అబ్బబ్బ పుస్తకం!
రాసిన వారు: చంద్రలత
****************
(ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం!)
23-4-2010
అబ్బబ్బ పుస్తకం
నిన్ను చూడగానే నోరూరుచుండు
ధర చీటి చూసి ..పర్సు తీయగానే ..
అబ్బబ్బ …
*
ఆ పై ఖాళీలూ తమరు పూరించ సవినయ మనవి. ఆ వాక్యం పై సర్వ హక్కులూ తమరివే.
*
పోనీండి. ఎవరి పాపాన వారు పోతారు. కానీ, కొని చదవడం తగ్గిపోయిందని వాపోతారే ..వారిగురించి కాసేపు. కొని చదివే వారు లేకుండా పోయే వారి గురించి మనం మాట్లాడుకోవడం ఎంచేత? ఇవ్వాళ అంతర్జాతీయ పుస్తక దినోత్సవం కదా అంచేత !
– అని అనుకుంటున్నారా?
కాదండి బాబు.
ఈ మధ్యే పరీక్షలు రాసొచ్చిన మా అబ్బాయి రాత్రంతా ఒకటే ఉలుకులుకి పడుతున్నాడు . పాపం …కలలోకి ఏ పుస్తకం వచ్చిందో ఏమో! హాస్టల్లో ఉంటున్న మా అమ్మాయిని పొద్దున్నే ఆఫీసులో కలవమని డీన్ హుకుం వేసార్ట , మొన్నామధ్య నేను తప్పక చదవాలి సుమా అంటూ, ఆమె బీన్ బ్యాగులో దాచి పెట్టి వచ్చిన పుస్తకం దొరికి పోయిందో ఏమో! పొద్దున్నే కాఫీ కప్పు ఇలా ఇస్తుంటే , తిరగేసిన పుస్తకంలోకి అలా తల దూర్చి మొహం చాటేసారు మా పిల్లల నాన్న గారు ! కొత్త పుస్తకం బుర్ర తొలిచేస్తుంటే , నిద్దట్లో ఏవేవి కలవరించానో ఏమో! సరేనండీ ,ఇలాంటి పుస్తక కష్టాలు తెల్లారి లేస్తే ఎన్నో.అర్ధం చేసుకోరు! అదలా ఉంచండి.
ఈ రోజు స్పెయిన్ లో , ప్రతీ పుస్తకాల దుకాణం లోనూ కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ఇస్తారుట. Cervantes వర్ధంతి కదా , అని,స్పెయిన్ వారు వారి జాతీయ పుస్తక దినోత్సవం
ప్రకటించుకొని, రెన్నాళ్ళ పాటు ఏకబిగిన Don Quixote “readathon” చేసి, Miguel de Cervantes Prize ఇస్తారుట. బావుంది. బ్రిటన్లో ,పౌండ్ కొక పుస్తకం తీసుకోండంటూ టోకెన్లు ఇస్తారుట.ఇక, షేక్ స్పియర్ నాటకమహోత్సవాల సంగతి సరేసరి. భలే భలే. అన్నట్లు,స్పెయిన్లో అబ్బయిలు అమ్మాయిలకు గులాబీ ఇస్తే, అమ్మాయిలు పుస్తకం తో బదులిస్తారుట.ఏకంగా నాలుగు మిలియన్ల పుస్తకాలు గులాబీలమారకం జరిగాయంటే ,చూడండి మరి.
నిజానికి, ఈ రోజున కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ని ఇవ్వడం క్యాటలోనియ లో మొదలయ్యిందట. పుస్తకం చడవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పకనే చెప్పడానికట.
నిజమే, మకాండొ దుమ్మూధూళిలో కనుమరుగయ్యే టప్పుడు, మిగిలింది క్యటాలోనియ పుస్తకాల దుకాణదారూడి సలహా మేరకు ,ఆ దుఖాణం లోని ముఖ్యమైన పుస్తకాలతో సహా
దేశాంతరం పట్టిన మార్క్వెజ్, ఆ తరువాత ఆయన రచించిన One Hundred Years of Solitude” మాత్రమే కదా? మకాండొ ,మార్క్వెజ్ .. ఈ కథా కమానీషు అర్ధం కావాలంటే ,ఆ పుస్తకం చదవాల్సిందే ,మరో మార్గం లేదు! అదలా ఉంచడి.
అంత మాత్రం చేత , ప్రభవ కు వచ్చి పుస్తకానికో గులాబీ ఇమ్మనేరు. ఇప్పటికే బితుకు బితుకు మంటున్న ఆ పుస్తకాలషాపు కాస్తా చితికి పోగలదు! మా వూళ్ళో గులాబీలు పుస్తకాల కన్న ఖరీదైనవీను! మీరు ఎప్పుడైనా గమనించారో లెదో గానీ, మన తెలుగు పుస్తకాలు ఏవీ “పౌండ్ “ను మించవు.మహా అయితే పౌండున్నర! ఆ లెక్కన పాఠకులకు అందేవన్నీ వన్ పౌండ్ చీటీలే! ఇదండీ, పుస్తకాల క్రయవిక్రయాల వ్యవహారం. దానా దీనా చెప్పొచ్చేంది ఏంటంటే, ఈ రోజు పుస్తకాలరోజు మాత్రమే కాదు. ఇవ్వాళ పుస్తక రచయితల,ప్రచురణకర్తల ,విక్రేతల ,విమర్శకుల ..ప్రత్యేకమైన రోజు గా UNESCO ప్రకటించింది.
వీరందరి మౌలిక హక్కుల ,కాపీ రైట్ డే ,గా కూడా ఈ రోజు గుర్తించబడింది. రచయితే ప్రచురణకర్తా,విక్రేత,పంపిణీదారుడు,ఆపైన, ప్రూఫ్ రీడరూ అయిన చోట ,ఈ రోజు మరింత ముఖ్యమైనది కాదూ ?
చేర్పించే , ఈ- దుకాణాలు బోలెడు తెరిచి ఉన్నాయి. గ్రంథాలయాలు,దుకాణాలు ఒక్క కొనగోటి మీటు దూరంలో ఉన్నప్పటికీ ,ఎందరం పుస్తకాలను చదువుతున్నామన్నదే ప్రశ్న.
కనుక, కొని చదివారా కొనకుండా చదివారా అన్నది కాదు , అసలు చదువుతున్నారా లేదా అన్నది మన ముందున్న ప్రశ్న . చదవండి. చదువుతూనే ఉండండి. ఆ పుస్తకమైనా e-పుస్తకమైనా. అదే మనం మన రచయితలకు అభిమానంతో అందించే గులాబీ పువ్వు!
ఇక ,కొని చదివారే అనుకోండి… ఆ పై , చెప్పవలసింది ఏముందీ?
*
పుస్తకం చదువరులకు శుభాకాంక్షలు
(గత ఏడు పుస్తకాల దినోత్సవం నాడు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ).
prem
😀 I love reading Books
చంద్ర లత
అహ్హహ్హ .. మీరింత గారాబం చేస్తానంటే నేనెందుకు వద్దనంటాను చెప్పండి సుజాత గారు? ఈ ఆలోచన చాలా బావుంది. కాకపోతే ..నాకు ఒక నాటుగులాబీ మొక్క..అదీను ..లేత గులాబీ రంగులోది కావాలి. సరేనా?..:-))
మరొక సారి ధన్యవాదాలు.
సుజాత
చంద్రలత గారూ, పుస్తకం పరమౌషధం మాత్రమే కాదు, పుస్తకం ఒక నిత్య జీవితావసరం కూడా కావాలనిపిస్తుంది నాకు. అన్నం, నీళ్లు, గాలి లాగా! ఉన్న కాస్త చిన్న జీవితంలోనూ పుస్తకాలు చదవకుండా గడిపిన కాలమంతా వృధాయేగా!కానీ మీరన్నట్లు మనలో చాలా మంది ఎవరైనా చెప్తే తప్ప బలవంతంగా అయినా సరే పుస్తకాలు చదవడం పెట్టుకోకపోవడం విషాదం!
మీకు గులాబీ ఇస్తే లాభం లేదు. గులాబీ మొక్క పెరిగిన పూల కుండీ ఇవ్వాలి. గులాబీ పూసినపుడల్లా మీరే కోసుకోవచ్చు! ఏమంటారు? :-))
చంద్ర లత
మీ అభిమానానికి ధన్యవాదాలండీ.
అప్పుడప్పుడూ అనిపిస్తుంది కదా.. పుస్తకం పరమౌషదం అంటూ ఎవరైనా మందులచీటీ రాసిస్తే గాని మనం చదవం కాబోలు అని..:-)
అన్ని కళల్లాగే పుస్తకం చదవడమూ ఒక కళే కదా. అందులోనూ పూర్తిగా వ్యక్తిగతమైనది.
మనం చేయగలింగిందల్లా, ఆ కళను నిలబెట్టడానికి అవసరమైన సాంస్కృతికనేపధ్యం, సామాజిక వాతావరణంకల్పించే ప్రయత్నాలు మాత్రమే. కదండీ.
గులాబీ మాల బరువును మోయలేనేమో, ఒకటి రెండు పూలను స్వీకరిస్తా..పదిలంగా.
ఆ పై వన్నీ మీ అందరికీ! తలా ఒకటి!
నమస్కారం.
raman
As long as the “TV” Devil is in our house, for that matter in anybody’s drawing room there is no way you can “sell” the books.
Some time ago i gave books as gifts for every occasion to friends and kids…the last i heard nobody even opened them. The only consolation is that they didn’t “sell” them or threw them out the window…may be they’ll read them when they are sick, bedridden and there is no “TV” anywhere near.
ఉష
చంద్రలత గారు, నా తరఫున మీకు ఒక గులాబీమాల, నేను రచనని ఒకసారి కన్నా ఎక్కువసార్లు చదువుతాను కనుక. ఇలా సాధికారంగా చెప్పగల మీవంటి వారు “చదవండి. చదువుతూనే ఉండండి…” తో పాటుగా “చదివిస్తూ ఉండండి.” అని కూడా పొడిగిస్తే బావుంటుంది. ఎన్ని వనరులు ఉన్నా మార్గనిర్దేశకత్వం తప్పనిసరి. పుస్తకం వారి అన్ని ప్రయత్నాలు ఆ దిశగా ఉంటాయి. ప్రపంచ పుస్తక దినోత్సవ అభినందనలు.
cbrao
పుస్తకాలదిన సందర్భంగా ఈ విశేష వ్యాసం వ్రాసిన చంద్రలతగారికో గులాబి.
cbrao
Mountain View, CA.