తెలుగు సాహిత్యానికి వెలుగు – వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]
తెలుగు పాఠకులకు సమగ్ర సమాచారంకోసం వేయి పుస్తకాలను ముద్రించిన మహోన్నత వ్యక్తి వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి (1884-1956). తెలుగు భాషకు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం చేసింది కూడా వీరే. అనిబిసెంట్, రాజాజీ, గాంధీజీ, ప్రకాశం పంతులు చరిత్రలు వెలువరించారు. వావిళ్ళ చేసిన వాజ్ఞ్మయసేవ అనితరసాధ్యం. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను సైతం వెలువరించి తెలుగు భాష ఉన్నంతవరకు వారు సజీవులేనని రుజువుచేసుకోవడం నెల్లూరు సాహితీసీమకు గర్వకారణం. వావిళ్ల ప్రచురణ సంస్థకు మూలపురుషుడైన శ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రి ఏకైక పుత్రుడు శ్రీ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి. తండ్రి మరణానంతరం వావిళ్ల గ్రామంనుంచి మేనమామ స్వగ్రామం అల్లూరులో చదువుకున్నారు. కర్నూలులో న్యాయవాద వృత్తి చేస్తున్న బావ కాళహస్తి దక్షిణామూర్తి పర్యవేక్షణలో కుటుంబ బాధ్యతలు, పుస్తక సంస్థ వ్యవహారాలను నేర్చుకోడానికి మద్రాసు పచ్చయప్ప హైస్కూలులో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎఫ్‍ఏ పూర్తిచేసి, శ్రీమంతుల సహాయంతో తన పుస్తక సంస్థనే వృద్ధిచేయడానికి సంకల్పించాడు. తన తండ్రి ముద్రణాలయం అయిన ’ఆదిసరస్వతీ నిలయం’ ను 1906లో వావిళ్ళ ప్రెస్సు పేరుతో ఏర్పరచి బాలశిక్ష మొదలు భారతం వరకు తొమ్మిది వందలఏళ్ళ సాహిత్య గ్రంథాలను, అన్ని రకాల అసంఖ్యాక పుస్తకాలను సంస్కృతం, తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రజల అభీష్టం మేరకు దాదాపు వేయి పుస్తకాలకు పైగా ముద్రించారు. కొన్నింటికి అనువాదాలు, కొన్నింటికి వ్యాఖ్యలు, కొన్నింటికి టీకాతాత్పర్యాలు చేశారు. వావిళ్ళ గ్రంథాలలో తప్పులుండవనే పేరును కూడా సంపాదించుకున్నారు. 1916లో ’త్రిలింగ’ అనే తెలుగుపత్రికను, 1927లో ’ఫెడరేటెడ్ ఇండియా’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ సంవత్సరమే వావిళ్ల ప్రెస్ కు అనుబంధంగా మద్రాసులోనే శ్రీరామా ప్రెస్సును స్థాపించుకున్నారు. వావిళ్ళ సంస్థ పుస్తకాల్లో గ్రాంథిక భాషనే ప్రోత్సహించారు. ఎక్కడా వాడుకభాషను ఉపయోగించకపోయినా వాడుక భాషకు వ్యతిరేకులు కారు. గురజాడ అప్పారావు వాడుకభాషను సమర్థిస్తూ ఒక పత్రాన్ని విశ్వవిద్యాలయ నిపుణుల సంఘానికి సమర్పించారు. దానిని గురజాడవారు ఆంగ్లంలో రాసారు. ఆపత్రం పెద్దదైనా వావిళ్ళవారు అప్పుతెచ్చి దాన్ని ప్రచురించి వాడుక భాషాభిమానాన్ని ప్రదర్శించారు. ఆంధ్రపత్రిక, భారతి స్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు భాషోద్ధారక బిరుదుతో ప్రసిద్ధులు. కడపపౌరులు వావిళ్ళను భాషోద్ధారక బిరుదుతో సన్మానించారు. ఆ బిరుదు పొందినవారిలో శాస్త్రి రెండవవారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ బిరుడాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించారు.
1899లో వయస్సు 15ఏళ్ళు ఉండగా..ధనవంతులు, స్కూళ్ళ ఇన్‍స్పెక్టరు భువనపల్లి సీతారామయ్య పుత్రికతో వివాహం జరిగింది. అప్పట్లో 30వేలు విలువ భూస్థితిని, రెండు ఇళ్ళను కానుకలుగా ఆమెకు ఇచ్చారు. వారి దాంపత్య జీవితం గట్టిపడకపోవడంతో పదేళ్ళు దూరదూరంగానే గడిపారు. 1956లో మరణించే సమయంలో సరైన వీలునామా రాయలేకపోవడంతో వావిళ్ల సంస్థ వికలమైపోవడానికి తానే కారణమై తనువు చాలించారు. వ్యక్తిగత జీవితంలోనే రాగద్వేషాలకు వెళ్ళాడనే అపవాదు ఉంది. వీలునామా రాయనందున వావిళ్ల సంస్థ క్లిష్టపరిస్థితులు చవిచూసింది. తరువాత వివాదాలతో సంస్థ నుండి పండితులు, విద్వాంసులు వైదొలగడంతో ప్రచురణలు ఆగిపోయాయి.
రాధిక
పెన్నాతీరం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది. అడ్రస్ కావాలి.
మోహనకృష్ణ నారాయణభట్ట
వావిళ్శ వారు చేసిన సాహిత్య సేవ ఆంధ్ర ప్రజ ఆచంద్రార్కం గుర్తు ఉంచుకోవలసిన విషయం.
సౌమ్య
పెన్నాతీరం లోని మిగతా వ్యాసాలతో పోలిస్తే, ఇది సవివర వ్యాసం కిందే లెక్కనుకుంటా 🙂
అయినా, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి గారి గురించి మరింత వివరంగా ఎవరన్నా రాస్తామంటే – అంతకంటే భాగ్యమా? 🙂
bharani prasad
VAVILLA VARI GURINCHI ICHINA SAMACAHRAM CHALA BAGUNDI.VARU TELUGU BASHA KU CHESINA SEVA PRASAMSANEEYAM.KANI VARI VYAKTIGATA JEEVITAM LONI ODIDUDUKULU BADHINCHINAYEE.VARI TARUVATI VARASULU EVARAINA VARI SEVALANU KONASAGINCHIVUNTE BUGUNDEDI