హాస్య సాహితీమూర్తి – పుచ్చా పూర్ణానందం

(పుచ్చా పూర్ణానందం గారి శతజయంతి సందర్భంగా ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో ప్రచురింపబడ్డ ఈ వ్యాసాన్ని తిరిగి ప్రచురించడానికి అనుమతించిన సుధామ గారికి ధన్యవాదాలు! – పుస్తకం.నెట్)
ఆయన పేరే పూర్ణానందం! పుచ్చపువ్వులా పరుచుకున్న వెన్నెలలాంటి హాయిదనం, పుచ్చకాయరసపు చల్లదనం, రెండూ మిళాయించిన హాస్య రచయిత కనుకనేనేమో – ఆయన ఇంటి పేరు “పుచ్చ” అయింది. “సంతోషం సగం బలంకాదు, అసలు బలమే అది” అనే తరహా వాది. వృత్తిరీత్యా వకీలు గిరియే! కానీ సంపాదించింది బోలెడు హాస్యపుసిరి.

“నీ జీవితం కామెడీయో, ట్రాజడీయో నీకు తెలియదు. ఆథర్ నీవు కాదు కనుక. అంచేత నీ కల్పన, నీ రచన, నీ చేతిలో పని కాబట్టి హెచ్చుగా కామెడీలే రాసి నవ్వి, నల్గురికీ నవ్వులు పంచిపెడితే మంచిది” అని సందేశిస్తారాయన. “పెక్కు దుఃఖమొస్తే ఫక్కున నవ్వాలి” అని ఆయన తల్లిగారనేవారట!

“ఎప్పటికైనా ఈ దేశంలో ఇంగ్లీషు పోయేదే కనుక నాలుగు కాలాలపాటు వుండే తెలుగులో రాయండి” అని 1932లో ప్రఖ్యాత హాస్య రచయిత భమిడిపాటి కామేశ్వరరావుగారు, మిత్రులు పుచ్చా పూర్ణానందం గారికి సలహా ఇస్తే – ఆంగ్లంలో రచనలను సాగించిన పూర్ణానందం గారు, అప్పటినుండి తెలుగు వెలిగించడం మొదలెట్టారు! ఇప్పుడు దేశంలో తెలుగు పోయే రోజులు దాపురిస్తున్నా ఆయన వెలిగించిన హాస్యం తనదైన మాటకారితనాన్ని నిలుపుకున్నదే! పుచ్చా పూర్ణానందం గారు ఏ అంశం తీసుకున్నా చెరుకు బండివాడు సారం మొత్తం పిండినట్లు, హాస్యరసం మొత్తం తీసిగానీ వదల్లేదు. ఒకసారి చెప్పిన అంశమే అని వదలక, అందులోనుండి కొత్త సొబగులు, సంపూర్ణసారం పిండారు. కథలు, కలంపోట్లు అనే టాగ్‍లైన్‍తో “కవి నియంత” పుస్తకం ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమికి (1951) ప్రచురణ చేశారు మొదటగా. అది వెలువడ్డ మండలం రోజుల తర్వాతగానీ ఈ వ్యాస రచయిత పుట్టనే లేదు. అప్పటి రూపాయి పావలా పుస్తకం ’అధికస్య అధికం ఫలంగా’ పదిహేనేళ్ళ తర్వాత – బాపు గారి బొమ్మలతో ఏలూరు పవరుపేట సౌర సాహితి ప్రచురణగా “ఆవకాయ-అమరత్వం” సంపుటిగా వెలువడింది. పుచ్చా పూర్ణానందం గారు అనగానే అమెరికాలోని మందపాటి సత్యంకయినా గుర్తొచ్చే హాస్య రచన “ఆవకాయ-అమరత్వం”. కవి నియంతలోని రచనలతో బాటు “వయసు మళ్లిందంటావా” అనే రచన కూడా అదనంగా ఆ పుస్తకం రెండున్నర రూపాయల ధరతో వచ్చింది. 1971లో ఆయన షష్ఠిపూర్తి సందర్భంగా తనయుడు “భార్గవ రామోజీ” వేసిన బొమ్మలతో ఆషాడ పట్టీ గ్రంథం వచ్చింది. దాని వెల మూడు రూపాయలు. 1984లో వెలువడిన “మీసాల సొగసులు” పదిహేను హాస్య రచనల, పదిహేను రూపాయల సంపుటిగా పూర్ణానందం గారి హాస్యపూర్ణ ప్రజ్ఞకు ఎత్తిన ధ్వజస్తంభంగా నిలుస్తోంది. అందులో ఆకాశవాణి శ్రోతలను అలరించిన ప్ర్రసంగమూర్తిమత్వమూ వుంది.

గుంటూరు జిల్లా పెద్దకొండూరులో 1910లో నేటి స్వాతంత్ర్య మాస దశమిన జన్మించిన పుచ్చా పూర్ణానందంగారు, దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకూ చదివి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ., బెనారస్‍లో మదన మోహన్ మాలవ్య వైస్ ఛాన్సలర్‍గా వుండగా ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి., చదివారు. ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రకాశంగారితో పరిచయం, స్నేహం. వీరసావర్కర్ అంటే గౌరవాభిమానాలు, అందువల్ల గాంధేయవాద సిద్ధాంతాలకానాడు దూరంగా నడిచారు. రాజమండ్రిలోనే భమిడిపాటి కామేశ్వరరావుగారితో పరిచయం కలిగి, ఆయన రచించిన నాటకాల్లో వేషాలు వేశారు. పుచ్చావారికోసమే భమిడిపాటి వారు కొన్ని పాత్రలు సృష్టించారు కూడాను.

పూర్ణానందం గారు పద్య నాటికలు ఎక్కువ వేయలేదుగానీ ద్రౌపదీ వస్త్రాపహరణంలో భీష్ముడిగా వేశారు. అనార్కలీలో సలీం, వాపస్, ఆడది పుట్ట, సంభవామి యుగేయుగే, టీకప్పులో తుఫాను, దంతవేదాంతం వంటి రంగస్థల నాటకాల్లో వేశారు. ప్రాచుర్యం పొందిన చిలకమర్తి వారి రేడియో నాటకం “గణపతి”లో ఉపాధ్యాయునిగా, ఇంకా కంకాభరణం, వయోలిన్ మాస్టారు, ఇంటినెంబరు, మృచ్ఛకటికం వంటి రేడియో నాటకాల్లో, బందావారితో, కాశ్యపతో, రామన్నపంతులు, రాఘవ, స్థానం వారలకు పూర్ణానందంగారు పరమ ఆప్తులుగా, ఆత్మీయులుగా మసలారు.

1942లో సినిమారంగం హీరోగా ఆహ్వానించినా తన లాయరు వృత్తిని వదలని ఆయన, జంధ్యాల పట్టుబట్టగా ఆనందభైరవి, రెండు రెళ్ళ ఆరు, శ్రీవారి శోభనం, మదనగోపాలుడూ, హై హై నాయకా చిత్రాలలో నటించారు.

మొదట తెనాలిలో ప్లీడర్‍గా ఖ్యాతిపొంది, త్రిపురనేని రామస్వామచౌదరిగారికి నిత్యసన్నిహితునిగా, గోపిచంద్ సహధ్యాయిగా వున్న పూర్ణానందంగారు 1944లో విజయవాడకు వచ్చి ప్రాక్టీసు కొనసాగించి, 1993లో మరణించే వరకూ కూడా హాస్య రచయితగా, నటునిగా, ప్రసిద్ధ లాయరుగా రాణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రాంబాబుగారు పూర్ణానందంగారి మేనల్లుడు. పూర్ణానందంగారు  తమ మీసాలు మాత్రం మేనల్లుడి స్ఫూర్తితో పెంచారని ఆయనే చెప్పారు.

“నేను ప్రొఫషనల్ రైటర్ని కాదు. కమర్షియల్ రచయితనీ కాను, అంచేత నా కాంట్రిబ్యూషన్ అల్పం” అని వినయంగా అంటూ “చి. పన్నాల సుబ్రమణ్యభట్టు సలహా, సంప్రదింపు, సహకారం లేకుండా వుంటే ఈ గ్రంథం రెండేళ్ళ క్రిందటనే వచ్చేది. అసలు నేను అచ్చే వేయించకపోతే ఆలశ్యం అనే క్వశ్చనే లేదు” అని చమత్కరిస్తూ “మీసాలు సొగసులు” గ్రంథానికి “ఆయన రాసిన మున్నుడిలో పూర్ణానందంగారు చేసిన హాస్యరస విశ్లేషణ, ఓ సిద్ధాంత గ్రంథసారమంతటిది. అసలు మనిషి అంటేనే హాస్యపదార్థం అనీ, భగవంతునికి నవ్వాలనిపించి సృష్టింపబడిన మానవుడు-ఆనందస్వరూపుడైన దైవాన్ని దర్శించడానికి, ఉపాసించడానికి “హాస్యమే దగ్గర దారి” అని అంటారు ఆయన. హాస్యరస గ్రహణ పారీణత ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వెన్న అంటే గుర్తొచ్చింది! ఆయన భోజన ప్రియత్వం గొప్పది. ఎనభై ఏళ్ళపైబడిన వయసులోనూ, చారు అన్నంలో ఇంత వెన్నముద్ద నంచుకుతినడం వారింటికి వెళ్లినప్పుడు స్వయంగా చూసిన దృశ్యం. రోజూ “వంకాయకూర” లేనిదే ముద్దే దిగదు. తిట్టు, దూషణ, మోటుతనం లేని నాజూకైన మృదుహాస్యరచనలే ఆయనవి! ఔచితి, సభ్యత, రమ్యత, నాగరికత, నైశిత్యం, గాంభీర్యం, సహృదయత, గల హాస్యం వారిది. ఆయన హాస్య రచనా వస్తువులు అచ్చ తెలుగు మధ్య తరగతి జీవితాల్లోనివి. “నఫ్రీమేళం”గా భోజన ప్రియుల గురించి, సరదాల స్నేహబంధం గురించీ రాశారు. భార్యతో బజారు గురించీ, అల్లుడి గురించీ, చుట్టాల హడావుడి గురించి, తాంబూలం గురించీ, నశ్యం గురించీ, చుట్ట గురించీ, లోభుల మహిమ గురించీ, నిద్రజగత్తు గురించీ, తమ వృత్తి నల్లకోటు గురించి, పట్నంలో పాడిగేదె గురించీ, మీసాల సొగసుల గురించీ… ఏ విషయం గురించి చెప్పినా తన రచనలో నవ్వుల కుప్పపోస్తారాయన! “నల్లకోటు” అనే రచనలోనే లాయర్లు గురించీ, న్యాయవాద వృత్తి గురించీ – డబ్బై అయిదుకు పైగా జోకులు దొరుకుతాయి. ఆయన తన రచనల్లో సృష్టించిన హాస్యం, పాత్రలు, అనేక సినిమాలకు ఆయనకు తెలియకనే తర్వాత ఎక్కి ఎందరెందరినో అలరించాయి.   “ఆషాడపట్టి”గా ఆయనకు మామగారు సిరాకలం ఇచ్చారు. బాల్‍పెన్‍లు, రీఫిల్ పెన్నులు తప్ప ఫౌంటెన్ పెన్నులు, వూటకలాలు నేటి తరానికేం తెలుసు! ఆ ఇంకు పెన్ను గురించీ, దానితో ఆయన పడ్డ అవస్థల గురించీ తీరుతీరుల వివరించిన తీరు.. అత్యల్పమనుకునే వస్తువునుండి అనల్పహాస్యం పిండగలమనడానికి దాఖలా!

“పెద్ద సైజు ఆ కలం. దీని బారెల్, టంగ్, స్క్రూ, నిబ్ ఎక్‍స్ట్ర్రా, అన్నీ సైజు నా కోసం ప్రత్యేక సృష్టి కాబోలు…. దీని దాహం తగలెయ్య, సగం సీసా త్రాగినా పొట్టనిండేది కాదు. కడుపో కంభం చెరువో బోధపడదు. హరించుకోలేదు సన్నాసి, కాగితం ముక్క దగ్గర పెట్టేసరికి భళుక్కు భళుక్కుమని వొకటే వాంతులు సుద్దలు సుద్దలుగా చూసినవాళ్ళు చీదరించుకోవడం. ఇది ఫౌంటెన్ పెన్ కాదు, మౌంటెన్ పెన్..దక్షిణాది రైల్వేవారు డబుల్ లైన్స్, ప్యార్లల్ లైన్సు ఇప్పుడు తలపెట్టారుగానీ, నా కలం ముప్పది ఏళ్ళనుంచీ వేస్తూనే వుంది. రంగు రంగుల సిరాలన్నీ పోసి చూశాను. దాని బుద్ధి మారదే! అన్ని కంపెనీలదీ ట్రై చేశాను. దయాల్బాగ్, దేవల్బాగ్, కృష్ణవేణి, నీలవేణి, సత్యవాణి, స్వాస్, క్రేస్, క్రో, అన్నీ దీనికింద చిత్తు, సనాతన పరురాలేమోనని, మడితో కరక్కాయ సిరా తయారు చేయించా. పాయింటు వేయించా. గోటితో గిల్లా, మెడవిరిచా, వర్షంలో నిలబెడ్డా, శీర్షాసనం వేయించా… దానికో లెక్కా? చండామార్కులవారి బళ్ళో మొద్దబ్బాయిబాపతు. కాప్ వదులై, తల్లో దూది పెట్టమనేది. షోకులు తెలుసు అక్కుపక్షికి.. యావజ్జన్మ జలుబే… మాధవాయి ముక్కుకి మల్లే, కాగితానికే దానికి ఆజన్మ శతృత్వం. ఢీ అంటే ఢీ! కుర్చీలు, బెంచ్‍లూ, ముందు కూర్చున్న వాళ్ళ వీపులు దీని చిందులతో అలంకరణ. సగం సిరా జేబు త్రాగేది. నా అవతారం చూసి ఆకు పచ్చ సిరా, వైలెట్ సిరా వాడుతున్న రోజుల్లో ఓ ల్యాండ్ లేడీ నన్ను పెయింటర్ అనుకుని తన యింటికి రంగులేయమని కోరింది. ఎర్రసిరా వాడుతున్న రోజుల్లో ఓ రోజు మా గృహిణి (త్రిపురసుందరి) గాభరాపడి తడి గుడ్డ తీసుకువచ్చింది. చేతికి కట్టుకడతానని.”  “పూర్వజన్మ కృతం పాపమ్ పూటకలం రూపేణ పీడితం” అంటూ రకరకాలుగా ఆ సిరా కలం గురించి వివరించే తీరు, ఆ రోజుల అనుభవాలను ఆనందకందళితంగా చిత్రించి చూపుతుంది. దాని అడుగుభాగాన్ని మరదలు పిల్ల ఆవకాయ జాడీగా వాడుకుంటాననీ, బావమరిది వక్కపొడి, ముక్కుపొడి పోసుకోవటానికి పనికొస్తుందనీ, వ్యాటర్‍కాన్ అని పిల్లలూ, కొత్త ఫిర్కానాయకుడు పిల్లకాల్వమీద వంతెనగా పనికొస్తుందనీ, శిథిలావాస్థలో ఉన్న పాత దేవాలయం ధ్వజస్తంభంగా వాడవచ్చనీ… ఇలా ఇంకు పోసుకునే కలం అడుగుభాగం గురించి ఆయన అల్లిన అతిశయోక్తులు అన్నీ ఇన్నీ కావు.

అలాగే – చేతిగడియారం గురించి “రిస్ట్ వాచ్” అని కాక, “రిస్ట్ క్లాక్” అనడంలోనే ఆయన చమత్కారం తెలుస్తుంది. దానికి సరిపోయే స్ట్రాలు దొరక్క “నవారు” కట్టాల్సి వచ్చిందట. అలాగే మీసాల గురించి తీరు తీరుల వర్ణించి రాసారు. “మీసాల సొగసులు”లో మీసం పెంచేవారికి ఆత్మవిశ్వాసం ముదిరి ఎంతటి వారినైనా ఢీకొని “మీ సములు” అని ఆటోమెటిగ్గా అనగల్గుతారట.

“ఊరుగాయలరాణి, రుచుల కాణాచి, తెనుగోడి తుర్ఫు ఆసు, ఆంధ్రమహిళల గారాల కూచి, ఆవకాయ అవతరించటం జాతి అదృష్టం” అని “ఆవకాయ-అమరత్వం”లో ఆవకాయ పెట్టే క్రియను, యజ్ఞంగా అభివర్ణించి తెలుగు వారు మరువలేని హాస్యం పుట్టించారు. కాకి గురించీ, పిల్లి గురించీ కూడా పసందైన హాస్యం రాసారు. “మన గుణింతం కా, కి తోనో గదా ప్రారంభం” అంటారు. “సంసారంలో టపాకాయలు”లో దాంపత్య సరసంను వివరించారు. పూర్ణానందం గారు “కొంపాన్వేషణ”లో చుట్టమీద “నఫ్రీమేళం”లో తిండి మీద పద్యాలు కూడ అల్లారాయన. హాస్య కవిత్వమూ ఎడనెడ గుప్పించారు.

పూర్ణానందంగారి లైఫ్ ఫిలాసఫియే హాస్యం. తాను నవ్వుతూ, తన వారినీ, చుట్టుపట్లవారినీ ఎప్పుడూ నవ్విస్తూ వుండేవారు. పుట్టడమే నవ్వుతూ పుట్టారట! అక్టోబర్ 2010 ఒకటో తేదీ విజయవాడలో అభిరుచి సంస్థ పుచ్చా బుచ్చిబాబు, చాణక్య, శర్మ, రామకృష్ణ ఆయన కుమారులు. అల్లుడు జె.వి.నారాయణమూర్తిలతో భట్టు పట్టుతో, పి. పాండురంగారావు, కృష్ణాజీ, మాడుగుల రామకృష్ణల సారధ్యంలో – శతజయంతి సమాపన మహోత్సవం నిర్వహించి ఆయనను సముచితంగా స్మరించింది. పూర్ణానందంగారన్నట్లు “నవ్వు సంపూర్ణమే. ఎందరు నవ్వులు పెంచినా, ఎందరు నవ్వులు పంచుకున్నా, నవ్వులన్నీ టోటల్ చేసి, నవ్వులోంచి సబ్స్ ట్రాక్ట్ చేసినా, శేషం పరిపూర్ణహాసమే! నవ్వులోంచి ఒక నవ్విక, ఒక ముక్క విడదీసి చూచినా అదీ నిండు నవ్వే! ఎంచేతంటే నవ్వే దైవం”.

ఓం పూర్ణమిదః పూర్ణమిదం -పూర్ణాత్ పూర్ణముదచ్యతే-పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాచ శిష్యతే.

You Might Also Like

6 Comments

  1. Praveen vure

    మీసాల సొగసులు బుక్ ఎక్కడ దొరుకుతుంది ?

  2. బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-బ్రేక్ తరువాత… « PHANI BABU -musings

    […] చేసి,అప్పుడెప్పుడో పుస్తకం.నెట్ లో పరిచయం చేయబడ్డ శ్రీ పుచ్చా పూర్ణానందం గారి […]

  3. mohanramprasad

    గురుతుల్యులు పుచ్చా వారు పరమపదించినప్పుడు నేనొక మాట యిలా అన్నాను.
    ‘మా న్యాయవాదుల సంఘం గర్వంగా తిరిగే గొప్ప మీసాల్ని కోల్పోయింది.

  4. bphanibabu

    శ్రీ పూర్ణానందం గారు వ్రాసిన పుస్తకాలు ఎక్కడ లభ్యమౌతాయో చెప్పగలరా దయచేసి.

  5. ramesh babu alapati

    “1944లో విజయవాడకు వచ్చి ప్రాక్టీసు కొనసాగించి, 1933లో మరణించే వరకూ కూడా హాస్య రచయితగా”

    మొత్తానికి పూర్ణానందం గారి మీద జొక్ కాదు గదా. వారు 1983 దాక వున్న జ్ఞాపకం.

  6. SIVARAMAPRASAD KAPPAGANTU

    “…పూర్ణానందంగారు 1944లో విజయవాడకు వచ్చి ప్రాక్టీసు కొనసాగించి, 1933లో మరణించే వరకూ కూడా…”

    ఆయన మరణించినది 1933లో కాదు. సంవత్సరం చూసి సరిచేయగలరు.

    [సవరించాము. నెనర్లు! -పుస్తకం.నెట్]

Leave a Reply