పుస్తకం
All about booksపుస్తకలోకం

April 20, 2010

కొత్తపల్లి కబుర్లు

More articles by »
Written by: Purnima
Tags:

కొత్తపల్లి గురించి మాకు తెల్సీ తెలియంగానే వారిని సంప్రదించాం. మరో పత్రిక, పిల్లల కోసం ప్రత్యేకం అన్నది మాత్రమే తెల్సు మాకప్పటికి. కొత్తపల్లి సభ్యులు నారాయణ శర్మగారు, ఆనంద్ గారు చెప్పుకొచ్చిన కబుర్లు వింటూ ఉంటే, మనకి అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగిస్తూనే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చో అని తెల్సుకొని అబ్బురపడ్డాం. కొత్తపల్లి ప్రింట్ పత్రికను చూసి ఆశ్చర్యపోయాం. వీరి కృషిని వీరి మాటల్లోనే మీకందిస్తున్నాం.

పూర్ణిమ: కొత్తపల్లి బృందం ఏం చేస్తూ ఉంటారు?

నారాయణ శర్మ: (పూర్ణిమ కాస్త తేలిక ప్రశ్నలు అడగొచ్చుగా!)

మేం కొత్తపల్లి.ఇన్ అనే తెలుగు పత్రికను, తెలుగు పిల్లల కోసం నడుపుతున్నాం.

ఇది మాసపత్రిక. ప్రస్తుతానికి ఇందులో పిల్లలు రాసినవి ఆరు నుండి ఎనిమిది వరకూ కథలు, పెద్దలు పిల్లల కోసం రాసినవి ఒక ఐదారు కథలూ ప్రచురిస్తున్నాం. ఇందులో ఒక సీరియల్ కథ, పజిల్ సెక్షన్, పాటల విభాగం మరియు జోకుల విభాగం ఉంటాయి. పాటల విభాగంలో పిల్లలు పాడిన పాటలు పెడుతుంటాం, కొన్నిసార్లు వాద్యసహకారంతో, కొన్ని సార్లు వాయిద్యాలు లేకుండానే.

ఆన్‍లైన్ సైట్ మొత్తం ఉచితంగా డౌన్‍లోడ్ చేసుకోడానికి వీలుగా ఉంది – html/pdf ఫార్మాట్లలో దిగుమతి చేసుకోవచ్చు. Creative Commons
‘non commercial’-‘share alike’ license కింద రచనలన్నింటినీ ఉచితంగా copy/Distribute/modify చేసుకోవచ్చును, non commercial purposes కొరకు వాడుకునేటప్పుడు. కొత్తపల్లికి / కొత్తపల్లి రచయితలకు తగిన గుర్తింపు ఇస్తూ.

మాసపత్రికను ప్రింట్ ద్వారా కూడా తీసుకొస్తున్నాం. (ప్రస్తుతం, మూడొందల యాభై మంది వార్షిక చందాదారులున్నారు). మామూలు డెస్క్ జెట్ ప్రింటర్స్ ను వాడుతూ, ఇంకును సాధారణ పద్ధతుల్లో రీఫిల్ చేస్తూ, ఈ పత్రికను ప్రచురిస్తున్నాం.

మాసపత్రికను ప్రింట్ ద్వారా కూడా తీసుకొస్తున్నాం. (ప్రస్తుతం, మూడొందల యాభై మంది వార్షిక చందాదారులున్నారు). మామూలు డెస్క్ జెట్ ప్రింటర్స్ ను వాడుతూ, ఇంకును సాధారణంగా వాడే ఇంజక్షన్ సిరంజిల పద్ధతిలో రీఫిల్ చేస్తూ, ఈ పత్రికను ప్రచురిస్తున్నాం. మామూలుగా వాడే ప్రింటింగ్ పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతి వల్ల రంగుల పేజీలు ముద్రించినా, ఒక మోస్తరు మంచి ప్రమాణంతో ఉండటంతో పాటు, ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఫోటో నెగటివ్‍లు భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కొంచెం నెమ్మదిగా సాగే ప్రక్రియ అయినా, ఈ సమస్యలు తొలగిపోయాక ఈ టెక్నాలజీ వల్ల, మనకు ఎన్ని కాపీలు అవసరమో, ఎప్పుడు కావలిస్తే అప్పుడు అన్నీ ఇంటి దగ్గరే ముద్రించుకోవచ్చు. అమ్ముడుపోని కాపీల భారం రచయితల మీద / పబ్లిషర్ల మీద పడకుండ ఉంటుంది. పిల్లలనూ ఈ ప్రింటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేస్తాం, దాని వల్ల వారికి కూడా ఈ విషయాలన్నింటిని గురించి కాస్తో కూస్తో తెలుస్తుంది.

అలా ప్రతి నెలా, మంచి కథలను ఎన్నుకుంటూ, వాటిని ఎడిట్ చేసి, పిల్లలు / కాస్త పెద్ద తరగతుల విద్యార్థులతో కథలకు అనుగుణంగా బొమ్మలు గీయించి, పిల్లలు చేత పాటలు పాడించి, వాటిని రికార్డ్ చేసి, కాస్తో కూస్తో ఎడిటింగ్ చేసి, కథలన్నీ టైపించి, చిత్రాలనూ పెడుతూ “పబ్లిష్’ చేస్తాం.

కథలను టైపు చేయడం ద్వారా పిల్లలకి కంప్యూటర్ వాడకం తెలుస్తుంది. వీలైనంత మంది పిల్లల్ని ఇందులో పాల్గొనేలా చేస్తాం. ఈ పనిని ముఖ్యంగా, సుచరిత అనే మా పాత విద్యార్థిని, చేస్తూ ఉంటుంది. ఇలా టైపు చేయడం వల్ల పిల్లలకు భాషలోని మెళకువల గురించి కూడా తెలుస్తుంది – ఇది కూడా మంచి లాభమే!

పిల్లలను కథలు రాయటానికి కూడా ప్రోత్సహిస్తూ ఉంటాము – పిల్లలకి ఐడియాలు వచ్చి కథలను రాసే విధంగా కొన్ని సూచనలు చేస్తుంటాం – ఇది ముఖ్యంగా సుబ్బరాజుగారు చూసుకుంటారు. ఇక పిల్లలు కథలు రాసినప్పుడు, పిల్లలకి రాయడం కూడా బాగా అలవడుతుంది. వీటిని ఆ పైన ఎడిట్ చేస్తాం.

ఇక బొమ్మలు ఎవరైనా గీయచ్చు, పాటల్లో / కథల్లో భాగం పంచుకోవచ్చు.

లినక్స్, ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ ని ఉపయోగించడం బాగా అలవర్చుకున్నాం. ఈ విధంగా పిల్లలకు వీటిపై ట్రైనింగ్ కి కూడా సంసిద్ధం చేస్తున్నాం. ఈ టెక్నాలజీలకి దీన్ని పరీక్షా సమయం అని కూడా అనుకోవచ్చు. ఓపెన్ ఆఫీసులోని అడ్వాన్సు ఫీచర్లను, gimp ఫోటో ఎడిటర్‍ను, అడాసిటీ సౌండ్ ఎడిటర్‍ను విరివిగా ఉపయోగిస్తాం. ఇహ, ఉబంటు, SCIM, యునికోడ్లకి సదా కృతజ్ఞతలు. టింబక్టు కలక్టివ్ మాకు కావాల్సిన స్థల, వస్తు సదుపాయాలను సమకూర్చారు. వీరే ప్రకృతి, టింబక్టు బడులని నిర్వహిస్తుంటారు. Python మాకు పునాది వంటిది. వీరందరికి మా ధన్యవాదాలు.

పూర్ణిమ: పిల్లల నుండి రచనలు ఎలా రాబట్టుతున్నారు? మొన్నీ మధ్య నా చేతికిజిక్కిన పాత తెలుగు పత్రిక సంపుటిలో, “ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు, తెలుగులో రాసే వాళ్ళు లేక ఈ పత్రికను ఆపేస్తున్నాం.” అని రాసారు. పత్రికకి కావాల్సిన వ్యాసాలనూ, కథలనూ రాబట్టుకోవటంలో మీకు కలిగే ఇబ్బందులు?

నారాయణ శర్మ: మేం (సుబ్బరాజు, నారాయణలు) గత 15-13 (వరసగా) సంవత్సరాలుగా చెన్నేకొత్తపల్లి గ్రామం (మండలం)లో‌ఉన్న ప్రకృతి బడి, టింబక్టు బడి లలో పిల్లలకు ఇంగ్లీషు, సైన్సు, తెలుగు, లెక్కలు చెబుతున్నాం. సుబ్బరాజుకు గత రెండేళ్ళుగా చిత్తూరు జిల్లాలోని విజ్డం స్కూలుతో కూడా దగ్గరి సంబంధం ఉన్నది. ఆవిధంగా ఈ బడులలోని పిల్లలతో కొత్తపల్లి బృందానికి ‘చాలా కాలపు పరిచయం’ ఉన్నది.

ప్రకృతి బడి, టింబక్టుబడులలో మామూలు చదువులకు భిన్నంగా చదువులు చెప్పటం మీద ఇన్ని సంవత్సరాలలోనూ అనేక ప్రయోగాలు జరిగాయి. ‘సగంరోజు చదువులు- సగంరోజు కళలు/ఆటలు’ అన్న ఆలోచన ఒకటి ఈ రెండు బడులలోనూ వ్యవస్థీకృతమై ఉంది. అలా ఈ పిల్లలకు తమకు ఇష్టమైన పనులు చేసుకోటానికి కావలసిన సమయం దొరుకుతుంది. ‘ఆటలు, పాటలు, కథలు చదవటం, రాయటం అనేవి చదువులకంటే ఏమంత భిన్నమైనవి కాదు’ అంటే ఇక్కడివాళ్ళకు చాలామందికి అర్థమౌతుంది.

ఆపైన మేం చేస్తున్నదల్లా ప్రధానంగా వాళ్ళకు కథలు రాయటమన్నా, పాటలు పాడటమన్నా ఇష్టం ఉండేలా చూడటమే. కొత్తపల్లి పత్రికలో ఎవరి కథైతే అచ్చవుతుందో, వాళ్ళకు ఆ సంచికను స్కూలు అసెంబ్లీలో బహుమతిగా అందజేస్తాం. పత్రికలో వాళ్ల ఫొటోలు, కథలు చూసుకొని వాళ్ళు మురిసిపోతే, మిగతా పిల్లలకూ ‘మేమేం తక్కువ?’ అనిపించకమానదు.

ఇక సుబ్బరాజు పిల్లలతో‌ కలిసి కూర్చొని కథలు రాసే క్లాసులు పెట్టుకుంటాడు. వాటిలో అందరూ సామూహికంగా ఆలోచించి కథలు తయారు చేస్తారు. అంతాలు ఎన్ని విధాలుగా ఉండచ్చో చూస్తారు.. అలా ఒక్కసారికే చాలా కథలు రాలతాయి!

‘బయటి పిల్లలకు ఇంకా చాలా కథలు వచ్చి ఉంటై కదా, వాళ్ళూ రాయచ్చు కదా, మరి రాయరేమి?’ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. గుంటూరుజిల్లా సుప్రజ, ఆదిలాబాదు జిల్లా సరస్వతి లాంటిపిల్లలు తక్కువమందే- అలాంటివాళ్ళు పంపే కథల్ని వీలైనంత వరకు- సవరించైనా సరే- ముద్రిస్తుంటాం.

నిజానికి, బడికొక్క టీచరు ఈలాంటి పనిమీద మనసు పెట్టినా చాలు- వందలాది పత్రికలు తయారవుతై.

ఇక్కడి పిల్లలంతా ప్రతినెలా కొత్తపల్లి పత్రికకోసం ఎదురుచూసి చదువుతారు. ఎవరెవరి కథలు అచ్చైనాయో చెప్పుకొని సంతోషపడతారు. పాత సంచికల్ని లైబ్రరీలో మళ్ళీ మళ్ళీ చదువుకుంటారు. అలాంటిపిల్లలు ఏదో ఒకటి రాసి/గీసి ఇస్తూనే ఉంటారు-ఎటొచ్చీ ఆ కథలు/బొమ్మలు వాళ్ళ సొంతంవేనా, సొంత భాషని వాడారా, లేదా, కథలను తిరిగి రాయించాలా అక్కర్లేదా, ఎవరైనా వాళ్ళకు అలా కథలు సృష్టించేందుకు కావలసిన ఐడియాలను అందిస్తుంటారా, లేదా అనేవి మనం గమనించుకోవాల్సిన అంశాలు.

మొత్తంమీద, రచనలు సంపాదించటం చిన్నపనైతే కాదు. పిల్లలు రచనలు చేస్తే వాళ్ళకు బాగా అనిపించాలి; ఆ రచనలు మనకు బాగా అనిపించాలి; అవి కాపీ కథలు కాకూడదు; చక్కని భావం కనబడాలి- ఇవన్నీ తెప్పించేందుకు బాగానే పని చేయాల్సి ఉంటుంది. అలాగని ఎక్కువ రచనల్ని తిరస్కరిస్తే పిల్లలకు స్ఫూర్తి తగ్గిపోతుంది- అదీ గమనించుకోవాలి. ఈ పనిలో శక్తి వెచ్చించగలవాళ్లు కొత్తపల్లి బృందంలో ఉన్నట్లున్నారు.

పూర్ణిమ: కొత్తపల్లి టీం వారు ఎక్కడో ఏదో పాఠశాల నడుపుతున్నారని నాకనిపిస్తుంది. నిజమేనా?

నారాయణ శర్మ: కొత్తపల్లి బృందం ఏ బడుల్నీ నడిపించటం లేదు. ఆయా బడులతో కొత్తపల్లి బృంద సభ్యులకు దగ్గరి సంబంధాలుంటున్నై. ఆయా బడులలో కొత్తపల్లిబృంద సభ్యులు సమయాన్ని వెచ్చిస్తున్నారు, పిల్లలతో నేరుగా కలువగల్గుతున్నారు, వాళ్ల చదువులకు పనికొచ్చే సహాయం చేస్తున్నారు, దానితోబాటు పిల్లలకు, టీచర్లకు ఐడియాలిచ్చి, వాళ్ల ఐడియాలను కలిపి, రచనల సృష్టికి దోహదం చేస్తున్నారు.

పూర్ణిమ: కొత్తపల్లి పత్రిక ఏవైనా కొన్ని స్కూళ్ళకే పరిమితమా?

నారాయణ శర్మ: కొత్తపల్లి పత్రిక తెలుగు పిల్లల పత్రిక. పిల్లలైనా, పెద్దలైనా- ఎవరైనా, ఎక్కడి వాళ్ళైనా- తెలుగు పిల్లలకు ఆనందాన్నిచ్చే రచనల్ని పంపితే వాటిని పరిశీలించి, వీలైతే దిద్ది, బాగున్నవాటిని అచ్చు వేయగలం. రచయితలు బడులకే గానీ ప్రత్యేకించి ఏదో‌ ఒక బడికేగానీ చెందాలని లేదు- తెలుగు వచ్చినవాళ్లైతే సరి.

పూర్ణిమ: పెద్దవాళ్ళైతే ఎవరన్నా రచనలు పంఫవచ్చు అని మీ పత్రికలో రాసారు. మరి చిన్నపిల్లలు పంపాలంటే ఏవైనా ఇతర నియమాలున్నాయా?

నారాయణ శర్మ: పిల్లల రచనలకు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ల రచనల తర్వాత చోటుంటే పెద్దల కధలు ఉంటై. ఇంకా చోటుంటే అనువాద కథలు ఉంటాయి. పెద్దల రచనలలోకూడాను, పిల్లలకు అర్థమయ్యే విషయం/శైలి ఉన్న రచనలకు ప్రాధాన్యత ఇస్తాం. నీతి మరీ explicit గా ఉంటే ఎవ్వరికీ ఎక్కకపోవచ్చు.. అలాంటివాటిని పిల్లలు రాస్తే చూస్తాం తప్ప, పెద్దవాళ్ళు రాస్తే మెచ్చం. ఇక ఏ కథలోనూ మతాల్ని చిన్నబుచ్చే అంశాలు, స్రీలను కించపరచే అంశాలు, తిట్లు, హింస ఉండకూడదు ఎలాగూ.

పూర్ణిమ: ఈ పత్రిక పిల్లలకి ఎలా చేరువౌతుంది? పసివయస్సులోనే పిల్లలకు సాహిత్యపు వాసనలు అందించాలని తపన పడే తల్లిదండ్రుల వల్లా? అంత అదృష్టం లేని పిల్లల సంగతి ఏంటి? పాఠశాలలకూ, గ్రంథాలయాలకూ మీ పత్రిక చేరే అవకాశాలు ఎంత?

నారాయణ శర్మ: ఇంటర్నెట్లో పత్రికను చదువుతున్నది పెద్దలో, పిల్లతో తెలిసే అవకాశం అంతగా లేదు. కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతుల చందాలు ప్రస్తుతం నాలుగువందలకు పైగా ఉన్నై. రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో పిల్లలు వీటిని చదువుతున్నారు. ఒక వంద-నూట ఇరవై ప్రతులు ప్రత్యామ్నాయ బడులకు/లైబ్రరీలకు పోతున్నై. ఒక ఇరవై-ముప్ఫై ప్రతులు మామూలు బడులకు పోతున్నాయి. మిగిలినవి వ్యక్తిగత చందాలు. వ్యక్తిగతచందాలు, మీరన్నట్లు, కొందరు పిల్లలకే సాధ్యం. బడులు/లైబ్రరీల సంగతి అలాకాదు. వాటి “reach”ఎక్కువ. కొత్తపల్లి పత్రిక ముద్రిత రూపం రాబోయే ఆరేడు నెలల్లో మరింత విస్తరించనున్నదని నాకు అనిపిస్తుంది.

పూర్ణిమ: ఇంతకీ.. పత్రిక అనే ఆలోచన ఎలా, ఎప్పుడు పుట్టింది?

నారాయణ శర్మ: పిల్లలతో కలిసి ఉండేవాళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు కథలు చెప్పాల్సిందే, చాలా కథలు వినాల్సిందే. అలా చాలా కథలు వచ్చాయి ఇన్నేళ్ళలోనూ. అప్పుడప్పుడూ, వీలు కుదిరినప్పుడు ఎప్పుడో ఓసారి కధా సంకలనాలు అచ్చేసి, బడి గోడలమీద అతికించటం జరుగుతూ వచ్చింది, నాటకాలు అచ్చేసి పిల్లలకిచ్చి వేయించటం కూడా అలాగే జరిగింది. అచ్చేసేందుకు ఆరోజుల్లో డాట్ మాట్రిక్స్ ప్రింటరొకటి ఉండేది. దాన్నే పరిమితంగా వాడుకునేవాళ్ళం. మెల్లగా గోడ పత్రిక ఐడియా వచ్చింది- సుబ్బరాజుకు. బెంగుళూరులో ఉద్యోగం చేసే ఆనంద్ అప్పుడప్పుడూ వచ్చి మా బళ్లో కంప్యూటర్లకు లైనక్సు, పెద్ద పిల్లలకు ప్రోగ్రామింగ్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. పని చేయనని మొరాయించే కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ఉండేవాడు. మాకు కంప్యూటరు టెక్కునిక్కులు నేర్పుతూ ఉండేవాడు, విండోస్ వదిలి లైనక్సుకు రమ్మని పోరుతూ ఉండేవాడు.

ఆ రోజుల్లో ఆనంద్, దేవి, ఇతర మిత్రులు కలసి మనలో మనం సందడి అని ఒక నెట్ పత్రిక పెడితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఎంతకీ సందడి మొదలుకాదు!.. “నేనూ రాస్తాను మొదలెట్టండి” అన్నా మొదలుపెట్టలేదు. చివరికి సందడి బదులు కొత్తపల్లి మొదలైంది- పెద్దల నెట్ మాగజైన్ బదులు, పిల్లల వెబ్జైనుగా.

దానికి కావలసిన వెబ్ స్పేసు ఆనందుదే. ఆనంద్, దేవి, లీల పాపం బాగా శ్రమపడి పత్రికకో రూపం ఇచ్చారు. “ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా దాన్ని మార్చుకుందాం, మనదేగా” అనుకున్నాం. (దానికేం ఖర్చు? డిజైనర్లు మావాళ్ళేనాయె! 🙂

ఆనంద్ వాళ్ళు అక్కడ డిజైన్ తో కుస్తీ పడుతుంటే, ఇక్కడ మేం “content” ని సమకూర్చుకోవటంలో పడ్డాం. ఒకనెల కథలు సులభంగానే వచ్చాయి. పిల్లలే అన్నీ టైపు చేశారు. దానికోసం విండోస్ లో బరహా వాడాం. అప్పట్లో మాకు పల్లెలో బ్రాడ్బ్యాండు కనెక్షన్ ఉండేదికాదు. డయ్లప్ తోటే తంటాలు పడేవాళ్ళం. ఫైలు సైజులు చిన్నగానే ఉండాల్సి వచ్చేది. బొమ్మలూ చిన్నగానే ఉండేవి. దానికి తోడు విండోస్/లైనెక్స్ సమస్యలు!

ఆనంద్ వాళ్ళు ‘అయ్యో లైనెక్సు వాడండి’ అనేవాళ్ళు. లైనెక్సు లో తెలుగు ఓ పట్టాన రాలేదు. ఇంకో రెండు నెలలకు దాన్ని సాధించాం, ఇక్కడే. అప్పటివరకూ బరహా తో రాసి నెట్లో కట్ పేస్ట్ చేశాం. ఓపెన్ ఆఫీసులో తెలుగు రాలేదప్పటికి. పేజ్ సెటింగు మా చేతుల్లో ఉండేది కాదు. అంతా చేసి, పిల్లలు దాన్ని చూసుకొనేదెట్లా, మా స్పీడులతో? అందుకని సుబ్బ కనీసం రెండు కాపీలైనా ప్రింటు చేయాల్సి వచ్చింది. మరి దానికోసం పిడియఫ్ లు కావాలి.. అవీ తయారు చేశారు ఆనంద్ వాళ్ళు. అలా, ఒకటి రెండు పత్రికలు- బడికొకటి చొప్పున ప్రింటు చేశాం మొదటి- రెండు, మూడు, నాలుగు నెలల వరకూ కూడా. అలా, కొత్తపల్లి ప్రింటు మ్యాగజైను ఐడియాకంటే ముందే వచ్చింది, ఇంటర్నెట్ మ్యాగజైను. రానురాను పిల్లల ఉత్సాహం చూసి, మాకూ ముద్రణ చేయాల్సిన కాపీల సంఖ్య ఎక్కువౌతూ వచ్చింది. ప్రింటింగు కధ మళ్ళీ చెబుతాను.

ఇక టైపింగు వరకూ ఎప్పుడూ కష్టం కాలేదు. సుచరిత, కేదార్, సలీం అని పిల్లలు (ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు) అప్పటికే సూపర్ టైపిస్టులయ్యారు. వాళ్లకు బరహానే కాక, అనుఫాంట్స్ వాడటం, ఫోటోషాపు వాడటం అన్నీ వచ్చేశాయి. దాంతో పని సులభమైంది. మాబు అని ఓ పిల్లాడు (అప్పట్లోనే బియస్సీ, ప్రస్తుతం డెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు) రోజూ వచ్చి కంప్యూటర్లు మెయింటెయిన్ చేస్తూ, ఓ వైపున సి, పైధాన్ ప్రయోగాలు చేస్తూ వచ్చాడు, ఆనంద్ సారధ్యంలో. అందరికీ మేమే టీచర్లం. అడవి రాముడు అనే పిల్లాడు (ప్రస్తుతం హైదరాబాదు జెయనెటియులో ఫైనార్ట్స్ కోర్సు చేస్తున్నాడు) చిన్నప్పటినుండీ మాదగ్గరే పెరిగి, బొమ్మలు బానే వేయటం నేర్చుకున్నాడు- (ఎవరెవరో గురువులు అతనికి!) అతని సారధ్యంలో‌బొమ్మలు గీసే పిల్లల బృందం మొదలైంది.

అలా ఏప్రియల్ 1, 2008 సర్వధారి ఉగాది రోజున కొత్తపల్లి పత్రిక తొలి సంచిక విడుదలైంది. మే మాసపు సంచిక బాగానే వచ్చింది. మేలో అందరం వేసవి శలవలు తీసుకున్నాం.. కొత్తకొత్త పనాయె!.. చెయ్యాడితేగానీ‌ పత్రిక రాదు- అయినా మాకేం తెల్సు? పిల్లలతోబాటు పెద్దలమూ శలవలు పుచ్చుకున్నాం- అలా జూన్ సంచిక రానే లేదు. ఆ తరువాత బుద్ధొచ్చింది. అంతకు ముందే మాకు తెల్సు- “ప్రత్యామ్నాయ బడులనూ, పత్రికలనూ మొదలుపెట్టటం సులభమే.. కొనసాగించటమే కష్టం” అని. ఒకసారి దెబ్బపడిన తర్వాత మేలుకున్నాం; ఆపైన అన్ని సంచికలకోసం ముందస్తు తయారీ మొదలెట్టాం. ఇప్పుడు కొంచెం తెలివి బానే వచ్చినట్లుంది. అన్నీ బాగానే నడుస్తున్నై, ముందస్తుగా.

ప్రింటింగు కథ:

సుబ్బరాజు పని రానురానూ ఎక్కువవుతూ వచ్చింది- ఎక్కువ కాపీలు( ఐదో, ఆరో!) కావాలి! వాటిని లేజర్ ప్రింటర్లలో తెలుపు-నలుపు లో ముద్రించినా వీలయ్యేట్లు లేదు. మామూలు డెస్క్ జెట్ ప్రింటరు ఖరీదు తక్కువే- కానీ కాట్రిజ్ లు కొనలేం! పేజీకి ఖర్చు పది రూపాయలు దాటేట్లుంది! కావాల్సింది కొన్ని కాపీలే- అయినా ఎలాగ?

అందుకని ప్రింటింగు ప్రయోగాలు మొదలెట్టాం- కాట్రిజ్ ల లోకి ఇంజక్షన్ సిరెంజ్ లతో ఇంకు వేసి చూడచ్చు అని! అదో పెద్ద కథే. ప్రింటర్ల తయారీదార్లు చేస్తున్న మోసం అంతా ఇంతా కాదు. ‘అసలు కంటే కొసరెక్కువ’ అన్నట్లు, వాళ్ళకు కావలసింది అందరూ కాట్రిజ్ లు కొంటూ ఉండటమే. మాలాంటి ప్రయోగదార్లను నిరోధించటానికి వాళ్ళు అనేక చెక్-బాలన్స్ లను పెట్టుకుంటున్నారు ప్రింటర్లలో. కొత్త ఇంకులను గుర్తించే సెన్సార్లు, పేజీలు లెక్కపెట్టుకుని, ఓ రెండొందలు దాటగానే మెషీన్లు మాట వినకుండా చేసే
ప్రోగ్రాములు, మళ్ళీ మళ్ళీ ‘సరైన కాట్రిజ్ లు కావు, మావే కొనండి ” అని వచ్చే మెసేజ్ లు- ఒక్కొక్కదాన్నీ అధిగమించేందుకు పెద్ద రీసెర్చే అవసరపడింది. ఓ నాలుగైదు రకాల ప్రింటర్లు కొనాల్సొచ్చింది. ఒకసారి దొరికిన మోడల్ మళ్ళీ రాదు- కొత్త ప్రింటర్లలో వాడే ‘సేఫ్ గార్డులూ’ కొత్తవే! – పాపం ఈ ప్రింటర్ కంపెనీలకెంత భయం!? అనిపిస్తుంది.

అయినా సుబ్బరాజు పట్టు వదల్లేదు. ఎందుకంటే, ఇలా వాడే ఇంకు వెయ్యి మిల్లీ లీటర్లకు (ఒక లీటరుకు) వెయ్యి రూపాయలు అవుతుంది- మిల్లీలీటరుకు ఒక రూపాయి, దాదాపు. కంపెనీ వాళ్ళు ఒక కాట్రిజ్ లో వేసేది నాలుగు మిల్లీ లీటర్లు! అంటే, ఎనిమిది- తొమ్మిది వందల రూపాయల కాట్రిజ్ లో ఉండేది కేవలం నాలుగు రూపాయల ఇంకన్నమాట! చూడగా, ఇలా మాలాగ టిక్కు టిక్కు మంటూ ప్రింటు చేసుకుంటే పేజీకి ప్రింటింగు ఖర్చు వచ్చేది కేవలం పది పైసలే! అయితే ప్రింటింగు కంపెనీల మోసం పెద్ద పని! కొన్ని సార్లు ఇంకేసిన తర్వాత ఇక ప్రింటర్లు పూర్తిగా మొరాయించేస్తాయి. అప్పుడు కాట్రిజ్ లు మార్చాల్సిందే. దానికి కొంత ఖర్చవుతుంది.

అవన్నీ అర్థమయ్యేసరికి, సుబ్బరాజుకు ప్రింటు కాపీల సంఖ్య పెంచొచ్చనిపించింది. ముందు ఇరవై వేశాం.. ముఫ్ఫై.. వంద.. అలా ఇప్పుడు ఐదు వందలు- అన్నీ అచ్చేసేది ఇక్కడే, మామూలు డెస్క్ జెట్ ప్రింటర్లలోనే.

మీరు ఏదైనా పుస్తకం- ఏ కవితల పుస్తకమో అచ్చేద్దామనుకున్నారనుకోండి- ఓ పది పేజీలవుతాయి, ఒక రంగుల కవర్ కావాలి- ఎన్ని కాపీలు?- ప్రింటర్లు కనీసం ఐదువందలో, వెయ్యో కాపీలు వేసుకోవాల్సి వస్తుంది. ఓ పదివేలో ఇరవైవేలో రూపాయలు పెట్టుబడిగా మురగ బెట్టుకోవాల్సి వస్తుంది. అవన్నీ అమ్ముడైతే తప్ప, మీ డబ్బు మీకు వెనక్కి రాదు. అలా సంవత్సరాలపాటు మీ పుస్తకాలు మీదగ్గరే ఉంటాయి, మీ డబ్బుకు మీరు వడ్డీ లెక్కకట్టుకొని పుస్తకం ఖరీదు పెంచుకుంటారు.. పబ్లిషర్లూ, డిస్ట్రిబ్యూటర్లూ, వాళ్ల లాభాలూ- అన్నీ చూసుకుంటే, ఇరవై రూపాయల పుస్తకం అరవై రూపాయలకు అమ్మితేతప్ప గిట్టుబాటు కాదు.

ఏమి, ఎందుకిలాగ? మీ ప్రింటరు మీ ఇంట్లో ఉంటుంది కదా? మీ దగ్గరో పిడియప్ ఉంటే, ఇక ఫిల్ముల అవసరం లేకపోతే, ఎంత చవక! ఎన్ని కాపీలు కావాలంటే అన్ని ముద్రించుకోరూ? ప్రింటింగు స్పీడులు పెద్ద సమస్య కాదు- ప్రస్తుతం మేం ఐదువందల కాపీలు- అంటే దాదాపు 15000 పేజీల్ని- నాలుగు రోజుల్లో ముద్రించగల్గుతున్నాం. ఈ ప్రింటర్ల తయారీదార్ల మోసాలు లేకపోతే ఇంకా ఎక్కువ కాపీల్ని, తక్కువ సమయంలో అచ్చు వేసి ఇవ్వగలం. ఇలా ముద్రించుకుంటే ఇంకో లాభం- ఇవి మల్టీకలర్ బొమ్మలు! వీటిని ఆఫ్సెట్ ప్రింటర్లలో అచ్చేయాలంటే చిన్న యంత్రాలు సరిపోవు. నలుపు-తెలుపు కంటే అలాంటి పెద్ద యంత్రాల్లో ఖర్చెక్కువ, కనీస కాపీల సంఖ్యా ఎక్కువే- అవన్నీ తప్పిపోతై. నన్నడిగితే అందరూ ఇలాగే ప్రింటు చేసుకోవాలి, దేన్నైనా.

పూర్ణిమ: ఆన్లైన్ లో సెప్టెంబర్ 2008 నుండి సంచికలున్నాయి. అదే ఈ పత్రిక ఆరంభమా? ఇంటర్నెట్ వైపుకి మీరెప్పుడు ఎలా మళ్ళారు? ఇంటెర్నెట్ వల్ల మీకు కలిగిన లాభాలు?! (ఇంతకీ మీరు “కూడలి”, “హారం” వాటిలో కొత్తపల్లిని చేర్చారా?)

నారాయణ శర్మ: ముందు మొదలైంది ఇంటర్నెట్ పత్రికే. తర్వాతే అచ్చు రూపం వచ్చింది. కూడలి, హారం లలో కొత్తపల్లి ఉందనుకుంటా. అయితే వాటిలో నెల మొదటి రోజున కనబడే పత్రిక ఎంట్రీ వల్ల పెద్దగా ప్రయోజనం కల్గుతున్నట్లు లేదు. నెలంతా వచ్చే ఏర్పాటు చూడాలేమో. ఆనంద్ సరిగ్గా చెప్పగలడు.

 
 


About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..14 Comments


 1. సౌమ్య

  ఈమాట పత్రిక తాజాసంచికలో కొత్తపల్లి వారితో రాజా పిడూరి గారు నడిపిన సంభాషణ వచ్చింది. లంకె – http://eemaata.com/em/issues/201405/4046.html


 2. gajula

  kottapalli all the best.we are with u


 3. ammaodi

  కొత్తపల్లి సభ్యులకు నిజంగా మీ శ్రమ, కృషి, పరిశోధన గొప్పవండి. పిల్లలను మీరు ప్రోత్సహిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందండి!


 4. కొత్తపల్లి వారికి:
  మీ ఈ-పత్రిక మొదలైనప్పతినుంచీ అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాను.
  అలా మొదటినుంచీ ఇప్పటివరకూ వచ్చిన మార్పులూ కొంచెం తెలుసు.
  ఇప్పుడే ఈ వ్యాసం అంతా చాలా సార్ల తర్వాత మళ్ళీ ఒక సారి చదివి, మీ ఏప్రిల్ సంచిక చూసి, ఇటు వచ్చాను.
  అక్కడ పిల్లల పాటలు నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చాయి. ఒక్క పాటకే వ్యాఖ్య రాశాను కానీ, పిల్లలందరినీ అభినందించాల్సిన విషయం.
  వారిని ప్రోత్సహిస్తున్న పెద్దలకూ అభినందనలు చెప్పాలి.
  మీరు ఇంత కృషి చేస్తున్నారు.
  పత్రిక గురించి నా అభిప్రాయాలు పైన (అడిగే వాళ్ళకి ఎలా తెలుసో అన్నట్లు) ప్రశ్నల రూపంలో కనిపించాయి. దానికి మీరు సమాధానాలు చాలా వివరంగా ఓపికగా ఇచ్చారు.
  ఐనప్పటికీ నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి మీరు ప్రచురించే కథల మీద. అందుకే నేను కాక వేరెవరైనా ఇలాంటి వాటి గురించి రాయాలని ఆశిస్తాను, నా కోణం నుంచే కాక వేరే కోణాలు తెలియాలి అని. ఆ పని ఈ వ్యాసం వల్ల నెరవేరింది కనుక ఇక నా ఆలోచనలు:
  మీరు చేస్తున్న కృషికి ఇంకా మంచి ఫలితాలు తెప్పించచ్చు. పిల్లల చేత రాయించి అచ్చు వేయించడం బావుంది. ఐతే మీరు చెప్పిన ఎడిటింగ్ పాత్ర అంత మరీ involved గా ఉండకూడదనుకుంటే వేరే రకాలుగా కూడా ఆలోచించాలేమో. ఈ పత్రికలో ఐతే మీరు పిల్లల కథలు చాలా మటుకు “సేకరణ” అని చెప్తున్నారు. కాబట్టి పరవాలేదేమో. కానీ అవైనా ఎక్కువ ఎడిటింగ్ లేకుండా వారు రాయగలిగే స్థితికి రప్పించాలి.

  ఉదాహరణకు పిల్లల చేత రోజూ చదవడం, రాయడం సాధన చేయించడం – ప్రచురించబడుతుందా లేదా అని ఒత్తిడి లేకుండా. చదివిన కథలు, పుస్తకాలు, విషయాలలో ఏమి నచ్చాయో, ఎందుకు నచ్చాయో, ఏమి నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో, పాత్రల గురించీ, కథలో సమస్య, పరిష్కారం వంటి వాటి గురించి రాయడము, చర్చించడము చెయ్యచ్చు. ఒక picture prompt ఇచ్చి రాయించచ్చు. ఒక సమస్య (వ్యావహారికమైనదే) ఇచ్చి పరిష్కరించమనచ్చు. ఒక కొత్త పదం ఇచ్చి దాని చుట్టూ కథ అల్లించచ్చు. ఒక్కో నెలకూ, ఆ నెల calendar కు theme తయారు చేయించచ్చు. పాల్గొంటున్న బడులలో వార్తలు రాయడం, లేదా ప్రముఖుల గురించి సమాచారం సేకరించడం, ఆ hero figures లో వారికి ఏ లక్షణాలు నచ్చాయి, ఎందుకు నచ్చాయి వంటివి రాయించడం, లేదా, ఒక జిల్లా గురించో ఒక వ్యాపకం గురించో, ఒక occupation గురించో రాయించడం, పరిశొధన అలవాటు చేయించడం, source దాచాల్సిన అవసరంలేకుండా పరిశొధించో, సేకరించో రాసామని చెపుతూ రాసేలా చేయించడం, ఇలాంటి ప్రయోగాలు చేసి మీరు ఈ ప్రయత్నాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకు పోవచ్చు. ఇవి ఇప్పటికే చేస్తున్నాము అంటారా, ఐతే శుభం. In time results will be there for all of us to see. ఇలాంటి ఆలోచనలతో brainstorming చెయ్యడానికి నేను ఉపయోగపడతాను అనుకుంటారా సంప్రదించండి.
  అభినందనలతో
  తెలుగు4కిడ్స్ .


 5. మంచి విశేషాలు తెలిపారు.

  మా వూరిపక్కనే ఇంత నిధి పెట్టుకుని ఇన్ని రోజులు తెలియలేదు. ఈ పత్రికకోసం ఏదైనా చేయాలనిపిస్తూంది. వీలున్నప్పుడు ఈ పత్రిక వారిని కలవాలి.


 6. బుడుగోయ్ గారూ – మీకు పక్కన సీగాన పెసూనాంబ లేకపోవడం మూలానో, ఇంకేదో కారణం మూలానో ఎక్కడో ఏదో తేడా వచ్చినట్టుంది…. 🙂 అసలు మీరన్న దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, అనవసరంగా మీరు పుల్లలుచ్చుకుని బయలుదేరారు కాబట్టీ, అదీ పుస్తకం వారి స్థలంలో కాబట్టీ నా సమయం వ్యర్థం చేసుకుంటున్నాను. ఆవ్యాసం లోని పెద్దాయనా, ఇక్కడ నేనన్న “నారాయణ” పెద్దాయన వేరు వేరు….లంకె లేదు. ఆయనకు చెప్పాల్సింది ఏదో అక్కడే చెప్పేసాను.

  ఇహ దీనిని ఇంతటితో ఆపితే మంచిది.


 7. చక్కని పరిచయం. ఎపుడైనా అనంతపురం వెళ్తే టింబక్టూను చెన్నేకొత్తపల్లి ని చూడాలనిపించేంత బాగుంది.
  కొత్తపల్లి వారి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
  వంశీ గారు, ఆ వ్యాసంలో మర్యాదగా చెప్పిన పెద్దాయనని ఈ వ్యాసంలోకి లాగడం నాకైతే నారాయణా అంటున్నట్టుగా లేదు.


 8. చక్కటి ప్రయత్నం – కొత్తపల్లి వారికి అభినందనలు. ఏ పే పాల్ ద్వారానో ఇండియా లో మనం ఎవరికైనా gift subscriptions ఇవ్వాలనుకుంటే ఇవ్వగలిగే అవకాశం కల్పించడాన్ని వీరు తప్పక పరిశీలించాలి (వాళ్ళకి మెయిల్ కూడా పంపిస్తాను).


 9. కొత్తపల్లివారికి అభినందనలు. నిజంగా మాష్టారనిపించారు, అన్ని వివరాలూ చక్కగా విడమరచి చెప్పి. పిల్లలు అదృష్టవంతులు, ఇలాటి మాష్టార్లు వాళ్ళకున్నందుకు.

  వేమూరి రాధాకృష్ణశర్మగారని, మా నాన్నగారికి పాఠాలు చెప్పే మాష్టారు – పిల్లలకోసం, పిల్లల భాగస్వామ్యంతో ఇలానే యాభై ఏళ్ళ క్రితం మా నానమ్మగారి ఊరు మచిలీపట్నంలో “వెన్నెల” అనే పత్రిక నడిపేవారట. నారాయణ శర్మగారు చెప్పినట్టు ప్రింటర్లతో ఇబ్బందుల మూలాన (ఇప్పుడు కంప్యూటర్ ప్రింటర్లవాళ్ళ వల్లా, ప్రింటుచేసె ప్రింటర్ల వల్లా ఇబ్బందైతే….ఆ కాలంలో అచ్చమైన ప్రింటర్ల ఇబ్బంది- ఇతర కారణాలున్నవేమో తెలియదు కానీ – సకాలంలో అచ్చేసి ఇవ్వక, ఇచ్చినా మూడు నాలుగు కథలు ఎగ్గొట్టో, అన్నీ ఇచ్చినా సరైన ప్రూఫు రీడింగు చెయ్యక తప్పుల తడకలతో – ఇలా బోలెడు ఇబ్బందులట!), దానికితోడు ఆర్ధిక ఇబ్బందులు కూడా తోడవ్వటంతో ఆ పత్రిక మూతపడాల్సి వచ్చింది అని తెలియవచ్చింది.

  “శుభం పలకరా అంటే ” ఏదో అన్నట్టు – ఆ పత్రిక మూతపడింది అని వివరం చెప్పినందుకు తప్పుగా అనుకునేరు…ఆ మధ్య నారాయణా అంటే, బూతు మాట్టాడతావురా అని ఒక పెద్దాయన ఇంతెత్తున లేచారు… :)ఆ ఉద్దేశంతో అనలేదనీ, ఇలాటి పత్రికే ఒకటి ఉండేదనీ తెలియచెప్పటం నా ఉద్దేశమనీ….అదండీ …

  ఏదేమైనా కొత్తపల్లివారు ఇలా మంచి మంచి తరుణోపాయాలతో చిక్కులని పరిష్కరించుకుంటూ, ఇంకో యాభై ఏళ్ళు ఈ పత్రికనందించాలని కోరుకుంటూ..


 10. A very candid interview and the best I read on Pustkam.net so far.
  You covered so many aspects in your questions.
  Thanks to Narayana Sarma garu and Anand garu for their elaborate answers.
  Got to read a couple of times more to get the grasp of the whole idea, effort behind it and the inspiration it can provide.
  With their kind of invlovement, they can really make many wonders happen.
  Even though I’m far off, I can still offer a little bit of my time and any kind of help that is possible using internet.


 11. పుస్తకం, కొత్తపల్లి – అభినందనలు.


 12. మెహెర్

  Great post focusing an inspiring effort. Thank you.


 13. […] This post was mentioned on Twitter by chavakiran, Anil Atluri. Anil Atluri said: కొత్తపల్లి కబుర్లు http://goo.gl/Pcx0 If you know to read Telugu, go read కొత్తపల్లి […]


 14. Thanks for this inspiring post.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Interview with Guy Deutscher

(Guy Deutscher is a popular linguist, now working at the University of Manchester. He has written several books and articles on language evolution for both linguists and general public. “Through the language glass” ...
by Purnima
3

 
 

The Bookworm, Bangalore

There’s nothing much to say about this bookstore called Bookworm in Bengaluru. If you’re a bookworm, you step in, get lost in the books for hours together and when worldly matters play spoilsport, you end up taking...
by Purnima
7

 
 

Chat with Amish – the author of ‘Immortals of Meluha’

‘Immortals of Meluha’ అన్నది ‘శివా ట్రైలజీ‘ అన్న పేరుతో రాబోయే పుస్తకాలలో మొదటిది. ఈ ఏడాదే ...
by సౌమ్య
3

 

 

Flipkart’s Speaking..

Flipkart – a name that doesn’t need an introduction among who shop books online in India. Almost every other article here in pustakam.net ends with a option to buy the book from Flipkart. And why do we do that? Beca...
by Purnima
6

 
 

అజో-విభొ-కందాళం ఫౌండేషన్ (AVKF) వారితో…

తెలుగు పుస్తకాల కొనుగోలుకి ఆన్లైన్లో ప్రస్తుతం ఉన్న ఉత్తమమైన సోర్సు – ఏవీకేఎఫ్ అన...
by సౌమ్య
7

 
 

116 సంవత్సరాల వయసున్న సంస్కృత పుస్తకాల పబ్లిషర్లతో

[ఎపుడో బెంగళూరు బుక్ ఫెస్ట్ జరిగినప్పటి కథ ఇది. ఇన్నాళ్టికి మోక్షం లభించింది! అనుకున...
by సౌమ్య
4