పుస్తకం
All about booksఅనువాదాలు

June 24, 2010

సమయానికి తగు… కవిత్వం (A Poem at the right moment)

More articles by »
Written by: అతిథి
Tags:

రాసిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి
*************************
మనందరం అనేక కవితా సంకలనాలు చదివాం; ఇంకా చదువుతున్నాం. చదవబోతాం కూడా. ఎంతోమంది కవిత్వం రాసారు. రాస్తున్నారు కూడా. చదివిన వాటిల్లో ఏ పాటి కవిత్వం మనల్ని వెంటాడుతుంది? ఎన్ని కవితలు మనకి గుర్తుంటున్నాయి? ఏ కవితా భావం కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది? ఏ కవి మన మదిలో పీఠం వేసాడు? ఇలాంటి ప్రశ్నలకి గతంలో తడువుకోకుకుండా జవాబు చెప్పగలిగేం కానీ, ప్రస్తుతం మాత్రం చెప్పడం చాలా తేలిక. కవులెక్కువయ్యి కవిత్వం పల్చబడింది. అలాంటివి లిప్త కవిత్వాల కోవకి చెందుతాయి. ఎందుకంటే కవిత్వం చదవడం వెనుకే మర్చిపోడం జరుగుతోంది. మదిని వెంటాడే కవిత్వం వద్దన్నా గుర్తుండి పోతుంది. ఒక్కోసారి రాసిన కవి గుర్తున్నా, గుర్తుండకపోయినా ఆ రసధార మాత్రం స్థిరంగా నిలిచిపోతుంది.

సరే – కవిత్వం ఎక్కడనిలుస్తుంది? రాసిన కాయితాల మీదా? ఎంతకాలం బ్రతుకుతుంది? మనిషి ఉన్నంతకాలమూనా? సూటిగా ప్రశ్నించుకుంటే వీటికి జవాబు మన దగ్గరే వుంది. మంచి కవిత్వం ప్రజల మదిలో నిలుస్తుంది. నాలుకలమీద నాట్యమాడుతుంది. మంచి కవిత్వానికి మరణం వుండదు. అంటే ఒకరి నోటి ద్వారా మరొకరికి చేరుతుంది. ఒక తరం నుండి మరో తరానికి అప్పజెప్పడం ద్వారా ప్రవహిస్తుంది. అందుకే పూర్వం అందరికీ పద్యాలన్నీ కంఠతా వచ్చేవి. తద్వారా ఆ కవిత్వానికీ, కవికీ ప్రాచుర్యం లభించేది. ఫలనా పద్యం చెప్పగానే కవీ, లేదా కవి పేరు చెప్పగానే రాసిన కవిత్వమూ గుర్తు రావడం ఉండేది. ఈ విధంగా మన పెద్దల ద్వారా చాలా పద్యాలే మనకి తెలిసాయి. ఈ క్రమంలో కవులకి చెందని కొన్ని పద్యాలు వారి పేర్ల మీదే చెలామణీ అవుతూ వచ్చాయి. వస్తున్నాయి. ఉదాహరణకి తెలుగు వారికి బాగా పరిచయమున్న “జో అచ్యుతానంద జోజో ముకుందా” లాలి పాట అన్నమయ్య రాసినట్లుగానే ప్రజల్లో వుంది. కానీ అది ఆయన రాసింది కాదనీ, వేరెవరో రాసారన్న వాదనలు చాలా వున్నాయి. అలాగే త్యాగరాజు పేరు మీద అనేక ప్రక్షిప్త కృతులూ చెలామణీ అవుతున్నాయి. నిజానికి అవి ఆయన రాసినవి కావు. “ఎక్కడి మానుష జన్మంబెత్తితి” కీర్తన అన్నమాచార్య కీర్తనగా అందరూ పాడేస్తున్నారు. కానీ అది రాసింది ఆయన మనవడు చిన తిరుమలాచార్య. ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. ఇక్కడ కవిత్వానికి ప్రాముఖ్యత కానీ, కవికి కాదంటారు కొందరు. ఎవరు రాసిందయితేనేం కవిత్వం తరతరాలుగా అందుతోందికదా? అనంటారు మరికొందరు. అదేమిటి కవిత్వానికే తప్ప, రాసిన కవికి ప్రాముఖ్యత అవసరం లేదా? అని వాపోతారు ఇంకొందరు. ఈ ధోరణి ఇప్పటిది కాదు. తెలుగు సాహిత్యంలో అనాదిగా జరుగుతున్నదే!

కొన్ని పద్యాలు ఎవరు రాసారో ఒక్కోసారి తెలీదు. పద్యం మాత్రం చక్కగా బ్రతుకుతుంది. ఇవి కొన్ని తరాలుగా మనకి చేరాయి. మౌకికంగా పద్యం ఒకరి నుండి మరొకరి చేరేదే ముఖ్యాంశం తప్ప ఎవరు రాసారన్నది కాదు. ఒక్కోసారి ఒకరు రాసింది మరొకరి పేరు మీద ప్రజల్లో తిరుగుతూ ఉంటుంది. సందర్భోచితంగా రాసిన అటువంటి వాటిని చాటు పద్యాలంటారు. వీటికి రచయితలెవరో తెలీదు. ప్రసిద్ధ కవుల పేరుమీద కొన్నిబ్రతికేస్తాయి. కొన్ని పద్యాల చుట్టూ అల్లబడిన కథల రూపంలో పదిమందికీ లభించాయి. తెలుగు పద్య సాహిత్యంలో చాటు పద్యాలకి చాలా ప్రాముఖ్యత వుంది. చాలామందికి చిన్నతనంలో పద్యం పరిచయం అయ్యేది ఈ చాటువుల రూపంలోనే!

గతంలో చాటువుల మీద తెలుగులో చాలా పుస్తకాలే వచ్చాయి. అవి వేరే భాషల్లోకి అనువదింపబడ లేదు. అలాగే ఇతర భాషల్లో చాటువులు మనకూ అంతగా తెలీదు. ఇటువంటి చాటు పద్యాలన్నీ జాగ్రత్తగా ఏర్చి కూర్చీ, వాటినన్నింటినీ ఇంగ్లీషులోకి అనువదించీ, చాటుటువులని వేరే భాషల వారికి పరిచయం చేసిన ఘనత వెల్చేరు నారాయణ రావూ, డేవిడ్ షుల్మన్‌లకి దక్కుతుంది. వారు రాసిన “ఎ పొయం అట్ ది రైట్ మొమెంట్” ( A Poem at the Right Moment ) అనే పుస్తకంలో తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో వచ్చిన ఆణిముత్యాల్లాంటి చాటు పద్యాల అనువాదాలూ, సందర్భమూ, వివరణలతో వున్నాయి. సాధారణంగా అనువాదాల్లో అర్థాలు జారిపోతాయి. ముఖ్యంగా కవిత్వంలో. ఈ పుస్తకంలో అసలు మూల పద్యం చదవకపోయినా అనువాదమొక్కటి చదివినా చాలు, అది ఎంతమంచి కవిత్వమో తెలుస్తుంది.

ఉదాహరణకి ఈ క్రింది అనువాదం చూడండి.

Condemn me, O Creator,
to any punishment you see fit
for all the sins I’ve committed.
But the hell of reading poetry
to those who have no taste for it—
not that, not that!

– ఈ పద్యం మూలం చెప్పను. మీరే ఊహించుకోండి. కొన్ని చోట్ల అసలు పద్యాల కన్నా అనువాదాలే గొప్పగా అమరాయాన్నట్లున్నాయి. ఇలాంటిదే మరోకటి.

KumbhakarNa loved Sleep.
After Rama killed him in battle,
Sleep was widowed.
Since then, she spends her time
at lectures.

-సాహిత్య సభల్లో కవుల స్థితినీ, సాహిత్య పరిస్థితిని చెప్పే ఒక సంస్కృత శ్లోకం అనువాదం అది. ఎంత అందంగా వుందో కదా? అలాగే ఒకరి వీపు మరొకరు తరచుకునే వారి గురించి మరొక చురక చాటువు.

When a camel gets married,
the donkey performs the wedding.
Each praises the other:
“Whata beauty!” “What a voice!”

-ఇలాంటివి ఈ పుస్తకంలో అనేకం వున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా కవుల గురించీ, ఆ చాటు పద్యం ఎవరి వద్దనుండి లభించిందీ వంటి వివరాలూ ఇచ్చారు. పుస్తకంలో ఉన్న చాటువుల అనువాదాలన్నీ చెప్పడం నా వుద్దేశ్యం కాదు. కొన్ని మచ్చుక్కి చూపించానంతే!

కాళిదాసు పేరున ఉన్నవీ, తెనాలి రామకృష్ణ పేరునున్నవీ, విక్రమార్కుడివీ ఇలా చాలా చాటువులని సవివరంగా పరిచయం చేసారు. మీకు తెలుగు రాకపోయినా, సంస్కృతం అర్థంకాకపోయినా నష్టం లేదు. ఇంగ్లీషు అనువాదం చదివినా అంతగానే ఆనందిస్తారు. ఈ మధ్యకాలంలో నేను ఇన్ని సార్లు చదివిన పుస్తకం ఇంకొకటి లేదు. చాలా సార్లు చదివాను. చదివిందే మరలా చదువుతున్నాను. ఎంత చదివినా అదొక కొత్త సందర్భంగానే మిగులుతోంది. ఎన్ని సార్లు రుచి చూసినా, అభిరుచి పెరుగుతూనే వుంది.

కవుల గొప్పతనం గురించి చెప్పే ఒక సంస్కృత పద్యం అనువాదం ఎంత అందంగా వుందో చూడండి.

The world is really two, made of name and form.
One the poet creates.
The second comes from God.

-అన్నీ ఇంగ్లీషు అనువాదాలే ఎందుకిచ్చానంటే, వాటి మూలాలు తెలుసుకోవడానికీ పుస్తకం తప్పకుండా చదువుతారన్న ఆశతో! అంత కంటే వేరే వుద్దేశ్యం లేదు. ఇంకా ఈ పుస్తకంలో చాటు పద్యాలపై మంచి వివరణుంది. ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఒక అంశమొకటుంది. చాటువుల సేకరణలో వాటి మూలాల్ని చెప్పడమే కాకుండా, ఆ చాటువు క్రింద ఎవరి ద్వారా అది లభించిందో కూడా ప్రస్తావించారు. ఇదొక మంచి పద్ధతిని అవలంబించారు. బావుంది. కొన్ని చాటువులు మనం తరచూ విన్నా, మరికొన్ని కొత్తవి ఈ అనువాదాలకి ఎంచుకున్నారు. అలాగే తమిళ భాషలో ఉన్న చాటు పద్యాలు కూడా ప్రచురించడం వల్ల ఈ పుస్తకానికి విశిష్టత పెరిగింది.

జీవితంలో మాధుర్యాన్ని చెప్పే ఒక చాటువు అనువాదం చెప్పి ఈ ఇది ముగిస్తాను.

The Tree of Life is bitter,
but it has two fruits:
good poetry
and a good friend.

అతి సరళమైన భాషలో అందరికీ సులభంగా అర్థమయ్యేలా అనువాదాలు చేసారు. ఒక అమెరికన్ మిత్రుడికి ఈ పుస్తకం చదవమని ఇచ్చాను. ప్రతీ పద్యానికీ క్రింద ఇంగ్లీషులోనే అసలు పద్యం చెప్పారు. అతనికి భాష రాకా, అర్థం కాకా మూలం చదవలేక పోయాడు. పద్యాలకి కేవలం ఇంగ్లీషు అనువాదాలు మాత్రమే చదివీ ఎంతో బావుందనీ చెప్పి తనూ ఒక ప్రతి కొనుక్కున్నాడు. మంచి కవిత్వానికి మది వాహకమయితే, మంచి పుస్తకానికి అభిరుచే ఆయువు పోస్తుంది.

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ప్రచురించిన ఈ పుస్తకం మీకు Amazon.Com లో దొరుకుతుంది. లేదా “గూగిలించండి. ఇంతవరకూ మీరు చదవకపోతే ఇప్పుడైనా చదవండి. సమయం మించి పోలేదు. ఒక్కసారి చదివితే ఒదిలి పెట్టలేం. ఒకటికి పది మార్లు మాత్రం ఖచ్చితంగా చదువుతారన్న నమ్మకం మాత్రం నాకుంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.7 Comments


 1. హెచ్చార్కె

  @బ్రహ్మానందం: మీరన్నది నిజమే. అనువాదం అనే పనిలో అలాంటి సమస్యలున్నాయి.
  ఈ చాటువులో మూలాన్ని మనం ఎందుకు అంతగా ఇష్టపడతామో, ఆ అంశం అనువదితం కాలేదు. ఉదాహరణకు__ చతురాననుడు సృష్టికర్త, తల రాతలు రాసేవాడున్నూ. ఇంగ్లీష్‍ అనువాదంలో సృష్టికర్త అనే పనిని సూచించారు. అది కాకుండా, తల రాతలు రాసేవాడి పనిని సూచించి వుంటే, మూలం లోని స్వారస్యం బాగా తెలిసేది. ‘తల రాత’ అనే భావన ఇంగ్లీష్‍ వాళ్లకు లేకపోవచ్చు. ఆర్ కే నారాయణ్‍ వంటి ‘ఇండియన్-ఇంగ్లిష్‍’ రచయితలు చూపిన మార్గం ఇలాంటి చోట్ల పనికొస్తుందేమో, పెద్దలు ఆలోచించాలి.
  పుస్తకం వీలయినంత తొందరగా సంపాదించి చదువుకుంటాను. థాంక్యూ.


 2. బ్రహ్మానందం

  హెచ్చార్కె గారూ,

  ఈ పుస్తకాన్ని అందరూ చదవాలన్న ఉద్దేశ్యంతోనే, కావాలనే నేను మూలాలు చెప్పలేదు. ఇహ మీరు సాగిల పడిన అనువాదం గురించంటారా? అనువాదాల్ని మూల చక్షువులతో చూస్తే కుదరలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే మూలం మనలో అంతగా నాటుకు పోయింది మరి. అయినా అనువాదాలు ఇతర భాషల వారికోసం కదా? మన పద్యాల్లో మాధుర్యాన్ని మరో భాషకి పరిచయం చెయ్యడం కోసమని అనుకుంటున్నాను. శ్రీ శ్రీ పద్యాల ఇంగ్లీషు అనువాదాలు చదివి పెదవి విరిచిన తెలుగు వారెందరో ఉన్నారు. అక్కడ కూడా మూలం మనలో అంత లోతుగా పాతుకు పోవడమే కారణం అని నా అభిప్రాయం. చాలా అనువాదాలున్నాయి ఈ పుస్తకంలో! నూటికి ఎనభై శాతం చక్కగా కుదిరాయి. వీలయితే పుస్తకం చదవండి.

  -బ్రహ్మానందం


 3. హెచ్చార్కె

  మంచి పుస్తక పరిచయం. చాటువుల మూల పద్యాలను కూడా ఇక్కడ ఇచ్చి వుంటే బాగుండేది. ఉదాహరణకు, మొదటి చాటు పద్యం మొదటి సారి విన్నప్పుడే దానికి సాగిల పడిపోయాను. ఇక్కడ అనువాదం (Condemn me, O Creator,…) ఆ అనుభూతిని ఇవ్వడం లేదు. ‘అరసికునికి కవిత్వం వినిపించే ‘కర్మ’ నా నుదుట రాయొద్దు రాయొద్దు రాయొద్దు బ్రహ్మదేవుడా!’ అనడంలో వున్న సజీవమైన వాక్కు అనువాదంలోనికి రాలేదు. ఇలాంటప్పడు ఏంచేయాలో అదాటుగా చెప్పలేం కాని, అనువాద సమస్యలపై ఆలోచించాల్సిన అవసరం వుంది. నాలాగే, వెంటనే మూల పద్యం చదవాలనిపించిన వారికి లింకు: http://pantulajogarao.blogspot.com/2010/04/blog-post.html

  ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
  విలిఖితాని సహే చతురానన
  అరసికేషు కవిత్వ నివేదనం
  శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !!!


 4. Srinivas Nagulapalli

  Thanks for a nice book review of a nice book.

  > The world is really two,
  > Made of name and form..
  > One the poet creates,
  > The second come from the God..

  May be world just appears as two,
  For poet that creates names
  Is in turn created by God too.
  ========
  Regards
  -Srinivas


 5. ramnarsimha

  The world is really two,

  Made of name and form..

  One the poet creates,

  The second come from the God..

  @POEMS ARE SIMPLE & SWEET..
  Thanq..


 6. ఈ పుస్తకం లోని కవితల ఆంగ్లానువాదాలు చాలా సరళంగా, భావయుక్తంగా వెంటాడేవిగా ఉన్నాయి.
  “Condemn me, O Creator,
  to any punishment you see fit
  for all the sins I’ve committed.
  But the hell of reading poetry
  to those who have no taste for it—
  not that, not that!”
  ఈ పద్యానువాదం తమాషాగా కవిత్వం చదవటం ఒక శిక్షగా చెప్తుంటే, ఒక పాత సంఘటన గుర్తుకొస్తుంది. నా మిత్రుడైన ఒక చిత్రకారుడు తనకి కోపం వచ్చినప్పుడు అవతలవ్యక్తిని ఇలా అంటారు ‘నువ్వు మనిషివా కవివా?” అని. నిత్య జీవితంలో కవులను అడ్డం పెట్టుకుని ఇలా కూడా తిట్టవచ్చా అని నాకు ఆశ్చర్యం కలిగిందప్పుడు.ఈ పుస్తకం సమీక్షింపదగ్గ పుస్తకం. చక్కగా, సోదాహరణలతో పరిచయం చేసిన బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు.
  cbrao
  Mountain view (CA)


 7. మంచి పుస్తకం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

The Sound of the Kiss, or The Story That Must Never Be Told

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ******** by Velcheru Narayana Rao and David Shulman (వెల్చేరు నారాయణ రావు గారి రచనల పర...
by అతిథి
5

 
 

Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ********** by Velcheru Narayana Rao “కన్యాశుల్కం” గురజాడ అప్పారావు గార...
by అతిథి
2

 
 

Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu

రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ****** By: Velcheru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam (మూడో రచయిత సంజయ్ సుబ్రహ్మణ్య...
by అతిథి
5

 

 

The Poet Who Made Gods and Kings

పరిచయం వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు ****** The Poet Who Made Gods and Kings by Velcheru Narayana Rao and David Shulman ఒక సంప్రదాయ కవ...
by అతిథి
5

 
 

A Poem at the Right Moment

పరిచయం చేసిన వారు: కె.వి.యస్. రామారావు ************** A Poem at the Right Moment by Velcheru Narayana Rao and David Shulman (నారాయణ రావు గార...
by అతిథి
3

 
 

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు ******** (ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు ఎంతోకాలం యూనివర్...
by అతిథి
6