పుస్తకం
All about booksపుస్తకలోకం

July 11, 2010

పత్రికోద్యమానికి జనకుడు – దంపూరు నరసయ్య

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

1909వ సంవత్సరం. ఆ ఏడే గురజాడ కన్యాశుల్కం నాటక్ం ద్వితీయ ముద్రణ చేస్తున్నారు. ఒంగోలు మునిసుబ్రమణ్యంకు గురజాడ లేఖ రాస్తూ – ’డి.నరసయ్య అనే మిత్రుడు “పీపుల్స్ ఫ్రెండ్” పత్రిక నడుపుతూ ఉండేవాడు, నెల్లూరీయుడే..ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఆయన చిరునామా పంపించు. ఆంగ్లభాషలో ఆయన చాలా గట్టివాడు’ అని ఉత్తరాన్ని ముగించారు. గురజాడ ఈ ఉత్తరాన్ని రాస్తున్న సమయానికి నరసయ్య చనిపోయి సరిగ్గా పదిరోజులయింది. దంపూరు నరసయ్య ఆంగ్లభాషలోనే కాదు..పత్రికా నిర్వహణలోనూ గట్టివాడు. సంపాదకునిగా, విమర్శకుడిగా గుర్తింపు పొందాడు. 1800 సంవత్సరం నాటికి అవధానం పాపయ్య మద్రాసులో దుబాసీగా ప్రఖ్యాతి గాంచాడు. ఆ పాపయ్య మనుమరాలు అన్నపూర్ణమ్మ బిడ్డే నరసయ్య. ఈయన సెప్టెంబరు 25వ తేదీ 1849న జన్మించారు. పత్రికా ఉద్యమానికి సింహపురి జనకునిగా చరిత్రకెక్కారు. 1864లో మెట్రిక్యులేషన్ పాసైన తొలిదినాల్లో నెల్లూరీయుడు చదలవాడ అనంతరామశాస్త్రి బాల్యవివాహాలను ఖండిస్తూ గ్రంథాన్ని రాసాడు. దీనిని వ్యతిరేకిస్తూ గుర్రం వెంకన్నశాస్త్రి మరోగ్రంథాన్ని వెలువరించారు. ఈరెండింటి మీద స్పందించిన నరసయ్య మద్రాసుటైమ్స్ ప్రతికకు వ్యాసాలు,ఉత్తరాలు వ్రాసి సంచలనాల దిశగా పయనించారు. వీటిని అన్నీ కలిపి ’లెటర్స్ ఆఫ్ హిందూ మేరేజస్’ అనే పుస్తకాన్ని వెలువరించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మద్రాసు పచ్చియప్ప పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి తన సోదరులు కృష్ణయ్య, పార్థసారథిలతో కలిసి 1867లో ’నేటివ్ అడ్వకేట్’ పేరుతో ఒక ఆంగ్ల వారపత్రికను ప్రారంభించారు. కానీ, 1869లో వెంకటగిరిరాజు కుమారయాచమనాయుడు ఆహ్వానంపై రాకుమారులకు చదువు చెప్పేందుకు వెంకటగిరి వెళ్ళారు. 1870లో నెల్లూరు కలెక్టరు కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత 1881లో మద్రాసు వెళ్ళి ’ది పీపుల్స్ ఫ్రెండ్’ ఇంగ్లీషు వారపత్రికను స్థాపించి 17ఏళ్ళు వెలువరించారు. 1888నాటి సంచికలోని కొన్ని పేజీల జెరాక్స్ కాపీలు బంగోరె సంపాదించి పెట్టారు. నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రికలో రాసిన వ్యాసాలు అప్పట్లో విశేషంగా ఆకర్షిస్తూ ఉండేవి. రాజకీయాలు, సంస్కరణలు పీపుల్స్ ఫ్రెండ్ కు రెండుకళ్ళు. ఉప్పుమీద, స్త్రీ విముక్తి మీద వారి వ్యాసాలు దేశస్థాయిలో గుర్తింపు తెచ్చాయి. గురజాడ కన్యాశుల్కం మీద సమకాలీన పత్రికల్లో వెలువడిన సమీక్షల్లో నరసయ్య సమీక్ష అత్యుత్తమమైనదిగా విమర్శకులు పరిగణించేవారు. కన్యాశుల్కం వస్తువునే కాక, వాడిన భాషనుకూడా నరసయ్య ఆహ్వానించాడు. 1897లో ’పీపుల్స్ ఫ్రెండ్’ పత్రికను నిలుపుదల చేసి ఆర్థిక కారణాలతో నెల్లూరు చేరారు. 1900 ’ఆంధ్రభాషా గ్రామవర్తమాని’ పేరుతో తెలుగు వారపత్రికను మొదలుపెట్టారు. పూర్తి వాడుకభాషలో పత్రిక వెలువడడం ఇదే మొదలు. ’లెటర్స్ ఆఫ్ హిందూ మేరేజస్’ తప్ప నరసయ్య రచించిన ఇతరపుస్తకాలు ప్రస్తుతం లభించడం లేదు. ఇంగ్లీషు వ్యాకరణం మీద రెండు పుస్తకాలను, భారతదేశ చరిత్ర మీద ఒక పుస్తకం వ్రాసినట్లు తెలుస్తుంది. ’పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ’ పేరుతో ఒక ప్రచురణ సంస్థను, మరో విక్రయసంస్థను కూడా నిర్వహించారు. 1902లో ’ఆంధ్రభాషా గ్రామవర్తమాని’ నిలిచిపోయింది. చివరిరోజుల్లో వెంకటగిరిలో స్థిరపడి, అక్కడే ఇద్దరు వితంతువులకు వివాహం జరిపించారు. 1909జూన్ 26న నరసయ్య విశ్రాంతి తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. నెల్లూరులో తొలిపత్రికను ఏర్పాటు చేసిన చరిత్ర ఎప్పటికీ వారి సొంతం.About the Author(s)

పుస్తకం.నెట్One Comment


  1. sreeni@gmx.de

    దంపూరి నరసయ్యగారి గురించి పలు వివరాలు తెలుపుతూ మూడేళ్ళ క్రితమొక మంచి పుస్తకం వచ్చింది: “ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగులు” అని. రాసినది నెల్లూరు వాసే అయిన కాళిదాసు పురుషోత్తం గారు. విశాలాంధ్ర, నవోదయ లాంటి షాపుల్లో తేలికగా దొరకాలి.

    — శ్రీనివాస్  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు మణిహారం – ఆముద్రిత గ్రంథ చింతామణి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
7

 
 

27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 

 

దువ్వూరు శతకాన్ని నిషేధించిన ఆంగ్లేయులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకల...
by సౌమ్య
3

 
 

నూరేళ్ళుగా ఉత్సవాలు – కవిత్రయ జయంతులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
1