వీళ్లనేం చేద్దాం? – యండమూరి వీరేంద్రనాధ్

“ఈ రోజు నువ్వు చేస్తున్నపని…
రేపటి నీ గమ్యానికి నిన్ను దూరంగానో, దగ్గరగానో తీసుకెళ్తుంది.
ఇంతకీ నీ గమ్యం ఏమిటి?
డబ్బా? ఆనందమా?
కుటుంబమా? అధికారమా?”
అన్న ప్రశ్నతో మొదలైన యండమూరి వీరేంద్రనాథ్‌ కొత్త నవల ‘వీళ్లనేం చేద్దాం?’ ఎప్పట్లానే ఆపకుండా చదివిస్తుంది. ఆలోచింపజేస్తుంది. రచన విజయవంతమవటానికి ఈ లక్షణాలు చాలేమో. యండమూరి కలం నుంచి కొత్త నవలలు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే. ఏం కావాలో తెలియక, అందర్లాగే మనమూ అంటూ జీవితపు పరుగుల్లో కొట్టుకుపోతున్న వారిని ఆపి, ఆలోచించమంటుంది ‘వీళ్లనేం చేద్దాం?’ ఈ నవల కథ గురించి చెప్పాలంటే – తరాలు తిన్నా తరగని సొమ్మును సంపాదించాలనుకునే రాయకీయ నాయకుల ప్రయత్నాలను విమర్శించడం. అంతే. కానీ యండమూరి నవలలు సొంతగా చదువుతుంటే వచ్చే మజా వేరెవరో కథ చెబితే రాదనుకుంటా. ఆయన కథ, కథనం, శైలి.. వీటన్నిటి మీదా భిన్నాభిప్రాయాలున్నా, ఆయన నవలల్లోని కొటేషన్లు మాత్రం ఎక్కువమందిని ఆకట్టుకుంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ – రుచికి…

* మీ సౌఖ్యాల కోసం సంపాదిస్తే అయితే అర్థం చేసుకోవచ్చు కానీ, ప్రజాధనాన్ని ఇంత కొల్లగొట్టి, ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములూ ఎవరికోసం కూడబెట్టారు? అయిదు తరాల ఆస్తిని ఏం చేసుకుంటారు?
మీ మీ సొంత ప్రయోజనాల కోసం ధర్నాలు, బందులు.. చేసే పనుల్లో కల్తీలు.. దాదాగిరీ.. నాకు నిజంగా అర్థం కావటం లేదు. సంపాదన ఒక వ్యసనంగా ఎందుకు చేసుకున్నారు? పదవిలోకి రావటం కోసం రైతు, కమ్మరి, కుమ్మరి లాంటి రకరకాల వేషాలు వేసి ఆయా వృత్తుల వారిని మెప్పించటానికి ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఎవరికోసం ఇదంతా?

* మానవుల పరిస్థితి ఎప్పుడూ ఒక్కటే.. వాటికి వారు వెతుక్కునే పరిష్కారాలే వేరు. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని తగలబెట్టేవారు. ఇప్పుడు తండ్రి చనిపోతే, తల్లిని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. అంతే తేడా!

* అవతలివారికి లేనిది మనం చూపిస్తే వారు సంతోషించరు. తమ చేతకానితనాన్ని ఒప్పుకోరు. అసూయని అభినందనల్తో అద్దుతారు. పైకి నవ్వుతూ కంగ్రాట్స్‌ చెపుతారు.

* సంపాదనకి అంతున్నది. విజయానికి అంతులేదు.

* అవసరమైనదానికన్నా ఎక్కువ ఉత్సాహం చూపకు.

* పాతికేళ్ల వయసులోపు ఒక వ్యక్తి, జీవితంలో ఒకటైనా మంచి పుస్తకం చదవకపోయినా, కనీసం ఒకసారైనా థియేటర్‌లో ఒక నాట్యంగానీ, నాటకంగానీ, మ్యూజికల్‌ ప్రోగ్రాంగానీ చూడకపోయినా, పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్లకపోయినా, కనీసం రాష్ట్రస్థాయి ఆటలపోటీని ఒకటైనా సరే ప్రత్యక్షంగా చూడకపోయినా – ఏదో మిస్‌ అయ్యాడని నా అభిప్రాయం.

* ‘తాను జీవిస్తున్న విధానం పట్ల తన సిద్ధాంతాల్ని నిర్భయంగా ప్రకటించుకోగలిగే శక్తిని ప్రతి వ్యక్తీ సమకూర్చుకోవాలనీ, ఒకలా ఆలోచిస్తూ మరోలా బ్రతక్కూడదనీ చెప్తాడు. మాంసం తింటూ ఎముకలు మెడలో కట్టుకోనవసరం లేదుగానీ, ‘నేను శాకాహారిని’ అని అబద్ధం చెప్పవల్సిన అవసరం లేదంటాడు. నీ అభిప్రాయాల్నీ, జీవనవిధానాల్నీ నువ్వే ఇష్టపడకపోతే, ఇంకెవరు ఇష్టపడతారని ప్రశ్నిస్తాడు.’ ఆ థియరీ నాకు నచ్చుతుంది.

* మీ మనసుకు ఏది శాంతినిస్తుందో అది చెయ్యాలి. మీరే కాదు, మీలాంటివారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చేస్తూ బాధపడతారు.. చెయ్యక బాధపడతారు. సిగరెట్లు తాగుతూ బాధపడి, మానేసి బాధపడి, తిరిగి తాగుతూ బాధని కొనసాగిస్తారు. ఇడ్లీ తింటూ పక్కవాడి పూరీ చూసి బాధపడతారు. ఛాటింగులు చేస్తూ, చదువు మీద శ్రద్ధ నిలవటం లేదని బాధపడతారు. యూ డోంట్‌ బిలాంగ్‌ టు యువర్‌ సెల్ఫ్‌. మీలాంటివారి గురించే భగవద్గీతలో కృష్ణుడు ‘చేస్తున్న పనిలో నిరంతరం ఆనందం పొందటమే జీవితం’ అన్నాడు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేని మీరు, జీవితం అనే వర్షాన్ని ఆస్వాదించలేక, కాలం విదిలిస్తున్న నీటి చుక్కల్లో ఆనందపు స్వాతి చినుకు ఇంకెప్పుడో వస్తుందని,  బ్రతుకంతా ఆల్చిప్పల్లా ఎదురుచూస్తూనే ఉంటారు. ఒకవైపు అశాంతిని కౌగిలించుకుని మరొకవైపు శాంతిని భార్యగా ఊహించుకుంటారు.

* ఆస్తి అనేది నువ్వు ఇతరులకి చూపించేది కాదు. నువ్వు అనుభవించేది. చాలామంది డబ్బు అనుభవించరు, చూపిస్తారు.

* దేనికోసం ఏది వదులుకోవాలో తెలియటమే శాంతి.
వదిలేసిన దానిగురించి బాధపడకుండా ఉండటమే శాంతి.
ఇతరుల అధికారాన్ని ఆస్తినీ, కీర్తినీ చూసి అసూయ పడకుండా ఉండటం శాంతి!
కష్టం – అశాంతి. సుఖం – శాంతి. పోలిక – అశాంతి, సంతృప్తి – శాంతి.
బంధం – అశాంతి, చిరునవ్వు – శాంతి. నిర్వాణం – శాంతి. స్వార్థం – అశాంతి!
ప్రకృతి – శాంతి. దాని ఆస్వాదన శాంతి.
————–
‘వీళ్లనేం చేద్దాం?’ (Veellanem cheddam)
యండమూరి వీరేంద్రనాధ్ (Yandamoori Veerendranath)
పేజీలు 196, వెల 100
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోనూ లభిస్తుంది.

You Might Also Like

17 Comments

  1. varaprasad.k

    ఆయన రచనలు మొదలు పెట్టినప్పటినుండి అనేక విమర్శలు, ఆయన వేటికీ స్పందించ లేదు. మరో పుస్తకం రాసుకొనేవాడు అంటే.మనలా పాఠకులే రక రకాలుగా వ్యాఖ్యానాలు చేసుకొని, ఆ తరువాత మనకు మనమే సర్దుకొని, మనకు నచ్చిన విధంగా సర్దుకొని పోతున్నాం.అయితే ఆయన రచనా వ్యాసంగం అప్రతిహతంగా అలా సాగిపోతూనే వుంది. మనం ఎపుడు రాస్తారా, ఎపుడు చదువుదామా అని ఎదురు చూస్తూనే వున్నాం. కాబట్టి ఇంకా మరిన్ని మంచి రచనలు ఆయన నుండి రావాలని కోరుకుందాం.

  2. Mamidi Kondalu

    ఈ నవల నేను చాలరోజుల తర్వాత చదివాను చాల బావుంది ఇ లాంటి ఇకముందు కూడా రావాలని కోరుకుంటున్నాను.

  3. varaprasad

    యండమూరి రచనా శైలి ఇంకేవరివల్ల కాదు,

  4. ram

    ee pusthakam yenni sarlu chadivina modatisari chaduvuthunnantha vudveganga vuntundi.yandamoori rachnallo naku nachchedi sandharbhochitha haasyam,vyakthitwa pariseelana. naku baga nachchina navalalu: priyuralu piliche,sampoorna premayanam,thappu cheddam randi,dabbu to the power of dabbu,abhilasha.

  5. m krishna mohan

    sir please try to write a commercial novel once again and lets start convert the people fromTVs to novels.

  6. తెలుగు లో మీ ముందుకు

    నన్ను కూడా ఈ పుస్తకం ఏక బిగిన చదివించింది..కానీ పుస్తకం మూసేసాక బలమైన ముద్ర వేయలేకపోయింది..నా రివ్యూ..

    http://telugulomeemunduku.blogspot.com/2009/02/blog-post.html

  7. rajirayapati

    eee book nenu kooda chadivanu confusing ga undi konnichotla situations asalartam kavatledu kani nakokati nachindi emi cheppalanukuntunnaro adi clear ga undi

  8. అరుణ పప్పు

    పాల్ కొయిలో పుస్తకం ‘బ్రిడా’ నుంచి గ్రహించిన స్ఫూర్తితో యండమూరి ఈ పుస్తకాన్ని రాశారని ఎవరో అనగా విన్నాను. బ్రిడా నేను చదవలేదు. రెండు పుస్తకాల్నీ చదివినవారుంటే ఇది నిజమో కాదో చెప్పండి.

  9. కె.మహేష్ కుమార్

    ఒక తరం ఇంకా తెలుగు పుస్తకాలు శ్రద్దగా చదువుతోందంటే, అందుకు అధికార భాషా సాంఘంవారు సలిపిన కృషికన్నా యండమూరి రాసిన పుస్తకాల ప్రభావం ముఖ్య కారణం.

    ఈ నవలని ఇప్పుడే చదవడం ముగించాను. అదీ ఒకసారి మొదలెట్టి రెండు గంటల్లో ముగించాను. అదే యండమూరి శైలి. తన పేరు బలంతో కొనిపిస్తాడు. తన రచనా శైలితో చదివిస్తాడు. తన ఆలోచనల్తో మనల్ని ఆలోచింపజేస్తాడు. అంతకంటే ఒక రచయితకు “మంచి లక్షణాలు” ఏమికావాలో నాకైతే తెలీదు. అందరూ ఎగబడి చదవటం అతని గొప్పేతప్ప కమర్షియల్ రచయిత అవడం తప్పెలా అవుతుందో అర్థం కాని ప్రశ్న.

  10. Dreamer

    బాబూ బ్యూటిఫుల్ మైండూ… ఒక్కసారి చదివేసరికే దేవుడు కనిపించాడు, ఈ నవల్నేం చేద్దాం అంటే తగలెయ్యమన్నాడు. I can’t waste another 3 hours of my life on this crap, Thanks for the advice anyway 🙂

  11. dhoom

    యండమూరి రాసిన “వీళ్లనేం చేద్దాం” అనే నవల పేరుపెట్టుకున్న పుస్తకం రివ్యూ.. దానిపై వచ్చిన కామెంట్స్‌ చాలా ఆసక్తి కలిగించాయి. ఈ విషయంపై కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ద ఫిష్‌.. ద సెవెన్‌ హేబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫక్టివ్‌ పీపుల్‌, ద ఎయిత్‌ హేబిట్‌, పాలో కోలో పుస్తకాలు చదవిన వారికి యండమూరి భావనలు కొత్తగా అనిపించవు. కాని యండమూరి మంచి అనువాదకుడనిపిస్తుంది. ఒక భావనను (అది ఎక్కడిదైనా.. నూటికి తొంభై సార్లు ఇంగ్లిషు పుస్తకాల నుంచి తీసుకొని) స్థానిక కాలమాన పరిస్థితులకు తగినట్లు అన్వయించుకొని దానికి పాఠకులకు పట్టేడట్లు అందించటం యండమూరి ప్రత్యేకత. తెలుగు వారు అన్ని ఇంగ్లిషు నవలలు చదవలేరు కాబట్టి.. ఇంగ్లిషు నవలలను తెలుగీకరించాల్సిన అవసరం కూడా ఏర్పడి ఉండచ్చు. ఇదే ఆయనను కమర్షియల్‌గా విజయవంతమయిన రచయితను చేసింది. ఇంగ్లిషు సాహిత్యం ఒరవడి మారిన తర్వాత- పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ రచనలకు ప్రాముఖ్యం పెరిగిన తర్వాత- యండమూరి కూడా ఆ పంధాలో పయనించటం మొదలుపెట్టారు. తన హంచ్‌ ఎప్పుడూ తప్పు కాదని నిరూపించుకున్నారు. ఇంత చెప్పిన తర్వాత కూడా.. యండమూరి రచనలకు విశిష్టత లేదని.. అవి రచనలు కావని ఎవరైనా అంటే అది సబబు కాదు. ఆధునిక సాహితీ చరిత్రలో యండమూరి గురించి ఫుట్‌నోట్‌లో తప్పకుండా ప్రస్తావన ఉంటుంది.

    1. varaprasaad.k

      ప్రతి కధకు మూలం ఎక్కడో విన్నట్టో,చదివినట్టో ఉండటంలో ఆశ్చర్యం లేదు.కధనం మాత్రం మనకు అర్ధమయ్యేట్టు raastene రచయితా ప్రజ్ఞ అర్ధమయ్యేది,జనం బుర్రలోకి ఎక్కేది.

  12. A beautiful mind

    @Dreamer

    నీకు సరిగా అర్దం కాలేనట్లుంది మల్లి చదువు….

    @neelaanchala

    ఇప్పుడే నిద్ర లేచి మంచి గురించి మాట్లాడుతున్నట్టున్నావు….ఆయన చాలా రోజులనుంచి మాటలాడుతున్నాడు…నువ్వు ఇప్పుడైనా నిద్ర లేచి….”తప్పు చేద్దాం రండి” , “విజయానికి ఆరో మెట్టు చదువు”….all the best

  13. పుస్తకం.నెట్

    @neelaanchala:

    “పుస్తకం” ముఖ్యోద్దేశ్యం పుస్తకాల పై అభిప్రాయాలను / అనుభవాలను అందరితో పంచుకోవటం. ఈ సైటు నిర్వహించడానికి అదే మూల సూత్రం. పుస్తకం లో రాయడానికి కమర్షియల్ – నాన్ కమర్షియల్ లాంటి అడ్డంకులు లేవు, ఉండబోవు.

  14. neelaanchala

    “పుస్తకం” మంచి పుస్తకాలనుంచి చివరికి కమర్షియల్ నవలలు, క్రైం స్టోరీల స్థాయికి దిగడం ఆశ్చర్యంగా ఉంది.

    1. surampudi pavan santhosh

      కమర్షియల్ నవలలు అంటే నవలా సాహిత్యంలోనే కమర్షియల్ టచ్ కోసం కొన్ని హంగులు అద్దుకున్నవనే అర్ధంలో చూస్తే, వాటిలో మీరన్న సోకాల్డ్ మంచిపుస్తకాలూ ఉంటాయి. ఉన్నాయి. రాక్షసుడు, ఋషి, వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ, ప్రార్ధన ఇలా ఎన్నో అద్భుతమైన నవలలు రాసిన యండమూరి వీరేంద్రనాధ్ వి మంచి పుస్తకాలు కాదంటున్న మీరు ఓసారి మీ మూస అభిప్రాయలు సమీక్షించుకోవాలి. యండమూరి రచనా జీవితం పరిశీలిస్తే ఒక స్థాయికి వచ్చాకా ఆయనలోని క్రియేటివ్ పీక్ అందుకుని, తర్వాత సూచీ కిందకి చూడడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఆంధ్రపాఠకలోకంలో పుస్తకపఠనాభిరుచి తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యింది. కాబట్టి ఆయన చెత్త రచనలు చూసి అన్నింటినీ అలాగే లెక్క వేయడం సరికాదు.

  15. Dreamer

    యండమూరి ఇదంతా ఇంకో నాన్-ఫిక్షన్ పుస్తకంలో రాసుంటే చాలా బావుండేది. కానీ ఈ పుస్తకానికి నవల అని పేరుపెట్టి మార్కెట్ చెయ్యడం మాత్రం 🙂

    చివరికొచ్చేసరికి అసలు ద్వైత మహర్షి ఎవరో, భరద్వాజ ఎవరో, ఎవరు కథ చెప్తున్నారో, అసలు మనం ఎక్కడ మొదలెట్టామో అంతా కన్ఫ్యూజింగా ఉంది. రెండు పారలల్ ట్రాక్స్ మొదలెట్టి వాటికి ముగింపేమీ లేకుండానే వదిలేశాడు. When he said its an absurd novel, I expected another “Thriller”.

    This can surely be Yandamoori’s Worst novel ever.

Leave a Reply