ఆరుద్ర – పదాలూ, పజ్యాలూ

ఆరుద్ర “ఇంటింటి పజ్యాలు” కనిపిస్తేనూ, చదవడం మొదలుపెట్టాను. ఇంతలో, ఎందుకో గానీ, “కూనలమ్మ పదాలు” గుర్తొచ్చింది. అది కూడా వెదుక్కుని, చదవడం మొదలుపెట్టాను. ఇంతలో, రెండు సంగతులు గమనించాను –

౧. “ఇంటింటి పజ్యాలు” – బాపు కి అంకితం చేస్తే, “కూనలమ్మ పదాలు” రమణగారికి పెళ్ళికానుకట.
౨. రెంటిలోనూ బాపూ బొమ్మలూ, నవోదయ పబ్లిషర్లూ.

-ఇక, రెంటిలోనూ ఉన్న రీడబిలిటీ ఫాక్టర్ గురించి చెప్పనక్కర్లేదు. ఇకపై ఏ సమయంలో తెరిచినా, అటూ ఇటూ పేజీలు మార్చుకుంటూ, కనీసం యాభైశాతం అన్నా చదివేదాకా లేవను అని ఘంటాపదంగా చెప్పగలను నేను. అందులోనూ, ఇంటింటి పజ్యాలు – నా అభిమాన కవి ’ఆగ్డెన్ నాష్’ స్పూర్తితో రాసినవాయె! తెలుగులో ఇలాంటివాటి కోసమే ఎదురుచూస్తున్నది ఇన్నాళ్ళూ! ఆమధ్య చదివిన ‘An anthology of Indian nonsense” లో తెలుగు కవితలు ఏ ఒకట్రెండో తప్ప లేవు. మరాఠీ, బెంగాలీ వంటి భాషల్లోవి విరివిగా కనిపిస్తూ ఉంటేనూ, మా చెడ్డ బాధపడిపోయా అప్పట్లో. ఇప్పుడూ చెడ్డ బాధే – ఆ పుస్తకకర్తలకి – “ఇంటింటి పజ్యాలు” కనబడలేదేం? అని.

“సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు, సాహిత్యం అంబరమైతే, ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు. కేవలం కవిత్వాన్నే తీసుకున్నా, అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో. కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు, ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది; ఇంకా జరుగుతోంది….”
– ఇలా సాగింది కూనలమ్మ పదాల వెనుక అట్టపై కథ. “ఇంటింటి పజ్యాలు” కి నండూరి రామ్మోహనరావు గారి పీఠికలోనూ, పుస్తకం వెనుక అట్టపై కూడా ఇంచుమించు ఇదే తీరు. సరే, పుస్తకాల కథకొద్దాం.

కూనలమ్మ పదాలు

కూనలమ్మ పదాలంటే, వాటికో ఛందస్సు ఉందని వీటినిలా పుస్తకంగా వరుసగా వంద పదాలు చదివి, ఆరుద్ర గారి పరిచయం కూడా చదివాక అర్థమైంది. దీనికి సంబంధించిన చరిత్ర – అప్పటికే ప్రచారంలో ఉన్న పాతకాలంనాటి కూనలమ్మ పదాల ప్రభావంలో, ’ఆంధ్రప్రభ’ ప్రత్యేక సంచికకోసం అదే ఛందస్సుతో మొదట ఒక పధ్నాలుగు పదాలు రాసారట ఆరుద్ర గారు. ఆతరువాత కొన్నాళ్ళకి ’జ్యోతి’ పత్రిక మొదలైనప్పుడు, ముళ్ళపూడి వెంకటరమణగారు ’స్నేహపు కమ్చీ ఝళిపించి’, మరిన్ని,మరిన్ని రాయించి, కొత్త కూనలమ్మ పదాలు మనందరికీ ఆరుద్రగారి రాత ద్వారా తెలిసేలా చేసారట. (ఇంట్రో రాసిన తేదీ – సంక్రాంతి ’64. కనుక, ఈపదాలు ఆ ప్రాంతాల్లోనే వచ్చాయేమో).

అసలు కూనలమ్మ పదాల చరిత్రా, ఛందస్సూ, ఇతర కవుల పద్యాల్లో దీని వాడకం, కూనలమ్మెవరు? – ఈ ప్రశ్నలకన్నింటికీ ఆరుద్ర వివరంగా తన ఇంట్రోలో సమాధానం చెప్పారు. (ఇటీవలి కాలంలో, పుస్తకాల ముందుమాటల గురించి ఆసక్తి పెరిగింది. వీటిని పునఃప్రచురించడానికి, ఆన్లైన్లో చూస్కోడానికి వీలు కలిగితే బాగుండు. పుస్తకాలు దొరక్కపోయినా, ముందు మాటలు దొరుకుతాయనుకోవచ్చు. అన్నట్లు, పుస్తకాల ముందుమాటల సంకలనాలు ఎందుకు వెయ్యరు?). సరే, అది అటు పెడితే – ఇదీ అదీ అని తేడాలేక, ఎన్నో విషయాలపై, నీతి సూక్తులు, అవినీతిపై చురకలు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, రాజకీయాలూ, రచయితలూ, జీవితమూ – ఏదీ వదలకుండా అన్నింటిపైనా పదాలూ-పన్నులూ ఉన్నాయిందులో. బాపు బొమ్మలు బంపర్ బొనాంజా లాగా – అసలంత కొసరు లా ఉన్నాయి. ఎక్కడో మూణ్ణాలుగు తప్ప – ఈ వంద పదాల్లో – ఎక్కడా ’బోర్’ అన్నదే అనుభవించలేదు నేను. అలా మూణ్ణాలుగు మాత్రం – మరీ రొటీన్ అనిపించాయంతే…

కొన్ని పదాలు: (3-4-3 : ఈ పద్ధతిలో ఉంటాయట మొదటి మూడు పాదాలు.)
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మా

మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మా

తమలపాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మా

కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మా!

పుణ్య గాథల బూతు
బూజు పట్టిన ట్రూతు
అంతు చిక్కదు లోతు
ఓ కూనలమ్మా!

(ఇటుల టైపితే కొన్ని
వదల మిగితా అన్ని
తుదకు చేసెద సుమ్మి
ఓ కూనలమ్మా
)
– అవి చదివి, ఆ ప్రభావంలో, నేను కూడా (3-4-౩) వస్తుందేమో అని చేసిన ప్రయత్నం. ఇలా టైపు చేస్తూ పోతే, మొత్తం టైపు చేస్తా ఎప్పుడో అని నా అనుమానం. 🙂

(కూనలమ్మ పదాలు -ఆరుద్ర, నవోదయ పబ్లిషర్స్, సెప్టెంబర్ 76 నాటి మూడో ముద్రణ – అప్పట్లో ధర నాలుగు రూపాయలట!!)

ఇంటింటి పజ్యాలు

అమెరికన్కవి శ్రీయుత ఆగ్డెన్ నేషు
హాస్య కవిత వ్రాసి చేసుకున్నాడు క్యాషు
అతణ్ణి అనుకరించే ఈ కవిత నిర్దోషు
దీనికి చాలు కొద్దిగా క్యాషు బోలెడు శభాషు
-అంటూ మొదలైంది ఈ ఇంటింటి రామాయణం లోకి నా ఎంట్రీ. తెలుగులో అలాంటి పద్యాలు చదవడం గురించిన నాఎదురుచూపులు ముగిసాయి, అని ఇప్పుడు మనస్పూర్తిగా చెప్పగలను, ఇవి చదివాక. ఇవి మొదట 1964 లో ఆంధ్ర పత్రికలో వారం వారం వచ్చాయట. బాపూ బొమ్మలు ఇందాకటి పుస్తకానికి మల్లే అసలంత కొసరుగా అద్భుతంగా ఉన్నాయి.

ఇందులోంచి ఒకట్రెండు “పజ్యాలు” :

కాళిదాసుగారింట్లో మాట్లాడే పక్షి
కవిత్వాన్ని గ్రోలినా నిరక్షర కుక్షి
భోజరాజు పెంపకంలో భోంచేసే శునకం
బొమికల్ని తింటుందా కాక కనకం?
త్యాగరాజు గారింట్లో దోమలు మాత్రం
బాగా అభ్యసించాయి సంగీతశాస్త్రం
(పజ్యం పేరు: రాగం తానం పల్లవి)

వెల్లవేసిన మర్నాడే పిచ్చిగీతలు
చల్లగా గీస్తాయి గోడపై చిట్టిచేతులు
కొన్న మరుగంటలోనే వారపత్రిక
కుట్లూడి పట్టబడుతుంది కొద్ది చిత్రిక
(పజ్యం : చిన్న బాల శిక్ష)

అసలీ ఈపుస్తకం ఎలా ఉందీ? అంటే – ఇలా ఉంది:

ఆరుద్ర ఇంటింటి పజ్యీయం
వానాకాలంలో వేడి మిరప బజ్జీయం
ఇవి చదివితే వేదన మటుమాయం
మీరు నవ్వుల్లో మునగడం ఖాయం
దిగులు తరిమేందుకు ఆరుద్ర చేస్తారు సాయం
దిగులుదసలే భారీకాయం
తరమడానికి వీరిని తోడు తెచ్చుకోవడం నయం
ఎంతైనా ఒంటరి పోరు కాదు సమర్థనీయం
నాన్సెన్సుతో దోస్తీ అభిలషణీయం
చదవలేదు నేను బిల్హణీయం
చదవలేదు ప్రతాపరుద్రీయం
తెలియదు నాకు రాజకీయం
తెలిసందల్లా ఆరుద్రీయం
ఇంటింటి ’పజ్యాల’ హార్మోనియం
(నాన్సెన్స్! అనిపించింది కదూ. పుస్తకం మాత్రం ఇలా ఉండదు. ఏం భయపడకుండా చదవండి. ఆరుద్ర రాక్స్)

(ఇంటింటి పజ్యాలు, నవోదయా పబ్లిషర్స్, 1969, ప్రథమ ముద్రణ, పబ్లికేషన్ నం:120, వెల- రెండున్నర రూపాయలు!!)

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] అజంతా బాకీ-బాకా – నిష్టల వెంకటరావు ఆరుద్ర – పదాలూ, పజ్యాలూ శతకాలు: కుమార శతకం, నారాయణ శతకం, సుమతీ […]

  2. పుస్తకం » Blog Archive » మాలతి గారి రీడింగ్ లిస్టు

    […] ఆరుద్ర – త్వమేవాహం, కూనలమ్మ పదాలు, వేమన్న వేదం, సమగ్రాంధ్ర సాహిత్యం […]

  3. హెచ్చార్కె

    @mohanramprasad:
    రెండు శ్రీలు ధరించి
    వరలు శబ్ద విరించి
    అనెను ఆరుద్ర దంచి
    ఓ మోప్రసాదూ!
    🙂

  4. గరికపాటి పవన్ కుమార్

    Brown Dictionary:

    జన్ని (p. 0476) [ zanni ] ḍzanni. [Tel.] n. Delirium. A sort of fit, convulsions. సన్నిపాతము. ఆమెకు జన్ని వచ్చి పడిపోయినది she fell down in a fit.

    గరికపాటి పవన్ కుమార్

  5. mohanramprasad

    శబ్దవిరించి
    ఆరుద్ర గురించి
    చెప్పారుమంచి..
    ………..ఓ బ్లాగులమ్మ..!

  6. మాలతి

    @ అసూర్యంపశ్య. :))))
    @ పవన్ కుమార్, జన్ని అంటే ఏమిటండీ?

  7. గరికపాటి పవన్ కుమార్

    మంచి ఫుస్తక సమీక్ష. మీర్రాసిన కూనలమ్మ పదంలో మూడో పంక్తిలో అంత్య ప్రాస తన్నింది.

    ఇటుల టైపితే కొన్ని
    వదల మిగితా అన్ని
    తుదకు చేసెద సుమ్మి
    ఓ కూనలమ్మా

    ఇలా పూరించొచ్చు:

    ఇటుల టైపితే కొన్ని
    వదల మిగితా అన్ని
    మీకు వచ్చును జన్ని
    ఓ కూనలమ్మా

    గరికపాటి పవన్ కుమార్

    1. అసూర్యంపస్య

      పవన్ గారికి
      ధన్యవాదాలు.
      అంత్యప్రాస – 🙂 బాగుందండీ. నా తెలుగు పదజాలం పరిమితం. నా పరిధుల్లో ఇదొక ప్రయత్నం. భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటాను 🙂

  8. rAsEgA

    నాకీ పుస్తకం లక్కీగా మొన్నవారం అబిడ్స్ పాతపుస్తకాల షాపులో దొరికింది. కూనలమ్మ పదాలు ఇంతకుముందే చదివినా, ఇంటింటిపజ్యాలు అప్పుడే చూడ్డం. నిజ్జంగానే ఆరుద్ర రాక్స్ 🙂

Leave a Reply