Dear D.
డియర్ డొరతీ..
ఉత్తరాలు రాయటం అనేది socially acceptable form of schizophrenia అని నా ఉద్దేశ్యం. వేరే ఊర్లో ఉన్నారనో, చూసి చాన్నాళ్ళైందనో రాయాలనిపించే – బళ్ళల్లో ఎనిమిది మార్కులకోసం ప్రాక్టీసు చేసి రాసే- ఉత్తరాలు చాలా వరకూ బద్ధకిస్తాయి. అదే రాయకతప్పని ఉత్తరాలు ఉంటాయని జీవితపు బడి బోలెడంత అనుభవపు జీతం కట్టి నేర్చుకున్నాక, అప్పుడు పక్కనున్నవాళ్ళకీ, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉన్నవాళ్ళకీ ఉత్తరాలు రాయకతప్పదు. గుండెల్లో కరుడుగట్టుకుపోతున్న భావోద్వేగాలను ఎక్కడో చోట దించకపోతే, లోపలున్న బాధంతా వెళ్ళగక్కకపోతే, బతకలేమన్న భయంతో, పూర్తి స్వార్థంతో రాయకతప్పని ఉత్తరాలను రాసిపారేస్తాం – చెత్తబుట్టలో అయితే మర్నాడు ఉదయం మనకాలనీ చెత్తలోకి చేరుతాయి. అదే అవతలి వాళ్ళ అడ్రస్సులో పారేస్తే, వాళ్ళు ఎంచక్కా చిత్తుకాగితాలుగా వాడుకోవచ్చు, లేక చలిమంట వేసుకోవచ్చు. లేదా వాళ్ల కాలనీ చెత్త పెరగొచ్చు. మధ్యనున్న పోస్టోళ్ళూ, కొరియరోళ్ళూ బాగుపడే అవకాశం ఇవ్వచ్చూ!
అవతలి వారు మన సమక్షంలో ఉన్నారని భ్రమసి, ఉండి మన మాటలనే శ్రద్ధగా వింటున్నారని గుడ్డిగా నమ్మి, మన గోడును వెల్లబోయటం లేత పిచ్చి. అది ముదిరితే ఇలా ఉంటుందన్న మాట – నా పుట్టుకకు రెండు మూడు దశబ్దాల ముందే పోయిన విదేశీ రచయితకు, నా భాషలో ఉత్తరం రాయటం!
ఇప్పుడు నాకంత కష్టమేమోచ్చిందీ అంటే.. కథ మొదట్నుండీ మొదలెడితే సరిపోతుంది. కాని నేను మొదటి కన్నా ముందునుంచి మొదలెడతానన్న మాట. అర్థరాత్రిదాకా ఇంటికి చేరే అవకాశం లేదని తెల్సాక, బుర్ర హాంగ్ అయ్యాక, చేదున్నర కాఫీ కూడా పనిచేయకపోతుంటే, ఏదైనా మంచి కథ చదువుకుందామని ఒక సైటు తెరచి, అందులో బోలెడు కథలున్నా, స్క్రోల్ బార్లకు భయపడి, ఓ కథ చిన్నగా అనిపించి మొదటి రెండు లైన్లు చదువుకొని “దేవుడా! వాడు కాల్ చెయ్యాలి ఇప్పుడు!” అంటూ అర్థించే ఆడపిల్ల కథేంటో నాకు తెలియాలని చదవటం మొదలెడితే ఆపకుండా చదవటం జరిగిపోయాక, “ఏం రాసాడూ….ఎవడో కానీ!” అననుకుంటూ బ్రౌజర్ మూసేసి, ఎంచక్కా మర్చిపోయాను.
మరపు మహా గొప్ప వరం. నాకుందది. కాని ప్రారబ్ధం! ఎవరో స్టేటస్ బార్ లో నీ కోట్ పెట్టారు. “భలే ఉందిగా” అన్నాను నేను ఊరికే ఉండక. “అవును… ఆవిడింకా భలే రాస్తుంది. వీలైతే చదవండి” అన్నారు వాళ్ళు. ’డొరతీ పార్కర్? ఎక్కడో విన్నానే ఈ పేరు?! గూగుల్… నీకెంత తెల్సు ఈ మనిషి గురించి? ఎవరో, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నవారే! ఓహ్… ఇది నాకు నచ్చిన కథ రాసిన వ్యక్తా? మగవాడు కాదా?’ అనుకున్నాను. (చదివాక తెల్సొచ్చింది.. నువ్వు ఆడవాడువని!)
ఆ తర్వాత, ఇక్కడ మా ఊర్లో నీ పుస్తకాలు దొరక్క, కూటికి లేనివాడు దొరికిన దానికల్లా కక్కుర్తి పడినట్టు, నెట్ లో ఎన్ని కవితలుంటే అవే చదివేశాను. అహా నుండి హహహహాహ మధ్య హా!హా! అనుకుంటూ నీతో చాలా దూరం ప్రయాణించేశాను. “రైట్.. రైట్” అనుకుంటూ ముందుకు నడిచేయడానికి సిద్ధపడి, నీ కథల పుస్తకం కొనుకున్నాను. చదవటం మొదలెట్టి ఏడాది కావొస్తుంది.. ఇంకా చదువుతూనే ఉన్నాను. ఎప్పటికీ చదువుతూనే ఉంటాను.
అమ్మాయ్! (ఇది హైట్స్ అని నాకు తెల్సు. కాని ఇప్పుడు ఈ ఉత్తరానికి సీన్ ఎలా ఉంటుందంటే… bonfire ముందు కూర్చొని కాక్‍టైల్ తాగుతున్న నిన్నూ, నీ ఎదురుగా కూర్చొని లొడలొడ వాగుతున్న నేను!) అందుకని అమ్మాయ్ అనొచ్చునులే!
అమ్మాయ్ – ఇందాక ఫ్లో కట్ అయ్యింది మరి – ఏం రాస్తావసలు? ఏమనుకొని రాస్తావూ? ఏమనుకోవాలని రాస్తావూ?
నిజంగా అడుగుతున్నా! మానవసంబంధాలను ఇంతిలా చీల్చిచెండాడాల్సిన అవసరం ఏముందని? అర్రే… మూడు, నాలుగేళ్ళ వయసొచ్చిన పిల్లలే, తల్లులు స్నానాలు చేయిస్తామంటే, సిగ్గుతో మెలికలు తిరిగిపోతారే! అలాంటిది నువ్వు బంధాలనూ-అనుబంధాలనూ నగ్నంగా మా ముందు నిలబెట్టటంలో నీ ఉద్దేశ్యం? అవేమన్నా కింగ్ ఫిషర్ కాలెండర్ మోడళ్ళు అనుకున్నావా? తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నా, కన్నుమరల్చకుండా చూడ్డానికీ? ఆస్వాదించటానికీ? మానవజాతి అతి జాగ్రత్తగా పీకలు నుండి పాదాల వరకూ పెద్ద గౌను తొడిగేసి, గాడిద మొహానికి బూడిద పూసినట్టు మేకప్ వేసి, మాంచి సెంటేసి… మానవసంబంధాలను ఫేరీటేల్స్ లోనూ, డ్రీం మూవీస్ లోనూ అమ్ముతుంటే.. మధ్యన నువ్వొచ్చి, “అంతా.. తూచ్! కొండదేవర మీద ఆన… నిజం చెబుతున్నా, నిజం తప్ప మరేం చెప్పనూ” అంటే ఏమయ్యిపోవాలి? కళ్ళకుగంతలు కట్టుకొని జీవిస్తుంటే, నువ్వు కళ్ళల్లో పడేట్టు ఫ్లడ్ లైట్లేస్తే ఎంత చూడగలమని అనుకున్నావ్?
Women are cruel! నిన్ను చదివాక, ఆ స్టేట్‍మెంట్ ను ఒప్పుకోక తప్పటం లేదు! అంతటి కౄరత్వాన్ని నింపిన వాళ్ళో, లేక అద్దంపట్టి చూపించే వాళ్ళు ఇంకెంత కౄరులో మరి!
మగాళ్ళని చీల్చిచెండాడి, ఆడాళ్ళు అంతటి వెర్రివెంగళమ్మలో చూపించి, ప్రేమను ఒక రకమైన మానసిక రోగం అని ఉన్న నిజాలను చెప్పేసి, జీవితం నుండి మృత్యువు వరకూ అన్నింటినీ ఉన్నవి ఉన్నట్టు చూపిస్తే… Lady! You mock Him! Not just that… the way you mock Him! వావ్! మనం చూడకూడదు అనుకున్న వాటిని చూడకుండా ఉండగలగటం ఒక వరం! ఆ వరం లేనివారికి మాత్రం, నిజాన్ని నిజంగా చూడగలిగిన (అభాగ్యులకు) వాళ్ళకి మాత్రం నీ రచనలు, ఒక ఊరట! ఒక బాసట! అంటే మనకన్నా అభాగ్యులను చూసినప్పుడు, మనకన్నా పీకలోతు కష్టాల్లో మునిగినవాణ్ణి చూస్తున్నప్పుడూ – ఒక సన్నటి ఆనందం కలుగుతుందే – దానికి సాటే లేదు! ఆమె అంది – అతడు అన్నాడు – ఆమె అంది – అతడు అన్నాడు – ఇలా సా..గే కథలు చదువుకోడానికి బాగోవని జనాలంటారు! ఇంకోటి మనలో మనమే వాక్కోవటం కూడా కథలకు సూట్ అవ్వవనీ అంటారు. జీవితాల్లో ఎటూ తప్పవు, కథలన్నా కాస్త మెరుగ్గా ఉండాలనేమో! నువ్వు మాత్రం… ఏం చెప్పను? పాపం, నువ్విప్పుడు ఎక్కడున్నావ్? పాపం – నీకు కాదు..నీ చుట్టూ ఉన్నవాళ్ళకి! పాపం, వాడు! నీతో ఎలా వేగుతున్నాడో ఏమిటో!
నీ రచనల్ని చదవమని మాత్రం ఎవ్వరికీ చెప్పటం లేదులే! “This is not a novel to be tossed aside lightly. It should be thrown with great force.” అని ఎవరి గురించో అన్నావ్ అట కదా! నీ పుస్తకాలూ అలానే పడేస్తారు జనాలు, కట్టుకొన్న పేకమేడల్లో నువ్వు కూల్చేస్తావని! నాకు చేతకాలేదనుకో… నారదుడి ఒక చేతిలో చిడత పట్టుకొని, “నారాయణా.. నారాయాణ!” అని భజన చేసినట్టు, నేను నీ కథల పుస్తకంతో నీ భజన చేశాననుకో! అయినా, ఎవ్వరికీ చెప్పటం లేదన్న మాట!
మాకో వాడుక ఉం(డే)ది… నిస్సహాయతలో ఉన్నప్పుడు, “తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టూ” అని. తూర్పే ఎందుకంటారో నాకు తెలీదు. కాని ఇప్పటి మేం మాత్రం (అందరూ కాదు!) ఊరికూరికే పశ్చిమానికి తిరిగి దణ్ణం పెట్టుకుంటుంటాం. ప్రేమించుకొన్నాక పెద్దాళ్ళు అడ్డు చెప్తే, “ఇదే.. అమెరికాలో అయితేనా…”, విడిపోవాల్సి వస్తే, “ఇదే… అమెరికా అయితేనా”, పెళ్ళి లాంటి ట్రాష్ లేకుండా జీవితాలని గడిపేయాలనుకుంటే, “ఇదే.. అమెరికా అయితేనా…” అనుకుంటూ అమెరికాను ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టేసుకొని బతికేస్తున్నాం. ఒక అరశతాబ్ధం ముందు అమెరికాలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో నీ కథల ద్వారా తెల్సుకున్నాక, ’అమెరికాలోనూ ఇంతేనా?!” అనిపించాక, ఎలా రికమెండ్ చేస్తా చెప్పు? ఆశ చంపేసే నిజం కన్నా, ఆశను బతికించే అబద్ధంలో బతికేయటంలో నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టినవాళ్ళు నీ కథలు చదివితే, దివాళా తీస్తారు మరి! వాళ్ళు కోపంలో నిన్ను ఏమన్నా అనొచ్చు, అసలే మాకు అమెరి’కంపు’ భాష బా వంటబట్టేసింది. మిడిల్ ఫింగర్లూ, “ఎఫ్”లూ… అమెరికా జనజీవన స్రవంతిలో కలిసిపోయాంలే!
ఇక్కడ గోల ఎప్పుడూ ఉండేదే కాని.. అక్కడి సంగతులెలా ఉన్నాయో చెప్పు! మిలన్ కుందేరా “ఇమ్మోర్టాలిటీ” అనే నవల్లో Goethe, Hemingwayల మధ్య ఆ లోకంలో జరిగే అద్భుతమైన సంభాషణ రాస్తాడులే! ఇప్పుడు మీరంతా అలా కల్సి కబుర్లాడుకుంటూ జోక్కుంటున్నారని నాకు మహా జలసీగా ఉంది.
సాహిత్యం అంటే గొప్ప అనుభూతిని ఇచ్చేదని నమ్మితే, నిన్ను తేలిగ్గా మర్చిపోవచ్చు. కలిగే అనుభవాలతో పాటు, చేతిలో ఝండూ బామ్ ఉందిగా అని తలబొప్పి కట్టించుకునే నాబోటి వాళ్లకి మాత్రం, you rock! అనుభవసారాన్ని ఇలా పుస్తకాల్లో దాచేసి, అవి మా కోసం వదిలేసినందుకు మాత్రం బోలెడు థాంక్స్! నీకు ఫ్పొగరనీ, నీ నాలుక పదుననీ, నీతో వేగటం కష్టమనీ – చాలా విన్నాను. ఏకకాలంలో ప్రేమించటం, ద్వేషించటంలో ఉన్న మజా వేరులే! అందుకే నిన్ను మర్చిపోవటం చాలా కష్టం!
ఏ లోకాన ఉన్నా.. వాళ్ళకీ చీకట్లో టార్చ్ వెయ్యి, చూసే ధైర్యం ఉన్నవాళ్ళు ఉండనే ఉంటారు! వాణ్ణి బతకనీ!
లవ్,
పూర్ణిమ
పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు
[…] పార్కర్ గురించి ఏం చెప్పను? I heart Dorothy Parker! […]
లలిత (తెలుగు4కిడ్స్)
పూర్ణిమా,
మొత్తానికి ఈమె రాతలు రుచి చూపించావు. చదవాలనిపించే ఆసక్తిని పెంచావు.
ఆమె సరే, నిన్నేమనాలి చెప్పు?
Telephone Call చదివాను.
కొన్ని కవితలు చదివాను. ఆమె గురించి కాస్త తెలుసుకున్నాను.
ఆమె చెప్పేది అర్థం అయ్యే దశలో ఉన్నాను.
ఇక ఈ వ్యాసం గురించి:
“ప్రేమను ఒక రకమైన మానసిక రోగం అని ఉన్న నిజాలను చెప్పేసి,” …
ఒక క్షణం ఆగుదాము. మానసికమైన dependency ని ప్రేమ అనుకోవద్దు.
“ప్రేమ” రోగం కాదు.
“మనం చూడకూడదు అనుకున్న వాటిని చూడకుండా ఉండగలగటం ఒక వరం! ఆ వరం లేనివారికి మాత్రం, నిజాన్ని నిజంగా చూడగలిగిన (అభాగ్యులకు) …”
నిజాన్ని నిజంగా చూడగలగడం అనేది వరం కాదని చాలా సార్లు అనిపిస్తుంది. నువ్విలా నిజాలు చెప్పేస్తే ఎలా? కానీ నిజమనే నిప్పును సరిగ్గా వాడుకోవడంలోనే ఉంది కదా challenge. నిజాన్ని చూసి నిరాశ పడితే అది శాపమే. నిజాలు అవతలి వారిలోనే కాదు మనలోనూ చూసుకుని, తెలుసుకుని, పక్క వారికన్నా ముందు మనని మనం “క్షమించుకుని” సహనం (అంటే భరించడం కాదు, అసహనానికి వ్యతిరేకార్థం) నేర్చుకోవడంలో ఉంది జీవిత రహస్యం. ఇలా ఎంతో రాసెయ్యాలని ఉంది. కాని నేను పూర్ణిమని కాదు కదా. ఆపేస్తున్నాను. కళ్ళు తెరిపించే నిజాలతో బాటు వెలుగుని భరించి అనుభవించగలిగే శక్తినీ చాటుతావని ఎదురు చూస్తూ…
Prasanthi
gaadida mohaaniki buudida pooyadam anna expression naaku chaalaa baagaa nachchesimdi. ameri’kampu’ kuudaa.
Purnima
@శారద: Sarada gaaru: Australian and NZ writers… wow! Should read them, some time soon. Why don’t you introduce them to us, meanwhile? Please.. Please..
@సౌమ్య: 🙂
@bhanu: Would like to know your opinion of it.
@Anusha: hmmmm… Women and cruelty.. not in that sense. Let me come back to you, with my thoughts on it.
@srihari: Glad you noticed it! It isn’t a typo! 😀
srihari
“ఆడవాడువని”—-idi typo error-owe leka kavalani use chesaaro teliyadu kaani…Baagundi!
Will atleast try to read one book of Dorothy Parker!!!!
nice letter 🙂
Anusha
ఎనిమిది మార్కుల కోసం రాసి రాసి అలవాటు ఐంది -అనడం పరమ సత్యం..కక్కుర్తి స్కూల్ తోనే మొదలవుతుందన్న మాట
women are cruel -చటుక్కున సూర్యకాంతం , ఛాయాదేవి గుర్తొచ్చారు
very transparent and honest letter purnima….
bhanu
పూర్ణిమ,
ఇది చూశాక ఆ కథలు తప్పకుండ ఉన్న పళంగా చదవాలి అనే విధంగా ఉంది . D ఏమిటా అని మొదలుపెట్టి చుస్తే చాలా ఇంటరెస్టింగ్ గా రాసారు
సౌమ్య
🙂 Good one!
శారద
పూర్ణిమా,
ఇంట్రెస్టింగ్ గా రాసారు. నేనింతకుముందే డోరతీ పార్కర్ కథలు కొన్ని చదివినా, ఎక్కడ చదివానో, ఏం చదివానో గుర్తు రాక కొంచెం అవస్థ పడ్డాను. మళ్ళీ తరువాత టెలిఫోన్ కాల్ కథ గుర్తొచ్చింది. మీరన్నట్టు చాలా నిజాయితీగా కొంచెం self-deprecating humorతో కూడినట్టనిపించింది. ఆస్ట్రేలియాకి చెందిన ఏమీ విట్టింగ్ (Amy Whitting), న్యూ జీలండ్ కి చెందిన కేథరీన్ మేన్స్ఫీల్డ్ (Katherine Mansfield) కథలు కూడా చదవండి, (ఇంతవరకూ చదవకపోయినట్టయితే). మీకు నచ్చే అవకాశాలు ఎక్కువ.
శారద