వనాథవారి కల్పన అద్భుతంగా ఉంటుంది…ఆ పుస్తకం కావాలంటే మీరు పాతపుస్తకాల షాపుల్లో ప్రయత్నించాల్సిందే..విజయవాడ వంశీ బుక్ స్టాల్,లెనిన్ సెంటర్ లో ప్రయత్నించండి..దొరకొచ్చు….

  3. Ravindranath Nalam

    విశ్వనాథ వారి రచనల గురించి మీ అభిప్రాయాలు బాగున్నాయి. ఆయన వ్రాసిన ఆహా ఈ హీ ఉ హూ గురించి రేఖ మాత్రము గా అయినా తెలియ చేయండి. ఈ పుస్తకం ఎక్కడ దొరకటం లేదు. వారి అన్ని రచనలు కలిపి అమ్ముతున్నారు. ఇది లభ్యము అయ్యే లింక్ ఐనా ఇచ్చి పుణ్యం కట్టుకోనండి

  4. nagamurali

    రాకేశ్వరా, అయితే మేఘదూతం చదువుతున్నారన్నమాట. ‘మేఘాలోకే భవతి సుఖినో2ప్యన్యథావృత్తి చేతః’. ఇంకా పెళ్ళికానివాళ్ళు – కొంచం జాగ్రత్త. 🙂

    నాకు గుర్తున్నంతవరకు మేఘాన్ని స్త్రీగా ఎక్కడా అనలేదే. మీకు ఎక్కడ తగిలిందో నాకో మెయిల్ కొట్టగలరా??

  5. రాకేశ్వర రావు

    నేనిప్పుడే మా మేఘదూతం తరగతి గది.. యఱ్… గది కాదు ఆఱుబయట నుండి వస్తున్నాను. విశాలా నగరం గుఱించి అద్భుతమయిన రెండు పద్యాలు చదివి, తరువాత, చణ్డీశ్వరధామం గుఱించి ఒక పద్యమూ చదివాను. మీరు ఏ కారణం చేత ఆ పుస్తకం చదివారో అదే కారణం చేత నేనీ సమీక్ష చదివాను.

    అన్నట్టు మా మేఘదూతమ్ తరగతిలో మేఘుడు కాదు చాలా సార్లు అది మేఘిని అని తెలియవస్తుంది. అప్పుడప్పుడూ మేఘుడు, కానీ చాలా సార్లు మేఘిని కూడానంట. దీనిఁ గుఱించి ఇంకా అఱా తీయవలసినది వుంది.

Leave a Reply