The Rozabal Line

రాయాలనుకుని రాయకుండా దాటేస్తున్న పుస్తకాల జాబితా అలా పెరుగుతూనే ఉంది. కనీసం ఒకదాని గురించన్నా అర్జెంటుగా రాసేస్తే లోపలి మనిషి కొంతన్నా నస ఆపుతుందన్న తాపత్రేయం లో…ఈ టపా! ఇటీవలికాలం లో ఒక పుస్తకం మొదలుపెడితే, వారాలు గడుస్తున్నా అది ముగియడంలేదు. రోజులుకి పదీ,ఇరవై నిముషాల మీద చదవడానికి కుదరక! అలాంటిది, ఒక మూడొందలు పైగా పేజీలున్న పుస్తకం రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేయడం నాకు పెద్ద అఛీవ్మెంటే! ఆ పుస్తకం పేరు – ది రోజబల్ లైన్. రచయిత – షాన్ హైగిన్స్ అనబడు అశ్విన్ సంఘీ.

ప్రధానంగా, ఈ పుస్తకం కథాంశం – హిస్టారికల్ ఫిక్షన్ కిందకు వస్తుందనుకుంటాను. క్రీస్తు పూర్వాల నుండీ, 2012 దాకా జెరుసలేం నుండీ లండం దాకా,వాటికన్ నుండీ వైష్ణోదేవీ దాకా, హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాల నూ, టెర్రరిజాన్నీ, బోలెడు చరిత్రనూ – కలుపుకుంటూ పోయిన కాంప్లికేటెడ్ కథ.

ఈ పుస్తకంలో నాకు నచ్చే విషయాలు ఎందులో ఉన్నాయంటే –
1)ఆపకుండా చదివించడంలో.
2)ఎక్కడికక్కడ అసలు చరిత్ర గురించి కుతూహలం రేకెత్తించడంలో.
3)రకరకాల మలుపుల మధ్య కూడా అయోమయం లేకుండా కథను మలచడంలో
4)అన్ని శతాబ్దాలూ, రకరకాల దేశాలూ, భిన్న మతాలూ – ఇన్నింటిని కలిపినా, ఎక్కడా రెచ్చగొట్టేలా రాయకపోవడంలో.
5)అన్ని సంఘటనలు కలిపాడు కనుక – రచయిత ఊహా శక్తిలో
6)అలాగే, అతను కష్టపడి చేసుకున్న పరిశోధనలో

అసలు, వీటన్నింటినీ మించి, ఇది రాసింది ఒక భారతీయుడు అన్న విషయం నాకు మహదానందం కలిగించింది. ఎందుకంటే, ఇదివరలో చదివిన ఇండియన్ ఇంగ్లీషు నవలలు కాలక్షేపానికి బానే ఉన్నాయి కానీ, అంతకు ఒక స్టెప్పు ముందుకు పోలేదు. ఉదాహరణకి – డావిన్సీ కోడ్ ఉందనుకుందాం, అలా ఎంతో కొంత పరిశోధన చేసి, కాస్త ట్విస్టులూ గట్రా ఉన్న హిస్టారికల్ ఫిక్షన్ నవల – ఒక భారతీయుడు రాస్తాడో లేడో – అని అనుకున్నాను కానీ, రాసాడన్నమాట 🙂

కథ మహా సస్పెన్సులో ఉన్నప్పుడు వర్ణనలూ గట్రా పెడితే నాకు ఆట్టే నచ్చదు. సస్పెన్స్ తెగే దాకా భాషనో, భావంలోని కవిత్వాన్నో నేను అప్రీషియేట్ చేయలేను. ఈ నవల చదువుతున్నప్పుడు – అలాంటి అనుభవం ఎదురుపడలేదు. సస్పెన్స్ దృశ్యాలలో మంచి పట్టు ఉంది. అయితే, ముగింపు సన్నివేశాలు మాత్రం చాలా గబగబా నడిచిపోయినట్లు అనిపించింది. దీన్ని గానీ సినిమాగా తీస్తే కన్నుల పండుగే!

ఈయనెందుకు ముందొక మారుపేరుతో ప్రచురించాడో! (షాన్ హైగిన్స్ అన్న పేరుతో మొదటి ముద్రణలో విడుదలైందీ పుస్తకం).. అంతర్జాతీయ మార్కెట్టు కోసమా? ఏదో ఒకటి కానీ, ఇంతకీ, రచయిత పూర్తిస్థాయి రచయిత అనుకునేరు. అతనికి ఇదే తొలి నవల అట. పైగా, అతను కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తూ, తీరిక వేళల్లో పుస్తకం రాసాడట (ఏదీ…ఇంత పరిశోధనా చేసి! ఎంత లేదన్న కూడా, చాలా చదివి ఉండాలి ఇలా రకరకాల విషయాలని కథలో జొప్పించడానికి). అలాంటి వాళ్ళని చూసాకే ఎపుడన్నా ‘టైం లేదూ’ అని మనసు గోలపెట్టగానే ‘సిగ్గులేదూ’ అనాలనిపిస్తుంది…

రచయిత గురించీ, రచన గురించీ, రచన తాలూకా రీవ్యూల గురించీ అశ్విన్ సంఘీ వెబ్సైటులో (ఇక్కడ) చూడవచ్చు.

You Might Also Like

Leave a Reply